మనసులో కురిసే ‘ వేసవి వాన’

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]

ప్రపంచ సాహిత్యాన్ని ఎంత చదివినా దాహం తీరదు.చదివే ప్రతి పుస్తకం హృదయానికున్న వేల కిటికీల్లో ఒక కొత్త కిటికీ ని తెరుస్తుంది.ఆ తెరిచిన కిటికీ మేరకు మన హృదయం లోనికి కాంతి ప్రవేశిస్తుంది.అందుకే ఒక మంచి పుస్తకం చదివితే కలిగే అనుభూతి ని మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యం కాదు.అలా ఈ మధ్య నేను చదివిన శ్రీ విన్నకోట రవిశంకర్‌ గారి కవితా సంకలనం ‘వేసవి వాన’ పై ఒక సమీక్ష.

కవిత్వమంటే ఏమిటి? ప్రతి యుగం లోనూ ప్రతి కవీ ఈ ప్రశ్న వేసుకుంటునే ఉన్నాడు.కవిత్వం ఎందుకు? ఎవరికోసం? ఈ ప్రశ్నలు తమని వేధించకుండా ఏ కవీ మౌలికమైన తన ఆవేదన ని కవిత్వం గా పాడలేకపోయాడు.తిలక్‌ చెప్పినట్టు కవిత్వం ఒక ఆల్కెమీ,అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అని మాత్రం సమాధానపరుచుకోవాలేమో! కవిత్వం ఒక కవి బాహ్యాంతరంగిక జీవితాల రసనిష్యందనమైన వ్యక్తీకరణ గా భావిస్తే,ఆ అభివ్యక్తి లో అంతర్వాహిని గా ఒక తాత్విక స్రోతస్విని ఉండి తీరుతుంది. ఆ తత్వం ఆ కవికే చెందిన అనుభవాల అనుభూతుల లోతుల్లోంచి ఒక సొంత దర్శనాన్ని ఏర్పరుచుకొని తన పట్లా లోకం పట్లా ఒక చూపు ని కలిగిఉంటుంది.అదే కోవ లో రవి శంకర్‌ గారు ‘వేసవి వాన’ లో తమ సామాన్య జీవితానుభవాల్నుంచే తాత్విక సత్యాల్ని ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నం లో కొన్ని మనోహరమైన కవితలు అతని కలం నుండి వెలువడ్డాయి.అతని మొదటి సంకలనం ‘కుండీలో మర్రి చెట్టు’ లో కూడా ఆణిముత్యాల్లాంటి కవితలున్నాయి.

ఇతని కవితల్ని చదవడమంటే వేసవి కాలం సాయంత్రం వాన కురిసినప్పుడు నేల నుంచి వెచ్చ గా ఉబికి వచ్చే మట్టి వాసన ఆఘ్రాణించడం,ఇతని కవితల్ని చదవడమంటే మనసులో వేల కన్నులు విప్పారడం,ఇతని కవితల్ని చదవడమంటే రెప రెప లాడే మనసు కాగితం పై నుంచి బరువైన శరీరాన్ని సున్నితం గా తొలగించి జల జల మని కురిసే వానలో ఒక చినుకు లాగా,గల గల మని వీచే చిరుగాలి లో తరగలాగా మన ఉనికిలేనితనాన్ని మనమే అనుభవించడం!

ఆనందగీతం అన్న కవితలోని

‘గడచిపోయిన కాలం లో ఒక్క క్షణాన్ని
తన రెండు చేతులతో పట్టిచూపే గడియారం లా
కరిగిపోయే ఒక్క అనుభవాన్నైనా
కవిత్వీకరించగలిగితే చాలు’

అన్న 4 పాదాలు చాలు ‘వేసవి వాన’ గురించి తెలుసుకోవడానికి.

చెప్పినట్టుగానే కర్తవ్య నిర్వహణలో night out చెయ్యడం,మొదటి సారి విమానం ఎక్కడం,చిన్న పిల్లతో దాగుడుమూతలాడడం లాంటి సామాన్య జీవితానుభవాల్నే మనోజ్ఞమైన కవితలు గా మలిచిన తీరు మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.‘పద్యం కోసం’ అన్న కవిత లో ‘ఒక్క కన్నీటి కణం బరువు కి చిగురుటాకు లా ఒరిగిపోవాలి’ లాంటి వాక్యాలతో ఇతని కవితల్లోని గాఢత స్పష్టమౌతుంది. ప్రతీ కవితలోనూ అత్యంత సున్నితమైన భావాలు మనల్ని చకితుల్ని చేస్తాయి.

‘వేసవి వాన’ కవితలో

‘ఎండకి కాపు కాసే మబ్బు గొడుగు
జల్లు కి మాత్రం చిల్లు చిల్లులు పడిపోతుంది’
అన్న వాక్యం

‘ఒంతరితనం’ కవితలో

‘ఏ చిరు దీపమూ పెదవులు సాచి
మృదువుగానైనా చుంబించకనేకదా
ఈ ప్రమిదలోని వత్తి కి
వేడి వెలుగుల అనుభవం లుప్తమైపోయింది’

అన్న వాక్యాలు చదివినప్పుడు అసలు ఇతను ఇలా ఎలా చూడగలిగారబ్బా? అనిపిస్తుంది.

సామాన్య జీవితానుభవాల్ని కవిత్వీకరించడమే కాక ఆ కవితల ద్వారా తాత్విక సత్యాల్ని అన్వేషించే ప్రయత్నం చాలా చోట్ల మనకు కనిపిస్తుంది.‘దాగుడు మూతలు’ అన్న కవిత ముగింపు లో

‘తనేమిటో నాకు పూర్తి గా తెలిసినా
తనను నేను కొత్తగా కనుక్కోవాలి

ప్రతిరోజు విడవకుండా
నన్నీ ఆటలోకి లాగే ఈ పాప
ఎప్పటికీ నాకు దొరికీ దొరకని
ఒక జీవిత సత్యం లాగా తోస్తుంది’

అన్న వాక్యం ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.

ఇతను కవిత్వాన్ని ఆత్మాన్వేషణ కు సాధనం గా మాత్రమే గుర్తించారన్న విషయం

‘తమ అంతరంగాల్ని పదే పదే ప్రక్షాళన చేసుకునే కదా
కవులు పద్యాల్ని సృష్టించేది
ఆ పద్యాల్లో మునిగితేలిన ప్రతివాడు
ఒక్క క్షణమైనా పునీతుడు గా మారగలగాలి’

అన్న వాక్యాలు చదివితే తెలుస్తుంది.

‘దృష్టి’ అన్న కవితలోని ‘జన్మాంతరాల దాహం తీరిపోవడమే మరణం’ లాంటి వాక్యాలు అత్యద్భుతం గా తోస్తాయి. కలకాలం తరగని భావ సౌందర్యం తో విలసిల్లే కళా ఖండాలు మన రవి శంకర్‌ గారి ‘వేసవి వాన’ చినుకులు. వీలైతే పూర్తి గా తడిసిపోయి మిమ్మల్ని మీరు మరిచిపొండి.

You Might Also Like

11 Comments

  1. పుస్తకం » Blog Archive » బాహ్య ప్రపంచపు మసి వదిలి తళతళలాడే ‘ రెండో పాత్ర’

    […] మూలా సుబ్రమణ్యం గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. అలాగే, రవిశంకర్ గారి […]

  2. పుస్తకం » Blog Archive » “రెండో పాత్ర”లో చిక్కని కవిత్వం

    […] మూలా సుబ్రమణ్యం గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. అలాగే, రవిశంకర్ గారి […]

  3. పుస్తకం » Blog Archive » జనాభిప్రాయాన్ని విరోధించి, ఔన్నిజమే అనిపించే కవితా వ్యూహం

    […] ఈమాటలో వచ్చిన వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ – పుస్తకం.నెట్) తరువాత ఇది […]

  4. మద్దుకూరి రఘురాం

    నాకు కవితలంటే ఇష్టం. చెట్టు ఇస్మాయిల్ మంచి కవి అని విన్నాను. ఆయన వ్రాసిన కవితల పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి తెలియ చెయ్యండి.

  5. Srinivas Vuruputuri

    సౌమ్య గారూ, శ్రీనిక గారూ,
    మీరు హైదరాబాదులో ఉంటే, నా దగ్గర ఉన్న కాపీ అరువు ఇవ్వగలను.

  6. సౌమ్య

    @శ్రీనిక: కొన్నాళ్ళ క్రితం ’ఒక మార్పుకోసం’-అని రవిశంకర్ గారి కవిత ఒకటి చదివి, వెంటనే ఈ పుస్తకంకోసం హైదరాబాదులోని ప్రముఖ తెలుగు పుస్తకాల షాపులన్నీ తిరిగాను. ఎక్కడా దొరకలేదు. కనుక, ఇది ఇప్పుడు దొరికే అవకాశాలు లేవేమో అని నా అనుమానం.

  7. శ్రీనిక

    ఏ చిరు దీపమూ పెదవులు సాచి
    మృదువుగానైనా చుంబించకనేకదా
    ఈ ప్రమిదలోని వత్తి కి
    వేడి వెలుగుల అనుభవం లుప్తమైపోయింది’
    చాలా మంచి భావన..
    సమీక్ష చాలా బాగుంది. ఇటువంటి సమీక్షలు చదివినపుడు…ఆయా పుస్తకాలు కొని చదవాలనిపిస్తుంది. కాని పరిచయకర్తలు, సమీక్షకులు రచయిత చిరునామా లేదా పుస్తకం లభ్యమయే వివరాలు ఇస్తే బాగుండును. కనీసం పుస్తకం.నెట్ వారైన సమీక్షకులకు, పరిచయ కర్తలకు ఒక సూచన చేస్తే బాగుంటుందని నా మనవి.

  8. సుబ్రహ్మణ్యం మూలా

    అందరికీ థాంక్స్.. ముఖ్యంగా హెచ్చార్కె గారికి 🙂

    నేను కవిత్వం మీద రాసిన మొదటి సమీక్ష ఇది. ఇక్కడ మళ్ళీ చదివితే ఆనందంగా ఉంది.

    మరో విషయం , విన్నకోట గారి మూడో పుస్తకం ఈ ఏడాది వేస్తున్నారు.

  9. mohanramprasad

    వేసవిలొ మల్లెల వాన కురిపించి కవి మనసు ‘మూలాల్ని ‘పట్టుకున్నారు. ధన్యవాదాలు.

  10. హెచ్చార్కె

    ‘ఒక్క కన్నీటి కణం బరువుకి చిగురుటాకులా ఒరిగిపోవాలి’. చాల అందమైన ఊహలున్న కావ్యాలు విన్నకోట రవిశంకర్‍ ‘కుండీలో మర్రి చెట్టు’, ‘వేసవి వాన’. కవి ఆత్మను పట్టుకోడానికి మూలా సుబ్రమణ్యం చేసిన ప్రయత్నం హృద్యంగా వుంది. కంగ్రాట్స్.
    చిన్న సవరణ: ‘ఆనంద గీతం’ నుంచి ఇచ్చిన కోట్ లో ‘గడచిపోయిన కాలం లో ఒక్క క్షణాన్ని/తన రెండు చేతులతో పట్టిచూపే గడియారం లా’అని రాశారు వ్యాసంలో. అదేమిటా అని చూశాను. ‘గడచిపోయిన’ కాలం కాదు. అది ‘గడిచిపోయే’ కాలం. పుస్తకం నుంచి లైన్లు తీసుకుంటున్నప్పుడు చెయ్యి జారినట్లుంది.

  11. రామకృష్ణ

    చాల చక్కగా పుస్తకం గురించి ఎందుకు ఏవిధంగా నచ్చినదో వ్రాశారు. మీ పుస్తక పరిచయానికి థాంక్స్

Leave a Reply