శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.1: సభాపర్వం
వ్రాసిన వారు: మల్లిన నరసింహారావు
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు)
*********************
(సభా పర్వ పరిచయం లో మొదటి వ్యాసం ఇక్కడ చదవండి. ఆ తరువాత..)
చేయుము రాజసూయ మెడసేయక; దానన చేసి దోషముల్
వాయు నిలేశ ! భూప్రజకుఁ; బార్థివులెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు ; సర్వ సంపదలు చేకొనఁగా దఱియయ్యెఁ గౌరవా
మ్నాయలలామ! నీ కెనయె మానవనాథులు మానుషంబునన్. 2-1-98
(ధర్మరాజా ! ఆలస్యం కాకుండా రాజసూయం జరిపించు. దానివల్ల ప్రజల పాపాలు తొలగిపోతాయి. రాజులంతా నీ ప్రతాపానికి లొంగిపోయేవాళ్ళే. సర్వసంపదలు సేకరించటానికి ఇది తగిన సమయం. ఓ కౌరవాన్వయ శ్రేష్ఠా! మానవయత్నంలో రాజులెవ్వరూ నీకు సరిగారు.)
ఇలా ధౌమ్యాదులు ధర్మరాజుకు ఉపదేశం చేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఇంద్రప్రస్థపురానికి వస్తాడు. ధర్మరాజు అతనితో జరిగిన విషయం అంతా చెప్పి- నీ యెఱుఁగని యవియుఁ గలవె నీరజనాభా – అంటూ శ్రీకృష్ణుని అభిప్రాయం అడుగుతాడు. నీ తమ్ముళ్ళ బలపరాక్రమాలవలన రాజసూయం చెయ్యటానికి నీవు సమర్థుడవే అని అంటూ జరాసంధుని సామర్థ్యం గుఱించి, పరాక్రమం గుఱించి చెపుతాడు. అతనికి చేడ్పాటు వచ్చే రాజులగుఱించి కూడా చెప్తాడు. కంసుని భార్య జరాసంధుని కూతురవటం చేత కంసుడిని శ్రీకృష్ణుడు చంపటం చేత జరాసంధుడు శ్రీకృష్ణునిమీద తఱచుగా దండయాత్రలు కూడా చేస్తూ ఉంటాడు. ఇలా చెప్తుండగా భీముడిది విని ధర్మరాజుతో –
ఆరంభరహితుఁ బొందునె ! యారయ సంపదలు ? హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ! తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్. 2-1-123
(లోకంలో ప్రయత్నమే చేయనివానికి సంపదలు సమకూరవు. బలహీనుడైనా సరే పురుషుడు తాను ప్రయత్నం చేసే స్వభావం కలవాడైతే, ప్రయత్నమే చెయ్యని ఎంత బలవంతులనైనా జయించగలడు.).
ఎంత మంచి సూక్తి!
కడు నధికుతోడఁ దొడరినఁ ! బొడిచిన నొడిచినను బురుషు బురుషగుణం బే
ర్పడుఁగాక, హీను నొడుచుట ! కడిఁదియె ? పౌరుషము దానఁ గలుగునె చెపుమా! 2-1-124
(లోకంలో బలవంతునితో వైరం పూనినా, యుద్ధం చేసినా, అతణ్ణి ఓడించినా పురుషుని పౌరుషం ప్రకాశిస్తుంది. అంతేకాని బలహీనుడ్ని ఓడించటం ఓ విశేషమా? అది పరాక్రమమా?)
ఇంకో మంచి సూక్తి.
అని అంటూ శ్రీకృష్ణుని దయతో,అర్జునుని బలపరాక్రమాల సహాయంతో తాను జరాసంధుడిని చంపగలనని భీముడు చెపుతాడు. శ్రీకృష్ణ అర్జున బలరాములు ముగ్గురూ త్రేతాగ్నుల వంటివారు. త్రేతాగ్నులు 3 ఆహవనీయ, దక్షిణ, గార్హపత్యాలు. ఇవిగాక ఇంకా సభ్యం, అపసభ్యం అనేవి కూడా ఉన్నాయి. అప్పడు అర్జునుడు ఇలా అంటాడు.
భూభుజులన్ జయింపుము, విభూతి నొనర్పుము రాజసూయమున్,
నాభుజ వీర్య విక్రమ గుణంబులకుం దగుచున్న యీ ధను
ర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన యీ సభా
లాభము నొండుపాట సఫలత్వముఁ బొందునె కౌరవేశ్వరా! 2-1-128
(ఓ కౌరవేశ్వరా! ధర్మరాజా! రాజులందరిని జయించు. అపారమైన ఐశ్వర్యంతో రాజసూయం నిర్వహించు. అలా కాకుంటే నా భుజబలపరాక్రమ గుణాలకు తగినట్లు ఈ గాండీవం, ఈ దివ్యబాణాలు, ఈ దివ్యరథం, శోభాయమానమైన ఈ మయసభ పొందినందుకు ఫలమేముంది ?)
గాండీవ దివ్యబాణరథాలు పార్థుని భుజబల పరాక్రమాలకు ఫలితంగా లభించినవైతే, మయసభ అర్జునుని శరణాగతవత్సలత్వానికి బహుమానంగా లభించిన బహుమతి.
కలరూప గుణ ద్రవ్యం ! బులు విక్రమవంతునందు భూవిదితములై
నిలుచు నవిక్రమునకు నవి ! గలిగియు లేని క్రియ నప్రకాశంబు లగున్. 2-1-129
(పరాక్రమవంతుని రూపగుణ సంపదలు ప్రపంచ ప్రసిద్ధాలై రాణిస్తాయి. పరాక్రమహీనునికి అవి ఉన్నా లేనట్లే కాంతివిహీనా లౌతాయి.) నన్నయ్య గారి సూక్తి.
ప్రియహిత సత్యవాక్య ! యరిభీషణ ! కృష్ణ ! భవన్నిదేశ సం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద, ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశులు, నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁబొందెన యకిల్బిషకీర్తి వెలుంగుచుండఁగన్. 2-1-166
(శ్రీకృష్ణా! నీవు ప్రియంగా, హితంగా సత్యం పలికేవాడివి. శత్రు భయంకరుడివి. నీ ఆజ్ఞను ఆశ్రయించి ఉండే మాకు బలవంతులైన శత్రువులను జయించటం ఒక విశేషమా ! ఇక జరాసంధుడిచేత బాధితులు,బంధితులు అయిన రాజులందరికి బంధాలనుండి విముక్తి కలిగినట్లే. నీ నిర్మలకీర్తి ప్రకాశించేటట్లు రాజసూయ యజ్ఞం కూడా జరిగినట్లే.)
నయనము నాకుఁ బవనత ! నయ విజయులు, మనము కమలనాభుఁడు వీరిం
బ్రియహితులఁ బాసి నిమిషం ! బయినను నెట్లుండ నేర్తు నవిచేష్టుఁడనై. 2-1-169
(భీమార్జునులు నాకు కళ్ళు. కృష్ణుడు మనస్సు. ప్రియులు, హితులు అయిన ఈ ముగ్గురిని వదలి ఒక్క నిమిషమైనా నిర్వికారంగా ఎలా ఉండగలను? )
శ్రీకృష్ణుడు జరాసంధవధకోసమని భీమార్జునులను తనతో తీసుకుని వెళతానని ధర్మరాజుని అడిగినప్పుడు ధర్మరాజు అలా అంటాడు.
దారుణ వజ్రచారు భుజదండములన్ బలవద్విచార గం
భీరులు ధీరు లాక్షణమ భేరులు మూఁటిని వ్రచ్చి చాత్యక
స్పార నితంబదేశమును భగ్నము సేసి గిరివ్రజంబు న
ద్వారమునందుఁ జొచ్చి రతిదర్పితు లా యదుకౌరవోత్తముల్. 2-1-177
(బలవంతుల్లా ఆలోచించటంవల్ల గంభీరంగా ఉన్నవాళ్ళు, ధైర్యవంతులు, ఎంతో గర్వంతో ఉన్నవాళ్ళు, అయిన యదువంశ కురువంశశ్రేష్ఠులు వజ్రంలా కఠినాలు సుందరాలు అయిన భుజదండాలతో తత్క్షణమే ఆ భేరులు మూడింటిని పగులగొట్టారు. చైత్యక పర్వతం యొక్క నడిమిభాగాన్ని భేదించి, గిరివ్రజపురాన్ని ద్వారం కాని మార్గంలో ప్రవేశించారు.)
పరమ వ్రతుడైన జరాసంధుడు వారికి ఎదురువచ్చాడట. వ్రతులు వ్రతభేదాన్ని బట్టి 9 విధాలు. అవి ఋషి, స్నాతకుడు, యతి, స్థాండిలుడు, ద్వయాతిగుడు, మూలికుడు, లోచకుడు, ఔర్వుడు, ఖపుటుడు. మళ్ళీ స్నాతకులు 9 విధాలు. సంతానంకొఱకు పెండ్లి చేసుకొనదలచి ధనాన్ని యాచించేవాడు, తన ధనాన్ని యాగాదులందు బ్రాహ్మణులకిచ్చి దరిద్రుడై ధనాన్ని కోరేవాడు, యజ్ఞార్థం ధనాన్ని యాచించేవాడు, గురుదక్షిణ కోసం ధనాన్ని కోరేవాడు, బాటసారుల పోషణకై ధనాన్ని యాచించేవాడు, రోగులపోషణకై ధనాన్ని యాచించేవాడు, ఆలుబిడ్డలపోషణకై ధనాన్ని యాచించేవాడు, బీదలకు అన్నదానం నిమిత్తం యాచించేవాడు, వేదపఠనానికై కావలసిన సౌకర్యాలను కోరేవాడు.
అతుల విక్రమ సంపదన్ రణయజ్ఞ దీక్షితులై రిపు
ప్రతతి నోర్చిన వీరు, లుగ్రతపంబు సేసినవారు స
ద్గతికిఁ బోదురు గాక ; యిట్లపకారదారుణవృత్తి ను
ద్ధతిని భైరవపూజ సేసిన దాన సద్గతి గల్గునే? 2-1-192
(పోటీలేని పరాక్రమమనే సంపదతో, యుద్ధమనే యజ్ఞంలో దీక్షవహించి, శత్రుసమూహాన్ని ఓడించినవీరులు, గొప్పతపస్సు చేసినవాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. కాని, నీవలె సాటిరాజులను క్రూరంగా హింసిస్తూ గర్వంతో శివపూజ చేస్తే మోక్షం లభిస్తుందా!)
ఇలా అని జరాసంధునితో శ్రీకృష్ణుడు అంటాడు. ఇంకా తమ తమ పరిచయాల్ని గుఱించి అతనితో అంటాడు.
చెడక నావచనంబు సేయుము; చెచ్చెరన్ ధరణీశులన్
విడిచి పుచ్చుమ: యేను గృష్ణుడ, వీడు భీముఁడు, వాఁడు గ
వ్వడి: భవత్కృత దారుణం బను వహ్ని యార్పఁగ నున్న య
క్కడిఁది వీరులు వీరలిద్దరు గర్వితుల్ కురుసింహముల్. 2-1-193
(నీవు చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉండే రాజులందరిని విడిచిపెట్టు. నేను కృష్ణుణ్ణి. ఇతడు భీముడు. అతడు అర్జునుడు. నీ దుర్మార్గం అనే నిప్పును చల్లార్చటానికి సిద్ధంగా వున్న ఆ మహావీరు లిద్దరూ గర్వోన్నతులు. కురువంశశ్రేష్ఠులు.)
జరాసంధుడితో కృష్ణుడన్న మాటలివి. జరాసంధుడు వారితో యుద్ధానికి సన్నద్ధమైనపుడు కృష్ణుడు అతడిని మా మువ్వురిలో మహాబలవంతుడుని ఒకడిని యుద్ధం చేయటానికి కోరుకొమ్మంటే జరాసంధుడు భీముడిని కోరుకుంటాడు. ద్వంద్వయుద్ధంలో భీముడు జరాసంధుని కడతేర్చుతాడు.
తఱువాత కృష్ణుడు ద్వారకకు వెళతాడు. ధర్మరాజు రాజసూయయాగంలో భాగంగా తన తమ్ముళ్ళను నలుగురిని నాలుగు దిక్కులకు రాజులందరినీ జయించి రమ్మని పంపిస్తాడు.
అర్జునుని ఉత్తరదిగ్విజయ యాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు.
1.పుళింద దేశ ప్రభువు, 2.ప్రతివింద్యుడు, 3.ద్వీపమండలేశ్వరులు, 4.ప్రాగ్జోతిషపురం-భగదత్తుడు, 5.శబరులు, 6.సాగరతీర వాసులు, 7.అంతర్గిరి,బహిర్గిరి,ఉపగిరి భూపతులు, 8.ఉలూకదేశాధిపతి-బృహంతుడు, 9.ఉత్తర ఉలూక, కామదేవ, మోదాపుర, సుదామ, సుసంకులము అనే దేశాలు, 10.దేవప్రస్థప్రభువు సేనాబిందుడు, 11.విష్వగశ్వుడు, 12.పార్వతేయులు, 13.బర్బర,శబర,తురుష్క పతులు, 14.మాళవ, పౌండ్ర, కాశ్మీర, త్రిగర్త, లోహిత, సుధన్వ, గాంధార, కాంభోజ, కోసల పతులు,15.సింహపురాధీశుడు చిత్రాయుధుడు, 16. వనచర దస్యుల రాజులు,17.శ్వేతపర్వతం దాటిన తర్వాత ఉన్న కాంభోజకటకుడు అనే రాజు, 18.హాటకదేశం, మానససరోవరం ఋషికుల్యప్రాంత రాజులు, 19.హేమకూట నిషధాచలాలను దాటిన తర్వాత గంధర్వనగరం, 20. జంబూవృక్షాన్ని జంబూనదిని చూచి మేరువును, గంధ మాదనాన్ని దాటి సిద్ధ, విద్యాధర, చారణ, గంధర్వులచేత పూజితుడైనాడు, 21.మాల్యవంతం నీలపర్వతం దాటిన తర్వాతనున్న ఉత్తర కురుదేశాలు – హరివాసర నగరం.
భీముడి పూర్వ దిగ్విజయ యాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు:
1.పాంచాల దేశం, 2.విదేహరాజు జనకుడు, 3.దశార్ణపతి సుధన్వుడు, 4.అశ్వమేధేశ్వరుడైన రోచమానుడు, 5.చేది భూపాలుడు శిశుపాలుడు, 6.పుళింద విషయంలో సుకుమార సుమిత్రులు, 7.కుమార విషయంలో శ్రేణిమంతుడు, 8.కోసలదేశంలో బృహద్బలుడు, 9.అయోధ్యాపురంలోని దీర్ఘప్రజ్ఞుడు, 10. కాశీరాజు సుపార్శ్వుడు, 11. రాజపతి అయిన సుధన్వుడు, 12.మత్స్య మలద పతులు, 13.కర్ణాట దక్షిణ మల్లులు, 14.మగధపతి సహదేవుడు, 15.హిమవత్పర్వత పార్శ్వంలో ఉన్న జలోద్భవమనే దేశం, 16. భల్లాటదేశం, 17. ఇంద్రపర్వత సమీపంలోని ఏడుగురు కిరాతపతులు, 18. శర్మక వర్మకులు, 19.ఇంద్రసేన సముద్రసేనులు, 20. కర్ణవత్సపతులు, 21.పుండ్రపతి, 22.పౌండ్రక వాసుదేవుడు.
సహదేవుడి దక్షిణ దిగ్విజయ యాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు:
1.సుమిత్ర, శూరసేన, దంతవక్త్ర, యవనులు, 2. గోశృంగగిరి నివాసులు, 3. కుంతిభోజుడు, 4. భూరిబలుడి పుత్త్రుడైన జంభకుడు, 5. నర్మదానదీ సమీపంలో అవంతి దేశాధిపతులు విందానువిందులు, 6. మాహిష్మతీపురాధీశుడు నీలుడు, 7. సౌరాష్ట్రదేశంలో ఉండి దూతల ద్వారా రుక్మి, భీష్మక, శూర్పారక, దండక పతులనుండి కప్పాలు తీసుకొన్నాడు, 8. సాగర ద్వీపవాసులైన నిషాదులు, పురుషాదులు, ఏకపాదులు, కాలముఖులు, కర్ణప్రావరణులు, నర రాక్షస జాతులవారు, 9. రామశైల, కోలశైల, తామ్రద్వీప, సంజయంతీపుర నివాసులు, 10. తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులు, 11. లంకాధిపతి విభీషణుడు(దూతల ద్వారా).
నకులుడి పశ్చిమ దిగ్విజయయాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు :
1.మహితక విషయం, దత్తక మయూరకాదులు,2. మరు, మాళవ, బర్బర, శైరీషక, దశార్ణదేశాలు, 3. పుష్కరారణ్య నివాసులైన ఆభీరగణాలు, 4. సరస్వతీ, సింధు నదుల నాశ్రయించి ఉన్న స్రువణీయులు, 5. పంచనద – అమర పర్వత నివాసులు, 6. ద్వారవతిలో వాసుదేవుడు, 7. మద్రపతి శల్యుడు (శాకల పురం), 8. పశ్చిమ సముద్రగర్భ నివాసులు బర్బర కిరాత వీరులు.
(కీ.శే. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారి మహా భారత చరిత్ర(1933) నుండి భారతకాల భరతఖండము చిత్రపటము ఉన్నది ఆ పటాన్ని చూచినచో ఫైన చెప్పిన రాజ్యాల్ని గుర్తుపట్టవచ్చు.
పటం పంపిన భైరవభట్ల కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)
పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.2: సభాపర్వం
[…] మొదటి వ్యాసం ఇక్కడ, రెండో వ్యాసం ఇక్కడా చదవండి. ఆ […]