ఆమె ఎవరైతే మాత్రం – శివారెడ్డి కవిత్వ సంకలనం

‘మోహనా! ఓ మోహనా!’ కవితా సంపుటికి 1990లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునందుకున్న కవి కె. శివారెడ్డి వెలువరించిన కొత్త కవిత్వ సంకలనం ‘ఆమె ఎవరైతే మాత్రం’.
‘సాహసంతో జీవితాన్ని తమ ఇష్టమొచ్చినట్టు
మలచుకొనేవాళ్లకు జై
ప్రపంచానికి ముగుదాడేసి తమ వెంట
నడిపించుకుపోతున్న స్త్రీమూర్తులందరికీ జై ‘

అంటూ ఆయన స్త్రీలందరికీ అంకితమిచ్చిన ఈ కవితల పుస్తకాన్ని కిందటివారమే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. అంతకుముందు రోజు కవి వీటిని చదివి వినిపించిన కార్యక్రమం కూడా జరిగింది. సమాచారం తెలిసినా పని భారంలో రెండుసార్లూ వెళ్లలేకపోయానుగానీ, పుస్తకం చేతికొచ్చిన తర్వాత చదవకుండా మాత్రం ఉండలేకపోయాను.
‘సగటు మగాడిలా ఎక్కడా స్త్రీని తప్పు పట్టకుండా, న్యూనపరచకుండా, ఆమె ప్రతి కదలికకూ, ప్రతి ఆలోచనకూ, ఆచరణకూ కారణాలను వ్యవస్థలో వెతుక్కుంటూ ‘ఆమె’ను అపార సానుభూతితో, ప్రేమతో, కరుణతో ఆశ్లేషించుకోవడం ఈ కవితలలోని ప్రత్యేకత’ అంటూ ప్రచురణకర్తలు పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి చెబుతున్నారు.

అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిని పోగొట్టుకున్న కవి శివారెడ్డిని అతని నాయనమ్మ పెంచారు. చిన్నతనంలో ఆయనపై చెరగని ముద్ర వేసిన శ్రమసౌందర్య ప్రతినిధులు మాలకొండమ్మ, శకుంతలమ్మతో పాటు జీవితం ప్రతి అడుగులోనూ తారసపడిన స్త్రీలలో ఏదోక విలక్షణతను చూసిన కవి కలం ఈ తరహా కవితలు రాయడం సహజమే. ‘అయిదేళ్ల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న ఒక పల్లెటూరి బాలుడికి ప్రపంచం ఒక వేయి తలల నాగుపాము. జీవితం ఒక భయం, ఒక దరిద్రం, ఒక అనాదరణ. అనాథబాల్యాలు కానీ, ఆర్ద్రత లోపించిన పిలుపులుగానీ, ఏకాకితనాలు కానీ, అర్థం కాని సంబంధాలు కానీ, అన్నీ అన్నీ భయంభయంగా నాలో మిగిలి నా అంతర్లోకాలన్నింటినీ ముట్టించి ఊదరబెట్టి ఊపిరాడక అరిస్తే, అమ్మా! అంటే పలికే గొంతు లేనప్పుడు – బహుశా ఇవన్నీ నా కవిత్వంలో అదృశ్యంగా నర్తిస్తూ ఉంటాయేమో’ అని చెబుతారు శివారెడ్డి. ఆ అనుభూతి నిజాయితీగా వ్యక్తమవుతుంది ఈ పుస్తకంలో. కవిత్వమంటే ఇష్టం, స్త్రీత్వం పట్ల ప్రేమ ఉన్నవారందరూ చదవాల్సిన పుస్తకం ‘ఆమె ఎవరైతే మాత్రం’
దాన్నుంచి మచ్చుకో కవిత :

ఆమెకలదు

ఏం చేస్తావు ఆమెని
ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
నీ రెండు కళ్లను పీకి
ఆమె అరచేతుల్లో పెట్టగలవా
ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
ఏం చేస్తావు ఆమెని
నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
గుండెలో విరిగిన ముల్లును
మునిపంటితో బయటికి లాగగలవా
భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
విశ్వమంతా ఊరేగించగలవా
ఏం చేయగలవు నువ్వు
చెదిరిన ముఖంగలవాడివి
చీలిన నాలుకలవాడివి
తలాతోకా తెలియని
మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
ఛేదించగలవా చదవగలవా
చిరుమువ్వల పువ్వులు ధరించి
తిరుగుతున్న ఆమెను వినగలవా
వీనులతో చూడగలవా
ఆమెనేం చేయగలవు
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
అందుకోగలవా అనువదించగలవా
ఆరుబయట వెన్నెట్లో
అమోఘంగా చలించే ఆమెను
తాకగలవా, తాకి తరించగలవా –
ఆమె ముందొక శిశువై
దిగంబరంగా నర్తించగలవా
ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
ఏం చేయగలవు
ఏం చేయలేని వెర్రిబాగులాడా
వెదకటం తెలియాలిరా
మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
ఆమె రక్షించగలదు
ఆమె కలదు, నువ్వు లేవు.
(22 ఫిబ్రవరి 2009 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

152 పేజీలున్న ఈ పుస్తకం వెల 50 రూపాయలు. అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోనూ దొరుకుతోంది.
రచయిత చిరునామా : కె. శివారెడ్డి, వి.కె. ధాగె నగర్‌, గడ్డిఅన్నారం,
దిల్‌షుక్‌నగర్‌, హైదరాబాద్‌ 500660. ఫోన్‌ 040 24064195
——-
ప్రచురణకర్తల చిరునామా :
పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ
సలీం నగర్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌ -036
ఈమెయిల్‌ palapittabooks@gmail.com

You Might Also Like

11 Comments

  1. పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం

    […] నాకు నచ్చినవి శివారెడ్డి ‘ఆమె ఎవరైతే మాత్రం‘ వైదేహీ శశిధర్‌ ‘నిద్రిత నగరం’ […]

  2. sailajamithra

    AAme evarithenem? kavitha samputi suryunimundu Dairyanga nilabadda vihangamla undi. Suryuni vivekaaniki, chandruni anubhuthiki madya kadile asthitwam nirantharanga manobhumikanu pachani pachikapai parachinatlundi.

  3. varma kumar

    pustakam website ide chudadam. chusina ventane sameekshallo tamdri sivareddygaari samkalanam pai mee vyaasam chudadam ento vuthejaannichimdi.

  4. నెటిజన్

    “పుస్తకం” వారు ఇంత వివరంగా పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియ జేసినందుకు, ధన్యవాదాలు. ఇదే ప్రమాణం గా భవిష్యత్తులో ని మీ పుస్తక పరిచయాలు ఉంటాయని, ఉండాలని ఆశిస్తూ..

  5. కె.మహేష్ కుమార్

    @రమణి: “స్త్రీత్వం అంతే అమ్మే గుర్తు రావాలి.” అని మీరు చాలా సంకుచితమైన ప్రతిపాదన చేశారనిపిస్తోంది. స్త్రీత్వం ఒక తల్లి,చెల్లి,భార్య,ప్రియురాలు,ప్రకృతి,శక్తి,ప్రళయం,సృష్టి ఇంకా ఎన్నెన్నో అని నేననుకుంటున్నాను.

  6. అరుణ పప్పు

    అందరికీ ధన్యవాదాలు. ‘ఆశ్లేషము’ అంటే ఆలింగనము, సంయోగము, కూడిక అనే అర్థాలున్నాయి. ‘ఆశ్లేషించు’ అనే పదానికి ‘ఆలింగనముచేయు, కవుగిలించు’ అని అర్థాలున్నాయి.
    రిఫరెన్సు : శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు, ప్రథమ సంపుటము.
    స్త్రీ అంటే ఎవరైనా ఒక స్త్రీ. స్త్రీత్వమనేది ఒక భావన. అది ప్రకృతిలో ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. దాన్ని ప్రేమించనివారు అరుదు.

  7. ramani

    ఆశ్లేషించడం అంటే … ఈ వ్యాసానికి సంబంధించి ఆమెని అర్థం చేసుకోడం లేదా మంచితనానికి ప్రతీకగా ఆమెని అన్వయించుకోడం అని అనుకొంటున్నాను. నేను దీని అర్థం కోసం వేచి ఉన్నాను అరుణ గారు.

    @ మహేష్ గారు: స్త్రీత్వం అంతే అమ్మే గుర్తు రావాలి. స్త్రీత్వం అంటే నాకు తెలిసి అమ్మతనం. మాతృత్వం. స్త్రీలోని ఆ మాతృత్వాన్ని , ఆ ప్రకృతీ వరాన్ని ప్రేమించాలి గౌరవించాలి స్త్రీని ప్రేమించడం వేరు స్త్రీత్వాన్ని ప్రేమించడం వేరు అని నా అభిప్రాయం.

  8. కె.మహేష్ కుమార్

    లేక భార్యా/ప్రియురాలు కావచ్చు. కానీ స్త్రీత్వాన్ని ప్రేమించడం అంటే స్త్రీ అనే భావనని, స్త్రీ శక్తిని,స్త్రీ అంశని ప్రేమించడమేమో అనిపించింది. మొదటిది స్త్రీని వ్యక్తిలా ప్రేమించడం. రెండవది స్త్రీ అనే తత్వాన్ని ప్రేమించడం. రెండవదాని విశాలత్వం అపరిమితం,విశాలం, అద్వితీయం.

  9. కె.మహేష్ కుమార్

    @కొత్తాపాళి: మీ వ్యాఖ్య చూశాక నాకూ అనిపించింది. కానీ మళ్ళీ స్త్రీత్వాన్ని ప్రేమించడం స్త్రీని ప్రేమించడం వేరువేరు అనే అనిపించింది. స్త్రీని ప్రేమించడం ఒక సిమితమైన పరిధి. అది అమ్మను కావచ్చు, అక్కచెళ్ళెళ్ళు ల్

  10. కొత్తపాళీ

    “ఆశ్లేషించుకోవడం” – what does this mean?

    “కవిత్వమంటే ఇష్టం, స్త్రీత్వం పట్ల ప్రేమ ఉన్నవారందరూ చదవాల్సిన పుస్తకం”
    Pray tell me what is this స్త్రీత్వం పట్ల ప్రేమ? And how it is different from స్త్రీ పట్ల ప్రేమ

  11. కె.మహేష్ కుమార్

    మంచి కవితలు. ఆర్ధ్రమైన కవితలు. ఆవలిఒడ్డుని అర్థం చేసుకునే ప్రయత్నం కవితలు. లేమిని,ప్రేమని,ఆరాధనను,అబ్బురపాటును,అమరత్వాన్ని సంబరం చేసే కవితలు.

    చాలా మంచి సంకలనం.పుస్తకావిష్కరణ రోజున 30 రూపాయలకే ఇచ్చారండోయ్!

Leave a Reply