సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు – ఎన్.ఇన్నయ్య
రాసిన వారు: వెనిగళ్ళ వెంకటరత్నం
*********************
ఇన్నయ్య గారు 40-50 సంవత్సరాల క్రితం విద్యార్ధిగా ఉన్ననాటి నుంచి తన స్నేహితులు, చదువు చెప్పిన గురువులు, సహ విద్యార్ధులతో ప్రారంభమై ఈ శతాబ్దం తొలినాళ్ళవరకు, తన జ్ఞాపకాలను, అనుభవాలను ఇందులో పంచుకున్నారు. ముఖ్యంగా తను రచయితగా, పాత్రికేయుడిగా పరిణతి చెందుతున్న సమయంలో పరిచయమైన వారిని తన కోణం నుంచి గమనించి, గుర్తుచేసుకొని 60 సంవత్సరాల తరువాత నెమరువేసుకొని, గ్రంధస్తం చెయ్యటమంటే మామూలు విషయం కాదు. ఈ పుస్తకంలో, జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఏ.సి.కాలేజ్ తెలుగు అధ్యాపకులు), యెలవర్తి రోసయ్య లాంటివారే కాకుండా వ్యాసోపన్యాసక ఏ.జి.కె, గోకుల్‌చంద్, కొండవీటి వెంకటకవి లాంటి 34 మంది ప్రముఖులతో తన అనుభవాలను మన ముందుంచారు.
రచయిత మాటల్లోనే “రచయితలు, కవులు భిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాన్ని వెళ్ళడిస్తారు. కవిని కేవలం కవిత్వ విలువలతో చూస్తారు. అలాగే రచయితలను కూడా. ఈ వ్యక్తిత్వ చిత్రణలో నిశిత పరిశీలన, చనువుతో కూడిన వ్యాఖ్యలు, అంచనాలు ఉంటాయి. అందరికీ తెలియని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అభిమానులు, వీరాభిమానులు చూసిన దృష్టి ఇక్కడ కనిపించకపోవచ్చు. వ్యక్తులలో ఎన్ని వైవిధ్యాలు విభిన్న రీతులు ఉంటాయో గమనించవచ్చు. ఒకే మూస ఉండదు. వ్యక్తులను విశాల కోణములో చూడటములో ఇదొక దుర్భిణి మాత్రమే.” ఈ సాహితీపరామర్శతో కూడిన తాజా పరిశీలనే ఇన్నయ్య గారి ఈ పుస్తకం. కొందరి ప్రముఖులతో ఆయన సరసాలు చూద్దాము.
దేవులపల్లి కృష్ణశాస్త్రి
శబ్దశిల్పి కృష్ణశాస్త్రి చెవికి ఇంపుగాలేని పదం తొలిగించి, మళ్ళీ తగిన పదం లభించే వరకు పాట పూర్తిచేసేవాడు కాదు.మల్లీశ్వరి నుండి ఉండమ్మా బొట్టు పెడతా వరకు కృష్ణశాస్త్రి వ్రాసిన పాటలు అనితరసాధ్యాలు. ఒకసారి ఉండమ్మా బొట్టు పెడతా సినిమాకు వ్రాయాల్సిన చివరిపాట ఎన్నాళ్ళకు పూర్తి చేయలేదు. నిర్మాతలు కలవరం చెందారు. చివరకు గుమ్మడి వెంకటేశ్వరరావును రాయబారం పంపారు. అప్పటికే గొంతుపోయిన కృష్ణశాస్త్రి చీటీ మీద “నిజలింగప్పకు ఆరోగ్యంగా లేదు. నయం కాగానే వ్రాస్తానని వ్రాసి చూపించారు. ఆ మాటే గుమ్మడి నిర్మాతలకు చెప్తే, ఎక్కడో కర్ణాటక ముఖ్య మంత్రి నిజలింగంప్పకు బాగా లేకుంటే, పాట పూర్తి చెయ్యటానికి, ఆయన ఆరోగ్యానికి ఏమి సంబంధం అని అన్నారు. చివరకు గుమ్మడి గుట్టు విప్పి చెప్పారు. నిజలింగప్ప అంటే తన లింగానికి అని గ్రహించమన్నాడు. అందరూ విరగబడి నవ్వారు. కృష్ణశాస్త్రికి అబద్ధాలు చెప్పే గుణముందని, రచయిత ఒకటి రెండు సందర్భాలు ఉటంకించారు. హైదరాబాదులో మామిడిపూడి వెంకట రంగయ్యకు సన్మానం జరుగుతుంటే కృష్ణశాస్త్రి రంగప్రవేశం చేసి గురుపూజ అంటూ మామిడిపూడి కాళ్ళకు నమస్కరించి శాలువా కప్పి సత్కరించాడు. ఆ తరువాత వెంకటరంగయ్య గారు, వీడు నా శిష్యుడంటాడు. నాకు గుర్తున్నంతవరకు ఇతగాడికి నేను పాఠాలు చెప్పిన దాఖలాలేదన్నాడట. కృష్ణశాస్త్రిని చాలా సంవత్సరాలు దగ్గరగా చూసినవాడుగా గోరాశాస్త్రి కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు.
ఆవుల గోపాలకృష్ణమూర్తి
ఎ.జి.కె గురించిన వ్యాసంలో చాలా బరువైన విషయాలే చోటు చేసుకున్నాయి. సాహిత్యంలో ఔచిత్యం ఉండాలనేది గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాథ మొదలు ప్రాచీన కవుల వరకు తన విమర్శకు గురి చేశాడు. కవులు రచయితలలో ఆవులను అభిమానించే వర్గం ఒకటి ఆయనంటే భయపడే వర్గం మరోకటి ఉండేది. భయపడే వారిలో విశ్వనాథ ప్రథముడు. ఏ.జి.కె ఉంటే ఆ సభకు విశ్వనాథ వచ్చే వాడు కాదు. వేయిపడగలు మొదలు రామాయణకల్పవృక్షం వరకు ఉతికేసిన ఆవులంటే, భయపడటం సహజం.
పెళ్ళి ఉపన్యాసాలు ఏ.జి.కె అద్భుతంగా చేసేవాడు. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో అందరికీ అర్ధమయేటట్లు ప్రమాణాలు చేయించి వివరణోపన్యాసం చేసేవాడు. ఎం.ఎన్.రాయ్ మానవాద రచనలు సరళంగా తెలుగించారు. చిన్న పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాసారు. నా చుట్టూ ప్రపంచం అనే శీర్షికతో వాహినీ పత్రికలో చాలా కాలం వ్రాశారు. వివేకానంద భావాలను ఆలొచనలను ఘాటుగా విమర్శించిన ఏ.జి.కె పై నీలంరాజు శేషయ్య సంపాదకత్వంలో వెలువడుతున్న ఆంధ్రప్రభ ధ్వజమెత్తింది. బుద్ధునిపై విశ్వనాధ చేసిన అనౌచిత విమర్శల పై ఏ.జి.కె పెద్ద ఉద్యమం చేశారు. 1956-57 ల లో పాఠ్య గ్రంధాల నుండి బుద్ధుడిని రాక్షసుడిగా చిత్రించిన భాగాలు తొలగించే వరకు నాటి విద్యా మంత్రి ఎస్. బి.పి పట్టాభిరామారావు పై విమర్శలు చేశారు. అమెరికా పర్యటనలో జవహర్‌లాల్ను ఏ.జి.కె విమర్శిస్తే అప్పుడు అమెరికాలో భారత రాయబారి గా ఉన్న బి.కె.నెహ్రు కన్నెర్ర చేసి పర్యటన ముగియకుండానే, భారతదేశానికి పంపిస్తానన్నా బెదరలేదు. ఇంత గొప్ప కృషి చేసిన ఏ.జి.కె 1967 లో 50 సంవత్సరాల వయస్సులో మృతిచెందారు.
ఏ.జి.కె విమర్శకు గురైన ముఖ్యమంత్రులలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య ఉన్నారు. ఒకసారి సంజీవయ్య విజయవాడ కొండ పై గల దళిత బాలికల వసతి గృహం సందర్శించవలసి ఉంది. వసతిగృహం దగ్గరకు కారులో వచ్చిన సంజీవయ్య, కారు దిగి “కొండపై కెక్కాలా? నా వల్ల కాదు.” అని కార్యక్రమం మానుకుని వెళ్ళి పోయారు. ఈ వార్త తెలిసిన ఏ.జి.కె “ముఖ్యమంత్రి పదవికి దేకగలిగినవాడు, దళిత బాలికల కోసం గుట్ట ఎక్కలేకపోయాడా!” అని చురక అంటించాడు. ఈవార్త ఆంధ్రపత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది. ఆ దెబ్బతో సంజీవయ్య వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వసతి గృహానికి వెళ్ళి వచ్చాక ఏ.జి.కెకు ఉత్తరం వ్రాశారు – ” మీరన్నది నాకు బాగా తగిలింది. కళ్ళు తెరిపించింది” అని.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
1954-58 మధ్య ఏ.సి.కాలేజ్ లో పాపయ్య శాస్త్రి తెలుగు అధ్యాపకులుగా ఉన్నారు. ఆ సమయంలో ఇన్నయ్య అదే కాలేజ్లో విద్యార్ధిగా ఉన్నారు. అప్పటికే కరుణశ్రీ కలం పేరుతో వ్రాసిన “పుష్పవిలాపం” ఘంటసాల పాడారు. ఈ పద్యాలు అటు కరుణశ్రీకు, ఇటు ఘంటసాలకు మంచి పేరు తెచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్ధులు ఆయనను ఘంటసాల పాపయ్య శాస్త్రి అని పిలిచేవారు. ఏ.జి.కె మాత్రం ఆయనను పాపశ్రీ అనే వారు.
పి.వి.నరసింహారావు
1968 నుంచి పి.వి.నరసింహారావుతో స్నేహం ఉండేది. పివితో అనేక ఇంటర్వ్యూలను తెలుగు విద్యార్ధి మాస పత్రికలో ప్రచురించారు. పి.వి. హైదరాబాదులో ఉన్న రోజులలో, టి లక్ష్మికాంతమ్మ అనే మహిళా ఎం.ఎల్.ఏ తో చాలా సన్నిహితంగా ఉండేవారు. పివి. ఇంటి పేరు పాములపర్తికాగా లక్ష్మికాంతమ్మ ఇంటిపేరు తేళ్ళ. వీరి ఇంటి పేర్లను, వారిరువురికిగల సన్నిహిత సంబంధం దృష్టిలో పెట్టికొని, ఈ తేళ్ళ-పాముల బాధ భరించలేకుండా ఉన్నామని జె.సి.కొండయ్య వ్యాఖ్యానించేవారట. విశ్వనాథ సత్యనారాయణ నవల వేయిపడగలు “సహస్రఫణి” పేరుతో పి.వి. హిందీలోకి అనువదించారు. అయితే ఈ అనువాదం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం, హిందీ విభాగంలో పనిచేసిన వారణాసి రామమూర్తి రేణు అనువదించినట్లుగా చెప్పుకునేవారు.
గజ్జెల మల్లారెడ్డి
1982-83 ప్రాంతంలో ఈనాడులో పనిచేస్తున్న గజ్జెల మల్లా రెడ్డి ఇన్నయ్య గారికి పరిచయమయ్యారు. టంగుటూరి ప్రకాశం పై, ఈనాడులో వ్యాసం వ్రాస్తూ, సైమన్ కమీషన్ మద్రాస్ పర్యటన సందర్భంగా టంగుటూరి, పోలీస్ కు, చొక్కా గుండీలు విప్పి గుండె చూపించి కాల్చుకోమన్నడని అప్పటికే ప్రచారం లో ఉన్నదాంట్లో వాస్తవం లేదని ఇన్నయ్య వ్రాశారు. కాల్పులలో చనిపోయిన శవాన్ని చూడటానికి వెళ్తున్న ప్రకాశాన్ని పోలీస్ ఆపాడనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రకాశంగారే స్వీయచరిత్రలో వ్రాసుకున్నారు. ప్రకాశం అభిమానులు మాత్రం ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చి పోలీస్కు గుండె చూపెట్టి కాల్చుకోమన్నాడనే కట్టుకధను ప్రచారం చేశారు. వాస్తవం వ్రాసినందుకు గొడవ చేశారు. దీనిపై ఆగ్రహిస్తూ 1000కి పైగా ఉత్తరాలు ఈనాడు కార్యాలయానికి అందాయి. అప్పుడు గజ్జెల మల్లారెడ్డి ఇన్నయ్య వ్రాసిన వాస్తవాన్ని సమర్ధించారు.
ఇంకా ఈ పుస్తకంలో సినారె, గోరా శాస్త్రి , నార్ల లాంటి వారితో ఇన్నయ్య కు గల పరిచయాలను చాలా విపులంగా వ్రాశారు. గోరాశాస్త్రి గురించిన వ్యాసం జీరాలో ఒక కోబ్రా .1968 లో ప్రారంభమయిన దిగంబర కవితోద్యమాన్ని అవహెళన చేసినందుకు తట్టుకోలేని విప్లవ కవులు ఆయనను జీరా లో ఒక కోబ్రా గా చిత్రిస్తూ కవితలల్లి తమ అక్కసు వెళ్ళగక్కారు. గోరాశాస్త్రి ఉంటున్న నివాసం సికందరాబాదులోని జీరా లో ఉండేది.
చివరగా, ఇంకా ఈ పుస్తకంలో సినారె, నార్ల, డి.వి.నరసరాజు, ఆలపాటి రవీంద్రనాథ్, కాళోజీ, రావిశాస్త్రి, పురాణం, చలసాని ప్రసాదరావు లాంటి వారితో ఇన్నయ్యకు గల పరిచయాలను విపులంగా వ్రాశారు. ఈ చిన్న పుస్తకంలో గత 50 ఏళ్ళలో సాహిత్య , పత్రికారంగాలలో ప్రముఖులతో పరిచయాలతో కూడిన ఆత్మీయతను తెలిపే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ తరం వారికి ఈ సంఘటనలు ఆసక్తికరంగా ఇన్నయ్య గారు తెలిపారు.
ప్రచురణ: శాస్త్రీయ పరిశోధనా కేంద్రం, హైదరాబాదు.
ప్రధమ ముద్రణ: 2008
ధర: రూ 50/-
అన్ని ప్రధాన పుస్తకాల దుకాణాలలో లభ్యం.
సాహితీ పరులు, పాత్రికేయులతో సరసాలు ఇ-పుస్తకాన్ని ఇక్కడ చదవ వొచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు.
Leave a Reply