“కదంబి” కబుర్లు – 2

“కదంబి” కబుర్లు – 1

“అన్నీ సర్దుకున్నాయ్, వ్యాపారమూ బాగా నడుస్తూందన్న సమయంలో మా పక్కింటాయన డిసౌజా, వాళ్ళావిడా నన్నో చుట్టాలింటికి “చాలా ముఖ్యమైన పనం”టూ పంపారు. నే వెళ్ళాను. వెళ్ళాక తెల్సింది, పెళ్ళిచూపులని. అమ్మాయికి నా సంగతంతా చెప్పారట. వాళ్ళు సరే అన్నారు. అమ్మాయిని చూసి నేనూ “సరే” అన్నాను. అప్పటి వరకూ నేనెప్పుడూ తమ్ముళ్ళ చదువులూ, కొట్టు పనులూ తప్పించి ఏమీ ఆలోచించలేదు, నాకసలు పెళ్ళి ధ్యాసే లేదు. “ఇదో.. అబ్బీ! ఇలానే ఉండిపోతావా ఏంటి? మేమంతా ఎందుకున్నట్టు?” అని ఈ డిసౌజా  భార్యాభర్తలే దగ్గరుండి నా పెళ్ళి చేశారు” అని అన్నారు. “అంతేలెండి! మనకన్నా చుట్టూ ఉన్నవాళ్ళకే కంగారెక్కువ” అని అనబోయి, కాస్త సంభాళించుకుని, “ఆవిడ పేరూ?” అని ఆరా తీశాం.

“హ-రి-ణి” అని సిగ్గు పడీపడకుండా చెప్పారు. “నాకింకా బాగా గుర్తుంది, ఆ రోజు దసరా! 11 October, 1959. ఆ రోజే మా పెళ్ళి జరిగింది.” అన్నారు.

“పెళ్ళాయ్యాక చెప్పారు డిసౌజా వాళ్ళు నాతో, అప్పటికే నాకు నలభై మూడు ప్రపోజల్స్ వచ్చాయట” అని ఆయన మాట పూర్తి కాక ముందే, “నలభై మూడా?” అని నోర్లు వెళ్ళబెట్టాం. ఆయన మరి కాస్త సిగ్గుపడీపడకుండా, “పుస్తకాలు కొనడానికి వచ్చే పోయే వాళ్ళల్లో చాలా మంది, “మా అమ్మాయుంది, మా చుట్టాల అమ్మాయుంది” అని అడిగేవారట. నా మాట తీరూ, అందరితో వ్యవహరించే విధానం వల్ల వాళ్ళకి నచ్చేవాడిని. నేనేమో నా పని నేను చేసుకోవటం తప్పించి  ఇంకేం పట్టించుకునేవాడిని కానాయే! అందుకే వాళ్ళే ఈ అమ్మాయిని నాకోసం సెలక్ట్ చేసారు. అన్నీ కుదిరి మా పెళ్ళయ్యింది!”

“ఆవిడ కూడా పుస్తకాలు బాగా చదువుతారా?”

“లేదు. అస్సలు చదవదు.”

“ఆవిడ గురించి ఇంకేమన్నా చెప్పండీ..”

“ఆవిడకి వంట చేయటం రాదు అప్పట్లో” అని గట్టిగా నవ్వారు. మా నవ్వుల్లో కలిసాక కూడా ఆయన నవ్వులు వినిపించాలంటే, ఆ మాత్రం గట్టిగా నవ్వాలి కదా!

“పుస్తకాల కొట్టు నిర్వహణలో అప్పుడప్పడూ కొన్ని గొడవలూ, అవీ తప్పేవీ కావు. అలాంటప్పుడు, తను చాలా భయపడేది. నేనే చెప్పాను తనకి, “నువ్వేం ఆలోచించకు. నా వ్యాపారం గురించి పట్టించుకోకు” అని. అలానే నెట్టుకొచ్చాం ఇప్పటి వరకూ” అని అంటూనే, “మీకు తెల్సునో లేదో, ఎమర్జెన్సీ కాలంలో మే, 31వ తారీఖు లాంగెస్ట్ కర్ఫ్యూ! అప్పుడూ పుస్తకాలు అమ్మడం కష్టమయ్యేది. అదీ కాక, తెలంగాణా విప్లవం అప్పుడు కూడా… తెలంగాణా అజిటేషన్ కి అప్పుడు ఎవరూ లీడర్?” అని పేరు గుర్తు తెచ్చుకోడానికి, కాస్త తడబడ్డారు. సాయం చేయడానికి మాకున్న జీ.కె కూడా అక్కరకి రాలేదు. అంతలో ఆయనకే  పేరు చట్టుక్కున గుర్తొచ్చేసింది. “చెన్నారెడ్డి! వాళ్ళు మనుషులని పంపి, కొట్టు మూసేయమని బలవంత పెట్టారు. నేను తిరిగి తగులుకునేసరికి “మీరు బయటకి రాకండి” అని చెప్పి వెళ్ళారు.” అని కాసేపు తెలంగాణా మీద మాట్లాడారు, “కలిసుండచ్చు కదా!” అనే అభిప్రాయంలో. అలాగే తాను ఇన్నేళ్ళ బట్టీ చూస్తున్న ఇక్కడ మనుషుల గురించీ చెప్పుకొచ్చారు. ఉన్నట్టుండి, “మీరు తెలుగువారా?” అని అడిగారు. “అవునం”టూ తలూపాము.

“తెలుగు భాషలో తిట్లూ, అవీ కాస్త ఎక్కువ! అందుకనీ..” అన్నారు.

“అలాంటిదేమీ లేదే!” అన్నాం ఆశ్చర్యపోతూ! తెలుగు భాష (పోనీ, ఆ భాష మాట్లాడ్డం) వల్ల ఆయన ఇరుక్కున్న సందర్భాన్ని ఇలా చెప్పుకొచ్చారు:

“అప్పట్లో తెలుగు మాట్లాడేవారు, అనకూడని, వినకూడని పదాలు ఉపయోగించేవారనీ, అది కూడా ప్రతీ వాక్యం చివరా అని తెల్సింది కాదు. అందుకే ఎవరో, ఎవర్నో అనకూడని మాటలతో సంభోదిస్తే, నేను అదే సరియైన తీరు అనుకుని, వాళ్ళింటికెళ్ళి మరీ ఆ పదం ఉపయోగించాను. అంతే, ఉన్న పలాన నా మీద పది మంది దాకా దాడికి దిగారు. అదృష్టం కొద్దీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, “చాలా మర్యాదస్తుడు, అలా అనే మనిషే కాదు” అని నచ్చజెప్పబట్టి బతికిపోయాను. భాష పూర్తిగా తెలీకపోవటం వల్లా, తెల్సున్న వాళ్ళు పదాలను తేలిగ్గా వాడేయడం వల్లా వచ్చిన నష్టం!”

నవ్వాలో, ఏడ్వాలో తెలీలేదు! అందుకే రెండూ చేయలేదు. ఈ ఒక్క సందర్భంలోనే నేను తలపైకెత్తింది. (అప్పటి వరకూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నా మరి!) “నీ కష్టం నేను చూడలేను తల్లీ!” అన్నట్టు, “సరే.. నేను రాసుకున్న నా చరిత్ర చూపిస్తాను రండి” అని తీసుకెళ్ళారు, ఒక మూలకి. అక్కడే వారి కుటుంబ సభ్యుల ఫోటో ఆల్బమ్ చూపించారు. వాళ్ళ ఆఖరి తమ్ముడు, మద్రాసులో రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయారని తెల్సుకొని ప్రాణం ఊసురుమంది.  చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయిన నాన్న తిరిగొచ్చిన వెంటనే తీసుకున్న ఫోటో చూపిస్తూ, “నాన్న రాగానే అడిగేశాను తెల్సా? ఏం మమల్ని వదిలిపెట్టి పోయావూ?” అని. ఏం సమాధానం చెప్పలేకపోయాడు పాపం!” అని అనేసరికి ఏమనాలో మాకూ తోచలేదు. చుట్టూ ఉన్న గాలి కాస్త బరువెక్కినట్టయ్యింది.

“ఇదో.. ఇది నా ఇరవై మూడో ఏట తీసిన ఫోటో..” అని చూపించారు, వెంటనే!

“ఆఆఆహ్.. నలభై మూడు ప్రపోజల్స్ ఇందుకొచ్చాయన్న మాట.. ఇప్పుడు అర్థమయ్యిందీ” అని కాస్త ఆటపట్టిస్తూ మేం గట్టిగా నవ్వితే, ఆయన ముసిముసి నవ్వులు నవ్వారు. ఇది చూసినప్పుడల్లా నాకు “ది పిక్చర్ ఆఫ్ డారియన్ గ్రే!” గుర్తొస్తుంది. ఎప్పటికీ అలానే ఉండిపోతాడు కదా?” అని ఇంకా ఫకాలున నవ్వేశారు. ( ది పిక్చర్ ఆఫ్ డారియన్ గ్రే, ఆస్కర్ వైల్డ్ రాసిన నవల. ఇందులో కథానాయకుడు యవ్వనంలో గీసిన తన పేటింగ్‍ని చూస్తూ, “నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోతే బాగుణ్ణు కదూ! కాలక్రమేణ నాలో రావాల్సిన మార్పులన్నీ ఈ పెయింటింగ్‍కే వస్తే భలే ఉంటుందే” అని అనుకుంటాడు. నిజంగా అలానే జరుగుతుంది, డారియన్ చనిపోయే వరకూ యవ్వనుడిగా, ఆరోగ్యంగా ఉండిపోతాడు. అతడి పేటింగ్ మాత్రం అతని వికృత మనస్తత్వానికి అద్దంలా నిలిచిపోతుంది!” )

“ఈవిడే మా అమ్మగారు. ఆ కాలంలో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళేది” అంటూ అమ్మ ఉన్న ఏ కబుర్లు చెప్పేటప్పుడు అయినా, ఆయన కళ్ళల్లో గర్వం చూసి తీరాల్సిందే!

“కదంబి పేరు ఎలా పెట్టారు?” అన్న ప్రశ్నకి, “అది మా ఇంటి పేరు. ఎప్పుడో ఒకసారి స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో వేళాకోళంగా ఏదో అన్నారు. ఇక అది బాగుంది కదా అనుకుని, పెట్టేశాను.” అని అంటూనే “మా తాతయ్యా, అమ్మమ్మా, నాన్నా, అమ్మ.. వీళ్ళందరే నాకు స్ఫూర్తినిచ్చింది. వీళ్ళ వల్లే ఇవ్వాళ నేను ఇలా ఉన్నాను.” అని నిట్టూర్చారు.

ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఆయనకు జ్యోతిష్య సంఘం వాళ్ళు చేసిన సన్మానం గురించి కబుర్లు చెప్పారు. ఇన్నేళ్ళుగా జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు అమ్మినందుకు గానూ ఆ సన్మానం. సన్మాన సభకి వారి భార్యకూడా తోడు వెళ్ళగా, మొట్టమొదటిసారిగా రామకృష్ణ ఆచార్య గారికున్న పేరు ప్రఖ్యాతలు తెల్సాయట!

“మీ రీడింగ్ హాబిట్స్ గురించి చెప్పండి” అని అడిగాము.

“నేను రోజుకి రెండు, మూడు పుస్తకాలు చదివేవాడిని” అన్న మాట వినగానే, “WHAT!” అనడానికి కూడా మాకు కాసేపు పట్టింది. ఈ లోపే ఆయన చెప్పుకొచ్చేశారు: “ఊ.. రోజుకి రెండు మూడు పుస్తకాలు చదవాల్సిందే. అలా నెలలో చదివిన పుస్తకాల విషయాలు రాసుకుంటే, ఇటుక మందమన్ని కాగితాలు పట్టేవి. మా ఆవిడ అంటూ ఉండేది, “ఏవిటిదంతా?” అని అప్పుడప్పుడూ.”

“మీరిలా దరిదాపుగా పుస్తకాలకే అంకితం అయ్యిపోతే, ఆవిడేమనే వారు, కాదా?!” అని అడిగేశాం.

“ఆవిడ ఏమీ అనేది కాదు. పెద్దగా మాట్లాడేది కాదు, పుస్తకాల గురించి…”

“అంత కన్నా అదృష్టమా? మీ సీక్రెట్ ఆవిడే” అని మళ్ళీ ఆటపట్టించాం. ఆయన ప్రతీ నవ్వూ అంగీకారార్థమే!

అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా, “నాకు హెమ్మింగ్వే, సోమర్ సెట్ మామ్ లతో పరిచయం ఉండేది. సోమర్ సెట్ రాసిన “హ్యూమన్ బాండేజ్” చదువుతూ అనుకుంటాను, ఆయనకో ఉత్తరం రాశాను. అందులో ఆయన టి.బి గురించి ప్రస్తావిస్తారు. మా అమ్మ కూడా అదే జబ్బున పడింది కదా! ఆ విషయమే ఆయనకో ఉత్తరం రాశాను. తర్వాత కొన్నాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. హెమ్మింగ్వే అయితే కేబుల్ పంపారు, తనతో మెడ్రిడ్ (స్పేన్)లో బుల్ ఫైట్ చూడ్డానికి రమ్మని. వెళ్ళలేకపోయాను. క్రికెటర్స్ మాన్ సింగ్, ఆసిఫ్ ఇక్బాల్, ఇంకా శ్యాం బెనిగల్ వీళ్ళంతా నా దగ్గరకు తరచూ వస్తూ పోతుండేవారు.”

“అప్పటికీ, ఇప్పటికీ కస్టమర్లలో తేడా ఉందంటారా?”

“నాకేమీ అనిపించదు. పైగా ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని పుస్తకాల కొట్లు వెలసినా, ఇంకా నా దగ్గరకే ఎందుకొస్తుంటారని? ఒక మాగజైన్ కోసం, బంజారా హిల్స్ నుండి ఇక్కడకి వస్తుంటారు కొందరు. నేను చాలా సార్లు చెప్తాను, అక్కడే కొనేసుకోండి, ఇంత దూరం అందునా ట్రాఫిక్ లో ఎందుకు శ్రమ అనీ! వింటే కదా! సరే వాళ్లు వస్తే, మాటా మంతీ నాకూ రోజు సంతోషంగా గడుస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే సమయం అలానే గడిచిపోతుంది.”

“ఇన్నేళ్ళ తర్వాత జీవితాన్ని వెనక్కి తిరిగిచూసుకుంటే, నాకు చాలా సంతృప్తిగా ఉంది. నిజమే, నేను ఇతురుల్లా డబ్బు కూడబెట్టలేకపోయాను. సంపాదించిందంతా ఎప్పటికప్పుడు తిరిగి పుస్తకాల్లోనే పెట్టేశాను. నన్ను వెర్రివాడిలా చూసిన వారూ లేకపోలేదు. కానీ నేను నాకు కావాల్సింది, నాకు ఇష్టమైనదే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ పొద్దున్నే లేచి కొట్టు తెరవనిదే నాకేమీ తోచదు. మా అమ్మాయి అంటూ ఉంటుంది, షాపు మూసేసి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. అది నాకు నచ్చదు. రోజూ ఇక్కడికి రావాలి, పుస్తకాలతో గడపాలి.” అని అన్నారు.

ఆదివారాలు తప్పించి ఈ షాపు అన్ని రోజుల్లోనూ  ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరింటి వరకూ తెరచి  ఉంటుంది. ఓ ఫోన్ చేసి వెళ్తే ఇంకా వీలుగా ఉంటుంది.

ఈ కబుర్లు అయ్యాక, అసలు పుస్తకాలేమున్నాయో అని చూద్దామనుకున్నాం. మాకు కనబడినంతలో క్లాసిక్స్, జ్యోతిష్యం, స్పోర్ట్స్, జంతు శాస్త్రం, ఆర్నిథాలజీ, హిస్టరీ, సినిమా, నాన్- ఫిక్షన్ సంభందించిన పుస్తకాలు ఉన్నాయి. సౌమ్యకి గ్రహం గూచ్ పుస్తకం ఒకటి తీసుకుంది. ఇంకోటి నాకూ కావాలని అడిగాను. “ఓహ్.. క్రికెట్ అంటే ఇష్టమైన అమ్మాయిలా? సరి సరి.. నేను వెతికిస్తా ఉండు..” అని నాకూ క్రికెట్ సంబంధించిన బుక్ ఒకటి ఇస్తూ.. “రాత్రి ఆ అబ్బి భలే కొట్టాడు కదా” అని అన్నారు.

“ఎవరు? గిల్లీ నే కదూ.. చిత్తగొట్టేసాడు” అని నేనూ.  ఇకేముంది! కాసేపు క్రికెట్ కబుర్లో మునిగిపోయాం. రెండు పుస్తకాలకీ డబ్బులు తీసుకోలేదు, ఎంత అడిగినా. కాసేపటికి వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం.

చేసే పని ఏది అయినా, ఆరంభంలో ఉండే ఉత్సాహమే కాక, ఏళ్ళ తరబడి ఆ ఉత్సాహాన్ని తగ్గనివ్వకుండా , మొదలెట్టినప్పుడున్న  ప్రాధమిక లక్ష్యాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, కాలం తీసుకొచ్చే ఆటు పోట్లని తట్టుకుంటూనే అనుకున్నది చేస్తూ పోవటం సామాన్య విషయం కాదు. గతిలేక తప్పని సరి పరిస్థితుల్లో  పుస్తకాలని ఆసరా చేసుకున్నా, “ఏరు దాటాక తెప్ప తగలేసే” తీరున కాక, వాటిని ఇప్పటికీ తన సొంతంగా చూసుకునే వాళ్ళు చాలా అరుదు. వ్యాపారంలో లాభ నష్టాలే కాదు, మనసూ ఉండాలని రుజువు చేశారు. కస్టమర్లని ఇంటికొచ్చే అతిధుల్లా పలకిరించే సంస్కృతి నేటి తరానికి కాస్త ఇబ్బంది పెట్టచ్చు కాక! కానీ అందులో ఉన్నది ఆత్మీయత మాత్రమే అని మా “కదంబి” విజిట్ నిరూపించింది. ఓ ఉన్నతమైన ఆశయాన్ని ఇన్నేళ్ళ పాటు నడుపుకొచ్చిన ఓ చక్కని మనిషిని మీకు పరిచయం చెయ్యాలన్న ఆశయంతోనే ఈ వ్యాసం! తప్పొప్పులు మన్నిస్తారని ఆశిస్తున్నాను. మేం అడగాల్సిన అవసరం లేకుండానే, తన కథనీ, అనుభవాలనీ, అభిరుచులనీ మాతో మూడు గంటలు కబుర్లాడిన “కదంబి” రామకృష్ణ ఆచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!

You Might Also Like

5 Comments

  1. I Make Thousands of Dollars a Month Posting Links on Google from Home

    Hey, nice post, really well written. You should blog more about this.

  2. pavan

    మంచి ఆర్టికల్.చదవడానికి వీలుగా రెండు భాగాలలో అందించినందుకు ధన్యవాదాలు.

    A bookstore is one of the only pieces of evidence we have that people are still thinking.
    Jerry Seinfield

  3. అరుణ పప్పు

    మీ ప్రయత్నం, దాన్ని అందించిన శైలి రెండూ బావున్నాయి. మీ ఇద్దరికీ అభినందనలు.

  4. meher

    బాగుంది

Leave a Reply