ఆవేదనతో నిండిన అక్షర నీరాజనం…. జ్వాలాముఖి “భస్మ సింహాసనం”
రాసిన వారు: శైలజామిత్ర
*****************
ప్రముఖ దిగంబరకవి జ్వాలాముఖి (ఆకారం రాఘవాచారి) మనమధ్య లేకున్నా వారి తాలుకు ఒక అంతులేని భావమేదో మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది..సమాజం పట్ల వారి ఆవేదన, ఏదో మానసిక వేదన కలిపినట్టి ఒక అద్భుత చిత్రం వీరి మనో భాష్యం.. చూడడానికి గంభీరమయినా, మనసు ఒక అందమయిన మల్లెల మాల. ” 1938 సంవత్సరంలో ఏప్రిల్ 12 న హైదరాబాద్ లో సీతారంబాఘ్ దేవాలయంలో వెంకట లక్ష్మి నరసమ్మ, వీరవెల్లి నరసింహా చార్యులు గారికి జన్మించారు. ” మనిషీ” కావ్యంతో సాహిత్య జీవితం ఆరంభించి, దిగంబరకవిగా, విప్లవ కవిగా, ప్రసిద్దికెక్కి, మహా వక్తగా పేరుగాంచిన వీరు సాంస్కృతిక రంగంలో ఐఖ్య సంఘటన అవసరమని నమ్మిన వ్యక్తి .. సామ్రాజ్య వాదాన్ని ప్రసంగాలలో ఎండగడుతూ, భూస్వామ్య సంస్కృతిని ఎదిరించిన ఒక శక్తి .
నేడు నా చేతిలో ఉన్న ఈ అక్షర నీరాజనం ” భస్మ సింహాసనం”మూడు దీర్ఘ కవితల సంకలనం..మొదటిది “మనిషీ” అనే కావ్యం.. ఇది వీరు తమ 1957 లో రాసిన మొదటి కావ్యం. రెండవది “మదరిండియా-92 ” మూడవది – “భస్మ సింహాసనం”.ఇది ఆయన 2002 లో రాసిన ఆఖరి దీర్ఘ కావ్యం. ఇవన్నీ కూడా కవిలోని కవితావేశానికి, అభినివేశానికి అద్దం పట్టడమే కాకుండా మతం పేరిట జరుగుతున్న మారణహోమాన్ని విశ్లేషిస్తూ, రసోద్వేగభరితంగా సాగుతూ, మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించేది గా ఉన్నాయి. జ్వాలాముఖి గారు తీవ్రంగా స్పందించిన విషయాలలో మత కలహాలు ఒక ముఖ్యమయిన అంశం. వీరు మతకల్లోలాలను నిరసిస్తూ అనేక కవితలుగా స్పందించడమే కాక, ఆయా సందర్భాలలో నిజనిర్ధారణ కమిటీలు, శాంతి కమిటీల ద్వారా విశేషంగా కృషి చేసేరు. పలుచోట్ల ప్రసంగాలలో పాల్గొన్నారు. భాధితులకు ఓదార్పుగా, సమర శీలంగా వెన్నంటి నిలిచేరు.
కల్మషం లేని కలలతో, ఒక నిర్దిష్టమయిన ఆశయాల వెలుగులతో మనిషిని కరుణారసమూర్తిగా, సంస్కారవంతునిగా ఎదగమని, అవస్థల స్థితిగతులను మానవీయంగా మలచుకోమని రచించిన గొప్ప కావ్యకంఠం- “మనిషీ” కావ్యం. మతం స్థానంలో మానవతని, దేవుని స్థానంలో మంచి మనిషినీ ఉంచి వారిలో ఒక చక్కనైన మార్పును ఆహ్వానిస్తూ కవి పాడిన ప్రభాత గీతం “మనిషీ”.
“ఓ మనిషీ!/ మానీషివిగా/ మహిలో /సత్యాన్వేషణ కై/ నిరంతరం జిగీషివిగా/కరుణ నిండిన/ మహా ఋషిగా..”
“నీతియే/ నీలోని పవిత్రత/ నిర్మల హృదయమే నిజమయిన దేవత/ అహమనుటే నీకు వినాశము/ దాన్ని మరచిన నీ కిహము/వశము”
-అంటారు ఆవేశంగా మనిషీ లో..
తర్వాత ప్రఖ్యాత నగరాలు హైదరాబాద్, మొరాదాబాద్, అహమదాబాద్, ముంబై, గుజరాత్, ఏక్కడైతేనేమి ? మత విద్వేషంతో పీడించ బడుతున్న ప్రతి కల్లోల సందర్బంలోను కవిగా జ్వాలాముఖి గారు స్పందించి, అలా స్పందించిన కరుణ రస వాహినిని, ఒక వీరోచిత చిత్రంగా అక్షరా విష్క్రుతి చేసేరు. పీడితుల పక్షాన ధర్మగ్రహంతో కవితాలను అలంకరించేరు. ముంబైలో రేగిన మత కల్లోలానికి నిరసనగా ఎత్తిన కవితా వెలుగు మదరిండియా-92 ! ఇదొక కనిపించని విచలిత దుఃఖ రూపం!
“మహా నగరం మొహందకారం / మహా నాగరికత మాంసల వ్యాపారం/ శరీరాల సంత ఆత్మల భాహిష్కారం/ యవ్వనాల సమాధి జీవితాల నిషేధం”
“చీకటి ధ్రువాల శిధిల సమాజంలో / ‘అరుణ తారగా’ వెలుగులూ విరజిమ్మిన రెడ్ లైట్ ఏరియా’ /’విముక్తి పోరాటం’ ముందుకు తెచ్చిన ‘మదరిండియా’ /’తవ శుభ నామే జాగే గాహే తవ జయ గాధా”
అంటారు ఆవేదనగా..
ఇక “భస్మ సింహాసనం” గురించి తెలుసుకోవాలంటే గుజరాత్ లో మతం పేరుతో సాగిన మారణ కాండకు, భీభత్స మయిన నరమేధానికి, వేదనపడి, క్రుంగి, కృశించి, అక్కడ రెండు పర్యాయాలు అనేక సార్లు పర్యటించి, అక్కడి బాధితులతో గడిపి రచించిన వాస్తవ చిత్ర రూపం. అక్కడ అమానుషత్వాన్ని చూసి, మానసికంగా అలసిపోయి, రోదించి, రచించిన ఆవేదనా అక్షర రూపం. అక్కడితో ఆగదు. పాలక వర్గ రాజకీయాల చేతుల్లో కీలుబొమ్మలై కొందరు మతోన్మాదంతో సాటిమనిషిని ” కేవలం మన మతం కాదనే ఒక్క మాటతో తలలు తెగ నరుకుతుంటే ఈ సుకవి రుద్రుడి, వీర రసస్పోరకంగా మనిషికి తిరగబడండి అనే నినాదాన్ని అందించారు. మానవతా విలువలని కాపాడుకొమ్మని సందేశం ఇచ్చిన ఉద్యమ గీతం “భస్మ సింహాసనం”.
అయితే ఈ పరిస్థితులు ఎలా మారుతాయి? వీటికి ప్రధాన కారణాలయిన విధానాలకు ప్రాణం పోసి పెంచుతున్న భూస్వామ్య వ్యవస్థను, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడి దారీ వ్యవస్థను, రద్దుచేసి, నిజమయిన ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడమే ఇందుకు సరైన మార్గమని, ఇదొక్కటే విలువైన పరిష్కారమని తెలిపిన మహా కవి జ్వాలాముఖి..
“శమశ్రీలను దోచిన రత్నగర్భ / జన స్త్రీలను చేర్చిన పుణ్యభూమి/ జాతుల అణచివేతలో ఆర్యవిజేత / మత విద్వేషంలో మధ్యయుగాల మన్వంతరం”..
“బూడిదలో బుద్ది పద్మాసనం ఫలితం భస్మ సింహాసనం/ ఎన్నికల బరిలో రౌడీల ఏకచత్రాదిపత్యం/ కండగల వాడిదే రాజ్యమన్న రాక్షస రామదండు / తిండిలేని వారి ముల్గులు పీల్చిన వివేకానందం “
ఈ ఆదర్శాలకు, ఆశయాలకు అనుగుణంగా, ఈ భయాలకు వ్యతిరేకంగా, భీతవహానికి వ్యతిరేకంగా, మానవతా ఆరాటాన్ని ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని, సాయుధులై, తిరగాబడవలసిన ఆవశ్యకతని, ఎంతో ఆవేశంగా రచించారు. ప్రతి పక్షం, అధికార పక్షం ఆవశ్యకతని, స్వార్థ రాజకీయ నినాదాలకు బలి కాకుండా నేటి భూస్వామ్య, బడా పెట్టుబడి దారుల ప్రజాస్వామ్యానికి విరుగుడుగా అందరూ కలిసి రావాలని, మనిషిని మనిషిగా నిలబెట్టాలని లేకుంటే మిగిలేది “భస్మ సింహాసనమే అని ఆవేదనతో, సమాజం పట్ల ఒక బాధ్యతతో తెలిపారు. సమాజంలో పీడితులున్నారు. భాదితులున్నారు. అందరూ ఒకే బరిలో నిలుచున్నారు. వీరందరినీ చూస్తూనే సింహాసనాల కోసం వీధిలో చేసుకుంటున్న పోరాటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించే అద్భుత కావ్యం ఈ “భస్మ సింహాసనం”.
ఏల్చూరి మురళీధరరావు
జ్వాలాముఖి వేదనానివేదనం శైలజా మిత్ర గారి సమీక్షలో తాదాత్మ్యభావనతో ప్రతిఫలించింది. కావ్యశీర్షికకు
“ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు.”
అన్న శ్రీ జాషువా గారి “శ్మశానవాటి” కవిత స్ఫూర్తి. దానికి అనువర్తనీయంగా కవి మనోగతాన్ని సమన్వయించుకోవాలి.
editor
chala bagundi maa telugudinapatrikalo review rastamu
editor am news telugu daily
website
http://www.amnewstelugudaily.com
సౌమ్య
ఏఎం న్యూస్ ఎడిటర్ గారికి:
మీరు ఈ పుస్తకం గురించి రివ్యూ రాసుకోవడం మీ ఇష్టం కానీ, ఇక్కడి వ్యాసాన్ని ప్రచురించే పక్షంలో మాత్రం – ముందు పుస్తకం.నెట్ కు తెలియజేయగలరు. అలాగే, ఒకవేళ ఇక్కడి వ్యాసాన్నే ప్రచురించిన పక్షంలో అది పుస్తకం.నెట్లో మొదట ప్రచురితమైందన్న విషయం కూడా ప్రస్తావించగలరు.
మరిన్ని వివరాలకు “కాపీరైట్స్ & వ్యాసకర్తలకు సూచనలు” పేజీలో ఉన్న సూచనలు చదవమని మనవి.
editor
chala bagundi maa telugu dinapatrikalo review rastamu
చౌదరి జంపాల
పద్యాలలోంచి ఉదహరించిన భాగాల్లో అచ్చుతప్పులు ఉన్నట్లు అనిపిస్తుంది.