Asleep – Banana Yoshimoto
ఓ పుస్తకాన్ని చదవబూనినప్పుడు, ఆ పుస్తకం లిఖించబడ్డ భాషలో ప్రవేశం ఉండడం పూర్వకాంక్షితం. లేకపోతే, పుస్తకాన్ని తిరగేసి పక్కకు పడేయడం తప్ప వేరేమీ చేయలేము. మనుషులు సంవదించటానికి అనేక భాషలు ఉన్నాయి. వాటిని అభ్యసించటానికి కొన్ని పద్ధతులున్నాయి. మనుషుల ఆలోచనలకూ, అనుభవాలకూ కూడా ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. కాకపోతే, వాటిని నేర్పించే వీలుండదు. ఆ ఆలోచనలో, అనుభావాలో మనకి అంతకు ముందే పరిచయం ఉంటే తప్ప, కొన్ని రచనల్లోని జీవం మనకి తెలీకుండా పోతుంది.
జపనీస్ రచయిత బనానా యోషిమోతో రచించిన “అస్లీప్” అనే ఈ పుస్తకంలో మూడు చిట్టి చిట్టి నవలికలున్నాయి. మూడింటిలోనూ “నిద్ర”ది ప్రముఖ పాత్ర.
మొదటి కథ – Night and Night’s Travelers: ఈ కథలో నరేటర్ ఒక అమ్మాయి. ఆమె అన్నయ్య ఒక ఆక్సిడెంటులో చనిపోతాడు. అతడి మరదలు అతడిని పీకలోతుగా ప్రేమిస్తుంది. అతడు ఒక అమెరికన్‍ని ప్రేమించి, ఆమె కోసం జపాన్ వదిలి అమెరికాకు వెళ్ళి, తిరిగొస్తాడు. అతడు చనిపోవటంతో ఈ ముగ్గురి జీవితాల్లో ఏర్పడ్డ వెలితి ఎలా ఉంటుందో రచయిత కథనాత్మకంగా చూపించిన తీరు నిరుపమానం. పోయిన మనిషికి మిగిలిపోయిన ఒక్కొక్కొరితో ఒక్కో రకం సంబంధం, అనుబంధం ఉండేది. ఆ సంబంధానుబంధాల అవశేషాలను వాళ్ళు ఎలా మోసారు? ఒకరికొకరు తారసపడ్డప్పుడు మొహం చాటేయలేక, ఎదురుపడలేక ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారు అన్నది కథాంశం.
రెండో కథ – Love songs: ఇది కూడా ఒక అమ్మాయి కథే. నిద్రపోబోయే ముందు ఆమెకి ఒక కమ్మని గొంతు జోల పాడుతూ ఉంటుంది. మొదట్లో అదంతా తన భ్రమని కొట్టి పాడేస్తుంది. తన ప్రేమికుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడనీ, అతడితో విడిపోతుంది. ఆమె చనిపోయాక, మళ్ళీ అతడిని చేరుకుంటుంది, కాస్త మెడికల్ సహాయంతో. అదెలా సంభవించింది, అన్నదే ఇందులోని కథ.
మూడో కథ – Asleep: ఇందులో ప్రముఖ పాత్ర అయిన అమ్మాయి, ఒకతణ్ణి ప్రేమిస్తుంది, అతనికి పెళ్ళైయ్యిపోయిందని తెల్సి కూడా. అతడి భార్య కోమాలో ఉంటుంది. ఈ అమ్మాయికి చాలా దగ్గరైన స్నేహితురాలు చనిపోవటంతో, ఆ విషాదాన్ని ఎవరితోనూ పంచుకోలేక, రోజుల తరబడి నిద్రపోతూ ఉంటుంది. అతి-నిద్రతో ఆమె సల్పిన పోరాటం, చేజారిపోతుందనుకున్న జీవితాన్నీ, ప్రేమనూ ఆమె తిరిగి స్వంతం చేసుకొన్న విధానం తక్కిన కథలో ఉంటాయి.
ఈ మూడు కథల్లోనూ సారూప్యాలున్నాయి. ఒకటి, వ్యక్తులు తమ ఇష్టుల మరణాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నం చేయటం. ఎంతగా ప్రయత్నించినా, పూడ్చలేనంత ఖాళీ ఏర్పడ్డంతో అది వారి నిద్ర మీద ప్రభావం చూపి, ఒక చోట స్లీప్‍వాకింగ్‍గానూ, మరో చోట అతి-నిద్ర గానూ పరిణామం చెందటం. అన్ని కథల్లోనూ అంతర్లీనంగా ప్రేమ, ప్రేమతో పాటు వచ్చే అభద్రతాభావం, నిరాశ, ఒంటరితనం, భావావేశాలు అన్నీ పుష్కలంగా పలికించగలిగింది, రచయిత. ఇందులో కథలన్నీ ఉత్తమ పురుష నరేషన్‍లో నడవడం వల్ల, పాత్రల్లోని మనోభావాల లోతులకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
కాకపోతే, ఇవి కాపీ-పేస్ట్ కథలు. రచయిత నేరుగా జీవితాల్లో నుండి కథలను అలా దించేశారు. రికార్డ్ ఆండ్ ప్లే! అందుకని, వీటికి అర్థం పర్థం ఉండవు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోయాడన్న వార్త తెలియగానే, ఒక్కసారిగా అరుస్తూ శవం మీద పడి ఏడ్వడమో, లేక అపస్మారక స్థితికి చేరుకోవడమో జరిగి, అంతా అయ్యాక, కొన్నాళ్ళకు అప్పుడప్పుడూ గుర్తొస్తుంటే, ఒక్కో కన్నీటి బొట్టు రాల్చడం అన్నది చదివి ఊరుకోడానికి బాగుంటుంది. ఇంకా ప్రేమ ఎక్కువై వాళ్ళే ఆత్మహత్యకో పాల్పడితే ఇంకా కిక్ వస్తుంది. అలా కాక, ఆ మనిషి మరణం ప్రతీ క్షణం నరకాన్ని తలపింపజేస్తూ ఉంటే, చేతిలో ఉన్న జీవితంలోని ఒక్కో క్షణం, ఒక్కో కన్నీటి చుక్కగా చేజారిపోతూ ఉంటే, ఎడతెగని ప్రయాణానికి ముగింపు ఉండదు. ఉన్నా, అది జనరంజకం అవ్వదు.
పేజీకో టన్ను నవ్వులనో లేక టాంకు కన్నీళ్లనో తెప్పించే రచనలను కామెడీ, ట్రాజెడీలుగా విభజించుకున్నాం కదా. అలా కాక, ఒక్కో పేజీకి పుట్టుకొస్తున్న నవ్వులన్నీ ఎండమావులై, తన్నుకొస్తున్న కన్నీళ్ళు ఆవరైపోయే రచన ఇదన్న మాట. ఇందులోని భావేవేశాలేవీ, రాంప్ పైకొచ్చి వయ్యారాలు పోవు. తలుపు చాటునో, మంచం కిందనో, రెప్ప మాటునో, పెదవంచునో దాగిపోతాయి. ఆగిపోతాయి. అందుకే, ఈ రచనను కనీసం పూర్తి చెయ్యాలంటే, అలా దాగి, ఆగే భావోద్వేగాలుంటాయని తెలియాలి. లేదా, ఇదో చేతకాని రచనలా అనిపిస్తుంది. చికాకు తెప్పిస్తుంది.
మూడో కథలో స్నేహితురాళ్ళిద్దరి మధ్యనా ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంటుంది. భార్య కోమాలో ఉన్నవాడిని ప్రేమిస్తున్న అమ్మాయి, అతడితో కల్సి గడిపిన క్షణాల్లో వెలితిని చెప్పటానికి ప్రయత్నిస్తుండగానే, దాని గురించి అభిప్రాయం వెల్లడించేస్తుంది, ఆమె స్నేహితురాలు, ఇలా:
“Hey, I’m a pro,” Shiori said, narrowing her eyes. “You see, people like him think everything that’s not formally declared is basically nil.”
“Nil?”
“That’s why he’s so nervous. As soon as he starts thinking of the two of you as a unit, his situation becomes extremely dangerous, you see? So, for the time being you’re nil, you’re being held in the reserve, the pause button is pressed down, you’re stacked in the stockroom, you’re a life’s special bonus.”
“I.. I think I know what you mean, but… what’s this ‘nil’? What kind of a place does he put me in, you know? Inside him?”
“Somewhere completely dark,” Shiori said.
And then she laughed.
ఇప్పుడిందులో అర్థాలు వెతుక్కోవటం కష్టం. అవి కనపడ్డాక, వాటిని విస్మరించటం మరీ కష్టం.
“Books say: She did this because. Life says: She did this. Books are where things are explained to you; life is where things aren’t. I’m not surprised some people prefer books. Books make sense of life. The only problem is that the lives they make sense of are other people’s lives, never your own.”
— Julian Barnes (Flaubert’s Parrot)
ఈ రచనలో “because”ల గురించి ఉండదు. అయినా చదవడానికి ఇబ్బంది పడనివాళ్ళు, చదువుకోవచ్చు.
ఇట్లాంటి రచనల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, ఓ స్నేహితురాలి ప్రశ్న: “జీవితంలో ఉన్నవి చాలడం లేదూ?! ఆటవిడుపుకి చదువుకోక, ఎందుకీ కష్టాలు?”
అంటే.. అదీ.. మరేమో.. అదో తుత్తి! 🙂
___________________________________________________
Book Details:
Asleep – Banana Yoshimoto
(Translation: Michael emmerich)
A blog review here.
jai
… జీవితం లో ఉన్నవి చాలడం లేదా .. ఎందుకీ కష్టాలు..
రివ్యూ ఎవరు రాసారో చూడకుండా చదివాను.. ఈ వాక్యం చూసి సౌమ్య గారు అనుకున్న.. సౌమ్య గారి సెన్సు అఫ్ హ్యుమర్ కి ఉన్న వేల మంది ఫాన్స్ గుంపులో నేను ఒక గోవింద ని కాబట్టి.
థాంక్స్ అండి పూర్ణిమ గారు
సౌమ్య
బాగుంది. నేను మొన్న సోమవారం నాడే ఒక పుస్తకాల షాపులో ఈయన పుస్తకం ఒకటి చూసాను (ఇది కాదు!). అప్పుడే ఈ పేరు ఎక్కడో విన్నానే, అనుకున్నా. మళ్ళీ వచ్చి ఈ వ్యాసం చూశాక అర్థమైంది ఎక్కడ విన్నానో!! 🙂