ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ
గమనిక: ఈ వ్యాసం ఆంధ్ర జ్యోతి (12 ఏప్రిల్ 2009) ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది.
మొన్నీమధ్య ఆస్కార్ అవార్డుల హంగామా నడుస్తున్నప్పుడు నాలాంటి కొందరు ఔత్సాహిక పాత్రికేయులకు నాలుగేళ్ల క్రితం ఆస్కార్ గెలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఒకటి అకస్మాత్తుగా గుర్తొచ్చేసింది. దానిపేరు ‘Born in to brothels‘.
దేశంలో అతి పెద్ద వేశ్యావాటికగా పేరొందిన కోల్‌కతా సోనాగచ్చీలో ఒక విదేశీయురాలు ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించింది. అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు కెమెరాలతో చిత్రీకరించడం నేర్పించి, వారి స్థితిగతులమీద వారే నటులుగా సాగిన ఈ లఘుచిత్రం 2004లో ఆస్కార్‌ను గెలుచుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన పూజా (ఇప్పటి పేరు ప్రీతి, ఇంకా ఎన్నో ఉండొచ్చు)కు అప్పుడు పదమూడేళ్లుంటాయేమో. ఆ పిల్ల ఇప్పుడెలా ఉందోనని ఆరాలు తీసి వెళితే – ఆమె సోనాగచ్చీలోనే మోస్ట్ వాంటెడ్ సెక్స్ వర్కర్‌గా జీవితం గడుపుతోందని తెలిసి ఆశ్చర్యపోవడం పాత్రికేయుల వంతయింది. ‘ నాతో నటించిన కొందరు తమ బతుకు మార్చుకున్నారు. విదేశాల్లో చదువుకుంటున్నారు. నేను మాత్రం ఈ జీవితాన్నే ఎంచుకున్నాను’ అని చెప్పే పంతొమ్మిదేళ్ల ప్రీతిని ‘ఇందులో పుట్టిపెరిగిన మీరు పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా’ అనడిగితే సభ్యసమాజాన్ని చాచి లెంపకాయ కొట్టే ప్రశ్నను సమాధానంగా సంధించింది. ‘ఆర్యూ క్రేజీ? నాకు డబ్బుంది, విలాస వస్తువులన్నీ ఉన్నాయి. నేనెక్కడికయినా నిర్భయంగా వెళ్లగలను, ఇప్పుడిలా హాయిగా ఉన్నాను. ఎవణ్నో ఒకణ్ని పెళ్లి చేసుకుని వాడి అడుగులకు మడుగులొత్తుతూ స్వేచ్ఛను కోల్పోవాలా?’
వివాహ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతాం? (మైడియర్ పాఠకులూ, భర్తలందరూ అలాగే ఉన్నారా అని నా మీదకు యుద్ధానికి రాకండి. ఆ వయసుకే ఆమెనలా అభిప్రాయపడేలా చేసిన సమాజ నిజాలేమిటో, ఆమె జీవితానుభవం ఎంతో – ఎవరికి వారుగా ఆలోచించండి.)
కోల్‌కతా జనాభా ఏడు లక్షల మంది (సవరణ: దాదాపు డెబ్భై ఏడు లక్షల మంది), వేశ్యావృత్తిని అవలంబిస్తున్నవారు డెబ్బైవేల మందికి పైనే. ఈ లెక్కలు దేనికి సూచికలు? ఇవన్నీ ఆలోచిస్తుండగా ఒక పుస్తకంలోని వాక్యం ఉలిక్కిపడేలా చేసింది. “సెక్స్ వర్కర్లుగా మేం నాలుగు రకాల అవస్థలను తప్పించుకున్నాం. మొగుడికి వండి వార్చటం, అతని మురికి గుడ్డలుతకటం, పిల్లల్ని పెంచుకునేందుకు అతని మీద ఆధారపడటం, అతని ఆస్తిపాస్తుల్లో వాటాలిమ్మని దేబిరించే అవసరం. ఇవి మాకు లేవు” అని.
ఇవి ఒక సెక్స్ వర్కర్ మాటలు. ఆమె పేరు నళినీ జమీలా.
మాతృప్రధాన వ్యవస్థ కొద్దోగొప్పో ఉండటం వల్ల మహిళలకు ఎనలేని గౌరవం ఉంటుందనీ, సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా బాగా అభివృద్ధి సాధించిందనీ మనం అనుకునే కేరళలో – వేశ్యావృత్తి విశేషాలు, దానిలోని సాధకబాధకాలను తెలియజేస్తూ సాగే పుస్తకం ‘ఓ సెక్స్ వర్కర్ ఆత్మకథ’. సాధారణ కుటుంబంలో పుట్టి వేశ్యగా మారిన నళినీ జమీలా తన జీవితంలోని అనేక మలుపులను వివరిస్తూ రాసిన పుస్తకం ఇది. చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలను ఒక్కొటొక్కటిగా పేర్చుకుంటూ నళినీ ఈ రచనకు అతి కష్టమ్మీద శ్రీకారం చుట్టింది. రెండేళ్ల్ల కాలంలో అనేక అవరోధాల్ని దాటి పుస్తక రూపంలోకి వచ్చింది. ఇంకో రెండేళ్ల అనంతరం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మూలంగా తెలుగులోకి అనువాదమై మన చేతుల్లోకి చేరింది.
కల్లూరు అనే గ్రామంలో పుట్టిన నళిని జీవితంలోని ఎత్తుపల్లాల్ని చాలా చిన్నతనంలోనే చవిచూశారు. ఆర్థిక స్థితి క్రమంగా మారిపోవడం, తన ప్రమేయం పెద్దగా ఏమీ లేకుండానే ‘పెళ్లి లాంటిది’ అయిపోవడం, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మరణించడం, మరే ఇతర మార్గమూ లేక తాను వేశ్యావృత్తిలోకి దిగడం, తర్వాతి మలుపులు, కూతుర్ని భద్రంగా పెంచాలనుకోవడంలోని కష్టనష్టాలు.. ఇవన్నీ చెప్పుకొచ్చే నళిని స్వరంలో వీటికి ఇతరులెవరో కారణమని ఫిర్యాదు చేసే తత్వం పుస్తకం మొత్తమ్మీద ఎక్కడా కనిపించకపోవడం విశేషం.
ఈ పుస్తకాన్ని కేవలం నళిని జీవితంగా మిగిలిపోనివ్వని కొన్ని అంశాలూ ఉన్నాయి. వామపక్ష భావజాలానికి పెట్టని కోటయిన కేరళ వంటి చోట్ల కూడా శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ ఎలా జరిగేది, శ్రీనారాయణగురు శిష్యులమని చెప్పుకునే వ్యక్తులు కూడా కులభేదాన్ని ఎంత పట్టుగా పాటిస్తారు, కొన్ని ప్రాంతాల్లో మసీదులు ఆపన్నులకు ఆశ్రయమిచ్చే తీరు, అందులోని రాజకీయాలు… ఇవన్నీ అర్థమవుతాయి పాఠకులకి ఈ పుస్తకం చదివాక.
చివరన ఇచ్చిన నళిని ఇంటర్వ్యూ ఈ వృత్తిపై అనేక సందేహాలకు, అపోహలకు సూటిగా సమాధానమిస్తుంది. ‘పేద స్త్రీలకు, తలకు మించిన భారాన్ని మోయాల్సినవాళ్లకి ఏదో ఒక రకంగా సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యం. చేస్తున్న పని గౌరవప్రదమైనదా కాదా అని ఆలోచించి ఎంపిక చేసుకునే వెసులుబాటు ఎంత మాత్రమూ లభించదు..’ అని చెప్పే నళిని వేశ్యలుగా తమ సమస్యలను స్త్రీవాదులు సైతం అర్థం చేసుకోలేరంటారు. ‘ఎంతో అనారోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పునరావాసాన్ని గురించి ఆలోచించని సమాజం మా పునరావాస సమస్యను మాత్రం ఎందుకింత తీవ్రంగా చర్చిస్తుంది? మేం చేస్తున్న పనిని కేవలం నైతిక సమస్యగా ఎందుకు చూస్తారు?’ అంటూ ఆమె సంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గరుంది? నాగరికతలన్నిటికన్నా ప్రాచీనమైన వేశ్యావ్యవస్థను అర్థం చేసుకోవడానికి ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’ ఉపయోగపడినంతగా ఏ సర్వేలూ, పేపర్లూ, విశ్లేషణలూ సాయపడవన్నది మాత్రం నిజం.
పుస్తకం వివరాలు:
‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’ (Oka sex worker atmakatha)
నళినీ జమీలా (Nalini Jameela)
అనువాదం : కాత్యాయని, (Katyayani)
పేజీలు : 123, ధర : రూ. 50.
ప్రతులు, వివరాలకు హైదరాబాద్ బుక్‌ట్రస్ట్.
varaprasaad.k
వేశ్య అనగానే చులకనగా చూసే మన సమాజానికి, ఆమె కూడా మనిషి అని,ఆమెకు ఆలోచనలు,అభిప్రాయాలూ ఉంటాయని చక్కగా చెప్పారు.
varaprasad
ముందుగా అరునగార్ని అబినందిచాలి,ఇంట చక్కటి సమీక్ష రాసినందుకు.అయితే కొందరి ఆలోచనే కరెక్ట్ అనుకోవద్దు.ముక్యంగా ప్ర్రీతి విషయంలో,వివాహబందాన్ని కేవలం డబ్బుతోనూ సుకాలతోను సరిపేట్టుకోవలనుకొంటే భారతీయ సమాజంలో వివాహబందానికి ఇంత గౌరవం ఉండేదికాదు ఇంతకాలం మన్నేదికాదు.
Yogi
ఎప్పుడో 2006 లో వీరి వుమెన్ ట్రాఫికింగ్ గురించి నేను సేకరించిన వివరాలు ఇక్కడ: http://krkind.googlepages.com/aids-india
చదవాలనుకున్న వారు గుండె దిటవ చేసుకోవాలి!! హ్యూమన్ రైట్స్ వాచ్ వారి గణాంకాల ప్రకారం భారతదేశం లో మొత్తం పది మిలియన్ల మంది వ్యభిచార వృత్తి జీవనాధారంగా బ్రతుకున్నారట. “ఇండియా షైనింగ్”, “ఇంక్రెడిబుల్ ఇండియా” అని మొరిగే శునకాలన్నీ కట్టకట్టుకుని ఎక్కడన్నా దూకి ఛావాలి, సిగ్గుతో!
http://starvingindian.googlepages.com/friedman_aids
abhilash
review chala bagundi..
దుప్పల రవికుమార్
ఈ పుస్తక పరిచయం అద్భుతంగా వుంది. పుస్తకం ఇంగ్లిష్ అనువాదం కొని చాలా రోజులే అయిందిగాని, నేను ఇంకా ఒక్కపేజీ కూడా చదవలేదు. కానీ, ఇప్పుడు గబగబా తెలుగు, ఇంగ్లిషు వెర్షన్లు చదివించేలా ఈ పరిచయ వ్యాసం చేసింది. సమీక్షకు అంతకుమించి ప్రయోజనమేముంది!
అరుణ పప్పు
పొరపాటుకు చింతిస్తున్నా.కోల్కతా జనాభా 2008 లెక్కల ప్రకారం 77,80,544. (ఆధారం వికీ). నా రాతలో ఓ ఏడు ఎగిరిపోయింది.
నాగరాజు
“కోల్‌కతా జనాభా ఏడు లక్షల మంది, వేశ్యావృత్తిని అవలంబిస్తున్నవారు డెబ్బైవేల మందికి పైనే.”
నిజమా? మా బెంగళూరే కోటికి చేరుకొందే! కొల్‌కత్త మరీ ఇంత చిన్న ఊరని నేననుకోలా ఇప్పటివరకూ 🙂
రివ్యూ బావుంది.