మంచుపూల వాన – కుప్పిలి పద్మ

రాసి పంపినవారు: మురళి (http://nemalikannu.blogspot.com)

manchu1నగరాల్లో పుట్టి పెరిగిన ఈ తరం అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయి? జీవితాన్ని గురించి వాళ్ళ దృక్పధం ఏమిటి? తరాల మధ్య అంతరాలు, పాశ్చాత్య సంస్కృతి మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఈ ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు రచయిత్రి కుప్పిలి పద్మ తన కథల తాజా సంపుటి ‘మంచుపూల వాన’ లో.. శీర్షికలో కనిపించే సున్నితత్వం పుస్తకం లోని దాదాపు ప్రతి పేజీలోనూ తొంగి చూస్తూ ఉంటుంది.

ఊదా మబ్బుల ఆకాశం, మెత్తని గాలి, వెచ్చని నెగళ్లు లాంటి ప్రకృతి వర్ణనలు, రంగు రంగుల పూలనీ, అందమైన సాయంకాలాలనీ ఇష్టపడే అమ్మాయిలూ, వాళ్ళ భయాలూ, బెంగలూ, ఇంకా సమాజం పట్ల వాళ్ళ బాధ్యతా, చుట్టూ ఉన్నవాళ్ళ కోసం వాళ్ళు పడే తపనా కథా వస్తువులుగా పద్మ రాసిన పన్నెండు కథలు ఈ సంకలనం లో చోటు చేసుకున్నాయి. ఈ కథలన్నీ గడిచిన ఐదారేళ్ళ కాలంలో వివిధ పత్రికలలో అచ్చయ్యాయి.

మొదటి కథ ‘వర్షపు జల్లులలో..’ లో నాయిక మహి. ఈ మధ్య తరగతి టీనేజ్ అమ్మాయికి ఓ స్నేహితుడి ద్వారా ఖరీదైన జీవితం పరిచయం అవుతుంది. ఫలితం..అప్పటివరకు ర్యాంకర్ గా ఉన్న ఆ అమ్మాయి బొటాబొటి మార్కులతో ఇంటర్ పాస్ అవుతుంది. విషయం తల్లికి తెలుస్తుంది. “కొన్నిసార్లు గాయపడడం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది..” అంటుంది అమ్మ.

‘మంచుపూల వాన’ కథలో నాయిక మేఘ..డబ్బున్న అమ్మాయి. నరేంద్ర ని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళయ్యాక నరేంద్రలో డబ్బు పట్ల పెరిగిన ఆకర్షణ. మేఘ కి, అతనికి మధ్య పెరిగిన దూరం. తనకి నచ్చిన పద్ధతిలో జీవించడం కోసం మేఘ తీసుకున్న నిర్ణయమే కథ ముగింపు. మిళింద్-మాళవిక ల ప్రేమకి మ్యాన్ హోల్స్ ఎలా అడ్డొచ్చాయన్నదే ‘చలేగా చలేగా ఏ ఇష్క్ కా జమానా’ కథ. సివిక్ సెన్స్ ఉన్న మాళవిక, అదే సెన్స్ ని తన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఆశించడం, దీనివల్ల మిళింద్ పడే ఇబ్బందులూ కథాంశం.

పున్నాగ పూలని ముద్దు పెట్టుకున్న ఓ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి కథ ‘మంత్ర నగరి సరిహద్దులలో..’ ప్రపంచీకరణ నేపధ్యంలో కెరీర్ లో పెరిగిన పోటీ, అవకాశాల కోసం వెతుకులాట, తమనితాము నిరూపించుకునే ప్రయత్నాల చుట్టూ సాగే ప్రేమ కథ ఇది. పెరటి తోటని ఇష్టపడే అమ్మకి ఓ ఇండిపెండెంట్ ఇల్లు కట్టించి ఇవ్వాలని తపన పడే కూతురి కథ ‘అమ్మకో ఇల్లు.’ ప్రేమంటే ఏమిటో సరిగ్గా తెలియని వశిష్ట ని తనకి కావల్సిందేమితో స్పష్టంగా తెలుసుకునేలా చేసిన ఉత్కళ కథ ‘కొన్ని రంగు రంగుల సాయంకాలాలలో..’

చిన్నప్పుడే తన వాళ్లకి దూరంగా ఓ బ్యూటీ పార్లర్లో పనికి కుదిరిన పేదింటి అమ్మాయి దక్ష కథ ‘చెమ్మగిల్లిన వసంతం.’ బహుళజాతి కాస్మటిక్ కంపెనీల వ్యాపార వ్యూహాలని వివరించారీ కథలో. కాల్ సెంటర్ సంస్కృతిని, అక్కడి ఉద్యోగుల మానసిక స్థితినీ చర్చించిన కథ ‘మాయ.’ పెళ్ళయిన పదిహేనేళ్ళ తర్వాత భర్త మరో అమ్మాయి వెంట పడితే ఆ భార్య ఏం చేసిందన్నది Ms. మయూర కథ. అపార్ట్మెంట్ సంస్కృతికి ఫలితంగా చెట్లు, ఆ చెట్ల కింద జీవించే వాళ్ళ జీవితాలు ఎలా కళ తప్పుతున్నాయో చిత్రించిన కథ ‘చింత చెట్టు నీడలో వచ్చని పరిమళపు పాట.’

ప్రేమ కన్నా కెరీర్ ముఖ్యమనుకునే కవి శిరీష్ నుంచి అతన్ని ప్రేమించిన జర్నలిస్ట్ నిత్యకల్యాణి నేర్చుకున్న పాఠమే ‘వసంత స్వప్నం’ కథ. ఒకప్పుడు వర్షాన్ని ప్రేమించిన వాళ్ళంతా ఇప్పుడు వర్షం అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పే కథ ‘వాన కురిసిన ఓ మద్యాహ్నం.’ హైదరాబాద్ మహా నగరం లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వాళ్ళ వర్షాకాలం లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలని వివరిస్తూనే పరిష్కారాన్నీ సూచిస్తుందీ కథ.

సున్నితమైన భావోద్వేగాలతో సాగిపోయే ఈ కథలు పుస్తకం మూసి పక్కన పెట్టాక కూడా మనల్ని వెంటాడతాయి. మనకున్న ‘సివిక్ సెన్స్’ ని ప్రశ్నిస్తాయి. ఆధునిక తరం అమ్మాయిల అంతరంగాలని ఆవిష్కరిస్తాయి. అధిక శాతం కథలు ఆశావహ దృక్పథం తోనే ముగుస్తాయి. ముక్తా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 95. లభించే స్థలాలు: ‘విశాలాంధ్ర’ ‘ప్రజాశక్తి’ అన్ని బ్రాంచీలు, ‘నవోదయ’ కాచిగూడ, హైదరాబాద్, ఏలూరు రోడ్, విజయవాడ, దిశ పుస్తక కేంద్రం, చిక్కడపల్లి, హైదరాబాద్, ప్రభవ బుక్ షాప్, పొగతోట, నెల్లూరు. ఎన్ని పుస్తకాల మధ్య ఉన్నా తనవైపు దృష్టిని మరల్చుకోగలిగే అందమైన కవర్ పేజి ఈ పుస్తకం ప్రత్యేకత.

You Might Also Like

9 Comments

  1. Kuppili Padma

    Thank you Murali గారు.

  2. మధురవాణి

    మురళీ గారూ,
    మీ పోస్టు చూసి నేనీ పుస్తకం కొన్నానండీ!

  3. praneeta.swathi

    మీ టపాలు చదివి కొన్న చాలా పుస్తకాల్లో ఇది కూడా ఒకటి మురళీగారూ..అన్ని కధలూ చాలా బాగున్నాయ్. చదవడం పూర్తి చేసిగాని లేవలేకపోయాను.

  4. నెటిజన్

    @Yogi: A Bibliophile and a book worm do deserve due respect. Thank you.

  5. Yogi

    On Telugus consuming less than 2000 copies, I can not emphasise how much I empathize with your cause. With all due respect I submit to you, that when a repetitive comment is being questioned, repetition is being questioned *NOT* the comment itself, not what it conveys. Well, If you find it out of my place to question, I’ll shrug, and let it go. Suggestions and questions are of same nature. Both are free.

    I do NOT find it blasphemous, or as an act of serious transgression when two telugus communicate in English on this forum – as a matter of fact, any other forum, unless Telugu fanatics are at the helm.

    The earlier comment seem to have hit a raw nerve, but it was not intended that way. It was neither audacity of brashness, but out of linguistic inability this send. I do appreciate your time responding to it, and the undeserving respect thrown at me. In our future conversations, If any – lets cut niceties like “Mr.”, “Dear”, “Sir” .

    I am going mute on this thread now.

    Cheers
    Yogi

  6. నెటిజన్

    @Yogi: Your unstoppable curiosity – is most welcome, but for my often repeated comments you would not have used the word ” obsession “.

    When the English read their English books, the Russians their Russian books, the French their books in French, the Norwegians their books in Norwegian, the Sinhalese read their books in Simhala, the Malaysians read their books in Malay, the Japanese read their books in Japanese, the Kashmiris their books in Kashmiri, the Tamilians read their books in Tamil and it is a pity, Sir, Dear Mr. Yogi, that for a population of six crores we hardly consume 2000 copies of a published work in Telugu.

    And Mr. Yogi, two Telugus are conversing in English, space courtesy provided by పుస్తకం డాట్ నెట్ begun by Telugu book lovers. The very name of this site is in Telugu language. The header image shows Telugu books.

    There are people out there who do not seem to have enough of access to Telugu books be they writers or readers. If, Mr. Yogi, if one more book is read / sold so much for Telugu writer / reader and the language, not necessarily in that order, though.

    You should also read an other story about కదంబి here on this site.

    Actually your comment deserves..but then this not the forum to elaborate on.

    పుస్తకం మిత్రులకి క్షమాపణలతో..

  7. Yogi

    @Netizen – I am sorry if I am intruding, This by no means is to hurt you. But I couldn’t control this – Out of unstoppable curiosity I ask you, why this obsession with stuffing down the throat of others, a same point again and again? Haven’t you asked pustakam.net people to give the details of books, like a million times before? Doesn’t it sound repetitive and monotonous?

    Again, I am just curious, and I don’t seek a reply from you. I just expressed my views!

  8. నెటిజన్

    ముఖపత్రాన్ని “స్కాన్” చేసి ఈ “పరిచయం” కి జతపరిచారు, అని అంటే పుస్తకం అందుబాటులో ఉన్నదనేగా అర్ధం! మరి ప్రచురణ / కర్త వివరాలు ఎందుకని ఇవ్వలేక పొయ్యారో? వారి అభిమాని KumarN గారి దృష్టికి ఆ పుస్తకం రాలేదు. మీరు ఆ వివరం ఇచ్చి ఉంటే, రచయిత్రి అభిమానిని, ఆ పుస్తకానికి మరొక మెట్టు దగ్గిరకి తీసుకుని వెళ్ళినట్టే కదా? పుస్తకం డాట్ నెట్ కి మరొక అభిమాని తయారయ్యేవారే కదా? రచయిత్రి కి పుస్తకం డాట్ నెట్ ఒక సహాయం చేసినట్టే కదా? ప్రచురణ కర్త/లకి కూడా! రచయిత్రికి – అభిమానికి మధ్య పుస్తకం డాట్ నెట్ ఒక వారధిగా ఏర్పడేది కదా?

  9. KumarN

    హ్మ్..
    నాకు కుప్పిలి పద్మ రాసేవి ఇష్టం. ఎప్పుడు ఇండియా వెళ్ళినా తనవేమైనా కనపడితే వెంటనే తీసేసుకుంటాను. శీతవేళ..సాలభంజికలు..అలా కొన్నవే. ఆన్లైన్ లో కూడా వెతుకుతూ ఉంటాను, ఏమయినా రాసిందేమోనని…

    ఈ పుస్తకం ఎప్పుడొచ్చిందబ్బా! మీ రివ్యూ చదవలేదు నేను కావాలనే..నేను చూద్దామనుకున్న సినిమా గురించి కాని, చదువుదామనుకున్న పుస్తకాన్ని గురించి కాని పరిచయాలు ముందు చదవను. కాని ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ ఖశ్చితంగా చదువుతాను.

    ఎనివే, పుస్తకం ఉందని తెలియచెప్పినందుకు ధన్యవాదాలు.

Leave a Reply