“రెండో పాత్ర”లో చిక్కని కవిత్వం

రాసిన వారు: మూలా సుబ్రహ్మణ్యం
*******************
సంవత్సరానికి రెండు సంకలనాలు వెలువరించే కవులున్న తెలుగు సీమలో ఒక సంకలనం కోసం పదేళ్ళు నిరీక్షించే విన్నకోట రవిశంకర్ వంటి కవులు అరుదుగా కనిపిస్తారు. ఈ మధ్యే విడుదలైన ఆయన మూడో కవితా సంకలనం “రెండో పాత్ర”పై ఒక సమీక్ష.

“తప్పిపోయిన స్వరం ఒకటి
తనదైన వాయిద్యాన్ని వెతుక్కున్నట్టు
నీ శరీరాన్ని మాధ్యమంగా చేసి
తనని తాను వ్యక్తపరుచుకుంటుంది”

“బాధ” అనే కవితలోని కొన్ని పంక్తులు కవిత్వానికి కూడా వర్తిస్తాయి. (బాధ కవిత్వానికి పర్యాయపదం అన్న మహాకవి మాటల్ని నిజం చేస్తూ), అయితే కవిత్వం కవిని వాహికగా చేసుకుని తనని తాను వ్యక్తపరుచుకోవడం కవికి వరమా? శాపమా? శాపమేనేమో అనిపిస్తుంది “ఒకోసారి” కవిత చదివితే..

“పద్యం రాయాలని ఉండదు
అంతరంగ వధ్యశిలపై
మరొకమారు తలవంచాలని ఉండదు”

అంటూ మొదలై

“పొడిపొడి మాటలు చాలవు
పరిచిత దృశ్యాలు పనికిరావు
తెలియని అడవిదారుల వెంట
తెలవారేదాకా సాగే అన్వేషణకి మళ్ళీ
తెరతీయాలని ఉండదు
పద్యం రాయాలని ఉండదు”

అంటూ ముగుస్తుంది. పద్యం రాయాలని ఉండదంటూనే మొదలైనా కవిత్వానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలని చెప్పడం పై కవితలో మనం చూడొచ్చు. వాడి వాడి అరిగిపోయిన విశేషణాలు, ఉపమానాలు, పదచిత్రాలు పాఠకుడిలో ఎలాంటి అనుభూతీ కలిగించవు. కవిత్వానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం కొత్తదనం అని నాకనిపిస్తుంది. ముప్పై మూడు కవితలున్న ఈ పుస్తకంలో అలాంటి నవ్యమైన పదచిత్రాలు ఎన్నెన్నో. మచ్చుకి కొన్ని..

వచ్చిపోయే అల
దిగులుతో ఉన్న తీరాన్ని
జాలిగా ముద్దాడింది
అప్పుడా ఇసుక కొన్ని క్షణాలపాటు
ఆకాశాన్ని ప్రతిబింబించింది

-(కెరటాలు)

వాన ఒట్టి భోళా పిల్ల
ఆకాశం నుంచి మోసుకొచ్చిన కబుర్లన్నీ
వస్తూనే గలగలా చెప్పేస్తుంది

-(అక్క-చెల్లెలు)

మెయిల్ బాక్సు నిండా
రాయని ఉత్తరాల దొంతరలు
క్రెడిట్ కార్డు మీద
తిరిగి చెల్లించని
ప్రేమలు, పలకరింపులు, పిలుపులు

-(బాకీ)

ఐతే కవిత్వానికి కొత్తదనం ఒక్కటే సరిపోతుందా? “పరిచిత దృశ్యాలు పనికిరావన్న” ఈ కవే, “పొడిపొడి మాటలు చాలవు” అనడం ఇక్కడ గమనార్హం. ఏ కావ్యసృష్టికైనా కరుణే కారణం. కరుణలేని కవిత మృతప్రాయం. కృష్ణ శాస్త్రిగారి మీద వ్యాసంలో ఇస్మాయిల్ అంటారు -“నిందించడానికీ, కీర్తించడానికీ కాదు. మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణం. ఈ అనుకంప ఎంతలోపల ఉంటే అంత మానవత్వం మానవుల్లో ఉన్నదన్నమాట. దానిని ఎంత ప్రభవింపచేస్తే అంత గొప్పదన్నమాట ఆ కావ్యం!” ఎంత నిజమో కదా అనిపిస్తాయి. “బంధుత్వం” అనే కవితలోని కింది పంక్తులు చూడండి.

“ఈ మహావృక్షంలో
ఏ పిల్లవేరు నీళ్ళులేక అల్లాడినా
నా కళ్ళల్లో నీళ్ళు నిలుస్తాయి”

రవిశంకర్ గారి కవిత్వంలో ప్రకృతి ఎన్ని వింతరంగుల్లో దర్శనమిస్తుందో, మంచులాంటి తెల్లదనం కూడా అడుగడుగునా కనపడుతుంది. . “వానపాట” , “మధ్యస్తం” , “యజ్నం” , “చేయూత” , “ఉత్సవం”, “తేడా”, “సహచరి”, “లోతు”, “గమనం” మొదలైన కవితలు ఆర్ద్రత, పశ్చాత్తాపంతో నిండి చదివినప్పుడు ఒక విధమైన దిగులు, అనుకంప కలుగుతుంది. అనివార్యమైన మృత్యువుని స్పృశించిన “తదనంతరం” వంటి కవితలు అద్భుతంగా తోస్తాయి. సొంత కవితలతో పాటు కొన్ని అనువాద కవితలు కూడా పుస్తకం చివరన చేర్చారు.

అయితే “శివరాత్రి” , “తేడా” వంటి కవితలు తప్ప మిగతా కవితలన్నీ దాదాపు ఒకే శిల్పంలో ఉండి, మరింత శిల్పపరమైన వైవిధ్యం ఉంటే బావుండేదేమో అనిపిస్తుంది. ఎక్కువైన ఉపమానాలు, వివరణలు అక్కడక్కడా కవిత్వాన్ని పల్చన చేసినట్లు అనిపించినా , ఏకాంతంలో నెమ్మదిగా చదువుకోదగ్గ రవిశంకర్ గారి కవితలు జీవన భీభత్సం నుండి సేదదీరుస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ప్రతులకి : అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, ఇంకా
rvinnako@yahoo.com

[రెండో పాత్ర పుస్తకం గురించి హెచ్చార్కె గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు. అలాగే, కె.వి.ఎస్.రామారావు గారు ఈమాటలో రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.]

విన్నకోట రవిశంకర్ గారి మరో సంకలనం – ‘వేసవి వాన’ పై వచ్చిన సమీక్షలు : ఈమాట లో ముకుంద రామారావుగారి వ్యాసం ఇక్కడ, పుస్తకం.నెట్ లో ప్రచురించిన మూలా సుబ్రమణ్యం గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. అలాగే, రవిశంకర్ గారి కవిత్వం పై ఈమాటలో వేలూరి వెంకటేశ్వరరావు గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

విన్నకోట రవిశంకర్ గారి కవితలు,వ్యాసాలు కొన్ని ఈమాట సంచికల్లో ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

One Comment

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] (బఠాణీలు) – గన్నవరపు నరసింహ మూర్తి 95. రెండో పాత్ర — విన్నకోట రవిశంకర్ 96. శ్రీ […]

Leave a Reply