“కొల్లాయిగట్టితేనేమి?” – నన్ను చదివించగలిగిన ఒక నవల

వ్యాసకర్త: భైరవభట్ల కామేశ్వరరావు
******

నాకు తెలుగు నవలలు చదివే అలవాటు బొత్తిగా లేదు (ఆ మాటకొస్తే అసలు నవలలు చదివే అలవాటే తక్కువ, అది వేరే సంగతి). కొని తెచ్చుకొని కూడా, కొంత చదివి ఆపేసినవీ అస్సలు తెరవకనే అలా ఉంచేసినవీ కనీసం ఒక నాలుగయిదారు నవలలయినా నా పుస్తకాల గూడులో కునుకుతున్నాయి. “కొల్లాయిగట్టితేనేమి?” నవల మాత్రం ఆ కోవకి చెందదు. ఎప్పటినుంచో యీ నవల గురించి వింటూ వచ్చినా దాన్ని చదవడం యీ మధ్యనే తటస్థించింది. ఆపకుండా చదివించింది. అలా హాయిగా చదివించడానికి మూడు కారణాలు. ఒకటి, పుస్తకం మరీ తలకింద దిండుగా పెట్టుకొనేంత పెద్దది కాకపోవడం. రెండు, కథనంలోని సరళత్వం. మూడు, చరిత్రలోకి ఒకమారు తొంగిచూడాలన్న కుతూహలం. చరిత్ర వెనకటి కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలగూర్చి, వాటి వెనకనున్న ప్రధాన వ్యక్తులగురించి మాత్రమే చెపుతుంది. చరిత్ర నేపథ్యంలో సాగే నవల, ఆయా సంఘటనలు అప్పటి ప్రజల వ్యక్తిగత జీవితాలపై వేసిన ముద్రని చూపిస్తుంది.

“కొల్లాయిగట్టితేనేమి?” నవలలో కథ పందొమ్మిదివందల ఇరవైలది. అంటే గాంధీజీ నాయకత్వంలో జాతీయోద్యమం ఊపందుకుంటున్న రోజులన్న మాట. రామనాథమనే యువకుడు గాంధీగారి సహాయనిరాకరణోద్యమ ప్రభావంతో కాలేజీ చదువు మానేసి, విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి, స్వాతంత్ర్యపోరాటంలో తనవంతు పాత్ర నిర్వహించాలన్న దీక్షతో తన స్వగ్రామమైన ముంగండకి ప్రయాణమవ్వడంతో నవల మొదలవుతుంది. అయితే తానేమి చెయ్యాలన్న స్పష్టమయిన ఆలోచన ఏదీ అతడికి ఉండదు. ఊరి పరిస్థితులు, తన వ్యక్తిగత జీవితంలోని పరిస్థితులూ ఎలా రామనాథం ఆలోచనలనూ చేతలనూ ప్రభావితం చేసాయన్నది నవల చివరికంటా మనకి కనిపిస్తుంది.

రామనాథానికి అప్పటికే పెళ్ళయి ఉంటుంది. బాల్యవివాహం. భార్య ఇంకా కాపరానికి రాదు. మామగారు బ్రిటిష్ పాలనలోని పోలీసు అధికారి. రామనాథం కూడా కాలేజీ చదువులు చదివి ఐ.సీ.ఎస్ పాసవ్వాలని అతని ఆకాంక్ష. అలా అవుతాడన్న నమ్మకంతోనే పిల్లనిచ్చి పెళ్ళిచేస్తాడు. రామనాథానికి తల్లిదండ్రులుండరు. చిన్నప్పటినుండి పినతల్లి, బాబాయి దగ్గర పెరుగుతాడు. వారికి కూడా పిల్లలు లేకపోవడంతో ఇతడిని కన్నబిడ్డలాగే చూసుకుంటారు వాళ్ళు. రామనాథం బాబాయి శంకరశాస్త్రికి కూడా రామనాథం పెద్ద ఆఫీసరవ్వాలని ఉంటుంది. కాబట్టి రామనాథం కుటుంబంలో ఎవరికీ అతనలా కాలేజి మానేసి వచ్చెయ్యడం ఇష్టముండదు, ఒక్క విశ్వనాథానికి తప్ప. విశ్వనాథం రామనాథానికి పెదనాన్న. అతను స్వాతంత్ర్యాభిలాషి. ఉద్యమంలో చేరి చాలా ఆస్తినికూడా పోగొట్టుకున్నవాడు. అతనిది మరో కథ. అతడికి వేరే కులం స్త్రీతో సంబంధం ఉంటుంది. కొడుకు కూడా ఉంటాడు, వెంకటరమణ. లోటు లేకుండా పెంచినా, వెంకటరమణకి సమాజంలో తగిన స్థానం ఉండదు. పోలీసు ఉద్యోగం ద్వారా దాన్ని సంపాదించుకోవాలన్నది అతడి ఆశయం. తల్లి మూలంగానే తనకీ పరిస్థితి కలిగిందని అతనికి కోపం. ఆ తండ్రీ కొడుకుల మధ్య నలిగే లచ్చమ్మ. విశ్వనాథానికి చిన్నప్పుడే వితంతువైన ఒక కూతురుకూడా ఉంటుంది. ఆమెకి ఇటు సంప్రదాయంపై నిష్ఠ, అటు దేశ స్వాతంత్ర్యంపై ఆకాంక్ష రెండూ ఉంటాయి. ఆమెకొక కొడుకు, పిల్ల దేశభక్తుడు. శంకరశాస్త్రికి విశ్వనాథం వ్యవహారం నచ్చదు. అయితే, ఒక్క మామగారికి తప్ప, రామనాథమంటే అతని కుటుంబసభ్యులందరికీ చాలా ఆపేక్షే. తన మాట కాదన్నా, తనకి ఇష్టం లేని పనులు చేస్తున్నా శంకరశాస్త్రికి కూడా రామనాథం పట్ల ఆప్యాయతకి లోటు రాదు. అయితే తను నమ్మిన నియమనిష్ఠలని మాత్రం ఆ ఆప్యాయత జయించలేదు. ఒకానొక సందర్భంలో తప్పుడు కేసులో రామనాథం జైలుకి వెళ్ళివచ్చి, బ్రాహ్మణ ఆచారం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిరాకరిస్తే, శంకరశాస్త్రి అతడిని ఇంట్లోకి రానివ్వడు. రామనాథం ఊరి చివర వాళ్ళ తోటలో వేరు కాపురం పెట్టవలసి వస్తుంది. రామనాథానికి చెందిన ఆస్తి కచ్చితంగా లెక్క తేల్చి అతనికి అప్పచెప్పేస్తాడు శంకరశాస్త్రి.

ఇలా వివిధ పాత్రల నడుమ తలెత్తే సంఘర్షణలతో కథ మలుపులు తిరుగుతూ సాగుతుంది. స్వాతంత్ర్యసమరంతో పాటుగా సంఘసంస్కరణ అతి ముఖ్యమయిన విషయమని రామనాథం గ్రహిస్తాడు. ఊరిలో కొనసాగుతున్న అస్పృశ్యత వంటి దురాచారాలని రూపుమాపడానికి పూనుకుంటాడు. జైలుకి వెళ్ళి వచ్చి ప్రాయశ్చిత్తమయినా చేసుకోని రామనాథంతో తెగతెంపులు చేసుకుంటాడు మామగారు. అల్లుడు స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొంటే తన పోలీసు పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్నది అతని అసలు భయం! తల్లిదండ్రుల చేత పూర్తిగా ప్రభావితమయిన రామనాథం భార్య, సుందరి కూడా అతడితో కాపురం నిరాకరిస్తుంది. నవల ప్రారంభంలో రామనాథం ముంగండకి ప్రయాణమైనప్పుడు అతనికి స్వరాజ్యం పరిచయమవుతుంది. ఆమె తండ్రి అబ్బాయినాయుడు కూడా ఆధునికభావాలున్న వ్యక్తి. భార్యకి ఇష్టం లేకున్నా కూతురుని కాలేజీ దాకా చదివిస్తాడు. స్వరాజ్యం పెళ్ళయినా చదువు మానకపోవడంతో ఆమె భర్తకి అది నచ్చక ఆమెని వదిలేస్తాడు. ఆమె స్వతంత్రంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటుంది. స్వరాజ్యం రామనాథాల ఆశయాలు కలుస్తాయి. చివరకి మనసులు కూడా కలిసి ఇద్దరి జీవితాలు ఒకటవుతాయి. రామనాథం కృషి ఫలితంగా ముంగండ గ్రామంలో కొద్ది కొద్దిగా మార్పు ప్రారంభమవుతుంది. గ్రామప్రజలలో స్వాతంత్ర్యకాంక్ష అంకురిస్తుంది. తాను నడుపుతున్న ఖద్దరు ఉత్పత్తి కేంద్రానికి గాంధీగారిని తీసుకురావాలన్న రామనాథం ఆశయం ఫలించబోతుంది. గాంధీగారికై సేకరించిన విరాళంతో పాటు యివ్వడానికి, “యథా యథాహి ధర్మస్య…” అనే శ్లోకం ప్రత్యేకంగా చెక్కించిన తాళపత్రం శంకరశాస్త్రి తీసుకువచ్చి రామనాథానికి ఇవ్వడంతో నవల ముగుస్తుంది.

జాతీయోద్యమ కాలంలో ఒకవైపు స్వాతంత్ర్యపోరాటం మరోవైపు సంస్కరణోద్యమం చేతులుకలిపి సాగాయి. ఒకదానికొకటి ఎదురెదురయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రెండు వర్గాల మధ్యనా స్పష్టమయిన విభజనరేఖ లేకపోవడం ఒక విశేషం. పరమ సాంప్రదాయవాదులయి కూడా ఇంగ్లీషు చదువులిచ్చే అధికారం కోసం అర్రులుచాచినవారు ఉన్నారు. మరోవైపు అప్పటి సంఘవ్యవస్థలో గౌరవం దక్కని వాళ్ళు కూడా సంప్రదాయాన్ని ధిక్కరించి ఇంగ్లీషు చదువులకి వెళ్ళినవాళ్ళూ ఉన్నారు. అలాగే భారతీయ సంప్రదాయాభిమానంతో పరసంస్కృతినీ, పరపాలననీ ధిక్కరించిన వారున్నారు. మరొకవైపు ఇంగ్లీషు చదువులిచ్చిన సంస్కారాభిలాషతో సంప్రదాయాలని ప్రశ్నిస్తూనే, మరోవైపు బ్రిటిష్ దౌర్జన్యపాలనని నిరసించిన వారూ ఉన్నారు. ఈ వైవిధ్యమంతా చాలావరకూ యీ నవలలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలోని అనేక చాయలు, ప్రధానపాత్ర రామనాథంలో కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. పాత్రచిత్రణలో రచయితకున్న నైపుణ్యానికి ఒక నిదర్శనం.

నవల వ్రాసిన కాలం 1960. గతశతాబ్దంలో ఇరవైలలో జరిగిన కథ గురించి అరవైలలో వ్రాసిన యీ నవల 2011లో చదివిన నాకు ఎందుకు నచ్చింది? కాలాతీతమైన కొన్ని మౌలిక మానవస్వభావాలని సంబంధాలని హృద్యంగా చిత్రించడం దానికి కారణం కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ. రామనాథం ఆస్తి అతడికి అప్పగించేందుకు శంకరశాస్త్రి ఇద్దరు సాక్ష్యులు కావాలంటాడు. అన్నాళ్ళూ ఆ ఆస్తిని శంకరశాస్త్రే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. రామనాథాన్ని పెంచి పెద్దజేసాడు. అలాంటి తన బాబాయి తన ఆస్తి తనకి ఇచ్చేటప్పుడు వేరేవాళ్ళు ఎందుకని రామనాథం వద్దంటాడు. అయినా ఆస్తి వ్యవహారం ఫైసలు చేసేటప్పుడు వ్యవహారనీతిగా మధ్యవర్తులు ఉండాల్సిందే అని శంకరశాస్త్రి పట్టుబడతాడు. ఆఖరికి, “వాళ్ళూ వీళ్ళూ ఎవరూ వద్దు. మీకు తోచినవారిని ఒకరిని మీరు పిలవండి. నాకు తోచిన వారొకరిని నేను పిలుస్తాను.” అంటాడు రామనాథం. శంకరశాస్త్రి దానికి ఒప్పుకుంటాడు. అయితే రామనాథం తనవంతుగా శంకరశాస్త్రి పేరునే సూచిస్తాడు! అది కలలోకూడా ఊహించని శంకరశాస్త్రి అది విని ఒక్క క్షణం విస్తుబోతాడు. వెర్రినవ్వు నవ్వేసి, “దేవాంతకుడివిరా…” అంటాడు. రామనాథానికి తనమీద ఉన్న నమ్మకానికి గౌరవానికి లోలోపల మురిసిపోయి ఆనందిస్తాడు. ఈ సన్నివేశం నా మనసుకి చాలా హత్తుకుంది. ఆస్తిపాస్తులు కాని, సైద్ధాంతిక విభేదాలు కాని మనుషుల మధ్యనుండే ఆత్మీయతకి అడ్డురావలసిన అవసరం లేదని చాలా సున్నితంగా చిత్రించే సన్నివేశమిది. నవల పొడుగునా ఇదే విషయం అనుస్యూతంగా అల్లుకుని ఉంటుంది. అది నన్ను బాగా హత్తుకుంది.

తమ రాజకీయ సిద్ధాంతాల ప్రచారంకోసం పాత్రలని తోలుబొమ్మలనీ, కీలుబొమ్మలనీ చేసి ఆడించకపోవడం కూడా నాకీ నవలలో బాగా నచ్చిన గుణం.

మనుషుల్లో సహజంగా కనిపించే అనేక కోణాలని చిత్రించడం వలన వాటికి సజీవత్వం అబ్బిందని నాకనిపించింది. మొత్తమ్మీద హాయిగా చదివిస్తూ, ఆనాటి సమాజాన్ని కళ్ళముందు చూపిస్తూ, నా మనసుకు హత్తుకున్న నవల “కొల్లాయిగట్టితేనేమి?”. ఈ నవలలో “నాటకీయత” లోపించిందని/తగ్గిందని ఒక విమర్శ ఉంది. ముఖ్యంగా పాత్రల మధ్య సంభాషణల్లో మరింత నాటకీయత ఉండాలనీ, ఇది ఆలోచనలతో మెదడుకి పనిచ్చెప్పే నవలే కాని హృదయానికి అనుభూతినిచ్చే నవల కాదని యీ విమర్శకుల అభిప్రాయం. దానితో నేను అంగీకరించను. మొద్దుబారిని హృదయాలని కదిలించడానికి నాటకీయత పాళ్ళు ఎక్కువ అవసరమేమో! నాటకీయత ఎక్కువయి మెలోడ్రామాకి దారితీసే ప్రమాదం జరగకుండా రచయిత జాగ్రత్తపడ్డారని నాకనిపిస్తుంది. పైగా, నాటకంలోను కథలోను శోభించే నాటకీయత నవలలో ఎక్కువగా శోభించదని నా అభిప్రాయం. అవసరమయినంత మేర నాటకీయత నాకు పుష్కలంగా కనిపించింది యీ నవలలో.

నవల చివరన ఇచ్చిన వ్యాసాల్లో కనిపించే రా.రా.గారి అధికప్రసంగమూ, సింగమనేనిగారి అర్థంలేని ప్రసంగమూ లేకుండా ఉంటే మరింత బాగుండేదని అనిపించింది. అయితే, “కొల్లాయిగట్టితేనేమి? నేనెందుకు రాశాను?” అని, నవల రచయిత మహీధర రామమోహనరావుగారు వ్రాసిన వ్యాసం కూడా ఆ వెనకనే ఇవ్వడం వల్ల ఆ నష్టం పూరింపబడింది! రా.రా.గారి వ్యాసంలో అధికప్రసంగం ఉందన్నందుకు చాలామంది నుదుళ్ళు ఇప్పటికే ముడిపడ్డాయని నాకు తెలుసు. దాని గురించి వివరించడానికి ఇక్కడ జాగా సరిపోదు. స్థూలంగా రెండు మాటల్లో నా అభిప్రాయం చెపుతాను. మార్క్సు సిద్ధాంతాన్ని సామాజిక ఆర్థిక విషయాలని విశ్లేషించే ఒక శాస్త్రీయ సిద్ధాంతంగా అర్థం చేసుకోవచ్చు. అలా చూసినప్పుడు అన్ని శాస్త్రసిద్ధాంతాల మాదిరిగానే దానికి కూడా కొన్ని విశిష్టతలూ, పరిమితులు ఉంటాయి. అదే సిద్ధాంతాన్ని రాజకీయదృష్టితో ఒక ఆశయంగా ఆదర్శంగా స్వంతం చేసుకోనూ వచ్చు. అప్పుడది ఒక విలువలవ్యవస్థకి మూలమవుతుంది. శాస్త్రీయ పరిథిని దాటి కొన్ని నమ్మకాలుగా స్థిరపడిపోతుంది.

రామమోహనరావుగారి దృష్టి మొదటి పద్ధతి, రా.రా.గారిది రెండవ పద్ధతి. నా ఒప్పుకోలు మొదటి పద్ధతికి. బహుశా అందుకే నాకు నవల నచ్చింది. రా.రా.గారి వ్యాసంలో అధికప్రసంగం కనిపించింది.

___________________________

పుస్తకం వివరాలు:

కొల్లాయిగట్టితేనేమి?

మహీధర రామమోహన్ రావు

ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్
వెల: 150 రూపాయలు

pages: 378

ముద్రణ: 2007

AVKF link

____________________________

జాలంలోసంబంధిత లింక్స్: 

సాక్షి పత్రికలో

కాలాస్త్రి బ్లాగులో

You Might Also Like

10 Comments

  1. varaprasad

    ” KOLLAYIGATTITENEMI ‘amulymayina elanti pustakalu dorikinapudu haiga chadookuni santoshamga undaka lolli cheyyoddu babu…

  2. “కొల్లాయిగట్టితేనేమి?” గురించి రా.రా.గారి విశ్లేషణ – నా ఆక్షేపణ | పుస్తకం

    […] నవలకి నేను వ్రాసిన పరిచయ వ్యాసంలో రా.రా.గారి మీద ఒక విసురు విసిరి […]

  3. manjari lakshmi

    కామేశ్వరరావు గారు, …….. స్త్రీలకు చెరుపు జరిగింది అని చెపుతూ మీరు రాసిన పోలికలతో నేను ఏకీభవించ లేక పోతున్నాను. మీరు చెప్పిన వాళ్ళందరి భార్యలకూ కష్టాలు వచ్చిన మాట నిజమే. కానీ వాళ్ళ కష్టాలకు కారణం వాళ్ళదా, భర్తలదా అనేది కూడా చూడాలి కదా! మీరు చూపించిన వాళ్ళలో రాముడి వల్లనే, సీతది ఆవగింజంత తప్పైనా లేకుండా, సేత అగ్నిలో దూకాల్సి వచ్చింది. ఆడవిలో దించేస్తే అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఆమె అతన్ని వద్దనుకోలేదు కదా? అతనే ఆమెని వదిలేశాడు. అలాగే బుధ్ధుడు కూడా సర్వసంగ పరిత్యాగిగా ఉండాలని చెప్పి భార్యని వదిలేశాడు. అందులో యశోధర తప్పు ఏ కొంచమైనా ఉందా? గాంధీ, కస్తూరి బాయి గురించి ఎదో విన్నాను గానీ గుర్తు లేదు. మీరే చెప్పాలి. కానీ సుందరి దగ్గరకొచ్చేటప్పటికి ఆమె బుధ్ధి హీనతా, చెడ్డతనం అరవై పాళ్ళైతే, ఆమె తల్లి,తండ్రుల బోధనలు ముప్పైపాళ్ళు కారణం. ఇంకేదైనా తప్పుందంటే అది రామనాధంది పదిపాళ్ళే. మీరు, పెళ్ళైనప్పుడు రామనాధం ఐ.సి.యస్. చదువుకుంటాడని చేశారు, హిందూ కుల ధర్మాలను పాటిస్తాడని చేశారు, అతని ప్రవర్తన వల్ల సంఘంలో హోదా, గౌరవాలు పోయేటట్టు ప్రవర్తించాడు, కాబట్టి అతనిదీ తప్పేనంటారేమో, మరి మీరు పోల్చిన రాముడి భార్య సీత, భర్త మహారాజు కాకుండా అడవుల పాలైతే కూడా అతనితోనే వెళ్ళింది కదా! ఏ రకంగా చూసినా మీరు పోల్చిన సందర్బంలో, మీరు పోల్చిన వాళ్ళతో పోలిస్తే రామనాధం వ్యక్తిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సుందరి కష్టాలకు రామనాధం కన్నా సుందరే ఎక్కువ బాధ్యురాలుగా కనిపిస్తుంది.

  4. కామేశ్వరరావు

    లక్ష్మిగారు, నవలగురించి మీ అభిప్రాయాలని యిక్కడ వివరంగా పంచుకోడం నా పరిచయవ్యాసం విలువని పెంచింది. మీరు చెప్పిన చాలా వాటితో నాకూ ఏకాభిప్రాయమే. రా.రా.గారి విశ్లేషణపై నాకున్న అభ్యంతరాలని విడిగా మరొక వ్యాసంగా వ్రాసాను. దానిపై కూడా మీ అభిప్రాయాలు చెప్పండి.

    రామనాథం భార్య సుందరి పాత్ర గురించి. ఆమె ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందని అనిపించినా, చివరికి ఆమెకి అన్యాయమే జరిగిందని అనిపిస్తుంది నాకు. సంప్రదాయపరుడు, సంఘంలో తన “స్టేటస్” గురించి పాకులాడేవాడు అయిన ఆమె తండ్రి, సుందరికి మళ్ళీ పెళ్ళి చేస్తాడన్న నమ్మకం లేదు. ఆమె జీవితాంతం ఒంటరిగా మిగలిపోవలసినదే! పోని స్వరాజ్యంలా సొంతకాళ్ళపై బ్రతకగలదన్న నమ్మకమూ లేదు. ఒకవేళ రామనాథంతో కాపరానికి వచ్చినా, వాళ్ళిద్దరికీ పొంతన కుదురుతుందని చెప్పలేం. రామనాథం భార్యకోసం తన పూనికని మానుకుంటాడన్న నమ్మకం లేదు. ఒకరికి మంచి, మరొకరికి చెడుగా మారడం మరోసారి కనిపిస్తుందిక్కడ. రాముడయినా, బుద్ధుడయినా, గాంధీ అయినా, రామనాథమయినా ఆ చెరుపు స్త్రీలకే జరగడం విచారించాల్సిన విషయం!

  5. మంజరి లక్ష్మి

    “కొల్లాయి కట్టితేనేమి” నవలలో నాకు బాగా నచ్చిన సన్నివేశం, ఇందులో హీరో రామనాధం (అప్పటికే అతనికి పెళ్ళై భార్యతో ఒక రకంగా తెగ తెంపులై పోతాయి), హీరోయిన్ స్వరాజ్యం (ఈమె కూడా భర్త తిరస్కారంతో పుట్టింట్లోనే ఉంటుంది) ప్రేమించుకొని పెళ్ళి లేకుండానే భార్యా, భర్తలుగా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళు గాంధీ గారి మీటింగ్ నుంచి వస్తూ ఉంటే హఠాత్తుగా స్వరాజ్యం రామనాధం వెనకాలే నక్కుతూ(దాక్కుంటూ) నడుస్తూ ఉంటుంది. అతను ఎందుకని అడిగితే తన మొదటి భర్తనూ, తన్నూ ఎరిగిన వాళ్ళు (భర్త ఇంటికి దగ్గరగా ఉన్నవాళ్ళు ) అక్కడ పార్కులో ఉన్నారనీ, వాళ్ళ కంట పడటం ఇష్టం లేక అలా చేశానని చెప్తుంది. అతను ఆమెను హేళన చేసి తనైతే భయపడనన్నట్లుగా చెప్తాడు. ఇంకొంచం దూరం వెళ్ళగానే అతనికి తెలిసిన స్నేహితుడు ఎదురై (ఆ స్నేహితుడికీ ఇతని మొదటి భార్య వృత్తాంతం అంతా తెలుసు) పలకరించేటప్పటికి ఇతను చాలా సేపు స్వరాజ్యం తన భార్య అని చెప్పటానికి సంకోచిస్తాడు. పాత భావాలకూ, కొత్త భావాలకూ మనసులో జరిగే సంఘర్షణ, మనకు తెలియకుండానే పాత భావాలు మన మీద చూపించే ప్రభావం, ఆచరణ లో కొచ్చేటప్పటికి అభ్యుదయ భావాలను ఆచరణలో పెట్టిన వాళ్ళు పాత భావాలున్న సంఘంలోని మనుషులు ఎదురైనప్పుడు వీళ్ళకు కలిగే సంకోచం వీటన్నిటినీ రచయిత ఈ నవలలో బాగా రూపు కట్టించారు. ఇది వరకెప్పుడో కె. రామలక్ష్మి గారు తను కడుపుతో ఉండి బస్సులో వెడుతూ ఉంటే, తన మెళ్ళో మంగళ సూత్రం, మిగతా పెళ్ళైన చిహ్నాలు లేక పోవటంతో ఆ బస్సులో వాళ్ళందరూ తన్ని అదోరకంగా జాలిగా చూశారని, అప్పుడు తను ఇంటికి వెళ్ళి ఆరుద్ర గారిని వెంటనే తన మెడలో తాళి కట్టేయమని అడిగానని రాస్తే చదివినట్టు గుర్తు. ఆ తరువాత ఆయన కట్టారో లేదో తెలియదుగానీ నాకు మాత్రం అది చదివి చచ్చే నవ్వొచ్చింది. అలాంటి ఆచరణల మీదా, చిహ్నాల మీదా నమ్మకం లేకే కదా అలా ఉన్నది. ఒక వేళ బయట వారి చూపులు తట్టుకోలేక కట్టుకోవాలనుకుంటే తనే కట్టుకోవచ్చుగా? ఆరుద్రగారే కట్టాలని ఆమెకు ఎందుకనిపించింది? ఇలాంటి పెద్దవాళ్ళే సంఘ భయంతో ఇలాంటి వెనకడుగేస్తే అభ్యుదయ భావాలు ఎలా ఆచరణలోకి వస్తాయి. ఈ నవలలో మాత్రం రామనాధం ఎంత సంఘర్షణ అనుభవించినా వెనకడుగు మాత్రం వెయ్యడు. ఈ నవల గురించి దాదపు సంవత్సరం క్రితం ఆంధ్రజ్యోతి సండే బుక్ లో పడిన ఒక కధలో (కధ పేరూ, రచయిత పేరూ గుర్తు లేదు) మొదట చదివాను. అందులో రచయిత్రి ఎంతో అభ్యుదయ భావాలున్న రామనాధం కూడా భార్య మారుతుందేమో అని నిరీక్షించకుండా వెంటనే రొండో పెళ్ళి చేసేసుకొన్నాడు. ఎంత అబ్యుదయ భావాలున్నా, మొగవాళ్ళందరూ భార్య దగ్గరికొచ్చేటప్పటికి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అని చాలా బాధపడుతూ రాసింది. అప్పటికి నేనింకా “కొల్లాయి కట్టితేనేమి” నవల చదవలేదు. నేను కూడా ఆమెను సమర్ధిస్తూ ఉత్తరం రాశాను. ఆ తరువాత ఈ పుస్తకం చదవటం జరిగింది. ఈ పుస్తకం చదివిన తరువాత రామనాధం విషయంలో ఆమె అభిప్రాయం తప్పనిపించింది. అతను భార్య కోసం మామ గారింటికి వెళితే, అక్కడ పోలీస్ ఆఫీసర్ అయిన మామ గారు ఇతన్ని కొట్టి జైల్లో కూడా పెట్టిస్తాడు. అయినప్పటికీ దువ్వూరి సుబ్బమ్మగారు చెప్పిన మీదట తన అభిజాత్యాన్ని వదులుకొని, తన భావాలు మార్చుకొని మధ్యవర్తులను పంపిస్తాడు, తనే స్వయంగా వెళతాడు, స్వరాజ్యం ద్వారా ఆమెని కలుసుకొని మాట్లాడతాడు. ఎన్ని చేసినా ఆమె అతనిలో ఉన్న మంచితనాన్ని గుర్తించకుండా అతన్ని ఒక పురుగును చూసినట్లు చూస్తుంది. కోర్టుకి వెళ్ళేటైతే వెళ్ళమని కూడా చెపుతుంది. దాంతో అతను ఆమె పోషణ కోసమే తన దగ్గరకు రాకూడదని చెప్పి మనోవర్తి క్రింద కొంత ఆస్థి కూడా రాసిస్తాడు. అది చూసైనా ఆమె కళ్ళు తెరుచుకోవు. తల్లి తండ్రి మాటలే ఆమెకు వేదవాక్కులుగా అనిపిస్థాయి. ఆమె మూర్ఖత్వం చూస్తే ఆ తల్లితండ్రీ భావాల నుంచి ఆమె ఎప్పటికైనా బయటపడే అవకాశం లేదేమోననిపిస్తుంది. ఇతనికి అన్ని విధాల సరిసమానమైన, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి పరిచయమవటం, అది ప్రేమగా మారటం జరిగిన తరువాత, అతను ఆమెను పెళ్ళి చేసుకోకుండా ఎంతకాలం ఆగాలి. అటువంటి వ్యక్తి కలవక పోతే ఆగేవాడేమో. అయినా అప్పటికే ఆతనికి తన భార్య ప్రవర్తన వల్ల మనస్సు విరిగిపోయింది. అటువంటప్పుడు ఆమె వచ్చినా వాళ్ళ జీవితం సజావుగా నడిచేది కాదు. ఒక వేళ ఆమె మారినా ఆమెకి ఆ శిక్ష అనుభవించడమే న్యాయం అనిపిస్తుంది. ఈ నవల గురించి రా.రా. గారు రచయిత ఈ నవలలో నాటకీయంగా మలచటానికి వీలైన ఎన్నో సంఘటనలను మామూలుగా రాశారనీ, నవలల్లో నాటకీయంగా సంఘటనలను కూర్చటం వల్ల అవి మనస్సుకు హత్తుకుపోయినట్లుగా ఉంటాయనీ రాశారు. నాకైతే ఈ నవలని ఇంత సాదా సీదా గా రాయటమే ఒక ప్రత్యేక ఆకర్షణ అనిపిస్తుంది. అయితే ఇందులో రెండు సంఘటనలు మరీ విపరీతంగా ఉన్నాయనిపించింది. మామగారు అల్లుడని గుర్తించకుండా ఆతన్ని బాగా కొట్టించటం, జైల్లో పెట్టించటం మరీ నాటకీయంగా ఉంది. అలాగే హీరోయిన్ స్వరాజ్యం తండ్రి అబ్బయనాయుడు ఎంతో సాత్వికమైన వ్యక్తీ, గ్రుడ్డివాడూ, బ్రహ్మసమాజీకు డు. తన కూతురుకు రెండో పెళ్ళి చెయ్యటానికి కూడా సిధ్ధపడే ఉన్నాడు. అటువంటి వ్యక్తి కూతురు రామనాధాన్ని పెండ్లి చేసుకుంటానని చెప్పగానే ఏవేవో ఊహించుకొని, కర్రతో అతని తలకాయ పగలకొట్టాలని చూస్తాడు. ఇంత వైరుధ్యంతో ఆ పాత్ర ఉండటం, ఆ సంఘటన మన ఎదురుగా జరిగినా కూడా నమ్మలేమేమోననిపిస్తుంది. మనం పుట్టినప్పటినుంచి సంఘంలో ఉన్న ఆచారాలు, అలవాట్లూ మన అంతరంగంలో ఒక భావ సంపుటిగా ఉండిపోతాయి. ఈ నవలలోని ప్రతి సంఘటనలోనూ అంతరాత్మకూ, అభ్యుదయ భావాలకూ జరిగే సంఘర్షణే ప్రధానంగా ఉంటుంది. రచయిత ఎక్కడా అంతరాత్మ అనే పదం వాడలేదు కానీ, రా. రా. గారు ఆ పాత భావాలనే అంతరాత్మ అంటే సరిపోతుందని రాశారు. నాకు కూడా అలా రాస్తేనే బాగుంటుందనిపించింది.

  6. jwaala

    mee sameeksha chala bagundi, deeni chadivina taruvata pustakam sampadinchi chadavalanivundi

  7. gks raja

    చక్కని సమీక్ష వ్రాశారు. నేను ఈ నవల చాలా కాలం క్రితం చదివాను. అప్పుడు ఎందుకు కొన్నానంటే/చదివానంటే — పుస్తకం పేరు చూడగానే, నా చిన్నప్పుడు ఆలిండియా రేడియో లో విన్న ‘కొల్లాయిగట్టితేనేమి ‘ ధారావాహిక గింగురుమంది. ఎవరు చదివారో తెలియదు కాని మనసుపై ముద్ర వేసింది. ఇన్నాళ్ళకు చాలా సంతొషం కలిగింది (ఈ నవల విషయంలో) దీన్ని చదివేవారు ఉన్నారనీ, మీలాగా చక్కగా వ్యాఖ్యలు వ్రాసేవారున్నారనీ.

  8. Murty

    Chala baga rasaru thanks.

  9. కొత్త పాళీ

    brilliant.
    చాలా చక్కటి సమీక్ష.

Leave a Reply