పుస్తకం
All about booksపుస్తకాలు

October 24, 2009

ఆకెళ్ల రవి ప్రకాష్ – “ఇసక గుడి”

More articles by »
Written by: అతిథి
Tags: , ,

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా
********************************

రవి ప్రకాష్ నైష్టికుడు. కవిత్వానికో నీతి ఉంది ప్రతిదానికీ ఉన్నట్టే. ఆ నీతిని పాటిస్తాడితను. పోస్ట్ మోడర్నిజం లాంటి సిద్దాంతాల్ని నమ్ముకుని అస్పష్టత అనే ఏట్లో దిగకపోవటం, రాజకీయాలతో కవిత్వాన్ని వ్యభిచరింప చెయ్యటానికి నిరాకరించటం, శబ్దగౌరవాన్ని పాటించటం, భాషా కాలుష్యాన్ని నివారించటం లాంటి నైతిక నియమాల్ని పాటిస్తాడు రవి ప్రకాష్. – ఇస్మాయిల్

isakagudi1993 లో “మరో మొహంజుదారో” కవితా సంపుటితో ఆకెళ్ల రవి ప్రకాష్ తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మలయమారుతంలా ప్రవేశించారు. మరలా 2000 సంవత్సరంలో “ఇసక గుడి” అనే కవితా సంకలనంతో తన సంతకాన్ని తెలుగు సాహితీపుటలపై చిరస్థాయిగా నిలిచేటట్లు చేసుకొన్నారు.

పైన ఇస్మాయిల్ గారు అన్నట్లు రవిప్రకాష్ కవిత్వం ఇజాలకు, రాజకీయాలకు అతీతంగా సాగుతుంది. జీవన వైవిధ్యాలు , ప్రకృతి సౌందర్యాలు అలతి అలతి పదాలలో అందంగా ఒదిగిపోతాయి. కవిత్వానికి జీవితం ఎప్పుడైతే ముఖ్య వస్తువవుతుందో, జీవితానికి ఉన్నంత విస్తృతీ అట్టి కవిత్వానికీ వస్తుంది. అందుకనే రవిప్రకాష్ కవితల్ని చదువుతూంటే వస్తువైవిధ్యం విస్మయపరుస్తుంది. ఇంటిలో జరిగే పితృదినం, హొటల్ లో గడిపిన ఒక రోజు, అంధబాలల ఆశ్రమ సందర్శనానుభవం, రైలు కోసం నిరీక్షణ, గ్లాసులలోకి కవిత్వాన్ని వొంపుకొన్న రాత్రి – వంటి కవితావస్తువులు ఈ కవి కున్న నిశితదృష్టికి నిదర్శనాలుగా నిలుస్తాయి.

వృద్ద తల్లిదండ్రుల్ని వొదిలిపెట్టి, కాంక్షా తీరాలకై వలస పోయిన వారిని “వెలితి” అనే కవితలో కవి ఇలా ప్రశ్నిస్తాడు

నువు కురిపించే డబ్బుతో
వాళ్లు కొనుక్కోలేనిదేదో వుంది

ఈ వయసులో వాళ్లకి కేవలం
డబ్బుతో దొరకనిదేదో వుంది.


నువు విమానంలో ఇలావచ్చి
అలా వెళిపోవడంలో
ఏదో లోపం ఉంది.

ఆ లోపం ఏమిటో కవి చెప్పడు. పఠితను ఆలోచించుకొమ్మంటాడు. అలా చదువరి ఆలోచనల్ని ఈ కవిత నీడలా వెంటాడుతుంది చాలా దూరం.

వైయుక్తిక అనుభవాన్ని సమర్ధవంతంగా సార్వజనీనం చేయటంలోనే కవి ప్రతిభదాగిఉంటుంది. అనుభవం కవిత్వంగా రూపాంతరం చెందినపుడు అది వినిపించే సంగీతంలో మన అనుభవాలు, మన కలలు, మన కన్నీళ్లు, మన దృశ్యాలే ఉంటాయి. అవి చదువరిని సరసరా లోనికి లాక్కొంటాయి. అందుకనే కాబోలు కవి తన చిన్నతనం నుంచి అనేక ఊర్లు మారటం మూలాన పరిచయమైన భిన్న దృశ్యాలు, వివిధ వ్యక్తులు తన కవిత్వానికి ముడిసరుకని “చిన్నప్పటి సంగీతం” అనే కవితలో ఇలా చెప్పుకుంటాడు.

నా జ్ఞాపకాలన్నీ అక్షరాలుగా
రూపాంతరం చెందాయి.
నాలోని మనుష్యుల మీద
మారిపోతున్న దృశ్యాలమీద
నేను పాటలు కట్టటం నేర్చుకొన్నాను.


నాలోని కాలవలు, నదులు, కొండలు, సముద్రాల మీద
నేను వాక్యాల్ని పేర్చుకోవటం నేర్చుకొన్నాను.

లోకం వెయ్యి ముక్కలుగా చీలిపోవటాన్ని అనాదిగా ఏ కవీ హర్షించలేదు. “వెయ్యిముక్కల ఆకాశం” అనే కవితలో ఈ కవి కూడా తన వసుధైక గీతాన్ని ఇలా ఆలపిస్తాడు.

సరిహద్దుల మీద
పెద్దగా నమ్మకం లేదు నాకు
ఎక్కడయితేనేం
ఎప్పుడయితేనేం
సరిహద్దులన్నీ రక్తంతో తడిసినవే……..
ఎన్ని సామ్రాజ్యాలు కూలాలీ,
ఎన్ని సరిహద్దులు చెరగాలీ
ఆకాశాలన్నీ ఒకటి కావటానికి!

ఉదయపు వర్ణన ని అనేక కవితల్లో చదువుతాం. కానీ ఈ వాక్యాలను చూడండి.

ఒక అందమైన ఉదయాన్ని భద్రంగా
నాకప్పగించి వెళిపోయిన వాళ్లందరకీ
మళ్లీ ధన్యవాదాలు చెప్పుకొంటాను!

రమణీయ దృశ్యాలను తనకు ప్రసాదించిన దేవునికో ప్రకృతికో లేక చుట్టూ సమాజానికో కృతజ్ఞతలు చెప్పుకోవటమనేది హృదయం నిండా ప్రేమ, లాలిత్యం, కవిత్వం కలిగిన వ్యక్తులు మాత్రమే చేయగలరు. అందుకేనేమో బహుసా ఆఫీసు పని ఒత్తిడులలో సతమతమవుతూ, చుట్టూ పేరుకొన్న ఫైళ్లను చూస్తూ ఈ హైకూలు వ్రాయగలిగారు.

ఆఫీసులో గుట్టలు గుట్టలుగా
ఫైళ్లు
ఇదంతా కవిత్వమైతే
ఎంత బాగుణ్ణు.

ఫైలు మీద వాలిన పిట్ట
నా సంతకం
వెల వెల బోయింది.

ఈ ప్రాపంచిక వ్యవహారాలను మోసుకు తిరిగే కాగితాలన్నీ కవిత్వమైతే ఎంతబాగుణ్ణూ అనటం, తన అధికార దర్పం అంతా ఒక పిట్ట ముందు వెల వెల బోయిందనటం వంటివి, వృత్తిరీత్యా IAS అధికారి అయిన శ్రీ ఆకెళ్ల రవి ప్రకాష్ గారు మాత్రమే సాధికారికంగా సృష్టించగలిగే పదచిత్రాలు.

ప్రతీ మతంలోనూ గతించిన పెద్దలను తలచుకోవటానికి ఏదో ఒక ఆచారం ఉంటుంది. కవి చిన్నప్పటినుంచీ ఇంట్లో జరిగే అట్లాంటి ఒక కార్యక్రమానికి (తాతగారి తద్దినం కావొచ్చు) గొప్ప తాత్వికత అద్ది “నిరంతర యాత్ర” అనే కవితలో అద్బుతంగా ఆవిష్కరిస్తాడు.

నాలుగు చితుకుల మధ్య
మండుతున్న సూర్యగోళం ముందు
ఒక మహా కావ్యానికి ఆవిష్కర్తలా
కూర్చునుంటాడు నాన్న.
మాటి మాటికీ ఆయన గొంతు
మూగవోతుంటుంది.
దు:ఖాన్ని పోగులుగా లాగిపట్టి
పదే పదే మంత్రాల్ని వల్లిస్తుంటాడాయన.
పదం పదంలోనూ కోల్పోయిన
ఒక వ్యక్తిని తిరిగి తెచ్చుకుంటాడు


నిష్క్రమించే ప్రతీ పాత్రా
మనల్ని మనకి గుర్తుకు తెస్తుంది
అసలు ప్రయాణం అక్కడే మొదలవుతుంది.

ఈ కవితా సంపుటి మొత్తం మీద గొప్ప ఆర్ధ్రతతో నిండిన పద్యమది. అసలు ప్రయాణం అక్కడే మొదలవుతుందని అనటంలోనే ఈ కవిత లోతూ, విస్త్రుతీ దాగిఉంది. ఛిద్రమవుతున్న కుటుంబ సంబంధాల నేపధ్యంలో, ఈ కవితా సందర్భాన్ని స్మరించుకోవటం అవసరమేనేమో!

అరకులోయను (మరేదైనా ప్రకృతి రమణీయ ప్రదేశం కూడా కావొచ్చు) సందర్శించటం ఒక గొప్ప అనుభూతి. జీవితంలోని సౌందర్యాల్ని, ఉద్వేగాల్నీ, హృదయ చెలమల్నీ మింగేసే నగర జీవన ఇనుప కౌగిలి నుంచి ఒక్క సారి బయటకు వచ్చి ఆకు పచ్చని అరకులోయలో విహరించే అనుభవాన్ని కవి ఇలా వర్ణిస్తాడు.


నగరం అణగదొక్కిన ఉద్వేగాలన్నీ
లోయ సాంగత్యంలో నిద్రలేస్తాయి.
కళ్లు మళ్ళీ సజలమౌతాయి.
తలమీద నేనింతవరకూ మోసిన
ప్రపంచం దిష్టి బొమ్మ వెయ్యి చెక్కలవుతుంది.

ఓ జీవితకాలం పాటు కలిసి జీవించిన దంపతులలో ఒకరు మరణించగా రెండవ వారి జీవితంలో వర్షించే విషాదం దారుణంగా ఉంటుంది. ఆ శూన్యాన్ని వర్ణిస్తూ “ఇద్దరు నడచి వచ్చిన దారి” అనే పేరుతో వ్రాసిన కవిత ఈ పుస్తకం మొత్తానికి మకుటాయమానంగా నిలుస్తుంది.

ఆ రెండు యవ్వన నయన సముద్రాల
మొగలిపూలు విప్పిన మౌనాల ఉద్వేగంలా
ఎన్ని సాయింత్రాలిక్కడ
తెల్లగా రెపరెపలాడాయో!

ఇద్దరు నడచి వచ్చిన దారి మీద
వణుకుతున్న స్వప్నంలా ఆయనొక్కడే!

ఈ ముగింపు వాక్యంలో వణుకుతున్న అన్న పదం ద్వారా వృద్దాప్యాన్ని శోకాన్ని, నిస్సహాయతను కవి ధ్వనిస్తున్నాడు. అలాంటి ముదిమికి మిగిలేవిక ఏముంటాయి, స్వప్నాలు, జ్ఞాపకాలు తప్ప.

క్లుప్తతకూ, పదబంధాల్ని సృష్టించటంలోని పటిమకూ ఈ వాక్యం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

తను కొత్తగా చేరిన పాండిచేరీ (పుదువై) పై వ్రాసిన ఒక దీర్గ కవిత (అపరిచిత జ్ఞాపకం) కూడా ఈ సంకలనంలో చోటుచేసుకొంది. ఈ కవిత లోతైన తాత్వికతతో సాగుతుంది. కవితా నిర్మాణం ఉదావర్త గతిలో (స్పైరల్ మోషన్) లో ఉండి, హృదయానికి గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.

ఈ కవితలోంచి కొన్ని వాక్యాలు –

ఒక కొత్త నగరాన్ని చేరటం అంటే
మరో దేహాన్ని వెతుక్కోవడమే.
ఒక కొత్త భాషని నేర్చుకోవటం అంటే
మరో బాల్యాన్ని ఆశ్రయించటమే
—————- అనే వాక్యాలతో మొదలవుతుంది

నెమ్మదిగా నగరం తన్ని తను
పరిచయం చేసుకొంటుంది//
పొడుగాటి రోడ్లన్నీ
మలుపులు మలుపులుగా అర్ధమౌతాయి.//
రోజులు పాతబడతాయి
కానీ సముద్రం కొత్తగా మిగిలిపోతుంది
—————- అంటూ సాగుతుంది.

జనన మరణాల జాడ ఎవరికి తెలుసు
ఇది ఎన్నో మజిలీయో ఎవరికి గుర్తు.
అదే అపరిచిత జ్ఞాపకంలోకి
మళ్లీ మళ్లీ సాహసం.
—————- అంటూ ముగుస్తుంది.

(ఈ కవితను ఇస్మాయిల్ గారు విశ్లేషించిన తీరు అత్యద్బుతంగా ఉంటుంది)

సైగల్ గాత్రం పై వ్రాసిన “సైగల్” అనే కవితలో

సాయింత్రం రాత్రిలోకి కరుగుతుంటుంది
అపుడు వినిపిస్తుంది నీ స్వరం///
గాయాలన్నీ మానిపోతాయి.
వేదనలన్నీ తీరిపోతాయి.
మహా యుద్దాలు ఆగిపోతాయి.
స్వప్నాలన్నీ వికసిస్తాయి.
రాజకుమారి నిద్రలోకి జారుకుంటుంది.

నిజమే మరి, స్వప్నాల్ని వికసింపచేసే శక్తీ, హృదయ రాకుమారిని నిద్రబుచ్చే మాధుర్యం సైగల్ పాటలోనే కాదు రవిప్రకాష్ కవిత్వంలో కూడా ఉన్నాయనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. చక్కని చిక్కని కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం నచ్చుతుంది.

పుస్తకం వివరాలు:

ముద్రణ: నవంబరు 2000
వెల: 50/-
కాపీలకొరకు : విశాలాంద్ర బుక్ హౌస్, హైదరాబాద్.
(or)
రచయిత
22C/38, Govt. Quarters,
PondicherryisakagudiAbout the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


  1. […] బాబా) ********************** ఓ కొత్తమొహంజోదారో, ఇసకగుడి కవితాసంపుటులను వెలువరించిన ­ఆకెళ్ళ […]


  2. […] గారు పుస్తకం.నెట్ లో రాసిన సమీక్ష ఇక్కడ చూడవచ్చు. (No Ratings Yet)  Loading […]


  3. phani

    vyaasam bagundi  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ఫ్రెంచిపాలనలో యానాం

వ్యాసకర్త: బొల్లోజు బాబా (ఈ వ్యాసం “ఫ్రెంచి పాలనలో యానాం” పుస్తకానికి బొల్లోజు బా...
by అతిథి
0

 
 
నా కవిత్వ నేపథ్యం : ఆకెళ్ళ రవిప్రకాష్

నా కవిత్వ నేపథ్యం : ఆకెళ్ళ రవిప్రకాష్

రాసిన వారు: ఆకెళ్ళ రవిప్రకాష్ (తన కవితా ప్రస్థానం మొదలై, పాతికేళ్ళు పూర్తైన సందర్భంగ...
by అతిథి
10

 
 
ప్రేమను ప్రతిపాదించే కవిత్వం

ప్రేమను ప్రతిపాదించే కవిత్వం

రాసిన వారు: బొల్లోజు బాబా (ఈ వ్యాసం మార్చి 2011 “పాల పిట్ట” మాసపత్రికలో ప్రచురింపబడి...
by అతిథి
3

 

 

కాలుష్యం అంటని కవి

రాసిన వారు: శిఖామణి (బొల్లోజు బాబా రచించిన “ఆకుపచ్చని తడిగీతం” కవితా సంపుటికి ప్ర...
by అతిథి
2

 
 

పద్యాలతో విశ్వసత్యాలను ఆవిష్కరించే తాత్విక కవి విన్నకోట రవిశంకర్

రాసిన వారు: ఆకెళ్ళ రవిప్రకాష్ ***************** మొట్టమొదటసారి నేను రవిశంకర్‌ని REC వరంగల్ కాంపస్...
by అతిథి
3

 
 

ఆలోచింపచేసే ‘నాలుగోపాదం’ – దాట్ల దేవదానం రాజు

రాసిన వారు: బొల్లోజు బాబా (ఈ వ్యాసంలోని కొంత భాగం 18 ఏప్రిల్ నాటి ’సాక్షి’ పత్రికలో వ...
by అతిథి
3