The Sweat of pearls
వ్యాసం పంపిన వారు: అరి సీతారామయ్య.
బాలి పర్యాటకుల స్వర్గం. పై వస్త్రాలు లేకుండా సంచరించే స్త్రీలూ, వారి స్తన సౌందర్యం ఒకప్పుడు పశ్చిమ దేశ పురుషులను విపరీతంగా ఆకర్షించింది. టూరిజం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు స్త్రీలు జాకెట్లు వేసుకోవటానికి అలవాటు పడ్డారు. అయినా 23 కోట్ల ముస్లిం జనాభా కల ఇండొనేసియా దేశంలో 80% హిందువులు నివసించే బాలి ఇప్పుడుకూడా ఒక వింతగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. 30 లక్షల జనాభా ఉన్న బాలి కి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యాటకులు వస్తూంటారు.
బాలి గురించి తెలుసుకోవాలంటే గూగిల్ లో వెతికినా, పుస్తకాల షాపుకెళ్ళినా దొరికే సమాచారం అంతా పర్యాటకుల వైపు నుంచి వచ్చేదే. బాలి నివాసుల నిత్య జీవితం గురించి, వారి సాధక బాధకాల గురించి బాలి వారు రాసిన పుస్తకాలు చాలా అరుదు. వాటిలో ఒకటి పుతు ఆక సుకాంత కథల సంపుటి “ది స్వెట్ ఆఫ్ పెర్ల్స్”. ఇండొనేసియా భాషలో రాసిన ఈ కథలను మొదట కళ్యాణమిత్ర ఫౌండేషన్ (జకార్తా) వారు ప్రచురించారు. ఆస్ట్రేలియా దేశస్తుడు వెర్న్ కార్క్ ఈ కథలను ది స్వెట్ ఆఫ్ పెర్ల్స్ పేరుతో ఆంగ్లం లోకి అనువాదం చేశాడు.
మనకు బాగా పరిచయం ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలి లో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్త్రీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యలద్వారా సాంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు స్త్రీలు. అందువల్ల, స్త్రీల జీవితాలను చిత్రించటం ద్వారా సమాజ స్థితి గతులకు అద్దం పట్టవచ్చనే అభిప్రాయంతో రాసిన కథలు ఇవి.
“గ్రీన్ బాగ్” కథలో జైల్లో ఉన్న ప్రియుడికి ఒక స్త్రీ పచ్చ సంచిలో భోజనం, అవసరమైన వస్తువులు పంపిస్తూంటోంది. తనింకా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడో, తనకోసం ఆమెను వేచి ఉండమనటం ఎంతవరకు న్యాయమో అని మధన పడుతూంటాడు అతను.
“వెయిటింగ్” కథ బడిపంతులుగా పనిచేస్తున్న భర్త జైల్లో పడితే, అంతవరకూ బయటి ప్రపంచంతో అంతగా సంబంధం లేని భార్య హటాత్తుగా ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచవలసి రావటంతో ఎలా సతమతమవుతుందో చిత్రిస్తుంది.
ఈ రెండు కథలూ పుతు స్వానుభవంతో రాశాడు. ఇండొనేసియాలో కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుందన్న భయంతో 1965 లో సి ఐ ఏ ప్రోత్సాహంతో జరిగిన మారణకాండలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎనభై వేల మంది బాలి నివాసులు. అధికారం చేబుచ్చుకున్న సుహార్తో ప్రభుత్వం పది లక్షల మందిని కనీసం పది సంవత్సరాల పాటు అకారణంగా జైల్లో వేసింది. అలా జైల్లోపడి 1976 లో విడుదలయిన వారిలో ఒకడు పుతు ఆక సుకాంత. ఈ పుస్తకంలో ఉన్నకథలు 1977-90 మధ్య కాలంలో రాసినవి.
“లూ గలూ” ఒక తక్కువ కులంలో పుట్టిన అమ్మాయి. యవ్వనంలో శాస్త్రీయ నృత్యంలో ప్రతిభ చూపించి మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు, నడి వయస్సులో, ఒంటరిగా ఉంటున్న ఆమెకు కూలి పనులుకూడా దొరకటం లేదు. కూటికే గడవటం లేదు.
“స్టార్మ్ క్లౌడ్స్ ఓవర్ ది ఐలాండ్ ఆఫ్ పారడైస్” కథలో బ్రాహ్మణ స్త్రీ ఇద ఆయు కతుత్ సుమర్తిని తనకు ఇష్టం అయిన తక్కువ కులం వాడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. ఆమె కుటుంబం ఒప్పుకోదు. సంబంధం తెంచుకోమని ఆమె మీద ఒత్తిడి తెస్తుంది.
“మోకో పెద్దమ్మ” ఒక అవివాహిత స్త్రీ. ఉమ్మడి కుటుంబం లో ఆమె బాధ్యతలూ, చెల్లెలి బిడ్డలతో ఆమెకున్న సాన్నిహిత్యం, పొలాల్లో ఆమె చేసే పని, చెల్లెలి కొడుక్కి పెళ్ళి సంబంభం కుదర్చటంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు, చివరకు చెల్లెలి భర్త అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నప్పుడు ఆమె కుటుంబ బాధ్యతలు నిర్వహించటం – సాంప్రదాయ సమాజంలో స్వతంత్ర భావాలు గల ఒక స్త్రీ జీవిత కథ “మోకో పెద్దమ్మ”.
ఈ కథల్లో బాలి స్త్రీల జీవితాలు సజీవంగా కనిపిస్తాయి. ఈ కథలు చదువుతూంటే తెలుగునాట పల్లెజీవితానికీ బాలి ప్రజల జీవితానికి చాలా పోలికలున్నాయని అనిపించింది నాకు. పుతు మంచి రచయిత. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్ని చిత్రిస్తున్నప్పుడుకూడా కథలో జోక్యం చేసుకోడు. వ్యాఖ్యానాలు చెయ్యడు.
ఈ పుస్తకం ప్రచురించిన వారు: దర్మ ప్రింటింగ్, 318 విల్సన్ స్ట్రీట్, డార్లింగ్టన్ 2008, ఆస్ట్రేలియా.
ప్రస్తుతం దొరుకుతుందో లేదో తెలియదు. ఐ ఎస్ బి ఎన్ 0-646-37742-6.
Vamsi
Interesting!!!
Thanks for introducing this book..