సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు

నా చిన్నప్పుడు చందమామలో తెనాలి రామలింగడి కథలు చదువుతున్నప్పుడు తాతాచార్యుల ప్రసక్తి వస్తుండేది. తాతాచార్యులు శ్రీకృష్ణదేవరాయలకి కులగురువు అనీ, ఆయన్నీ, ఆయన చాదస్తాలనీ రామలింగడు ఆటపట్టిస్తూ ఉండేవాడని గుర్తు. నేను మెడికల్ కాలేజీలో ఉండగా ఎమెస్కో పాకెట్ బుక్స్ వారు సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు పుస్తకం ప్రచురించినప్పుడు, నేను అవి రామలింగడి కథల బాపతు అని అనుకొని ఆ పుస్తకాన్ని పట్టించుకోలేదు. చాలాకాలం తర్వాత తెలిసింది ఈ తాతాచార్లు వేరు, ఇతని కథా-కమామీషూ వేరు అని. కొన్నాళ్ళ క్రితం వెల్చేరు నారాయణరావుగారి దగ్గరనుంచి పుస్తకం అరువు తెచ్చుకున్నాను కానీ ఇప్పటివరకూ చదవడానికి కుదిరింది కాదు. గతవారం ఒక మిత్రుడు ఈ పుస్తకాన్ని గుర్తుచేస్తే అప్పుడు చదివాను.

ఈ తాతాచార్లు కృష్ణదేవరాయల కాలం వాడు కాదు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన సి.పి.బ్రౌన్ దగ్గర ఉద్యోగి. భ్రౌన్ మాటల్లో:

” The anecdotes collected in this volume were chiefly related to me by a Telugu Brahmin named Tatachari, in the year 1842. He was a tall stout man about fifty years of age, a humorist thoroughly versed in Sanscrit learning, very learned and eloquent, most modest and humble; he died in my employ. He was a poet, a rhetorician and a logician, skilled in medicine and astronomy. I read some of the Telugu poets with him: and in the course of amusing conversations, he related to me the tales here preserved.
“ Tatachari was acquainted with Sanscrit alone beyond his native Telugu. He had made some attempts to learn Kannadi: a language connected with Telugu and using the same alphabet…”

తాతాచార్లు (తాతాచారి?) నెల్లూరు వాడని బ్రౌన్ పేర్కొన్నాడు. ఆయన ఇంటి పేరు, ఊరి పేరు, పూర్వాపరాలు తెలుసుకోవాలని పరిశోధకుడు, ఈ పుస్తకం సంపాదకుడు, బంగోరె ప్రయత్నించాడు కానీ కుదరలేదు. తాతాచార్లు 1843లో మరణించినట్లు బ్రౌన్ పుస్తకం ప్రిఫేస్‌లో ఉంది కాని, అది అచ్చుతప్పు అని 1848 అయి ఉంటుందని బంగోరె అభిప్రాయం.

1855లో బ్రౌన్ శాశ్వతంగా ఇండియా వదలి లండన్ వెళ్ళేముందు తాతాచార్ల కథల్ని కొన్నిటిని ఏరి, ముందుమాటతో, ఇంగ్లీషు తర్జుమాలతో సహా ప్రచురించాడు. 1916లో వావిళ్ళ వారు తెలుగు కథలను మాత్రం, ఎడిటెడ్ బై గురజాడ అప్పారావు, ఆథర్ ఆఫ్ కన్యాశుల్కం, అంటూ పుస్తకంగా తెచ్చారు. ఈ పుస్తకం 1926, 1951లలో పునర్ముద్రితమయ్యింది. వేర్వేరు కారణాలవల్ల ఈ కథలకి సాహిత్య గౌరవం దక్కలేదు. బంగోరెమాటలుబట్టి, నాకు మల్లేనే గిడుగు సీతాపతిగారు కూడా ఈ తాతాచార్లు కృష్ణదేవరాయలనాటి వాడని పొరపడ్డట్టున్నారు.

బ్రౌన్ చరిత్రపై విశేషంగా పరిశోధన చేసిన బంగోరెకి తాతాచార్ల కథలపై ఎవరైనా పరిశోధన చేస్తే బాగుంటుందని ఉండేది. ఎమెస్కో యం.యన్. రావుగారి కోరికపై తాతాచార్ల కథల్ని ఎడిట్ చేసే బాధ్యత తానే తీసుకొన్నాడు. ఈ క్రమంలో బంగోరె మద్రాసు ఓరియంటల్ మేన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీలో పదిలంగా భద్రపరచబడ్డ తాతాచార్ల కథల మూల వ్రాత ప్రతిని చూశాడు. ఈ వ్రాత ప్రతిలో ఉన్న 23 కథల్లో ఏడు కథలు బ్రౌన్ ముద్రితప్రతి కెక్కలేదు. ఈ రెండు ప్రతులలోనూ లేని ఎనిమిది చిన్న కథలు వావిళ్ళ ప్రతిలో ఉన్నాయట. ఈ పుస్తకంలో మొత్తం 31 కథలూ ఇచ్చారు.

బ్రౌన్ దృష్టిలో, “Taatachaarlu uses a style free from pedantry: his tales were written down from his dictation: and furnish good models of the colloquial Telugu. Several turn upon points of Sanskrit learning….These tales may supersede the prose abridgements, which are still read under the name of Panch Tantra and Tales of Vicramarca. These two are excellent compositions: but the abridgements are written in a pedantic style different from the Telugu in daily use.”

ఇంతకూ ఈ కథలు దేని గురించి? ఇవి నీతి కథలు, పురాణకథలు, రాజుల రాజకుమారుల కథలు కావు. ఆ కాలంలో నెల్లూరు ప్రాంతల్లో ప్రచారంలో ఉన్న రకరకాల విడ్డూరపు లేక వినోదపు విషయాల గురించి అని స్థూలంగా చెప్పుకోవాలి. అప్పటి సామాజిక పరిస్థితులు, స్థానిక చరిత్ర ఈ కథల వల్ల తెలుస్తాయి. దుగ్గిశెట్టి కుటుంబంలో ఒక ముసలివాడు పిండారీదండులో గుర్రపువాడిని మోసం చేసి అతను దోచుకున్న సొత్తును సొంతం చేసుకోవటం ఒక కథ. చుట్ట తాగే ఒకడు పొగతాగడం గురించి పొగకోవికి సతి మోవికి… అని పద్యం చెప్పటం ఇంకో కథ (కన్యాశుల్కంలో ఈ పద్యం ప్రసక్తి గుర్తుందా?). ఆరికాటి (ఆర్కాటు) నవాబు వాలాజా దగ్గర దివాను రాయిజీ గుడి కట్టటం మొదలుబెట్టి, తురకల వల్ల తంటాలు వస్తే గుడిని మసీదుగా మార్చటం ఇంకో కథ. నెల్లూరు తాలూకా మక్తాకు తీసుకున్న మధ్వపతి శేషగిరిరాయడు నవాబుకు లక్ష వరహాలు కలిమి దండగ ఇవ్వలేక జైలుపాలైన కథ ఇంకోటి. దేవర మాకులు (దేవుడు చెట్లు) పడగొట్టించబోయి భంగపడ్డ తెల్లదొరగారి కథ ఇంకొకటి. ఇట్లా ఈ కథల్లో చాలావరకూ సమకాలంలో జరిగిన సంఘటనలపై ఆధారపడిన కథలు.

ఈ కథలన్నీ ఒకరు ఇంకొకరికి చెప్పినట్లు ‘ఆశు’ సంప్రదాయంలో, వాడుక భాషలో ఉంటాయి. ఇప్పుడు వాడుకలోలేని కొన్ని తెలుగు మాటలతో పాటు అప్పుడు చట్ట వ్యవహరాల్లో, శిస్తు వ్యవహారాలలో, వృత్తి పనులలో, ఇంటిసంగతులలో వాడుకలో ఉన్న చాలా పదాలు ఈ కథలలో కనిపిస్తాయి. ఉదాహరణకు ముసద్దీ మామ్లీతు కథలో పొలం మక్తాకు తీసుకున్న సంసారి “అయిదు పుట్ల పద్ధెనమందుం ముక్కుస కైలు చేసి వాటికి కోరు మేడిపాలు చెరువుమేర చాతుర్భాగం మేరలు మిరాశి పొలిదోసిలి ధర్మచేట రాశడుగు కీడిశ దండగట్టి శలగ పంచాంగం మొదలైన కైరాతు కరణం చేవ్రాలుతో వైనముగా జాబు వ్రాయించి” పొలం స్వంతదారుకు పంపాడుట. పొలంలో కుప్ప నూర్చాక ఇంటికి తీసుకుపోయేముందు కొంత ధాన్యాన్ని వివిధ భాగాలుగా పనివారికీ, వృత్తిపని వారికీ, గ్రామ ఉమ్మడి వ్యవస్థలకూ సర్దుబాట్లు చేసే పద్ధతుల్ని వివరించే చాలా మాటలు ఈ వాక్యంలో ఉన్నాయి. ఈ మాటల వివరాలు తెలుసుకుంటే గ్రామీణ, వ్యవసాయ వ్యవస్థల గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నట్టే.

ఈ పుస్తకంలో ప్రతి కథా పెద్ద అచ్చులో ఉంటుంది. కథ తర్వాత కొద్దిగా చిన్న అచ్చులో ఈ కథ వెనుక ఉన్న కమామిషు గురించి బంగోరె వ్యాఖ్యానం ఉంటుంది. ఆ పైన ఇంకా చిన్న అచ్చులో,  పాదపీఠికల పద్ధతిలో, కథలో వచ్చిన కొన్ని సాంకేతిక పదాల గురించి వివిధ నిఘంటువులు, ఇతర పుస్తకాలు ఇచ్చిన వివరణలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 200 ఏళ్ళనాటి మన సాంఘిక జీవన, చారిత్రక వివరాలు మనకు తెలుస్తాయి.

ఈ కథలను సంకలించి వ్యాఖ్యానం చేసిన బంగోరె (బండి గోపాల రెడ్డి)  ఆధునిక తెలుగు పరిశోధకులలో ఎన్నదగినవాడు. “కొండను తవ్వి ఎలకను పట్టడం నా చేత కాదు. అది నా తత్వమూ కాదు. ఎలుకను తవ్వి, కాదంటే, దువ్వి కొండను కొట్టటం లేదా కొల్లగొట్టడం నాకు నచ్చిన పని. ఇదేదో పి.హెచ్.డి డిగ్రీ కోసం పడే కక్కుర్తి కాదు. ఏదో పవిత్ర బాధ్యతగా ఎంచి అందులో ఐక్యమైపోయే ఒక లౌల్యం” అంటూ ఈ పుస్తకం ముందు మాటలు ప్రారంభంలో పరిశోధనపట్ల తన ఉద్వేగాన్ని నిర్మొహమోటంగా చెప్తాడు బంగోరె. బ్రౌన్ పట్ల ఈయనకు ఉన్న ఆసక్తి, భక్తి జగమెరిగిందే. 20 పేజీల ముందుమాటల్లో తాతాచార్లు గురించి కొంత సమాచారమున్నా, బ్రౌన్ వివరాలే ఎక్కువ. ఒక్కసారి కథల్లోకి వెళ్ళాక మాత్రం, ఆ కథల వెనుక ఉన్న చారిత్రక వివరాల్ని మనకు చెప్పడానికి చాలా ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తుంది. బంగోరె వ్యాఖ్యానం, వివరణల వల్లే ఈ పుస్తకం ఇప్పుడు ఆసక్తికరంగా, అందరికీ ఉపయోగకరంగా ఉంది.

నేను ఫ్రీకెన్‌బర్గ్ గుంటూరు జిల్లా పుస్తకం చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవటానికి కష్టపడ్డ సాంకేతిక పదాలు చాలావాటికి నాకు ఈ పుస్తకంలో అర్థాలు దొరికాయి. వాటికి అర్థాలు బ్రౌణ్యంలోనో, లేక andhrabharati.com నిఘంటుశోధనలోనో వెతికితే దొరికేవి అని కూడా తెలిసింది. అలాగే ఈమధ్యే చదివిన దిగవల్లి వెంకట శివరావుగారి కథలు గాధలులో పరిచయమైన దివాను రాయరెడ్డిరావు ఇందులో ఒక కథలో ముఖ్య పాత్ర. ఈ పుస్తకాన్ని బంగోరె దిగవల్లి వెంకట శివరావుగారికే అంకితమిచ్చాడు.

పుస్తకం ఎమెస్కో పాకెట్‌బుక్స్ నాణ్యతతోనే ముద్రించబడింది. అచ్చుతప్పులు బహుతక్కువ.

పుస్తకం ముఖపత్రంపై చెప్పినట్లు ఈ కథలు వాడుకభాషకు ఒజ్జబంతులు, చరిత్రాంశాల పాతరలు, వ్యవహార పద ఖజానాలు.

********************

సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు
పరిశోధన – సంకలన: బంగోరె
జులై 1974
ఎమెస్కో పాకెట్ బుక్స్ – 233

234 పేజీలు; అప్పటి ధర 5 రూ.

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

One Comment

  1. A RAMU

    Ee pustakam yekkada dhorukuthundi

Leave a Reply