దేవుణ్ణి మనిషిని చేసిన ‘కొండ కతలు’

వేంకటేశ్వరస్వామి తిరుపతి కొండమీద ఎలా వెలిశాడు అనగానే నాకు (బహుశా మీగ్గూడా) భృగు మహర్షి కోపమూ, లక్ష్మి అలిగి వెళ్ళిపోవటమూ, ఆవిణ్ణి వెతుక్కొంటూ విష్ణువు భూలోకాన కొండమీదకొచ్చి పుట్టలో ఉండటమూ వగైరా జ్ఞాపకమొస్తాయి. అదికాదట అసలు కథ. తిరుపతికి ఆరుమైళ్ళ దూరంలొ ఉన్న పేరూరు గ్రామంలో ఉండే పేరూరమ్మకు, శేషాచలపతికి ఏడుగురు కొడుకులు. వాళ్ళు పెద్ద ఓబులన్న, చిన్న ఓబులన్న, మద్ది లేటన్న, పెంచల నరసింహ, కదిరి నరసింహ, గోవిందరాజు, వేంకటేశ్వరుడు. అన్నలు ఆరుమందికి తగిన చోటు దొరుకుతుంది. అందరికన్న చిన్నవాడైన వేంకటేశ్వరుడు తాను నివసించటానికి తగిన స్థలం వెతుక్కోవటానికి తల్లి పేరూరమ్మ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతాడు. ఎంత వెతికినా తగిన స్థలం దొరకలేదు. అలా వెదుక్కొంటూ తిరుపతిలోని మూడు గుంటల (తాతయ్య గుంట) గంగమ్మ దగ్గరకొచ్చి తనకు తగిన స్థలం ఎక్కడుందో చెప్పమంటాడు. తనకు తగిన చోటు చూపిస్తే గంగమ్మకు సంవత్సరానికి ఒకసారి జాతర జరిపించి, దున్నపోతుల్ని, కుంభాల్ని ఆహారంగా సమర్పిస్తానని చెప్తాడు. అప్పుడు గంగమ్మ ఏడుకొండలమీద గట్టి చోటు చూపించిందట.

సరే, అయ్యవారు కొండెక్కి కూర్చుంటే, అమ్మవారు మరి తిరుచానూరులోనే ఎందుకు ఉండిపోయారు? దానికీ ఒక కత ఉంది (కాదు కాదు, మూడు కతలు ఉన్నాయి). వేంకటేశ్వర స్వామికి, అలమేలు మంగకు నారాయణవనంలో పెళ్ళయ్యింది. కొన్నాళ్ళకు అలమేలు మంగ కాపురానికి కొండకొస్తుంది. సంసారానికి కావలసిన వస్తువులన్నిటినీ సారెపెట్టెల్లో తెస్తుంది. వస్తువులన్నిటినీ చూసిన వేంకటేశ్వర స్వామి, “కరివేపాకు తెచ్చావా” అని ప్రశ్నిస్తాదు. “అయ్యో, మరిచిపోయాన”ని అలమేలు మంగ కరివేపాకు తేవడానికి వెనక్కు వెళుతుంది. అప్పుడు వెంకన్న పొద్దుపోయేలోపల కొండకు చేరుకోవాలని, లేకపోతే పొద్దుపోయేటప్పుడు ఎక్కడ ఉంటే అక్కడే శిలగా మారి, పూజలందుకుంటావని చెప్తాడు. అలమేలు మంగమ్మ గబగబ కొండదిగి నారాయణ వనం చేరుకొని కావాలసినంత కరివేపాకు తీసుకొని తొందర తొందరగా కొండ కొస్తుంటుంది. అయితే అలమేలు మంగమ్మ తిరుచానూరు కొచ్చేసరికి పొద్దుపోతుంది. అలమేలు మంగమ్మ అక్కడే శిలైపోయింది.

వెంకన్న ఎదురేగి వెళ్ళి అలమేలు మంగమ్మను కరివేపాకు కోసం అడిగింది పైకెళ్ళే దారిలో ఉన్న మోకాళ్ళ పర్వతం దగ్గరట. అలమేలు మంగమ్మ అక్కడే సారెపెట్టెల్ని వదిలి ఆంజనేయస్వామిని కాపలా పెట్టి కొండదిగి వెళ్ళిందట. అప్పట్నుంచీ అక్కడే పడి ఉన్న సారెపెట్టెలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయట. అమ్మవారు వస్తున్నారని ఆంజనేయుడు అక్కడే ఇతరులకు ఇప్పటికీ రాళ్ళ రూపంలో కనిపించే ఆ సారె పెట్టెలకి కాపలా కాస్తూనే ఉన్నాట్ట (కావాలంటే ఆ సారెపెట్టెల ఫొటోలు కూడా చూడొచ్చు).

అసలు విషయం అది కూడా కాదట. వేంకటేశ్వరుడు కరివేపాకు అడిగాడని కోపమొచ్చిన అమ్మవారు అలిగి కొండ దిగి తిరుచానూరులోనే శిల అయి నిలచిపోయిందట.

అయినా వేంకటేశ్వరుడు కరివేపాకే ఎందుకు అడిగాడు? కొండ మీద అడవుల్లో కరివేపాకు పెరగదట మరి.

పైన చెప్పిన కథలు తిరుపతి ప్రాంతంలో స్థానికులు తరతరాలుగా చెప్పుకొంటున్న కతలు. ఇటువంటివే అనేక కథలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి దేవుడి గురించీ, గుడి గురించీ, కొండ గురించీ, మడుగు గురించీ, తిండి గురించీ, ఆచారాల గురించీ ప్రచారంలో ఉన్నాయి. ఈ కతల్లో ఒకోసారి మానవాతీత శక్తులతో దేవతలు మహిమలు చూపిస్తారు. చాలా కతల్లో దేవుళ్ళు మనుషుల్లాగే మసలుకొంటుంటారు. ఎవరో అనామకంగా సృష్టించి, మౌఖికంగా తరతరాల కందిస్తూ వస్తున్న ఈ ఐతిహ్యాలను (legends) శ్రద్ధగా సేకరించి క్రోడీకరించి కొండ కతలు అన్న పేరుతో మన కందించారు తిరుపతి వాస్తవ్యులు, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిజేస్తున్న డా. పేట శ్రీనివాసులు రెడ్డి.

దాదాపు పదేళ్ళ క్రితం, శ్రీ ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రోజుల్లో ఇలాంటి కతలు కొన్నిటితో కొండ కతలు అన్న పేరుతో కవర్‌స్టొరీ ప్రచురించారు. అవి చదువుతుంటే నాకు సరదాగా అనిపించింది. ఆ తర్వాత నాకు ఆయన పరిచయమయ్యాక ఈ కతల గురించి వాకబు చేస్తే, అవన్నీ పేట శ్రీనివాసులు రెడ్డిగారు సేకరించారనీ, అట్లాంటి కథలు చాలా కలిపి పుస్తకంగా తెస్తున్నారనీ చెప్పారు. తర్వాత చాలా కాలానికి ఉమామహేశ్వరరావుగారి ద్వారానే ఈ పుస్తకం నాకు అందింది. శ్రీ శ్రీనివాసులు రెడ్డి ఈ పుస్తకమే కాక తిరుపతిలో గంగ జాతర మీద కూడా ఇంకో మంచి పుస్తకం తెచ్చారని విన్నాను.

ఐతిహ్యాలు, వాటి లక్షణాలు గురించి – ఒక పరిశోధనా పత్రానికి ఉపోద్ఘాతంలా వ్రాసిన – ఒక పెద్దవ్యాసంతో ఈ పుస్తకం మొదలవుతుంది. మొత్తం 333 ఐతిహ్యాలను సేకరించారు శ్రీ శ్రీనివాసులు రెడ్డి. ఈ ఐతిహ్యాలన్నీ పరిమాణంలో చిన్నవే. సాధారణంగా ఒక పేజీలోపే. కొన్నయితే నాలుగయిదు పంక్తులు కూడా ఉండవు. కొన్ని విషయాలు రకరకాల రూపాలలో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. చాలా ఐతిహ్యాల్లో గంగమ్మ ప్రస్తావన వస్తుంది. శ్రీ శ్రీనివాసులు రెడ్డి ఈ ఐతిహ్యాలను 30 రకాలుగా విభజించారు (ఊర్లకు సంబంధించినవి, శబ్దాలకు సంబంధించినవి, దారులకు సంబంధించినవి, కొండలకు కోనలకు సంబంధించినవి, గుహలకు సొరంగాలకు సంబంధించినవి, దేవతలకు సంబంధించినవి, ప్రసాదాలకు సంబంధించినవి వగైరా). కొన్ని కతలు పేర్లకి సంబంధించినవి. కొన్ని కతలు ఆచారాలకి సంబంధించినవి. వేంకటేశ్వరుడి పుట్టుక నుంచి ఆయన్ని సేవించుకొనే భక్తుల వరకూ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరనుండి తాతయ్య గుంటపై గంగమ్మ వరకూ, శ్రీవారు వేసుకొనే చెప్పుల దగ్గరనుండి, ఆయనకు ఇష్టమైన ప్రసాదాల వరకూ అన్నిటి గురించీ చాలా కతలు ప్రచారంలో ఉన్నాయి.

చెప్పుల విషయానికొస్తే, వేంకటేశ్వర స్వామికి ఏడాదికొకసారి కొత్త చెప్పులు బహూకరిస్తారట (స్వామి భక్తుల బాగోగులు చూడడానికి తిరుగుతాడు కాబట్టి ఆయన పాత చెప్పులు కొత్త చెప్పులు వచ్చే సమయానికి అరిగిపోయి ఉంటాయట). ఐతే ఆ కొత్త చెప్పులు రెండూ రెండు చోట్ల తయారవుతాయట – ఒకటి కాళహస్తి ప్రాంతంలో, ఇంకొకటి కంచిప్రాంతంలో. ఇంత దూరంగా చేసినా, స్వామి వారి మహిమవల్ల రెండిటి కొలతా ఒక్కలాగే ఉంటుందట.

లడ్డూల కతేమిటంటే, పద్మావతీదేవి వరాహ స్వామి ఆలయంలో లడ్డులు పంచుతుంటే ఆటవికుడిగా పెరిగిన శ్రీనివాసుడికి ఆ నాగరికుల ఫలహారం నచ్చిందట. అందుకే అది ఆయనకు ప్రియమైన ప్రసాదమయ్యిందట. ఆది ఒక కత ఐతే ఇంకో కతలో ఇంత రుచులు మరిగిన వేంకటేశ్వరుడూ దక్షిణ మాడలో గుగ్గిళ్ళు అమ్ముకొనే అవ్వ దగ్గిర నాలుగు దముళ్ళు(?)కు గుగ్గిళ్ళు తిని డబ్బులడిగినప్పుడు ఇవ్వకుండా జారుకున్నాడట. ఆ అవ్వ డబ్బులడుగుతుందేమోనన్న భయంతో ఇప్పటికీ ఊరేగింపులప్పుడు దక్షిణ మాడలో గుర్రపుసాల వద్ద మేళతాళాలాపేసి స్వామిని నిశ్శబ్దంగా తీసుకుపోతారట.

తిరుపతిలో ఉన్న పలురకాల ఆలయాలు, విగ్రహాలు, వేంకటేశ్వరునికి చేసే వివిధ సేవలు, తిరుమలలో ఉన్న శ్రీవారి ఐదు మూర్తుల వెనుక కథలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. మూలవిరాట్‌కు ముందు ఉన్న గడపను కులశేఖర పడి అని ఎందుకు పిలుస్తారు, బేడీ ఆంజనేయస్వామికి బేడీలు ఎవరు వేశారు, కొండలమీద తొండమానుడు, కుమ్మరదాసుడు కురువత్తి నంబి ఎవరు, గుడితలుపులు గొల్లకులస్తులే ఎందుకు తెరుస్తారు, పారువేటలో స్వామికి పడిశం ఎందుకు పడుతుంది, భక్తులు గుండు చేయించుకొనే ఆచారం ఎలా మొదలయ్యింది వంటి ఎన్నో ప్రశ్నలకు ప్రాంతీయంగా ప్రచారంలో ఉన్న సమాధానాలు తెలుస్తాయి.

ఈ కథల్లో కొన్నిట్లో స్వామి మహిమాన్వితుడయినా, చాలా కథల్లో ఆయన సామాన్య మానవుడిగానే ప్రవర్తిస్తాడు. అందరితో కలసి ఆడుతాడు, పాడతాడు. ఆకలిదప్పులు అనుభవిస్తాడు. ఆడువారితో ఆనందిస్తాడు. అక్కచెల్లెళ్ళ పట్ల ఆదరం చూపిస్తాడు. తనకు సాయం చేసినవారిని గుర్తు పెట్టుకొని వారికి మేలు చేస్తాడు. విసిగించిన వారిని ఇబ్బంది పెడతాడు.

”శిష్టులు శ్రీవారికి పట్టు పీతాంబరాలు కట్టి, ఆభరణాలు తొడిగి, కిరీటాన్ని పెట్టి సుగంధ పరిమళాలను వెదజల్లి గంభీర స్వరూపాన్ని ఆవిష్కరిస్తే, జానపద మనస్తత్వం కలిగిన సామాన్య మానవులు వెంకన్నకు పంచెకట్టి, తలపాగ చుట్టి, తుండుగుడ్డ భుజంపై వేసి, చేతికి కర్రనిచ్చి, అచ్చు మన పల్లెటూరి రైతును చేసేశారు. నిజం చెప్పాలంటే శిష్టులు వేంకటేశ్వరుని భయభక్తులతో దూరంనుండి ఆరాధిస్తే, జానపదులు మాత్రం ప్రేమానురాగాలతో వెంకన్నను తమలో ఒకడిగా భావించి తమకున్న లక్షణాలను, ఇష్టాలను, శృంగారాలను స్వామి వారికి అంటకట్టి ఆనందపడ్డారు, ముసి ముసి నవ్వులతో మురిసిపోయారు,” అంటారు శ్రీ శ్రీనివాసులు రెడ్డి.

దాదాపు పేజీకొక్కటి చొప్పున ఫొటొలున్నాయి ఈ పుస్తకంలో. ఫొటొలు కూడా శ్రీనివాసులు రెడ్డిగారే తీశారట. ముఖచిత్రంపై ఉన్న ఫొటోల నాణ్యత, లోపలి ఫొటోల్లో లోపించింది. కాగితం కారణమో, రంగుల ఫొటోలను నలుపుతెలుపుల్లో ముద్రించటం వల్లనో లేక ముద్రణాలోపమో కాని చాలా ఫొటొలు స్పష్టంగా లేకపోవటంతో రచయిత పడ్డ శ్రమకు తగిన ఫలితం రాలేదనిపించింది.

శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికి ఈ విషయంపై ఉన్న ఆసక్తిని, సేకరించడానికి పడ్డ శ్రమను, క్రోడీకరించి ఒక సమగ్రరూపం ఇవ్వటంలో చూపిన శ్రద్ధను, ఈ పుస్తకం ప్రచురించటానికి చేసిన కృషిని అభినందించాలి. దేవుడిపై భక్తి, ఆచారాలపై మక్కువ ఉన్న వారికి తాము ఆరాధించే, ఆచరించే అనేక విషయాల గురించి ఈ పుస్తకం ద్వారా వివరాలు తెలుస్తాయి. భక్తి ఉన్నా లేకపోయినా జనజీవనం పైనా, జానపద కథలపైనా కుతూహలం ఉన్న వారికి కూడా ఈ పుస్తకం ఆసక్తిగా ఉంటుంది.

కొండ కతలు
(తిరుపతి ఐతిహ్యాలు /Hill Tales)
డా. పేట శ్రీనివాసరావు (డా. పేటశ్రీ)
ప్రచురణ: 2003
రుషితేజ పబ్లికేషన్స్, 418, బండ్ల వీధి, తిరుపతి, 517501

ప్రతుల కోసం:
డా. పేట శైలజ, 418, బండ్ల వీధి, తిరుపతి, 517501

224 పెజీలు; 100 రూ.

You Might Also Like

7 Comments

  1. sangareddy durga rao

    sir i want this book..how i will purchase this book..i am from vijayawada.is there any book stall purchase this book in vijayawada…

  2. ప్రసాద్

    Please send me bookstall details, i want to purchase this book.

  3. dwarakanatha reddy

    meeru konda kathalu boook gurinchi chala chakaga sameeshicharu enno vela mila dooramlo unna meeku maa uri book intha nachadam tirupati vadiga ee book publisher ga mee abhiprayalu chala anamdam kaliginchidi
    eelanti manchi pustakalani parichayam chasinandku chala thanks

    namesthe
    Dwarakanatha reddy
    Tirupati.

    1. M .viswanadhareddy

      gd mrg sir me cell number ebbandi sir nadi tpt

  4. కొత్తపాళీ

    చాలా బావుంది. పుస్తకం తెప్పించుకోవాలి

  5. ఆర్ ఎం ఉమామహేశ్వరరావు

    జంపాలగారి పరిచయం బావుంది. తిరుమల అనగానే వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, ఆ గుడితో, గుడిలోని దేవుడితో ప్రజలు పెనవేసుకున్న బంధం కూడా. కొండ కతల్లో కనిపించేది ఇదే. దేవుణ్ణి కొండ మీది గుడిలోంచి లాక్కొచ్చి తమ గుడిసెలోని మనిషిగా మార్చుకుని కతలల్లుకుంటారు. తమ కష్టసుఖాల్లో దేవుణ్ణీ భాగం చేస్తారు. ఇవన్నీ నిజాలు కానక్కరలేదు. కానీ హాయిగా ఉంటాయి. పేటశ్రీ కొండ కతల్ని పుస్తకం.నెట్ లో పరిచయం చేసినందుకు జంపాలగారికి అభినందనలు.

    1. M .viswanadhareddy

      ee pustakam andubatulo ledu bahusa me daggara vuntundani anukunta copy kavali sir estey scanchesukogalanu

Leave a Reply