చరిత్రను పరిచయం చేసే “కథలు-గాథలు”

ఇతిహాసపు చీకటికోణాల సంగతుల మాటెలా ఉన్నా సాక్ష్యాలతో సహా లిఖించబడిన చారిత్రక విశేషాల గురించి కూడా మనకు సరిగా తెలీదు. కొన్ని విషయాలపట్ల మనకు ఆసక్తి ఉండదు. మరికొన్ని విషయాలపట్ల మనకు అపోహలు ఉంటాయి. పుక్కిటి పురాణాలు చారిత్రక సత్యాలుగా గుర్తించబడతాయి. చరిత్రపఠనం, పరిశోధన, నిజశోధన, అన్న మాటలు మన మాధ్యమాల్లో పనిచేసే చాలామందికి అలవాటులేని మాటలు. అందుచేత మనకు రొడ్డకొట్టుడు చరిత్రపాఠాలు తప్ప మన గతాన్ని గురించి చాలా విషయాలు తెలీవు.

దిగవల్లి వేంకట శివరావుగారు వృత్తిరీత్యా న్యాయవాది. కానీ, ఆయనకు చరిత్ర మీద చాలా ఆసక్తి ఉంది. తన 96 సంవత్సరాల (1898 -1992) జీవితంలో 60 పుస్తకాల దాకా రచించారట. చరిత్రకారులుగా భారత రాష్ట్రపతిచే గుర్తించబడ్డారట. ‘కొన్ని చరిత్ర గ్రంథాలలోను, జీవితచరిత్రలలోను, దినచర్యలు, జాబులు, యాత్రా వృత్తాంతాలు, (Reminiscences) అనుభవాలు, జ్ఙాపకాలు మొదలైన వాటిలోను, రచ్చకెక్కిన వ్యవహారాలలోను ఇంకా ఇతర గ్రంథాలలోను నాకు కనబడిన రసవంతములైన ఘట్టములే ఈ కథలు – గాథలు” అంటూ శివరావుగారు 1942 నుండి ఒక దశాబ్దంపాటు భారతిలోను, ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలలోనూ రాసినవి ఒక పుస్తకంగా 1944లో ముందు ప్రచురించారు. 1945లో రెండవభాగం ప్రచురింపబడింది. 1947కల్లా నాలుగు భాగాలు ప్రచురింపబడ్డాయట. ఇప్పుడు ఈ నాలుగు భాగాలు కలిసి ఒక్క పుస్తకంగా విశాలాంధ్ర వారు ప్రచురించారు.

శివరావు గారు “పెద్ద పెద్ద గ్రంథాలయాలలో మూలపడిఉన్న పాత పుస్తకాల బూజు దులిపి చదివిన కొద్దీ” చాలా ఆసక్తికరమైన విశేషాలు ఆయనకు కనబడ్డవి. వాటిలో కొన్ని మచ్చుకి:

జగద్గురు తత్వానందస్వామి కథ: భారతదేశంలో క్రైస్తవమతం ప్రచారం చేయటానికి మిషనరీలు మొదట్లో చాలా ప్రయత్నించినా ప్రజల్ని అంతగా ప్రభావం చేయలేకపోయారట. 1606లో రోబర్టో డీ నోబిలి అనే ఇటాలియన్ మత ప్రచారకుడు మధురానగరికి (చోళమండలంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న చిన్న రాజ్యం; ఏకవీర నవలకు కథాస్థలం) వచ్చాడు. ఆయన అక్కడకు రాకముందు ఉన్న మత ప్రచారకులు 17 సంవత్సరాలు కష్టపడితే అవసానదశలో ఉన్న ముగ్గురు నలుగురు తప్ప ఇంకెవర్నీ క్రైస్తవులుగా మార్చలేకపోయారట. కారణాలు ఆలోచించిన డీనోబిలి, “రోము నగరంలో ఉన్నప్పుడు రోము నగరవాసుల లాగానే ప్రవర్తించాలి” అనే సామెత ప్రకారం క్రైస్తవమత ప్రచారకుడు తాను నివసిస్తూ ఉన్న దేశ వ్యవహారాలను గమనించి ఆ ప్రకారమే తాను కూడా ప్రవర్తిస్తేనే తప్ప లాభం లేదనిన్ని, హిందూదేశాచారాలయందు అగౌరవము కలిగించేటట్లు ప్రవర్తించడంవల్ల ప్రజలకు అవమానము, అవిశ్వాసముకలిగి, వారు క్రైస్తవమతం దరికి చేరకున్నారనిన్ని కనిపెట్టాడు. ఆయన స్థానికులతో తాను పరంగీని (పోర్చుగీస్ సంతతి వాడిని) కాననీ, సన్యసించి వచ్చిన ఇటాలియన్ రాజసంతతి వాడిననీ చెప్పుకుని ఒక మట్టిగోడలు గల పూరిపాకలో నివసిస్తూ, కాషాయ బట్టలు కట్టుకొని, పావుకోళ్ళు తొడుక్కొని, జందేలు వేసుకొని (శిలువతో సహా), మాంసాహారం మానేసి, నిష్టగా సన్యాసిలాగా జీవిస్తూ, తమిళం, సంస్కృతం, తెలుగు నేర్చుకొని నగర ప్రముఖులతో ధార్మిక చర్చలు చేస్తూ, జగద్గురు తత్వానందస్వామి అనే పేరుతో వ్యవహరించసాగాడు. హిందూ మతగ్రంథాలలోని విషయాలని కలుపుకుని మాట్లాడుతూ క్రైస్తవమతానికి చాలామందిని మార్చటంలో కృతకృత్యుడయ్యాడు. కొన్నాళ్ళకు మేలుకొన్న స్థానికులు ఆయన యత్నాలను ప్రతిఘటించటం మొదలుపెట్టారు (ఏకవీరలో మీనాక్షీదేవి ఈ డీనోబిలిని మతచర్చకు చెందిన వాగ్వివాదంలో ఓడించగా, అతని నాలుగేండ్ల ప్రయత్నాలు దానితో భగ్నమైనట్లు విశ్వనాధ రాశారు). తర్వాతిరోజుల్లో మతాధికారులు డినోబిలీగారు ఇట్లా హిందూ సన్యాసి వేషం వెయ్యడాన్ని నిషేధించారట.

ఖైదులో చెన్నపట్నం గవర్నరు
: కర్ణాటక నవాబు (ఆర్కాటు నవాబు) మహమ్మదాలీ భోగవిలాసాలతో జీవిస్తూ, కొలువులో చాలామంది ఇంగ్లీషువారిని పెద్దజీతాలతో పెట్టుకుని, ఖర్చులకోసం ఇంగ్లీషువాళ్ళదగ్గర పెద్ద వడ్డీలకు అప్పులు చెయ్యటం మొదలుబెట్టాడట. నెమ్మదిగా ఈ అప్పు రెండుకోట్ల నవరసుల (పౌన్ల)దాకా తేలింది (వీటిలో ఒకకోటీ తొంభై లక్షల నవరసులు అబద్ధమని తర్వాత కంపెనీ వారు విచరణలో తేల్చారట). ఈ అప్పుపై సాలుకు 60,23,000 నవరసులు వడ్డీగా చెల్లించవలసి వచ్చేదట. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయానికి రెట్టింపు అట. అప్పు పత్రాల్లో చాలా దొంగ పత్రాలున్నా, పై అధికారులు ఈ పత్రాలున్నవాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాటిని న్యాయబద్ధమైనవే అని తీర్మానించారట. డబ్బులు చెల్లించటం కష్టమైన నవాబుగారు కొంతమంది ఇంగ్లీషువారి సహాయంతో తంజావూరు రాజ్యంపై దండించి గెలిచి, ఆ రాజ్యంలో పండిన పంటలు మొత్తాన్నీ పాల్ బెన్‌ఫీల్డ్ అనే ఆయన అప్పుకింద దఖలు చేశాడట. గవర్నరు పిగట్టుగారికి ఈ తంజావూరు ఆక్రమణ అన్యాయంగా తోచింది. ఈ విషయం పైన ఆయనకూ, గవర్నర్ కార్యాలోచనాసభకు అభిప్రాయభేదాలు వచ్చాయి. గవర్నరుగారు కార్యాలోచన సభను రద్దు చేయటానికి ప్రయత్నించారు. కార్యాలోచనసభ వారు గవర్నర్‌ని ఖైదులో పెట్టారు. ఈ విషయం అంచెలంచెలుగా లండన్‌లో ఉన్న డైరెక్టర్ల మండలి దాకా వెళ్ళింది. అక్కడ వ్యవహారాలు తేలేలోపు పిగట్టుగారు ఖైదులోనే మరణించారట.

దుబాషీ లంగరు పాపయ్య కథ. అవధానం పాపయ్య అనే నెల్లూరి సీమ ఆంధ్ర వైదీక బ్రాహ్మణుడు లంగరు పాపయ్యగా ప్రసిద్ధుడయ్యాడు. చెన్నపట్నం రేవులో లంగరువేసిన ఓడల లెక్కలు రాసే యాంకరేజ్ అకౌంటు గుమస్తాగా జీవితం ప్రారంభించి, నెమ్మదిగా గవర్నర్స్ కౌన్సిల్ సభ్యులు ఐన హాలెండ్ సోదరులకి దుబాషీ అయ్యాడు. 1789-90 ప్రాంతంలో ఆ సోదరులిద్దరూ  ఒకరి తర్వాత ఒకరు చెన్నపట్నం గవర్నరులుగా పని చేశారు. ఆకాలంలో మద్రాసులో జరిగిన చాలా లావాదేవీలలో, లంచాల వ్యవహారాల్లో పాపయ్యగారు పెద్దపాత్ర వహించారు. పైన చెప్పిన ఆర్కాటు నవాబు బాకీల విషయంలో కూడా పాపయ్యగారిది పెద్ద పాత్రే. ఫోర్జరీ పత్రాలు సృష్టించి తన విరోధులపై తప్పుడు కేసులు బనాయించి చివరకు దొరికిపోయారు. సర్ వాల్టర్ స్కాట్ రాసిన సర్జన్స్ డాటర్ అనే నవలలో పాపయ్య అనే దుష్ట దుబాషీ పాత్ర ఉంటుంది. పాపయ్యగారు అనేక అపూర్వ సంస్కృత గ్రంథములను ప్రోగుచేసి, వాటికి ప్రతులను రాయించి కొన్నిటిని తెలుగులో అనువదింపచేశాడట.

ఇంకా చిలకసరస్సులో రంభ అనే ఊళ్ళో గొప్ప భోగభవనం కట్టించుకున్న గంజాం జిల్లా లంచగొండి కలెక్టరు స్నాడ్‌గ్రాస్, తనపై విచారణకు అధికారులు వస్తే రికార్డులన్నీ పడవలోపెట్టి చిలకసముద్రంలో ముంచేసిన కథ, ఆ తర్వాత తన ఉద్యోగాన్ని తీసేసి పెన్షన్ ఇవ్వకపోతే, ఇంగ్లండులో కంపెనీ భవంతి ఎదుట నిరుపేదలా నటించి, ఆ అప్రదిష్ట వదిలించుకోవటానికి కంపెనీవారితో పెన్షన్ ఇప్పించుకున్న కథ, శాపగ్రస్తమని చెప్పుకునే హోప్ వజ్రం కథ, కోహినూర్ వజ్రం కథ, మన పంచతంత్రం ప్రపంచమంతా వివిధ పేర్లతో ప్రచారమైన వివరాలు, ముసల్మాన్ పాలకులు హిందూ పద్ధతులను అనుసరించిన కథలు, కృష్ణదేవరాయలి ఆస్థానంలోని కావలి తిమ్మడి కథ, హొన్నూరు ఫకీరుల (శైవం పద్ధతులు పాటించే ముస్లిములు) కథ, ఆల్బెరూనీ చెప్పిన మహాభారతం వివరాలు, అయోధ్య మహారాణీ జీవిత విధానం వంటి వైవిధ్యమైన కథలు మొత్తం 58 ఉన్నాయి ఈ పుస్తకంలో. వీటిలో ఒక వ్యాసం భారతీయ చరిత్రపై టాగూర్ రాసిన దానికి స్వేఛ్ఛానువాదం.

ఈ కథల్లో చాలావాటికి శివరావుగారు తాను చెప్పినదానికి అధారభూతాలైన పుస్తకాల వివరాలు ఇస్తారు. అప్పుడప్పుడూ కొన్ని చారిత్రకాధారాలు లేని, వ్యాప్తిలో ఉన్న కథలు కూడా చెప్పినా, చరిత్రకూ చరిత్ర కానిదానికి ఆయన తేడా స్పష్టంగానే చెపుతారు. పుస్తకం మొత్తం 20వ శతాబ్దం పూర్వార్థంలో వాడుకలో ఉన్న శిష్ట వ్యవహారికంలో ఉన్నా చదువుకోవటానికి వీలుగా, సాఫీగా ఉంది. ఇప్పుడు వాడుకలో లేని కొన్ని పదాలు, ఇంగ్లీషు పదాలకు అనువాదాలు (ఉదా: chandelierను పంగలదీపం అనటం) చాలా సరదాగా అనిపించాయి. ఐతే ఈ కథలు ఎన్నిక చేసుకోవటంలో ఒక ప్రణాళిక ఉన్నట్లుగా తోచదు. ఈ పుస్తకాన్ని కాలక్షేపం కథలుగా చదువుకొన్నా, మనకు తెలీని చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది.

విశాలాంధ్రవారు ప్రచురించిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు చాలా తక్కువగా ఉన్నాయి.


భారతదేశ చరిత్రకు, భారతీయ ప్రజా జీవనానికి సంబంధించిన
కథలు-గాథలు
దిగవల్లి వేంకట శివరావు
ప్రథమ ముద్రణ: 1944-47; ప్రస్తుత ముద్రణ 2010
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్
ఆబిడ్స్, హైదరాబాద్ -001
348 పే; 180 రూ.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************

You Might Also Like

2 Comments

  1. Srinivas Udumudi

    చౌదరి గారూ, అమర్నాథ్ ఇంట్లో మనం మీ “మన్యం రాణి” రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు దిగవల్లి వెంకట శివ రావు గారి మనవడు ఈ రివ్యూ నాకు పంపించారు! ఈ పుస్తకం పాత ప్రింటు నేను ఇదివరుకు చదివాను. దిగవల్లి వారు చెప్పిన చరిత్రకు సంబంధించిన విషయాలు చాల ఆసక్తికరంగా ఉన్నాయనిపించాయి. మీ రివ్యూ బావుంది.


    శ్రీనివాస్

  2. D.Ramachandra

    It is surprising to see literary interest in a medical professor. I wish to convey my compliments to Dr. Jamapala Choudhary for his literary taste and recognizing the value of the historical anecdotes brought out by the author of the book. This book of Kadhalu-gadhalu’s latest edition from Visalandhra has been receiving wide applauds. I thank the reviewer and the magazine editor for bringing out the review.

Leave a Reply