Mithunam and Other Stories

1995 ఏప్రిల్ మొదటివారం. మద్రాసు వెళ్ళిన నేను శ్రీ ఎం.బి.ఎస్. ప్రసాద్‌ని కలిశాను.  బొమ్మ బొరుసు పుస్తకం విషయాలు వ్రాసినప్పుడు చెప్పినట్లు ముళ్ళపూడి వెంకటరమణగారి రచనలన్నీ ఒక సంపుటంగా ప్రచురించాలని ప్రయత్నిస్తున్న రోజులు. చాలా విషయాలు మాట్లాడుకొన్నాం ఆ రోజున. మాటల్లో ఆయన,  ‘ఈ మధ్య శ్రీరమణ బంగారు మురుగు అని ఒక గొప్ప కథ వ్రాశారు. ఆంధ్రజ్యోతిలో ఆ కథ వేసినప్పుడు కొన్ని వందల ఉత్తరాలు వచ్చాయట. మంచి కథ వస్తే ఇప్పటికీ పాఠకులు దానికి స్పందిస్తూనే ఉంటారండీ’, అని అన్నారు. అప్పటివరకూ శ్రీరమణ పేరడీలు, హాస్యజ్యోతి, రంగులరాట్నం, ప్రేమ పల్లకీల ద్వారానే తెలుసు. కథారచయితగా పరిచయం లేదు. (యాదృఛ్ఛికంగా ఆ ఉదయమే శ్రీరమణగార్ని మొదటిసారి కలిశాను. తానా సావనీరు కోసం ఏమైనా వ్రాయమని అడిగితే సుతారంగా తప్పించుకొన్నారు; సావనీర్ల తీరుతెన్నుల గురించి ఒకటి రెండు వ్యంగ్యోక్తులు కూడా విసిరారు). ఆ తర్వాత రెండు రోజులకి విజయవాడ నవోదయ పుస్తకాల షాపులో కథ-93 పుస్తకం దొరికింది. అందులో బంగారు మురుగు కథ చదివాను (ఓల్గా తోడు కూడా ఆ సంపుటంలోనే ఉన్నట్లు గుర్తు). చాలా నచ్చింది. బామ్మ పాత్ర, బామ్మా మనుమళ్ళ అనుబంధం, ఒకప్పటి పల్లెటూరి వాతావరణాల చిత్రణలతోపాటు, గాఢమైన విషయాలను కూడా రచయిత క్లుప్తంగా, చమత్కారంగా చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది. ఇంత గొప్పగా కథ వ్రాయగలిగిన శ్రీరమణగారు ఇంకా కథలు రాస్తే బాగుణ్ణు అనిపించింది.

1997 ఆగస్టు 21.  బాపుగారి దగ్గరనుంచి ఒక భారీ కవరు వచ్చింది. ఏమైనా నచ్చితే అందరితో పంచుకోవటం బాపుగారి సహృదయత, ఉదారత, అలవాటు. కథలో, బొమ్మలో, కార్టూన్లో నచ్చినవి కాపీలు పంపించి ఉంటారు అనుకొంటూ ఉత్సుకతతో కవరు తెరిచాను. బాపుగారి చేవ్రాతలో చాలా కాగితాలున్నాయి. ఏదో పెద్ద ఉత్తరం వ్రాసినట్టున్నారేమిటని సందేహిస్తూ చదవటం మొదలుబెట్టాను. ఉత్తరం చిన్నదే; ఒక పేజీ కూడా పూర్తిగా లేదు. “ఈ మధ్య శ్రీరమణగారు మిథునం అని ఒక చక్కని కథ వ్రాశారు. కథ నాకు బాగా నచ్చింది. అందుకని నాచేతితో కథ మొత్తాన్ని తిరగవ్రాసుకొన్నాను. మీరు చదువుతారని పంపిస్తున్నాను. ఈ కథ చదివాక, మీకు కూడా కళ్ళూ, గుండె ఆనందంతో చెమరిస్తే, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోండి.” ఆ ఉత్తరంతోపాటు, 26 కాగితాలలో, బాపురాతలో మిథునం కథ.

బాపుగారు శ్రీరమణగారి కథల్ని నాకు పంపటం అది మొదటిసారి కాదు. అంతకుముందొకసారి బంగారు మురుగు, వరహాల బావి, తేనెలో చీమ, ధనలక్ష్మి – నాలుగు కథలు ఒకేసారి పంపించారు. కాకపోతే అవి పత్రికలలో వచ్చిన వాటికి జిరాక్స్ కాపీలు. ఇలా చేతిరాతలో లేవు. అందుచేత ఆశ్చర్యం వేసింది. బాపుగారు తెలుగుసాహిత్యాన్ని బాగా చదువుతారు. తెలుగులో వచ్చిన చాలా గొప్ప కథలు వాటి ప్రథమ ముద్రణలో బాపు బొమ్మలతో అలంకారం చేసినవే. లేకపోతే అవి సంకలనాలుగా వచ్చినప్పుడైనా ఆయన బొమ్మలు వేసినవే. గొప్ప కథలు, మంచి కథలు, చెత్త కథలు అన్నీ ఆయన శ్రద్ధగానే చదువుతారు. (కొన్ని కథలకు బొమ్మలు వేసినప్పుడు బాపుగారు తీసుకొనే పారితోషికం బొమ్మ వేసినందుకు కాదు, కథ చదివినందుకు అని పాత జోకు). అలాంటి బాపుగారు ఇంతగా నచ్చింది అని చెప్తున్నారంటే సహజంగానే ఈ కథ మీద నా అంచనా చాలా పెరిగింది. అప్పటికే బంగారు మురుగు, ధనలక్ష్మిల తరువాత శ్రీరమణగారి కథలపై గొప్ప అంచనా ఉంది. తెలుగులో వచ్చిన గొప్ప కథల జాబితాలో ఆ రెండు కథలు ఉంటాయని నా నమ్మకం. చాలా ఉత్సాహంగా కథ చదవటం మొదలుబెట్టాను.

ఇప్పటికీ ఆ సాయంకాలం నాకు బాగా గుర్తు. బీవర్‌క్రీక్‌లో మా ఇంట్లో నా కార్నర్‌సీటులో కూర్చుని నేను ఆ కథ చదువుకుంటున్నాను. అరుణ పక్కనే కూర్చొని ఇంకేదో పుస్తకం చదువుకుంటోంది. అప్పదాసు, బుచ్చిలక్ష్మిల సంభాషణలు చదువుతూ నవ్వుకొంటున్నాను, అప్పుడప్పుడూ పైకే నవ్వుతున్నాను. అరుణ అప్పుడప్పుడూ తన పుస్తకంలోంచి తలెత్తి చూస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారి నా మూడ్ మారిపోయింది. నవ్వు మాయమయ్యింది. చేతిలో కాగితాలబొత్తి మూసేసి, తల పక్కకు తిప్పుకున్నాను. కంట్లో ఏదో పడింది. గొంతులో కూడా. గుండె పట్టేసింది. ఏదో జరిగిందని అరుణకు తెలిసింది. పుస్తకం మూసేసి నావంక ప్రశ్నార్థకంగా చూసింది. నోరువిప్పటానికి నాకు ధైర్యం చాలలేదు. మాటలు సరిగా రావని తెలుసు. ఏం లేదన్నట్టుగా తల ఊపి మళ్ళీ కథ చదవటం మొదలుబెట్టాను. కాసేపటికి కథ పూర్తయ్యింది. ఆఖరు సన్నివేశంలో బుచ్చిలక్ష్మి చెప్పిన మాటల్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అలాగే కూర్చుండిపోయాను. నెమ్మదిగా సర్దుకొని, బాపుగారు శ్రీరమణగారి కొత్త కథ పంపించారు అని అరుణకు ఇచ్చాను. కాసేపటికి తన పరిస్థితీ అదే. తాను చదవటం ఐన తరువాత నేను తీసుకొని మళ్ళీ చదివాను. మళ్ళీ అవే ఉద్వేగాలు.

వెంటనే, కృతజ్ఞతలు చెప్పటానికి బాపుగారికి ఫోన్ చేశాను. ముళ్ళపూడి వెంకటరమణ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరితోనూ మాట్లాడాను. “ఎంత బాగా రాశాడండీ. ఎక్కడా అక్షరం పొల్లు పోకుండా, ఒక్క మాట కూడా అనవసరంగా లేకుండా, శిల్పం చెక్కినట్టు చెక్కాడండీ కథను”, అన్నారు రమణగారు. ఫోన్లోకి తలూపాను. (ఈ కథ స్థాయికి తగ్గ బొమ్మ వేయటం తనకు కుదరలేదని, అందుకే కథను తనచేత్తో తిరగరాసుకొన్నాననీ బాపు వేరే సందర్భంలో వ్రాశారు).

బాపుగారు చెప్పినట్లుగానే నా కళ్ళూ, గుండె ఆనందంతో చెమర్చాయి. ఆయన ఆదేశాన్ననుసరించి ఆ కథను బాపురాతలో వందలాదిమందితో పంచుకొనే అదృష్టం నాకు పట్టింది (ఆ కథ గురించి అప్పటి తెలుగు అంతర్జాల సాహిత్య వేదిక తెలుసాలో నా మాట ఇక్కడ).

బాపు దస్తూరీతిలకం ఒక ఎత్తు అయితే, ఈ కథకు పాఠకులు, అభిమానులు పట్టిన నీరాజనాలు మరో ఎత్తు.  కథగా మిథునంకు వచ్చిన స్పందన తెలుగులో ఇంకే కథకూ రాలేదేమో. మిథునం కథ 1997 నవంబరులో ఆంధ్రభూమి వారపత్రికలో నాలుగు వారాలపాటు సీరియల్‌గా ప్రచురితమయ్యింది. మరో మూడు నెలల తర్వాత, 1998 ఫిబ్రవరిలో రచన మాసపత్రిక ఈ కథకు బాపుగారు వేసిన చిత్రం ముఖచిత్రంగా అలంకరించుకొని, కథ మొత్తాన్నీ బాపు రాతలోనే ప్రచురించింది. పాఠకులనుంచి గొప్ప స్పందన లభించింది.  కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ – అపూర్వంగా – ఆ కథ ఒక్కటే పూర్తి సంచికగా రచన మాసపత్రిక వచ్చింది. 2000 నవంబరులో మొదటిసారిగా “మిథునం – శ్రీరమణ కథలు” ఎనిమిది కథల సంపుటంగా నవోదయ ప్రచురించింది. ఆ సంపుటం ఇప్పటికి ఏడుసార్లు పునర్ముద్రణలు పొందింది. ఈ మధ్యే మళ్ళీ పునర్ముద్రించబడి మార్కెట్లో దొరుకుతుంది. ఈ సంపుటంలో కొన్ని కథలు మిథున పేర కన్నడంలో సంకలనంగా వచ్చాయి. అధికారికంగానో, అనధికారికంగానో, ఇంటర్నెట్‌లో ఈ కథ చాలా చోట్ల ప్రచురితమయ్యింది. ఇప్పటికీ బాపురాతలో ఉన్న జిరాక్స్ కాపీలు, పిడిఎఫ్ కాపీలు బట్వాడా అవుతూ చలామణిలోనే ఉన్నాయి.

1997లో భారతీయ భాషలలో వచ్చిన మేటి కథల సంకలనం ‘Katha’లో మిథునం చోటు చేసుకొంది (కల్లూరి శ్యామల గారు ఆ కథని ఆంగ్లంలోకి అనువదించారు). దాన్ని చదివిన ప్రముఖ మళయాళ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, చలన చిత్ర దర్శకుడు ఎం.టి. వాసుదేవన్ నాయర్ ‘ఒరు చెరు పుంచిరి’ (A Slender Smile) పేరుతో మళయాళంలో సినిమా తీశారు. మిథునంలో ఉన్న స్వారస్యాన్ని పూర్తిగా పట్టుకోలేదు అనిపించినా, ఈ చిత్రానికి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అవార్డులూ, ప్రశంసలూ వచ్చాయి. తమిళంలోనూ, తెలుగులోనూ ఈ కథని సినిమాగా తీద్దామని చాలామంది ప్రయత్నించటం నాకు తెలుసు (కథలో ఒక ముఖ్య సన్నివేశాన్ని పెళ్ళైనకొత్తలో అనే సినిమాలో కాపీకొట్టిన విషయం పక్కన పెడదాం). మిథునం కథ శ్రవణరూపకంగానూ వచ్చిందని విన్నాను.

ఈ కథా సంపుటాన్ని భారీసంఖ్యలో కొనుక్కొని కొందరు తమ సన్నిహితులకు ఇచ్చి చదివించటం తెలుసు. గత ఆరు నెలలలోనే రెండు సార్లు – ఒక షష్టిపూర్తి సందర్భంలోనూ, ఒక గృహప్రవేశం సందర్భంలోనూ – ఈ కథనొక్కదాన్నే చిన్న పొత్తంగా అచ్చు వేసి, ఆహూతులందరకూ పంచిపెట్టటమూ నాకు తెలుసు. కథ వ్రాసి పద్నాలుగేళ్ళు దాటినా, ఈరోజుకీ చర్చింపబడుతున్న ఈ కథ ఇప్పటికి కనీసం లక్ష ప్రతులైనా ప్రచురింపబడి ఉంటుందని అంచనా.

2011 ఆగస్టు 22. మిథునం కథని నేను మొదటిసారి తెలుసాలో పరిచయం చేసిన రోజుకు సరిగ్గా పద్నాలుగేళ్ళ తరువాత మళ్ళీ టపాలో ఇంకో మిథునం పుస్తకం. ఈసారి ఇంగ్లీషులో. ఛీఫ్ ఇన్కంటాక్స్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన శ్రీ కె. చంద్రహాస్ శ్రీరమణ కథల అభిమాని. మిథునం కథ ఇంతకు ముందు ఆంగ్లంలోకి అనువదింపబడలేదన్న అపోహలో ఆయన ఆ కథని ఆంగ్లంలోకి అనువదించారు. ఆ ఉత్సాహంతోనే, మిథునంతో పాటు శ్రీరమణగారి మిగతా కథల్ని కొన్నిటిని కూడా ప్రముఖ ఒరియా రచయిత శ్రీ కె.కె. మొహాపాత్ర (ప్రస్తుతం ఒడిషాలో ఛీఫ్ ఇన్కంటాక్స్ కమిషనర్‌) సహాయంతో   అనువదించి, ఈ కథలన్నిటినీ Mithunam and Other Stories అన్న సంకలనంగా తీసుకొచ్చారు. తెలుగు భాషా సంస్కృతుల పునశ్చైతన్యానికి సంకల్పించిన సి.పి.బ్రౌన్ అకాడెమి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ సంకలనంలో తొమ్మిది కథలున్నాయి: The Gold Bracelet, Dhanalakshmi, The Last Stanza, The Wedding, Soda Nayudu, The Quagmire, Aasthikalu, Simhachalam Champak Flowers and Mithunam. వీటిలో మూడు కథలు (చివరి చరణం, ఆస్తికలు, సింహాచలం సంపెంగ) తెలుగు మిథునం కథాసంకలనం ప్రచురించాక వచ్చినవి. తెలుగు సంకలనంలో ఉన్న అరటిపువ్వు సాములారు, వరహాల బావి కథలు ఆంగ్లసంకలనంలో లేవు.

శ్రీరమణ గారి కథలు మనపై బలంగా ముద్ర వేసుకోవటానికి ముఖ్యంగా నాలుగు కారణాలున్నాయని నేననుకుంటాను. మొదటిది వస్తుబలం; రెండు: వాతావరణ కల్పన; మూడు: మనలో చాలామంది గతస్మృతులని గుర్తు చేసుకొని, గతించిన ఒక కాలాన్ని మళ్ళీ పట్టుకోడానికి పడే ఆరాటాన్ని తాకడం; నాలుగు: కథ చెప్పే ఒడుపు, భాషను వాడుకొనే విధం. ఈ కథల్లో రచయిత కొద్దిమాటల్లో చెప్పే విషయాలు తెలుగువాళ్ళకు ఇట్టే అర్థం అవుతాయి. వేరే భాషల, సంస్కృతుల వారికి అర్థం కావాలంటే కొంత వ్యాఖ్యానమో, విపులీకరణో అవసరం. దీనికితోడు, తెలుగు పలుకుబళ్ళని లాఘవంగా ఉపయోగిస్తారు శ్రీరమణగారు. చాలాసార్లు క్లిష్టమైన విషయాల్ని క్లుప్తంగా షార్ట్‌హేండ్‌లో మనకు అర్థమయ్యే కోడ్‌లో చెప్పేస్తారు. ఇవి అనువాదానికి తేలిగ్గా చిక్కవు.

అందుచేత శ్రీరమణ కథల్ని ఆంగ్లంలోకి అనువాదించాలనుకోవడం ఒక సాహసమే. ఈ సాహసం చేసినందుకు శ్రీ చంద్రహాస, మొహాపాత్రలను అభినందించాల్సిందే.ఈ కథలను అనువదించాలంటే రెండు ముఖ్య పద్ధతులున్నాయి. మూలాన్ని శ్రద్ధగా అంటిపెట్టుకొని ఏ మాట, వాక్యమూ వదలకుండా మొత్తాన్ని అనువదించడం. లేక కొంత స్వేఛ్ఛ తీసుకొని, అనువాదానికి ఒదగనివాటిని వదిలేసో, కొంత మార్చో వ్రాయటం రెండో పద్ధతి. ఈ పుస్తకం అనువాదకులు మొదటి పద్ధతి ఎంచుకున్నారు (ఇంతకు ముందు మిథునం కథని అనువదించిన శ్యామలగారు రెండో పద్ధతి ఎంచుకొన్నారు). మూలాన్ని యథాతథంగా అనువదించాలనుకోవడం చాలా కష్టమైన పని. ఈ కథల్లో ఉన్న విషయాన్ని అనువదించటం తేలికే అనుకొన్నా, ఆ కథల్లో రచయిత గొంతుని (tone), పలుకుబళ్ళని (idioms) ఆంగ్లంలోకి పట్టుకురావడం చాలా కష్టమైన పని. మిథునం, బంగారు మురుగు వంటి గడచిన కాలపు గ్రామీణనేపధ్యంలో ఉన్న కథల్లో మరీని. పట్టణ, సమకాలీన వాతావరణం ఉన్న కథల్ని ఇంకొంత తేలికగా చేయవచ్చు. అదే ఈ సంపుటంలోనూ కనిపిస్తుంది. The Wedding, The Last Stanza వంటి కథల అనువాదాలు చదువుకున్నంత సాఫీగా The Gold Bracelet, Mithunam కథలు చదవటం సాగలేదు. ఈ కథలకు స్వేచ్ఛానువాద మార్గమే బాగుండేదేమో.

ఈ కథలపై అనువాదకుల ప్రేమ, కథలని ఆంగ్ల పాఠకులకు సంపూర్ణంగా అందించాలని వారు పడ్డ తాపత్రయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లిష్టమైన కార్యాన్ని విజయవంతంగా సాధించినందుకు వారికి అభినందనలు.

పుస్తకాన్ని చక్కటి కాగితంపై, అందమైన ఫాంటుతో, శ్రద్ధగా, పాశ్చాత్య ప్రమాణాలతో నాణ్యతగా ముద్రించారు. అమెరికన్ ఇంగ్లీషు పలుకుబడులకు అలవాటుపడ్డ నాకు  ఈ పుస్తకంలో పలుకుబడులు కొన్నిచోట్ల ఇబ్బందిగా అనిపించాయి. అనువాదంలో తప్పనిసరిగా వచ్చిన తెలుగు పదాలని, కొన్ని సందర్భాలనీ విపులీకరిస్తూ పుస్తకం చివర ఉపయోగకరమైన టిప్పణి ఉంది. తెలుగు తెలియనివారికోసం ఉద్దేశించిన ఈ పుస్తకంలో సి.పి.బ్రౌన్ అకాడెమి వారి ప్రకటనలు తెలుగులో ఉండటం నవ్వించింది.

మనం గొప్పవి అని చెప్పుకునే కథలనీ, రచయితలనీ మిగతా ప్రపంచానికి పరిచయం చేయటానికి  అనువాదాలు అవసరం.  తెలుగు రాని మీ స్నేహితులతోనో, మీ పిల్లలతోనో ఈ కథలను పంచుకోవాలనిపిస్తే, ఈ అనువాదాలు ఉపయోగపడతాయి.

*************************
Mithunam and Other Stories
Sriramana
Translated from Telugu by K. Chandrahas and K.K. Mohapatra
July 2011
CP Brown Academy, No. 53 Nagarjuna Hills, Panjagutta, Hyderabad 500082
Phone: 040-2342 3188
E-mail: info@cpbrownacademy.org
170 pages; Rs. 190 /$ 10.

 

You Might Also Like

18 Comments

  1. కొత్తపాళీ

    Interested to check out the translation.

  2. siddharth

    hello sir,
    your guess is wrong. i am not writer. i will give my address thu email.
    siddharth

  3. చంద్రహాస్

    సిధ్ధార్థ గారూ
    Thanks a lot for your comment on translation of Telugu stories/literature.
    Are you a writer? I guess you are.
    Would you please write to me at kchandrahas@yahoo.com. I wish to send you a copy of our book.

  4. siddharth

    చంద్రహాస్ గారూ
    మీ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మిథునం కంటే కూడా బంగారు మురుగు ఇంకా మంచి కథ అనినేను భావిస్తాను. ఇతర భాషా సాహిత్యాల గురించి తెలుగువారికి తెలిసినట్లు తెలుగుసాహిత్యం గురించి ఇతర రాష్ట్రాల వారికి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. ఈ అనువాదాల పరిచయంలో ఎవరు ఏ చిన్న ప్రయత్నం చేసినా వాళ్ళ వెన్నంటినే ఉండాలని నేను భావిస్తాను.
    ధన్యవాదాలు..

  5. K.Chandrahas

    ఈ వ్యాసం మా ఇంగ్లీషు పుస్తకం Mithunam and Other Stories గురించి అని మొదట్లో సంతోషపడ్డాను. సిధ్ధార్థ గారు said it is not. Derail అయిన బండి మళ్లీ పట్టాలమీదకు వస్తుందేమోనని ఆశపడ్డాను. అది జరగలేదు. ఇంకో మార్గం పట్టింది. పుస్తకంలో మిథునంతోబాటు ఇంకా ఎనిమిది కథలున్నాయి. అన్నీ మంచి కథలే. తెలుగులోకూడా మంచి కథలున్నాయి అని తెలుగు చదవలేనివారికి తెలిపే మా ప్రయత్నంపై కాస్త దృష్టి మరల్చమని మనవి.

  6. సూరంపూడి పవన్ సంతోష్(పక్కింటబ్బాయి)

    నిజానికి ఈ కథలో ప్రత్యేకత పైన siddharth అన్నట్టు బ్రాహ్మణ వంటలూ వాటి రుచులూ కాదు. పండిన వయసులోని దాంపత్యం దాని రుచీనీ. అందుకే కథ చెప్పించేందుకు యవ్వనంలో కూడా పడని కుర్రాణ్ణి ఎంచుకున్నాడు.
    ఇదే కథని జాలరి దంపతులు ద్వారా చేపలు వండిస్తూ చెప్పినా తేడా ఉండదని నా అభిప్రాయం. రచయిత తనకు తెలిసిన వాతావరణాన్ని రాయాలన్న ఉద్దేశ్యం వల్ల ఈ కథ ఇలా వచ్చింది అంతే. కథ నచ్చకపోతే రచయిత ఫోన్ నెంబరు ఎన్నో పత్రికల్లో పడుతూంటుంది ఒక్క కాల్ కొట్టి ఆయనకే చెప్పొచ్చు.

  7. డా. మూర్తి రేమిళ్ళ

    “Mithunam and other stories” గురించి జంపాల చౌదరి గారు చేసిన పరిచయం, దాని మీద సిద్ధార్థ్ గారు రాసిన వ్యాఖ్య, మళ్ళీ దానికి జంపాల చౌదరి గారి సమాధానం ఇలా అన్నీ చదువుతున్నాను.

    ఒక కథ గురించీ దాని మీద వచ్చిన పరిచయ వ్యాసానికీ ఇంత హంగామా జరగడం సంతోషంగా వుంది. అందులో నాకు కూడా ఇష్టమైన మిథునం కథ గురించి ఇదంతా జరగడం ఇంకా సంతోషాన్నిచ్చింది. కానీ ఒకింత పక్క దారి పట్టిందేమో అనిపిస్తోంది కూడా.

    సిద్ధార్ద్ గారూ,

    ఏ కథ అయిన సినిమా అయిన అసలు ఏదైనా అందరికీ నచ్చాలని రూలు లేదు + వున్నా ఎవరూ ఫాలో కాలేరు కూడా. అసలు అల వుంటే లోకం లో ఇంత వైవిధ్యం కానీ ఇన్ని రకాల కథలు, పుస్తకాలు రావడానికి అవసరం + అవకాశం కూడా ఉండేవి కాదు.

    మీకు మిథునం కథ నచ్చక పొతే ఆశర్యం లేదు, తప్పు కూడా కాదు. “జిహ్వ కో రుచి – పుర్రెకో బుద్ధి అన్నారు”. మళ్ళీ మిమ్మల్నేదో అన్నన్ను అనుకునేరు ! ఇంతకు ముందే చెప్పినట్లు అది లోక సహజం ! “లోకో భిన్న రుచి: ” అన్నారు కూడా.

    అయితే, ” కాస్తంత ఇంగువ (రుచి)కథగా తప్పితే ఇదేమంత (మిథునం) గొప్ప కథేమీ కాదు. ఒక మామూలు మంచి కథ మాత్రమే. పోనీ ఇదెందుకు గొప్పకథ అయిందో జంపాలగారు విడమరిచి చెప్తే చదివి తరిస్తాం.” అని అనడం ఒకింత వ్యంగ్యమే ! ఈ కధను ఇష్టపడి, దాని కోసం కష్టపడి సంపాదించుకుని చదివి ఆనందిస్తున్న పాథకులనీ చిన్నబుచ్చడమే, నొప్పించడమే !

    అదే విధం గా జంపాల గారి పరిచయం గురించి – “కథల గురించి, కథకుడి గురించి కాక అనువాదం గురించి ఇంకాస్త ప్రస్తావించి ఉంటే బాగుండేది.” అన్న మీ వ్యాఖ్య లో తప్పు లేదు. మీరు ఎక్ష్పెక్త్ చేసినది మోర్ అబౌట్ త్రన్స్లతిఒన్ అయితే అదీ తప్పు కాదు. అంతటి తో ఆగితే సరిపోయేది. బట్ వంటలలోకి వెళ్లి వాటినే చూడడం ……… !!

    అసలు ఈ కధలో ఇంగువ , దప్పళం మాత్రమె చూసి రాసేరు మీరు. జంపాలా గారు కూడా (కావాలనే అనుకుంటాను) ఇంగువ మాత్రమె కాక మిగిలిన పోపు పదార్ధాల గురించి కూడా గుర్తు చేసి మళ్ళీ నోరూరించేరు. నిజానికి అది కాదు ఇందులో ఉన్నదీ ఇంత మంది ఇన్ని రోజులగా మాట్లాడుకుంటూ, కథనీ, కథ చదివితే వచ్చిన ఆనందాన్నీ పంచుకుంటూ అదో కొత్త ఆనందాన్ని అనుభవిస్తున్న ఈ కథ లో వున్నది.

    వంటలు, ఇంగువ, శనగలు పైకి కనపడేవి మాత్రమే. కానీ ఇందులో కథ పేరుకి తగ్గట్టు వున్నవి ఏమిటంటే – ఆ వృద్ధ దంపతుల మధ్య వున్నా ఆప్యాయతా, అనురాగం, చిన్న పిల్లల్లా అప్పుడే పెళ్ళైన వాళ్ళల్లా పోట్లాడుకుంటూ (అలా కనిపిస్తూ) వున్నా అంతర్లీనంగా ఒకరి మీద ఒకరికి వున్న ప్రేమ, అంత మంది పిల్లలున్నా తమ జీవితం తాము బతకాలనుకుని , తమకోసం బతకాలనుకుని , తమకు నచ్చిన విధంగా బతకాలనుకుని బతకడం, ఒకరి కోసం ఒకరుగా , తమ సహచరునిలోనే పిల్లల్నీ ప్రపంచాన్నీ చూసుకోవడం, అలాగని పిల్లల్ని మర్చిపోకుండా చెట్లకి కూడా వాళ్ళ పేర్లు పెట్టుకుని పలకరించుకోవడం ….ఒక పక్షుల జంట (మిథునం అన్న పేరు కి తగ్గట్లు గా) ఎలా బతుకుతుందో అలా ముడుసరి లో బతకాలని చూపించిన కథ ఈ మిథునం. వాళ్ళల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి వున్న ప్రేమకి తార్కాణం, ఉదయం అటక మీద వుంచేసిందని అరిచిన హీరో (అప్పదాసు) హీరోయిన్ (బుచ్చి) ని దగ్గరుండి పేరంటానికి తీసుకుని వెళ్ళడం ఒకెత్తు అయితే; తను లేక పొతే ఆయన ఏమైపోతాడో అని ఆలోచించి ఏ భారతీయ స్త్రీ కోరుకొని విధం గా అతనే ముందు వెళ్ళిపోవాలని ఆమె కోరుకున్న తీరు వాళ్ళ మధ్య ప్రేమకి పరాకాష్ట గా మనసుల్ని కదిలించడం ఇందులోని విశేషం. ఇలా చెబుతూ పొతే అన్నీ విశేషాలే ! ఎందుకంటె ” తా వలచింది రంభ, తా మునిగింది గంగ” అన్నారు.

    ఇక దీనికి గణపతితో పోలిక పెట్టడం, దానిలోని అపహాస్యపు రూపంగా చూపించాలుకోవడం అంతగా సరి కాదు. నేను కూడా గణపతి నవలకి కూడా అభిమానినే. కానీ ఇవి రెండూ వేరు. మళ్ళీ రుచుల భాషలో చెప్పాలంటే ఒకటి పంచదార,ఒకటి బెల్లం. రెండూ తీపి వస్తువులే అయిన దేని రుచి దానిదే. ఇష్టం వున్న వాళ్ళు సందర్భాన్ని బట్టి రెండూ తినొచ్చు. లేదా ఏదో ఒకటే తినొచ్చు. అసలు తీపే ఇష్టం లేక పొతే కారం తినొచ్చు. అంతే కానీ, చెరుకుని పీల్చి పిప్పి చేసి దాంట్లో రసాన్ని జుర్రేసుకున్నవాళ్ళు అనీ, పొయ్యి మీద మరగ బెట్టి తీసుకున్న వాళ్ళు అనీ అంటే ఎలా ?

    అందరు దేవతలూ ఒకే సారి ప్రత్యక్షమై వరాలు కురిపించేసినట్లు; ఎన్నో రోజుల, నెలల, సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ మధ్యనే నాకు బాపు గారి handscript లో మిథునం కథ, వెంటనే PDF gaa “బంగారు మురుగు” కథా, అవి రెండూ దొరికిన ఆనందం గుండె దిగే లోగానే మొత్తం ఎనిమిది కథల సంపుటి (పుస్తకం) దొరకటం జరిగేయి. అవి చదువుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందిస్తున్న నాకు , మీ వ్యాఖ్య పానకం లో పుడక లాగ అనిపించింది ( అదిగో మళ్ళీ తిండి ధ్యాస అనుకునేరు.. అదో గొప్ప ఉపమానం) ! అందుకే కొంచెం ఎక్కువగా react అయ్యేనేమో …. మొత్తమ్మీద నేను చెప్పదలచుకొన్నదేమిటంటే …. ఎవరికి ఇష్టమైనది వారు చదువుకోండి బాగున్నవీ బాగోనివీ (అంటే బాగా అనిపించనివీ) పంచుకోండి. కానీ ఏమి బావుంది ఎందుకు బావుందీ అనడం అంతగా బాగోలేదు !

    (మీకు చెప్పినట్లే నేను కూడా “అలా ఎందుకు అన్నారూ” అని అనకూడదేమో అని ఇంతా టైపు చేసేక ఇప్పుడనిపిస్తోంది. అన్య్వయ్, అది వేరే సంగతి !)

    జంపాల గారూ,

    Many thanks to you. కథలు, కథల పుస్తకాలూ అంగట్లో దొరుకుతాయి కానీ వాటి వెనుక వున్న కమామీషూ (కథ-కమామీషూ లో) అరుదు. దాన్నిమాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  8. siddharth

    భోజనప్రియుడు తనకిష్టమైన వంటకాలన్నీ ఏకరువు పెడితే అదొక గొప్ప కథవుతుందా? ఒకసారి గణపతి నవలా నేపథ్యం చూడండి. ఆ పెళ్ళిభోజనంలోని మనుషుల భోజన ప్రియత్వం నుంచే, కక్కుర్తి నుంచే గణపతి నవల పుట్టింది. అప్పదాసు పాత్రలో గణపతి ఉన్నాడు. గణపతి నవలలోని అవలక్షణాల నుంచే మిథునం కథ పుట్టుకువచ్చింది.

    1. Jampala Chowdary

      అప్పదాసుని, గణపతిని, మిథునాన్ని మీరు, నేను వేరుగా అర్థం చేసుకున్నట్లున్నాము.

      భోజనప్రియుడు తనకు తెలిసిన వంటలగురించే రాస్తే అది గొప్ప కథా కాదు,మామూలు మంచి కథ కూడా కాదు. మిథునం కథలో వంటల ప్రస్తావన, పూలమొక్కల, పళ్ళచెట్ల వర్ణనలు తీసివేసినా కూడా అది మంచి కథే అవుతుంది. ఆ కథ అప్పుడు మిథునం కాదు అనేది వేరే విషయం.

  9. siddharth

    కథల గురించి, కథకుడి గురించి కాక అనువాదం గురించి ఇంకాస్త ప్రస్తావించి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తూ ఆ ప్రయత్నం ఎక్కువగా చేసినట్లు లేదు. అవసరానికి మించి పొగడటానికే ఈ వ్యాసం పనికొచ్చింది. కాస్తంత ఇంగువ (రుచి)కథగా తప్పితే ఇదేమంత (మిథునం) గొప్ప కథేమీ కాదు. ఒక మామూలు మంచి కథ మాత్రమే. పోనీ ఇదెందుకు గొప్పకథ అయిందో జంపాలగారు విడమరిచి చెప్తే చదివి తరిస్తాం.

    1. Jampala Chowdary

      సిద్ధార్థ్ గారూ:

      ఇంత సులువుగా తరించేట్టైతే, ఈ వ్యాసంతో పాటు దీనికి ఉన్న లంకెలు కూడా తొందరగా చదవండి.

      ఈ కథగురించి మీదైన అనుభవం మీది; de gustibus non est disputandum.

      ఐతే, ఈ కథ కాస్తంత ఇంగువ రుచి కథ మాత్రమే అన్న మీ అభిప్రాయంతో నేను తీవ్రంగా విభేదిస్తున్నాను. ఇది ఆవపెట్టిన అరటికాయకూర, తోటకూర పప్పు, (తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా, హద్దుమీరకుండా) కొతిమీర వేసిన వంకాయబజ్జిపచ్చడి, కర్వేపాకు చెట్టుమీంచి తీసి వెంటనే వేసిన చారు, జామకాయలు, అరటిపళ్ళు, ఒరుగులు, వడియాలు, అప్పడాలు, మామిడి టెంకలు వేసి మరీ క్షీరసాగరమథనంలా కోలహలంగా మరిగించి పోపుపడితే తొలకరిలా ఉరిమి రాచిప్పలో ఉప్పెన వచ్చినట్టున్న ధప్పళం, ఘన పంచరత్న శాకాలు, మిరపకాయలు వేయించి అప్పుడే తాళింపు వేసిన కొబ్బరిపచ్చడి, ఉప్పూకారం నేచుక్కా చిటికెడు కర్వేపాకూ కలిపిన వరిపేలాలు, వాయినంలో శనగలు, కుడుములు, కందట్లు, పొంగరాలు, అన్నిటికన్నా ముఖ్యంగా మధుపర్కం కొంగుకి ముడేసిన మూటలో వేరుశనక్కాయల రుచుల కథ కూడా. ఇంగువ కూడా కాస్తంతేం కాదు; ఉదారంగా, హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో.

      శ్రీరమణగారి మాటల్లో చెప్పాలంటే, “…(కొందరు) ‘కథలో అంత సీన్ లేదు. బ్రాహ్మణవంటల మీద రాయబడింది.’ అన్నారు. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి. భోజనప్రియుణ్ణి.”

      ఈ వ్యాసం కొద్దిగా జాగ్రత్తగా చదివితే, కథ చదివినప్పుడు నా అనుభవం గురించి చెప్పటం తప్పించి మిథునం గురించి నేను ఒక్క విశేషణం కూడా వాడలేదని గమనించగలరు. మీకు పొగడ్త అనిపించినది నిజంగా జరిగిన విషయాల గురించిన జాబితాయే.

      అన్నట్టు, ఆ జాబితాలో చేర్చటంలో నేను మరిచిపోయిన ఇంకో విషయం – సినీనటుడు వేలు మిథునం కథని రంగస్థలనాటకంగా కూడా చేశారు.

  10. K. Chandrahas

    Due to oversight, in the comment that I posted a little while earlier, in the second paragraph, I said, ‘I can’t agree less.’ This ought to have been, “I couldn’t agree with you more.” I regret the error.

  11. K. Chandrahas

    Chowdary garu
    Thanks for your comments.
    You mentioned me as ‘రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ కె. చంద్రహాస్’. This needs amendment. I belonged to the Indian Revenue Service (IRS) and not the IAS. I retired as a Chief Commissioner of Income-tax while my co-translator, also from the IRS,is presently serving as the Chief Commissioner of Income-tax, Orissa.

    Please refer to your remark, “తెలుగు తెలియనివారికోసం ఉద్దేశించిన ఈ పుస్తకంలో సి.పి.బ్రౌన్ అకాడెమి వారి ప్రకటనలు తెలుగులో ఉండటం నవ్వించింది.” I can’t agree less. I was in fact furious when I saw the ads in Telugu. The publisher appears to have routinely added them because those pages were not found in the proof that I’d approved.
    Thanks once again

    1. Jampala Chowdary

      చంద్రహాస్ గారూ: సవరించాను.

  12. SRRao

    చక్కటి పరిచయం చేశారు. ధన్యవాదాలు.

    మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

    శిరాకదంబం వెబ్ పత్రిక

  13. సౌమ్య

    Thanks for the information!

    పుస్తకాల గురించి “ఆకలి”, చెప్పడంలో సరళత్వం…ఇవన్నీ ఒక క్షణం పక్కన పెడితే, ఓపిగ్గా (తరుచుగా, క్రమం తప్పకుండా కూడా!) వాటి గురించి రాయడం విషయంలో మీరు నాకు గొప్ప స్పూర్తి కలిగిస్తూ ఉంటారు.

    Please keep writing!

  14. Purnima

    @ Jampala gaaru: పుస్తకాల విషయంలో ఇంత ’ఆకలి’ని ప్రదర్శించే వాళ్ళు చాలా మంది తెల్సు కానీ, చదివిన వాటి గురించి ఇంత సరళంగా, అందంగా, to-the-point చెప్పేవాళ్ళని చాలా అరుదుగా చూసాను. Both of us – Sowmya and I, can’t thank you enough for not just giving pustakam such a boost, but also for being such an inspiration for us.

    Though, I’m kinda wary of the translated version of Mithunam.. but still worth a try, I guess. Indeed a feast for Telugu illiterates.

    Thanks a ton, for introducing! I confess, I envy you thoroughly for the access you’ve to publications in Telugu literature.

  15. KumarN

    చాలా థాంక్స్ అండీ. మీరేదైనా పుస్తకం గురించి రాస్తే, చదువుకోడానికి ఎంత సరళంగా, పాయింట్ ఏ టు పాయింట్ బి, జిపిఎస్ ఆన్ చేసుకొని వెళ్ళినట్లుగా(?!), ఎటెళ్తున్నామా అని అటూ ఇటూ తల తిప్పుకోకుండా, దారి పొడుగునా సుఖంగా ప్రయాణం చేసి, చివరకి గమ్యం చేరినట్లుగా ఉంటుంది.
    నేను తెలుగులో కూడా చదవలేదు. I wish I knew this few days ago, I would have latched onto this, as I was in Hyderabad back then.

Leave a Reply