శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.3: సభాపర్వం

రాసిన వారు: మల్లిన నరసింహారావు
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు)
*********************
(సభా పర్వ పరిచయం లో ఇది మూడో వ్యాసం. మొదటి వ్యాసం ఇక్కడ, రెండో వ్యాసం ఇక్కడ,  మూడో వ్యాసం ఇక్కడా చదవండి. ఆ తరువాత..)

మొదల నప్రియ మయ్యును దుదిఁ గరంబు ! పథ్య మగు పల్కు ప్రియులందు బలిమి నైనఁ
బలుక వలయు మోమోడక యొలసి యట్టి ! వాఁడు దగు సహాయుండు భూవల్లభునకు. 2-2-192

(మొదట వినటానికి ఇంపు కాని దైనా, చివరికి మేలు చేసే మాటను, ఇష్టులైనవాళ్ళ చెంత చేరి, మొగమోటమి లేకుండ, బలవంతంగానైనా చెప్పాలి. అలాంటివాడే రాజుకు తగినసహాయం చేసేవాడు.) ఇదింకో బంగారు మొలక లాంటి సూక్తి. ఇలా పలికిన విదురుని పలుకులు అరణ్యరోదనే అయ్యింది.

‘ఎల్లధనంబు నోటువడి తిందుకులేశ్వర ! యింక నొడ్డఁగా
మొల్లము నాకుఁ జూపు’ మని ముందట సారె లుద్రోచి యాడఁగా
నొల్లకయున్న సౌబలున కున్నతచిత్తుఁడు ధారుణీతలం
బెల్లను నొడ్డి యోటువడియెన్ బలవద్వ్యసనాభిభూతుఁడై. 2-2-194

(‘ఓ చంద్రవంశపు రాజా ! ధర్మరాజా! ఉన్న సంపదనంతా ఓడిపోయావు. ఇంకా పందెం ఒడ్డటానికి నాకు ధనం చూపు’ అని సారెలు ముందర పడవేసి ఆట మానిన శకునికి, గొప్పమనస్సు కల ధర్మరాజు బలమైన ద్యూతవ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు.)

వ. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్కఁ దక్కిన మహీతలంబును, బ్రాహ్మణులు దక్క సర్వప్రకృతిజనులను, రాజపుత్త్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువడి వెండియు. 2-2-195

(ఈ విధంగా – దేవాలయాల్లోని దేవుళ్ళ ధూపాలంకార నైవేద్యాలకు, బ్రాహ్మణుల జీవనోపాధికి దానాలుగా ఇచ్చిన భూములు తప్ప సామాన్యజనులందరిని, రాజపుత్త్రులను ఒక్కొక్క ఒడ్డున ఒడ్డి ఓడిపోయాడు.) మళ్ళీ–

తమ్ముల నత్యంత ధర్మసమేతుల ! నాయత బాహుల నాజి జయుల
నాదిత్యతేజుల నాది భూపాలక ! చరితుల నభిమానసత్యరతుల
సహదేవ నకుల వాసవసుత భీములఁ ! గ్రమమున నలువురఁ గౌరవేంద్రు
డొక్కొక్క యొడ్డున నొడ్డి తన్నును నొడ్డి ! యుక్కివంబున నప్పు డోటు వడిన
నతనిఁ జూచి శకుని యనియె ‘నిట్లేల ని ! న్నొడ్డి తధిప! నీకు నొండు ధనము
గలదు ; మఱచి తెట్లు? కమలాక్షి పాంచాల కన్య నీకు ధనము గాదె’ యనిన. 2-2 196

(పూర్తిగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, విశాలమైన భుజాలు కలవాళ్ళు. యుద్ధంలో జయశీలురు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాళ్ళు, తొలిరాజుల వలె మంచి నడవడి కలవాళ్ళు, ఆత్మగౌరవంలో, సత్యంలో ప్రీతిగలవాళ్ళు అయిన తమ్ములు – సహదేవ నకులార్జున భీమసేనులు నలుగురిని వరుసగా ధర్మరాజు ఒడ్డి ఓడిపోయాడు. కడకు తనను కూడ ఒడ్డుకొని వంచనకు గురి అయి ఓడిపోగా, శకుని చూచి, ‘ఓ ధర్మరాజా ! ఈ విధంగా నిన్నేల ఒడ్డుకున్నావు? నీకు ఇంకొక ధనం ఉందిగదా ! ఎలా మరిచావు? కమలాక్షి ద్రౌపది నీధనం కాదా? ‘ అన్నాడు.)

ఇక్కడ శకుని వేసిన ప్రశ్న జటిలమయింది. ఆ చిక్కు ధర్మరాజుకే అర్థమౌతుంది. ధర్మరాజు తనను తాను పణంగా పెట్టుకొన్నప్పుడు శకుని మాట్లాడలేదు. అతను ఓడినతర్వాత మఱొక ధనం ఉందని జ్ఞాపకం చేసాడు. తన్నోడిన ధర్మజుడు దాసుడు కావచ్చు కాని, అతని భార్యమీది అధికారం అతనికున్నదని సూచన చెయ్యటం ఒక అర్థం. ధర్మజుడు ఓడాడు కాబట్టి శకుని చెప్పినట్లు చేయటం కర్తవ్యం కావటం మరొక అర్థం. ఈ రెండిటి చేత బంధింపబడిన ధర్మజుడు భార్యను పణంగా పెట్టడానికి పూనుకొన్నాడు. దీనిలోని ధర్మసూక్ష్మాన్ని గుఱించి ద్రౌపది నిండుసభలో ప్రశ్నించబోతున్నది.

(సవివరణమైన వివరణ సభాపర్వ పీఠికలో డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారిచే ఇవ్వబడింది.- చదువరులు పరిశీలించగలరు)

అలయక వెండియుం గడఁగి యక్షరతుండయి ద్రౌపదిన్ మహో
త్పలదళచారునేత్రఁ గులభామఁ పణంబుగఁ జేసి యొడ్డి సౌ
బలఖలుచేత నోటువడి పాండుసుతుం డుడిగెన్ ధనంబు ల
గ్గలముగ నొడ్డలేమి గతగర్వమునం గడు దీన వక్త్రుడై. 2-2-197

(ఆలస్యం చెయ్యకుండా, పాచికలాటమీది ప్రేమతో, ధర్మరాజు మళ్ళీ ఆటకు పూనుకొన్నాడు. కలువరేకులవంటి కన్నులు కలది, కులకాంత అయిన ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. దుష్టశకుని చేతుల్లో ఆమెను కూడా ఓడిపోయాడు. ఇంకా ఒడ్డటానికి ధనం లేదు, అందుచేత గర్వాన్ని కోల్పోయాడు. ఎంతో దీనమైన ముఖంతో ఆట చాలించాడు.)

ధర్మజుని ద్యూతవ్యసనం కడకు ద్రౌపదిని ఓడిపోయేదాకా సాగితేగాని ఆగలేదు. మానవస్వభావంలో వ్యసనపరత ఎంత బలీయమో, అన్ని ధర్మాలు తెలిసిన ఆ ధర్మరాజు సమతనే అది ఎంతగా తారుమారు చేసిందో – మహాభారతం ఈ ఘట్టంలో మఱపురానంత బలంగా ప్రదర్శించింది. అప్పుడు దుర్యోధనుడు దాసీజనంతో కలసి తన ఇల్లు తుడవడానికై ద్రౌపదిని తీసుకొని రమ్మని విదురుని ఆజ్ఞాపిస్తాడు. నన్నిటువంటి పనికి నియోగించటం నీకు తగునా అంటాడు విదురుడు.

మదమలినమనస్కుఁ డరుం ! తుదుఁడు నృశంసుం డనఁ బరఁగు దుర్జనునకు సం
పద లెడలయ్యును నాతని ! మొదలిటి సంపదలతో సమూలంబు చెడున్. 2-2-02

(పొగరుచేత మలినమైన మనస్సుకలవాడు, ఆయువుపట్టును(మర్మస్థానాన్ని) నొప్పించేవాడు, క్రూరుడనదగినవాడు అయిన దుర్మార్గుని సంపదలు చెదరిపోవటమే కాక, అతని తొలి సంపదలు కూడ సమూలంగా నాశనమౌతాయి) అంటాడు విదురుడు. దానికి దుర్యోధనుడు విదురుని నిందించి ప్రాతికామి అనేవాడిని పిలిచి ద్రౌపదిని పిలుచుకొని రమ్మంటాడు.

ప్రాతికామి ద్రౌపదితో-

‘ధనసంపదలు నిజధరణిరాజ్యంబుఁ దనయులం దమ్ములఁ దన్నును నిన్నుఁ
దనరఁ జూదంబాడి ధార్తరాష్ట్రులకు ధర్మతనూజుండు దా నోటువడియె:
వనజాక్షి! కౌరవవరుపని నిన్ను వడిఁ దోడుకొని పోవ వచ్చితి నిపుడ:
చనుదెమ్ము కౌరవేశ్వరుకడ’ కనిన జలజాయతాక్షి పాంచాలి యిట్లనియె. 2-2-207

(‘ధర్మరాజు జూదమాడి – కౌరవులకు తన ధనసంపదలను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. పద్మాక్షీ! కౌరవశ్రేష్ఠుడైన దుర్యోధనుని పనిమీద నిన్ను వేగమే తోడ్కొని పోవటానికి వచ్చాను. కౌరవేశ్వరుని దగ్గఱికి రా’ అని అనగా ద్రౌపది అతనితో ఇలా అన్నది.)

‘ఏయుగంబునందు నెట్టి దుష్కితవుండు! భార్య నొడ్డి యోటువడిన భర్త
గలఁడె ? యిది వినంగఁ గడు నపూర్వం బయ్యె!: నిట్లు సేయునొక్కొ యిందుకులుఁడు? 2-2-208
మున్ను దన్నోటువడి మఱి నన్ను నోటు! వడియెనో, నన్ను ము న్నోటువడి విభుండు
గ్రన్నఁ దన్నోటువడియెనో యన్న! నాకు ! నెఱుఁగఁ జెప్పుము దీని నీ వెఱుఁగుదేని.’2-2-209.

(ఏ యుగంలో నయినా, ఎటువంటి చెడ్డ జూదగాడయినా, భార్యను పణంగా ఒడ్డి ఓడిపోయిన భర్త ఉన్నాడా? వినటాని కిది ఆశ్చర్యంగా ఉంది. చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా? నా భర్త మొదట తన్నోడి న న్నోడెనా? లేక ముందే నన్నోడి తా నోడెనా? అన్నా! నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు‘).

ఇందుకులుడు – అనటంలో చంద్రుని కాంతితో పాటు అతని మచ్చ కూడా ధ్వనిస్తోంది. అంటే ధర్మజుని గుణాలతో పాటు అతని ద్యూతవ్యసనం కూడా ధ్వనిస్తోంది. పదునైన ద్రౌపది బుద్ధికి ఈ ప్రశ్న ఒక ప్రబల నిదర్శనం.

వ.’ఎఱుంగవేని యక్కితవు నడిగి వచ్చి మఱి నన్నుం దోడ్కొని పోవనగునేని తోడ్కొని పొ’మ్మనినం బ్రాతికామి క్రమ్మఱి వచ్చి పాంచాలి పలుకులు ధర్మరాజునకుం జెప్పిన, దురోదర పరాజయ దుఃఖిత చేతస్కుండగుటం జేసి యతఁడు వానికి నదత్తప్రతివచనుం డైనఁ, బ్రాతికామికి దుర్యోధనుం డిట్లనియె.

‘నీకు తెలియకుంటే, ఆ జూదగాణ్ణి అడిగి వచ్చి- నన్ను పిలిచికొని వెళ్ళటం తగినట్లయితే పిలుచుకొని వెళ్ళు’ అని ద్రౌపది పలుకగా, ప్రాతికామి తిరిగి వచ్చి ఆమెమాటలు ధర్మరాజుకు చెప్పాడు. కాని, అతడు జూదంలో ఓడిపోయి దుఃఖంతో ఉండటంవల్ల ప్రాతికామికి బదులు చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడు ప్రాతికామితో – ఖచ్చితంగా సమాధానం చెప్పటానికి వీలులేని సందిగ్ధమైన న్యాయాన్ని అడిగావు. ఈ సభలోనివారందరు తెలిసికొనేట్లు, ఆ ద్రౌపదిని ఆలస్యం చేయకుండా సభలోనికి తీసుకొని రా – వెళ్ళు. అని పంపించాడు.

సభలోనే ఆమె సందేహం నివృత్తి చేయువారయి సభ్యులు నిన్ను రమ్మన్నారు అని చెప్పి ఆమెను సభకు తోడ్కొని వస్తాడు ప్రాతికామి. ఆమె ధృతరాష్ట్రుని దగ్గఱ ఉండగా దుర్యోధనుడు – ప్రాతికామి భీమునకు భయపడతాడు కాబట్టి నువ్వు ఆమెను సభలోనికి తీసుకొని రమ్మని దుశ్శాసనునికి పురమాయిస్తాడు. ఇది తెలిసి ద్రౌపది గాంధారి దగ్గఱకు చేరుతుంది. దుశ్శాసనుడు ద్రౌపదివెంట పరుగెత్తి ఎక్కడకు వెళతావు. శకుని నిన్ను జూదంలో గెలిచాడు, ఇప్పుడు నీవు దుర్యోధనుని సొత్తు. నీ భర్తలు నిన్నూ రాజ్యాన్నీ, తమనీ ఓడిపోయారు అని దగ్గఱగా రాబోతే ఆమె – నేను రజస్వలను, ఏకవస్త్రను, గురుజనులున్నసభకు ఎలా రాగలను అంటుంది.

నీవు ఏకవస్త్రవైతే ఏమి, విగత వస్త్రవైతేనేమి నిన్ను ఎలాగైనా తీసుకొనిపోతాను అని ఆమెను కొప్పుపట్టి ఈడ్చుకొని పోతాడు సభలోనికి. అప్పుడామె ధర్మనందనుడు ధర్మం తప్పేవాడు కాడు, దుర్మార్గంగా ఈ దుశ్శాసనుడు నన్ను సభలోనికి ఎందుకు తీసుకు వచ్చాడు? అని ఆమె సభాసదులందరినీ ప్రశ్నించింది. భీతితో కృష్ణుడిని స్మరించిందామె.అప్పుడు భీముడు ధర్మరాజుతో మేమందరం నీ సొమ్ము కాబట్టి మమ్మల్నందరినీ ఒడ్డటం సరే, కాని దుష్టద్యూతమని శకుని పన్నాగమనీ తెలిసీ ధర్మవిరుద్ధంగా ప్రవర్తించావు కాబట్టి ఆ జూదమాడిన నీ చేతుల్ని ఖండిస్తాను అంటాడు. అప్పుడు అర్జునుడు భీముని శాంతపరుస్తూ

ధర్మతనూజుండు ధర్మువు దప్పిన! ధరణీతలం బెల్లఁ దల్లడిల్లుఁ;
దగిలి సుహృద్ద్యూత ధర్మయుద్ధములకుఁ! బరులచేఁ బిలువంగబడి విభుండు
గడగక విముఖుండు గాఁ జన దని శుభ! క్షాత్త్ర ధర్మంబు లోకంబునందు
నిలిపె దా; నిది పతినేరమియే? దైవ! వైపరీత్యం బైన వనరఁ దగునె?
గురుల ధర్మపరులఁ గోపించి ధీరు ల! తిక్రమింతురే? తదీయ నిత్య
ధర్మ గౌరవం బధార్మికు లగుచున్న! పరులచేతఁ జెఱుపబడియెనిట్లు. 2-2- 224

(ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా? స్నేహంగా ఆడుకొనే జూదానికి, ధర్మం కొఱకు చేసే యుద్ధానికి ఇతరులు పిలిస్తే ప్రభువైనవాడు అందుకు పూనుకోకుండ, పెడమొగంపెట్టి పోకూడదన్న శుభక్షత్రియధర్మాన్ని, ఆయన లోకంలో నిలిపాడు. అంతేకాని, ధర్మరాజు ఈ జూదమాడటం అజ్ఞానం వల్లనా? దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించటం తగునా? ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం – ధర్మహీనులైన ఇతరులచే చెడగొట్టబడింది.) అని అర్జునుడు ధర్మరాజుని సమర్ధించాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వికర్ణుడు(దుర్యోధనుని తమ్ముళ్లలో ఒకడు) లేచి

సమచిత్తవృత్తు లగు బు ! ద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా
రము సేయ వలయు; నవిచా ! రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్. 2-2-226

(పక్షపాతం లేని బుద్ధిమంతులంతా ఇప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నను విచారించవలసిన అవసరముంది. అలా విచారించకుండా మన కెందుకు లెమ్మని ఊరకుంటే అది నరక హేతు వౌతుంది)
-అని పలికి ఎవ్వరూ బదులు పలకక పోయేసరికి – నేనే ధర్మనిర్ణయం చేస్తాను. అందరూ వినండి. జూదం, వేట, మద్యపానం, అతిగా తినటం అనే ఈ నాలుగూ చెడు వ్యసనాలు. వీటిలో తగుల్కొన్న మానవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. అలాంటి వాడి పనులు లెక్కలోకి తీసుకోకూడదు. జూదగానిచేత ఆహ్వానించబడి, జూదవ్యసనంలో తగుల్కొని ఓడిపోయిన ధర్మరాజు, పాండవులకందరికి ఉమ్మడి సొమ్ము అయిన పాంచాలిని పందెంగా ఒడ్డాడు. అందుచేత ఆమె అధర్మంచేత జయించబడింది. ఆ సుకుమారిని – ఒకేవస్త్రం ధరించి ఉన్నదాన్ని, ఇక్కడికి తీసుకొని రావటం అన్యాయం.- అంటాడు. దానికి కర్ణుడు

ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు ! బేల నీకుఁ జెప్పనేల వలసెఁ?
జిఱుతవాని కింత తఱుసంటి పలుకులు ! సన్నె వృద్ధజనము లున్నచోట?2-2-228

( ఎవ్వరూ తెలియటానికి ఇష్టపడని ధర్మాన్ని, మూఢుడా! నీ వెందుకు చెప్పవలసివచ్చింది? పెద్దవా ళ్ళుండేచోట చిన్నవాడికి అధికప్రసంగం ఎందుకు?)
-ఇది నన్నయ్య గారి రుచిరార్థ సూక్తినిధిత్వానికి మచ్చుతునక. ‘ చిఱుతవాని కింత తఱుసంటి పలుకులు’ మంచి తఱచుగా వాడబడే పదప్రయోగం. ఇటువంటి భాషా ప్రయోగాలను మన తఱువాతి తరానికి అందించాలంటే దాని కోసమైనా భారతాన్ని చదవాలి.

కర్ణుడు వికర్ణునికి సమాధానం చెబుతూ – ద్రౌపది ధర్మరాజు సర్వస్వంలోని భాగమే. అందుచేత ఆమె ధర్మవిజితయే. అలాకాకపోతే పాండవులందరూ ఎందుకు ఊరుకున్నారు? పోతే ఏకవస్త్రను సభకు తేవటం- భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. కాని ఈమె పెక్కుమంది భర్తలను కలది. అందుచేత ఈమె బంధకి అనబడుతుంది. ఆమెని వివస్త్రగా సభకు రప్పించినా దోషం లేదు అంటాడు కర్ణుడు. ఇది విన్న దుర్యోధనుడు దుశ్శాసనుడిని పాండవుల బట్టలు ఊడతీయమంటాడు. పాండవులు ఇది గ్రహించి వాళ్ళే పైబట్టల్ని తీసేస్తారు.

దుశ్శాసనుడప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి పూను కుంటాడు. ఇది చేయకూడదని మనస్సులో విచారించక దుశ్శాసనుడు ఆమె కట్టుకున్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండుసభలో విప్పాడు. ఆపకుండా అతను విప్పుతున్నా ముందు తొలగించబడిన వస్త్రం వంటి వస్త్రమే ఆ లలితాంగి మొలభాగంమీద ఎడతెగకుండా మళ్ళీ మళ్ళీ రాసాగింది. అదిచూచి సభ్యులందరూ సంతోషించారు. విప్పిన వస్త్రసమూహం కొండలా పెరిగింది. ఇంక విప్పలేక అతడు చతికిలబడ్డాడు. అప్పుడు భీమసేనుడు ఓ దారుణమైన ప్రతిజ్ఞ చేసాడు. చాలా మంచి పద్యం. మనందరికీ వచ్చిన పద్యమే.

కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధురుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝ ర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్. 2-2-233

(కురు వంశపు పెద్దలు, గురువులు, వృద్ధులు, బంధువులు పెక్కుమంది చూస్తుండగా – పొగరెక్కి చెలరేగి, ద్రౌపదిని ఇలా చేసిన దుశ్శాసనుడిని రాజైన దుర్యోధనుడు చూస్తుండగానే యుద్ధంలో లోకభయంకరమైన రీతిలో వధించి , అతని విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్తప్రవాహమనే సెలయేటి నీటిని భయంకరాకారం ధరించి త్రాగుతాను.)

అక్షరరమ్యమై, అర్థగంభీరమై, పద్యశిల్పంలో అతిప్రసిద్ధమైన నన్నయ పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదువుతుంటే భీముని రౌద్రాకృతి మన కట్టెదుట సాక్షాత్కరిస్తుంది. ప్రతిపదంలోనూ రౌద్రం పొంగిపొరలుతుంది. మహాప్రాణాక్షర వర్ణవిన్యాస వైఖరి. అక్షర రమ్యతను రౌద్రరసోన్నిద్రంగా ఆవిష్కరించింది. ఇలాగనక చేయలేకపోతే పితృపితామహుల గతికి తప్పినవాడ నౌతాను అంటాడు. అప్పుడు ఆ సందడిని నివారించి విదురుడు అందరితో ఇలా అంటాడు.

సుమతులు పాంచాలీ ప్ర! శ్నము నర్థము నేర్పడన్ విచారింపుడు పా
పము నొందు ధర్మసందే! హము దీర్పనినాఁడు సభ్యులగు సజ్జనులన్. 2-2-235

(బుద్ధిమంతులంతా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టమయ్యేటట్లు ఆలోచించండి. ధర్మసందేహం తీర్చనిరోజు సభలోని సజ్జను లందరికీ పాపం అంటుకొంటుంది.)
ఇంకా చిన్నవాడైనా బృహస్పతిలా వికర్ణుడు శాస్త్రప్రకారంగా ధర్మాన్ని చెప్పాడు. అన్నిచోట్లా ధర్మంయొక్క సరైన అర్థాన్ని నిర్ణయించటం ఏ ఒక్కడికీ – బ్రహ్మకు కూడా – సాధ్యం కాదు.

సభకు వచ్చి ధర్మ సందేహమడిగిన ! నెఱిఁగి చెప్పకుండిరేని సభ్యు
లనృత దోష ఫలమునం దర్థ మొందుదు! రనిరి ధర్మవేదులైన మునులు. 2-2-237

(సభకు వచ్చి ఎవరైనాసరే ధర్మసందేహం అడిగితే, తెలిసి చెప్పకుంటే – సభ్యులు, అసత్యమాడే తప్పువల్ల కలిగే ఫలంలో సగం పొందుతారని ధర్మమెఱిగిన మునులు చెప్పారు.)

ధర్ము వెఱిఁగి దానిఁ దా నొండుగా లాభ ! లోభ పక్షపాత లోలబుద్ధి
సభల నెవ్వఁడేని సభ్యుఁడై పలుకు వాఁ ! డనృతదోషఫలము ననుభవించు. 2-2-238

(ధర్మాన్ని తెలిసికూడా, లాభం చేతనో, లోభంచేతనో, పక్షపాతం చేతనో, ఊగిసలాడే బుద్ధితోనో సభల్లో ఎవడైనా – దానిని మరొకవిధంగా పలికితే, అతడు అసత్యమాడే దోషం వల్ల కలిగే ఫలాన్ని అనుభవిస్తాడు.)

ఈ రెండూ కూడా నన్నయ రుచిరార్థసూక్తులే. న్యాయా న్యాయ నిర్ణయం చేసే సభల్లో కూర్చున్న న్యాయనిర్ణేతలందరికీ ఇవి శిరోధార్యాలే. అంతేకాదు, ధర్మం అధర్మం చేత బాధింపబడి సభకు వస్తే , దాన్ని తీర్చని సభ్యులు , అధర్మంచేత బాధింపబడతారు. అంతేకాదు. సభ్యులు కామక్రోధాలు విడిచి అధర్మాన్ని ఆపనినాడు, ఆ అధర్మంలో ఒక నాల్గవ భాగం సభ్యులకు, మఱొక నాల్గవభాగం రాజుకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందుచేత ధర్మం తప్పక చెప్పాలి.అందుచేత మీరుకూడా ఆలోచించి ధర్మనిర్ణయం చేయండి అన్నాడు విదురుడు సభనుద్దేశించి. కాని దుర్యోధనుడికి భయపడినవారై ఎవ్వరూ మాట్లాడలేదట.

‘ అవ్విధంబున నొప్పి యా స్వయంవరము నాఁ! డఖిల భూపతులచే నట్లు సూడఁ
బడి, పాండవుల ధర్మపత్నినై, గోవిందు ! చెలియలినై, వీనిచేత నిట్లు
పరిభూత నగుచు సభామధ్యమున మహీ ! పతులచేఁ జూడంగఁ బడితి; నింత
వడుదునె ? యిపుడు నా పలుకుల కెవ్వరు ! ఫ్రతివచనం బేల పలుక రైరి?
ధన్యులార ! యే నదాసినే? దాసినే? ! యెఱుఁగఁ జెప్పి పనుపు‘ డెల్ల దాని
ననుచు వనరుచున్న నాపగాసుతుఁడు శాం! తనవుఁ డిట్టు లనియె దానిఁ జూచి.2-2-244

(‘ఆ స్వయంవరంరోజు ఆ విధంగా వెలిగి, అందఱు రాజులచే అంత గొప్పగా చూడబడి, పాండవుల ఇల్లాలినై, శ్రీకృష్ణుని చెల్లెలినై- ఇప్పుడు ఈ దుశ్శాసనునిచేత ఇలా అవమానించబడుతూ, ఈ సభామధ్యంలో రాజులందరిచేత చూడబడుతూ ఇంత దుస్థితిని అనుభవిస్తున్నానే- నే నడిగిన దానికి ఎవరు గూడ ఎందుకు బదులు చెప్పరు? నేను దాసినా? కానా? పూర్తిగా తెలియజెప్పి నన్ను ఆజ్ఞాపించండి’ అని దుఃఖిస్తున్న ద్రౌపదిని చూచి భీష్ముడు ఇలా అన్నాడు.)

వ.’అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్ఠురుఁడు సెప్పవలయుఁ: గానినాఁడు ధర్మసూక్ష్మత యెవ్వరికి నెఱుంగ గహనంబు: దీని ఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతు’ రని పలుకుచున్న యవసరంబున నక్కోమలిం జూచి నగుచు. 2-2-245

‘ తరుణి! యేవురకంటె నొక్కరుండ భర్త! యగుట లగ్గు జూదంబున నాలి నోటు
వడని వానిగాఁ దగు భర్తఁ బడయుమింక’ ! ననుచు రాధేయుఁ డుల్లసమాడె నంత. 2-2-246

(‘ద్రౌపదీ! ఐదుగురికంటె ఒక్కడే భర్త కావటం మంచిది. జూదంలో భార్యను ఓడిపోని తగుభర్తను ఇక పొందు’ అని కర్ణుడు ఆమెను ఎగతాళి చేసాడు. అంటే దుర్యోధనుణ్ణి చేపట్టమని సూచన.ఏ కులకాంతకైనా కర్ణుని మాటలు కర్ణశూలాలే. కాగా, కర్ణుని సూచన మాయాద్యూతంలో లభించిన అక్రమ విజయంతో మదోద్ధతుడై ఉన్న దుర్యోధనుని దుర్మార్గాన్ని ఎగదోసాయి.

అమ్ముదితన్ విభీతహరిణాక్షిఁ గలాపవిభాసితకేశభా
రమ్మున నొప్పు దానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా
రమ్మని సన్న సేసె ధృతరాష్ట్ర సుతాగ్రజుఁ డప్డు దాని దూ
రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్. 2-2-247

(ధృతరాష్ట్రుని జేష్ఠపుత్త్రుడైన దుర్యోధనుడు, భయపడిన లేడి కన్నులవంటి కన్నులు కలది, నెమలిపురిలా ప్రకాశించే తల వెండ్రుకలభారం కలది అయిన ద్రౌపదిని – అందమై, విశాలమైన తన తొడమీద కూర్చుండ రమ్మని సైగ చేసాడు. ఆ సైగను దూరంనుండి చూచి, కౌరవులు అనే జింకలపాలిటి సింహం లాంటి భీముడు కోపంతో—)
ప్రళయకాల యమధర్మరాజులా దయలేనివాడై, రాజులంతా ఆశ్చర్యంతో, తొట్రుపాటుతో, తనమాటలు వింటుండగా ఇలా అన్నాడు. ఇది ఇంకో ప్రసిద్ధమైన మంచి పద్యం.

ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరు దేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్.2-2-249

(రాజ్య సంపదవల్ల కలిగిన పొగరుతో అందమైన ద్రౌపదిని జూచి, అరటిబోదెల వంటి తొడలుగల ఆమెను, తన తొడమీద కూర్చుండరమ్మని పిలిచిన ఈ దుర్యోధనుణ్ణి భయంకర యుద్ధరంగంలో ఎదుర్కొని, అడ్డగించ సాధ్యంకాని నా చేతులు త్రిప్పే భీకర గదాదండం దెబ్బలతో ఇతని తొడలు విఱుగ కొట్టుతాను.)
-ఇటువంటి అందమైన పద్యాలకోసం కూడా మనం భారతాన్ని చదవాలి.వింటే ఇంకెంత బాగుంటాయో ఈ పద్యాలు. అప్పుడు భీముడు పదే పదే తన గదాదండం వైపు చూపులు సారిస్తుంటే పెద్దలందరూ అతడిని వారించారు. ఈ కలకలం విన్న ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి వరాలిస్తాను కోరుకొమ్మంటాడు.

సుందరి! నా కోడండ్రుర! యం దభ్యర్హితవు నీవ; యతిముదమున నీ
కుం దగఁ బ్రియంబు సేసెద! నిందుముఖీ! వేఁడుఁ మెద్ది యిష్టము నీకున్.2-2-257

(సుందరీ! ద్రౌపదీ! నా కోడళ్ళందఱిలో నీవే గౌరవించదగిన దానివి. చంద్రముఖీ! నీ కేది ఇష్టమో కోరుకో. ఎంతో సంతోషంతో ఇస్తాను.)

ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.కనక ద్రౌపది అందం ఎలా వుంటుందో అతనికి తెలియదు. అయినా అతడామెను సుందరీ,ఇందుముఖీ అని సంబోధన చేస్తున్నాడు. ఆమెకు ఆనందం కలిగించటం కోసమే ఆ సంబోధనలు.

కరుణతోడ నాకు వరము ప్రసాదింప! బుద్ధియేని లోకపూజితుండు
మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు! వలనఁ బాయవలయు వసుమతీశ! 2-2-259

( ఓ ధృతరాష్ట్ర మహారాజా!దయతో నాకు వరం ఇవ్వాలని మీకు అనిపిస్తే లోకంచేత పూజింపబడేవాడు, మనువుతో సమానమైన వాడు అయిన ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి కలగాలి.)

అలా అయితే ప్రతివింద్యుడిని (ధర్మరాజు వలన ద్రౌపదికి కలిగిన పుత్రుడిని) దాసపుత్త్రుడని లోకులు అనరు. ఇదే నాకు ఇష్టం. అంటుంది. సరే ఇచ్చాను. ఇంకోవరం కోరుకో అంటాడు ధృతరాష్ట్రుడు. మిగిలిన నలుగురు పాండవులకూ దాస్యవిముక్తిని కలిగించమంటుంది. దీన్నీ ఇచ్చాను ఇంకో వరం కోరుకో అంటాడామెను ధృతరాష్ట్రుడు. అప్పుడామె ఓ చక్కని మాట అంటుంది.

‘వైశ్యసతికి నొక్క వరము, సత్క్షత్రియ సతికి రెండు, శూద్రసతికి మూఁడు,
విప్రసతికి నూఱు వేఁడఁజ న్వరములు గాన యింక వేఁడఁగాదు నాకు.’2-2-263

(వైశ్య స్త్రీ ఒక్కవరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ రెండువరాలు, శూద్రస్త్రీ మూడువరాలు, బ్రాహ్మణస్త్రీ నూఱు వరాలు కోరవచ్చు. అందువల్ల ఇక నేను వరాలు కోరకూడదు.)

అన్నదామె. ధృతరాష్ట్రుడు ఆమె ధర్మశీలతకు మెచ్చి ధర్మరాజును, అతని తమ్ములతో కూడ రప్పించి ‘ నీవు సర్వసంపదలు, నీ రాజ్యం తీసుకొని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా జీవించు. నా కొడుకు జ్ఞానం లేక మీకు కీడు చేసాడు.ఈ అపకారాన్ని మరచిపో. నేను నీకింకేమీ చెప్పనక్కరలేదు.’ అన్నాడు.

మనమున వేఱమిఁ దలఁపమి! యును, సక్షమచిత్తుఁ డగుటయును, గుణములు కై
కొని దోషమ్ములు విడుచుట! యును నుత్తముఁ డయిన పురుషు నుత్తమగుణముల్. 2-2-266

( మనసులో వైరం తలచకుండటం, ఓర్పుతో కూడిన మనస్సు కలిగి ఉండటం, గుణాలు గ్రహించి, దోషాలు విడిచివేయటం, గొప్పవ్యక్తి యొక్క లక్షణాలు.)

మానవతకు వెలుగు నిచ్చే సూక్తుల్లో ఇది ఒకటి. ఇటువంటి సూక్తులకోసమే భారతం చదవటం. భీమడు భార్యవలన రాజ్యం పొందటానికి అసహ్యపడి యుద్ధం చేసి మొత్తం రాజ్యాన్ని సాధిద్దామని అనగా అతడిని వారించి పాండవులు ఇంద్రప్రస్థపురం చేరతారు. ఈ జరిగిన దంతా విన్న దుర్యోధనుడు తండ్రి దగ్గఱకు వచ్చి ఇట్లా అంటాడు.

అహితుల నెల్ల విధంబుల! నిహతులఁగా జేయునది వివేక మని మరు
న్మహితుండు చెప్పె నిది మును! బృహస్పతి సురేశ్వరునకుఁ బ్రియహితబుద్ధిన్. 2-2-271

(‘శత్రువుల్ని అన్నివిధాల తెగటార్చటమే వివేకం‘ అని దేవతల్లో గొప్పవాడయిన బృహస్పతి ఇంద్రునికి మేలుచెయ్యాలని ప్రేమతో చెప్పాడు.)

మనం పాండవులకు ఇంత చేసినాగానీ హితులము అవ్వము కదా. వారిని విడిచి తప్పు చేసాము.వాళ్ళు మిక్కిలి బలవంతులు. వారిని యుద్ధంలో మనం గెలవలేం. మళ్ళీ వారిని జూదానికి పిలవమని బలవంతం చేస్తాడు. మళ్ళీ పిలువగా వాళ్ళు వస్తారు. ఈసారి జూదంలో ఓడినవారు నారచీరలతో బ్రహ్మచారులై 12 సంవత్సరాలు అరణ్యవాసం ఒకయేడజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో పట్టుబడితే తిఱిగి 12 ఏండ్లు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి – ఇలా అయితే జూదం ఆడదాం. లేకపోతే లేదు అంటాడు శకుని. జూదానికి పిలువబడి వెనక్కు తగ్గరాదనే ధర్మాన్ని అనుసరించి ధర్మరాజు సరే అని ఆడి ఓడిపోతాడు. కుంతీ దేవిని విదురుడు తన గృహంలో ఉండమంటాడు. పాండవులు ద్రౌపదితో కలసి అరణ్యవాసానికి బయలుదేరుతారు. తిరిగి వచ్చిన తర్వాత యుద్ధంలో దుర్యోధనుడ్ణి, దుస్ససేనుడిని మిగిలినకౌరవులను సంహరిస్తామని ప్రతిజ్ఞలు చేస్తూ పాండవులు అడవికి బయలుదేరతారు.
ఇక్కడితో సభాపర్వం పూర్తి అయింది.

తఱువాత మనం ఆరణ్యపర్వం లోనికి ప్రవేశిద్దాం.

You Might Also Like

Leave a Reply