శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.2: సభాపర్వం

రాసిన వారు: మల్లిన నరసింహారావు
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు)
*********************
(సభా పర్వ పరిచయం లో ఇది మూడో వ్యాసం. మొదటి వ్యాసం ఇక్కడ, రెండో వ్యాసం ఇక్కడా చదవండి. ఆ తరువాత..)

భీష్ముని సలహాపై ధర్మరాజు రాజసూయయాగంలో శ్రీకృష్ణునికి అగ్రాసనం ఇచ్చి అర్ఘ్యం ఇస్తాడు. అప్పుడు శిశుపాలుడు దానికి అభ్యంతరం లేవనెత్తి ధర్మరాజును ఆక్షేపిస్తాడు.

అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ
దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాధ! గాంగేయు దు
ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్ వార్ష్ణేయుఁ బూజింప నీ
యవివేకం బెఱింగించి తిందఱకు: దాశార్హుండు పూజార్హుఁడే 2-2-8

( ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజు లుండగా, విశేషంగా పూజించదగిన పెద్దలు , బ్రాహ్మణులు పెక్కుమంది ఉండగా, భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి, వృష్ణి వంశంవాడు, చెడు ప్రవర్తన కలవాడు అయిన శ్రీకృష్ణుని పూజించి, నీ తెలివితక్కువతనాన్ని తెలియజేసావుగాని – ఆ దాశార్హుడు పూజార్హుడా?)

యాదవులు యయాతి శాపంచేత రాజ్యానర్హులు. ఆ యాదవవంశాల్లో వృష్ణివంశం ఒకటి. దశార్హవంశం మరొకటి. రాజ్యానర్హుడై, తక్కువజాతికి చెందిన వృష్ణివంశం వాడు, చెడుప్రవర్తన కలవాడు అయిన శ్రీకృష్ణుని పూజించటం తగునా అని అధిక్షేపం.

కడుకొని ధర్మతత్త్వ మెఱుఁగంగ నశక్యము: ధర్మబాహ్యు ని
న్నొడఁబడ నిష్టుఁడై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ
న్జడునకుఁ బూజ యిమ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్
వెడఁగుదనంబునం బనిచె: వృద్ధులబుద్ధులు సంచలింపవే. 2-2-9

(ధర్మతత్త్వాన్ని తెలుసుకోవటం అసాధ్యం. భీష్ముడు ఆలోచన సరిగా లేనివాడు. అందుకే ఎందరో మహానుభావులు ఈ సభలో ఉంటే, అవివేకంగా ఆ శ్రీకృష్ణుడనే బుద్ధిహీనునికి అర్ఘ్యం ఇమ్మని, ధర్మ బాహ్యుడివైన నిన్ను సమ్మతింపజేసాడు. వృద్ధుల బుద్ధులు నిలకడగా ఉండవు కదా!)

శిశుపాలుడుకి మరణం ఆసన్నం కావటం చేత భగవంతుడైన శ్రీకృష్ణుడిని నిందించటం మొదలుపెట్టాడు. ఇంకా ఇలా అంటున్నాడు.

ఇతనికిఁ గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక. మహాత్ములైన భూ
పతులయు విప్రముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే ? 2-2-10

(శ్రీకృష్ణునికి మీరు స్నేహితులయితే ఒంటరిగా మీ ఇంటికి పిలిచి ధనమిస్తే ఇవ్వండి. ఆయనకు ప్రీతికరాలయిన పనులు మనసార చేస్తే చెయ్యండి. ఇష్ఠుడు కదా అని పోషిస్తే పోషించండి. అంతేకాని, మహాత్ములైన మహారాజులు, బ్రాహ్మణశ్రేష్ఠులు ఉండే ఈ మహాసభలో – శాస్త్రంలో చెప్పబడిన ఈ గొప్పపూజ – పొందటానికి ఏమాత్రం యోగ్యత లేని అతణ్ణి యోగ్యుడని పూజించటం ఏం న్యాయం?)

-కాదని భావం. ఈ పద్యం లోని వాక్యాలు తెలుగువారి నిత్యవ్యవహారికంలో చోటు చేసుకున్నాయి.

ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే! వసుదేవుఁ డుండంగ వసుమతీశ!
ఋత్విజుండని విచారించి పూజించితే! ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి;
యాచార్యుఁడని వినయమునఁ బూజించితే! కృతమతుల్ ద్రోణుండుఁ గృపుఁడు నుండ;
భూనాథుఁ డనియెడు బుద్ధిఁ బూజించితే! యాదవుల్ రాజులే యవనిమీఁదఁ;
బూజనీయులైనపురుషులలోపల! నెవ్వఁడయ్యెఁ గృష్ణుఁ ? డిట్టు లేల
పూజ్యులయినవారిఁ బూజింపనొల్లక ! భీష్ము పనుపుఁ జేసి బేల వయితి. 2-2-11

(ధర్మరాజా ! శ్రీకృష్ణుణ్ణి వృద్ధుడని గుర్తించి పూజించావా! సభలో ఆయన తండ్రి వసుదేవుడే వున్నాడు కదా ! ఋత్విజుడని ఆలోచించి పూజించావా! సభలో వేదవ్యాస మునీంద్రులే ఉన్నారు కదా ! గురువుగారని వినయంతో పూజించావా ! సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారుకదా! మహారాజు అనే బుద్ధితో పూజించావా ! భూమిమీద యాదవులు రాజులా! ఈ విధంగా పూజింపదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు ? పూజించవలసినవాళ్ళను పూజించక , భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుణ్ణి పూజించి మూఢుడి వనిపించుకున్నావు.)

మూఢునికి కాళిదాసు నిర్వచనం ‘మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః’ ఇతరులు చెప్పింది నమ్మే బుద్ధి కలవాడు. ఈ పద్యంలో ప్రతిపాదం పూర్వార్థం ఆరోహగతిలో, ఉత్తరార్థం అవరోహగతిలో సాగి అందగించింది.

చనఁ బేడికి దారక్రియ ! యును, జెవిటికి మధురగీతియును, జీకునక
త్యనుపమ సురూపదర్శన ! మును జేయుటఁ బోలు గృష్ణుఁ బూజించు టిలన్. 2-2-14

(ఈ భూమిమీద శ్రీకృష్ణుణ్ణి పూజించటం – నపుంసకుడికి పెండ్లిచేయటంలాంటిది. చెవిటివాడికి కమ్మనిపాట వినిపించటంలాంటిది. గ్రుడ్డివాడికి అందమైనరూపాన్ని చూపించటంలాంటిది.)

శిశుపాలుడీ విధంగా విమర్శించి, బుద్ధిమంతుడా! అని ధర్మరాజుని ఎత్తిపొడుపుగా సంబోధించి, ‘ఈ రాజశ్రేష్ఠులు ఇంతమంది నిన్ను చూసి నవ్వేటట్లు, ధర్మరాజనే నీ ప్రత్యేకనామం వ్యర్థం అయ్యేటట్లు ఈ విధంగా చేశావా ?‘ అంటూ ధర్మజ భీష్మ కృష్ణులను నిందిస్తూ కోపోద్రిక్తుడై సభలోనుంచి తనపరివారంతో సహా బయటకు వెళ్ళిపోయాడు. ధర్మరాజు అతని వెనుకనే వెళ్ళి అతనిని బుజ్జగిస్తూ

భూరిగుణోన్నతు లనఁదగు! వారికి ధీరులకు ధరణివల్లభులకు వా
క్పారుష్యము చన్నె? మహా ! దారుణ మది విషముకంటె దహనము కంటెన్. 2-2-17

(గొప్ప గుణాలచేత శ్రేష్ఠులని చెప్పదగినవాళ్ళకు, పండితులకు, ప్రభువులకు కఠినంగా మాట్లాడటం తగునా? మాట కాఠిన్యం విషం కంటె, అగ్నికంటె భయంకరం కదా!) ఎంత మంచి సూక్తి.

ఆదిజుఁడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు, వే
దాది సమస్త వాజ్ఞ్మయములందుఁ బ్రశంసితుఁడైన వాఁడు, లో
కాది, త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా
మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని; యుక్తమ కా కిది యేమి దోసమే? 2-2-18

(సృష్టికి మొదటపుట్టిన బ్రహ్మపుట్టుకకే స్థానమైనవాడు, వేదాలు మొదలైన మహా గ్రంథాలన్నింట కీర్తించబడేవాడు, లోకాలకే ఆద్యుడైనవాడు, ముల్లోకాలచే పూజింపదగినవాడు – అని తెలుసుకొని పితామహుడైన భీష్ముడు, శ్రీకృష్ణుణ్ణి పూజార్హుడని చెప్పాడు. ఇది ఉచితం కాక దోషమౌతుందా ఏమిటి?)

సృష్టికర్త యైన బ్రహ్మ విష్ణువు నాభికమలం నుండి పుట్టాడు. దామోదరుడు అంటే తులసిమాల ఉదరంపై కలవాడు.

పరమార్థ ప్రతిభఁ దమో ! హరు నచ్యుతు భీష్ముఁ డెఱిగిన ట్లెఱుగఁగ నీ
కరిది శిశుపాల! పెద్దల ! చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్? 2-2-19

(ఓ శిశుపాలా! పరమార్థ తత్త్వాన్ని దర్శించే ప్రతిభచేత అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు, పతనం లేనివాడు అయిన శ్రీకృష్ణుణ్ణి భీష్ముడు అర్థం చేసుకొన్నట్లు అర్థం చేసుకోవటం నీకు అసాధ్యం. ఎక్కడైనా మహాత్ముల చరిత్రను అల్పులు అర్థం చేసుకోగలరా!)

నీకంటె పెద్దలందరూ అతనిని గురుడని, జ్ఞానదాత అని ఒప్పుకొనగా కాదనటం నీకు తగునా? అంటూ శిశుపాలుని ఒప్పించే ప్రయత్నం ధర్మరాజు చేస్తుండగా, భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటాడు.

పాలిత దుర్ణయుండు శిశుపాలుఁడు బాలుఁడు ; వీని నేల భూ
పాలక నీకుఁ బట్టువఱుపన్? మఱి ధర్ము వెఱుంగ వీనికిం
బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య ల
క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాద శీలికిన్? 2-2-22

(ధర్మరాజా! శిశుపాలుడు పెచ్చుపెఱిగిన చెడునడత కలవాడు; పరిపక్వంకాని బుద్ధికలవాడు. ఇలాంటి వీడికి చెప్పి ఒప్పించే ప్రయత్నం నీవు ఎందుకు చేస్తావు? అంతేకాదు, ఇతడు అసూయాక్రోధాలకు వశమైన మనస్సు కలవాడు. కొద్దిపాటి రాజ్యలక్ష్మిచేతనే మదించి వివక్షను కోల్పోయిన బుద్ధి కలవాడు. కారణం లేకుండానే మహాత్ములను నిందించే స్వభావం కలవాడు. ఇలాంటి వీడికి ధర్మతత్త్వం తెలుసుకోవటం సాధ్యమవుతుందా?)

-సాధ్యం కాదు. అని ధర్మరాజును వారించి భీష్ముడు శిశుపాలునితో మూర్ఖుడా ఈ సభలోని రాజులంతా ఆయన దయతో జరాసంధుని చెఱ నుండి విడిపించబడినవాళ్ళు మరియు అతని చేతిలో ఓడి అతనిని శరణు పొందినవాళ్ళూను. అలాకాని వారెవ్వరో చెప్పు.

ఉత్తమ జ్ఞానవృద్ధు నా నుండెనేని! బాలుఁడయ్యును బూజ్యుండు బ్రాహ్మణుండు:
క్షత్రియుఁడు పూజ్యుఁ డమిత విక్రమసమృద్ధి! నుర్విపతులలో నధికుడై యుండె నేని. 2-2-25

(ఉత్తమ జ్ఞానంచేత గొప్పవాడయితే, వయస్సుచేత బాలుడయినా బ్రాహ్మణుడు పూజింపదగినవాడే. అపరిమితమైన పరాక్రమంతో రాజుల్లో అధికుడైతే క్షత్రియుడు పూజార్హుడౌతాడు.) నన్నయ్య రుచిరార్థసూక్తి.

వృద్ధు లొక లక్ష యున్నను! బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింపంగా;
నిద్ధరణీశులలో గుణ ! వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్. 2-2-27

(వయస్సుచేత వృద్ధులైనవాళ్ళు ఒక లక్షమంది ఉన్నా – ఎవరినైనా వాళ్ళ జ్ఞానాన్ని బట్టే పూజిస్తాం.– రాజులందరిలో గుణంచేత గొప్పవాడనే శ్రీకృష్ణుణ్ణి భక్తితో పూజించాం.)

ష్ముని మాటలు ఆ సందర్భానికి తగినవే కాకుండా ఎల్లవేళలా సత్యాలని అనిపించేవి. భీష్ముడు ఇంకా శ్రీకృష్ణుని గొప్పతనాలనేకం పొగుడుతాడు. అప్పుడు సహదేవుడు ‘దీనిని కాదనే వారి శిరసు మీద నా కాలు వేసి తొక్కుతాను’ అని భీషణంగా ప్రతిజ్ఞ చేస్తాడు. భీష్ముడు శిశుపాలునితో కృష్ణుడు సింహం లాంటి వాడని అతన్ని ఎదిరించటం ఎవ్వరికీ సాధ్యం కాదనీ అంటాడు. ఇంకా కొన్ని దూషణలు చేసిన తర్వాత నూఱు తప్పులు నిండగానే శ్రీకృష్ణుడి చక్రాయుధంతో శిశుపాలుడు మరణిస్తాడు. అప్పుడు

ప్రల్లదమేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాది తుల్యుఁడై
త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం
బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయో
త్ఫుల్ల విశాలనేత్రు లయి భూపతులెల్లను జూచుచుండగన్. 2-2-69

(నిందిస్తూ మాట్లాడుతున్న శిశుపాలుని నోరు మూతపడింది. రాజులంతా ఆశ్చర్యంతో కళ్ళంతా పెద్దవి చేసుకొని చూస్తుండగా – శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా క్రింద పడింది. ఆ కళేబరం నుంచి ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది.)

You Might Also Like

One Comment

  1. పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.3: సభాపర్వం

    […] రెండో వ్యాసం ఇక్కడ,  మూడో వ్యాసం ఇక్కడా చదవండి. ఆ […]

Leave a Reply