శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి ? – 1.1

వ్రాసిన వారు: మల్లిన నరసింహారావు
*******************
పదిహేనో తేదీన వచ్చిన వ్యాసానికి కొనసాగింపు.

తన రెండవ భార్య యైన మాద్రితో వేటకు వెళ్ళిన పాండురాజు రెండు లేళ్ళజంట క్రీడిస్తుండగా వాటిలో మగలేడిని బాణంతో కొడతాడు. అప్పుడు ఆ దెబ్బతిన్నలేడి నేను కిందముడనబడే మునిని. రాజులకు మృగయావినోదం దోషం కాకపోయినా

పఱవనోపక యున్న, మైమఱచి పెంటిఁ ! బెనగియున్నను, బ్రసవింప మొనసియున్నఁ,

దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ ! రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన. 1-5-53

(పరుగెత్తలేనివి, ఆడుదానితో కూడికొన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను మాంసం ఆహారంగా జీవించే కిరాతులు కూడా కొట్టరు.) రాజులకు మృగయావినోదం ధర్మమైనప్పటికిన్నీ అన్నివేళలా అది కూడదు. ధర్మాలలో విశేషధర్మాలనేవి కొన్ని ఉంటాయి. పాండురాజుకు కిందముడి శాపం – భార్యను కలిసినప్పుడు మరణిస్తావనేది –  పూర్వకర్మఫలితంగా కవి చెప్పుతున్నాడు. గమనించండి. ఇటువంటి మంచి పద్యాలకోసమే మనం భారతాన్ని చదవాలనేది.

ఎట్టి విశిష్టకులంబునఁ ! బుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్

గట్టిన కర్మఫలంబులు ! నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్ ? 1-5-58

శ్వేతకేతుడనే మహాముని, ఉదంకమహాముని పుత్త్రుడు – తన తల్లి ముట్టయి ఋతుమతిగా ఉన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమెని కోరగా  అది ధర్మవిరుద్ధమని కోపించి శ్వేతకేతుడు స్త్రీ పురుషుల విషయంగా ఈ క్రింది కట్టడిని ఏర్పాటు చేసాడు. అదేంటో చూద్దాం రండి.

ఇది యాదిగా సతు లెన్నండుఁ బర పురుషార్థినుల్ గాఁ జన; దన్యపురుషు

సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ; బరిగ్రహ భూత లయిన సతుల

కిట్టిద మర్యాద  యి మ్మనుష్యుల కెల్లఁ జేసితి లోకప్రసిద్ధి గాఁగ

నని ధర్మ మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి

యబ్జ భవ సమానుఁ డగు శ్వేతకేతుండు ! నిలిపె నదియు ధారుణీ జనంబు

నందు లోకపూజ్య మై ప్రవర్తిల్లుచు ! నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి 1-5-85

ఇటు వంటి కట్టడులు పూర్వం ఉండిఉండకపోవచ్చు. తఱువాత తఱువాత శ్వేతకేతుని లాంటి పెద్దలు సంఘహితం కోసం ఏర్పఱచి ఉండవచ్చు అప్పటినుండీ

పురుషులచే ధర్మస్థితిఁ ! బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం

తరము నిజ పురుష భక్తియుఁ ! బరపురుష వివర్జనంబుఁ బరిచితమయ్యెన్.1-5-87

భర్తచేత నియోగింపఁ బడక సతికి  నెద్దియును జేయఁగాఁ దగఁ  దెద్ది యైన

భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ జేయకునికి దోషం బని చెప్పె మనువు. 1-5-88

పాండురాజు తన శాపకారణంగా పిల్లలను భార్యద్వారా పొందటానికి అవకాశం లేనప్పుడు కుంతికి సూర్యుడిచ్చిన వరం ద్వారా కుంతీ మాద్రిలు సంతానవతు లయ్యే ఘట్టం లోని పద్యాలు ఇవి.

మతిఁ దలఁపఁగ సంసారం ! బతి చంచల మెండమావులట్టుల సంప

త్ప్రతతు లతిక్షణికంబులు ! గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. 1-5-159

మనం అతి తఱచుగా వాడే సామెత ఇక్కడినుండి వచ్చిందన్నమాట. ఈమాటలు కృష్ణద్వైపాయనుడు తన తల్లి సత్యవతితో అంటాడు. (ఆలోచించి చూస్తే సంసారం ఎండమావులవలె అతిచంచంలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే రోజులకంటె గడచిపోయిన రోజులే మేలు. ఎందుకో వివరిస్తున్నాడు చూడండి.)

క్రూరులు విలుప్తధర్మా! చారులు  ధృతరాష్ట్ర సుతు లసద్వృత్తులు ని

ష్కారణ వైరులు వీరల ! కారణమున నెగ్గు పుట్టుఁ గౌరవ్యులకున్. 1-5-160

(ధృతరాష్ట్రుని కొడుకులు దుర్మార్గులు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వారి కారణంగా కౌరవవంశానికి కీడు కలుగుతుంది.)

ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుం డగు వానితోడ మూ

ర్ఖునకుఁ, బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ

రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడఁ గష్ట దు

ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే ? 1-5-204

ద్రోణుడు ద్రుపదునితోడి తన బాల్యస్నేహాన్ని పునరిద్ధురించుకుందామని అతని వద్దకు వెళ్ళినప్పుడు ద్రుపదుడు అతనిని పై విధంగా పలికి అవహేళన చేస్తాడు.(ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిఱికివానికి, కవచరక్షణ కలవానితో అది లేనివానికి, సజ్జనునితో దుర్జనునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది ?) –పేదవిప్రులకును ధారుణీశులకుఁ బోలగ సఖ్యము సంభవించునే?—అని పలికి తఱువాత పైవిధంగా అంటాడు. ఈ పద్యం నన్నయ నానారుచిరార్థసూక్తినిధిత్వానికి ఓ మచ్చు తునక. ఇంకా పొడిగింపుగా—

సమశీలశ్రుతయుతులకు !  సమధనవంతులకు సమసుచారిత్రులకుం

దమలో సఖ్యము వివా ! హము నగు గా; కగునె రెండు నసమానులకున్? 1-5-205

(సమానమైన స్నేహం, విద్య కలవాళ్ళకు , సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచినడవడి కలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి, కాని, సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? ఏర్పడవని భావం)

వేఁడుటెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్

వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్

వేఁడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్

పాఁడి కుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.1-5-218

(యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం తగినదే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే, ధనం ఇవ్వలేక పోయినా, అశ్వత్థామ పాలకోసం నాలుగు పాడిగోవులనైనా ఇవ్వకపోతాడా?) అని ద్రోణు డనుకుని వెళ్ళి అడిగి – లేదనిపించుకున్నాడు.

తేజితబాణహస్తు, దృఢదీర్ఘమలీమసకృష్ణదేహుఁ గృ
ష్ణాజినవస్త్రు, నస్త్రవిషయాస్తవిషాదు నిషాదుఁ జూచి యా
రాజకుమారులందఱుఁ బరస్పరవక్త్రవిలోకనక్రియా
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్. 1-5-235

(పదును పెట్టిన బాణాన్ని చేతపట్టుకొన్నవాడు, దిట్టమైనది, పొడవైనది, మురికిపట్టినది, నల్లనిదీ అయిన దేహాన్ని కలిగినవాడు, జింకచర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, అస్త్రవిద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుడిని చూచి, ఆ రాకుమారులంతా విపరీతమయిన మాత్సర్యంచేత అతడిని చూడలేక ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు.)

కులము గలవాఁడు, శౌర్యము ! గలవాఁడును, నధికసేన గలవాడును, భూ
తలమున రాజనునామము ! విలసిల్లగఁ దాల్చు మూఁడు విధముల పేర్మిన్. 1-6-47

(కుల మున్నవాడు, శౌర్య మున్నవాడు, అధిక సేనా బల మున్నవాడు భూమిమీద మూడువిధాల రాజనే పేరు గొప్పగా పెట్టుకుంటాడు.) కుమారాస్త్రవిద్యాప్రదర్శన ఘట్టంలో కర్ణుడిని తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి మరీ అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయమని కృపాచార్యుడు ఆంక్ష పెట్టినపుడు దుర్యోధను డనిన మాటలివి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా అభిషిక్తుడినిగా చేస్తాడు.తఱువాత భీముడు కర్ణుడిని సూతకులంలో పుట్టిన వానినిగా తెలుసుకుని ఈ క్రింది విధంగా అధిక్షేపిస్తాడు.

ఉత్తమ క్షత్త్రియ ప్రవరోపయోగ్య మైన యంగరాజ్యంబు నీ కర్హ మగునె ?

మంత్రపూత మై గురుయజమానభక్ష్య మగు పురోడాశ మది గుక్క కర్హ మగునె ! 1-6-57

(ఉత్తమ క్షత్త్రియ శ్రేష్ఠునిచేత అనుభవించ దగిం దైన అంగరాజ్యం నీకు అనుభవించ తగిందవుతుందా? గొప్పయజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపుపిండివంట కుక్క తినటం తగునా!)

శూరులజన్మంబు సురలజన్మంబును ! నేఱులజన్మంబు నెఱుగ నగునె ?

మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే ! వాసవాయుధ మైన వజ్ర మదియు;

గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన ! నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనగ శరవ

ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె? శర ! స్తంబజన్ముడు గాఁడె ధర్మవిదుఁడు

గృపుడు ? ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు ! వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁ బుట్ట

రైరె సత్క్షత్రియుల్ ఘను లవనిఁ గావఁ ? గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ.

(శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి ఎముకనుండి పుట్టలేదా? గంగ కొడుకుగా, కృత్తికల కొడుకుగా, అగ్ని కొడుకుగా, రుద్రుని కొడుకుగా, రెల్లుపొదలలో జన్మకలవాడుగా కుమారస్వామి పుట్ట లేదా? ధర్మ మెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డిగంటలో పుట్ట లేదా? కీర్తిమంతుడు, శ్రేష్ఠుడు అయిన ద్రోణుడు కుండలో పుట్ట లేదా? భూమిని కాపాడడానికై ఉత్తమక్షత్త్రియులు బ్రాహ్మణులవలన పుట్ట లేదా? విన్న దానిని బట్టి మీ పుట్టుకలు కూడా ఇట్టివే కదా!) కర్ణుడి జన్మ గుఱించి అవహేళన చేసిన భీమునితో దుర్యోధనుడు అన్నమాటలివి. మొదటి చరణం చాలా ప్రసిద్ధమై అందఱి నోళ్ళలోనూ నానుతుంది.

వీ రెవరయ్య? ద్రుపదమ ! పరాజులె ! యిట్లు కృపణు లయి పట్టువడన్

వీరికి వలసెనె? యహహ!! హారాజ్యమదాంధకార మది వాసెనొకో?.1-6-90

(వీ రెవ రయ్యా?ద్రుపదమహారాజులే!ఈ విధంగా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే? అహహా! మహారాజ్యమదం చేత కలిగిన కన్ను గానని తనం తొలగిపోయిందా!(  ఇది కూడా ఒక ప్రసిద్ధ పద్యం.  అర్జునుడు ద్రుపదుని బందీ చేసి ద్రోణునికి గురుదక్షిణగా తెచ్చినప్పుడు ఆయన ద్రుపదునితో ఎకసెక్కెంగా అన్నమాటలివి. తెలుగునాట ప్రతినోటా తఱచుగా అటువంటి సందర్భాలలో పలుకబడే మాటలు ఇవి.

ఇంక నైన మమ్ము నెఱుగంగఁ నగునొక్కొ!”యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు

విడిచిపుచ్చె గురుడు; విప్రుల యలుకయుఁ ! దృణహుతాశనంబు దీర్ఘమగునె? 1-6-91

(‘ఇకముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా?’ అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచి పెట్టాడు. బ్రాహ్మణుని కోపం, ఎండుగడ్డి మంట ఎక్కువసేపు ఉంటాయా? )

కణికనీతిలోని పద్యాలు కొన్ని—

పలుమఱు శపథంబులు నం! జలియును నభివాదనమును సామప్రియభా

షలు మిథ్యావినయంబులుఁ! గలయవి దుష్టస్వభావకాపురుషులకున్.1-6-112

తన కిమ్మగు నంతకు దు! ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం

దన కిమ్మగుడును గఱచును! ఘనదారుణకర్మగరళఘనదంష్ట్రములన్. 1-6-113

తఱియగునంతకు రిపుఁ దన! యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం

జెఱచునది ఱాతిమీదను! వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్. 1-6-115

తన కపకారము మునుఁ జే! సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం

జన; దొకయించుక ముల్లయి! నను బాదతలమున నున్న నడవఁగ నగునే 1-6-116

ఈ కణికనీతులను కణికుడు దుర్యోధనునికి చెప్పుతాడు. కణికనీతులు కాబట్టి అర్థాలను వ్రాయకుండా వదిలాను.

విదురనీతులు మంచివి. వాటికి అర్థాలను చదువుకుందాం తఱువాత తఱువాత.

విదురుడు ధర్మరాజుతో వారణావతంలో జాగ్రత్తగా మెలగవలసిందని, ప్రమాదాలు కలుగబోతాయని రహస్యంగా చెబుతాడు. ఆ రహస్యసంభాషణం దేని గుఱించని కుంతి ధర్మరాజుని అడగ్గా ఆత డామెతో విదురుని మాటల అర్థాన్ని వివరిస్తూ ఇలా అంటాడు.

ఎల్లకార్యగతులు నెఱుఁగుదు; రయినను! నెఱుఁగ జెప్పవలయు నెఱిఁగినంత;

పనియులేక మిమ్ముఁ బనిచిన కురుపతి! హితుఁడపోలె మీఁద నెగ్గు సేయు. 1-6-147

చేయ దగిన పనుల పద్ధతు లన్నింటిని మీ రెరుగుదురు. అయినా నాకు తెలిసినంతవఱకు మీకు తెలియచెప్పాలి. ఏ పనీ లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడివలె ఉండి తర్వాత కీడు చేస్తాడు.

రమణి నిజభాతృనియో ! గము దలఁపక యపుడు భీముఁ గదిసెఁ; బతిస్నే

హమ కామినులకు బలవం ! తము; పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే? 1-6-191

(హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకొన్నది. కాంతలకు భర్తమీది స్నేహమే బలమైనది. తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు.) అంతేకదా మరి. కాని భీముడు మటుకు ఆమె కిలా అంటాడు.

విను బేల యెట్టి కష్టుఁడుఁ! దన పురుష గుణంబు సెడఁగఁ దల్లినిఁ దోఁబు

ట్టినవారి విడిచి రాగం! బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా. 1-6-197

(అమాయకురాలా! ఎంతటి నీచు డైనా తన పురుష లక్షణం పోగొట్టుకొని – తల్లిని, తోబుట్టువులను వదలి మోహంలో పడి చంచలమైన స్త్రీ సుఖాన్ని పొందుతాడా !చెప్పుము.); చూశారా, ఎంత బాగా చెప్పాడో!

వధకు నర్హుఁ డై వచ్చినవానిఁ జంపి ! తదియు ధర్మువ; యిది చాల నబల దీని

కలుగఁజన; దాత్మరక్షకు నగ్గలంబు ! ధర్మ రక్షయ యుత్తమ ధార్మికులకు.1-6-220

(చంపదగినవాడిని చంపావు. అది ధర్మమే. ఈ హిడింబ అబల. దీని మీద కోపపడ కూడదు. ఉత్తములైన ధర్మాత్ములకు ఆత్మరక్షణ కంటె ధర్మరక్షణమే ముఖ్యం.) అని ధర్మరాజు భీమునితో అంటాడు. ఈ పద్యం కూడా నన్నయ సూక్తి నిధిత్వానికి ఒక ఉదాహరణ. అని ఇంకా –

ఆపద యైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయుఁ బరమార్థము ధ

ర్మాపాయమ ధార్మికులకు నాపద జన్మాంతరమున ననుగత మగుటన్.1-6-221

(తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేత నంటే ఇంకొక జన్మలో కూడ వెంటవచ్చేది కావటంచేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద.) భారతంలో ఇలా అడుగడుగునా ధర్మ పరిరక్షణ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే మనమందరం భారతాన్ని చదవాలని అనేది. ఇంకో బంగారు మొలక—

కృత మెఱుఁగుట పుణ్యము; స ! న్మతి దానికి సమముసేఁత మధ్యము; మఱి త

త్కృతమున కగ్గలముగ స ! త్కృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్. 1-6-244

ఏకచక్రపురంలో విప్రుని ఇంటిలో కష్టం కలిగి వారంతా బాధపడుతున్నప్పుడు కుంతీదేవి భీమునితో పై విధంగా అంటుంది. బకునికి ఆహారంగా పోవాల్సివచ్చినపుడు బ్రాహ్మణకుటుంబం వారు ఈ క్రింది విధంగా అనుకొంటారు. ఎంత మంచి పద్యాలో చూడండి.

నలసారము సంసార మ ! ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం

చలము పరాధీనం బిం ! దుల జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్. 1-6-248

(సంసారం గడ్డివలె నిస్సార మైనది. దుఃఖాన్ని కలిగించేది. భయానికి స్థానమైనది. మిక్కిలి చంచల మైనది. ఇతరులకు లొంగేది. పండితు లైనవాళ్ళు ఈ సంసార జీవనం సత్యమైన దని ఎట్లా నమ్ముతారు ?)

ఆదిని సంయోగవియో! గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం

పాదిల్లక తక్కవు పూ! ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నైనన్.1-6-249

( ఎంత యోగికైనా – ఏ మానవుడికైనా – పూర్వజన్మకర్మ వలన కలవటం, విడిపోవటం అనే ద్వంద్వాలను అనుభవించటం తప్పదు.)

మనుజులకు నెవ్విధంబున ! ననతిక్రమణీయ మైన యాపద్విషయం

బున సంతాపింపఁగఁ జన ! దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్.1-6-254

(మానవులకు ఏవిధంగాను దాటరాని దైన ఆపద విషయంలో శోకించ గూడ దని తెలిసికూడ, ఎట్లా అని శోకించవచ్చా? కూడదని భావం.)

పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన ! సతియ నోఁచినదియు సతులలోనఁ;

బురుషహీన యైనఁ బరమపతివ్రత ! యయ్యు జగముచేతఁ బ్రయ్యబడదె. 1-6-256

(భర్తకంటె ముందు మరణించిన భార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మురాలు. పరమ పతివ్రత అయినా భర్త లేని స్త్రీ లోకంచేత నింద పొందుతుంది గదా!)

పడిన యామిషంబు పక్షు లపేక్షించు నట్లు పురుషహీనయైన యువతిఁ

జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు రిదియుఁ బాప మనక హీనమతులు. 1-6-257

(క్రిందపడిన మాంసం ముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూచి నీచులు ఇది పాప మని అనుకోక తేలికగా ఆమెను కోరతారు.)

ధృతి సెడి వేడెడువానిని ! నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా

గతుఁ జంపఁగ నొడబడు దు! ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 1-6-274

( ధైర్యాన్ని కోల్పోయి ప్రార్ధించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయపడేవాడిని. శరణు కోరి వచ్చిన వాడిని చంపాలనుకొనే దుర్మార్గునికి ఇహలోక పరలోక సుఖ ముంటుందా! – ఉండదు.)

ఖలు నసుర నోర్వ నోపెడు ! బలయుతుఁగా నెఱిఁగి కొడుకు బనిచెదఁ గా; కి

మ్ముల శతపుత్త్రులు గల ధ ! న్యుల కైన ననిష్టుఁ డగు తనూజుఁడు గలఁడే? 1-6-277

(దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగల బలవంతు డని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే వందమంది కొడుకులున్నవాళ్ళ కయినా ఇష్టం కాని కొడుకు ఉంటాడా?) అని కుంతీ దేవి అంటుంది వారితో.

You Might Also Like

One Comment

  1. kiran

    బావుంది మీ వ్యాఖ్యానం

Leave a Reply