నాకు నచ్చిన పద్యాలు

(ఈ వ్యాసం మొదట NATS సావనీరులో వచ్చింది. పుస్తకం.నెట్ లో ప్రచురణాకు అనుమతిచ్చిన వైదేహి గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*****************
పద్యాలతో అనుబంధం ,ముఖ్యంగా చిన్న తనంలో విని,నేర్చుకున్న పద్యాలతో అనుబంధం వాటి పఠనానందం తో పాటు అనేక జ్ఞాపకాలతో ముడిబడి ఉంటుంది. నేను విని నేర్చుకున్న మొదటి పద్యాలు మా నాయనమ్మగారి దగ్గరే .ప్రతి రోజూ, మధ్యాహ్నం సాయంత్రం లో కలిసిపోయే చల్లని వేళ, ఆమె తన వ్యాస పీఠం తెరిచి ,కళ్ళజోడు పెట్టుకుని మంద్రస్థాయిలో భారతమో, భాగవతమో చదివేవారు. చుట్టూ చెదురుమదురుగా ఉన్న మేమంతా ఓరగా ఆమె చదివే పద్యాలు వింటూ ఉండేవారం. భారతంలో వచ్చే చాలా పిట్ట కధలు నాకు ఆమె ద్వారా తెలిసినవే . తర్వాత నేను నేర్చుకున్న పద్యాలు మా నాన్నగారు ఎన్నో సాయంత్రాలు ఆరుబయట వెన్నెల్లో గొంతెత్తి చదివిన పద్యాలు . మా నాయనమ్మగారి గొంతులో పూర్తిగా భక్తిపారవశ్యం కనిపిస్తే మా నాన్నగారి గొంతులో భక్తి తో పాటు మంచి సాహిత్యానికి స్పందించటం ద్వారా పొందే ఆనందం కూడా కనబడేది .ఏది ఏమైనా ఈ నాటివరకూ నేను గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడూ చదువుకునే పద్యాలలోఎక్కువశాతం నేను వారిద్దరి ద్వారా విని నేర్చుకున్నవే .

ఛందోబద్ధంగా వ్రాసిన ఒక మంచి పద్యాన్ని చూసినప్పుడల్లా నాకు అబ్బురం కలుగుతుంది. అందంగా ,బలంగా ,చక్కటి సౌష్ఠవంతో నిర్మించిన కట్టడపు సౌందర్యాన్ని చూసి కలిగే ఆనందం,ఆశ్చర్యం కలుగుతాయి. నిర్దుష్టమైన యతి,ప్రాస, నియమాలను సూత్రీకరించి మిరుమిట్లుగొలిపే పద్యసౌధాలను నిర్మించే చాతుర్యాన్ని ఛందస్సులో నిక్షిప్తం చేయటం లో ఉన్న ప్రతిభ , గొప్ప ఇంజనీరింగ్ మేధస్సులా అనిపిస్తుంది. నాకు నచ్చిన కొన్ని ప్రాచీనాంధ్రపద్యాలలో నాకు తోచిన విషయాలు,ఆకట్టుకున్న విశేషాల గురించిన నా అభిప్రాయాల సంకలనమే ఈ వ్యాసం .

ముందుగా ఆదికవి నన్నయ్యగారి చివరి పద్యంతో ప్రారంభిస్తాను.ఈ పద్యం అరణ్యపర్వంలో చతుర్ధాశ్వాసంలో శరదృతువర్ణన. నేను ఆరవతరగతి చదివేప్పుడు ఒక కొత్త తెలుగు మాస్టారు టెక్స్టు పుస్తకం లో లేని మంచిపద్యాలు కొన్ని చెప్పమని పిల్లలందరినీ అడిగినప్పుడు మా నాన్నగారి దగ్గర ఆసరికే నేర్చుకున్నఈ పద్యాన్ని చదవటం నాకింకా గుర్తు.

శారద రాత్రులు జ్వలల సత్తర తారక హారపంక్తులై
జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధ బంధు రో
దార సమీరసౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచి బూరములంబర బూరితంబులై

ఎంతో అందమైన పద్యం. ఉజ్జ్వలంగా వెలిగే నక్షత్ర మాలికలతో, వెదజల్లిన పుప్పొడి లాంటి వెన్నెల తో మెరిసే శరత్కాలపు రాత్రుల సౌందర్యం గురించిన వర్ణన .అయితే సందర్భానికి తగినట్లే,ఎంతో ఆహ్లాదకరంగా కలువలు విచ్చినట్లు ,సుగంధపు గాలులు వీచినట్లు ఆయన ఎన్నుకున్న పదాలలాలిత్యం, ధార ఈ పద్యానికి ఎంతో సొగసును తెచ్చాయి.

సరళంగా,సూటిగా,వాగాడంబరం లేకుండా చక్కటి తెలుగులో పద్యాలు వ్రాయటం తిక్కన గారి కవితా లక్షణం. అయితే సందర్భోచితంగా భావానికి తగిన గంభీరమైన భాష వాడటానికి ఆయన ఏమాత్రం వెనకాడలేదని నిరూపించే పద్యం ఒకటి నాకు చాలా ఇష్టం . భాషను ఔచిత్యంతో,పదునుగా వాడుకోగలగటంలోనే కవి నిజమైన ప్రతిభ కనబడుతుంది.

భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త జా
లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే

ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్ని చూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది. భీష్మద్రోణ కృపాదులవంటి అతిరధ,మహారధులు, వేసవిసూర్యుడి ప్రతాపం లాంటి శౌర్యంగల వీరులు నిండివున్న అపారమైన సేననుగూర్చి చెప్పేటప్పటి భాషకు ఎంతటి రాజసం ,హంగు ఉండాలో ఈ పద్యం చూపిస్తుంది. పైపెచ్చు చెబుతున్నది సముద్రంలాంటి సేనను చూసి భయభ్రాంతుడైన రాకుమారుడు ఉత్తరకుమారుడు. భయపడ్డ అతనికనులకు ఈ ఉద్దండమైన సేన మరీ ఉగ్రంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే ,పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే ,ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది. ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం. “శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి ,ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది.ఇది ఆ పద్యం/కవి గొప్పదనం . అంతేకాక యుద్ధభూమి పై వ్రాసిన పద్యం ”శార్దూలం”లో వ్రాయటం లో కూడా చక్కటి ఔచితి వుంది. నా చిన్నప్పుడు మాకు తెలుగు ఎంతబాగా వచ్చో పరీక్ష చేయటానికి మా నాన్నగారు ఈ పద్యపాదాలు డిక్టేట్ చేసి తప్పులులేకుండా రాయగలమో లేదో చూసేవారు .

నాకు నచ్చిన మరో రెండు పద్యాలు ఎర్రన గారివి. వాటిలో ఒక పద్యం పైన చెప్పిన నన్నయ్య గారి అరణ్యపర్వం లో ఆఖరి పద్యానికి కొనసాగింపుగా ఎర్రన గారు వ్రాసిన మొట్ట మొదటి పద్యం. అచ్చంగా నన్నయ్యగారి శైలిలో,ఆయన కల్పించిన వాతావరణానికి అనుగుణమైన కవిత్వ వాతావరణాన్ని కల్పిస్తూ అంతే ఆహ్లాదకరంగా సాగుతుంది.ఈ రెండు పద్యాలు ఒక కవి వ్రాసినవి కావంటే నమ్మకశ్యము కానంత అభేదం గా ఉంటాయి .అంతేకాదు,ఇలా వ్రా యటం లో గొప్ప కావ్యౌచిత్యమే కాకుండా, నన్నయ్య గారిమీద ,ఆయన కవితా ప్రతిభ మీద ఎర్రన గారికున్న గౌరవం స్పష్టంగా కనబడుతుంది.ఒక ఉద్దండపండితుడి పట్ల మరో ఉద్దండ పండితుడు చూపించే స్పర్ధలేని గౌరవానికి, అర్పించే నివాళికి ఇంతకంటే నిదర్శనం ఏముంది!

స్ఫురదరుణాం శురాగరుచి బొంపిరి వోయి నిరస్త నీరదా
వరణ ములై దళత్కమల వైభవ జృంభణ నుల్లసిల్ల ను
ద్ధరతర హంసారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళల జూడగన్

ఇంత ఆహ్లాదంగా శారద రాత్రుల వర్ణనచేసిన ఎర్రన గారు “హరివంశం” లో “శమంతకోపాఖ్యానం” లో వ్రాసిన మరో పద్యంలో భీభత్సాన్ని కూడా అంటే ప్రతిభావంతంగా వర్ణిస్తారు. ఈ పద్య సందర్భం : తనపై వచ్చిన అపవాదు తొలగించుకోవటానికి ప్రసేనుడిని,శమంతకమణి ని వెతుకుతూ వెళ్ళిన శ్రీకృష్ణుడు అరణ్యంలో ప్రసేనుడి కళేబరాన్ని చూసిన దృశ్యం .

బలవచ్ఛింహ చపేట పాటిత తనుప్రభ్రష్ట భూషాంబరా
కులకేశ ప్రకరున్ కరస్ఖలిత ఖడ్గున్ ముక్తపల్యాణ సం
వలిత గ్రీవ వికీర్ణ కేసరి మృగాశ్వప్రాంత సంస్థున్ రజః
కలుష శ్మశ్రుముఖున్ ప్రసేను గనియెన్ గ్రవ్యాద సంవేష్టితున్

ఫొటోగ్రాఫిక్ డీటైల్ తో కధావాతావరణంలోకి పాఠకుడిని ఎలా తీసుకువెళ్ళాలో తెలియడానికి కధకులందరూ ఈ పద్యం చదవాలి . కేవలం ఒక దృశ్యాన్ని వర్ణించటం ద్వారా అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగిఉంటాయో, మన ఊహకు అందేటట్లు ఈ పద్యంలో ప్రతిపంక్తి ద్వారా ప్రసేనుడికి సింహానికి జరిగిన పోరాట భీభత్సాన్ని, దాని పర్యవసానాన్ని మన కళ్ళకి కట్టినట్లు కవి చెప్పకనే చెప్పటం జరిగింది. చివరలో “గ్రవ్యాద సంవేష్టితున్ “ అనగానే మనకి అతని అంతిమ స్థితిని చూసి ఒక జలదరింపు,జాలి కలుగుతాయి.

నా చిన్నతనం నుండీ కొన్ని వందలసార్లు మా నాన్నగారు గొంతెత్తి పాడగా నేను విన్న పద్యాలు “గజేంద్రమోక్షం” పద్యాలు . అందువల్లనో, లేక ,”బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకను” అమ్ముకోనని నిర్ద్వందం గా చెప్పిన ఆయన వ్యక్తిత్వం మీద గౌరవమో కానీ పోతనగారి పద్యాలంటే నాకు చాలా ఇష్టం . గజేంద్రమోక్షంలోని పద్యాలు దాదాపు అన్నీ ప్రార్ధనా పద్యాలుగానే చలామణి అయినా ఈ పద్యాలలో భక్తిభావమే కాకుండాఎప్పుడో ఒకప్పుడు దాదాపుగా అందరి జీవితాలలో ఎంతో కొంత అందరూ అనుభవించే ఒక సార్వజనీనమైన మానవ వేదనను మనం చూస్తాం. ఆమేరకు ఈ పద్యాలతో మమేకం అవడానికి,వాటి కవితా సౌందర్యాన్నిఆస్వాదించడానికి మన మతవిశ్వాసాలు, ఆస్తికత్వం, నాస్తికత్వం అడ్డం వస్తాయని నేననుకోను.

నానానేక పయూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశ లక్షకోటి కరిణీ నాధుండనై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలందుండలే
కీ నీరాశ నిటేలవచ్చితి, భయం బెట్లోకదే యీశ్వరా!

తను తీసుకున్న నిర్ణయాల పట్ల పునరాలోచన, ఆ నిర్ణయం తాలూకు పరిణామాల గురించిన భయం,వేదన,పూర్వ వైభవాన్ని ,ప్రస్థుత దుస్థితిని తలచుకుని జీవులు పొందే విచారం ఏంటో కవితాత్మకంగా,ఆర్ద్రంగా చక్కటి ధారతో ఈ పద్యంలో చూపిస్తారు.

గజేంద్రమోక్షంలోనే మరోపద్యం-

మొరసెన్ నిర్జర దుందుభుల్;జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం ;బువ్వుల వానజల్లు గురిసెన్ ;దేవాంగనా లాస్యముల్
పరగెన్;దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె,సా
గర ముప్పొంగె తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై

ఈ పద్యంలో నిష్కారణంగా పెద్ద ఆపదలో చిక్కుకున్న వ్యక్తి కి ఆ ఆపద ,విపత్తు తప్పిపోయిన తర్వాత కలిగే ఒక గొప్ప ఊరట,ఆనందం తో పాటు ఒక మంచి వ్యక్తికి కలిగిన కష్టం తొలగినపుడు, ఒక దుర్మార్గుడు శిక్షించబడినపుడు,చుట్టూ ఉన్న సమాజం లో కలిగే హర్షా తిరేకాన్ని “జీవ జయశబ్దధ్వానముల్ నిండె “ అనడం లో చక్కగా ప్రతిబింబిస్తారు.ప్రకృతి స్పందించిన విధాన్ని అందంగా “సాగరముప్పొంగె తరంగ చుంబిత ముఖాంభోజమై..” అనడంలో ఎంతో జుబిలియేషన్ ఉంది.

నాకు చాలా నచ్చిన శ్రీనాధుడి పద్యాలలో ఒక పద్యం “కాశీఖండం” లోని ఈ పద్యం.

“ఆనందంబుల యర్ధరాత్రముల జంద్రాలోకముల్గాగాయగా
నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కా
శీనాధున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదున్
మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలోన్”

గొంతెత్తి చదివినపుడు వెన్నెలలో నిద్రపోతున్న కోనేటి పక్కగా,ఏ కొండ శిఖరం మీద ఆలయాన్ని చేరుకోటానికో అంచెలంచెలుగా మెట్లెక్కుతున్నట్లు ఈ పద్యం నడక సాగుతుంది. భక్తి పారవశ్యానికి తోడైన శబ్ద సౌందర్యం,లయ ఈ పద్యానికి చక్కటి వన్నె తెచ్చాయి .

చివరగా నాకు చాలా ఇష్టమైన పెద్దన గారి అందమైన పద్యం –
ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి భా
షాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షాపర తంత్రు డంబురహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్య తనూ విలాసుడై

ఈ పద్యం మనుచరిత్ర లో ప్రవరుడి పాత్ర ప్రవేశం లోని పద్యం.వరూధిని దేవతా స్త్రీ . మానవులది లౌకికమైన సౌందర్య మయితే పురాణ పద్ధతి ప్రకారం దేవతలది అలౌకికమైన సౌందర్యం. సామాన్య మానవుడైనా వరూధిని వంటి దేవతా స్త్రీ ని ఆకర్షించగల విశేష సౌందర్యం కల మానవుడి పాత్ర ప్రవరుడిది.అటువంటి వాని పాత్రచిత్రణ లో అతని సౌందర్యాన్ని గురించి పెద్దనగారు వర్ణిస్తూ వ్రాసిన పద్యంలో వున్న లాలిత్యము,సొగసు ప్రవరుడి సౌందర్యాన్నిపాఠకుడికి స్ఫురింపజేసేంత అందమైనవే కాకుండా అతని సౌందర్యౌద్ధత్యాన్ని పాత్ర పరిచయంలోనే పాత్రోచితంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది కూడా . ముఖ్యంగా “మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి “ అనడంలోనూ , “ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుడై ” అనడంలోనూ పెద్దన గారు ఈ పద్యరచనలో చూపించిన సొగసు ప్రవరుడి సౌందర్యాన్నిఈ పద్య సౌందర్యం ద్వారా ప్రతిబింబిస్తుంది. తద్వారా ముందు జరగబోయే కధలో వరూధిని కి ప్రవరుడిపై కలుగబోయేబలీయమైన ఆకర్షణకి పాత్ర ప్రవేశం లోనే చక్కటి పునాది వేసారు. అతని అత్యున్నత గుణగణాల్ని,ధర్మనిరతిని, వర్ణించడంలోని ఉదాత్త సమాసాలు కూడా ప్రవరుడి వ్యక్తిత్వచిత్రణకి బలం చేకూర్చాయనడంలో సందేహం లేదు.

ఇంకా అపార ప్రతిభ కల ప్రాచీన కవులు ఎందఱో వ్రాసిన మరెన్నో తీయని పద్యాలు,అద్భుతమైన పద్య సాహిత్యం మన అదృష్టం కొద్దీ అందుబాటులో ఉంది.అయితే తమ నాటకాలు,అవధానాల ద్వారా పద్యాన్ని పామర జన హృదయాల్లోకి కూడా తీసుకువెళ్ళి పద్యానికి ఒక అనూహ్యమైన ప్రాచుర్యం తీసుకు వచ్చిన పండిత కవులు గా తిరుపతి వెంకట కవులకి,కొప్పరపు కవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక పద్యకవిత్వాన్ని సుసంపన్నం చేసిన విశ్వనాధ, రాయప్రోలు, నాయని, జాషువా, కరుణశ్రీ, తుమ్మల, దువ్వూరి, వేదుల, కొడాలి వంటి కవిదిగ్గజాలు ఎందఱో. నిజానికి భాష మీద పట్టు, శబ్ద సౌందర్యం,లయ తెలిసి మంచి కవిత్వం వ్రాసిన తిలక్,శ్రీశ్రీ ,కృష్ణశాస్త్రి వంటి ఆధునిక కవులు చాలామంది పద్యసాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారు,అందంగా పద్యాలు వ్రాయగలిగిన వారు కూడా.అయినా మరెవ్వరూ పద్యాలు వ్రాయకపోయినా పద్యసాహిత్యానికి వచ్చిన లోటు లేదు.అంతటి సుసంపన్నమైన పద్య సాహిత్యం మనకుంది.పద్యాన్ని నిలబెట్టటానికి ఎవరూ ప్రయాస పడక్కర్లేదు.రకరకాల ఇజాల,నానావాదాల కవితారీతుల జడివానలను అలవోకగా తట్టుకుని నిలబడ్డ సమున్నతమైన కోట మన పద్యసాహిత్యం. ఆమాటకొస్తే పద్యమైనా,గద్యమైనా వచనకవిత్వమైనా ప్రతిభగల కవిత్వం,నిలబడే కవిత్వం అప్రతిహతంగా ప్రజల హృదయాల్లో నిలచిపోతుంది.

డా.వైదేహి శశిధర్
05/09/2011

You Might Also Like

5 Comments

  1. n.pandari

    మంచి పద్యాలను అందించారు చాలాదన్యవాదాలు

  2. rajeshwari.n

    నమస్కారములు.
    మంచి పద్యాలను గుర్తు చేసారు. అవి మీకు నచ్చినవే కాదు అందరికీ నచ్చినవి . నచ్చి తీరేవి .ధన్య వాదములు.

  3. M.V.Ramanarao

    మీరు ఉదహరించిన పై పద్యాలన్నీ పూర్వపు మహాకవుల ప్రసిద్ధ పద్యా లే.ఈ సందర్భంలో నేను రచించిన పద్యాల్లో ఒక దాన్ని చదవండి.

    నిలిచె హిమాంబువుల్ కుసుమ నేత్రములందు,సరోజమాలికా
    కలిత జలాశయంబులును,కళ్ళము లందున ధాన్య రాశులున్
    దళిత విశీర్ణ పత్రముల దాకుచు వీచెడి శీతవాతమున్
    చలిచలి యంచు నిల్వెడల జాలగ నోపని మానవాళియున్,’
    (హేమంతము నుండి.)
    ధన్యవాదాలు రమణారావు.ముద్దు

  4. శ్యామలరావు

    చాలా చాలా మంచి పద్యాలను గుర్తుచేసారు. ధన్యవాదాలు.

  5. narasimharao mallina

    మంచి పద్యాలను గుఱించిన మంచి పరిచయం. అభినందనలు.

Leave a Reply