శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2: సభాపర్వం

రాసిన వారు: మల్లిన నరసింహారావు
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు)
*********************
ఆది పర్వం పూర్తయి సభాపర్వం లోనికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఓ చిన్న విషయం. వ్యాస భారతంలో ఆదిపర్వానికి ఉన్న శ్లోకసంఖ్య 9984. ఆంధ్రమహాభారతంలో ఉన్న పద్య గద్యాల సంఖ్య 2084. అలాగే సభాపర్వంలోని సంస్కృత భారత శ్లోక సంఖ్య 4311, ఆంధ్రభారతం లోని గద్యపద్యాల సంఖ్య 2894.

సభాపర్వం లోని కథే తరువాత జరగబోయే మహాభారత యుద్దానికి ప్రాతిపదిక అవుతుంది. నన్నయ్యగారి సభా పర్వంలో రెండు ఆశ్వాసాలు ఉన్నాయి. మొదటి అశ్వాసంలో ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజ సభాభవన నిర్మాణం, ధర్మరాజు నారద ప్రేరేపితుడై రాజసూయయాగం చేసే ప్రయత్నాలు, పాండవ దిగ్విజయం వగైరాలు వర్ణించబడినవి. రెండవ ఆశ్వాసంలో రాజసూయయాగ పరిపూర్తి, కౌరవ సభకు పాండవులు ద్యూతక్రీడకు ఆహ్వానించబడి మాయా ద్యూతంలో సర్వస్వం ఒడ్డి ఓడిపోవటం, ద్రౌపదీ పరాభవం, పునరుద్యూతం మళ్ళీ పాండవులు ఓడిపోయి అరణ్య అజ్ఞాత వాసాలు చేయటానికి బయల్దేరటం వంటి కథాభాగాలు ఉన్నాయి. భారతానికి ఆయువుపట్టు అనదగ్గ ద్యూతక్రీడ, దాని పర్యవసానాలు పాండవ ప్రతిజ్ఞలు వగైరా బహు రమ్యంగా వర్ణించబడినాయి ఈ సభాపర్వంలో.

ఖాండవ వన దహనానంతరం దానిలో అర్జునునిచే ప్రాణాలు రక్షింపబడిన దానవ విశ్వకర్మ అయిన మయుడు పాండవులు, కృష్ణుడు ఉన్నచోటికి వచ్చి తాను కృతజ్ఞతా పూర్వకంగా పాండవులకు కావలసిన ఎటువంటి భవన నిర్మాణాన్నయినా చేసి ఇవ్వగలనని చెపుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక సుందరమైన సభాభవనాన్ని ధర్మరాజుకు కానుకగా నిర్మించి ఇవ్వమంటాడు మయుడిని. అప్పుడు మయుడు కృష్ణునితో–

ఇమ్మనుజేంద్రుఁ డింద్ర దనుజేంద్రులకంటె మహావిలాస సౌ
ఖ్యమ్ములఁ బెద్ద యిద్ధరణిఁ గావున, నీతని పేర్మికిం దగన్
నెమ్మి నొనర్చెదన్ సభ మణిప్రభ నొప్పఁగ, దేవతా విమా
నములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడఁగన్.2-1-7

(వైభవంలో, భోగానుభవంలో, దేవేంద్ర రాక్షసేంద్రులకంటె మనుజేంద్రుడైన ధర్మరాజే ఈ ధరమీద మిన్న. ఆయన గొప్పదనానికి తగ్గట్లు, దేవతల మేడలైనా ఇంత బాగుంటాయా అని జనమంతా దానినే మెచ్చిచూచేటట్లు, మణుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసార నిర్మించి ఇస్తా.) అంటాడు.

బిందుసర సరోవరంలో దాచి ఉంచబడిన రత్నాలతో కూడిన నిర్మాణ సామాగ్రి నుపయోగించి అక్కడే అనేక రత్నమాణిక్యాలతో మయసభా నిర్మాణం కావించాడు మయుడు. నవరత్నాలతో పొదగబడ్డ ఆ మయసభ ఎన్నోవింతలు విశేషాలతో అలరారుతుంది. ఈ మయసభను 14 నెలలపాటు నిర్మించి మహాబలులైన 8000 మంది రాక్షసకింకరుల చేత మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడట మయుడు. తన దగ్గఱ ఉన్న గొప్ప గదా దండాన్ని భీమునకు దేవదత్తం అనే పేరుగల శంఖాన్ని అర్జునునికి ప్రీతితో ఇచ్చాడు. ఆరోజుల్లో ఉన్న సాంకేతిక విలువలు ఎంతగొప్పవో మనం ఈ ఘట్టం మూలంగా ఊహించుకోవచ్చు.

నవరత్నాలు 9: ఇంద్రనీలం, పద్మరాగం, వైదూర్యం, వజ్రం, మౌక్తికం, గోమేధికం, మరకతం, పుష్యరాగం, ప్రవాళం.

ధర్మరాజు మయసభా గృహప్రవేశానంతరం—

మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి, ముదమొప్పం గాంచి, ర
య్యుదయాస్తాచల సేతుశీతనగ మధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్. 2-1-19

(నేల నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులంతా – ఎడతెగక వృద్ధిపొందే సంపదకలవాడు, లోకమంతటా నిండిన పరాక్రమంచేత ఔన్నత్యం వహించినవాడు అయిన ధర్మనందనుని సంతోషంతో దర్శించుకొన్నారు. మదపుటేనుగుల్ని, గుఱ్ఱాల్ని, బంగారాన్ని, మాణిక్యాలను, వేశ్యలను కానుకలుగా సమర్పించుకొని మనసార ఆ మహారాజుని సేవించు కొన్నారు.)

నన్నయ్య అక్షరరమ్యత ఈ పద్యంలో ప్రస్ఫుటమవుతుంది. అంతేకాక ఆ సభకు వచ్చిన మహామహుల పేర్లు చూడండి.

సుబల మార్కండేయ శునక మౌం ! జాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ ! గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్య గోపతి గోప ! వేష మైత్రేయ పవిత్రపాణి
ఘటజాను కాత్రేయ కఠకలాప సుమిత్ర ! హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య
వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని ! శుక సుమంతు పైల సువ్రతాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు ! రమ్యమయిన ధర్మరాజుసభకు. 2-1-21

అంతమంది మహామునులు ఉగ్రశ్రవసుడూ అంతా కలసి ధర్మరాజు సభను దర్శించారట. అప్పుడు మహాత్ముడైన నారద మహర్షి కూడా అక్కడకు వచ్చాడట. ఆయన రాకను వర్ణించి చెప్పిన పద్యం క్రిందిది.

నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి
స్ఫేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబుననుండి సురేంద్రమందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్. 2-1-23

(సూర్యు డేల నేలకు దిగి వస్తున్నాడో ! అని తన దేహకాంతిని చూచి జనులంతా ఆశ్చర్యపడుతుండగా – నారదమహర్షి, ఆకాశం నుండి – దేవేంద్రుని గృహశోభనే గేలిచేసే ధర్మరాజు గృహానికి ఎంతో ప్రీతితో వచ్చాడు.)

వచ్చి ధర్మరాజును రాజనీతి విషయాలను కొన్నింటిని ఈ క్రింది విధంగా అడుగుతున్నాడు. ఈ రాజనీతికి సంబంధించిన విషయాలు ఆ రోజులకే కాక ఈరోజులకు కూడా ఉపయోగపడేవే. అవి ఏమేమిటో చూద్దాం రండి.

మీ వంశమున నరదేవోత్తములదైన ! సద్ధర్మమార్గంబు సలుపుదయ్య?
ధర్మవిదుండవై ధర్మార్థకామంబు ! లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గా లీల సేవింతె ? ! ధర్మువునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపరరాత్రమ్ములం దెప్పుడుఁ ! జింతింతె నిజబుద్ధి జేయఁదగిన
రాజకృత్యములఁ ? దిరంబుగా నిఖిల ని ! యోగ వృత్తులందు యోగ్యులయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె ! నీవు వారిదైన నే ర్పెఱింగి. 2-1-26

(మీ వంశంలో జన్మించిన రాజశ్రేష్ఠులు ఏర్పఱఛిన ధర్మపద్ధతిని తప్పక ఆచరిస్తున్నావు కదా ! ధర్మాన్ని తెలుసుకొని, ధర్మార్ధకామాలు ఒకదాని నొకటి బాధించకుండ, కాలోచితాలుగా వాటిని విభజించుకొని సేవిస్తున్నావు కదా ! ధర్మమందే మనస్సు నిలిపి, చేయదగిన రాజకార్యాల్ని స్వబుద్ధితో ఎల్లప్పుడూ అర్థరాత్రి దాటిన తఱువాతే ఆలోచిస్తున్నావు కదా ! ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరంగా యోగ్యులైన వాళ్ళను, వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలని గుర్తించి గౌరవభావంతో, స్థిరంగా నియమించావు కదా !).

రాజు యొక్క కర్తవ్యాలను ప్రశ్నల రూపంలో ఎంతందంగా నారదుని చేత చెప్పించారో చూడండి. అర్థకామాలను ఎప్పటికీ ధర్మబద్ధంగానే సాధించుకోవలసి ఉంటుంది కాని ఆ అర్థకామాలు సాధించు కోవటానికి అవలంబించే మార్గాలు ధర్మానికి విరుద్ధంగా ఉంటే మొత్తానికే ముప్పు వాటిల్లుతుంది. మనకూ మన దేశానికీ ఈ ధర్మపరిరక్షణే ఆలంబనంగా నిలుస్తోంది అన్నికాలాల్లోనూ. మనిషికి మోక్షసాధనకు మొడటి మెట్టు ధర్మమే.

అనఘుల శాస్త్ర విధిజ్ఞుల ! ననురక్తులఁ బితృపితామహక్రమమున వ
చ్చిన విప్రుల మంత్రులఁగా ! నొనరించితె కార్య సంప్రయోగము పొంటెన్. 2-1-27

(పుణ్యాత్ములు, శాస్త్రనియమాలు బాగా తెలిసినవాళ్ళు, నీమీద ప్రేమగలవాళ్ళు, తాతతండ్రులనాటి నుండి వంశపారంపర్యంగా కొలువుచేస్తున్నవాళ్ళు అయిన బ్రాహ్మణోత్తముల్ని రాజకార్యనిర్వహణకు మంత్రులుగా ఏర్పరచుకొన్నావుకదా!).

You Might Also Like

8 Comments

  1. పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.2: సభాపర్వం

    […] లో ఇది మూడో వ్యాసం. మొదటి వ్యాసం ఇక్కడ, రెండో వ్యాసం ఇక్కడా చదవండి. ఆ […]

  2. కామేశ్వర రావు

    బహుశా భగవద్గీతలో ఎక్కువగా కనిపించే “పార్థా” అన్న సంబోధన వల్ల అర్జునుడికి పార్థుడు అన్న పేరు ప్రసిద్ధమైనదేమో! అరణ్యపర్వంలో దుర్యోధనుడి ప్రాయోపవేశ ఘట్టంలో ఒక పద్యంలో, “సన్మతుల పృథాతనూజుల నమానుషతేజుల” అని కుంతీసుతలనే కాక మొత్తం పాండవులందరినీ పృథాతనూజులనడం గమనించవచ్చు.
    సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం. తిక్కనగారి “సింగంబాకటితో” పద్యంలో అర్జునుణ్ణి “కుంతీసుత మధ్యముడు” అన్నాడని కొందరు ఆక్షేపిస్తారు కాని మరి కొన్ని చోట్ల కూడా పాండవులందరినీ కుంతీసుతులనడం తెలుగు భారతంలో ఉంది. సంస్కృత భారతంలో కూడా ఉందేమో నాకు తెలియదు.

  3. నరసింహారావు మల్లిన

    నాగమురళి గారి అభిప్రాయమే నాది కూడా.పృథాతనూజుడు కావున ధర్మరాజును కూడా నన్నయ గారు పార్థుడు అని వ్యవహరించారు.

  4. జంపాల చౌదరి

    కృతజ్ఞతలు. అర్జునుణ్ణి తప్ప మిగతా ఇద్దరు కుంతీసుతులని పార్థులుగా పేర్కొన్నట్టు ఇంతకు ముందు చదివిన గుర్తు లేదు.

  5. నాగమురళి

    పార్థుడు అంటే పృథ(కుంతి) యొక్క కుమారుడు అని కదా అర్థం. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ పార్థుడు అంటే యుధిష్ఠిరుడే. మాఘకావ్యంలో కూడా యుధిష్ఠిరుణ్ణి పార్థుడిగా పేర్కొనడం కనిపిస్తుంది –

    ఇయక్షమాణేనాహూతః పార్థేనాథ (పార్థేన + అథ) ద్విషన్మురమ్ – (తరువాత, యజ్ఞము (రాజసూయము) చేయగోరుచున్న పార్థునిచేత పిలువబడినవాడై, కృష్ణుడు…. )

  6. పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి-2.1: సభాపర్వం

    […] (సభా పర్వ పరిచయం లో మొదటి వ్యాసం ఇక్కడ చదవండి. ఆ […]

  7. జంపాల చౌదరి

    2-1-23 పార్థు గృహంబు అంటే అర్జునుడి ఇల్లు అని కదా?

Leave a Reply