మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-1
Who is the most respected woman figure in the entire history of Telugu film industry ? అని ఎవఱైనా తెలుగువాళ్ళని అడిగితే మనం చెప్పుకోక తప్పని పేరు మహానటి సావిత్రిది. ఆ విధంగా తెలుగువాళ్ళకి అభినయకళాపరంగా ఒక గొప్ప వారసత్వాన్ని ప్రసాదించి మన సంస్కృతిని పరిపుష్టం చేసిపోయిన మహామహురాలు ఆమె. ఆమె అందఱిలో ఒకఱు కారు. అందఱికీ కలిపి ఒక్కఱే. మహానటి గుఱించి మా తరంలోనే తెలిసింది తక్కువంటే ఇహ ఈ తరానికి అసలేమీ తెలీదు. కారణం – పాత సినిమాలు థియేటర్లలో విడుదల కావడమే మానేశాయి. అఱాకొఱా వస్తే గిస్తే టీవీ ఛానళ్ళలో అరుదుగా ప్రసారమవుతూంటాయి. ఆ నటీనటుల్లో ఎవఱు ఎవఱో ఈనాటి యువప్రేక్షకులకి సరిగా తెలీదు, ఎవఱైనా పెద్దలు పక్కనుండి “ఈ నటి పేరిది, ఈ నటుడి పేరిది” అని ప్రత్యేకంగా రన్నింగ్ కామెంటరీ ఇస్తే తప్ప ! అసలు నేటి యువతరానికి నాటి నలుపు-తెలుపు సినిమాలంటే మాచెడ్డ చిఱాకు, అసహ్యం కూడా ! అవి వస్తున్నాయంటే చాలు, ఛానల్ మార్చేస్తారు. అంతే తప్ప మన తెలుగుసినిమా ఏయే కాలాల్లో ఎలా పరిణామం చెందిందో, లేదా ఆ కాలంలో సినిమాలంటే ఎలాంటి కథలు తీసేవారో, ఎలా తీసేవారో, ఎలా నటించేవారో ? తెలుసుకుందామనే వట్టి చారిత్రిక కుతూహలం కోసమైనా పాత సినిమాలు చూడరు.
ఇలాంటి ఆధునిక ప్రేక్షకులకి ఆ మహానటి జీవితాన్ని సవివరంగా, విశదంగా పరిచయం చేయాలనే ప్రబల పవిత్ర సంకల్పంతో శ్రీమతి పల్లవిగారు అనేక వ్యయప్రయాసలకోర్చి సంతరించిన జీవితచరిత్రే “మహానటి సావిత్రి – వెండితెర సామ్రాజ్ఞి” అనే ఈ ఉద్గ్రంథం. అయితే ఒక విశేషం ఉంది. రచయిత్రి దీన్ని చరిత్రలా కాక నవలారూపంలో నవరసాలూ మేళవించి, సంఘటనలతో, సంభాషణలతో వర్ణనాత్మకంగా వ్రాశారు. అందుచేత ఈ రచనకి పఠనీయత (readability) ఇనుమడించింది. చదువుకుంటూ పోతే పుటలు చకచకా అలవోకగా తిరిగిపోతూంటాయి. అయితే కాల్పనిక సాహిత్యాన్ని అనుకరించిన ఈ శైలి మూలాన ఒక ఇబ్బంది కూడా లేకపోలేదు. భావిచరిత్రకారులు ఇలాంటి రచనల్ని ప్రమాణంగా తీసుకోవడానికి సంకోచించే అవకాశం ఉంది. ఉదాహరణకి – సావిత్రికి ఆనాటి ప్రఖ్యాత హాలీవుడ్ నటి సూజన్ హేవార్డ్ నుంచి ప్రశంసాపూర్వకమైన లేఖ వచ్చినట్లు రచయిత్రి వర్ణించారు. అయితే అది కల్పిత ఘటనేననీ, అలాంటి లేఖ ఏదీ రాలేదనీ తానే మఱోచోట తెలియజేశారు. అలాగే సావిత్రికి చిన్నతనం నుంచి ప్రోడతనం దాకా చాముండి అనే alter ego ఉన్నట్లు వర్ణించారు. ఈ పుస్తకంలోని ప్రతిఘట్టంలోనూ ఆమె ప్రత్యక్షమైపోతూంటుంది. మఱి ఇదెంతవఱకూ నిజమో మనకి తెలియదు. ఏదేమైనా రచయిత్రి ఇలాంటివి చేయకుండా ఉంటే బావుండేదేమో ననిపిస్తుంది. ఎందుకంటే జీవిత చరిత్రల్లో ఇలాంటి కల్పనలు/ సవరణలు ఒకటి-రెండు చోటుచేసుకున్నా యావత్తు పుస్తకాన్నే అనుమాన దృక్కులతో పరికిస్తాయి భావితరాలు.
ఈ పుస్తకాన్ననుసరించి – మహానటి కీ.శే. సావిత్రీగణేశన్ క్రీ.శ. 1936 జనవరి 4 వ తేదీన గుంటూరుజిల్లా తెనాలి తాలూకా చిఱ్ఱావూరులో జన్మించారు. కాదు, క్రీ.శ. 1935 లోనే జన్మించారని ఇతర ఆకరాలు (sources). సావిత్రి తల్లి అల్లాడ సుభద్రమ్మగారు. తండ్రి నిశ్శంకర గురవయ్యగారు. మహానటికి మారుతి అనే అక్క కూడా ఉంది. సావిత్రికి ఆర్నెల్ల వయసప్పుడే గురవయ్యగారికి హఠాత్తుగా టైఫాయిడొచ్చి కన్నుమూయడంతో ఆ కుటుంబం అనాథ అయింది. దివంగత గురవయ్యగారికి కాస్తో కూస్తో ఆస్తులున్నప్పటికీ బంధువులు చేసిన ద్రోహం వల్ల అవి వీరికి సంక్రమించలేదు. అందువల్ల జఱుగుబాటు లేని సుభద్రమ్మగారు తన పసిపిల్లలిద్దఱినీ తీసుకుని అక్కగారైన దుర్గాంబగారింటికి విజయవాడ వెళ్ళక తప్పలేదు. దుర్గాంబగారి భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్యగారు. ఆయన ఆ నగరంలోనే మోతుబరి వ్యాపారులైన గోగినేని పెద్దబ్బాయిసోదరుల దగ్గఱ కారు డ్రైవరుగా, ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తూండేవారు. అయినా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు పస్తులు తప్పేవి కావు. రచయిత్రి పల్లవిగారి మాటల్లో – “…. శుచీశుభ్రం లేని వీథి, నలుగురి మీద ఎంత శుభ్రంగా ఉంచాలన్నా వీలుగాని నాలుగు అడుగుల గది. పస్తులు. డబ్బులు అరువు అడగటం. ఇది సావిత్రి బ్యాక్‌గ్రౌండ్, హంబుల్ బ్యాక్‌గ్రౌండ్. కానీ ఈ సంగతి చెప్పుకోవటానికి సావిత్రి ఏనాడూ సిగ్గుపడలేదు. దాచేందుకూ ప్రయత్నించలేదు…. కానీ 1959 నుంచి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది, ఏ పత్రికా తన బ్యాక్‌గ్రౌండ్ గురించి రాయకూడదని….”
సావిత్రీ, ఆమె అక్కగారూ ఇద్దఱూ అక్కడి కస్తూరీబాయి మెమోరియల్ స్కూల్‌లో చేఱారు. వాళ్ళు బడికేళ్ళే దార్లో ఓ డాన్సు స్కూలుండేది. తిరిగొచ్చేటపుడు నాట్యం చూసే పిల్లల్ని చూసేది సావిత్రి. ఎవఱూ నేర్పకుండానే 8 ఏళ్లకే నాట్యగత్తెలా మెడతిప్పటం వచ్చేసింది. ఆ చిన్నవయసులోనే చూసినవారెవ్వఱూ సావిత్రిమీదనుంచి చూపు మఱల్చుకునేవారు కారు. ఒకటికి రెండుసార్లు చూసేవారు. బుగ్గలు పట్టుకుని లాగేవారు. అందంలో రకాలున్నాయి. తుచ్ఛమైన శారీరిక మోహాన్ని పురుషులలో రగులుకొల్పే అందాలు కొన్ని. చూడంగానే పూజ్యభావాన్ని కలిగిస్తూ “ఇలాంటి అక్కో, చెల్లెలో నాకుంటే బాగుండు”ననిపించేలాంటి దేవీకళతో ఉజ్జ్వలంగా వెలిగిపోయే అందాలు కొన్ని ! సావిత్రి అందం ఈ రెండో శ్రేణికి చెందినది. అందఱూ తన అందాన్ని పొగడటంతో సావిత్రికి తన అందం మీద విపరీతమైన నమ్మకం. ఈ విషయాన్ని చెబుతూ రచయిత్రి ఇలా అంటారు : “…ఒక్కమాట. సావిత్రి తన అందాన్ని దేనికీ పణంగా పెట్టాల్సిన అవసరం రాలేదు.” అని !
నిజమే. సావిత్రి సాధించిన విజయాల్లో కనీసం ఒక్క పదోవంతైనా ఈనాడు సాధించాలంటే ఇప్పటి హీరోయిన్లు అడుగడుగునా అన్నిటికీ రాజీపడాల్సిందే. ఎన్నో పరిస్థితులకి లొంగిపోవాల్సిందే. ఎంత పేదఱికంలోంచి వచ్చినా సావిత్రికి ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. కారణం – ఆమె ఒక బంగారుయుగంలో జన్మించడం కావచ్చు. ఆ యుగానికి చెందిన నటీమణి కావడం కావచ్చు. ఆనాటి సినిమావాళ్ళు నటీమణుల నుంచి అలాంటి సేవల్ని ఆశించని పాతకాలం మనుషులు కావడమూ కావచ్చు. ఆ విషయం సావిత్రే ఒకసారి వెల్లడించింది. హీరోయిన్స్ అవ్వాలనుకుని తన దగ్గఱికొచ్చిన ఇద్దఱు గుంటూరమ్మాయిలకి సినిమారంగం వద్దని నచ్చజెబుతూ, “మా కాలంలో అందమూ, అభినయమూ చూసి సినిమాల్లో తీసుకునేవారు. మేమంతా అలాగే వచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయమ్మా ! మీరు ఇంటికి వెళ్ళిపోండి” అని తిరుగుప్రయాణపు ఖర్చులిచ్చి పంపేసింది.
మళ్లీ మన కథకొస్తే – బాలసావిత్రి విజయవాడలోనే ఒక నాట్యోపాధ్యాయుల (పేరు పూర్ణయ్యశాస్త్రిగారట) పాఠశాలలో చేఱి చాలా రోజులు అక్కడ నాట్యం అభ్యసించింది. ఆ రోజుల్లోనే అరుణోదయ నాట్యమండలి అనే నాటకాల సంస్థవారు ఆ పాఠశాలకొచ్చి తమ సంస్థలో వేషం కట్టడానికి బావుందని చెప్పి సావిత్రిని తమవెంట తీసుకెళ్ళారు. ఆ సంస్థ ద్వారా సావిత్రి కేవలం 11 ఏళ్ల వయసుకే, అంటే ఇంకా సినిమాల్లో చేఱకముందే ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధురాలయిందంటే, వేలాది జనం సావిత్రి అనే ఆ తెలివైన చలాకీ చిన్నపిల్లని చూడ్డం కోసమే టిక్కెట్లు కొనుక్కుని మఱీ ఎగబడేవారని చెప్పినప్పుడు ఈనాటివారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్వతహాగా కళలంటే యథార్థమైన ఆసక్తి ఉన్నప్పటికీ సావిత్రి ఆ రోజుల్లో నాటకాల కంపెనీల్లో చేఱడానికి ప్రధాన ప్రోద్బలం – ఇంటి దగ్గఱ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, పెదనాన్నకి సహాయం చేయాలనుకోవడం. ఈ నాటకాల గొడవలో పడి ఆమె చదువు సరిగా సాగింది కాదు. ఎనిమిదో తరగతితో ఆపేయాల్సి వచ్చింది. అపేస్తేనేం, నాటకాల ద్వారా ఆమెకి బాల్యంలోనే కొంగర జగ్గయ్య, ఎన్.టి.రామారావులాంటివాళ్ళతో పరిచయాలు కలిగాయి. ఆ రోజుల్లో ఆ మహానటులు అప్పటికింకా సినిమాల్లో స్థిరంగా కుదురుకోలేదు. యౌవనంలో వారు గుంటూరు – విజయవాడ ప్రాంతాల్లో నాటకాలు వేస్తూండేవారు. జగ్గయ్యకైతే సొంతంగా ఒక నాటకాల కంపెనీ ఉండేది. ఎన్.టి.ఆర్. కూడా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (N.A.T) పేరుతో ఇంకో నాటకాల కంపెనీ నడుపుతూండేవారు. పెద్దయ్యాక ఈ పరిచయాలు ఆమెని ఉన్నత శిఖరాగ్రాలకి తీసుకెళ్ళాయి.
1948 లో కాకినాడలో నాటకాల పోటీలు జఱిగినప్పుడు సావిత్రి కూడా వెళ్ళి పాల్గొన్నది. అప్పుడు అక్కడికి ప్రముఖ హిందీ హీరో పృథ్వీరాజ్ కపూర్ వచ్చాడు. ఆయన సావిత్రిని చూసి చాలా ముచ్చటపడి “మహానటివవుతామ్మా !” అని ఆశీర్వదించాడు. నాటకరంగం క్రమక్రమంగా క్షీణిస్తోందని గమనించి 1948 లో ఆమెని మద్రాస్ తీసుకెళ్ళి సినిమాల్లో చేర్చాలని వాళ్ళ పెదనాన్నగారు తీవ్రంగా ప్రయత్నం చేసి ఘోరంగా విఫలమయ్యారు. ఆ రోజుల్లో సినిమా అంటే ఏడాదిపాటు తీసేవారు. కనుక వీళ్లు వెళ్ళేసరికే చాలా సినిమాలకి పాత్రధారులు నిర్ణయమైపోయి ఉన్నారు. కాబట్టి మఱుసటి సంవత్సరం రమ్మని చెప్పారు స్టూడియోలవాళ్ళు. కనుక సావిత్రీవాళ్ళు విజయవాడ తిరిగొచ్చేశారు. అప్పట్లో ఎన్.టి.ఆర్. కంటే నాగేశ్వరరావంటేనే జనంలో క్రేజ్ ఎక్కువ. ఆ సంవత్సరం విజయవాడ జైహింద్ టాకీస్ లో ఆయన నటించిన “బాలరాజు” సినిమా శతదినోత్సవాల సందర్భంగా ఏ.ఎన్.ఆర్. అక్కడికి వచ్చారు. ఆయన్ని చూడాలని అందఱితో పాటు బాలసావిత్రి కూడా ఎగబడిందట. జనరద్దీ, తోపులాటలో ఆ పక్కనున్న ముఱిక్కాలవలో పోయి పడిందట. అనంతరకాలంలో ఆమె అనేక చిత్రాలలో ఆ ఏ.ఎన్.ఆర్. పక్కనే చేయాల్సిరావడం – విధి చేయు వింతలంటే బహుశా ఇవేనేమో !
సావిత్రికి మొట్టమొదటి సినిమాఛాన్స్ 1949 లో వచ్చింది ’అగ్నిపరీక్ష’ అనే చిత్రంలో ! కొన్ని సన్నివేశాలు తీసి చూసుకున్నాక “పిల్ల మఱీ చిన్నగా అనిపిస్తోం”దని “ఆ పాత్రకి సరిపో”దనీ భావించి ఆ ఒప్పందం రద్దుచేసుకున్నారు నిర్మాతలు. అంతే ! ఇహ మళ్ళీ ఆ ఏడాదంతా ఖాళీయే. ఆ మఱుసటి సంవత్సరం ఏ.ఎన్.ఆర్.తో తీస్తున్న ’సంసారం’ అనే సినిమాకి తీసుకున్నారు. కానీ భయం భయంగా నటిస్తోందని గమనించి అప్పటిదాకా తీసిన సన్నివేశాల్ని కూడా రద్దుచేశారు. ఆ పాత్రని పుష్పలతకి ఇచ్చేసి మొదట్నుంచీ మళ్ళీ తీశారు. సావిత్రిని జూనియర్ ఆర్టిస్టుగా మార్చారు. అందువల్ల ఆ తరువాత వచ్చిన “పాతాళభైరవి” లో కూడ సావిత్రి జూనియర్ ఆర్టిస్టుగా ఒకే ఒక డాన్స్ బిట్ కి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత 1950 లో ’రూపవతి’ సినిమాలో తక్కువ నిడివి గల ఒక వ్యాంప్ పాత్ర వచ్చింది. ఈ రెండు సినిమాలూ మఱుసటేడాదిగ్గానీ విడుదల కాలేదు. ఈ అన్ని పరిణామాలూ, సావిత్రినీ, ఆమె కుటుంబాన్నీ ఎంతో నిరాశపఱచాయి.
కానీ 1951 కల్లా ఆమెకి నిజంగానే దశెత్తుకుంది. ఆ ఒక్క ఏడాదిలో ఆమెని రెండో హీరోయిన్‌గానూ, ప్రధాన నాయికగానూ పెట్టి వరసగా పెళ్ళిచేసి చూడు, పల్లెటూరు, ఆదర్శం, ప్రియురాలు, శాంతి, సంక్రాంతి అనే సినిమాలు తీశారు. అంతే ! ఇహ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకపోయింది. ఆ తరువాత ఒక పుష్కరకాలం దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో సావిత్రియుగంగా మారిపోయింది. ఎటొచ్చీ, 1965 తరువాత ఆమెకి హీరోయిన్ పాత్రలు రావడం బాగా తగ్గిపోయింది. కొత్తకొత్త కథలకి కొత్తరకం హీరోయిన్లు అవసరమయ్యారు. అందువల్ల ఆమె 1972 తరువాత సీనియర్ క్యారెక్టర్ పాత్రలకి పరిమితమయింది. తెలుగు, తమిళ భాషల్లో అన్నీ కలిపి సావిత్రి మొత్తం 236 చిత్రాల్లో నటించింది. వీటిల్లో తన భర్త అయిన జెమినీ గణేశన్ తో నటించినవి 45 దాకా ఉన్నాయి. పెఱిగిన వయసుతో అవకాశాలు తగ్గినప్పటికీ, స్త్రీపాత్రలకి ఆమె జీవం పోసిన విధానం ఆ తరువాత వచ్చిన హీరోయిన్లందఱికీ ఒక ఒఱవడిగా, పాఠ్యపుస్తకంగా మారింది.
ముగింపు రెండో భాగంతో….
Mitra reddy
Alanati abinaya netri savitramma gaari gurinchi inkaa telusu kovali undi medam. Ame palikinche havabhavalu super.
Maa taram vallaku mahanati gurinchi telavali.
varaprasad
thanq very much,mahanatini malli gurtuchesinanduku
Jampala Chowdary
లలితాబాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు పల్లవిగారి పుస్తకం ఆసక్తికరంగా ఉండటమూ, వడిగా చదివించడమూ నిజమే. కానీ ఆయనే చెప్పినట్లు ఈ పుస్తకంలో నిజం ఎక్కడ ఆగుతుందో, కల్పన ఎక్కడ మొదలవుతుందో చెప్పటం కష్టం. పుస్తకంలో నిజం కాదని మనం అనుమానించని కొన్ని విషయాలు కూడా పరీక్షకి నిలబడవు.
ఉదాహరణకు, పల్లవిగారి పుస్తకం ప్రకారం సావిత్రి జన్మదినం 1936 జనవరి 4. కానీ చిర్రావూరు గ్రామ జనన మరణ తేదీల రిజిస్టరు ప్రకారం ఆమె అసలైన పుట్టినరోజు 1935 డిశంబరు 6. ఆ విషయం ఎలా తెలుసు అంటే ఆ రిజిస్టరు ప్రతిని నేను A Legendary Actress Mahanati Savitri అనే పుస్తకంలో (2009) చూశాను. వి. ఆర్. మూర్తి, వి.సోమరాజు ఈ పుస్తకాన్ని వ్రాశారు. సావిత్రి జీవితం గురించి, సావిత్రి సినీ జీవితం గురించి చాలా శ్రద్ధగా పరిశోధించి వ్రాసిన పుస్తకం. 635 పేజీల్లో, సావిత్రి జీవిత చరిత్ర, వేసిన ముఖ్య పాత్రలు, చిత్రాల విశ్లేషణ, చేసిన ఇంటర్వ్యూల వివరాలు, చక్కటి ఛాయాచిత్రాలు, సావిత్రి నటించిన సినిమాలన్నిటి గురించి వివరాల పట్టిక, ఆధారాల పట్టికలు ఉంటాయి. అధికారికమైన జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు.
ఈ పుస్తకం తెలుగునాట ఆవిష్కరించారని విన్నాను కాని నాకు వివరాలు తెలీవు. అమెరికాలో గట్టిబైండు ప్రతిని Upstate Harbor Publisher (www.uhpublisher.com) ప్రచురించారు. 35 డాలర్లకి కొన్నాను అని గుర్తు.
అన్నట్లు, ఈ ఆంగ్లపుస్తకంలో చాముండి అన్న మనిషి గురించి ఎట్టి ప్రస్తావన లేదు.