పద్యాలతో విశ్వసత్యాలను ఆవిష్కరించే తాత్విక కవి విన్నకోట రవిశంకర్

రాసిన వారు: ఆకెళ్ళ రవిప్రకాష్
*****************
మొట్టమొదటసారి నేను రవిశంకర్‌ని REC వరంగల్ కాంపస్‌లో కలిసాను. అపుడు నేను JNTUలో ఇంజినీరింగ్ విద్యార్థిగా REC వరంగల్‌లో జరిగిన సాంస్కృతిక వుత్సవాలకు హాజరయ్యాను. REC వరంగల్‌లో అప్పుడు రవిశంకర్ అధ్యాపకుడుగా పనిచెసేవాడు.అక్కడమొదలైన మా స్నేహం తరచుగా ఫోనుల్లో తప్పక పలకరించుకొనేలాగా మూడు దశాబ్దాలుగా సాగుతూనేవుంది. మా యిద్దరి జీవన శైలికి కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇద్దరం ఇంజినీరింగు చదివి, ఆ తర్వాత కూడా వుద్యోగ ప్రయత్నాల్లోగాని, సాధనల్లోగాని తలమునకలయినవాళ్ళం. ఇస్మాయిల్ స్నేహం ద్వారా కవిత్వంలో తాత్వికాంశని, జీవితానుభవాన్నీ నింపుకున్నవాళ్ళం.

గత మూడు దశాబ్దాలుగా రవిశంకర్ జీవితాన్నీ, కవిత్వాన్నీ అతి దగ్గరగా చూడగలిగిన నాకు, అతని కవిత్వాన్నీ, ముఖ్యంగా వేసవివాన, రెండో పాత్ర కవితా సంకలనాల మీద విశ్లేషించాలని కోరిక కలిగింది. ఆ ఫలితమే ఈ సమీక్ష.

1. రవిశంకర్ కవితా ప్రక్రియ రహస్యం ఏమిటి?

విన్నకోట రవిశంకర్ సాధారణ జీవితానుభవాల ద్వారా విశ్వ సత్యాలను ఆవిష్కరిస్తాడు. అలంకారాలు, భాషాడంబరం, శబ్ద మాధుర్యం లాంటివి పట్టించుకోకుండా అలతి అలతి మాటలతో భావావిష్కరణ చేస్తాడు. జెన్ బుద్ధిజం లోనూ, జపనీస్ హైకూలోనూ ఇలాంటి నిశ్శబ్దం, సౌందర్యం చూస్తాం. రవిశంకర్ తన కవిత్వాన్ని నిర్వచించుకున్న విధం చూస్తే పై విషయాల నిరూపణ జరుగుతుంది.

“వేసవివాన లో “పద్యం కోసం” :

ముందుగా మౌనం కావాలి
సకలాలంకారాల్నీ
స్వచ్చందంగా పరిత్యజించాలి
. . .
కవిత్వ సేచన కోసం
నవనాడులూ సమాయత్తంకావాలి
. . .
ఒక కొత్త అందం కోసం
కొత్త చూపుతో
అన్వేషణ సాగించాలి

విన్నకోట రవిశంకర్‌కి తన కవిత్వంలో తారాడే మౌనం గురించి, కవిత్వం కోసం అతను నిర్దేశించుకున్న మార్గం గురించి పూర్తి అవగాహన వుంది.

వేసవివాన లో “కవిరూపం”
నిన్ను నేను నిరుత్సాహ పరచి ఉండవచ్చు.
నీ కలల ఒంటిస్థంభం మేడకి
పునాదిని నేనే అయినా,
దాని ఎత్తుకి నేనే భయపడి కదిలి ఉండవచ్చు.

రవిశంకర్‌కి ఎలాగయితే పదాల మీద, అలంకారాల మీద మోజు లేదో, అలాగే వ్యక్తిగత ఆడంబరాల మీద, అలంకారాల మీద ఆసక్తి లేదు. కవులలో కనిపించే hypocrisyకి అతను ఆమడ దూరం.

తన కవితాప్రక్రియని తనే ఎలా వివరించాడో ఈ క్రింది కవితల్లో చూడండి:

రెండో పాత్ర “అవకాశం”

మనసు పెట్టినంత సేపు
మంచులా ఘనీభవించే పద్యం
దృష్టి మరలితే
నీరై జారిపోతుంది.

రెండో పాత్ర “ఒకోసారి”

అసంపూర్ణ పద్యాన్ని మోస్తున్నంత సేపూ
ఆందోళనగానే ఉంటుంది
పల్లెటూళ్ళో ప్రసవవేదన పడుతున్న స్త్రీని
బండిలో వేసుకు బయల్దేరినట్టుగా ఉంటుంది
జీవన్మరణాలకి బాధ్యత వహించే
ఇంత బరువుని మరి మోయాలని ఉండదు.

రెండో పాత్ర “అసంపూర్ణ పద్యం”

అలజడి ఉన్నప్పుడే పద్యం పూర్తికావాలి.
ప్రతిరూపం తిరిగి ఏర్పడిందంటే
ఇక, పద్యం పూర్తికాదన్నట్టే.

విన్నకోట రవిశంకర్ ఎలక్ట్రికల్ ఇంజనీరు. మొదట అధ్యాపకుడిగా, ఆ తర్వాత APSEBలో ఇంజనీరుగా పనిచేసి, అమెరికాకి ఉద్యోగ రీత్యా వలస వెళ్ళాడు. ఇన్ని మజిలీలలో కూడా కవిత్వం పట్ల అతనికున్న దీక్ష, శ్రద్ధ ఎంతగా గాఢమవుతూ వస్తున్నదో పై కవితల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగని పద్యం నుంచి, జీవితం నుంచి దూరంగా నిలబడి లోతైన నిశ్శబ్దంలో తాదాత్మ్యం చెందడం అతనికి తెలుసు.

రెండో పాత్ర “ఉత్సవం”

పద్యం ముగించాక
ప్రతిభ కనబరిచిన
పదచిత్రాలన్నీ
రంగులు కడిగేసుకుని
వచ్చిన దారినే వెళ్ళిపోతాయి
. . . .
ఏమీలేనితనం
ఎంత లోతైనదీ అర్థమౌతుంది.

రవిశంకర్ వేసవివానలో తన కవిత్వాన్ని యిలా నిర్వచించుకున్నాడు ,

తాను లోబడి
ప్రపంచాన్ని లోబరుచుకొనే
విచిత్ర సమ్మోహన రహస్యం
కవిత్వం

నన్నయ తిక్కనాదులనుంచీ ఈ తరం కవుల వరకు అందరూ యీ విచిత్ర సమ్మోహన రహస్యానికి లోబడినవారే. తమ కవిత్వాన్ని తామే స్పష్టంగా నిర్వచించుకోవడం, మార్గ నిర్దేశం చేయడం కవుల లక్షణం.

2. రవిశంకర్ కవిత్వంలో సంఘర్షణ లేదా?

రవిశంకర్ కవిత్వంలో సున్నితత్వం వుంది. తాత్వికత, జీవితానుభవం వుంది. వీటన్నిటి వెనుక కనబడీ కనబడని, లోతుగా పరిశీలిస్తేగానీ కనబడని వ్యక్తిగత సంఘర్షణ వుంది. కొంచెం నిశితంగా లోతుగా అన్వయిస్తే అతనిలో లోతుగా పాతుకుపోయిన సంఘర్షణల వేళ్ళని అర్థం చేసుకోవచ్చు.

రెండో పాత్ర “అమ్మనుంచి”

మాతృ భాష
మాతృ భూమి
మనసుపెట్టి చదివిన మాతృ శాఖ
అమ్మతో పోలికచెప్పిన అన్నిటికీ దూరమయ్యాం.

వేసవివాన “ప్రవాసం”

కలల దేశానికి వచ్చినదగ్గర్నించి
కన్న దేశం
కలలోకి వస్తుంది.

***
ఇల్లు, ఊరు, రోడ్డు, కారు
– అన్నీ విశాలమే
మరి జీవితమెందుకు యిరుగ్గా ఉంది?

వేసవివాన “జన్మ వృత్తాంతం”

ఏకకణమైననాటినుంచినాకిది అలవాటే
ఎదగటంకోసం నన్నునేనే విభజించుకోవటం
మనసేర్పడక ముందునుంచి నాకిది పరిపాటే
అనవరతం ఒక సంశయాత్మక అస్తిత్వమై చలించటం
. . .
కణసముదాయంగా జీవనరేఖను దాటినప్పటినుంచి
మృత్యువు నీడను చూస్తూనే వున్నాను
చావుపుట్టుకల నాకు పరిపాటే
నిరంతర జనన మరణాల నిత్యవేదిక శరీరం

వేసవివాన “కోరిక”

ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు
చనిపోవాలని ఉంటుంది.
‘ ‘ ‘
స్థల కాలాల్లేని ఒక ఏకాంతంలోకి
శాశ్వతంగా ఒదిగిపోవాలని ఉంటుంది.

రెండో పాత్ర “లోతు”

ప్రశ్నలు పాతవే అయినా
ప్రమాదం లేదు.
పాత జవాబులతో సమాధాన పడటంతోనే
పతనం ప్రారంభమౌతుంది.
శీతువులా ఆవరించే
ఈ లోతులేనితనం
అప్పుడప్పుడు సన్నగా కోతపెడుతుంది.

తను వదిలి వెళ్ళిన మాతృదేశం, మాతృభాష రవిశంకర్‌ని బాగా కృంగదీస్తాయి. ఎన్ని నుఖాలు పరాయిదేశం తనకి యిచ్చినా, జీవిత యిరుకుగా అనిపిస్తుంది. తనని తాను విభజించుకొంటూ ఏకకణం నాటినుంచి సంశయాత్మక అస్తిత్వమై చలిస్తానని అంటాడు.

3. రవిశంకర్ కవిత్వంలో వస్తు నవ్యత్వం

మిగతా కవులెవరూ రాయని వస్తువుల గురించికవితలు రాయడం, ఎవరూ రాయని కారణాల్ని పట్టుకోవడం రవిశంకర్ ప్రత్యేకత. ఈ క్రింది కవితలు చూడండి మచ్చుకి:

వేసవివాన “ఉడాన్”

మబ్బుల పూలతోటల్లో విహరించే దేవతలు,
మాయా పుష్పకంలో వచ్చి అపహరించే రాక్షసులు
– అనాదిగా మనిషి ఊహాజగత్తునేలిన
అపురూపమైన ఒక కలలోనికి
సశరీరంగా నేడు ప్రవేశించాను.

రెండో పాత్ర “యజ్ఞం”

ఏ కొత్తవస్తువు తాకినా
అజ్ఞాత సృష్టికర్తల ఆనవాళ్ళు
తడితడిగా తగుల్తాయి.

సుదూర ప్రాంతాల జీవనగాధలు
అంతరంగంలో వినబడతాయి.
వినియోగ మహాయజ్ఞంలో
వ్రేల్చిన సమిధలేవో
బూడిదరంగు పెదవుల్తో
పొడిపొడిగా నవ్వుతాయి.

రెండో పాత్ర “బాకీ”

పనిభారం కంటె
చెయ్యని పనుల బరువే ఎక్కువ.

రెండో పాత్ర “జీవన సూత్రం”

మిత్రులు లేకపోయినా ఫరవాలేదు
కాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం

. . .
ప్రతీ ఆటలోనూ సహచరులకంటే
ప్రత్యర్థి పాత్రే ముఖ్యం.

రెండో పాత్ర “సవాలు”

ఏడు రంగుల్లో ఏరంగుగానైనా
ఎలాగోలా బతకవచ్చు.
అన్నిటితో సయోధ్య సాధించి
ఏకవర్ణం కావటమే కష్టం.

జీవితాన్ని అతి సూక్షంగా పరిశీలిస్తేగానీ యింత నవ్యత సాధించటం కష్టం. వస్తువు పాతదే అయినా దానిలో కొత్త కోణాలు వెతికి మన ముందు వుంచుతుంది.

4. నిష్కల్మష ప్రేమను బంధాల్లో పునః ప్రతిష్టించే కవిత్వం

విన్నకోట రవిశంకర్ కవిత్వం చదివితే ఆరోగ్యం చేకూరుతుంది. ఎలాగంటే అతను మనచుట్టూ తిరిగే మన అనేకానేక బంధాలలో వున్న కల్మషాన్ని వుతికి ఆరేసి కొత్తగా ఆస్వాదించేలా చేస్తాడు. కోల్పోతున్న స్వచ్చతని పునఃప్రతిష్టిస్తాడు. బంధాల్లో వుండే ఆనందాన్ని, ప్రేమని ఆవిష్కరించి కొత్త ఆకాశాలకి తలుపులు తెరుస్తాడు. తల్లి, తండ్రి, భార్య, కూతురు, తరత్రాల పోలికలు – ఇలా అన్నిటినీ మనం మళ్ళీ కొత్తగా అనుభూతి చెందేలా చేస్తాడు. రవిశంకర్ కవిత్వం చదివితే మనకి మానసిక ఆరోగ్యం కలుగుతుంది. పొరలు, పొరపొచ్చాలు వీడి మన జీవితాల్లో ప్రేమని పునః ప్రతిష్టించే దిశగా ఆలోచనలు కలుగుతాయి. పతనమవుతున్న కుటుంబ వ్యవస్థకీ, వాణిజ్యపరమంవుతున్న సంబంధాలకీ వైద్యం చేసే వైద్యుడు రవిశంకర్. ఈ క్రింది కవితల్ని చూడండి :

రెండో పాత్ర “గొడుగు”

ఆయన విడిచి వెళ్ళిన గొడుగుని
బహుశ మేమెవరమూ తెరవం.
విప్పిచెప్పని ఆయన అంతరంగంలా
ఆ గొడుగు ముడుచుకొనే ఉంటుంది.

వాళ్ళ నాన్న వదిలి వెళ్ళిన గొడుగునింత ప్రేమిస్తే, రవిశంకర్ తన తండ్రిని ఎంత ప్రేమించి వుంటాడు? దీని ద్వారా మనకి ఏమి సందేశం యిస్తున్నాడు?

రెండో పాత్ర “రెండో పాత్ర”

కళ్ళకి అక్కడక్కడా అంటుకొన్న కలని
కాసిని చన్నీళ్ళతో కడిగింది.
పాప చేతినుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని
తిరిగి నడుముకు చుట్టుకుంది.

తన భార్య గురించి, తల్లిగా ఆమె అస్తిత్వం రూపాంతరం చెందదం ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. సున్నితత్వం ఎంత అవసరం బంధాలు కాపాడుకోవడానికి. ప్రేమని మళ్ళీ ప్రతిష్టించుకోవడానికి తల్లిని, భార్యని, కూతురుని అర్థం చేసుకోవడం ఎంత అవసరం!. బంధాలగురించి అతను రాసిన ఇతర కవితలు చూదండి:

రెండో పాత్ర “బంధుత్వం”

తరాలుగా అందిన అంశలో
నూరోవంతైనా కలిసిన ఒక చేతిని
ప్రేమగా స్పృశించాలనుంటుంది.

రెండో పాత్ర “అమ్మనుంచి”

అమ్మ దీపస్థంభం
అందరం ఓడలం
ఎవరి బరువు వారు మోసుకొంటూ
తలో తీరానికి తరలిపోయాం.

రెండో పాత్ర “తొలి అడుగు”

ఊగే మనసుతో ఆ పాప
తల్లికీ, లోకానికీ మధ్య
లోలకంలా ఊగుతోంది

. . .
చెయ్యి విడవటానికి సందేహిస్తున్నా ఈ అమ్మాయే
ఒకనాడు
ఒంటరితనపు గుయ్యారంలో వారిని వదిలి
చెయ్యి ఊపుతూ వెళ్ళిపోతుంది.

ఇలా రవిశంకర్ బంధాల్లో ఆనందాన్నీ, నిష్కల్మష ప్రేమని మనకి దర్శింప జేస్తాడు.

5. రవిశంకర్ కవిత్వంలో ప్రకృతి గురించిన పదచిత్రాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?

రవిశంకర్‌లో ప్రకృతి పదచిత్రాలు అత్యధికంగా కనిపిస్తాయి. హాలొవిన్, వేసవివాన, విశ్వరూపం, పూల ఋతువు, మూడు పువ్వులు, అక్కచెల్లెలు, ఒక చలిపొద్దు, వానపాట, పక్షులు, బాకీ, రంగు, నేల కురిసేవాన, ఋతు సంధ్య, నింగి-నేల, కెరటాలు యిలా ప్రత్యక్షంగా ప్రకృతిలోని భిన్న వైవిధ్యాల్ని, రుతువుల్ని, అందాల్ని ప్రదర్శిస్తూకవితలు రాయడంకనబడుతుంది.మిగతా కవితల్లోఅత్యధికంగా పదచిత్రాలు కూడాప్రకృతిలోని విశేషలక్షణాల ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకు రవిశంకర్ యింత ఎక్కువగా ప్రకృతిని తన కవిత్వంలోనింపుతున్నాడు? దాని ద్వారా అతను ఏం చెప్పదలుచుకున్నాడు? కొంచెం నిశితంగా పరిశీలన చేస్తేసమాధానం అతనికవిత్వంలోనే కనబడుతుంది.

వేసవివాన “వేసవివాన”

అగ్ని పర్వతం ఒకటి
హఠాత్తుగా మనసు మార్చుకొని,
మంచు కొండగా మారిపోయినట్టుగాఉంది.
. . .
అలసటతో విసిగి,విసిగి
ఎండిపోయాననుకున్న నాకు,
నాలుగు చినుకులకే ఆశలు చిరురించటం
ఎంత ఆశ్చర్యంగా ఉంది!

ఈ కవితనిచదివితేమనకి అసలు రహస్యం బోధపడుతుంది. మనందరిలోనూఒక ప్రకృతి వుంది.అందులో అడవులు, ఎడారులు, నదులు, కొండలు, సముద్రాలు అనేకానేక విశ్వాంతరాళాలుపరుచుకుని వున్నాయి. బాహ్య ప్రపంచంలో, ప్రకృతిలోకొన్ని మార్పులు సంభవించినపుడు, మన లోపలి ప్రకృతి వుత్తేజం చెంది, తాదాత్మ్యం చెందుతుంది.అలాగేమనలోపల అనేకానేకమంది వ్యక్తులో,సమూహాలో వున్నాయి. అందుకే ఎవరోమనుషుల్ని చూసి మనం వుత్తేజం చెందుతాము. అందులో మన లోపలి ప్రపంచంలోని పరిచిత వ్యక్తి పలకరించడం వల్లనే మనకీ ఆనందం కలుగుతుంది. రవిశంకర్ మన బాహ్య ప్రక్ర్తిలో మనల్ని వుత్తేజపరిచే వస్తువుల్ని తీసుకుని తన కవిత్వం ద్వారా మనందరి లోపలి ప్రకృతితో, వ్యక్తులతో సంభాషిస్తున్నాడు, వుత్తేజపరుస్తున్నాడు. ఇది యీ క్రింది కవితలో ఎంత చక్కగా, చిక్కగా నిర్వహించాడో చూడండి :

రెండో పాత్ర ” ఒక చలిపొద్దు”

ఎండగానే ఉంటుంది గాని
ఎక్కడా వేడి పుట్టదు
సూర్యుడు కూడా చలితో
గజగజ వణుకుతాడు

. . .
ఆకులు రాలని చెట్టు
తన నీడను తానే
భారంగా మోస్తుంది
దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది

ఒక చలికాలపు రోజు ద్వారా మన లోపలి ప్రకృతిలోని అనుభూతుల్లోకి, జ్ఞాపకాల్లోకి మనల్ని నడిపిస్తున్నాడు. బాహ్య ప్రకృతి గురించి ప్రస్తావన కవికి అంతఃప్రకృతిలోకి జ్వలించడానికి వాహిక. కవిత చదవడం పూర్తయ్యాక రవిశంకర్ మన అంతఃప్రకృతిలో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఇతనిపుస్తకం అందుకేచదివి ఎన్ని సంవత్సరాలైనా మనజ్ఞాపకాలనుంచి చెక్కు చెదరదు.ప్రకృతి రవిశంకర్ కవిత్వానికి మనందరి లోపలి ప్రపంచంతోసంభాషించడానికి మాధ్యమం.

ముగింపు

విన్నకోట రవిశంకర్ కవిత్వాన్ని విశ్లేషించడానికి అతనితో నాకున్న అనుబంధం, స్నేహం దృష్టిలో వుంచుకుని కొంచెం సందేహించాను; ఒక స్నేహితుడి కవిత్వాన్ని పూర్తి నిజాయితీతో ఎలా విశ్లేషించగలం? కానీ ఒక కవిని కూలంకషంగా చర్చించడానికి కొంత వ్యక్తిగత పరిచయం కూడా దోహదం చేస్తుంది. అది కవిత్వ సమీక్షకు న్యాయం చేకూర్చగలదని అనిపించి, ఆ ధైర్యంతోనే యీ విశ్లేషణను మీ ముందుకు తీసుకువస్తున్నాను.

************************************

[రెండో పాత్ర పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో హెచ్చార్కె గారు రాసిన వ్యాసం ఇక్కడ, తమ్మినేని యదుకులభూషణ్ గారి వ్యాసంఇక్కడా, మూలా సుబ్రహ్మణ్యం గారి వ్యాసం ఇక్కడా చదవవచ్చు. అలాగే, కె.వి.ఎస్.రామారావు గారు ఈమాటలో రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.]

విన్నకోట రవిశంకర్ గారి మరో సంకలనం – ‘వేసవి వాన’ పై వచ్చిన సమీక్షలు : ఈమాట లో ముకుంద రామారావుగారి వ్యాసం ఇక్కడ, పుస్తకం.నెట్ లో ప్రచురించిన మూలా సుబ్రమణ్యం గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. అలాగే, రవిశంకర్ గారి కవిత్వం పై ఈమాటలో వేలూరి వెంకటేశ్వరరావు గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

విన్నకోట రవిశంకర్ గారి కవితలు,వ్యాసాలు కొన్ని ఈమాట సంచికల్లో ఇక్కడ చదవొచ్చు.

ఈ వ్యాస రచయిత ఆకెళ్ళ రవిప్రకాష్ గారి కవితలపై ఇదివరలో బొల్లోజు బాబా గారు పుస్తకం.నెట్ లో రాసిన సమీక్ష ఇక్కడ చూడవచ్చు.

You Might Also Like

3 Comments

  1. bollojubaba

    wonderful intro to a still more wonderful poet

  2. Rakesh

    I Love Vinnako…. May god bless him!!!

  3. జంపాల చౌదరి

    బాగుంది. మంచి కవితలని మళ్ళీ గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతలు.

Leave a Reply