నుడి – నానుడి

nuDiతెలుగు మీద, తెలుగు భాషలోని పదాల మీద అభిమానం ఉన్నవారికి చక్కని విందు తిరుమల రామచంద్ర గారి నుడి – నానుడి (Nudi-Nanudi). ఈ పుస్తకాన్ని “పరిచయం చేయడం” అన్నది కూడా నా లాంటి వాడికి ఓ పెద్ద పని కాబట్టి, ఈ పుస్తకం ఒకటి ఉన్నది అని మాత్రమే చెప్పబూనుకుంటున్నాను.

సంస్కృతంలో పద పదార్థ చర్చ సాగినంతగా మరే భాషలోనూ సాగలేదని మున్నుడిలో సెలవిస్తారు రచయిత.

ఈ వ్యాసావళిలో తెలుగులో కొన్ని పదాలను ఎంచుకుని, ఒక్కొక్క పదాన్ని, దాని పుట్టుకను వివరిస్తూ, తెనుగు తోబుట్టువులలోని సమానార్థక సరూపపదంతో తులనాత్మకంగా తరచి చూపిస్తూ, ఆ పదం పుట్టుపూర్వోత్తరాలను మానవజాతి పరిణామ దృష్టితోనూ పరిశీలించారు. పద చర్చ లో అక్కడక్కడా సంస్కృత శాబ్దికులపై విసుర్లూ విసిరారు. అయితే అవి వాదబలం కోసమే తప్ప, అవజ్ఞతో చేసినవి కావని రచయిత మనవి చేసుకుంటారు.

ఈ పుస్తకంలో ప్రస్తావించిన తెలుగు పదాలు కొన్ని. – “పనస, ఉప్పు, పాలు, సీతాఫలప్పండు, మగువ, ఉల్లి, వేప, కోమటి, చింత, తెరవ, పాడి, వాన, రోలు, తెడ్డు, గరిటె, పులిమీదపుట్ర, అవ్వాయిచువ్వా, కొడవలి, వేరుసెనగ, దిక్కూ – దివాణమూ, ఉండ్రాళ్ళూ, చారు, సెట్టిసింగారం, టెంకాయ, కోటలోపాగా, కరాంబువు………..

ఇక ఈ విందును కాస్త రుచి చూద్దాం.

ముందుగా మిరియం-మిరపకాయ.

“మిరపకాయ నేడు దేశమంతటా ఆంధ్రులకు ప్రతీక అయింది. నిజానికి మిరపకాయను తమిళులలో రామనాథపురం,తిరునల్వేలి జిల్లాల వారు, మహారాష్ట్రులు మనకన్నా విశేషంగా వాడుతారు. కాశ్మీరీలయితే, “కబళే కబళే గోవింద నామ సంకీర్తనం” అన్నట్టు ముద్ద ముద్దకు పచ్చిమిరపకాయలు నములుతారు.

కాని ఈ మిరపకాయ శ్రీనాథునికి తెలియదు. అతనికి తెలిసి ఉంటే సిరియాళుని మాంసాన్ని మిరపపండు కారంతోనే కలిపి వండే వాడు.

“మిరియము నుల్లియుం బసవు
మెంతియు నింగువ జీరకంబు” (హరవిలా. ౨-౧౨౦)

కృష్ణ రాయలకు కూడా మిరపకాయ తెలిసినట్లు లేదు. ..”

ఇలా మొదలుపెట్టి, మిరపకాయ సంస్కృత మరీచ శబ్ద తద్భవం కాదని, తమిళ శబ్దం మిళ్షగు, మెళె, మెరె,మిరె, మిరియం, మిర్యెం గా మారిందని ప్రస్తావిస్తారు రామచంద్ర.

ప్రొద్దు –
“సూర్యుని పేర్కొనే పదాలు తెలుగులో దాదాపు ముప్పై వున్నాయి. వాటిలో ప్రొద్దు, వెలుగు అనేవి చాలా పాతవి. తమిళంలో పొళ్షుదు అనే పాత పదం వుంది. కన్నడంలో పొళ్షు, పొత్తు, పొర్తు అనే పదాలున్నాయి. మనకు “పొద్దు పొడిచింది”, “భళ్ళున తెల్లవారింది” అని చక్కని ప్రయోగాలున్నాయి. సూర్యుడు దేనినో చీల్చుకుని వస్తున్నట్టు తోచడం వల్ల, సూర్యుడింకా కొన్ని గంటలకు ఉదయిస్తాడనగానే చీకట్లు విరిగి పోవడం వల్ల ఈ చక్కని ప్రయోగాలు మన భావకుల మనస్సుకు తట్టి ఉంటాయి. సూర్యుడు చీల్చుకుని, తూరి వచ్చే దిక్కు తూర్పయినట్టు;పొడుచుకుని, తూరి వచ్చేది ప్రొద్దు అయి ఉంటుంది. తమిళంలో పోళ్శ్ ధాతువుకు చీల్చు, ముక్కలు చేయు, బారుగా తెరచు, లోపలికి జొరబడు, నశింపజేయు అని అర్థాలున్నాయి.

ప్రొద్దు అనే పదం సంస్కృత బ్రధ్న శబ్దం నుంచి పుట్టిందనే వాదం ఒక తరం క్రిందే ఖండించబడింది.”

జల్లెడ –

ఓ ఇంట్లో రెండు జల్లెడలు మాట్లాడుకుంటున్నాయి.
మొదటిది, ” నేను చాలినీ. చల కంపనే అనే ధాతువు నుంచి మా వంశనామం పుట్టింది. సిసలైన సంస్కృతం మాట.”
రెండో జల్లెడ జలజలలాడింది. అన్నది : ” వస్తువులను జల్లించడం, కదలించడం, చల్లడం, వెదజల్లడం మున్నగు పనులు చేసే వారం కనుక, జల్లించు అనే దానిని బట్టే జల్లెడ వచ్చింది. నేను సిసలైన తెలుగు దాన్ని. తమిళ ’సెల్లెడై’ వారు మాకు చాల దగ్గర వారు, పెద్దవారూనూ.”

ఆంధ్ర ప్రభలో ఒకప్పుడు శీర్షికగా వచ్చిన ఈ వ్యాసావళి విశాలాంధ్ర ప్రచురణ. ఈ పుస్తకానికి మున్నుడి భద్రిరాజు కృష్ణమూర్తి గారు వ్రాసారు. ఈ పుస్తకం ఈ మధ్య తిరిగి ప్రచురించినట్టు కనబడుతున్నది.వెల 30/-ఈ పుస్తకం తప్పని సరిగా కొని దాచుకోవడానికి మరొక కారణం, ఇంటి ముంగిట ముగ్గులా – ప్రతి వ్యాసానికి ముందు అందంగా అమరిన బాపు బొమ్మ.

You Might Also Like

2 Comments

  1. Sreeram

    పుస్తకం ధర సవరించబడింది. వ్యాసానికి ఈ సవరించిన ధరని చేర్చితే ఉపయోగపడొచ్చు. పదకొండేళ్లయ్యింది కనుక ధర అలానే ఉండదు కానీ కొత్త ధరని చెప్పడం కొంత ఉపయోగకరం.

    1. పుస్తకం.నెట్

      కొత్త థర ఎంతో చెప్పగలరు. అప్డేట్ చేస్తాము.

Leave a Reply