The Unfolding of Language by Guy Deutscher

మొదలెట్టారా చదవటం? సరే, ఈ ఒక్క టపాకి మీరు నేననుకుందాం. ఇహ చదవండి:

మీరు తెలుగువారు. అనగా, మిమల్ని భూమి మీదకు కొరియర్ చేసినవాడెవడో, తెలుగింటి చిరునామాలో పడేసాడు. కొన్నాళ్ళకు మీ అల్లరి పడలేక మీ ఇంట్లో వాళ్ళు మిమల్ని బళ్ళో పడేసారు. బళ్ళో ఒక పక్క తెలుగు, హింది అనేవి నేర్పించారు. జీవనవిధివిధానంగా రుద్దబడుతున్న ఇంగ్లీషు కాక, మరో రెండు భిన్నమైన లిపుల్లో అక్షరాలను గుర్తుపెట్టుకొని, బట్టీయం వేయించి వంద మార్కుల్లో తూకం వేయించినట్టుగా నేర్చుకుంటారు మీరా భాషల్ని. తత్ఫలితంగా, ఏ వేదిక మీదైనా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడదామంటే, “అబ్బో, ప్రాంతీయ వాసన (accent) కొడుతుందే!” అని ముక్కు మూసుకుంటారు జనాలు. పోని, మనోళ్ళ మధ్యలో మాట్లాడదామంటే, “ఇంగ్లీషు ముక్క లేకుండా కక్కలేరు.. వెధవ సంత! నాశనం చేసేస్తున్నారు” అని విసుక్కుంటారు. ఇలా రెంటికి ’చెడ్డ అత్తిలి బోడోడు’ అయిన మీరు, ఎందుకొచ్చిన గోలని, తెలుగును టాంక్ బండ్‍లో వినాయక నిమర్జనం చేసినట్టు చేసేసి, మెల్లిగా మరుపుకు అలవాటు పడిపోతుండగా, పడ్డం పడ్డం.. అమాంతంగా జాలంలో పడి, ఎలక్ట్రానిక్ తెలుగు తగులుతుంది. ఇక్కడేమో అందరూ తెలుగు బాగా నచ్చిన వాళ్ళు. వచ్చిన వాళ్ళు. ఓ పక్క వీరి భాషాభిమానంతో మీకు నోట మాట రాదు. (మీది శేఖర్ కమ్ముల పాత్రల లాంటి తెలుగు కదా!) మరో పక్క మీ స్నేహితులతో ఉండగా, “చెంబు జారి, కాలి మీద పడింది” అనగానే, వాళ్ళిచ్చే ’లుక్స్’కి ఉల్లిక్కిపడి ఆ చెంబిచ్చుకునే తలబాదుకోవాలనిపిస్తుంది. ఈ లోపు, మా తెలుగు వేరే! మీ తెలుగు వేరే! అని నినదిస్తున్న వాళ్ళను చూసి, “అసలు తెలుగేదీ?” అని దిక్కులు చూస్తుంటారు.

ఇవి, ఇలా ఉండగా, కలిసొస్తే అమెరికా ఆన్-సైట్ వెళ్ళో, లేక అధమం ఒక నాలుగైదు ఫ్రెండ్స్ ఎపిసోడ్స్, ఒక నాలుగైదు సినిమాలూ చూసేసి “ఎఫ్” లాంగ్వేజ్ డౌన్లోడ్ చేసుకునేసి ఉంటారు మీ తోటివాళ్ళంతా! Quintessential telugu middle class upbringing అంతా ఏమయిపోతుందో అని మీ అనుమానం. వాళ్ళు వాడుతున్న అసభ్యకర ఆంగ్లపదాలకు బదులుగా సమానార్థాలు గల తెలుగు పదాలను వాడమంటే, ముఖ్యంగా ఇళ్ళల్లో వాడమంటే ఎలా ఉంటుందో అనుకుంటారు. మీ అమ్మ, మీ చేత, దగ్గర నుండి మరి ass = donkey అని రాయించుంటారు, ఫ్లాష్‍బాక్‍లో. మీకు ఇటాలియన్ రచయితలు ఇష్టం కనుక, కాని భాష రాక అనువాదాలే చదువుతారు గనుక, అనువాదకుల గురించి తెల్సుకోవాలని గూగుల్లితే, రెండు హాయి గొల్పే మాటలు తెలుస్తాయి. ఒకటి) ఇటాలియన్‍ భాష గురించి బెంగలెట్టేసుకొని, కిందామీదా పడిపోతున్నారు అక్కడివాళ్ళు . ముఖ్యంగా అనువాదాలకోసం శుద్ధమైన యాసలను కాకుండా, అనువాదాలకు వీలుగా ఉండే ఇటాలియన్‍ను వాడుతున్నారని. రెండు) ఇటాలియన్‍లో అసభ్య పదజాలాకి సరిపడా పదాలు ఇంగ్లీషులో లేవట! (ఇటలీలో ఉద్యోగాలు ఉండకూడదు. వాళ్ళ సినిమాలు పెద్దగా విజృభించకూడదు అని మనసులో అనుకుంటూనే, అసలు మీ భాషలో ఎంత ’సరుకు’ందీ అని ఆలోచనలో పడతారు. మునగటం రాదు కాబట్టి, సరిపోతుంది.)

పై రెండు పేరాలూ అలా ఉండగా, మీ గ్రహాలు వక్రించి, తెలుగు వార్తా ఛానల్ పెట్టుకుంటారు. జగదేకవీరుని సినిమా గురించి చెప్తూ (=విసిగిస్తూ), ముక్తాయింపుగా “అదీ సంక్షిప్తంగా స్టోరీ!” అంటుందా గొంతు. కళ్ళు తిరిగి, ఈ ముక్క మీ ఫ్రెండ్‍కి చెప్తే, మంచమ్మాయిలకు బాగా అలవాటుపడున్న అనుభవాన్ని రంగరిస్తూ, టాపిక్ మార్చి తాను చదువుతున్న పుస్తకం కబుర్లు చెప్పుకొస్తుంది. అవి వింటున్నట్టు “ఊ” కొడుతూనే, “ఏ భాషకూ కాకుండా పోయిన శాల్తీలను ఏమంటారు?”, “మిడ్-లైఫ్ క్రైసిస్ లా లింగ్విస్టిక్ క్రైసిస్‍లూ ఉంటాయా?”, “సామంత రాజులు నాకు కప్పం కట్టకుండా కాఫీ కప్పులు కడుగుతున్నారేమిటీ?”, “నా పట్టపు రాణీ పాయ్..” లాంటివన్నీ ఆలోచిస్తుంటారు.

ఇంత నేపధ్యం ఉన్న మీరు: The Unfolding of Language: An Evolutionary Tour of Mankind’s Greatest Invention
by Guy Deutscher అన్న పుస్తకం కనిపించగానే వదిలిపెట్టరు. మీ బడుగు జీవితానికి ఉన్న డైలమాలు చాలవన్నట్టు, భాషా-డైలమా కూడా ఎందుకని, ఈ పుస్తకం దానికి సమాధానం అవుతుందేమోననీ ఆశపడతారు.

పుస్తకం మొదలెట్టీ ఎట్టగానే మీకు నచ్చుతుంది. భాషలంటూ మొదలయ్యాక వాటి మనుగుడ ఎలా ఉందో చర్చిస్తాననీ, దానికి పూర్వం మానవులు ఎలా సంవాదించుకునేవాళ్ళో తెలీదనీ రచయిత స్పష్టం చేయగానే, కాసింత నిరాశ పడినా, “గానం పుట్టుక గాత్రం చూడాలా?” అనుకొని సరిపెట్టుకుంటారు. ప్రపంచ పటంలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడబడుతున్న, మాట్లాడబడి అంతరించిపోయిన భాషలను చూసి విస్తుపోతారు. భారతదేశ పటంలో, ద్రవిడ సంతతికి సంబంధించిన భాషలేవీ లేకపోవటం ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడే, భాషకు ఒక గొప్ప నిర్వచనం కనిపిస్తుంది:

 

‘this marvellous invention of composing out of twenty-five or thirty sounds that infinite variety of expressions which,whilst having in themselves no likeness to what is in our mind, allow us to disclose to others its whole secret, and to make known to those who cannot penetrate it all that we imagine, and all the various stirrings of our soul’.

మీకు గబగబా అర్థమయ్యిపోతున్న విషయాలు:

మనిషి కనిపెట్టిన వాటిలో భాషదే ప్రధమ స్థానం అని ఈయన అభిప్రాయం. కానీ ఏ ఒక్క మనిషో కనిపెట్టలేదు. ఎలా, ఎక్కడ మొదలయ్యాయో భాషలు చెప్పటం కష్టం. పింగళి గారన్నట్టు, ఎవరో ఒకరు పుట్టిస్తేనే కదా పుట్టేవి పదాలు! అందుకని పుట్టేసాయనుకున్నా ఒక్క పదాలతో పని కాదుగా! పదాలను ఎలా వాడాలి? ఎక్కడ వాడాలి? ఎప్పుడు వాడాలి? అన్నవాటి పై చాలా నియమ నిబంధనలుంటాయిగా. అవ్వన్నీ ఎవరు పెట్టినట్టు? అవే ఎందుకు పెట్టినట్టు? పదాలంటే కేవలం కనిపిస్తున్న ప్రతిదానికీ నామకరణాలు చేస్తూ పోవడమే కాదు. అనుభవంలోకి వచ్చేవాటికీ పేర్లు పెట్టాలి. మళ్ళీ కొన్ని భాషల్లో వీటికి పుఃలింగం, స్త్రీలింగం అని విభజన. అందుకు తగ్గట్టు వాడాలి. చేసే పనులుకూ పదాలు కావాలి. ఎవరు చేస్తున్నారన్నదాని బట్టి పదాలు కావాలి. ఉదా: మీరు చేస్తారు, నువ్వు చేస్తావు, నేను చేస్తాను, వాడు చేస్తాడు, అది చేస్తుంది, వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం.. ఇలా, ఒక చేయడం గురించే! తెలుగులో ఇలా. లాటిన్ భాషల్లో అయితే చుక్కలు కనిపిస్తాయట. అన్నింటికీ పదాలుంటే సరిపోదు. వాటికో క్రమం ఉంటుంది. ఆ క్రమంగా ముందుకు పోతే తప్ప కుదరవని మొండికేస్తాయి కొన్ని భాషలు. ఇంకొన్ని, ముందుకు పోవటం ముఖ్యం అంటాయి. కొన్ని భాషల్లో ఒక పదానికి ఇంకో భాషలో కొన్ని వాక్యాలు రాయాల్సి వస్తుందట.

ఇలా ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే, ఎంత చికాకో.. జర్మన్ భాషను గురించి విసుక్కున్న ఒక రచయిత:

Every noun has a gender, and there is no sense or system in the distribution; so the gender of each must be learned separately and by heart. There is no other way. To do this one has to have a memory like a memorandum-book. In German, a young lady has no sex, while a turnip has. Think what overwrought reverence that shows for the turnip, and what callous disrespect for the girl. See how it looks in print — I translate this from a conversation in one of the best of the German Sunday-school books:

GRETCHEN: `Wilhelm, where is the turnip?’
WILHELM: ‘ She has gone to the kitchen.’
GRETCHEN: ‘Where is the accomplished and beautiful English maiden?’
WILHELM: ‘ It has gone to the opera.’

ఇంతకీ విసుక్కున రచయిత పేరు: మార్క్ ట్వెన్ అని గమనించి విస్తుపోతారు. జర్మన్‍లో “వాన” పుఃలింగం అన్న విషయం మీకు నచ్చుతుంది.

అసలు మనుషులందరికీ ఒకటే భాష ఏడ్వక, ఇన్నేసి ఎందుకు అని విసుక్కునేసరికి ’టవర్ ఆఫ్ బాబల్’ కథ వస్తుంది. దాన్ని నమ్మాలని లేదు. అంతకన్నా నమ్మశక్యమైన కథ ఇంకోటి లేదో అని రచయిత అంటుంటే మీకు నవ్వొస్తుంది. పుస్తకం ఇంగ్లీషులో ఉంది కాబట్టి, ఇంగ్లీషును ఆధారంగా చేసుకునే వివరణలన్నీ ఉంటాయి కాబట్టి మీరట్టే శ్రమపడరు. అప్పుడప్పుడూ తెలుగులో అయితే ఎలా అని కూడా ఆలోచించేస్తుంటారు; పొరపాట్లు జరుగుతుంటాయి. అత్యధికంగా లాటిన్ భాషల గురించి చర్చిస్తారు. అరబ్ భాషల్నీ వాడతారు. ఎక్కడో చోట, తక్కిన భాషల్ని స్పృశిస్తారు. అందులో రెండు భారతీయ భాషలు, పంజాబి, తమిళం ఉన్నాయని మీరు గమనిస్తారు.

మెటఫార్ల మీద ఉన్న ఒక ఛాప్టర్ మీకు బెమ్మాండంగా నచ్చేసి, దాంట్లో నుండి ఒక్క ముక్క కూడా ఇక్కడ చెప్పరు. ఆ ఒక్క ఛాప్టర్ కోసం పుస్తకం చదవచ్చన్న మీ అభిప్రాయాన్ని మాత్రం చెప్తారు.

ఈ కింది వాక్యాలు చదవగానే, మీ-మా తెలుగు అనటం మనతోనే మొదలుకాదని అర్థం అవుతుంది.

An American linguist once quipped that ‘a language is a dialect with an army and a navy’, and his point is illustrated by recent cases such as Serbian and Croatian, which before the break-up of the former Yugoslavia were regarded as dialects of one language, Serbo-Croatian, but afterwards were suddenly proclaimed to be different languages.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గానీ, మీ నేపధ్యం వివరించటానికే మూడు పేరాలు తీసుకున్నారు కాబట్టి, అట్టే నిడివుంటే జనాలు చదవరు కాబట్టి, మీ ముగింపు వాక్యాలు:

భాష జీవనది. పుడుతుంది, ఖచ్చితంగా ఇక్కడ, ఇలా అని చెప్పడానికి వీల్లేకుండా. అంతమొందుతుంది, ఎప్పటికో, ఎలానో తెలియకుండా. పుట్టటం, గిట్టటం మధ్యలో కాలంతో పరుగెడుతుంది. స్థలకాలాదులకు అనుగుణంగా రూపురేఖలను మార్చుకుంటుంది. ఏ ఎండకా గొడుగు పడుతుంది. ఎందరో నాలుకలపై నాట్యమాడుతుంది. కొందరి మస్తిష్కాల్లో ఊపిరోసుకున్న ఊహలకు ఊతాన్నిస్తుంది. నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. అపార్థాలను సృష్టిస్తుంది. అర్ధాలనూ, అర్థాలనూ అందిస్తుంది. మనిషి మరో మనిషితో సంవాదించడానికి ప్రకృతి అందించిన స్వరపేటికకు అనుకూలంగా ఉన్న శబ్ధాలను అనుసరిస్తూ, ఆ శబ్దాల కలియికతో పదాలు సృష్టించి, వాటికి అర్థాలు ఆపాదించి, వాక్యాలుగా సాగి, నిరాటంకంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నవి పోగా, వచ్చేవి వస్తాయి. అరువిస్తుంది. అరువు తెచ్చుకుంటుంది. బాలారిష్టాలు దాటి, యవ్వనియై మనసులు కొల్లగొట్టి, జానతనం జార్చుకున్నాక, నిక్కుతూ నీలుగుతూ అంతమొందుతుంది. ఆ క్రమంగా ప్రతి ఘట్టాన్నీ వీలైనంత మేరకు విశిదీకరించే పుస్తకం ఇది. అందునా, భాషలకు సంబంధించి శాస్త్రీయ జ్ఞానం అవసరం లేకుండా అర్థమవుతుంది. చదువుకోడానికి సరిపడ ఆంగ్లం, అక్కడక్కడా కాసిన్ని కాఫీ నీళ్ళు, బోలెడు ఆసక్తి ఉంటే హాయిగా చదువుకొని ఆనందిచచ్చు. పైగా, కాస్తో కూస్తో జ్ఞానం కూడా అబ్బుతుంది.

ఇది చదివిన కొన్నాళ్ళకు మీరు ఉరిమి డబ్బింగ్ సినిమాకు వెళ్తారు. నాలుగొందేళ్ళ క్రితం జరిగిన కథకు ఇప్పటి తెలుగును వాడారని మీకిట్టే అర్థమయ్యిపోతుంది. అప్పటి తెలుగుకీ, ఇప్పటి తెలుగుకీ మీరు ఉదాహరణలు ఇవ్వలేకపోయినా, ఈ పుస్తకంలో వివరించిన కొన్ని ఆంగ్ల ఉదాహరణలు ఇస్తే చాలుననీ, అప్పుడు మీ పక్కనున్న భజన బృందం, “అబ్బా… నీకెన్ని విషయాలు తెల్సో” అని ఎత్తెస్తారనీ మీకు బాగా తెలిసొస్తుంది.

ప్చ్.. కానీ మీరు నేను కారు. అందుకని, ఇక్కడి దాకా వచ్చారంటే కొద్దో, గొప్పో నచ్చే ఉంటుంది గనుక, చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మీరుగా ఏమనుకుంటున్నారో నాకు నాకుగా చెప్పండి. ఎదురు చూస్తుంటాను.

**********************

Book details:

The Unfolding of Language: An Evolutionary Tour of Mankind’s Greatest Invention
Author: Guy Deutscher

Paperback, 368 pages

Author’s website – Book’s website

An interview with Guy Deutscher » American Scientist

Wordsmith’s online chat with Guy Deutsher

Amazon link

Buy The Unfolding Of Language from Flipkart.com

Through the Language glass  by same author review here.

 

You Might Also Like

5 Comments

  1. Purnima

    @veerabhadram: No. He talked very little about Sanskrit and it’s derivatives. I don’t think it was his forte.

  2. వీరభద్రం

    జర్మన్ భాషని ఉదహరించిన రచయిత,సంస్కృతం గురించి కూడా ఇలాగే ఏదైనా అన్నారా?ఆయన చెప్పినవన్నీ సంస్కృతానికి కూడా వర్తిస్తాయి కదా.

  3. పుస్తకం » Blog Archive » Interview with Guy Deutscher

    […] of “Through the language glass“, published here in pustakam.net 4) A review of “The unfolding of language“, published here in pustakam.net Purnima Tammireddy: Software engineer by profession, […]

  4. సూరంపూడి పవన్ సంతోష్(పక్కింటబ్బాయి)

    మీరు చెప్పిన “through the language glass” పుస్తకం తెప్పించి చదవడం మొదలెట్టాను చాలా బాగుంది. భవిష్యత్ కాలం లేని భాషలున్నాయనీ, అవి అంతరించిపోతున్నాయని(భవిష్యత్తు లేనందున:)) చదివి ఆశ్చర్యపోయా. ఇలాంటివి ఎన్నో ఆ పుస్తకంలో. ఇంతలోనే ఆ రచయితే రాసిన మరోపుస్తకం గురించి చెప్పేస్తే ఎలా. గుక్కతిప్పుకోనివ్వడంలేదు మీరు.

  5. సౌమ్య

    :))

    Will check out this book soon!

Leave a Reply