“కొల్లాయిగట్టితేనేమి?” గురించి రా.రా.గారి విశ్లేషణ – నా ఆక్షేపణ

వ్యాసకర్త: భైరవభట్ల కామేశ్వరరావు

******

“కొల్లాయిగట్టితేనేమి?” నవలకి నేను వ్రాసిన పరిచయ వ్యాసంలో రా.రా.గారి మీద ఒక విసురు విసిరి గుంభనంగా తప్పించుకున్నానని ఎవరికైనా అనిపించి ఉంటే అది వాళ్ళ తప్పు కాదు. దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. పైగా నేనూహించినట్టుగానే చాలా మందికి భృకుటి ముడిపడిందని కూడా అభిజ్ఞవర్గాల వల్ల తెలిసింది.:) ఆ ముడులు విప్పదీసే బాధ్యతకూడా నాకుంది కదా, నా అజ్ఞానాన్ని బయటపెట్టయినా సరే! అందుకే యీ ప్రయత్నం.

ముందుగా అసలు రా.రా.గారి వ్యాసం చదివిన తర్వాత, నవల ఒక కొత్త వెలుగులో నాకేమైనా కనిపించిందా అని ఆలోచించి చూసాను. అట్లాంటిదేమీ కనపడ లేదు. నిజమే, మార్క్సిస్టు George Lukas, Historical Novel అనే పుస్తకంలో చెప్పిన చారిత్రక నవలా లక్షణాల గురించి వ్యాసంలో చక్కగా వివరించారు రా.రా. ఆ లక్షణాలని నవలకి సమన్వయింప జేసి, ఈ నవల ఒక గొప్ప చారిత్రక నవల అని నిరూపించే ప్రయత్నమూ చేసారు. రా.రా వివరించిన చాలా లక్షణాలు నవలలో చాలా సహజంగానే ఉన్నాయి. అది చారిత్రక నవల అనీ, దాని లక్షణాలు ఇవి అనీ తెలియకపోయినా అవి నాకు బాగానే అవగానయ్యాయి. అంచేత రా.రా. ఇచ్చిన వివరణ కేవలం academic interestతో తెలుసుకోడమే తప్ప నవలని అర్థం చేసుకోడానికి పెద్దగా ఉపయోగపడేది కాదని నాకు అనిపింది. బహుశా అతనీ వ్యాసం వ్రాసిన కాలానికి (అంటే 1968 సం.) దీని అవసరం ఉండి ఉండవచ్చు, అది నాకు తెలీదు. ఇక రా.రా. వ్యాసంలో నాకు నచ్చని, అభ్యంతరకరమైన అంశాలు:

1. చారిత్రక నవలా లక్షణంగా పేర్కొన్న “పాత్రలను ఆనాటి చారిత్రకశక్తులకూ, సామాజికధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించాలి”.
2. నవలలో హేతుబద్ధత గురించి రా.రా. పడిన గందరగోళం.
3. పాత్రల ప్రవర్తనలోని వైరుధ్యాన్ని గుర్తించడంలో రా.రా. పొరపాట్లు.
4. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళందరూ ఫ్యూడల్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారనీ, మతాభిమానమూ సనాతన ధర్మమూ బ్రిటిష్ వాళ్ళకి తాబేదార్లుగా వ్యవహిరించాయనీ అనడం.
5. అబ్బాయినాయుని మనస్థితిని చిత్రించే సందర్భంలో “అంతరాత్మ” అన్న మాట వాడవలసినదని అభిప్రాయపడడం.
6. రామనాథాన్ని అతని మామ కొట్టి, తప్పుడు కేసు మోపి జైలుకి పంపిన యాదృచ్ఛిక సంఘటన తదనంతర కథకి ఆధారం అవ్వలేదనడం.
7. చారిత్రక నవలల గురించి వ్యాసం చివర చేసిన అధికప్రసంగం.

ఒకొక్క అంశంపైనా నా ఆలోచనలని వివరిస్తాను.

1. చారిత్రక నవలా లక్షణంగా పేర్కొన్న “పాత్రలను ఆనాటి చారిత్రకశక్తులకూ, సామాజికధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించాలి”.

“పాత్రలను ఆనాటి చారిత్రకశక్తులకూ, సామాజిక ధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించి, వాటి మధ్య జరిగే ఘర్షణను పాత్రల మధ్య జరిగే ఘర్షణగా చిత్రించడం.” అన్నది రా.రా. చెప్పిన చారిత్రక నవలా లక్షణాలలో ఒకటి. చారిత్రక శక్తులు, సామాజిక ధర్మాలూ (విలువలు) పాత్రలపై ప్రభావం చూపించడం వరకూ సరే కాని ఏకంగా వాటికి ప్రతినిధులుగా పాత్రలను చిత్రించడం ఎంతవరకూ సమంజసం? అట్లా చేస్తే ఆ పాత్రలు కొయ్యబొమ్మలుగా తయారు కావా? నిజానికి ఈ నవలలో రామమోహనరావుగారు అలాంటి పొరపాటు చెయ్యలేదు. ఏ పాత్ర తీసుకున్నా, రామనాథం కాని, శంకరశాస్త్రి కాని, విశ్వనాథం కాని, అబ్బాయినాయుడు కాని – అది ఏ ఒక్క సామాజిక ధర్మానికీ ప్రతీకగా చిత్రించబడింది కాదు. వాళ్ళు అచ్చమైన మనుషులే కాని, దేనికో ప్రతీకలు కాదు. ఒక్క రామనాథం మామగారు తప్ప. వేర్వేరు సామాజిక ధర్మాలు, చారిత్రకశక్తులు వేర్వేరు పాత్రలపై వేర్వేరు ప్రభావాలు చూపించాయి, అంతే. ఉదాహరణకి ప్రధాన పాత్ర రామనాథాన్నే తీసుకుందాం. అతడు పూర్తిగా రా.రా. అన్న బూర్జువా ధర్మానికి ప్రతీక కాదు. ఒక వేళ అలా అయ్యుంటే, వాళ్ళ తోటలోని ఇంటిని వేదపాఠశాలగా మార్చాలన్న తన బాబాయి శంకరశాస్త్రి ప్రతిపాదనని ముందు ఎందుకంగీకరించినట్టు? ఆ తరువాత కూడా దాన్ని కాదనడానికి కారణం, అది నిజంగా తను అనుకుంటున్నట్టుగా సరిగా నడవదని స్నేహితులు అతనికి బోధించడం వల్లనే కదా. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బూర్జువా శక్తులకి అతడు ఎక్కువగా ప్రభావితుడయినా, అతనిలో ఫ్యూడల్ భావాలు పూర్తిగా నశించ లేదనే కదా? అట్లా చిత్రించడంలో తప్పులేదు సరికదా అది మనిషి సహజ నైజానికి అద్దం పడుతుంది కూడాను. ఈ విషయాన్నే రా.రా. కూడా యిదే వ్యాసంలో మరొక చోట మరో రకంగా చెప్పారు! “ప్రతి వ్యక్తి మీదా భిన్న శక్తుల ప్రభావం నిత్యం ఉంటుంది గనుక, యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖలాగా జీవితం ఒకే విధంగా ఉండదు. వ్యక్తులలోని యీ అంతర్వైరుధ్యాలను చిత్రించేదే ఉత్తమ సాహిత్యం” అని సోమర్సెట్ మాం సూక్తిని ఉటంకించారు. “యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖలాగా జీవితం ఒకే విధంగా ఉండదు” అన్న అయోమయమైన వాక్య నిర్మాణం సంగతి పక్కన పెడితే, ఇక్కడ చెపుతున్న విషయం, పైన చారిత్రక నవలా లక్షణంగా పేర్కొన్న దానితో విభేదించడం లేదూ?

2. నవలలో హేతుబద్ధత గురించి రా.రా. పడిన గందరగోళం.

నవలలో హేతుబద్ధత గురించి రా.రా. చాలా గందరగోళానికి గురైనట్టుగా నాకు అనిపించింది. “జీవితం హేతురహితంగా కనపడుతుందే కాని, నిజానికి హేతురహితం కాదు”, అంటూ మొదలుపెట్టి, dialectics జీవితానికి కూడా అన్వయించవచ్చునని చెప్పి, “వాస్తవ జీవితంలో కార్యకారణాలు అన్నీ ఒకదానితో ఒకటి బీరకాయపీచు లాగా పెనవేసుకొని, యేది దేనికి కారణమో, యేది దేనికి కార్యమో విడదీయడానికి సాధ్యంగాకుండా ఉంటాయి. తత్కారణంగా జీవితం హేతురహితంగా కనపడవచ్చుగాని, నిజానికి అత్యంత హేతుబద్ధమైనది”, అని తేలుస్తారు. విడదీయడానికి సాధ్యం కాకుండా కార్యకారణాలు పెనవేసుకుపోతే అసలు వాటి ఉనికి ఎలా తెలుస్తుంది? ఏదో రకంగా ప్రతిదానిలోనూ dialecticsని అన్వయించాలన్న తపనే కాని యిది నాకు తర్కబద్ధంగా అనిపించ లేదు. పోని అక్కడితో ఆగలేదు. “ఇక సాహిత్యం అచ్చం జీవితం లాగే ఉండాలనుకోవడం కూడా తీవ్రమైన పొరపాటే”, అని కూడా అన్నారు. అంటే సాహిత్యం జీవితమంత హేతుబద్ధంగా ఉండక్కర లేదని అతని అభిప్రాయమేమో అని అనుకున్నాను, అది చదవగానే! కాని అతని వివరణ ఏమిటంటే, “జీవితాన్ని అర్థం చేసుకోడానికి మానవుడు చేసే ప్రయత్నంలో ఒక భాగమే సాహిత్యం (మరొక భాగం సైన్సు). ఒకదాన్ని అర్థం చేసుకోవడమంటేనే దానిలోని కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం. దానిలోని హేతుబద్ధతను గ్రహించడం. కనుక జీవితం మానవునికి యే మేరకు అర్థమవుతుందో, యే మేరకు అర్థమైనట్లు భాసిస్తుందో, ఆ మేరకే జీవితం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. అనగా హేతుబద్ధమైన జీవితమే సాహిత్యంలోకి ఎక్కుతుంది. అనగా సాహిత్యం హేతుబద్ధంగా తప్ప మరొక విధంగా ఉండజాలదు”, అని వక్కాణించారు! ఇది నాకు బొత్తిగా తలకెక్కలేదు. జీవితాన్ని అర్థం చేసుకోడానికి dialectics ఒక్కటే మార్గమన్న అతని నిశ్చయం కేవలం అతని మార్క్సిస్టు చూపు తప్ప అందులో నిజం లేదు. అదలా ఉంచితే, అప్పుడే కదా “జీవితం పూర్తిగా హేతుబద్ధమైనదే” అని తేల్చింది. అంతలోనే “హేతుబద్ధమైన జీవితమే సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది” అనడంలో అతని ఉద్దేశమేమిటి? హేతుబద్ధం కాని జీవితం కూడా ఉంటుందా? జీవితం హేతుబద్ధమైనప్పుడు సాహిత్యమూ హేతుబద్ధమైన జీవితన్నే ప్రతిఫలించేటప్పుడు, సాహిత్యం అచ్చం జీవితం లాగానే కదా ఉంటుంది. అలా ఉండాలనుకోవడం తీవ్రమైన పొరపాటని ఎందుకంటున్నారు?

ఇందులోని ఆంతర్యం నాకర్థమైనది ఇది. జీవితం హేతుబద్ధంగా కనిపించదు. అయినా అందులో హేతుబద్ధత ఉందని నమ్మి, ఏదో రకంగా ఆ హేతుబద్ధతని జీవితానికి ఆపాదించ గలిగేదే నిజమైన సాహిత్యమని అతని ఉద్దేశం. ఇది పూర్తిగా అతని పక్షపాత దృష్టికి నిదర్శనం. అసలీ నవలలోనే హేతువుకి అందని విషయాలున్నాయి. ఉదాహరణకి శంకరశాస్త్రి, రామనాథాల మధ్యన పూర్తిగా తెగిపోని అనుబంధానికి హేతువేమిటి? తన మాటని పట్టించుకోని రామనాథాన్ని ఆస్తి విషయంలో శంకరశాస్త్రి మోసం చెయ్యకుండా నిక్కచ్చిగా అతని ఆస్తిని అతడికి ఒప్పచెప్పడం వెనకునున్న హేతువేమిటి? కేవలం అతని వ్యక్తిగత స్వభావం. అంత ఆధునిక భావాలున్న చంద్రశేఖరం (రామనాథం బావమరిది), తన చెల్లెలికి కోరి బాల్యవివాహం చెయ్యడం వెనకున్న కారణమేమిటి? కేవలం అతని స్వార్థం. ఇలా కొన్ని మానవ సహజమైన స్వభావాల వెనక కార్య కారణ సంబంధాలు చూపెట్టడానికి dialectics పని చెయ్యదు. వాటి వెనకన ఏవో సాంఘికశక్తుల ప్రభావాన్ని వెతకడం దండగ.

3. పాత్రల ప్రవర్తనలోని వైరుధ్యాన్ని గుర్తించడంలో రా.రా. పొరపాట్లు.

నవల పాత్రలలో కొన్ని వైరుధ్యాలని చూపెట్టి, వాటికి కారణాలు వెతికే ప్రయత్నం తన వ్యాసంలో రా.రా. చేసారు. రా.రా. పేర్కొన్న ఉదాహరణలలో నాకు పొరపాటనిపించినవి:
అ.) పడవ గుమాస్తా ప్రవర్తన. గుమాస్తా రామనాథాన్ని సరంగుకు పరిచయం చేస్తూ, రామనాథం గురించి చాలా గొప్పగా చెపుతాడు. అదే గుమాస్తా, రామనాథంతో పడవ గదికి చార్జీ ఇతరులతో కంటే రెండణాలు యెక్కువ వసూలు చేస్తాడు. ఇందులో వైరుధ్యమేదీ నాకు కనిపించలేదు. గుమాస్తా, రామనాథాన్ని పొగిడిందే డబ్బుకోసం. ఉద్యమాన్ని ఆసరాగా తీసుకొని తమ స్వార్థం చూసుకొనే వాళ్ళు కూడా ఉంటారని చెప్పడానికే ఆ పాత్ర, అని నాకనిపించినది. గుమాస్తా మాటల్లో నిజాయితీ ఉందని అనుకుంటే, అతను రామనాథం దగ్గర ఎక్కువ డబ్బు తీసుకోడం వైరుధ్యమవుతుంది కాని కానప్పుడు వైరుధ్యమే లేదు కదా.

ఆ.) అబ్బాయినాయుడికి గాంధీ అంటే భక్తి ఉన్నా కూడా తన కూతురిని కాలేజీకి పంపించడానికి సిద్ధపడడం. ఈ విషయంలో అబ్బాయినాయుడి పాత్రలో నాకు వైరుధ్యమూ, ద్వంద్వ ప్రవృత్తి పెద్దగా కనిపించ లేదు. గాంధీగారంటే అభిమానమున్నంత మాత్రాన అతను చెప్పినది ప్రతీది అంగీకృతమవ్వాలని లేదు కదా. అబ్బాయినాయుడి దృష్టిలో తన కూతురికి విద్య చాలా అవసరం అనుకున్నాడు. అందుకే చదివించడానికి సిద్ధపడ్డాడు. అబ్బాయినాయుడికి గాంధీగారి మీద కన్నా బ్రహ్మసమాజమ్మీదనే ఎక్కువ భక్తి అని స్పష్టంగానే తెలుస్తుంది. కాబట్టి అతను చేసిన దానిలో ద్వంద్వ ప్రవృత్తి లేదు.

ఇ.) శంకరశాస్త్రికి గాంధీ మీదా, కాంగ్రస్ మీదా సదభిప్రాయం లేకపోయినా, గాంధీ ముంగండకి వస్తున్నప్పుడు తాటాకుమీద భగవద్గీత శ్లోకం చక్కగా వ్రాసి గాంధీకి సమర్పించడానికి తయారు చెయ్యడం ఆ పాత్రలోని వైరుధ్యంగా పేర్కొన్నారు. దాన్ని వివరించడానికి ఏవో తంటాలు పడ్డారు. అయితే, శంకరశాస్త్రికి గాంధీగారి మీద సదభిప్రాయం లేదనడానికి నవలలో నాకెక్కడా కూడా ఏ ఆధారమూ కనిపించలేదు. పైపెచ్చు, నవల మొదట్లో రామనాథం స్వరాజ్యం వాళ్ళ బండిలో వచ్చేటప్పుడు జరిపిన సంభాషణలో తన పెదతండ్రి శంకరశాస్త్రికి గాంధీగారంటే మంచి అభిప్రాయం ఉందని కూడా చెపుతాడు. రా.రా.గారు ఎందుకలా తీర్మానించారో మరి! శంకరశాస్త్రి ఆచార పరాయణుడు కాబట్టి, జాతీయోద్యమ ప్రభావంతో తన కొడుకు సర్వనాశనమైనాడనే భావం ఉంది కాబట్టి, అతనికి గాంధీ అంటే విముఖత ఉండి ఉంటుందని రా.రా.గారే అలా ఊహించేసినట్టుగా ఉంది!

4. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళందరూ ఫ్యూడల్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారనీ, మతాభిమానమూ సనాతన ధర్మమూ బ్రిటిష్ వాళ్ళకి తాబేదార్లుగా వ్యవహిరించాయనీ అనడం.

జాతీయోద్యమ కాలంలో స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా ఫ్యూడల్ శక్తులపై బూర్జువా శక్తుల పోరాటం కూడా సాగిందన్నది చారిత్రక సత్యం. అయితే, ఫ్యూడల్ శక్తులపై పోరాటం చేసినవాళ్ళే దేశభక్తులని, సనాతన ధర్మాభిమానులు బ్రిటిష్ వాళ్ళకి తాబేదార్లని వ్యాఖ్యానించడం పూర్తిగా అసంబద్ధం, సత్య దూరం. మహారాష్ట్రలోనూ ఇతర ఉత్తరభారత ప్రాంతాలలోనూ జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాదమూ పెనవేసుకొని ఉన్నాయని తానే చెప్పారు. మరి అలాంటప్పుడు ఫ్యూడల్ వ్యవస్థలో దైవభక్తి, రాజభక్తి మొదలయిన వాటికే ప్రాధాన్యమనీ, విధేయతా, ఆజ్ఞాపాలనా, బానిసబుద్ధీ మొదలైన గుణాలను అది ఉగ్గుపాలతో నేర్పుతుందనీ చెప్పి, ఆ వ్యవస్థలోని వారందరూ బ్రిటిష్ వాళ్ళకి తాబేదారులే అని ధ్వనించడంలో అర్థమేముంది? పోనీ ఈ చెప్పిన లక్షణం తెలుగువాళ్ళకే పరిమితమని అనుకున్నా అదికూడా సత్య దూరమే. తెలుగువాళ్ళందరి వరకూ ఎందుకు, ఈ నవలలో పాత్రలని తీసుకున్నా అది ఎంత తప్పుడు అభిప్రాయమో స్పష్టంగా తెలుస్తుంది. విశ్వనాథానికీ, విశాలాక్షికీ దేశభక్తి ఉంది. గాంధీగారి మీదా జాతీయోద్యమం మీదా ఎంతో అభిమానమూ ఉంది. అయినా వాళ్ళు సంప్రదాయాన్ని అతిక్రమించ లేదు! విశ్వనాథం ధైర్యం చెయ్యలేకపోయాడు అనుకున్నా, విశాలాక్షి మాత్రం సంప్రదాయమ్మీద కచ్చితమైన నమ్మకం ఉన్నదే. సనాతధర్మాన్ని పూర్తిగా నమ్మిన శంకరశాస్త్రికూడా గాంధీగారి మీద అభిమానం చూపించినవాడే. తమాషా ఏమిటంటే, ఆధునిక భావాలు కలిగిన అబ్బాయినాయుడు, చంద్రశేఖరం వాళ్ళలాగానే, అతడు కూడా ఇంగ్లీషు చదువులకి మాత్రం వ్యతిరేకి కాదు. ఫూడల్ ధర్మాలని పూర్తిగా తిరస్కరించిన చంద్రశేఖరం బ్రిటిష్ వారిపై వ్యతిరేకత కాని, జాతీయోద్యమంపై అభిమానం కాని ఎక్కడా చూపించడు. ఇంగ్లీషు చదువుల గొప్పదనం గురించి రామనాథంతో వాదిస్తాడు కూడా. ఆధునిక దృక్పథానికీ, ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటుకీ ఇంగ్లీషు చదువులు దోహదం చేసాయనడంలో సందేహం లేదు. ఆ చదువుల వల్ల ఆధునిక దృక్పథం ఏర్పరచుకున్న కొంతమంది వాటిని సమర్థించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే కొంతమందికి ఇంగ్లీషు చదువులు వేరే ప్రయోజనాలని చేకూర్చాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే, వెంకటరమణ, శంకరశాస్త్రీ కూడా ఇంగ్లీషు చదువుల కోసం ఆసక్తి చూపించడం వెనక కారణం ఒకటే! ఒక వర్గంవారు ఆనాటి సంఘంలో తమకు లేని స్థానాన్ని ఇంగ్లీషు చదువుతో వచ్చే అధికారంతో సంపాదించుకోవాలని అనుకుంటే, మరొక వర్గంవారు తాము సంఘంలో కోల్పోతున్న స్థానాన్ని నిలబెట్టుకోడం కోసం ఇంగ్లీషు విద్య యిచ్చే అధికారంకోసం ఆశపడ్డారు. మరొక విషయం. జాగ్రత్తగా ఆలోచిస్తే, గాంధీగారు సనాతనధర్మాన్ని పూర్తిగా తిరస్కరించినవారు కాదు. దాని పునరుద్ధరణే అతని అభిమతం. అందువల్లనే అతను చాలామంది సంప్రదాయవాదులని కూడా తన అనుయాయులుగా చేసుకోగలిగారు. ఇదంతా కూడా నవలలో నేర్పుతో చిత్రించారు మహీధర. దీనిని విశ్లేషించడంలో రా.రా. గందరగోళానికి గురయ్యారని నాకనిపించింది.

5. అబ్బాయినాయుని మనస్థితిని చిత్రించే సందర్భంలో “అంతరాత్మ” అన్న మాట వాడవలసినదని అభిప్రాయపడడం.

ఇది పూర్తిగా అర్థం లేని అంశం. అబ్బాయినాయుడు, తన కూతురు వేరే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు కాని రామనాథాన్ని చేసుకోవడానికి మాత్రం అభ్యంతరం చెపుతాడు. అతడు కూడా తన కూతురిలాగానే వివాహితుడు కావడమే అందుకు కారణం. ఈ అభ్యంతరం వెనకనున్న కారణం స్పష్టంగానే కనిపిస్తుంది నవలలో. ఈ వివాహాన్ని ఇటు హిందూసమాజం కాని, అటు బ్రహ్మసమాజం కాని అంగీకరించదు. ఏ వర్గమూ అంగీకరించదు కాబట్టి ఆ వివాహాన్ని సంఘం గుర్తించదు. అదీ అతని అభ్యంతరానికి కారణం. రా.రా.గారి ప్రకారం, ఇది అతని “అంతరంగం”లోని ఆవేదన. అతని “వివేకం” మాత్రం వారి ఇద్దరి వివాహాన్ని అంగీకరిస్తుందిట. “మన సంఘంలో ఉన్న ఆచారాలు, అలవాట్లూ ఆ మనస్థితికి మూలకారణం” అన్న వాక్యంలో రచయిత “మనస్థి” అన్న పదం బదులు “అంతరాత్మ” అన్న పదం ఎందుకు వాడలేదో అని విచారిస్తారు రా.రా. అసలు “అంతరంగం” అంటే ఏమిటన్నది సరిగ్గా నిర్వచించకుండా, “అంతరంగాన్ని”, “వివేకాన్ని” వేరుచేసి, అంతరంగానికి ఆందోళని అంటగట్టి, అదే పదం వడాల్సిందని అనడం ఎంత అర్థంలేని అశాస్త్రీయమైన విమర్శ! “అంతరాత్మ”లో ఒక “దైవాంశ”ని చూసి, దాన్ని చావు దెబ్బకొట్టాలన్న ఒక వెఱ్ఱి కోరిక తప్ప ఇందులో నాకెలాంటి ఔచిత్యమూ కనిపించలేదు.

6. రామనాథాన్ని అతని మామ కొట్టి, తప్పుడు కేసు మోపి జైలుకి పంపిన యాదృచ్ఛిక సంఘటన తదనంతర కథకి ఆధారం అవ్వలేదనడం.

రామనాథం భార్యతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఆమెతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అతని మామగారు వచ్చి, రామనాథాన్ని వెనకనుండి చూసి ఎవరో పరాయివాడు తన కూతురుతో అలా చనువుగా ఉన్నాడేమిటన్న కోపంతో అతడిని కొట్టి బయటకి తరుముతాడు. తర్వాత తన పొరపాటుని గ్రహిస్తాడు. కాని దాన్ని ఒప్పుకోడానికి అతనికి అహం అడ్డు వస్తుంది. దానితో అతడిపై తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టిస్తాడు. యాదృచ్ఛికంగా జరిగిన యీ సంఘటన, తర్వాత కథా గమనాన్ని నిర్దేశించినది అన్నది ఒక విమర్శ. రా.రా. ఆ విమర్శని ఒప్పుకోక, ఆ సంఘటన, తర్వాత కథకి ఆధారం కాదని వాదించారు. ఆ వాదనలో నాకు ఏమాత్రం పస కనిపించలేదు. రామనాథం జైలుకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడమే, రామనాథం మామగారు అతడిని తన కూతురితో కలవనివ్వకుండా చేయడానికి బలమైన కారణమయ్యింది. రామనాథం భార్య అతనితో కాపురం వద్దనడానికి కూడా అదే బలమైన కారణం. దానికి పర్యవసానమే స్వరాజ్యం రామనాథానికి దగ్గరవడం. రామనాథం శంకరశాస్త్రితో వేరుపడి తోట యింటిలో కాపరం పెట్టడానికి కూడా అదే ప్రధాన కారణం. అదే లేకపోతే తోటబావిలో నీళ్ళు అస్పృశ్యులకి వాడడానికి ఇవ్వడమూ ఉండదు. అంచేత కథలోని ముఖ్య సంఘటనలన్నిటికీ రామనాథం మామగారింట్లో జరిగిన యాదృచ్ఛిక సంఘటనే ఆధారం.

7. చారిత్రక నవలల గురించి వ్యాసం చివర చేసిన అధికప్రసంగం.

తన వ్యాసం చివర తెలుగులో వచ్చిన ఇతర చారిత్రక నవలల మీద రా.రా. విరుచుకుపడ్డారు. ఇది పూర్తిగా భౌతికవాద దృక్పథంపై అతని మూఢభక్తికి నిదర్శనం. అసలిక్కడ ఇతర చారిత్రక నవలల ప్రసక్తి పూర్తిగా అప్రస్తుతం. ఏ ఏ నవలలని దృష్టిలో పెట్టుకొని అతనీ విమర్శ చేసాడన్నది కూడా అస్పష్టంగానే మిగిలిపోయింది. ఏదైనా, తాను నమ్మిన లక్షణాలు ఉన్నదే చారిత్రక నవల అనీ, అవి లేని నవలలు ఎందుకూ కొరగానివనీ నిష్కర్షగా తేల్చెయ్యడం అతని అసహనానికి మాత్రమే చిహ్నం. అసలు రాయలకాలం నాటివి కాని, అంతకన్నా వెనక కాలానికి కాని చెందిన నవలలను “కొల్లాయిగట్టితేనేమి?” వంటి ఆధునిక కాలానికి చెందిన నవలలతో పోల్చడమూ, ఈ నవలకి వర్తించిన సూత్రాలే వాటికికూడా వర్తించాలనుకోవడమూ ఎంతవరకూ సమంజసం? ఇటీవలి కాలానికి సంబంధించిన చరిత్రతో మనకి స్పష్టమైన పరిచయం ఉంటుంది. అందులో ఈ నవల అయితే కవి సుమారుగా ఆ కాలానికి చెందిన వ్యక్తి కూడాను. అదే ఏ పదకొండవ శతాబ్దానికి చెందిన నవలో అయితే, అది చాలా వరకూ ఊహ మీదనే ఆధారపడుతుంది. వాటి ప్రయోజనం కూడా భిన్నంగా ఉంటుంది. అలాంటి నవలల్లో చేసే కల్పనలు కాని ఊహలు కాని మార్క్సిస్టు దృక్పథానికి అణుగుణంగానే ఉండాలని పట్టుబట్టడం ఏం సమంజసం?

పైన పేర్కొన్న అంశాలతో నాకు కలిగిన అభ్యంతరాల వలన నాకు రా.రా. వ్యాసంలో అధికప్రసంగము అనౌచిత్యము కనిపించింది. మార్క్స్తిటు భావజాలంపై అతనికున్న భక్తి చాలాచోట్ల తర్కాన్ని మింగేసిందని అనిపించింది. నా యీ అవగాహనలో తప్పులుండే అవకాశం ఉంది. అలాంటి తప్పులని ఎవరైనా వివరంగా ఎత్తి చూపిస్తే, సరిగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాసం వ్రాయడం వెనకనున్న ముఖ్యోద్దేశం అదే!

You Might Also Like

11 Comments

  1. నాగరాజు

    కామేశ్వరరావుగారు,
    (దొంగపడ్డ ఆర్నెల్లకి కుక్కమొరిగిన రీతిలో, ఎప్పటినుండో దీనిపై రాద్దామనుకుంటున్నా, నా ఆలోచనల్లో స్పష్టత లేక దాటేస్తూ వచ్చాను. ఇప్పటికీ అంత స్పష్టత లేదు, కానీ, మీ వ్యాసం చదివి రాసుకున్న నోట్సు ఇది – మీకేమైనా ఉపయోగపడితే సంతోషం 🙂 )

    అధికప్రసంగం అని తీర్మానించటం తీవ్రమైన అభియోగమే! అందుకు ఇక్కడ మీరిచ్చిన వివరణ చాలదు 🙂

    మార్కిస్టు సిద్ధాంతాల సాయంతో సూత్రీకరించిన విమర్శలు, వ్యాసాలలో తరచుగా దొర్లే “ఫ్యూడల్ సంప్రదాయాలు”, “బూర్జువా భావాలు” వగైరా పరిభాషా ప్రయోగాలు, వెనుకటికి కాలేజీగోడలమీదా, ఇప్పుడు కొన్ని బ్లాగులనిండా నినాదాలుగా వాడి, వాడి అవి వసివాడిపోయినందువల్లనేమో చాలామందికి చిరాగ్గా అనిపిస్తాయి.  ఆ కారణంగా, రా.రా వ్యాసాలలో ఇట్లాంటి పదజాలం చదువరిని విసుగుపుట్టించే ఆస్కారం లేకపోలేదు.

    ఒక్కో రచయితకి ఒక్కో రకమైన emotional energy ఉంటుంది – అదే వారి బలమూ, బలహీనతాను.  కొంతమంది సౌమ్యంగా, కొంతమంది ఉద్రేకంగా, మరికొంతమంది విరుచుకుపడ్డట్టూ, కొంతమంది వివరణాత్మకంగా, చాలా కొద్దిమంది పోయెటిగ్గా “కమ్యూనికేట్” చేస్తారు, అది వారి రచనలలో ప్రతిఫలించే హృదయాంతర్గత లక్షణం.

    కాల్పనికేతర రచనలు, ముఖ్యంగా పరిశోధన ప్రాతిపదికగా రచించిన విశ్లేషణావ్యాసాలపై సమీక్షలుగానీ, విమర్శలుగానీ చేసేటప్పుడు రచయితయొక్క ఈ రచనాశక్తిని గుర్తించి, పాఠకుడిని అప్రమత్తుడిని కావించి వదిలెయ్యాలి. అప్పుడే, వారు సాధారణ పాఠకుడి స్థాయిని దాటగలిగే నైపుణ్యాన్ని సంతరించుకోగలరని నా అభిప్రాయం. అలాకాకుండా, రచయితని నిర్వచించే మౌలికమైన లక్షణాన్నే విమర్శకి ఆధారం చేసుకోవడం న్యాయం కాదనుకుంటాను (కాల్పనికేతర రచనల విషయంలో).

    రా.రా వ్యాసాలన్నిటిలోనూ ఉండే ధోరణే ఈ వ్యాసంలోనూ ఉంది, అది ఈ వ్యాసానికి ప్రత్యేకంకాదు కదా – ఆయన శైలే అంత. అందుకని, దానిని మనం పక్కనపెట్టి వ్యాసంలోని ముఖ్యమైన అంశాలనీ, ప్రతిపాదనలనీ లోటుపాట్లని గమనించాలి కదా? ఉదాహరణకి, సౌమ్య ఇంతకుముందోసారి  అనువాదాల మీద రా.రా రాసిన పుస్తకాన్ని సమీక్షించటంలో అటువంటి సంయమనాన్ని పాటించారు.  రచయిత Idiosyncrasiesని,  పాఠకుడి విజ్ఙతని గౌరవించే ఈ పద్దతి నాకు చాలా నచ్చింది.
    ****

    కొల్లాయిగట్టితేనేమి నవల నేను మొట్టమొదటిసారి ఇంటర్లో ఉన్నప్పుడు చదివాను – ఆ నవల అప్పట్లోనే నాపై ప్రగాఢమైన ముద్ర వేసింది. గత మూడేళ్లలో కలోనియలజింపై పెరుగుతున్న ఆసక్తికారణంగా మరో మూడు నాలుగుసార్లు చదివాను.  పుస్తకం చివర్లో రా.రా చారిత్రక నవలల లక్షణాలు ప్రస్తావిస్తూ రాసిన వ్యాసం నన్ను చాలా ఆకట్టుకుంది. రామ్మోహనరావుగారి వ్యాసం కూడా చాలా కూలంకషంగా ఆ నవల నేపథ్యాన్ని పాఠకుడి ముందు పెడుతుంది.

    ఈ వ్యాసంలో ఆయన ప్రస్థావించిన అంశాలు ప్రధానంగా మూడు.  
    (1) లూకాచ్ తన హిస్టారిక్ నవల్ లో ప్రతిపాదించిన,సామాజిక నవలకీ, చారిత్రక నవలకీ ఉన్న వ్యత్యాసం. దాని ఆధారంగా ఆయన రామ్మోహనరావుగారి నవలలో కొన్ని లోపాలు ఎత్తి చూపాడు – మీరు ఆక్షేపించిన ఆరో అంశం ఈ వ్యత్యాసం ఆధారంగా అర్థంచేసుకోవాలనుకుంటాను.
    (2) మీరీ వ్యాసంలో ప్రస్తావించిన హేతుబద్ధత. మీరన్నట్టుగా, ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది.
    (3)  ముంగండ అనే ఒక చిన్న బ్రాహ్మణ అగ్రహారమే చారిత్రక శక్తుల కార్యరంగంగా మలచడాన్ని రా.రా చాలా బలంగా సమర్ధించారు. రా.రా వాదనతో రామ్మోహనరావుగారు సమ్మతించలేదు.  వారిద్దరి వ్యాసాలలోనూ, ఈవిషయమై రెండు విభిన్నమైన వాదనలు చేసారు. వారిద్దరి వాదనని లోతుగా పరీశీలించవలసిన అవసరం ఉంది. ఈ రెండు వ్యాసాలలోనూ నాకు అతి ముఖ్యంగా కనిపించిన విషయం ఇదే నిజానికి.

    ఇవికాకుండా, రామ్మోహనరావుగారు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసారనే అభియోగం గురించి: ఇది కథనానికి సంబంధించిన సంగతి, నాకు పెద్దగా తెలియనివి. కథా శిల్పంగురించీ, నవలా ప్రక్రియల గురించీ లోతుగా మనసుపెట్టి అధ్యయనం చేసిన మెహరో, మాచవరం మాధవో, జంపాలగారో ఓ దిట్టమైన వ్యాసం రాస్తే చవులూరుతూ మనం చదువుకోవచ్చు.

    రా.రా ప్రతిపాదనలు, చారిత్రక నవలలకి ఉండవలసిన లక్షణాలు, మనం మార్క్సిస్టు పరిభాషలో కాకుండా, సాధరణ భాషలో వ్యక్తం చేస్తే, టూకీగా Paul Hogarth, Artist as Reporter అన్న వ్యాసంలో చెప్పిన చివరి రెండు పేరాలు చెప్పుకోవచ్చు:

    The best of the American War Artists never sought to depict actual scenes of action without somehow conveying an inner emotional response to the ferocious spectacle of human beings destroying one another; at the same time their comments were never that esoteric that they could not carry out their audience with them.

    Photography no longer imitates while expressing nothing, so the strength of an artist has long since ceased to lie merely in his ability to describe.

    Yet if art has a meaning at all, it is surely as a means of communication with those who like to relish their understanding of our time with personalized comment on events and man’s role in making them. The strength of an artist lies rather in his capacity to intensify the significance of change across the conflicting categories of aesthetic expression. (Penrose Annual, Volume 55)

    రా.రా ప్రతిపాదనలని ఈ రీతిలో అర్థంచేసుకుంటే, ఆయన వ్యాసం చారిత్రక నవలలని అంచనా వెయ్యడంలో చాలా ఉపయోగపడుతుంది. చారిత్రక నవలా ప్రక్రియపై, తెలుగులో నేను చదివినవి రెండే వ్యాసాలు. ఒకటి కవి సామ్రాట్ట్ నోరి నరసింహశాస్త్రిగారు తన సారస్వత వ్యాసాలలో రాసిన “ఆంధ్రభాషలో చారిత్రక నవల” వ్యాసము, ప్రస్తుత చర్చనీయాంశమైన రా.రా వ్యాసమూ.  ఆంధ్రభాషలో చారిత్రాత్మక నవల వ్యాసంలో, ఓ చోట (132) నోరి నరసింహ శాస్త్రిగారు,  “పాశ్చాత్యులు శవాలను శల్యాలను బధ్రపరిచినట్లే జరిగిన సంఘటనలు వ్రాత పూర్వకంగా పదిలపరుస్తారు. … మన అదృష్టం వల్ల మన గత చరిత్ర వివరాలు అంత ఎక్కువగా లేనందువల్ల చారిత్ర్రక నవలాకారులకు స్వతంత్ర కల్పనలు చేసేందుకు అవకాశాలెక్కువ ఉన్నవి. … చరిత్రక నవల విశృంఖలంగా ఊహావీధులలో స్వైరవిహారము చేయవచ్చును”  అని నిర్ణయించేసి, అటుపైన ఆయన చరిత్రలో ఎవరికి పట్టం కట్టాలనుకున్నారో వారిని అందలం ఎక్కించేసి, ఎవరిని విలన్లు చెయ్యాలనుకున్నారో వారిని పాతాళానికి అణగదొక్కేసి, చారిత్రక నవల ముసుగులో స్వైర విహారం, యధేచ్చగా చేసారు.  శాస్త్రిగారు నిర్వచించిన చారిత్రక నవలాలక్షణాలకంటే, రా.రా ప్రతిపాదించిన చారిత్రక నవల లక్షణాలు నాకు వెయ్యిరెట్లు “న్యాయం”గా తోచాయి.
    ****

    సామాజిక నవలకీ, చారిత్రక నవలకీ మధ్య ముఖ్యమైన తేడాలని రా.రా ప్రతిపాదన:

    “యదార్థ జీవితంలోని దేశకాల పరిస్థితులను యెలావున్నవాటిని అలా చిత్రించటమే సామాజిక నవల కర్త్యవ్యం. ఆ పరిస్థితుల పూర్వాపరాల పరిశీలనకానీ, కార్య కారణాల పరిశీలన కానీ దానికి అనవసరం. కానీ చారిత్రక నవలలో దేశకాల పరిస్థితులకు చారిత్రకత ఉంటుంది. అనగా, ఆ దేశంయొక్క గత చరిత్ర ఫలితంగా ఆనాటి సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయని, ఆ దేశపు చారిత్రక పరిణామక్రమంలో అది ఒక దశావిశేషమని పాఠకునికి ఒక స్పృహ కలుగుతుంది. ఈ స్పృహ ఎలా కలుగుతుందంటే భూతకాల శక్తులకూ, వర్తమాన కాల శక్తులకూ జరిగే ఘర్షణ కథలో కీలక పాత్ర వహించడం ద్వారా.

    చారిత్రక నవలలో మరొక విశేషం దేశకాల నిర్దిష్టత, సామాజిక నవలలోని పరిస్థితులు చిత్రంలో పూర్వరంగంలాగే ఉంటాయి. కానీ, వాటికి అంతకుమించి ప్రాముఖ్యం ఉండదు. దేశకాల పరిస్థితులు మార్చినా కథకు తీరని నష్టం ఏమీ జరగదు. ఆ దేశకాల పరిస్థితులలో తప్ప ఆ కథ అలా జరగకూడదని అనిపిస్తుంది చారిత్రక నవల. అది యెలా సాధ్యమంటే, యిటు నవలలోని పాత్రలకూ, సన్నివేశాలకూ మనోధర్మాలూ, జీవిత పద్ధతులూ, ప్రవర్తనా రీతులూ, వ్యక్తా వ్యక్త ఆశయాలూ, అట్లే సన్నివేశాల పూర్వాపరాలు దేశకాల విశిష్ట పరిస్థితులచేత నిర్ణయింపబడతాయి.”

    రా.రా ప్రతిపాదనతో మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – ఈ వ్యాస పరిధిలో ఆయన లేవనెత్తిన ఆరోపణలూ,  లోపాలు ఈ ప్రాతిపదిక ఆధారంగానే మనం విమర్శించాలి. ఆయన, రామనాథాన్ని మావగారు కొట్టడం అనే సన్నివేశాన్ని యాదృచ్ఛికమైన సంఘటనైనప్పటికీ,  తదనంతర కథాగతి దానిపైగాక,  అనాటి “చారిత్రక సన్నివేశంలో” (Emphasis added) అల్లుడు జాతీయవాది, మామ పోలీసు ఉద్యోగీ కావడం అనే కీలక పరిస్థితి మీదా, ముఖ్యపాత్రల మనోధర్మాలమీద సంపూర్ణంగా ఆధారపడింది అనే వివరణలో, సంపూర్ణంగా అన్న ఒక్క పదం మినహాయించి,  “అధికప్రసంగం” నాకేమీ కనపడలేదు.

    ఇక హేతుబద్ధత గురించీ రా.రా మాటలివి:
    “సమాజంలో నిత్యం ఘర్షణపడే ధర్మాలకూ, చారిత్రక శక్తులకూ, జీవిత విధానాలకూ పాత్రలు ప్రాతినిధ్యం వహించడమంటే, ఆ పాత్రలు యోచించి, చర్చించి, లాభనష్టాలు బేరీజు వేసుకొని ఒక పక్షం వహించడం కాదు. ఆ పాత్రల జీవిత పద్ధతులూ, మనోధర్మాలూ, అవ్యక్త కాంక్షలూ అన్నీ కలిసి ఆయా పాత్రలు ఆయా పక్షం వహించేటట్టు (గత్యంతరంలేదని అనిపించే విధంగా) నిర్ణయిస్తాయి.”

    ఇది చాలా లోతైన పరిశీలన. అయితే, దీనిని గతితార్కిక పద్ధతికి అన్వయించడంలో రా.రా కొంత గందరగోళంలో పడటం వాస్తవమే! మీరన్నట్టుగా, రామనాథంకి, ఆతని బాబాయికి ఎన్నో అభిప్రాయ బేధాలు ఉన్నా, వారు మనుషులుగా ఒకరికొకరు సన్నిహితులు, ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం ఉన్నాయి. ఇట్లాంటి “వైరుధ్యాలని” ఈ మధ్య అక్కిరాజు “జంధ్యం”లో కథా వస్తువుగా మలిచాడు.

    రా.రా పాత్రల మధ్య ఎత్తి చూపిన అంతర్వైర్యుధ్యాలు కూడా నిజానికి వైరుధ్యాలు కానే కావు. అట్లానే, మీరు చూపించిన “proximate” హేతువులు మాత్రమే కాకుండా, ultimate హేతువులు కూడా ఉంటాయి. 

    జాతీయోద్యమానికి దారితీసిన పరిస్థితుల వెనుక ఉన్న Ultimate కారణాలని రా.రా, రామ్మొహనరావుగారు ఇద్దరూ పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారేమో అని నా సందేహం.   రా.రా, రామ్మొహనరావుగారు విభేదించిన ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం:

    “ఛాందసత్వాన్ని, ఈ వ్యవస్థయెక్క (ఫ్యూడలిజం) పరమమైన రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాల్లోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ, రామనాధాన్ని కథానాయకునిగానూ ఎన్నుకొన్నారు” అన్నారు రా.రా. దానికి రామ్మోహనరావుగారు, “ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని, సామాజిక పరిణామచిత్రణను ఉద్ధేశించిన దృష్ఠ్యా సరికాదు” అంటూ, ముంగండ, దేశంలోని పరిస్థితికంతా అద్దంపట్టిన ఒక Microcosm గా అభివర్ణించారు ఆయన.

    మీకు ప్రధానంగా, రా.రా  వాదనతో ఉన్న అభ్యంతరం, రా.రా అగ్రహారీకులని కరుడుకట్టిన సాంప్రదాయవాదులుగా, ఫ్యూడలిజానికి ప్రతీకగా వర్ణించడంతోనే అనుకుంటాను.  నిజానికి, అప్పట్లో గ్రామాల్లో అస్పృశ్యత ఎందుకుండేది, అది ఎప్పట్నుంచీ ఒక సామాజిక “అవసరం”గా మారింది అనే విషయం రామ్మోహనరావుగారు తన నవలలో సూచించలేదు. అస్పృశ్యత ఉంది అని చెప్పారు, జాతీయోద్యమంలో దాన్ని ఎదుర్కోవడం ఒక ముఖ్యమైన భాగంగా చిత్రీకరించారు, కానీ దాని వెనుక ఉన్న “ఆర్ధిక”పరమైన హేతువులు, చారిత్రక నేపథ్యమూ ఆయన చిత్రీకరించలేదు. అందువల్ల, కొల్లాయిగట్టితేమి నవలలోని అస్పృశ్యత అంశం సామాజిక నవలలోని అంశంగా మాత్రమే చిత్రీకరించబడిందిగానీ, చారిత్రక నవలలోని అంశంగా చిత్రీకరించబడలేదనేది నా అభియోగం. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులని ఊరికి రప్పించడానికి ఆ అంశం నవలలో ఉపయోగించుకున్నారు గానీ, ఆ “చారిత్రక  పరిస్థితిని” గతితార్కికంగా చిత్రించలేదు.
     
    నాకు తెలిసినంతలో,  కోసాంబి ప్రతిపాదించినట్టుగా – మనదేశం, ఉష్ణమండలం అవ్వటం మూలంగానూ,  పొట్టనింపుకోడానికి వ్యవసాయాధారిత ఆహరమొక్కటే మార్గం కాదు కాబట్టి (It is possible to live under the “sun” throughout the year, and it is possible to “gather” food) ఇక్కడ బానిసత్వం, పాశ్చాత్య దేశాల్లో ఉండినట్టు ఒక వ్యక్తి యొక్క “సంపద”గా (A salve being an individual’s ‘property’), కాకుండా కమ్యూనిటీ స్లేవరీ ఏర్పడవలసిన అవసరం వచ్చింది. One way to enforce community slavery is by controlling access to all community resources like water and other infrastructure.  అగ్రహారాల్లో “అచారాలకి”, అస్పృశ్యతకీ వెనకాల “చారిత్రక” కారణం ముఖ్యంగా ఇదే. ఇక బ్రిటిష్ హయాంలోనే ఇదెందుకు పెచ్చుపెరిగిందీ అంటే – అప్పట్లో టాక్సులు సుమారుగా 60% ఉండేవి (ఉత్పత్తి ఉన్నా, లేకున్నా.  అప్పట్లో కంపెనీ కొన్ని గ్రామాలని జమీందారులకి fixed fee కి గుత్తకి ఇచ్చేసేవారు. ముందు ఒప్పుకున్నంత మొత్తమూ జమీందారు కంపెనీకి చల్లించవలసిందే – పంట పండినా, పండకపోయినా!).

    ఇక ముంగండని “Microcosm”గా పూర్తిగా ఒప్పుకోలేం – ఎందుకంటే, జాతీయోద్యమంలో ముఖ్యపాత్ర వహించిన చారిత్రక శక్తులు అనేకం ఉన్నాయి, అవన్నీ ముంగండలో లేవు.  ఒక ఉదాహరణ – జాతీయోద్యమంలో ప్లీడర్ల పాత్ర.. అప్పట్లో ప్లీడర్లలో చాలా ధనవంతులు ఉండేవారు. (మోతీలాల్ నెహ్రూ, పటేల్, ప్రకాశం పంతులు…). అట్లానే, ఇంగ్లాంఢుకి చదివుకి వెళ్ళినవారు ఎక్కువగా (ఇప్పుడు ఐ.టి చదువులకోసం ఎగబడినట్టు) బారిస్టరు చదవుకోసమే వెళ్ళేవారు.  జాతీయోద్యమానికి వెన్నుదన్నులుగా నిలిచింది కూడా లాయర్లే! దీనివెనుక నేపధ్యాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఉంది — అప్పట్లో లాయర్లకి ఎందుకంత డిమాండు? వారికి అంత ధనం, ఆస్తులు ఎక్కడనుండీ వచ్చాయి? ప్రజలు కోర్టుల చుట్టూ (కన్యాశుల్కంలోమాదిరి) తిరుగుటూ ఆస్తులు కరగదీసుకున్నారా? కోర్టుల్లో కేసులు ఎవరికి మధ్య ఉండేవి – ప్రజలకీ/ప్రభుత్వానికీ మధ్యనా, ప్రజలకీ-ప్రజలకీ మధ్యనేనా? బ్రిటిష్ కోర్టులు రాకపూర్వం మనసమాజంలో “కోర్టులు”, “చట్టాలు” ఏ రీతిగా ఉండేవి?

    ఇరవైయ్యో శతాబ్దిలో జాతీయోద్యమమూ, దానికి తోడుగా స్వాతంత్రోద్యమమూ ఊపందుకున్నా, అంతకు ముందువరకూ అగ్రవర్ణాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎందుకు కొమ్ముకాసాయి? ఎక్కువగా మితవాదులే ఉండేవారు. బ్రిటిష్ రాణిని, రాజుని దేశ చక్రవర్తులుగా మనవాళ్ళు చాలా కాలం ఒప్పుకున్నారు కదా? దీనివెనుక కారణాలు ఏమిటి అనేవి కూడా పరిశోధించాలి.

    నా ఉద్దేశంలో, ఈ అంశాన్ని రెండు/మూడు కోణాల్లో పరిశోధించడానికి వీలుంది. వేల్చేరు నారాయణరావుగారు, శ్రీనివాసు ఈమాటలో ప్రచురించిన ఒక వ్యాసంలో, మన సంస్కృతిలో విధేయత రాజుకేగాని, రాజ్యానికి లేదని ప్రతిపాదించారు. దీనిగురించీ విస్త్రుతంగా మరోసారి. ఇక రెండో కోణం – ఆనంద కుమారస్వామి, Spiritual Power and Temporal Authority in Indian Theory of Government లో పురోహితుడు, రాజు నాణానికి రెండు ముఖాలుగా ఉండేవారని, ఇద్దరూ కలిస్తేనే “రాజ్యాధికారం” పుట్టేదని అంటారు.  ఇది కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. ఇక మూడోది, తరతరాలుగా పైనుంచీ ఎవరో రావడం,  ఏవో దండయాత్రలనో, మరోరకంగానో “రాజులు” తరచుగా మారిపోతుండటం వల్ల కూడా, రాజు ఎవడైతేనేం అన్న సంసృతి ఏర్పడిఉండవచ్చు కూడా! అయితే, బెర్నీ ఖోన్ శక్తివంతంగా నిరూపించినట్టుగా, బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా వ్యాపార నిమిత్తం, కాబట్టి వారు ప్రధానంగా వ్యాపారులు. So, they had to commoditize all forms of knowledge and other values. కమ్మొడిటైజ్ కాకపోతే ఇక్కడనుండీ పట్టుకుపోవడానికి కుదరదు కదా?  ఈ తేడాని అవగాహన చేసుకోడానికి మన సమాజానికి చాలా సమయం పట్టిందనుకుంటాను.

    జాతీయోద్యమన్ని చారిత్రకంగా చిత్రీకరించే ప్రయత్నంలో,  అసలు జాతీయత అనే భావన ఎందుకు, ఎలా ఏర్పడుతుందో చెప్పాలి కదా? Benedict Anderson, తన Imagined Communities లో జాతీయవాదం (Nationalism) మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికగా వివరించలేం అంటాడు.  లూకాచ్ ఎంత ప్రతిభావంతంగా చారిత్రక నవల లక్షణాలని ప్రామాణీకరించాడో అంతే లాఘవంగా  ఎండర్సెన్ కూడా జాతీయవాదం మార్కిస్టు సిధ్ధాంతాలకి లొంగదని నిరూపించాడు.  రెంటిమీదా విమర్శలుకూడా అంతకంటే ఘాట్టిగానే ఉంటాయి.

    ఇవన్నీ ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే – పైకి ఎలా కనిపించినా, ఒక వ్యవస్థ ఏర్పడటం వెనుక కారణాలు ఉంటాయి. వాటిని, చాలా వరకూ మార్క్సిస్టు సిద్ధాంతాల ఆధారంగా సూత్రీకరించవచ్చు. అంత మాత్రాన, వ్యక్తులని నాయకులు, విలన్లు, దుర్మార్గులుగా చిత్రీకరించవలసిన అవసరం లేదు.  అందుకే, మార్కిజ్సం “రీజన్” (కారణం) వెతుకుంది, అంటకంటే hermeneuticsలో రీజనుకంటే మీనింగుకి (అర్థం) ముఖ్యమైన భూమిక ఉంటుంది. కాబట్టి, హెర్మెనియిటిక్సు అర్ధాన్ని వ్యాఖ్యానిస్తుంది – ఈ పద్ధతి ఇప్పుడు నారాయణరావుగారివంటి పరిశోధకులు శక్తివంతంగా ఉపయోగిస్తున్నారు.

    ఎలాగూ,  hermeneutics దాకా వచ్చాం కాబట్టి, ఇక్కడ మరోసంగతి కూడా  కలోనియల్ స్టడీస్ లో భాగంగా ప్రస్తావించటం అసందర్భం కాదనే అనుకుంటాను:
    సిపాయిల విప్లవంకి చాలా ముందునుంచీ, పోర్చుగీసు, డచ్చివారితో ఇక్కడి ప్రాంతీయ రాజులు, జమీందారులు తలపడినప్పుడల్లా ఘోరంగా ఓడిపోతుండేవారు. ఇక ఫ్రెంచ్, బ్రిటిష్  సేనలు పెద్ద యొత్తులో ఏర్పడిన తర్వాత మనవాళ్ళు గెలుపన్నదే ఎరగరు. అయితే, మనవాళ్ళు ఈ పోరాటాలని ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన పోరాటులుగా వర్ణించుకున్నారు. అంతే కాదు, పోర్చుగీసువాళ్ళో, బ్రిటిషువాళ్ళో  అన్యాయంగా, అధర్మంగా, కపటోపాయాలతో, మాయోపాయలతో ఉచ్చులుపన్నడం మూలంగా “ఓడించబడ్డాం”, అంతేకానీ, అవన్నీ ధర్మయుద్ధాలైన పక్షంలో మనకి ఓటమి ప్రశ్నే లేదు.  ఇట్లా జరిగిన కొన్ని ఘర్షణలు, మనకి కథలుగా, గాధలుగా, పాటలుగా రాసుకున్నాం.  అవెలా ఉంటాయంటే — తాండ్రపాపారాయుడు సింహబలుడు. ఆయన బొబ్బొలిలో జబ్బ  చరిస్తే విజయనగరంలో మేడలు కూలిపోయేవి. లేకపోతే అల్లూరి సీతారామరాజు ఒక్క రాత్రిలో  ఓ రెండొందల కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు. టిప్పు సుల్తానో, ఝాన్సీ లక్ష్మీభాయో కత్తి ఎత్తితే అదో నూరుగురిని అవలీలగా నరికేసేది. ఎప్పుడో, మహాభారతంలో “అయ్యో అన్నమాట కోసం అయ్యో అడవి పాలయరా” అన్నట్టుగా – మన పక్షానిది మొక్కవోని ధర్మం, అవతలివారిది కుయుక్తి. మొన్నమొన్నటి చైనాతో యుద్ధాన్ని కూడా మనం ఇలానే చరిత్రకి ఎక్కించుకున్నాం — వాస్తవాలు వేరుగా ఉన్నప్పటికీ!  అటు బ్రిటిషు వాళ్ళ కథనాలలో చిత్రం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి, George Bruce Melleson, The Decisive Battles of India అనో చక్కటి పుస్తకం రాసాడు. అందులో ఆయన బ్రిటిషువారికి, మనవాళ్ళకి  మధ్య జరిగిన ఘర్షణలలో ఎంత పేలవంగా మనవాళ్ళు చతికిలపడిపోయారో రాసాడు. ఇంకా చాలా చోట్ల, బ్రిటిషువారి డాక్యుమెంట్సులో  భారతీయులతో వ్యవహారాలు ఎంత కష్టంగా ఉంటాయో,  ఒక మాటమీద ఉండరనీ, చాలా కుయుక్తులు పన్నుతారనీ ఇట్లాంటి అభియోగాలు ఉన్నాయి.  ఏమయినప్పటికీ, మనకి ఒక ప్రత్యేకమైన “సాహిత్య ప్రక్రియ” ఒకటి ఏర్పడినట్టుగా ఉంది, దాని ముఖ్య లక్షణం ఏమిటంటే – ఓడిపోయిన పక్షాన్ని,  ధర్మాధర్మ యుద్ధంగా, మోసంవల్ల తాత్కాలికంగా వంచింపబడ్డ పక్షంగా చిత్రించడం.

    మన జాతీయోద్యమాన్ని పూర్తిగా చిత్రించదలచుకుంటే, ఇట్లాంటి అంశాలన్నీ కూడా అందులో అంతర్భాగం కావాలి. అందుకని ముంగండ అనే ఒక చిన్న అగ్రహారంలో కథని నడిపించడంతో అది సాధ్యంకాదని నా అభిప్రాయం.

    ******
    చివరిగా, డయలెక్టిక్ పద్ధతిని, Theory of Novel కి రాసిన ముందుమాటలో,  Michael McKeon చాలా స్పష్టంగా వివరించాడు:

    Most important, “dialectical method” as I use it is not a doctrine but a method of inquiry. My use of “dialectic’’ is derived most directly (but by no means exclusively) from Marx’s writings, which are of course nothing if not doctrinal. But it’s a dialectical truth that method can be provisionally separated from doctrine, so that the locally doctrinal implications of method play a relatively minor role in the process of inquiry. Western—and especially American—readers are accustomed to seeing dialectic as deductive, reductive, and teleological. According to this view, dialectical method is a technique for closing down inquiry, not opening it up. It’s deductive in that it imposes an abstract, predetermined scheme of understanding on what it seeks to understand; this is inevitably a reductive process because it simplifies and falsifies complex phenomena; and it’s teleological in that it assumes, as part of its own procedure, the results it purports to discover outside itself. For many readers, a formulaic model for this sort of dialectic is the familiar “Hegelian” progression from thesis to antithesis to synthesis. Posited from the outset, such a method finds what it wants to find, not what’s there, and it shapes what it finds according to a progressive (“synthesizing”) model of improvement that’s predictable, even inevitable.

    రా.రా విమర్శనా పద్ధతి “డాక్ట్రినల్”గా తోచడం, రా.రా రచనలోని లోపంకాదనుకుంటాను, అటువంటి సమస్య, గడచిన అర్ధశతాబ్దిలో సుమారుగా మార్స్కిస్టు పరిశోధకులందరిలోనూ ఉంటుందేమో! లూకాచ్ హిస్టారిక్ నవల్ మీద కూడా ఇటువంటి విమర్శలు లేకపోలేదు.

    “వేల్చేరు, విమర్శకుడు రా.రా అన్న వ్యాసంలో, రా.రా విమర్శకున్న నేపథ్యాన్ని, ప్రత్యేకతని వివరించారు – “ముద్దుకూరి చంద్రశేఖరరావు, కె.వి.రమణారెడ్డి లాంటి మార్కిస్టు మేధావులు రారా విమర్శరంగంలో ప్రవేశించేనాటికి ఒక మంచిపని చేసిపెట్టి ఉన్నారు. ఆ పని ఏమిటంటే – తెలుగు సాహిత్య చరిత్రని, ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రని మార్కిస్స్టు దృక్పథంతోఒ పరిశీలించి, స్థూలంగా పురోగామి దృక్పధాల మార్గాలనూ, అభ్యుదయ భావాల ప్రాబల్యాన్నీ వివరించి చూపించడం…

    అయితే ఈ పనిలో వారు సాధించిన ప్రయోజనం బలీయమైనదె అయినా, ఒక యుగధర్మాన్ని విశ్లేషించడంలో వాళ్ళు సాధించినంత స్పష్టత ప్రత్యేకంగా ఓ కవినో, ఒక పద్యాన్నో తీసుకుని చర్చించడంలో సాధించలేదు. ఆ పని, సాహసం చేసి మొదలుపెట్టనవాడు రారా.”

    రారా వ్యాసాలని ఈ నేపథ్యంలో చదివితే, అందులో అధికప్రసంగం నాకెక్కడా కనిపించలేదు. మీరు ఉదాహరించిన కొన్ని సమస్యలు నాకు వ్యాసరచనలోని పొరపాట్లగానే తోచాయితప్పితే, వాటిల్లో మౌలికమైన సమస్యలేవీ కనిపించలేదు. అయితే, ఇప్పుడు గతితార్కిక పద్ధతికంటే మెరుగైన పరిశోధనా పద్ధతులు వచ్చాయి, మన దగ్గర ఇప్పుడు మునుపులేని సమాచారం, ఉపకరణాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు కలోనియనిజంపై మరింత లోతైన, విస్త్రుతమైన పరిశోధనలు జరగడానికి అవకాసం ఉంది. దానిని మనం వినియోగించుకోవడం చాలా అవసరం.

    రిగార్డులతో
    నాగరాజు

    1. కామేశ్వరరావు

      నాగరాజుగారూ,

      >>”దొంగపడ్డ ఆర్నెల్లకి కుక్కమొరిగిన రీతిలో,…”
      Better late than never కదండీ! ఇంత విపులమైన వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు, మీ ఓపికకి వందనాలు! మీరిందులో ప్రస్తావించిన అనేక విషయాలు – జాతీయోద్యమం గురించి, జాతీయ భావన గురించి, hermeneutics గురించి, Michael McKeon గురించీ చెప్పినవి – చాలా విలువైనవీ ఆలోచించవలసినవీను.
      ఇలాంటి మంచి చర్చని లేవనెత్తడమే నా ఉద్దేశం. మీరన్న కొన్ని విషయాలపై నా అభిప్రాయాలు, సందేహాలు:

      >>”రచయితని నిర్వచించే మౌలికమైన లక్షణాన్నే విమర్శకి ఆధారం చేసుకోవడం న్యాయం కాదనుకుంటాను.. రా.రా వ్యాసాలన్నిటిలోనూ ఉండే ధోరణే ఈ వ్యాసంలోనూ ఉంది, అది ఈ వ్యాసానికి ప్రత్యేకంకాదు కదా – ఆయన శైలే అంత.”

      ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, రా.రా.గారి “రచనా శైలి” గురించి నా ఆక్షేపణలో ఎక్కడా నేను అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదు, అతను లేవెనెత్తిన అంశాలపైనే తప్ప. రెండు – విమర్శకుడు కొన్ని మౌలిక సిద్ధాంతాల ఆధారంగా ఒక విమర్శ చేసినప్పుడు, దానిపై చేసే ప్రతివిమర్శలో ఆ సిద్ధాంతాలలో కనిపించే లోపాలను ఎత్తిచూపడం తప్పవుతుందా? నేనిక్కడ రా.రా.గారి వ్యాసాన్ని సమీక్షించ లేదు, నా ఆక్షేపణలను మాత్రమే చెప్పిన మాట నిజమే. నా ఉద్దేశం రా.రా.గారి వ్యాసంపై ఒక సమగ్రవిశ్లేషణ చేయడం కానే కాదు, నాకు కనిపించిన కొన్ని అభ్యంతరాలను చెప్పడం మాత్రమే.

      >>”సామాజిక నవలకీ, చారిత్రక నవలకీ మధ్య ముఖ్యమైన తేడాలని రా.రా ప్రతిపాదన:… రా.రా ప్రతిపాదనతో మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – ఈ వ్యాస పరిధిలో ఆయన లేవనెత్తిన ఆరోపణలూ, లోపాలు ఈ ప్రాతిపదిక ఆధారంగానే మనం విమర్శించాలి”

      రా.రా. చేసినది నా దృష్టిలో చాలా విలువైన ప్రతిపాదనే. నా అనుమానం అల్లా, ఒకే నవలలో సామాజిక చారిత్రక (ఇంకా యితర) అంశాలు ఉండవచ్చు కదా? అలాంటప్పుడు, ఆయా అంశాలని గుర్తించి వివరించడం సరైన విమర్శ అవుతుందా, లేక ఒకే దృష్టిలో పరిశీలించి (ఇక్కడ రా.రా. దృష్టిలో యీ నవలని చారిత్రక నవలగా మాత్రమే భావించి), మిగతా అంశాలను లోపాలుగా ఎత్తిచూపడం సరైన విమర్శ అవుతుందా?

      >>”ఒకటి కవి సామ్రాట్ట్ నోరి నరసింహశాస్త్రిగారు తన సారస్వత వ్యాసాలలో రాసిన “ఆంధ్రభాషలో చారిత్రక నవల” వ్యాసము”

      నోరివారు చారిత్రకనవల గురించి చెప్పిన విషయాలతో నేను ఏకీభవించను. అయితే, ఎప్పుడో కొన్ని శతాబ్దాల కిందట జరిగిన (ఉదాహరణకి పదకొండో, పద్నాలుగో శతాబ్దాలకు చెందిన) సమాజం గురించి, మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానో మరొక సిద్ధాంతం ద్వారానో (మాత్రమే) అర్థం చేసుకోవాలనుకోవడం ఎంతవరకూ సమంజసం? – అనేది నా సందేహం.

      >>”అనాటి “చారిత్రక సన్నివేశంలో” (Emphasis added) అల్లుడు జాతీయవాది, మామ పోలీసు ఉద్యోగీ కావడం అనే కీలక పరిస్థితి మీదా, ముఖ్యపాత్రల మనోధర్మాలమీద సంపూర్ణంగా ఆధారపడింది అనే వివరణలో, సంపూర్ణంగా అన్న ఒక్క పదం మినహాయించి, “అధికప్రసంగం” నాకేమీ కనపడలేదు.”

      దీనితో నేను కొంతవరకూ ఏకీభవిస్తాను. ఆనాటి చారిత్రక సన్నివేశం ఆధారంగా, కథాగతి నవలలో చూపించినట్టు అవే సంఘటనలు కాకపోయినా, రామనాథం కాపురంపై చాలా ప్రభావం ఉండేది అనేది ఒప్పుకోవలసిన విషయమే.

      >>”మీకు ప్రధానంగా, రా.రా వాదనతో ఉన్న అభ్యంతరం, రా.రా అగ్రహారీకులని కరుడుకట్టిన సాంప్రదాయవాదులుగా, ఫ్యూడలిజానికి ప్రతీకగా వర్ణించడంతోనే అనుకుంటాను.”

      నా అభ్యంతరం, ఈ నవలలో అలా చిత్రించకపోయినప్పటికీ, రా.రా. అలా భావించడంపైన.

      >>”అందువల్ల, కొల్లాయిగట్టితేమి నవలలోని అస్పృశ్యత అంశం సామాజిక నవలలోని అంశంగా మాత్రమే చిత్రీకరించబడిందిగానీ, చారిత్రక నవలలోని అంశంగా చిత్రీకరించబడలేదనేది నా అభియోగం.”

      అస్పృశ్యత గురించి మీరన్నట్టు, దాని చారిత్రక కారణాలను గురించి యీ నవల పట్టించుకో లేదన్న విషయాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే అది “అభియోగం”గా భావించడాన్ని నేను ఒప్పుకోను.

      >>” ముంగండ, దేశంలోని పరిస్థితికంతా అద్దంపట్టిన ఒక Microcosm గా అభివర్ణించారు ఆయన.”

      రామ్మోహనరావుగారు తన వ్యాసంలో, ముంగండ దేశంలోని పరిస్థితికంతా అద్దంపట్టే Microcosm, అన్నట్టుగా నాకెక్కడా అనిపించ లేదండీ. నవల పరిమితుల గురించి ఆయన స్పష్టంగానే వివరించారు.
      ఈ సందర్భంలో రామ్మోహనరావుగారు వాడిన “రాజకీయ విశ్లేషణ”, “సామాజిక పరిణామ చిత్రణ” అనే పదాలు ఆసక్తికరమైనవి (“ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని, సామాజిక పరిణామచిత్రణను ఉద్ధేశించిన దృష్ఠ్యా సరికాదు” అన్నప్పుడు). వీటిని మీరెలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవాలని ఉంది.

      >>”రా.రా విమర్శనా పద్ధతి “డాక్ట్రినల్”గా తోచడం, రా.రా రచనలోని లోపంకాదనుకుంటాను, అటువంటి సమస్య, గడచిన అర్ధశతాబ్దిలో సుమారుగా మార్స్కిస్టు పరిశోధకులందరిలోనూ ఉంటుందేమో!”

      మీరన్నది నిజమే కావచ్చు. మీరన్నట్టుగా, వాటిని తిరిగి మరోసారి చూసి, ఆ విశ్లేషణలోనూ, వాటి వెనకనున్న సిద్ధాంతాలలోనూ ఉన్న లోపాలనూ పరిమితులనూ అర్థం చేసుకోవడం అవసరమే కదా. నా ఉద్దేశమూ అదే తప్ప రా.రా.ని వ్యక్తిగతంగా నిందించడం కాదు.
      McKeon మాటలు నా ఆలోచనలని ప్రతిఫలించాయి. Dialectics, ఒక doctrineగా కన్నా, ఒక methodగా ఎంతో విలువైనదని నేనూ నమ్ముతాను.
      సందర్భం వచ్చింది కాబట్టి, యీ విషయంలో మార్క్సిజం గురించి బాలాగోపాల్ చేసిన విశ్లేషణా, లేవనెత్తిన ప్రశ్నలూ నాకు చాలా అర్థవంతంగానూ సమంజసంగానూ అనిపించాయి. సమయం చిక్కితే దాని గురించి ఎప్పుడైనా రాస్తాను.

  2. manjari lakshmi

    ఒకటో అంశం: ఈ నవల చివరి వరకూ పోలీస్ ఆఫీసర్ అయిన రామనాధం మామ నారాయణ మూర్తి ఒక్కడే కరడుగట్టిన (మూర్తీభవించిన) భావాలకు ప్రతీకగా ఉన్నాడు కానీ మిగతా నవలలోని పాత్రలన్నీ అలాగ లేని మాట నిజమే. ముంగండను మహీధర రామమోహన్‌రావుగారి వర్ణించిన తీరు చూస్తే స్థూలంగా అదీ గడ్డకట్టిన ఫ్యూడల్ భావాలతో ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ పాత్రల ప్రకారం చూస్తే కొంతమంది కొంత అప్పటికే మార్పుకు గురైనట్లు, కధ చివరికొచ్చేటప్పటికి, ఇంకా కూడా, క్రమానుగతంగా, ఎక్కువ మంది అభివృధ్ధికరమైన భావాల వేపు మారుతున్నట్లు స్పష్టంగా కధలో చూపించారు. అయితే రామనాధం, ఘర్షణ జరిగిన ప్రతి సంఘటనలోనూ, ఎక్కువ శాతం (అభివృధ్ధికరమైన భావాలవైపు త్వరితంగా మార్పుచెందుతూ) ఆధునిక భావాల వైపే ఉండి దానికి వ్యతిరేకమైన భావాలతో ఢీ కొన్నట్లుగా చూపించటంతో అతను స్థూలంగా ఆధునిక భావాలకు ప్రతీకగా నిలబడినట్లే కనిపిస్తుంది.
    “యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖలాగా జీవితం ఒకే విధంగా ఉండదు” అనేదాన్నీ “యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖలాగా జీవితం పర్యంతం ఒకే విధంగా ఉండదు” అని చదువుకుంటే సరిపోతుందేమో కదా!
    రెండో అంశం: జీవితంలోని అనంత వైవిధ్యాన్ని సాహిత్యం సరిగా ప్రతిబింబించలేదనే విమర్శ ఉందని చెపుతూ మనిషి జీవితంలో అనేక సంఘటనలు (యాదృఛ్ఛికమైనవి కూడా) బీరకాయ పీచులాగా పెనవేసుకొని సాధారణ దృష్టికి హేతురహితంగా కనపడినప్పటికీ, సాహిత్యాన్ని సృష్టించే రచయితలు మాత్రం జీవితాన్ని పరిశోధించి తాము పట్టుకోగలిగినంతమేర కార్యా, కారణ సంబంధాన్ని చూపిస్తూ మానవ జీవితాల్ని సాహిత్యంలోకి ఎక్కిస్తారనీ, ఆ ఎక్కించే సాహిత్యకారుల్లోనే అపరిణితులు సరళ రేఖల్లాంటి పాత్రలను సృష్టిస్తే మహీధర రామమోహనరావుగారు, పరిపూర్ణమైన భౌతిక వాద దృక్పధం జీర్నించుకున్నవాడూ, చరిత్రసారాన్ని గాఢంగా గ్రహించినవాడూ (dialectics బాగా తెలిసినవాడూ) గనుక ఎక్కడా హేతుబధ్ధతకు భంగం కలగకుండా మనుషుల మనస్తత్వంలోని అంతర్వైరుధ్యాన్ని, ద్వంద్వ స్వభావాన్ని, (దానికి ప్రేరణను) కేవలం మానవ లక్షణంగానే కాక చారిత్రక లక్షణంగా కూడా చిత్రించగలిగాడు అనీ అర్ధం చేసుకుంటే సరిపోతుంది.
    ప్యూడల్ ఆచరణకు లోబడి, ఆ సమాజం తనను వెలివెయ్యకుండా ఉండటం కోసం, కొడుకులాగ పెంచుకొన్న రామనాధంను ఇంటిబయట అరుగు మీదే కూర్చోపెట్టిన (స్వార్ధంతోనా?) శంకర శాస్త్రి, డబ్బు విషయంలో కొచ్చేటప్పటికి నిజాయితీగా ఉన్నాడు. నీతి, నిజాయితీలనేవి కూడా ఈ సమాజం ద్వారా మనకు అందిన భావాలే కాదా? అలాగే స్వార్ధంగా ఉండటం, అవకాశవాదంతో ప్రవర్తించటం అన్నవి కూడా ఈ సమాజంలో ఉన్న భావాలే. మన ప్రవర్తన ఈ సమాజంలోనించి అందిన భావాల సముదాయంతో ఏర్పడేదే కాక పోతే వేరే ఎక్కడినుంచి వస్తుంది? అయితే ఎవరు ఏ భావాలకు ఎంతవరకూ కట్టుబడి ఉంటారూ, ఎవరి మీద ఏ భావాలు ఎంత ప్రభావం చూపిస్తాయీ అనేంతవరకే వ్యక్తుల ప్రత్యేకత.
    మూడో అంశం: పడవ గుమాస్తా రామనాధం ప్రతిఙ్ఞ చేసిన మీటింగుకు వెళ్ళాడూ అంటే అతనికి కూడా గాంధీ జాతీయవాద భావాల మీద ఏ మాత్రమో అభిమానం ఉండబట్టే కదా. అందుకనే అతన్ని గుర్తు పట్టటం, అందరికీ అతని గురించి గొప్పగా చెప్పటం జరిగింది. అయితే డబ్బు కోసం దాన్ని కూడా ఉపయోగించుకున్నాడు అంటే అతను ఇక్కడ ద్వంద్వంగా ఉన్నట్లే కదా?
    శంకర శాస్త్రి విషయానికి వస్తే రామనాధం జాతీయోద్యమంలో పాల్గొనడం అతనికి ఇష్టం లేదు. అతను ఐ.పి.ఎస్. చదివాలి అని పట్టుపట్టటం అంటే ఆ చదువుకు ఫలితంగా, అతని మామకు మల్లే, అతను కూడా ఇంగ్లీషువాళ్ళకు తాబేదారుగా పనిచెయ్యాలి అనేగా. వీటికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతూ తన పెంపుడు కొడుకులాంటి రామనాధం జేవితాన్ని పాడుచేసి, తన కుటుంబంలో చీలిక తెచ్చిన గాంధీ గారిని దేనికి ఇష్టపడ్డాడు? ఆ పాత్ర రామనాధం చేసిన ప్రతి చర్యనూ వ్యతిరేకించిందీ అంటే అతను గాంధీ గారి భావాలకు వ్యతిరేకంగా ఉన్నట్లే కదా! ఏదో ఒక చోట ఇష్టం అని చెప్పగానే అతనికి ఇష్టం ఉన్నట్లేనా? చివరికొచ్చేటప్పటికి గాంధీ గారిని కారణ జన్ముడు అనేశాడు. ఇది ద్వంద్వం కాదా? తనకూ, తను నమ్మిన వ్యవస్థకూ, ఏహానీ జరగకుండా స్వాతంత్ర్యం వస్తే అటు తరువాత ఏర్పడే ప్రభుత్వానికి తాబేదారులుగా తన వారసులను తయారు చేసే పనిలో నిమగ్నమై వుండేవాడు పాపం!

    నాల్గవ అంశం: బెంగాలు, పంజాబుల్లో టెర్రరిస్టు ఉద్యమం రూపంలో, మహా రాష్ట్ర, ఉత్తర భారత ప్రాంతాలలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుధ్ధరణ వాద ప్రాబల్యముతో జాతీయోద్యమం పెనవేసుకొని నడిచింది కానీ ఆంధ్ర రాజకీయాల్లో వాటికి స్థానమే లేదనీ, ఎందుకంటే తెలుగు జాతి జీవితంలో, జాతీయోద్యమం కంటే ముందే సంఘ సంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణ ఉద్యమ రూపంలో ప్రవేశించాయనీ. తెలుగుదేశంలో అప్పటికే మత విశ్వాశాల మీద తిరుగుబాటు, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై ఉన్నదనీ ఆయన చెప్పి మిగతాది చెప్పారు. మీరు రా.రా.గారిది తప్పు అని చూపించాలంటే ఆంధ్ర దేశంలో కూడా ఉత్తరభారతంలో జరిగిన ఉద్యమల్లాంటివి ప్యూడల్ వ్యవస్థనుంచి పుట్టినట్ట్లుగా చూపించగలగాలి. ఆ సందర్భంగా మహీధర రామమోహన్ రావుగారు కూడా తెలుగు జాతికి ఉన్న ఈ ప్రత్యేకత అర్ధం అయినప్పుడు కలిగే ఆనందానికి అంబరం ఉండదు అని కూడా రాశారు. ఆ సందర్భంగానే అట్లా తెలుగు యువకుల మనస్సుల తుప్పుదుళ్ళ కొట్టినది వీరేశలింగం, చలమూనని తను వాదించేవాడినని కూడా రాశారు. రా.రా. గారు ప్యూడల్ వ్యవస్థ గురించి ఎక్కువగా రాశారేమో కానీ, ఆంధ్ర దేశంలో కొంచెమో గొప్పో ఆ వ్యవస్థను ఎదిరించిన వాళ్ళే ఎక్కువ మంది జాతీయోద్యమ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారనేదే ఆయన చెప్పదలుచుకున్నది. ఎక్కువ మంది ఫ్యూడల్ భావాలున్నవాళ్ళు శంకరశాస్త్రికి మల్లేనే ఉన్నారు..

    ఆరో అంశం: రా.రా. గారు ఉదహరించిన దానిలో నారయణ మూర్తి అల్లుణ్ని బాదిన సంఘటన వరకే తీసుకొని, ఆ ఘటన ఒక చిన్న పొరపాటు వల్ల జరిగిన యాదృఛ్ఛిక సంఘటన అని చెప్పారు. ఆ సంఘటన యాదృఛ్ఛికమే అయినా నారయణ మూర్తి కర్కోటకపు, పోలీసు స్వభావానికి అది అసహజమేమి కాదని చెప్తూ రా.రా. గారు చాలానే రాశుకొచ్చారు.
    తప్పుడు కేసు మోపి జైలుకి పంపించటం అనేది నారయణ మూర్తి కావాలని చేసినదే. అతడు, రాజద్రోహి అయినవాడు అల్లుడయినా తన్ని జైలుకు పంపించిన రాజభక్తి తత్పరుడననే ప్రశంసల కోసం, దురభిమానంతోనూ అలా చేశాడనీ, కధ అంతా ఆ నాటి చారిత్రక సన్నివేశంలో అల్లుడు జాతీయవాది, మామ ప్రభుత్వ బంటైన పోలీసు ఉద్యోగి కావడం అనే కీలక అంశం మీదా, ముఖ్య పాత్రల మనోధర్మాల మీదా సంపూర్ణంగా ఆధారపడింది అని రాశారు. ఇది సూక్ష్మ దృష్టితో చూస్తే తెలుస్తుంది అని రాశారు. ఇందులో పొరపాటేముంది?

    ఐదవ అంశం: తన కూతురు వివాహితై భర్త చేత వదిలివేయ బడినట్లే రామనాధం వివాహితుడైనా తన భార్య చేత వదిలి వేయబడ్డాడు కదా. అయినా అతడు వివాహితుడు కాబట్టి చేసుకోవటానికి వీల్లేదనటం ఏమిటి? వాళ్ళిద్దరూ వివాహం చేసుకోకూడదనటానికి హేతుబధ్ధమైన కారణమేదైనా ఉందా? మరి తన అల్లుడు ఇంకో పెళ్ళి చేసుకున్నాడని తెలిసికూడా కూతుర్ని అత్తింటికి ఎలా పంపించాడు? తాను బ్రహ్మసమ్మాజికుడైనాడు అంటే హిందూ మత ధర్మాలు హేతుబధ్ధంగా లేవనేగా ఆ పని చేసింది. రామనాధంలో ఉన్న ప్రత్యేకతలన్నిటినీ గుర్తించి ఇష్టపడ్డ వ్యక్తి అతనే తన కూతురుకు భర్తవుతాడంటే ఎంత ఆనందించాలీ? వీళ్ళిద్ధరి వివాహం ఇంకో ఆధునిక సంప్రదాయాన్ని ఏర్పరుస్తుందన్న అలోచనా, తాను హిందూ సాంప్రదాయాన్ని ఎదిరించినట్లే, వాళ్ళూ బ్రహ్మ సమాజాన్ని కూడా ఎదిరించవచ్చు అన్న అలోచన లేకుండా ఆవేశపడి రామనాధం తలకాయ పగలకొట్టటానికి సిధ్ధమయ్యాడూ అంటే అతని మీద హేతువాదం కంటే సనాతన మూఢాచారాలే ఎక్కువగా పనిచేశాయన్న మాట. చివరికి ఒప్పుకొని పంపించడానికి ఎంత ఘర్షణ పడిందీ రామమోహనరావుగారు చాలానే చెప్పారు కదా! అంటే అతనిలో ఎంత అంతర్యుధ్ధం జరిగి ఉండాలి. అది ఏ భావాలకూ, ఏ భావాలకు మధ్య జరిగిందీ? ఆయన అన్న అంతరాత్మనే మీరు అంతరంగం అని ఉంటే ఆయన అంతరాత్మ అనేది మానవుని వ్యక్తా వ్యక్త మనస్సు (sub-conscious mind) లో గూడు కట్టుకున్న విశ్వాసాల సంపుటి అని చెప్పి, మానవుని చుట్టూ వున్న సమాజంలోని విశ్వాశాలే పసితనం నుండి అతని మనసులో ప్రవేశించి వయసు వచ్చేటప్పటికి స్థిరపడి అంతరాత్మరూపం ధరిస్తాయి అని నిర్వచించినట్లున్నారు కదా! “వయస్సు వచ్చేక అతను ఆర్జించే విద్యా విజ్ఙానాల ఫలితంగా ధర్మాలను గురించి అతని అభిప్రాయాలు మారవచ్చు. కానీ వ్యక్తావ్యక్త మనస్సులోని అతని విశ్వాసాల పట్టు సులభంగా సడలదు. ఆనగా వ్యక్తి వివేకం యెదిగినంతగా అంతరాత్మ ఎదగదు” అని ఇంత వివరంగా చెపితే సరిగా నిర్వచించలేదంటారేమిటి. “మన సంఘంలో ఉన్న ఆచారాలు, అలవాట్లూ ఆ మనస్థితికి మూలం” అని రచయిత అన్నదానికే ఇదంతా వివరణగా అనిపించటం లేదా?

    ఏడవ అంశం: ఆయన చారిత్రక నవలలకు ఉండాల్సిన లక్షణాలూ, ఆ లక్షణాలు ఈనవల్లో ఎట్లా పొందుపర్చబడ్డాయి చెప్పే నేపధ్యంలోనే మిగతా నవలలతో పోల్చడం కూడా జరిగింది. ఇందులో అప్రస్తుతం ఏముందీ? గతకాలపు ఘటనలను ఈ నాటి విజ్ఙ్నాన వివేకాలతో అధ్యయనం చెయ్యగలిగేదే చరిత్రా, వందిమాగధులు చెప్పిన స్తోత్రపాఠాలే తిరుగులేని చారిత్రక ప్రమాణులుగా స్వీకరించిన వాళ్ళవి కావు అనీ ఉదాహరణగా విజయనగర సామ్రాజ్యం నవలా, దాని మీద గురజాడ రాసిన విమర్శని చూపించారే? ఇటీవలి కాలానికి సంబంధించిన చరిత్రతో మనకి స్పష్టమైన పరిచయం ఉంటే మాత్రం దాన్ని మార్కిష్టు దృక్పధంతో రాయాలని ఏముందీ? మార్కిష్టు దృక్పధంతోనే రాయదలుచుకున్నవాళ్ళు, పదకొండవ శతాబ్దానికి చెందినదాన్నైనా సరే, వాళ్ళకు సాధ్యమైనంతవరకే ఆ చరిత్రనే పరిశోధించి, పరిశీలించి రాయగలిగినంతవరకే ఆ దృక్పధంతోనే రాస్తారు? ఏమవుతుందీ. ఇక్కడ దృక్పధం ముఖ్యం. అంతే కానీ నువ్వు రాయలేనిదాన్ని రాయమని ఎవరూ అడగటం లేదు. ఏనాటి ఊహలైనా గత చరిత్రకూ, వర్తమాన చరిత్రకూ కార్యా, కారణ సంబంధాన్ని చూపిస్తూ, ఆనాటి చరిత్ర అలా ఉన్నందువల్లనే, ఈనాటి చరిత్ర ఇలా ఉన్నదన్న సృహ కలిగించాలి. అదే ఉత్తమమైన చారిత్రక నవల అంటే తప్పేమిటి? భౌతిక వాదులెప్పుడైనా అభివృధికరమైన భావాలున్నవాటిని స్వీకరించాలి, అభివృధి నిరోధకమైన వాటిని అవతల పారేయాలనే చెప్తారు. రా.రా. గారు అభివృధ్ధి నిరోధకమైన పుస్తకాలను నెత్తినెత్తుకోమని చెప్పాలనటం ఏం సమంజసం?

  3. కామేశ్వరరావు

    రవీ,

    మీరన్నట్టు “పాత్రలను ఆనాటి చారిత్రకశక్తులకూ, సామాజికధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించాలి” అన్న వాక్యాన్నికి ఒక కాంటెక్స్టు (నేపథ్యం) ఉంది. ఆ నేపథ్యంలో దాన్ని అర్థం చేసుకుంటే అది సమంజసంగానే అనిపిస్తుంది. నాకు అర్థమయినంత వరకూ, Lukas చెప్పినది, పాత్రలని రచయిత తమతమ “ఆదర్శాలకి” ప్రతీకలుగా ప్రతినిధులుగా కాక సామాజికధర్మాలకి అనుగుణంగా చిత్రించాలని. చారిత్రక పాత్రల Romantisizationని Lukas తప్పుపట్టాడు. ఇందులో అసమంజసమైన దేదీ లేదు. అయితే, సామాజికపరిస్థితుల గురించి చారిత్రక స్పష్టత లేని కాలానికి సంబంధించిన నవలల్లో ఈ సూత్రాన్ని ఎలా అన్వయించాలన్నది ఆలోచించాల్సిన విషయం. చారిత్రకశక్తుల గురించి, సామాజికపరిస్థితుల గురించి బాగా తెలిసినప్పుడు, చారిత్రక నవలలోని పాత్రచిత్రణలో వాటి ప్రభావం తప్పకుండా కనిపించాలనడం సమంజసమే. కాని, ఒక వ్యక్తి మీద ఆ కాలంలో ఉన్న అన్ని శక్తుల ప్రభావమూ ఉంటుంది. వ్యక్తి వ్యక్తికీ మధ్యన ఆ ప్రభావాలలో అంతరాలు ఉంటాయి. దాని మూలంగా రకరకాల పాత్రలు కనిపిస్తాయి. చారిత్రకశక్తుల సంఘర్షణ పాత్రల మధ్యలోనే కాదు, ఒకే పాత్రలో కూడా కనిపిస్తుంది.

    రా.రా. వ్యాసంలో నాకీ కాంటెక్స్టు సరిగా కనిపించ లేదు. రామనాథం బూర్జువా ధర్మానికి ప్రతినిధీ, బ్రాహ్మణ గ్రామమైన ముంగండ ఫ్యూడల్ సంస్కృతికి ప్రతినిధీ, రామనాథానికి తన గ్రామంతో వచ్చిన సంఘర్షణ బూర్జువా ఫ్యూడల్ శక్తుల ఘర్షణ అని చెప్పి, ముంగండ ఫ్యూడల్ సంస్కృతికి ఎందుకు ప్రతినిధో సుదీర్ఘంగా వివరించారే తప్ప, ముంగండ గ్రామంలోని ప్రజలపై కూడా ఈ రెండు శక్తుల ప్రభావం ఉంటుందని కాని, దాన్ని చిత్రించే పాత్రలీ నవలలో ఉన్నాయని కాని అతను గుర్తించ లేదు. దీనినే, “సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకి బయటనే ఉండిపోయింది” అని రా.రా. విశ్లేషణ గురించి మహీధర తన వ్యాసంలో ఎత్తి చూపారు.

    అంతేకాదు, చారిత్రక నవలకి మాత్రమే పరిమితమైన యీ పాత్రచిత్రణ విధానాన్ని జెనరలైజ్ చేసి, అసలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోడానికి కూడా యిదే సాధనమని చెప్పి, మరింత గందరగోళాన్ని సృష్టించారు రా.రా.! గోపీచంద్ లాంటివాళ్ళ నవలల్లో rationalism కనిపించదనీ, వాటికి లక్ష్యశుద్ధీ, భావైక్యతమూ, కథనపాటవమూ లేక గందరగోళంగా ఉంటాయనీ విమర్శించారు. గోపీచంద్ లాంటి వాళ్ళు రాసినవి చారిత్రక నవలల కింద పరిగణించ వచ్చా? అలా కానప్పుడు, యీ సూత్రాలని అక్కడ వర్తింప చెయ్యవచ్చా?

    రా.రా. ధోరణితో నాకు వచ్చిన చిక్కిదే.

  4. రవి

    ఈ నవల చాలా రోజులుగా చదవాలనుకుంటున్నా, ఇప్పటికి మొదలెట్టడం కుదిరింది. ఇంకా సగం మాత్రమే చదివినా, రా.రా. విమర్శ చదవకపోయినా మీ వ్యాఖ్యలకు నా ఆలోచనలు.

    సాధారణంగా సైద్ధాంతికదృక్పథం ఉన్నవాళ్ళు కొన్ని పదాలను జాగ్రత్తగా వాడాలి. రా.రా. ఆ పని చేసినట్టు లేదు, తన మనసులో ఉన్నది ఎదుటివాళ్ళకు ఇట్టే అర్థమవుతుందని రాసుకుంటూ పోయాడు.

    “పాత్రలను ఆనాటి చారిత్రకశక్తులకూ, సామాజికధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించాలి” – ఇక్కడ ప్రతినిధులు అన్నది తప్పు, ప్రభావం అన్నది సరైన పదం అని మీరంటున్నారు. “ప్రభావం చూపటం” అన్నది గీటురాయి కాదని అనుకుంటున్నాను. యండమూరి, మధుబాబు వంటి పాపులర్ రచయితలు చారిత్రక నవల రాస్తే నవల్లో పాత్రల మీద కూడా ఎవరో ఉదాత్తచరిత్రుడి ప్రభావం ఉండవచ్చు. అంతమాత్రాన అది గొప్ప చారిత్రకనవల అయిపోదు.(ఇలా అన్నానని నేను షాడో విమర్శకుణ్ణి కాదు. ఆ మాటకొస్తే షాడో మీద విమర్శ వస్తే ఊరుకునేది లేదు. :))

    ఇక ధర్మానికి “ప్రతినిధి” – అంటే మీరు ఆ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తలపై మోసేవాడని, ప్రాణం పోయినా కట్టుబడి ఉండేవాడని అర్థం చెప్పుకున్నట్టు ఉన్నారు. ఇది శుద్ధ గ్రాంథికార్థమే తప్ప వాస్తవికార్థం కాదు. ఉదాహరణకు గాంధేయవాదానికి ప్రతినిధి అన్నంతమాత్రాన రైల్లో మూడవతరగతిలో ప్రయాణం చేస్తూ, ఖద్దరు పంచ తొడుక్కుని, గాంధీని ఇమిటేట్ చేసే పాత్రగా ఊహించడం సరి కాదనుకుంటున్నాను. అలాగయితే గాంధీ కథ చదువుకుంటే పోలా, వేరే “ప్రతినిధుల” పాత్ర చిత్రణలెందుకు? :)ఏ వ్యక్తి అయినా ఒక ధర్మానికి ప్రతీక (ప్రతిబింబం)గా నిలబడుతూ, తను అర్థం చేసుకున్న పరిధిలో, పరిస్థితులు అనుమతించిన మేరా ఆ ధర్మానికి కట్టుబడి, తను నమ్మిన ధర్మానికి విరుద్ధమైన సంఘటనలు ఎదురైనప్పుడు సంఘర్షణకు గురై, పెనుగులాడ్డం మానవస్వభావం, సహజం. రా.రా. “ప్రతినిధి” అని ఇలాంటి అర్థం (ప్రతిబింబం) లోనే వాడాడని నా ఆలోచన.ఆ దృష్టిలో చూస్తే రా.రా. వాదనలో అనౌచిత్యం కనబడడం లేదనుకుంటున్నాను.

    ఇక 3, 6 – మీరు చెప్పిన కారణాలు సబబుగా ఉన్నాయి. మిగిలినవి తెలియాలంటే పూర్తిగా చదవాలి. చివరి కారణం మరింత లోతుగా చదవాలి. 🙂

  5. సౌమ్య

    In my view, they are “view points”. Especially, point 6.
    View points may have fundamental logic problems…they may not have too.
    Ofcourse, this is my view..and it can be either logical or illogical, depending on the view of your logic…or the logic of your view. 😛

  6. కామేశ్వరరావు

    రా.రా.గారి Dialectics దృష్టితో ఆలోచిస్తే, నేనెత్తి చూపిన 1 నుండి 6 పాయింట్లో దోషాలు దోషాలు కాకుండా పోతాయా? అన్నది నా ప్రశ్న. ఆ దృష్టితో అవి దోషాలు కావు అని అన్నట్లయితే, ఎందుకు కావో వివరించాలని నేను కోరుకుంటాను.
    That is what I am looking for. In this essay, I believe that, I did not try to use a different/generic view-point/framework at all. All I tried is to point out some issues in rA.rA.’s application of Dialectics to this novel (and some other analysis). I believe that the problems that I am seeing as problems are not because of difference in thought process or view-points. I think they are more fundamental logic problems (either mine or rA.rA.’s). 🙂
    Ofcourse, I am open for correction.

  7. సౌమ్య

    క్షమించాలి. నేను వాడిన టర్మినాలజీ తప్పు. నా ఉద్దేశ్యం: రా.రా. ఆలోచనా విధానం వేరు, మీ ఆలోచనా విధానం వేరు అని. ఆయన వివరిస్తున్నప్పూడు మీరే అన్నట్లు, గతితార్కికాన్ని (Dialectics ని తెలుగులో అదే అంటారు కదా?) దృష్టిలో ఉంచుకున్నారు. మీరు వివరిస్తున్నప్పుడు మామూలుగానే, ఏ వాదాల పరిధిలోనూ లేనట్లు అనిపించింది. ఇక నేను వాడిన “ఫ్రేం వర్క్” లో చెప్పాలని చూసింది కూడా ఇదే. ఆయనకి ఒక ఫ్రేంవర్క్ ఉంది – అది “specific”. మీ ఫ్రేంవర్క్ “generic” అని. 🙂

  8. కామేశ్వరరావు

    సౌమ్యగారు,

    నేనే “ప్రేం వర్క్” మీద ఆధారపడి నవలని చదవలేదండి. నేను చేసిన విమర్శకూడా ఏ ఫ్రేంవర్క్ మీదా ఆధారపడి చేసినది కాదు (మీకలా అనిపిస్తే అదేమిటో వివరించండి). రా.రా. విశ్లేషణ ఒక ఫేంవర్క్ మీద ఆధారపడి చేసినది. ఆ ఫ్రేంవర్క్ ని యీ నవలకి అన్వయించడంలో నాకు కనిపించిన దోషాలు, పొరపాట్లు నేను ఎత్తిచూపాను.
    ఆరవ పాయింటు అసలు ఫ్రేంవర్క్ కి సంబంఢం లేనిది.
    ఏడవ పాయింటు – అతని ఫ్రేంవర్క్ ఇతర చారిత్రక నవలలకి అన్వయించడాన్ని ప్రశ్నించాను.
    వ్యాసంలోని రెండవ పేరా కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. అందులో చర్చించడానికి ఏమీ లేదు.
    తక్కిన పాయింట్లు తార్కికంగా విశ్లేషించ దగినవే అని నేననుకుంటున్నాను.

    నేను పూర్తిగా వేరే ఫ్రేంవర్క్ మీద ఆధారపడినట్టయితే (లేదా రా.రా. ఫ్రేంవర్క్ ని పూర్తిగా తిరస్కరించినట్టయితే) అప్పుడింక రా.రా. విశ్లేషణని తప్పుపట్టడంలో అర్థం లేదు కదా!

  9. సౌమ్య

    నేను ఆ నవల ఇంకా చదవలేదు కానీ, రా.రా. గారి విమర్శ మాత్రం చదివాను. నవల గురించి ఏమీ తెలీకుండా చదివినందువల్ల కాబోలు, రారా వ్యాసం నాకు నచ్చింది. ఆయన స్పష్టంగా, చక్కగా తానేమనుకుంటున్నాడో చాలా బాగా చెప్పారు అనుకున్నాను. ఇప్పుడూ అదే అనుకుంటున్నా అనుకోండి, కాకపోతే, ఆయన అర్థం చేసుకున్న ఫ్రేం వర్క్, మీదీ వేరు వేరని ఇప్పుడు మీ వ్యాసం, దాని తరువాత రాసిన వివరణ వ్యాసం చదివాక అర్థమైంది.

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  10. పక్కింటబ్బాయి(పవన్ సంతోష్ సూరంపూడి)

    మొదటిసారి నేను చదివినప్పుడు ఈ ముందుమాట నన్ను చాలా బాధపెట్టింది. ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన చారిత్రిక నవలలు ధూర్జటి, మల్లారెడ్డిలను అవమానించినట్టు భావించి బాధపడ్డాను. తర్వాత్తర్వాత ఆ రచయిత పద్ధతి ఆయన పెట్టుకున్న కళ్ళద్దాలు గమనిచ్ని ఇక పట్టించుకోలేదు. ముఖ్యంగా సాంప్రదాయవాదులు బ్రిటీషర్లకి తాబేదార్లన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు నా కళ్లు తెరిపించాయి. ఎందరో సాంప్రదాయవాదులు స్వరాజ్యం కోసం పోరాడిన వారున్నా చూడలేని ఆయన పద్ధతి అర్ధమైంది

Leave a Reply