అనువాద సమస్యలు
“అనువాద సమస్యలు” పేరు బట్టి చూస్తే, పుస్తకం దేని గురించో అర్థం అవుతోంది కదా. ఈ పుస్తకం ఉద్దేశ్యం – ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు కలిగే ఇబ్బందుల గురించి విశ్లేషించడం. రచయిత – రాచమల్లు రామచంద్రారెడ్డి. ఈ పుస్తకానికి ౧౯౮౮లొ కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. పుస్తకం ఉద్దేశ్యం అనువాదం గురించే అయినా, సగానికి పైగా, తెలుగు భాషా, ప్రముఖులైన వారు సైతం చేసిన పొరబాట్ల గురించే సాగుతుంది. ఈ పుస్తకాన్ని గురించి అందరూ పొగిడారు కానీ, ఇది అనువాదాల గురించి కాదు అన్న విషయం ఒక్కరు కూడా చెప్పలేదు. అందుకని, ఇప్పుడు నేను ఈ వ్యాసం రాయాల్సి వస్తోంది.
మొత్తంగా ఇరవై అధ్యాయాలు ఉన్నాయి పుస్తకంలో. “టైమెంత?” అన్న “తెలుగు” ప్రశ్నతో మొదలవుతుంది పుస్తకం. “టైం” అన్న పదం ఎన్ని రకాలుగా మన భాషలో భాగమైపోయిందో చెబుతూనే, ఏ ఏ సందర్భాల్లో “టైం” బదులు ఎలాంటి తెలుగు పదాలు వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయో చక్కగా, స్పష్టంగా వివరించారు. అలాగే, మరికొన్ని తెలుగైపోయిన ఆంగ్ల పదాలను ఉదాహరణగా తీస్కుంటూ, కొన్ని పదాలకు ఆంగ్లంలో ఉన్నన్ని అర్థాలకు తెలుగులో సమానార్థకాలు ఉండవనీ చెబుతూ, అనువాదం గురించిన చర్చ ఇలాగే “టైం నుంచి సెక్సు దాకా” ఎన్నో అంశాలను స్పృశిస్తుందని చెబుతూ ఈ అధ్యాయం ముగించారు.
“గొంతెమ్మ కోరికలా?” అన్న రెండో అధ్యాయంలో పదాలు, నుడికారం గురించి చెబుతూ, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ ఉదాహరణలు ఇస్తూ, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రావొచ్చు అని ఉదాహరణలు కూడా ఇస్తారు. చివరగా, అనువాదకుడికి మాతృభాషలో వాక్యనిర్మాణం పై బాగా పట్టు ఉండాలని చెబుతూ, తెలుగులో కొన్ని రచనలను ఎంచి (ఉదాహరణలన్నీ అనువాదాలు కావు!), వాటిలో వాక్య నిర్మాణ దోషాలు ఎత్తి చూపుతూ, చివర్లో, ఎంతమందికి భాషపై పట్టు ఉందని ప్రశ్నించడంతో ముగుస్తుంది. “తెలుగువాని యొక్క మొదటి పేరేమిటి?” అన్న మూడో అధ్యాయంలో ప్రకటనల్లో వాటిల్లో కనబడే కృత్రిమ తెలుగును గురించి చెబుతూ, ఎందుకు అలా రాస్తారో, ఆంగ్లం నుంచి మక్కికి మక్కి అనువదిస్తే ఏమౌతుందో చెబుతారు. “మాన్ అంటే మనిషేనా?” అన్న నాలుగో అధ్యాయంలో, ఒక్క “మాన్” అన్న పదం వివిధ సందర్భాల్లో తెలుగులోకి అనువదితమైనప్పుడు ఎలా అర్థాలు మారుతుందో చెబుతారు.
“అసలు సమస్యలేమిటి?” అన్న ఐదో అధ్యాయంతో ఉదాహరణలు దాటుకుని, పరిష్కారాలు సూచిస్తూ, అసలు విషయం మొదలవుతుందని అనిపిస్తుంది మనకి. చేతకాని అనువాదాలను పక్కన పెడితే, ఇరుభాషలు తెలిసిన వారు కూడా అనువాదాలు చేయడంలో సమస్యలు ఎదుర్కుంటారని చెబుతూ, రా.రా. అనువాద సమస్యలని రెండు రకాలుగా వర్గీకరించారు – వాక్యనిర్మాణ సమస్యలు, పదాలకి సంబంధించిన సమస్యలు. వాక్యనిర్మాణ సమస్యలని ఉదాహరిస్తూ, ఒక అనువాదంలో ఆంగ్లంలో నుండి చాలా ఉపవాక్యాలు ఉన్న ఒక వాక్యాన్ని ఎలా అనువదించారో చూపుతూ, వ్యాసం ముగిస్తారు. (మళ్ళీ, ఉదాహరణ దగ్గరే ఆగిపోయారు!) ఆరవ అధ్యాయం, “వాక్య భాగాల క్రమం” లో ఆంగ్లానికి, తెలుగుకి మధ్య వాక్య నిర్మాణంలో ఉన్న భేదాలను గురించి చెబుతూ, అనువాద సమయంలో వాక్య నిర్మాణం ఎలా మారుతుంది, మారకపోతే వాక్యం ఎలా కృతకంగా ఉంటుంది? ఎలాంటి వాక్యాలు అనువాదంలో తిప్పలు పెడతాయి- వంటి అంశాలను చాలా వివరంగా రాసారు. అయితే, నాకు ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఏమిటి అంటే, ఈ అధ్యాయం మొత్తంలోనూ, రా.రా. బాలేని ఉదాహరణలు కాక అనువాదం సరిగా ఉందంటూ ఇచ్చిన ఏకైక ఉదాహరణ, తాను చేసిన అనువాదానిదే కావడం! (పుస్తకం మొత్తం ఇదే ధోరణి కొనసాగింది. తెలుగులో రారా చేసినవి తప్ప ఒక్క మంచి అనువాదం కూడా లేదా! ఆయన చేసినది కూడా నాకు మామూలుగానే అనిపించింది, అది వేరే విషయం.)
“పదాలు” అన్న ఏడవ అధ్యాయంలో ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ భాషలో ఉన్న పదాలకి ఈ భాషలో సమానార్థకాలు లేకపోవడం గురించి చెబుతూ, రా.రా. గారు తేల్చిన విషయం: “.. కానీ, prude, prig, filial, sanctimonious లాంటి పదాలు మనకి లేకపోవడానికి కారణం ఏమిటంటే మన నాగరికత ఇంకా అంతగా వికసించకపోవడమే అని చెప్పాలి, మన సమాజం ఆ భావాలను నిత్యజీవితంలో అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగకపోవడమే అని చెప్పాలి” అంటారు (పుట 42). ఒక భాషలో కొన్ని పదాలు లేకపోవడం – నాగరికత లోపం ఎలా అవుతుంది? అన్నది నాకింకా అర్థం కాలేదు. ఇటీవలే, Guy Deutscher అన్న భాషాశాస్త్రవేత్త రాసిన “Through the language glass” అన్న పుస్తకం చదివాను. ఒక భాషలో ఏదో భావానికి పదాలు ఉండడం-లేకపోవడం అన్నది ఆ భావం గురించి ఆ భాషీయుల ఆలోచనలను ఎంతవరకూ ప్రభావితం చేస్తుంది? అన్నది ఆ పుస్తకం చర్చా వస్తువు. ఆస్ట్రేలియాలోని ఆటవిక తెగల భాషల గురించి కూడా చాలా వివరంగా చర్చించారు. ఒక్కచోట కూడా, ఇలా ఏ భాషలోనైనా పదాలు లేకపోవడం – “నాగరికత లోపం” అనలేదు. అది వారి సామాజిక పరిస్థితుల్లో భాగం అనే అన్నారు. తెలుగులో కానీ, వేరే భాషలో కానీ, చివరికి ఆంగ్లంలో కానీ, ఒక పదానికి సమానార్థకం లేకపోవడం నారికత లోపం అని అనడం కన్నా, డాయిషర్ ఇచ్చిన వివరణ సబబుగా అనిపించింది నాకు. ఇక్కడే మరొకటి అంటారు – “మనము, మేము అనే మాటలకు సంబంధించి నంతవరకు మన తెలుగు ఘనమైనదే. కానీ, అంతమాత్రాన, ఇంగ్లీషు లాంటి భాషలతో పోలిస్తే మన భాష బాగా అభివృద్ధి చెందినదని చెప్పలేం కదా” అని (పుట 42). మనం ఏ అంశాల గురించి పోలుస్తున్నాం? అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా ఘనాఘనాల పోలిక? అన్నది నా సందేహం (ఆ మాటకొస్తే, ఆంగ్లంతో పోలిస్తే, గణన యంత్ర పరంగా తెలుగుని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. యంత్రానికి ఎక్కువ శ్రమ ఇస్తుంది కనుక తెలుగు అభివృద్ధి చెందినది అనాలా? తెలుగుకంటే కంప్యూటరుని తిప్పలు పెట్టే భాషలూ ఉన్నాయి. ఈ లెక్కన ఇంగ్లీషు అభివృద్ధి చెందని భాష అనుకోవాలా?)..ఇలాగే ఆంగ్లంలో ఉండి, తెలుగులో సమానార్థకాలు లేని (బహుసా, ఆలోచిస్తే సమానార్థకాలు తట్టవచ్చేమో!) మరిన్ని ఉదాహరణలతో ఈ అధ్యాయం ముగుస్తుంది.
“అనువాదమంటే” అన్నది ఎనిమిదో అధ్యాయం (ఎక్కడికక్కడ ఇదిగో, ఈ అధ్యయంతో అసలు విషయం మొదలవుతుంది..అనిపిస్తూ వచ్చింది నాకైతే!). “అనువాదం గురించి తెలుగులో వివరించడమంటే సిమెంటు రోడ్డుమీద కొత్తకారులో ప్రయానంలాగా సాఫీగా ఉండదు. దారీ డొంకా లేని కీకారణ్యంలో మన కాలిబాట మనమే నిర్మించుకుంటూ, సూటి బాట సాధ్యం కానప్పుడల్లా అటూ, ఇటూ మలుపులూ, మెలికలూ తిరగక తప్పదు. కనుక, పక్కదారి పట్టినా, పట్టినట్లు కనిపించినా, అది సరైన దారి కొరకు చేసే అన్వేషణలో భాగంగానే ఉంటుంది.” (పుట 46) అంటారు ఒకచోట. అంత కష్టం దేనికో నాకు అర్థం కాలేదు. ఒకవేళ అంత కష్టమే ఉన్నా, అది దేనికైనా సార్వజనీనంగా ఉండే కష్టం అని నా అభిప్రాయం. ఇదే ధోరణిలో కొనసాగి “అనువాదమంటే ఎంత కష్టమైనదో, దానికి ఎంత విశాలమైన లోకజ్ఞానమూ, ఎంత విస్తారమైన గ్రంథ పఠనమూ, ఎన్ని సిద్ధాంతాలతో, మతాలతో, విజ్ఞాన శాస్త్రాలతో, ఎన్ని దేశాల చరిత్రలతో పరిచయమూ అవసరమో మీకు అర్థమైతే తప్ప, మీ మనసులో నాటుకుంటే తప్ప, అనువాదమంటే ఏమిటో నేను చెప్పినా మీకు పూర్తిగా అర్థం కాదు కనుక, అనువాద నిర్వచనానికి ఇదంతా ఉపోద్ఘాతం అనుకోండి” (పుట 54) అంటారు. (తరువాత కొన్ని ఉదాహరణలతో అధ్యాయం ముగించేసారు..అనువాదం అంటే ఏమిటో చర్చించడం ఇక్కడ సాధ్యం కాలేదని ఒప్పుకుంటూ).
తరువాతి అధ్యాయం “టైం కథ ఏమిటో చూద్దాం” లో, మరోసారి తెలుగులో “టైం” గురించి వివిధ సందర్భాల్లో “తెలుగు పదాలతో” వివిధ రకాలుగా ఎలా చెప్పొచ్చు అన్నది ఓపిగ్గా చాలా ఉదాహరణలతో వివరిస్తారు. అంతా అయ్యాక …”..వివరాలకు డిక్షనరీ చూడండి” అని రాసారు. పగలబడి నవ్వాను నేను. తెలుగు తెలుగు అంటూ అంత రాసిన మనిషి నిఘంటువు అనో, మరొకటనో అనలేకపోయరే అని.
పదో అధ్యాయం – “అనువాద వివరణ“. పుస్తకం మొత్తం మీద, అనువాదం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అన్న విషయాల గురించి స్టడీ చేసి, సాధికారికత కలిగిన మనిషి రాసింది అనిపించిన అధ్యాయం ఇదే! దీని తరువాతి అధ్యాయం థియోడార్ సేవరీ అన్న ఆయన అనువాదం కళ గురించి ప్రతిపాదించిన సిద్ధాంతం గురించిన విమర్శ.
Dr. Manjanna
అందరికి నమస్కారం. నా పేరు మంజణ్ణ కనా౯టక. నాకు ఈ బుక్ కావాలి దయచేసి ఎవరికైనా ఎక్కడ దొరుకుతుంది తెలిసింటె తెలుపండి. నా నంబర్ 7353226694
Prakash
ఈ పుస్తకం ఎక్కడ లబించును. దయచేసి చెప్పగలరు. చాల ఆత్యవసరం,
gsrammohan
మీరు చెప్పిన పదంతో కూడా సమస్య ఉంది. యంత్రుడు అని మీరు దానికి మగతనాన్ని ఆపాదించేశారు.పోనీ యంత్రి అందామా! జెండర్ న్యూట్రల్ కాబట్టి రెండూ కరెక్టు కాకపోవచ్చు. అపుడు యంత్రమే అవుతుంది. యంత్రం అనేది చాలా విస్తృతమైన పదం. అప్పుడు మన లక్ష్యం సిద్ధించదు. మనం ఇపుడు ఏ కొత్త పదాన్ని కనుక్కున్నా జెండర్ విషయం కూడా చూసుకోవాలి. ఇప్పటికి అభివృద్ధి చెందిన భాష నిండా పురుషాధిక్యతే ఉంది. ఇప్పుడు మనం కూడా అదే పని చేస్తే ఎలా! ఇతర భాషా సంస్కృతుల నుంచి వచ్చిపడే పదాలను అనువదించుకోవడం కష్టమే. కాకపోతే అసాధ్యమేమీ కాదు. అర్హత ఉండడంతో పాటు దానిమీద దృష్టిపెట్టి పనిచేసే మనుషులు కావాలి. తమిళనాట అది కనిపిస్తుంది. సన్ టీవీ న్యూస్‌లో మీకు ఒక్క ఆంగ్లపదం కనిపించదు.తెలుగునాట భాష గురించి గోల ఎక్కవ. కృషి తక్కువ.
gsrammohan
సౌమ్యగారూ
మీరు రాసిన స్పిరిట్‌తో ఏకీభవిస్తున్నాను. ఎవర్నీ నిర్విమర్శగా తీసుకోనక్కర్లేదు. భాష విషయంలో అనువాదం విషయంలో రారాను దాటి ముందుకు చూడాల్సి ఉంది. భద్రిరాజు, సుబ్రహ్మణ్యం, చేరా, బూదరాజు దాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అనువాదం వరకే పరిమితమయితే బూదరాజు ఉపయుక్తమైన కృషి చేశారు. కాకపోతే రారా వాడిన వికసించకపోవడం, ఎదగకపోవడం లాంటి పదాలను పక్కనబెడితే భాషకు నాగరికతకు విడదీయలేని సంబంధమున్నమాట వాస్తవం. ఆలోచిస్తే సమానార్థకాలు తట్టొచ్చేమో అని మీరు ఒకింత సులభంగా అనేశారు. కష్టం. కొత్త పదాలను పుట్టించడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. మన సంస్కృతిలో, నాగరికతలో లేని పరభాషా పదాలకు మనం సమానార్థకాలను పుట్టించుకోలేకపోతున్నాం. ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. ప్రైవసీ అంటామనుకోండి. ఏం చెప్తాం తెలుగులో! అది నగరనాగరికతనుంచి వచ్చిన పదం. పట్టణీకరణకు ముందు ఆ భావనే లేదు. మనకు కొత్త విషయమిది? అదే కాదు, సెలబ్రిటీ అంటాం. పాపులర్, ఫేమస్ పదాలకు కనీసం ప్రముఖులు, ప్రసిద్ధులు అని ఏదో రకంగా తిప్పలు పడగలమేమో కానీ సెలబ్రిటీని ఎక్కడినుంచి తెస్తాం! కాబట్టి భాష అనేది నాగరికతతో సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడిన అంశం. ఈ కష్టం తెలుగువారికి పరిమితమని చెప్పబోవడం లేదు. మీరన్నట్టు ఎవరికైనా ఉండేదే. నెరజాణ అనేదానికి సమానార్థకం వాడడానికి ఇంగ్లీషోడు తిప్పలు పడక తప్పుద్దా! ముగ్గుకు ఏదో ఒక పదం కనిపెట్టేశాడే అనుకుందాం, ఆ తర్వాత ముగ్గులోకి దించాడు అనే పదం వచ్చినపుడు అతనేమి చేస్తాడు? మన వ్యావహారికం తెలియక పోతే ఎంత కంగాళీ అయిపోతుంది? కాకపోతే తెలుగులో కొత్త పదాల సృష్టి తక్కువ. అదిథ్యాంక్ లెస్ జాబ్ కావడం వల్ల ఎవరూ దానిమీద దృష్టిపెట్టడం లేదు. కొత్త పదాలు వాడినవారిని ఎగతాళి చేయడంలో ఉన్న చురుకుదనం కొత్తపదాల సృష్టి మీద లేదు. నాగరికత, స్థలకాలాలూ ఇవన్నీ పదాలకు అర్థాలను అర్థఛాయలను మార్చేస్తూ ఉంటాయి. చీర, సన్యాసి లాంటి పదాలు కాలక్రమంలో ఎలా అర్థాలు మార్చేసుకున్నాయో చెప్పబోవడం లేదు.రూఢి అర్థాల గురించి కూడా మాట్లాడబోవడం లేదు. మీ ఉదాహరణే తీసుకుందాం. రారా పుస్తకం చదువుతూ ఫలానా చోట నేను పగలబడి నవ్వాను అని కనుక ఇరవై యేళ్ల క్రితం రాసి ఉంటే మీరు దుస్సాహసి అయిఉండేవారు. కనీసపక్షం సాహసి అయ్యుండేవారు. ఇవాళ మూమూలుగా ఉంది.ఒకటే వాక్యం వివిధ కాలాల్లో మనకు అర్థమయ్యే విధానం కలిగించే భావన వేర్వేరుగా ఉండగలదు. రారా రాసిన అన్ని అంశాల్లోఏకీభవించనక్కర్లేదు కానీ భాష స్థలకాలాలతోనూ నాగరకతతోనూ ముడిపడి ఉంటుందనేది వాస్తవం. ఆయా సంస్కృతులతో నాగరకతతో మతాలతో, భావజాలాలతో సంబంధం లేకుండా అనువాదం చేయడం కష్టం అనేది కూడా వాస్తవం. ఇస్లాం మత సంప్రదాయాలతో పరిచయం లేనివ్యక్తి( అలవాటుగా లేనివాడు అనేవస్తుంది, భాషలో జెండర్ సెన్సిటివిటీని పాటించడం చాలా కష్టం. దీనికే ఇంతవరకూ సమాధానం కనుక్కోలేకపోయాం)ఫలానా మసీదులో ప్రేయర్స్ అంటే పూజా పునస్కారాలు అని అనువదించే ప్రమాదం లేదా! ఇన్నిమాటలేల! అనువాదకులకు ఉండవలసిన అర్హతల గురించి రారా చెప్పింది విస్తృతమైన అర్థంలో వాస్తవం. దాన్ని విశ్లేషించే క్రమంలో ఆయన దారి తప్పిన మాట కూడా వాస్తవమే.
సౌమ్య
రామ్మోహన్ గారికి: ఇన్నాళ్ళ తరువాత ఈ వ్యాసం చదివినందుకు ధన్యవాదాలు.వ్యాసం స్పూర్తిని అర్థం చేసుకున్నందుకూ ధన్యవాదాలు. కాకపోతే, ఒక్క వాక్యం మీద మాత్రం నాకు ఇంకా చెప్పాల్సింది ఉందనిపించి ఈ వ్యాఖ్య రాస్తున్నాను.
>>”ఆలోచిస్తే సమానార్థకాలు తట్టొచ్చేమో అని మీరు ఒకింత సులభంగా అనేశారు. కష్టం. కొత్త పదాలను పుట్టించడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం.”
– సులభంగా అనడం కాదు. మీ సంగతి నేను చెప్పలేను కానీ, పదాలు పుట్టించడానికి కూడా ఒక రకమైన భాష జ్ఞానం కావాలి. అందరూ పదాలు పుట్టించలేరు. అది నా బలం కాదు. నాకు దానికి తగ్గ అర్హతలూ లేవు. భాషాశాస్త్రమూ తెలియదు. కనుక, అది నాకు తేలిక కాదు. అయితే, కొంచెం ఇతర ప్రపంచ భాషల్లోకి తొంగి చూస్తే, ఆధునిక పదజాలాలకి కూడా వారు తమవైన పదాలు సృష్టించుకున్న విధానం (ముఖ్యంగా నేనుంటున్న జర్మనీలో) నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదంతా ఎందుకు? రోబో ను మనం రోబో అంటున్నాము. తమిళులు చక్కగా యంతిరన్ అనుకున్నారు. తెలుగులో “యంత్రుడు” అని పెట్టలేదేం? అని అప్పట్లో నేను ఏదో ఫోరంలో అడిగితే, “యంత్రుడేమిటీ? ఎబ్బెట్టుగా ఉంది. రోబో నే బాగుంది” అన్నారు. ఆ తరువాత తెలుగులో కొత్తపదాలు కనిపెట్టడం కష్టం, “english is very expressive” అంటారు. ఈ ధోరణితో నాకు సమస్య. తెలుగు మీడియంలో చదువుకునేవారికి సైన్సు పదాలు అవీ తెలుగులో ఉంటాయి కదా కొన్ని. అలాగే. భాషలో లేని భావాలు తదనంతర కాలంలో ప్రవేశిస్తే, కొత్త పదాలు పుట్టించగల పటుత్వం భాషకి ఉంది కనుకే, దాన్ని ఘనత వహించిన ఆంగ్లంలో natural language అంటారు…, computer language అనకుండా. ఏమంటారు? 🙂
నారాయణ
నేను ఈ చర్చలోకి బహుశ: అంతా ముగిసాక వచ్చానేమో…
1. సరస్వతీ కుమార్ గారు రాసినట్లు, రాచమల్లుగారి అనువాదాలన్నీ చాలా వరకు మాస్కో/సామ్యవాద పుస్తకాల నేపధ్యంలోనే జరిగాయి. ఈ పుస్తకంలో వాటిని ప్రామాణికంగా ఎందుకు తీసుకోకూడదో వివరించారాయన ఓచోట.. చదివినప్పుడు ఆ వివరణ సమంజసంగానే అనిపిస్తుందిగానీ, సమీక్షకుల బారినుండి తను తప్పించుకునేందుకు ఆ వివరణను వాడుకున్నారేమో అనిపిస్తుంది తర్వాత ఆలోచిస్తే.
2. శాస్త్రం (సైన్సు, చట్టం…) పరమైన రచనల అనువాదాల్లో ఖచ్చితంగా సమానార్థకాలైన పదాలను వాడాలని ఎవరైనా అంటే కాదనలేం. అయితే సామాన్యులకు అర్థమవ్వటం అనేదీ ఒకటుంటుంది కదా. అనువాదాలను అలా ‘అర్థమవ్వటం’ నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళినవాళ్ళు చాలామందే ఉన్నారు- వారిలో రారా కూడా ఒకరు, నిస్సందేహంగా. ఐతే ఇక్కడ చర్చ రారా గారి అనువాదాలగురించి కాదు; అసలు అనువాదాలు ఎలా ఉండాలి అనేదాని గురించి. ఈ పుస్తకంలో నాలుగు రకాల అనువాదాలగురించి ప్రస్తావిస్తూ రాచమల్లువారు చేసిన విశ్లేషణ బాగుంది.
3. అనువాదం అనే కళని చిన్నబుచ్చుతూ- ‘ఎవరైనా చేయగలరు-అనువాదాలు’ అనేవాళ్ళని దృష్టిలోపెట్టుకొని రాసినట్లున్నారాయన, ఈ పుస్తకాన్ని. ‘గూగుల్ ట్రాన్స్లేట్’ ప్రయోగాన్నే తీసుకోండి, నాలాంటి చిన్నమనిషికే “ఎంత పొగరు! యంత్రాలతో చేయిస్తారట అనువాదాలు!” అనిపించేట్లుంటుందది. అయితే రష్యావారు, జపాన్ వాళ్ళు మరి, వాళ్ళ భాషల్ని ఇంగ్లీషులోకి అద్భుతంగా తర్జుమా చేసే యంత్రాలను తెచ్చేసారని చెబుతారు- ఎలా వీలైందో మరి? గూగుల్ వారి యాంత్రిక తెలుగు మాత్రం చాలా హాస్యస్ఫోరకంగా ఉండి, జీవితంమరీ నిస్సారమైపోయిందనిపించినప్పుడల్లా కడుపుబ్బ నవ్వించి, ఆ రకంగా జనాలకు గొప్ప సేవే చేస్తున్నది.
4. ‘ఆంగ్ల పదాలకు సమానార్థకాలైన తెలుగు పదాలు ఉండవు’ అని చెబుతూ రారా గారు చాలాసార్లు ‘నాగరికత’ని తీసుకొస్తారు. ఆ భావనకు సామ్యవాదధోరణి ఒకటి ఆధారం. ‘భాష అనేది నాగరికతతో పాటు వచ్చింది’ అనే సిద్ధాంతాన్ని రారావారు నిర్ద్వంద్వంగా విశ్వసిస్తారు. ‘చరిత్ర, చరిత్రలో జరిగిన/జరగనున్న సంఘటనల పరిణామక్రమం- ఇలాంటి అంశాలు తమకు బాగా తెలిసిన అంశాల పరిధిలోవి’ అని ఆ కాలపు సామ్యవాదులు చాలామందే విశ్వసించారు- ఈ ధోరణి రాహుల్ సాంకృత్సాయన్, మహాశ్వేతాదేవిల రచనలనుండి, బాలగోపాల్ గారి సంక్లిష్ట విశ్లేషణలవరకూ చాలావాటిలో కనబడుతుంది- కాబట్టి రారా గారిని ప్రత్యేకించి విమర్శించవలసిన అవసరం లేదు.
అయితే, ఆయన చెప్పిన ఈ మాటని గురించి మటుకు, ఈనాడు కంప్యూటర్ల “తెలుగీకరణ” కోసం పనిచేస్తున్నవారంతా కొంచెం గట్టిగా ఆలోచించాలి- నిజంగానే, చాలా ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థక ఒంటి పదాలు దొరకవు. ‘కొత్తగా కాయిన్ చేయచ్చు’; జనాలు అలవాటు పడచ్చు- నిజమే. అయితే ఈ ప్రక్రియ రుద్దటంలాగానూ , ‘నీక్కావాలంటే ఆ ఆంగ్ల భావనని కూడా తెలుగులో(నే) చదువు; లేకపోతే నీ ఖర్మ, ఇంగ్లీషులో(నే) చదువు ‘ అన్నట్లు ఉంటే ఎలాగ? భాషని ప్రాదేశికంలోంచి విశ్వసామాన్యం చేయటంలో ఆయన అన్నట్లు నిజంగానే సామాజిక అంశాలు చాలానే ఉండవూ?. – తెలుగు ఇంగ్లీషైపోయిననాడు, తెలుగువాడు ఇంగ్లీషువాడవ్వకుండా ఉండగలడా? అనేది ప్రశ్న. ‘ఏంకాదు’ అనేది కూడా ఒక సమాధానం, కాదనను.
— ఈ థ్రెడ్‌ని ఇంకా ఎందరు ఫాలో అవుతున్నారో తెలీదు; కాబట్టి ఇక్కడికి ఆపుతాను. మొత్తంమీద ఈ పుస్తకాన్నైతే అనువాదాల గురించి ఆలోచించేవాళ్లంతా చదవాలని ఒప్పుకుంటారుగా, అందరూ?! 🙂
సౌమ్య
>> 2. అసలు అనువాదాలు ఎలా ఉండాలి అనేదాని గురించి. ఈ పుస్తకంలో నాలుగు రకాల అనువాదాలగురించి ప్రస్తావిస్తూ రాచమల్లువారు చేసిన విశ్లేషణ బాగుంది.
– అనువాదాలు ఎలా ఉండాలి? అన్న చర్చ ఈ పుస్తకంలో చాలా తక్కువ భాగం ఆక్రమించిందని నా అభిప్రాయం. చర్చించినంతసేపు మాత్రం రాచమల్లు గారు చేసినది కాదు కానీ, ఇతరుల పరిశోధనను ఈయన క్లుప్తంగా చెప్పిన విధానం బాగుంది నాకు. కానీ, రా.రా. స్వీయ అనువాదాలే ప్రామాణికంగా తీసుకున్నట్లు తోచింది.
>>”‘గూగుల్ ట్రాన్స్లేట్’ ప్రయోగాన్నే తీసుకోండి, నాలాంటి చిన్నమనిషికే “ఎంత పొగరు! యంత్రాలతో చేయిస్తారట అనువాదాలు!” ”
– I object. I told this several times to several people. But, this keeps popping up whenever there is some talk about Machine Translation. There are several other purposes an automated translation system can serve. It need not always be to replace human translators. For example, I benefited greatly from it when I came to live in a foreign country whose language I did not speak a few years ago. No human would come along with me everywhere like a tail and translate words and phrases to me. 🙂
>>”ఈ ధోరణి రాహుల్ సాంకృత్సాయన్, మహాశ్వేతాదేవిల రచనలనుండి, బాలగోపాల్ గారి సంక్లిష్ట విశ్లేషణలవరకూ చాలావాటిలో కనబడుతుంది- కాబట్టి రారా గారిని ప్రత్యేకించి విమర్శించవలసిన అవసరం లేదు.”
-దాదాపు రెండేళ్ళ తరువాత రాసిన వ్యాఖ్య కనుక మరీ వివరంగా సమాధానం రాయడానికి నేను మళ్ళీ పుస్తకం చదవాలి. కానీ, క్లుప్తంగా చెప్పాలంటే, వాళ్ళ ధోరణి ఏదైనా, ఒక భాషని అనాగరికం అనడం సరికాదు అని నా అభిప్రాయం. అదే ఇక్కడ కూడా రాసాను. రా.రా. ని ప్రత్యేకంగా విమర్శించడం ఏదీ జరుగలేదు ఈ వ్యాసంలో. రారా రాసిన పుస్తకంలోని ఆలోచనలని గురించి కొన్ని పరిశీలనలు మాత్రమే చేశాను. రారా ని ప్రత్యేకంగా పాయింట్ అవుట్ చేయకూడదు కనుక, ఆ మొత్తం అందరి రచనలు చదివితే తప్పిస్తే నీకు భాష ని అనాగరికం అనకూడదు అని చెప్పే అర్హత లేదు అంటే మాత్రం నేనేం చెప్పలేను 🙂
pavan santhosh surampudi
గూగుల్ ట్రాన్స్ లేట్ ఎలా పనిచేస్తుందంటే ఓ చిన్నపిల్లాడు భాష నేర్చుకున్నట్టు. ఎలాగంటే మనం దానికి పదాలకు సమానార్థాలు అందించేకొద్దీ అది అప్డేట్ అవుతూంటుంది. ఫ్రేజ్ తప్పుగా ఉన్నప్పుడు చూసి నవ్వుకుని ఊరుకుంటే, ఇక అది అలా నవ్వించేందుకే పనికివస్తుంది. అలాకాక మనం దాన్ని సరిదిద్దితే, అలా సరిదిద్దేవారు పెరిగేకొద్దీ అభివృద్ధి చెందుతుంది.
పోనీ అలాకాకున్నా గూగుల్ ట్రాన్స్ లేట్ మరోవిధంగా కూడా పనికివస్తుంది. ఇప్పటికే తమతమ అనువాద అవసరాల కోసం కొందరు కొన్ని వేల పదాలకు తెలుగులో అర్థాలను దానికి అందించారు. కాబట్టి ఎప్పుడైనా ఓ పదానికి తెలుగులో సమానార్థకం తట్టకున్నా, లేదా ఆంగ్లంలో ఓ తెలుగు పదానికి సమానార్థ పదం తట్టకున్నా టక్కున దాన్ని వాడొచ్చు. ఐతే జాగ్రత్తపడాల్సింది ఎక్కడంటే గూగుల్ ట్రాన్స్ లేట్ పదాన్ని ట్రాన్స్ లేట్ చేసినంత సరిగా వాక్యాన్ని చేయలేదు. ఆంగ్లం తెలుగు భాషల మధ్య వాక్యనిర్మాణంలో భేదం ఉందన్నది తెలిసిందే. ఈ సూక్ష్మం విషయంలో ఆ మెషీన్ ట్రాన్స్ లేషన్ ని ఎవరూ మెరుగుపరచలేదు. అందుకే వాక్యాన్ని అనువదించిపెట్టలేదు కానీ పదం కావాలంటే చేసుకోవచ్చు.
నేనూ చాలా తమిళ, మలయాళ పదాలకు అర్థాలు విడివిడి పదాలను ట్రాన్స్ లేట్ చేసుకుని తెలుసుకున్నాను. అదే లేకుంటే నాకు నేర్పే ఓపికున్నవారెవరున్నారు ఇక్కడ?
ఏ టెక్నాలజీ అయినా దానికదే గొప్పదో, తక్కువదో అయిపోదు, వాడుకోవడం రానివాళ్ళూ, వాడుకునేందుకు దృష్టి లేనివాళ్ళ మధ్య దాని పూర్తి సామర్థ్యం వెలికి రాక అలా అవకరంగా మిగిలిపోతుంది. అలాంటి దృక్పథం ఉంది కనుకనే జపనీస్ వంటి భాషల్లో దాన్ని సమర్థంగా అభివృద్ధి చేసుకునివుంటారు.
Kameswara Rao
>> “శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన మహాసర్పములు చావరు” అన్న వాక్యాన్ని పట్టుకు, “చావవు” అనాలి కానీ, “చావరు” అనడం తప్పు అని విమర్శించారు.
ఇక్కడ సమస్య, శేషుడు వాసుకి మొదలైనవాళ్ళకి మనిషి రూపం ఉన్నదా కాదా అన్నది కాదు. “సర్పము” అన్నది జంతువుని సూచించే పదం (వ్యాకరణరీత్యా). “చావరు” అన్నది పురుషులని సూచించే పదం. అంచేత యీ రెండూ కలిపి వాడడం కుదరదు. “… తక్షకుడు మొదలైనవారు చావరు” అనో, “… తక్షకుడు మొదలైన మహాసర్పరాజులు చావరు” అనో ఉంటే వ్యాకరణరీత్యా సరి అవుతుంది.
Saraswathi Kumar
సోవియట్ ప్రచురణ సంస్థవారు ఎంతో ఖర్చును భరించి సామ్యవాదసాహిత్యాన్ని తెలుగులో అందించారు. కానీ అదంతా ఈయన గారి అనువాదశైలి వల్లే ఎవరికీ అర్థం కాకుండా పోయింది.
SeshatalpaSayee Vadapalli
ఆచార్య భీంసేన్ నిర్మల్ గారి “అనువాద శాస్త్రము” (తెలుగు అకాడమీ – Monograph series)
–Sayee.
సుజాత
ఈ పుస్తకం పాత ఎడిషన్ నా దగ్గరుంది. అయితే ఇది వార్తలు వ్యాసాలు వంటి విషయాల అనువాదానికి తప్ప స్వేచ్ఛానువాదానికి అంతగా ఉపయోగపడదేమో అని అభిప్రాయం. మంచి పుస్తకం
సౌమ్య
కానీ, పుస్తకంలో గోర్కీ కథల తెలుగు అనువాదం గురించి ప్రస్తావించి దాని ఉదాహరణలు కూడా చూపించారుగా.
RAJASEKHAR
very good sir