మౌలిక పరిశోధనాఫలితాలు: ఏల్చూరి సాహిత్యవ్యాసాలు
వ్యాసకర్త: సూర్యదేవర రవికుమార్
*************
వేయి సంవత్సరాల తెలుగు కావ్యప్రపంచంలో వేలకొలది కావ్యాలు ఆవిర్భవించాయి. వాటిని రచించిన కవులు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఈ కాలాన్ని ప్రాచీనం, ఆధునికం అని వింగడించుకొంటే కందుకూరి వీరేశలింగం గారి పూర్వులు ప్రాచీనులనీ, కందుకూరి వారితో ఆధునిక కవిపరంపర ప్రారంభమైనదనీ స్థూలంగా అనుకోవచ్చు. నా లెక్కకు వచ్చిన ప్రాచీన తెలుగు కవులు 1565 మంది ఉన్నారు. వీరు కాక కాలవాహినిలో పడి కనుమరుగైనవారెందరో! ఇక ఆధునికులు అసంఖ్యాకులు. “దేవు నాన మున్ను దేశాని కొక కవి, యిప్పు డూర నూర నింట నింట, నేవు రార్గు రేడు నెనమండ్రు తొమ్మండ్రు, పదుగురేసి కవులు పద్మనాభ!” అన్న చాటువే దీనికి నిదర్శనం. ఇందరు కవులు సృజించిన కవిత్వసంపద ఎన్ని బండ్లకెత్తదగినదో అనూహ్యము. తాళపత్రాలలో నిక్షేపించబడిన ప్రాచీనుల కవితాసంపుటాలు కాలక్రమంలో మూలప్రతులకు పుత్రికలు సమకూర్చనందున, క్రిమికీటకాలకు, అగ్నిప్రమాదాలకు, వరదలకు, ప్రజల వలసలకు, అశ్రద్ధకు, ఇతర కారణాలకు అనేకం నష్టమైనాయి. సుమారు రెండు వందల సంవత్సరాల పూర్వం కాగితం మీద ముద్రణ సౌకర్యం సమకూడిన తర్వాత కూడా నేటికీ అనేక ప్రాచీనరచనలు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాలలో అసూర్యంపశ్యలుగా కొనఊపిరితో నిలిచి ఉన్నాయి. ముద్రిత కావ్యాలలో కూడా పునర్ముద్రణ భాగ్యానికి నోచుకోక కొన్ని,అనాదరణతో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఆధునిక కవుల కవితాసంపుటులు కూడా ఇదే స్థితిలో ఉంటున్నాయి. వేగంగా మారుతున్న కాలపరిస్థితులు, కరిగిపోతున్న మాతృభాషాభిమానం రానున్న తరాలలో తెలుగు కవిత్వసంపదను ఎంత వరకు రక్షిస్తాయో ఊహాతీతంగా ఉంది.
ఈ స్థితిలో వివిధరూపాలలో లభ్యమౌతున్న తెలుగు కవిత్వసంపదను గుర్తించి, సేకరించి, అనుభవించి, ఆ అనుభవాలను ఇతరులకు పంచే మహనీయులు లేకుంటే ఆ సంపద అంతరించే ప్రమాదం ఉన్నది. గతశతాబ్దంలో మహనీయులనేకులు ఆ సంపదను పెంచి ఎందరికో పంచిపెట్టారు. నేడు ఆ స్ఫూర్తిని నింపుకొన్నవారిలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు ఒకరు.
డాక్టర్ మురళీధరరావు గారు గుంటూరులో అభ్యుదయ కవులలో నిన్నటి తరంలో సుప్రసిద్ధులైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారులు. సంస్కృతాంధ్రాంగ్లభాషలలో నిష్ణాతులు, కవి, బహుగ్రంథకర్త. విశిష్ట పరిశోధకులు. వీరి పరిశోధనావ్యాసాలు “వాఙ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్ని విశేషాంశాలు” పేర ఇటీవల వెలుగుచూశాయి. ఆ వ్యాస సంపుటిని గురించిన పరిచయవాక్యాలు ఇవి.
ఈ సంపుటిలోని మొదటి వ్యాసం ఒక్కటి చదివితే చాలు – ఏల్చూరి వారి భాషాపటిమను, ప్రతిభాపాటవాలను, పరిశోధనారీతిని పసికట్టటానికి. ఇందులో చిత్రవిచిత్రకవితారీతులలో రచించబడిన ప్రాచీనకవుల కొన్ని పాషాణపాక, గూఢార్థపద్యాలకు వీరు చేసిన వ్యాఖ్యలు, వివరణలు, సవరణలు, అన్వయాలు పాఠకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. అవి చదివి ఆనందించవలసినవే.
ఘంటసాల వారి కంఠం ద్వారా యావదాంధ్రప్రజలకు పరిచయమైన నన్నయ్య మహాకవి మహాభారతంలోని “ధారుణి రాజ్యసంపద మదంబున…”; “కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులనేకుల్…” అని సాగే పద్యాలలోని శాబ్దికచిత్రాలకు మూలాలు వేణీసంహారం, ప్రచండ పాండవం అన్న సంస్కృత నాటకాలలోని శ్లోకాలలో ఉన్నవని ఏల్చూరి వారు నిరూపించినప్పుడు, నన్నయ భారతానికి క్రీ.శ. 1670 ప్రాంతాలలో చంద్రశేఖర భట్టు అనే సంస్కృత పండితుడు సంస్కృతానువాదం చేశాడని తెలిపినప్పుడు – ఏ సాహిత్యపాఠకునికైనా ఎద పులకరించక మానదు.
నన్నెచోడుని పద్యభావాలను తెనాలి రామలింగకవి తన కందర్పకేతువిలాసములో స్వీకరించిన విషయాన్ని గుర్తించి, ఆ విషయమై ఏల్చూరి వారు చేసిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కాలగతిలో ఎంతో కొంత అనుకరణ లేని సాహిత్యసృష్టి అసాధ్యమనే చెప్పాలి. లక్షణ గ్రంథాల ద్వారా, సంకలన గ్రంథాల ద్వారా ఉపలబ్ధమై పూర్తి ప్రతి లభించని నన్నెచోడుని కళావిలాసములోని పద్యాలను గురించిన విస్తృతమైన చర్చకు ఏల్చూరి వారు ఎన్నో తాళపత్ర, ముద్రిత గ్రంథాలను సంపాదించి విశేషశ్రమ చేశారు. ఈ వ్యాసంలోనే సంస్కృతకవి క్షేమేంద్రుని కళావిలాసము తెలుగు కవులను ఎంతగా ఆకర్షించిందో వివరించబడింది.
హాలుని గాథాసప్తశతిని తాను అనువదించినట్లు శ్రీనాథుడు చెప్పుకున్నాడు కానీ, అది మనకు పూర్తిగా లభించలేదు. శ్రీనాథునివిగా చెప్పబడుతున్న సప్తశతి పద్యాలు అవి శ్రీనాథునివా? కావా? అని నిగ్గుతేల్చడంలో ఏల్చూరి వారి పరిశీలన ప్రశంసనీయం. అలాగే, శృంగారనైషధానువాదంలో శ్రీనాథుడు తన అనువాదశిల్పసూత్రాన్ని సూచించలేదని, భీమేశ్వరపురాణములోని “హరచూడా హరిణాంకవక్రతయు” అని సాగే పద్యానికి సంస్కృతకవి శంభుని రాజేంద్రకర్ణపూరము ఆధారమని చేసిన చర్చను ఏల్చూరి వారు మనోహరంగా వివరించారు.
పిల్లలమర్రి వంశాన్ని గురించి, పినవీరభద్రుని కవితాశక్తిని గురించి జైమిని భారతములోని పాఠభేదాలను గురించి, ఆ కావ్యముయొక్క అంకిత కాలం గురించి ఏల్చూరి వారు చేసిన కృషి నిరుపమానమైనది. ఈ సందర్భంగా జైమిని మహర్షిని గురించి ఎన్నో విశేషాలు వివరించారు.
పరిశోధకులు, సాహితీవేత్తలు అంతగా దృష్టిపెట్టని గణపవరపు వేంకటకవి రచన శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమును గూర్చి మురళీధరరావు గారు వ్రాసిన డెబ్భై పేజీల రచన అనంత ప్రతిభావంతమైంది. వేంకటకవి నిర్దేశించుకొన్న రచనాప్రణాళికను, అతడు వ్రాసిన కొన్ని పద్యాలలోని గూఢార్థాలను ఏల్చూరి వారు వివరించి చెప్పిన తీరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ కవి ఇతర కృతులను గురించి కూడా ఏల్చూరి వారు చక్కగా వివరించారు.
సుప్రసిద్ధ సంస్కృతకవి సుబంధుని గురించి, అతడి రచన వాసవదత్త గురించి, తెలుగు కవులపై దాని ప్రభావాన్ని గురించి రచించిన రెండు విపులమైన వ్యాసాలు ఏల్చూరి వారి పరిశోధనాదృష్టికి మకుటాయమానాలు. ఈ వ్యాసాలలో వారు పేర్కొన్న దమయంతి, వాసవదత్తల గురించి రచించబడిన కథాకావ్యాల వివరాలను చదివితే ఆ ఇద్దరి గురించి ఎంత విస్తృతమైన వాఙ్మయం సృష్టించబడిందో తెలిసి ఆశ్చర్యపోతాము.
గరుడ పురాణానికి ఉత్తర దక్షిణ భారతీయ ప్రతులలో భేదాలు, ఆ పురాణంలో లేకున్నా ఉన్నవని చెబుతూ తెలుగులో ప్రచారంలో ఉన్న గ్రంథాల వివరాలు, భైరవకవి కవిగజాంకుశము, శ్రీరంగమాహాత్మ్యము, రత్నపరీక్షా గ్రంథాలకు ఆ పురాణమే ఆకరమన్న విషయాలు ఏల్చూరి వారి సాహిత్యకృషికి ఎత్తిన దీపాలు. అసలు గరుడపురాణమే ఒక కలగూరగంపగా ప్రసిద్ధి చెందింది.
ఐతరేయ ఉపనిషత్తు గురించి, అన్నమయ్య శృంగారమంజరి గురించి, చైనా రాజవంశీయుడు ఛు యువాన్ కవితల గురించి, “రవిబింబం బుపమింప” … ఇత్యాదిగా సాగే పోతన ప్రసిద్ధపద్యానికి ఆకరాన్ని గురించిన వ్యాసాలు లోతైన అధ్యయనాలు. ఇటువంటిదే నైమిశారణ్య చరిత్ర కూడా.
“ఆంధ్రవాగ్గరిమకు నన్నపార్యుడు”గా చెప్పదగిన జూలూరి అప్పయ్య గారిని గురించి, వారి సాహిత్యకృషిని గురించి పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధం, ఇరవైయవ శతాబ్ది పూర్వార్ధాలలో జన్మించిన మహనీయులు మండపాక పార్వతీశ్వరశాస్త్రి, కూచి నరసింహం, వేటూరి ప్రభాకరశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, అబ్బూరి రామకృష్ణారావు, విశ్వనాథ సత్యనారాయణ, నయాగరా కవులు, అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, బైరాగి, మద్దిపట్ల సూరి, కుందుర్తి ఆంజనేయులు, ఆచంట జానకీరామ్ , ద్వారం వెంకటస్వామి నాయుడు, బోయి భీమన్న, పి.బి.శ్రీనివాస్, శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారు, గుంటూరు శేషేంద్రశర్మ, ముళ్ళపూడి వెంకటరమణ, కోరాడ రామచంద్రశాస్త్రి, అనుమాండ్ల భూమయ్య, అప్పాజోస్యుల సత్యనారాయణ గార్లను గూర్చి, వారి రచనలను గూర్చిన విశేషాలు సాహితీప్రియులకు హృదయరంజకంగా వివరించబడ్డాయి.
ఏల్చూరి వారి సాహిత్య పరిశోధన ప్రధానంగా మౌలికమైంది. సాహిత్యపరిశోధకులు, చరిత్రకారులు గుర్తించని అనేక విషయాలు ఏల్చూరి వారు ఈ గ్రంథంలోని వ్యాసాలలో ఆవిష్కరించారు. ప్రాచీన, ఆధునిక వాఙ్మయ విషయాలను గురించి ఈనాడు లోతైన పరిశీలనా వ్యాసాలు అంతగా రావటంలేదు. అటువంటి వివరణాత్మక, విశ్లేషణాత్మక పరిశోధనా వ్యాసాలను ఆహ్వానించి, ముద్రించి వెలుగులోనికి తెచ్చే ‘భారతి’ వంటి సాహిత్యపత్రికలు ఈనాడు లేవు. సత్యనిష్ఠ గల వాఙ్మయ పరిశోధకులూ కరువైనారు. ఈ స్థితిలో ప్రాచీన, ఆధునిక తెలుగు కవుల గురించి, వారి కవితాసౌరభాలను గురించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి ఈ వ్యాస సంపుటి కవితాప్రియులకు విందుభోజనం. ఒక దీక్షతో, ఆరాధనతో, అభిమానంతో, విశేషశ్రమతో వాఙ్మయసేవ కావిస్తున్న శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు కృతపుణ్యులు, ధన్యజీవులు.
వాఙ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్ని విశేషాంశాలు (వ్యాస సంపుటి)
రచన: ఏల్చూరి మురళీధరరావు
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్,
ప్రతులకు: ఫోన్: 040-40179673, 9701063970,
నవోదయ బుక్ హౌస్.
వెల: రు.1000/-
శ్రీ సూర్యదేవర రవికుమార్ గారు 1947 నవంబరు 2-న జన్మించారు. పశువైద్యునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. సాహిత్యాభిలాషతో ‘భారతి’, ‘స్రవంతి’, ‘ప్రసన్నభారతి’ వంటి పత్రికలలో అనేక సాహిత్య వ్యాసాలను ప్రకటించారు. అముద్రితంగా ఉన్న ప్రాచీన కావ్యాలు నండూరి బాపయ ‘విఘ్నేశ్వర చరిత్ర’, మనుమంచిభట్టు ‘’హయలక్షణ విలాసము’ (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ), వడ్లపూడి పెద్దయ ‘మాఘ మాహాత్మ్యము’, బేతపూడి కృష్ణయకవి ‘జానకీరాఘవము’లను పరిష్కరించి ప్రకటించారు. ‘స్నేహగీతం’, ‘మృత్యుంజయ’, ‘రవికిరణాలు’, ‘మేఘసందేశం’, ‘కాణిపాక వినాయక శతకము’ వంటి పద్య గేయ రచనలు; ‘వ్యాససుధ’, ‘ఆరు నెలల తెలుగు కవితల పరిశీలన’, ‘తుమ్మల సాహిత్యం’, ‘కవిత వ్రాసిన కమ్మవారు’ (3 సంపుటాలు), ‘ప్రాచీన భారతీయ పశువిజ్ఞానం’, ‘సినిమా పాటలలో ఏమున్నది’, ‘గుంటూరు కవులు’ వంటి పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు.
Leave a Reply