“కథాప్రపంచం ప్రచురణలు” వారితో

ప్రముఖ హిందీ సాహిత్యకారుడు మున్షీ ప్రేమ్ చంద్ కథలకి అచ్యుతుని రాజశ్రీ గారి తెలుగు అనువాదాలని “కథాప్రపంచం ప్రచురణలు” వారు పుస్తకాలుగా తెస్తున్నారు. మొదటి పుస్తకం ఈ నెలలో రానున్నది (ఈ పుస్తకం గురించి పబ్లిషర్లు వెలువరించిన ఒక చిన్న పరిచయ వ్యాసం గత నెలలో పుస్తకం.నెట్ లో వచ్చింది. లంకె ఇక్కడ). ఈ సందర్భంగా ప్రచురణ కర్త కిరణ్, సంపాదకురాలు ఉషా ప్రత్యూష గార్లతో ఒక చిన్న ఈ-మెయిల్ సంభాషణ.  

Q: ముందుగా కథాప్రపంచం ఏమిటి?  ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దీని వెనుక ఎవరు ఉన్నారు?

కిరణ్: 2013 ప్రాంతంలో తొలిసారిగా కథాప్రపంచం అనేది ఒక ఫేస్బుక్ పేజీ గా చదువరుల కోసం మొదలుపెట్టబడింది. అప్పట్లో ఆ పేజీ లో అనేక ప్రపంచ అనువాద సాహిత్యాలు, రచయితల పరిచయాలు, నవలల పరిచయాలను తెలుగు పాఠకుల కోసం రాయడం మొదలు పెట్టాను. అలా మొదలైన నా ప్రయాణాన్ని పాఠకులు ఎంతగానో ఆదరించారు. చాలకాలం నా వివరాలు గోప్యంగా ఉంచి  పేజీని కొనసాగించాను. తరువాత కథాప్రపంచం వర్డ్ ప్రెస్ బ్లాగు మొదలుపెట్టి అందులో కూడా రాయడం కొనసాగించాను. 2015 ప్రాంతంలో మరొక అడుగు వేసి  వర్డ్ ప్రెస్ లో కథా ప్రపంచం వెబ్ సైట్  మొదలుపెట్టి  అందులో అరుదైన పుస్తకాల గురించి తెలుగు పాఠకులకు తెలియని  ప్రపంచ సాహిత్యం గురించి వ్యాసాలు, పుస్తకాల సమీక్షలు వ్రాసేవాడిని. మరి కొంతకాలానికి కొందరు మిత్రుల, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో సొంత  పెట్టుబడితో 2017 ఆఖరులో కథా ప్రపంచం పేరుతో ఒక బుక్ స్టోర్ ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల అమ్మకాన్ని మొదలుపెట్టాను. ఆ స్టోర్ లో సాహిత్య అకాడమీ పుస్తకాలు, దేశ విదేశీ అనువాద పుస్తకాలు, పెంగ్విన్, హార్పర్, మాక్మిలాన్, రూపా పబ్లికిషన్స్, NBT పుస్తకాలను, అమ్మడం మొదలుపెట్టాను. అదే నా వృత్తిగా మారింది. అప్పటికి  ఏదో తెలియని లోటు. పుస్తకాల అమ్మకం కొనసాగించే సమయంలోనే రెండు మూడేళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన నవ్యంధ్ర బుక్ ఫెయిర్, హైదరాబాద్ మరియు విజయవాడ బుక్ ఫెయిర్ లకు పుస్తక అమ్మకందారునిగా అటెండ్ అయ్యి కథాప్రపంచం పేరుతో బుక్ స్టాల్ ని నిర్వహించాను. ఆ సమయంలోనే అనేకమంది పుస్తక ప్రచురణకర్తలు, రచయితల పరిచయాలు పెరిగాయి. పుస్తకాల పైన ఉన్న మమకారంతో  నేను ఒక పుస్తకాన్ని ముద్రించాలని నా మొదటి పుస్తకాన్ని 2018 లో ప్రచురణ మొదలుపెట్టాను. 2020 లోపు  తొమ్మిది పుస్తకాలు  ప్రచురించాను. అప్పటివరకు పూర్తిగా నాది  ఒంటరి ప్రయాణమే, వన్ మ్యాన్ ఆర్మీ ఏ. రాజు బంటు నేనే అయి మొత్తం పనులను చేసుకోవడంతో కథా ప్రపంచం ప్రచురణలు  మొదలైంది. కోవిడ్ మహమ్మారి అందరినీ కబళించిన సమయంలో వాస్తవికంగా చుట్టూ ఉన్న మనుష్యుల నిజ స్వభావాలు బట్టబయలు కాసాగింది. దానితో నేను నష్టపోయిన పర్వాలేదు ఒకరిని కష్టపెట్టకూడదనే స్వభావం ఉన్న నేను అప్పైనా చేసి అందరికీ  తీర్చవలసిన బాకీలు  తీర్చి కథాప్రపంచాన్ని ముగించేద్దామనుకున్నాను. 

కానీ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో  అనుకోకుండా ఉషా ప్రత్యూష పరిచయం కావడం, ఒకే ప్రాంతపు వారమవ్వడం , పుస్తకాల గురించి మాట్లాడే సమయంలో ఆమెలో కనబడే ఆ పాజిటిట్ వైఖరి, పుస్తకాల పట్ల ఆమెకు ఉన్నటువంటి  మమకారం, అభిమానం, ఆసక్తి, ఉత్సాహం ఆమెకు కథా ప్రపంచం బాధ్యతలు అప్పజెపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగించింది. అనుకోకుండా మాటల సందర్భంలో  భవిష్య ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు నిర్వీర్యంగా ఉన్న నాకు  తన సపోర్ట్ అందిస్తానని  పుస్తక ప్రచురణను  ముందుకు తీసుకెళ్ళమని, నన్ను ఉత్తేజపరిచింది. ఆమె మాటలకు ప్రభావితమైన నేను మళ్లీ కార్యోన్ముఖుడిని అయ్యాను. కథా ప్రపంచం మళ్లీ  తన ప్రచురణాలను మొదలుపెట్టింది. ఉష రాకతో అనుకున్న దాని కంటే వేగంగా ప్రాజెక్టులు ట్రాక్ పైకి రాసాగాయి. కథా ప్రపంచం ప్రచురణలు ముగించేయాలన్న నిర్ణయం నుండి ఆపకుండా మంచి సాహిత్యాన్ని ప్రచురించాలన్న దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది. 

Q: మీరు ఈ రంగం లోకి ఎలా, ఎందుకు ప్రవేశించారు? మీకు ప్రేరణ ఏమిటి?

కిరణ్ : చిన్నతనం నుండి ఏర్పరచుకున్న అమితమైన పఠనాసక్తి కారణంగా గత 15 సంవత్సరాలుగా భారత దేశంలో జరిగిన బుక్ ఫెయిర్స్, లిటరరీ ఫెస్టివల్స్ లో నేను క్రమం తప్పకుండా  పాల్గొన్నాను. ఈ క్రమంలో ఇతర భాషా రచయితలను, నోబెల్ ప్రైజ్ గ్రహీతలను కలుసుకోవడం నాపై చాలా ప్రభావం చూపాయి. ఒకసారి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో మార్గరెట్ అటీవుడ్ ని కలిసాను. ఆ సంఘటన తో పుస్తకం పై నా ఆసక్తి మరింత బలంగా మారింది. గతం లో నా పుట్టిన రోజు  రోజున రస్కిన్ బాండ్ ని కలవడానికి ముస్సూరీ కి వెళ్ళేవాడ్ని. ఎందుకంటే నా పుట్టిన రోజు, అయన పుట్టినరోజు ఒకే రోజు. అంతటి ప్రఖ్యాత రచయిత పుట్టిన రోజు నా పుట్టిన రోజు ఒక్కరోజే అవ్వడం యాదృచ్చికం అయినప్పటికీ నాకో పర్వ దినం గా భావిస్తాను. నా ఆనందాన్ని, సంతోషాన్ని పుస్తకం సాహిత్యం లోనే వెతుక్కునే ఒక సాధారణ పుస్తక ప్రేమికుడిని. పుస్తకాలు , సాహిత్యం , రచయితలూ , వీటి మధ్యే తిరగడం వలన పుస్తక ప్రచురణ చేయాలని ఆలోచన కలిగింది. ప్రచురణ మూలంగా ఎందరో పాఠకులను, రచయితలతో అనుసంధానం కలిగిస్తూ  నాకెంతో ఇష్టమైన పుస్తక ప్రపంచం లో జీవించవచ్చు అన్నదే నా ఆలోచన, అభిలాష. 

ఉషా ప్రత్యూష : మొదటి నుండి పుస్తకాలు అంటే ఉన్న మక్కువ కారణం గా కనిపించిన ప్రతి పుస్తకం కోనేదాన్ని. పుస్తకాన్ని చేతికి తీసుకున్న ప్రతిసారి అది ఎలా తయారవుతుంది అన్న ఒక  క్యూరియాసిటీ కలిగేది. అలాగే చాలా పుస్తకాలు ఇతర భాషల్లో ఉన్నంతగా తెలుగులో లేకపోవడం నిరుత్సాహపరిచేది. ఉదాహరణకు మన చిన్నతనంలో ఇంద్రజాల్ కామిక్స్ అమర్ చిత్రకథ వంటి అనేక  కామిక్స్ ఇతర భాషల్లో వచ్చేవి. నాకు ఊహ తెలిసినప్పటినుండి తెలుగులో ఏదైనా దొరక్క పోతుందా అని ఎదురు చూస్తున్నా! కానీ ఇప్పటికీ పెద్దగా దొరకట్లేదు. కామిక్స్ అనే కాదు చాలా మంచి మంచి పుస్తకాలు ఇతర భాషల్లో ఉన్నవి  తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. వాటిని చదివినప్పుడు భాష అర్థం అవుతున్నా మన భాషలో చదివిన తృప్తి దొరికేది కాదు. అప్పుడు అనిపించేది అన్ని పుస్తకాలు తెలుగులోకి అనువాదం దొరికితే ఎంత బాగుంటుంది అని. అనుకోకుండా కోవిడ్ లాక్ డౌన్ సమయం ముందు కిరణ్ గారు పరిచయం అవడం, అనేక అనువాదాలను నాకు పరిచయం చేయడం జరిగింది. మొదట్లో కేవలం చదువరిగా మాత్రమే ఉన్నప్పటికీ కాలక్రమేణా నేను ఒక మంచి పుస్తకాన్ని తీసుకురావాలన్న ఆసక్తికి బీజం పడింది నాలో. అదే విషయాన్ని కిరణ్ గారితో ప్రస్తావిస్తే అప్పుడు ప్రేమ్ చంద్ కథల ప్రాజెక్టు గురించి తన మనసులో ఉన్న ఆలోచనను బయటపెట్టారు. వెంటనే నిర్ణయించుకున్నాను ఎలాగైనా ఆ పుస్తకాన్ని బయట తీసుకురావాలని. అలా పుస్తకాలు అంటే ఉన్న మమకారమే నాకు ప్రేరణ.

Q: ఇప్పటిదాకా ఏమేం పుస్తకాలు వేశారు?

కిరణ్ :  2018 నుండి 2020 మధ్యలో వరుసగా 

  1. మా తిరుపతి కొండ కథలు
  2.  కథల మాంత్రికుడు గోపిని కరుణాకర్ కథలు 
  3. టి.  షణ్ముఖరావు అనువాద కథలు
  4.  మధురాంతక రాజారాం పిల్లల కథలు 
  5.  వేటగాడి కొడుకు ఇతర కథలు 
  6.  ఎస్వీ రంగారావు కథలు 
  7.  అమ్మ చెప్పిన కథలు
  8.  శ్రీకృష్ణ విజయం 
  9.  రమణీయ శ్రీ రామాయణం  

 పై 9 పుస్తకాలను  ప్రచురించి పాఠకుల ముందుకు తీసుకొని వచ్చాను. ఇంతలో కోవిడ్ మహమ్మారి  కారణంగా అనుకోని ఇబ్బందులను ఎదుర్కొని ప్రచురణ నిలిపి వేయదలుచుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉష తో కలిసి కథా ప్రపంచం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. 

ఉషా ప్రత్యూష :  ‘ప్రేమ్ చంద్ కథావళి’ సంపాదకురాలిగా నా తొలి పుస్తకం. కథా ప్రపంచం  ప్రచురణలలో 10 వ పుస్తకం. ఇవి కాకుండా ఇప్పుడు కొత్త, పాత కంటెంటు లతో ఇరవై ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నాము. అవి ఒక్కోటి పట్టాలెక్కుతున్నాయి. కానీ అనుకున్న దానికంటే వేగంగా పని జరగడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. 

Q: మీరు ఎలాంటి పుస్తకాలు ప్రచురించాలి అనుకుంటున్నారు? 

ఉషా ప్రత్యూష

  • దేశీ, విదేశీ భాషల్లోని మంచి పుస్తకాల అనువాదాలు
  • తెలుగులో బాల సాహిత్యం
  • పురోగమన సాహిత్యం
  • అన్నీ రకాల కథా సాహిత్యం
  • ఇదిగాక మార్గదర్శనం చేసే జీవిత చరిత్రలు 
  • ఆసక్తిని రేపే నవలలు
  • యాత్రా సాహిత్యాలు 

పాఠకులకు నచ్చే వారు మెచ్చే సాహిత్యం ప్రచురించాలని మా అభిలాష.

Q: ప్రచురణకర్తల కోసం వెదుకుతున్న పుస్తక రచయితలు మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా?

ఉషా ప్రత్యూష : తప్పకుండా సంప్రదించవచ్చు. అలా మాతో ప్రచురించదలచిన ఔత్సాహిక రచయితలు kathaaprapanchambooks@gmail.com కి మెయిల్ ద్వారా గాని లేదంటే +919908284105 కి కాల్ చేసి కిరణ్ గారిని సంప్రదిస్తే, పుస్తకం లో విషయం మేము మా టీం తో చర్చించి ప్రచురణయోగ్యమైతే ఆ విషయాన్ని రచయితలకు తెలియపరచి వారితో అన్నీ వివరాలు చర్చించి ఇరువైపులా సమ్మతమైతే ప్రచురణలో ముందుకెళతాము. 

Q: కొత్త పుస్తకాలని ఎలా ఎంచుకుంటారు?

ఉషా ప్రత్యూష : ప్రోగ్రెస్సివ్ కంటెంట్ కలిగిన ఈ తరానికి కనెక్ట్ అయ్యే భావజాలం గల పుస్తకాలు, హృద్యమైన కథాంశాలు, ఆలోచనలు రేకెత్తించే పుస్తకాలు, పాఠకులకు ఆసక్తిని కలిగించే ఇతర భాషల్లో పుస్తకాలు మా టీం తో కలిసి చదివి ఫైనల్ చేసుకుంటాము. ఫైనల్ అయిన పుస్తకాల కాపీరైట్స్ కోసం వాటి ఒరిజినల్ రచయితలు, పబ్లిషర్లతో ఒప్పందం  చేసుకొని అనువాద ప్రక్రియ మొదలు పెడతాము. రచయితలకు ఇచ్చే రాయల్టీ ల విషయంలోనూ రెమ్యూనరేషన్ విషయంలోనూ చాలా ఖచ్చితంగా లీగల్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళతాము.  

Q: పుస్తకం మొదటి ప్రతి సిద్ధమయ్యాక ఎడిటింగ్ ప్రూఫ్ రీడింగ్ వంటి దశలలో మీ పనితీరు గురించి కొంచెం వివరిస్తారా?

ఉషా ప్రత్యూష : పుస్తకం డిటిపి  దశ ను దాటుకొని మొదటి  ప్రతి చేతికి రాగానే వాటిని కాపీలు తీయించి  మా తెలుగు భాష నిపుణుల టీం కి ఆ ఫైల్ ని ఫార్వర్డ్ చేస్తాం. మా టీంలో  నేను, కిరణ్ గారి తో పాటు  ఇద్దరు నిపుణులు అక్షర దోషాలు లేకుండా పర్యవేక్షిస్తారు. నాలుగు దశల్లో ప్రూఫ్ రీడింగ్ జరిగాక ఎప్పటికప్పుడు డిటిపి ఆపరేటర్ల దగ్గర  అక్షర దోషాలను  సవరించి ఫైనల్ కాపీని తయారు చేస్తాం. ఈ అక్షర దోషాల సవరణ అన్నింటికన్నా పెద్ద దశగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత మా చిత్రకారునికి పుస్తకానికి ముఖచిత్రం గీయడానికి కావలసిన సమాచారం అందించి అతనికి కావలసిన సమయం ఇచ్చి, మేము కోరిన విధంగా ఆ చిత్రం వచ్చే వరకూ పలు రకాల వర్షన్లు గీయించి ఫైనల్ గా మా టీం లో అందరి ఆమోదం పొందిన చిత్రాన్ని ఎంపిక చేసి మా డిజైనర్ కు ఆ చిత్రాన్ని పంపి కవర్ పేజీ డిజైన్ మరియు బుక్ మేకింగ్ ప్రక్రియను పూర్తి చేస్తాము.

Q: పుస్తక ప్రచురణతో పాటు ఇతర పుస్తకాల అమ్మకాలు కూడా చేస్తారా?

కిరణ్ : చేస్తాము. ఇప్పటి వరకూ కేవలం ఆఫ్ లైన్ గా మాత్రమే పుస్తకాల అమ్మకాలు చేసే వాడిని. కానీ ఇవుడు ఉష ఇచ్చిన ఆలోచనతో www.kathaaprapanchambooks.com పేరున ఒక పుస్తక విక్రయ వెబ్సైటు ను ప్రారంభించాము. మా ద్వారా వారి పుస్తకాలను విక్రయించదలచిన రచయితలు, ఇతర ప్రచురణ కర్తలు  వారి పుస్తకాలను మా వెబ్సైట్ ద్వారా అమ్మకం జరపడానికి మా  నెంబర్ ని సంప్రదించి వివరాలు పొందవచ్చు.

తాజా పుస్తకం గురించి

Q: తాజాగా ప్రముఖ హిందీ/ఉర్దూ రచయిత ప్రేమ్ చంద్ రాసిన వంద కథల తెలుగు అనువాదం తో ఒక పుస్తకం ప్రచురిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున  పెద్ద ఎత్తున ఆయన రచనల అనువాదానికి  పూనుకోవడానికి కారణం ఏమిటి? 

ఉషా ప్రత్యూష : మున్షీ ప్రేమ్‌చంద్ ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత భారతీయ రచయిత.  అతని కథలను తెలుగు భాషలోకి అనువదించడం వల్ల అసలు హిందీ లేదా ఉర్దూ భాషలతో పరిచయం లేని పాఠకులు సైతం అతని సాహిత్య రచనలను చదివి ఆనందించవచ్చు. ఆయన రాసిన కథల సమగ్రాన్ని విస్తృతమయిన ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే కోరిక నుండి ప్రచురించాలన్న ఆలోచన వచ్చింది. తద్వారా ప్రేమ్ చంద్ రచనలను కొత్త తరాలకు    పరిచయం చేసే అవకాశం కలుగుతుంది. తెలుగులో ఆయన కథలు పదుల సంఖ్యలో కూడా లేకపోవడం ఈ పుస్తకం తీసుకురావడానికి మరొక ముఖ్య కారణం. 

Q: 19 శతబ్దం మొదట్లో రచించబడిన కథలు తరం పాఠకులకు ఏవిధంగా కనెక్ట్ అవుతాయి అని మీరు భావిస్తున్నారు?

ప్రేమ్‌చంద్ కథల్లో  ఎంచుకున్న పేదరికం, సామాజిక అసమానత, కుల వివక్ష మరియు మానవ స్వభావం వంటి సార్వత్రిక  ఇతివృత్తాలు ఈనాటి సమకాలీన సమాజంలో సైతం ప్రబలంగా ఉన్నాయి. ఆయన కథల్లో కనిపించే సామజిక సమస్యలు, నైతిక సందిగ్ధతలు, మానవ సంబంధాలు, భావోద్వేగాలు అన్నీ ఈ తరం జీవితాలకు అనుసంధానించబడి ఉన్నాయి. దీని కారణంగా చదివే పాఠకులు తమను తాము ఆ పరిస్థితుల్లో ఆ పాత్రలలో చూసుకొని కనెక్ట్ అవుతారు. 

Q: ఈ సిరీస్ లో ఇంకా ఎన్ని పుస్తకాలు రానున్నాయి? వీటిని అనువాదం చేస్తున్న వారి గురించి పరిచయం చేయండి. 

మేము మొత్తం 300 వరకూ ప్రేమ్ చంద్ కథలు సేకరించాము. వాటిలో 100 కథలతో మొదటి భాగం గా ఈ ప్రేమ్ చంద్ కథావళి ని మీ ముందుకు తెస్తున్నాము. రెండవ దఫా  100 కథల సంపుటి అనువాద దశలో ఉంది. మూడవ పుస్తకంగా వేయదలచిన ప్రేమ్చంద్ కథలు  ఎంపిక చేయబడిన ఫైలు సిద్ధంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే  వీలైనంత తొందరగా మిగిలిన రెండు పుస్తకాలను కూడా ప్రచురణ రూపంలోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నాం. 

ఈ మూడు భాగాల ప్రేమ్ చంద్ కథావళి లోని 300 కథలను అనువాదం చేస్తున్నది అచ్యుతుని రాజ్యశ్రీ గారు. ఆవిడ  వృత్తి రీత్యా అధ్యాపకురాలిగా పని చేసినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్యభిలాషులు. వార్త, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వంటి అనేక ప్రముఖ దిన పత్రికల్లో ఆమె ఆర్టికల్స్ ప్రచురితం అయ్యాయి. హైదరాబాద్ రేడియో పిల్లల ప్రోగ్రాం లలో, వనితావాణిలో పాల్గొన్నారు. యు.ఎస్.ఆన్లైన్ మాగజైన్ తరుణి లో మహిళా మణులు అనే శీర్షికతో రాస్తున్నారు. రామోజీ ఫౌండేషన్ లోని విపుల లో ఆమె అనువదించిన 200 పైగా కథలు, చతురలో కొన్ని నవలలు ఆమెకు గుర్తింపు ను తెచ్చిపెట్టాయి.

Q: కథలని నేరుగా మూలం నుంచే అనువదించారా? మూల రచనలు ఎక్కడ నుండి సేకరించారు? 

కిరణ్ : హిందీ లోని ప్రేమ్ చంద్ కథా సంకలనాల నుండి కథలను సేకరించి రాజ్యశ్రీ గారితో అనువాదం చేయించాము. వీటిలో కొన్ని కథలు ఉర్దూ నుండి హిందీ లోకి అనువాదం చేయబడిన కథలను మేము తెలుగులోకి అనువాదం చేయించాము.

Q: ప్రేంచంద్ కథలేనా లేదా ఆయన ఇతర రచనల అనువాదాలని కూడా తెలుగులో తెచ్చే ఆలోచన ఉందా? 

ఉషా ప్రత్యూష : తెలుగులో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన నవలలు ఇప్పటికే అనువదించబడ్డాయి. ప్రస్తుతానికైతే మాకు కథా సాహిత్యం మొదటి ప్రాధాన్యత. ఒకవేళ పాఠకులు కోరితే భవిష్యత్తులో తెలుగు అనువాదానికి నోచుకోని ప్రేమ్‌చంద్ నవలా సాహిత్యాన్ని కూడా  పుస్తకరూపం లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 

Q: “ప్రేమ్ చంద్ కథావళి” పుస్తకం ప్రచురించాలన్న ఆలోచన నుండి పుస్తక రూపం దాల్చడానికి ఎంత కాలం పట్టింది?

 పుస్తకంలో ఉన్న కథలను సేకరించడానికి దాదాపుగా ఆరు నెలల కాలం పట్టింది. తర్వాత వాటిలో మొదటి నూరు కథలను  అనువదించడానికి మా అనువాదకురాలు అచ్యుతుని రాజ్యశ్రీ గారికి 8 నెలల సమయం పట్టింది. డీటీపీ చేయించడానికి 3 నెలలు, తర్వాత విభిన్న దశలలో ప్రూఫ్ రీడింగులు, అక్షర దోషాలు దిద్దుబాటు ప్రక్రియ చేపట్టి ఫైనల్ కాపీ తయారు అవడానికి 3 నెలల సమయం పట్టింది. మొత్తంగా ప్రేమ్ చంద్ కథావళి పుస్తక రూపం దాల్చడానికి వెనుక మా రెండు సంవత్సరాల శ్రమ ఉంది. 

Q: ఈ పుస్తకాన్ని ప్రచురించే ప్రయాణం లో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు?

నిజానికి చెప్పాలంటే పుస్తకం లోని కథలు ఎంపిక, వాటిని అనువాదం చేసాక వాటిని డీటీపీ కి పంపడం అనే దశలు చాలా సులభంగా దాటుకున్నాము. డీటీపీ పూర్తి చేసుకున్న తొలి ప్రతి మా చేతికి వచ్చినప్పుడు వాటిలో అక్షర దోషాలు లేకుండా సరిచేయించడం మాకు ఎదురైన తొలి సవాలు. అలాగే పుస్తకం అన్నీ దశలు దాటుకున్నాక ప్రింటింగ్ కు పంపడానికి ముందు ISBN కోసం అప్లై చేయాలనుకున్నాము. కానీ ప్రస్తుతం మారిన పద్ధతులలో ISBN పొందే విధానం మాకు తెలియలేదు. యూట్యూబ్ లో కూడా చాలామంది పెట్టిన వీడియోలు పాత పద్దతి లో ఉన్నాయి. అప్డేట్ చేసిన విధానం మాకు తెలియక ఇప్పుడు మార్కెట్ లో ISBN తో పుస్తకాలు ప్రచురిస్తున్న అనేక మందిని సలహా అడిగితే అది ఎవరికీ దొరకని బ్రహ్మ పదార్థం అన్న రీతిలో చెప్పి, అది అంత సులభంగా దొరకదని, ISBN అప్లై చేసినా వెంటనే శాంక్షన్ అవదని మమ్మల్ని నిరుత్సాహపరిచడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మేము మావంతు ప్రయత్నం గా అప్లై చేసాము. మా శ్రమని మరిచే విధంగా మేము అప్లై చేసిన రెండవ రోజునే మాకు ISBN అలాట్ చేశారన్న ఇమెయిల్ అందింది.

Q: పాఠకులు ఈ పుస్తకాన్ని ఎలా కొనుగోలు చేయవచ్చు? అంతర్జాతీయ పాఠకులు, ఇతర మాధ్యమాలలో చదివే వారికోసం ఈ-బుక్స్, ఆడియో బుక్స్ వంటివి తయారు చేసే ఆలోచన ఉందా? 

ఉషా ప్రత్యూష : ఈ పుస్తకం కొనాలనుకునే వారు ప్రస్తుతానికి 99082 84105 నెంబర్ కు Phone pe లేక Gpay ద్వారా పుస్తకం వెల ₹699 + ₹50 పోస్టల్ చార్జీల కోసం పంపి ఆ స్క్రీన్ షాట్ ను పైన చెప్పిన నెంబర్ కు వాట్సాప్ చేసి అడ్రస్ పంపిన యెడల మీకు పోస్టు లో పుస్తకం సురక్షితంగా చేరేలా చేస్తాము.  త్వరలోనే మా కథా ప్రపంచం పుస్తకాల వెబ్సైటు సిద్దమవగానే అందులో కూడా మా పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ మరియు flipkart ల లో కూడా మా పుస్తకాలు లభ్యం అయ్యేలా ఏర్పాటు చేస్తున్నాము. త్వరలోనే ఆ లింకులు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాము. 

ఇక ఈ-బుక్స్ మరియు ఆడియో బుక్స్ విషయానికొస్తే కథాప్రపంచం సమీప భవిష్యత్తు లో మా అన్నీ పుస్తకాలను ఈ-బుక్స్ ఇంకా ఆడియో బుక్స్ గా తీసుకొచ్చే దిశలో పనిచేస్తున్నాము. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే పాఠకులతో ఆ కబురు పంచుకుంటాము. 

Q: మీరు ప్రచురించే ఇతర పుస్తకాల వివరాలు అప్డేట్ లూ పాఠకులు ఏ విధంగా తెలుసుకోవాలి?

 ప్రస్తుతానికి కథా ప్రపంచం ప్రచురణల అప్డేట్లను తెలుసుకోవడానికి కథాప్రపంచం ఫేస్బుక్ పేజిని follow అవండి. అలాగే త్వరలోనే సిద్ధం కాబోతున్న వెబ్సైటు ను సందర్శించడం ద్వారా మా అప్డేట్లను పొందండి. 

Q: మీరు ప్రచురించబోతున్న తదుపరి పుస్తకాలు ఏమిటి? 

ఉషా ప్రత్యూష : ప్రస్తుతానికి ప్రేమ్ చంద్ కథావళి మొదటి పుస్తకం తో బాటుగా, 

  • విక్టర్ హ్యూగో చే రచింపబడి సూరంపూడి సీతారం గారిచే తెలుగులోకి అనువాదం చేయబడిన ‘ఘంటారావం’
  • చార్లెస్ డికెన్స్ చే రచింపబడి బెల్లంకొండ రామదాసు గారిచే తెలుగులోకి అనువదించబడిన ‘కలికాలం’

ప్రచురణ కు పంపేసాము. ఇవి కాకుండా మరో 8 పుస్తకాలు ప్రూఫ్ రీడింగ్ జరుపు కుంటున్నాయి. ప్రేమ్ చంద్ కథావళి రెండవ భాగం సైతం అనువాద దశలో ఉంది. 23 పుస్తకాలు తదుపరి ప్రచురణ కొరకు మా నిపుణుల సమూహం చేత ఎంపిక చేయబడినాయి. త్వరలో వివరాలు తెలియజేస్తాము.


Q. పాఠకులకు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?

పుస్తకాలను దయచేసి కొని చదవండి. పైరసీ ని ప్రోత్సాహించకండి. టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్స్అప్ గ్రూపుల్లో అంతర్జాలంలో పిడిఎఫ్ ల రూపంలో పుస్తకాన్నిఉంచి లేక పంచి రచయితలు, పుస్తక ప్రచురణకర్తల పొట్టపై కొట్టకండి. ఒక పుస్తకాన్ని ప్రచురించి మీ ముందుకు తీసుకొని రావడానికి వెనుక కొన్ని నెలల కొన్నిసార్లు  కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. దయచేసి ఆ కష్టాన్ని గుర్తించండి. పుస్తకాన్ని కేవలం కొని చదవండి.

You Might Also Like

One Comment

  1. Ramesh Babu Javvaji

    Great effort. I have been following this page in FB for quite some time. Very interesting and a great deal of work.

Leave a Reply