పుస్తకం
All about booksఅనువాదాలు

May 17, 2009

He: Shey by Rabindranath Tagore

More articles by »
Written by: Purnima
Tags: , ,

he“అతడు” – పదం వినగానే మహేష్ సినిమా గుర్తొచ్చేసిందా? హమ్మ్.. సరే! నేనిప్పుడు నాకు తెల్సిన ఇంకో “అతడు” గురించి చెప్తాను. వింటారా?

పోయిన ఆదివారం ఎప్పుడూ ఆడే ఆటే మొదలెట్టా పుస్తకాలతో! కానీ నా మూడ్ ఏమో మా పార్ట్ నర్ షిప్ కొనసాగనివ్వకుండా ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకాన్ని రన్ అవుట్ చేసేస్తూ ఉంది. ఇక ఆ రోజుకి ఆటలు సాగవూ అనుకుంటుండగా “టట్టడాం..” అనుకుంటూ “అతడు” నా ముందుకొచ్చాడు. చూడగానే ఉలిక్కి పడ్డా, వింత ఆకారం, భయంకర రూపం! నేను భయపడ్డా అని తెలియగానే కాస్త వేళాకోళంగా నవ్వాడు. నాకు కోపమొచ్చింది.

“ఎంటా నవ్వు?” అన్నా, “ఎవరు నవ్వు?” అని అడగక్కుండా.

“భయపడ్డావా?” అన్నాడు అదే వెక్కిలి నవ్వుతో..

“లేదు.. కానీ అసలు ఎవరు నవ్వు?” -హమ్మయ్య అడిగేశా..

“నేను “అతడి“ని”

“ఏం తమాషాగా ఉందా? వేషాలు వేస్తున్నావ్?” – తిక్కరేగి ఉన్నా అప్పటికే..

“శాంతించు.. శాంతించు.. నేను మీ టాగోర్ తాలూకానే! ఎన్నో రోజుల బట్టి ఎదురుచూస్తున్నా, నువ్వు మాట్లాడుతావేమో అని. నన్ను పక్కకు పడేసి అసలు పట్టించుకోవటం లేదు.. అందుకే నేనే వచ్చేను..” అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. “టాగోర్” అన్న మాట వినగానే కాస్త చల్లబడ్డాను. తెలీని మనిషితో మాట్లాడనా వద్దా అన్న సంశయం వీడకున్నా, టాగోర్ అనగానే మనసు లాగేసి అసలు సంగతేంటో అడగాలనుకున్నాను. అడిగాను.

“కథ చెప్పనా?” అన్నాడు

“ఆహహహా! ఇప్పుడు నేను వెంటనే “ఊ.. చెప్పు, చెప్పు” అని ఆతృత కనబరచగానే, ఇందాకటి వెక్కిరింపు నవ్వు మళ్ళీ నవ్వి, “కథ చెప్తాను ఇప్పుడు…..” అని పాస్ (pause) ఇచ్చి “ఇప్పుడు కాదు గానీ, రేపూ” అనడానికా? ఎవరికి తెలీని వేషాలివి?” అని నా గడుసుతనం అంతా చూపించాను.

“అయ్యో.. లేదు, లేదు, నిజంగానే.. బోలెడు కబుర్లు చెప్తాను / చెప్పిస్తాను.. విను మరీ” అన్నాడు బతిమిలాడుతూ..

“చెప్పిస్తాను? ఏంటి? నీతో పాటు ఇంకెవ్వరున్నారు?”

“టాగోర్..”

ఇంకేముంది? కోపం, ఉక్రోషం, గడుసుతనం, విసుగు, చిరాకు అన్నింటినీ అక్కడే వదిలేసి, అమ్మ అప్పం పెడతానగానే పెరిగెత్తుకొని వెళ్ళి, చేతులు కట్టుకుని బుద్ధిగా నిల్చునే చిన్నారిలా మారిపోయాను. కథ మొదలయ్యింది..

“దేవుడు సృష్టించిన మానవులకి అతడి సృష్టి సంతృప్తి పరచలేకపోయింది. మేమే మనుషుల్ని సృష్టించుకుంటాం అని కథల్లో పదాలతో ఎందరికో జీవం పోశారు. మొన్న నా మనవరాలు నన్ను కథ చెప్పమని నిలదీయటంతో నేనూ ఈ కథలు చెప్పేవారి జాబితాలో చేరాను..” అంటూ టాగోర్ అందుకున్నారు. “నిలదీయనిదే మీరు కథలు చెప్తారేంటి?”  అందామనుకుని, మళ్ళీ గమ్మునయ్యా.

ఇంతకీ ఆ మనవరాల పోరు పడలేక, ఈ తాతగారు కూడా పదాలతో ఓ పాత్రను సృష్టించారు. ఆ పాత్రకు నామకరణం చేయకుండా బెంగాళీలో “శే”, ఇంగ్లీషులో “హి”, తెలుగులో “అతడు”గా (నా చేత) పిలవబడ్డాడు. ఈ “అతడు” “హీరో” కాదు, “విలనూ” కాదు. ఆకలేసే గుణమున్న మనిషి. మనలాంటి మనిషి. ఆ మనిషి, మన తాతగారూ కలిసి, ఈ చిన్నారిని తమ కథలతో ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు. మొదట్లో మనిషిగా మారాలనుకున్న కొంకనక్క కథ, మానవ మనుగుడ కోసం మళ్ళీ మనుషులంతా నాలుగు కాళ్ళ జీవిగా మారాలని ప్రతిపాదించే కొత్త తరం మేధావులు చేసే ప్రయోగాల గురించి ఓ కథ చెప్పుకొచ్చారు.

“ఏంటి? అన్ని టాగోర్ చెప్తున్నారు? నువ్వేం చెప్తావ్?” అన్నా రెచ్చగొడుతూ “అతడి”తో..

అంతే మొదలెట్టాడూ. కథలో ఒక పాత్రలా మిగిలక, టాగోర్‍కే కౌంటర్లు వేస్తున్నాడు. “ఈ కథ నచ్చుతుందంటావా?”, “ఇది విని నవ్వుతుందంటావా?”, “నువ్వు కాస్త మెరుగుపడాలి కథల విషయంలో” అని టాగోర్ కే ఉచిత సలహాలు. అందుకే, ముందే చెప్పాను కదా, మనలాంటి మనిషని!

“అయ్యో రామా! ఆయనకే సటైర్లా? దమ్ముంటే చూపించు నీ బడాయ్?” అన్నాను ఉండబట్టలేక.

పూర్తి చేసిన కథకి వంకలు పెట్టడమే కాకుండా, తానే కథకుడినైతే ఎలా చెప్పేది కూడా వివరించాడు. టాగోర్ సాన్నిహిత్యమో ఏమో కానీ, మన “అతడు” పులి మీద కవితలు కూడా రాశాడు. ఇద్దరూ కలిసి అప్పటి తరం కవుల గురించి, కొన్ని పౌరాణిక పాత్రల గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. టాగోర్, అతడు, ఆ చిన్నారి కలిసి చెప్పుకున్న ముచ్చట్లన్నీ నేను ఆసాంతం బుద్ధిగా వినేశాను. చివరికొచ్చేసరికి, “ఏంటి తాతయ్య, నా మీదే ఇలాంటి చిన్న కథలు చెప్తావ్” అనేంత పెద్దగా అవుతుంది ఆ అమ్మాయి.

అంతా విన్నాక, ఓ తొమ్మిదేళ్ళ అమ్మాయికి చెప్పిన కథల్ని నేనిప్పుడు ఈ వయస్సులో ఇలా చెవులప్పగించుకుని వినడం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అనుమానం కలిగింది. తెలీకుండా, చుట్టూ చూస్తూ “ఎవరూ చూడలేదు కదా” అని అయోమయంగా అతడి వైపు చూశాను. అప్పుడే ఎవరో అంటూ ఉన్నారు.. “I find it not just for children but for the eternal child.” అతడూ, నేనూ ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాం.

ఇక వెళ్ళిపోయే సమయం వచ్చేసరికి ఇద్దరికీ ఏదోలా ఉంది. “మళ్ళీ కలుద్దాం లే! ఇక్కడే ఉంటా నేను” అన్నాను. నా సంగతి తెల్సునేమో, పెద్ద ఉత్సాహపడలేదు. “నీ ఫ్రెండ్స్ కి నన్ను పరిచయం చేస్తావా?” అనడిగాడు ఆశగా..

“నువ్వు “నిజం” కాదుగా” అనేశా, మనిషనని నిరూపించుకుంటూ..

నాలుక కరుచుకుని, “పరిచయం చేస్తాను. నువ్వు అడిగావ్ అని కాదు. ఈ కింది వాక్యాలను నాకు పరిచయం చేసి, అందులో అర్థం బోధపడేలా నాతో మిగిలిపోతున్నందుకు” అని అన్నాను.

“Whatever impresses itself upon the mind in a distinct form or shape is ‘real’. It does not rely upon reason or logic; it may have no functional meaning or factual basis; it may lie far beyond the limits of possibility. Still, ‘it represents an image before the mind, awakens an interest in it, fill up an emptiness: it is ‘real’.”

సంతృప్తిగా నవ్వుకుంటూ పుస్తకంలోకి “అతడు” వెళ్ళిపోయాడు. నేను హాయిగా నిద్రపోయాను.

********************************************************************************************************

పుస్తకం వివరాలు:

పేరు: He:Shey by Rabindranath Tagore

ఆంగ్లానువాదం: Aparna Chaudhuri

వెల: రూ. 195 /-

ప్రచురణ: PenguinAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..9 Comments


 1. సమీక్ష చేసిన విధానం వినూత్నంగా చాలా బాగుంది. అభినందనలు. వూహకు వాస్తవానికి మధ్య కనీ కనిపించనట్లుడే సన్నని రేఖ ‘తర్కం’.. టాగోర్ పాత్రలు దీనికి అతీతం . వూహలు వాస్తవ రూపం లోకి వచ్చి మనతో కబుర్లు చెప్పి .. అది వాస్తవమనుకునేలోగానే మన మనసులో ముద్ర వేసి మాయముతాయి. ఈ పుస్తకం చదవలేదు కాని.. దీని గురించి ఆంధ్ర జ్యోతి డైలీ అనుకుంటా (సరిగ్గా గుర్తు లేదు) చదివాను. టాగోర్ ఆలోచనలు భావుకతతో నిండిన ఊహా వాస్తవాలు. ఈ ప్రేరణ తోనే , నేనొక కథలో ‘భావం యొక్క అనుభవమే భవము…రియాలిటి’ అని వ్రాసాను. టాగోర్ భావాలు చదివే కొద్దీ కొత్త ఆలోచనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. అలాగే మీకు వీలున్నప్పుడు ఆర్ కే నారాయణ పుస్తకాల గురించి కూడా కొన్ని కబుర్లు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంత మంచి సైట్ ఇంతింతై .. అన్నట్లు పెరగాలని కోరుకుంటున్నాను.


 2. పుస్తకం చదివిన “అనుభవాన్ని” పంచుకునే మీ శైలి అరుదైనది.


 3. Raghava

  Purnima ,

  Wow !!! Believe me your talent to give the non living things life is amazing .. Your article about a dustbin a Book .. Marvelous .. Keep it up .. Proud of you ..

  I Wish you all the best and also wish that your writings reach maximum people .

  Regards
  Raghava


 4. సమీక్షలని విభిన్నంగా వ్రాయడంలో మీకు మీరే సాటి.


 5. పరిచయం చేసిన విధానం చాలా బావుంది; ’ఆ పుస్తకం కూడా అలాగే ఉందా!’ అనిపిస్తోంది.ఓహో ఇది మీ శైలి యా! చివరి ఆంగ్ల వాక్యాలు: చించేశారు!అద్దిరింది. అతడ్ని రియల్ చేసేసారు.


 6. ఈ పుస్తకం పదో తరగతి శెలవుల్లోనో ఎప్పుడో చదివాను. నిజం చెప్పొద్దూ.. ఏమీ అర్ధం కాలేదు. శ్రీశ్రీ కవితల్లో సర్రియలిజం కొంచం పరిచయం ఉండటం వల్ల ఇదేదో అదే రకమో లేదా అబ్సర్డ్ కాటగిరీ అని వదిలేశా. మీర్రాసిన పరిచయం బాగుంది. ఇప్పుడు మళ్ళీ చదివితే ఏమైనా అర్ధమౌతుందేమో.


 7. సమీక్ష, మీ శైలిలో ఉంది. ఇలాంటి సమీక్షలే అవసరం. ఆ రాక్షసుడి బొమ్మ (పుస్తకం అట్ట) వ్యాసం చివర్లోనో, మధ్యలోనో వచ్చి ఉంటే, ఇంకాస్త రక్తి కట్టి ఉండేదా అని ఓ చిన్న అనుమానం. (ఇది విమర్శ కాదు!)


 8. ఈ పుస్తక పరిచయం చాలా బాగుంది 🙂
  ఇలా పుస్తకం లో రకరకాల పద్ధతుల్లో సమీక్షలు రావాలి…


 9. ఇంతగా ఊరించి ఊరించి చివరికి ఆంగ్లానువాదం వివరాలిస్తే ఎలా! “అతడు” చెప్పిన ఆ కథలు, కబుర్లు మాకు మీరు తెలుగులో ఎప్పుడు వినిపిస్తారో చెప్పండి. 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నెమరేసే పుస్తకాలు

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడ...
by రవి
8

 
 

మన టప్ టపా టప్

వ్యాసం రాసిపంపినవారు: చంద్రలత టప్ టపా టప్! ఏమిటీ శబ్దం ? ఎలుగుబంటికి భయం వేసింది.జింక ...
by అతిథి
4

 
 

2009 లో నేను చదివిన పుస్తకాలు

నాకు చిన్నప్పటినుండి పుస్తకాల పిచ్చి ఎక్కువే. అందునా తెలుగు పుస్తకాలు. అమ్మకు కూడా ...
by జ్యోతి
1

 

 
ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్ ముచ్చట్లు

ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్ ముచ్చట్లు

హైదరాబాద్ లో అత్యంత పురాతన పుస్తక షాపుల్లో అబిడ్స్ లో ఉన్న “ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్ల...
by Purnima
9

 
 

అంతర్జాలంలో టాగోర్

టాగోర్ అంటే ఇంత iconic figure కదా… ఆయన గురించి అంతర్జాలంలో ఎంత సమాచారం ఉందో…అన్న ఉద్దేశ్య...
by పుస్తకం.నెట్
0

 
 

Stray Birds పై Stray Thoughts

ఓ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. “ఓయ్.. నన్ను వ...
by పుస్తకం.నెట్
6