ఒక యోగి జీవన గాథ
వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి
*******
“శాశ్వతమైన సత్యం ఒకటే… అది ప్రతీక్షణం, మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించే హక్కు మీకు వుండడం అని చెబుతూ, మనలో దయతో కూడిన దృక్పథం ఉన్నంతవరకు, మనం యితరులను బాధపెట్టనంతవరకు, మనలోని అంతర్వాణి ఆదేశాలను మనం వినగలిగినంత వరకు, మనం సఫలురమే”(పుట…264) అని చెప్పే, *నిజం చెప్పాలంటే …ఒక యోగి జ్ఞాపకాల పరంపర* అన్న పుస్తకం, సానుకూల దృక్పథంతో, తన లక్ష్య సాధన కోసం జీవించిన ఒక సాధకుడు విజయవంతుడైన విధానాన్ని చెప్పడం మాత్రమే కాదు, జీవితంలో సంపూర్ణతను సాధించాలని ఆశించే, ప్రతి యొక్కరికి మార్గదర్శనం చేయగలిగిన నవలా రూపంలో, సమకాలీన చారిత్రక నవలా రూపంలో ఒక స్వీయచరిత్ర. ఒక గొప్ప తాత్త్విక కావ్యం కూడా!
రాబిన్ సన్ నవల, మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, పా ల్ కోయిలో నవల ది ఆల్కమిస్ట్ లను చదివినపుడు మన ఆలోచనలెంతగ ప్రేరేపించబడతాయో, *ఒక యోగి ఆత్మకథ* ను చదివినపుడు, ఎంతటి ఆనందోద్వేగా లకు లోనవుతామో అంతటి జీవన తాత్త్వికతను అందించగలిగిన ఈ పుస్తకం, ఒక పంజాబీ యువకుడు అమిత్ తాను కోరుకున్నట్లు తన జీవిత లక్ష్యాన్ని సాధించిన విధాన్ని తెలిపే గొప్ప మార్మిక వచన కావ్యం కూడా !
ఒక సాధారణ కుటుంబానికి చెందిన దంపతులకు మూడవ సంతానంగా జన్మించి, తన ఐదవ యేటనే, బొమ్మలను చూడడంతో ప్రారంభించి ఏకబిగిని చదివేసిన కామిక్ పుస్తకాలు, తనకు పండుగలప్పుడు కూడా పుస్తకాలను బహుమతిగా కోరి పొందడం, తమ ఊరనున్న గ్రంథాలయం లోని పుస్తకాలను అత్యంత వేగంగా చదివి, గ్రంథాలయాధికారి చేత మిఠాయి డబ్బాను బహుమతిగా పొందడం, తరగతిలో అధిక మార్కులను సంపాదించడమే గాక, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, మంత్రశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించడం, ఇంటరు లో అత్యధిక మార్కులని సాధించినా, తన ఇతర వ్యాపకాలకు అడ్డురానీయని వాణిజ్య శాస్త్రాన్ని ఎన్నుకుని డిగ్రీ ని ముగించిన అమిత్, చిన్నతనం నుండి అమ్మ చెప్పే కథలు, చేసే పూజలద్వారా భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడు. భగవత్ సాక్షాత్కారం పొందాలన్న లక్ష్యాన్ని జీవిత ధ్యేయంగా ఏర్పరచుకొన్న వాడు. ఎనిమిదేళ్ళ వయస్సులో కలలో భగవంతుడు శివుడు కనిపిస్తే, తన అమ్మకు కూడా దర్శనం ఇవ్వవలసినదిగా కోరిన వాడు. ఒక సాధువు ద్వార లభించిన ‘సియార్ సింఘీ’ (నక్క శరీరం పై పెరిగే ఒక గడ్డ వంటిది) సాయంతో, తమ యింటిలోని పనిమనిషి కుమారుని కుష్టు రోగాన్ని నయం చేయ గలిగిన వాడు. సంవత్సరంలో దాదాపు నాలుగు మాసాలు ఆస్మా కు గురియైనప్పటికి, రోజులో అత్యధిక గంటలు ధ్యానం చేస్తూ, ఆత్మ సాక్ష్తాత్కారం దిశగా తన ప్రయాణం కొనసాగుతుందని గుర్తించడమే కాదు, మాస్టర్స్ చేయడం కొరకు ఆస్ట్రేలియాకు తన పద్దెనిమిదవ యేట చేరుకున్న వాడు.
కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికి, తల్లిపట్ల అమితమైన ప్రేమను కలిగిన అమిత్, ఆస్ట్రేలియా లో ఒంటరిగానే తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. “మానవు డెప్పుడూ ఒంటరి కాదు. మనకు తెలియని దేశాలలో కూడా మనకు ఎవరో ఒకరు సాయపడుతూనే ఉంటారు. అది సృష్టి నైజం” అని మహామహోపాధ్యాయ రాహుల్ సాంకృత్యాయన్ చెప్పినట్లు, భారత దేశంలో గాని, ఆస్ట్రేలియాలో గాని అమిత్ కు సాయపడిన మంచి మనస్సులు లెక్కకు మిక్కిలి గానే కనిపిస్తాయి. దీనినే అమిత్, “అసంఖ్యాకులైన వ్యక్తులు నా జీవితంలో చేసిన సహకారాన్ని గుర్తించడం నా భావ వ్యక్తీకరణకు మించినది. శరీరం లెక్కలేనన్ని కణాల యొక్క సముదాయం అయినట్లే, నా జీవితం కేవలం ఇతరులు చేసిన మేలు యొక్క క్రోడీకరణ. ఈ సంస్మరణ, నా ప్రతి శ్వాస, నా హృదయపు కాన్వాస్ పై వారి అందమైన, తేజోవంతమైన కదలికల యొక్క వ్యక్తీకరణ”. (పుట…265) అని స్మరించుకున్నారు.
తన సంపాదనతోనే చదువుకోవాలి అన్న నియమం, అతని వ్యక్తిత్త్వాన్ని తీర్చిదిద్దే గీటు రాయిలా పని చేసింది.భారత దేశం లోని తల్లి, మామయ్య, ప్రొ. ఏ.పి.శర్మ గారు, వ్యాపారి పర్వేష్ సింగ్లా, న్యూస్ పేపర్ నడుపుతుండిన హర్ ప్రీత్ సింగ్ దర్దీ లతో బాటు, ఆస్ట్రేలియాలో తనకు పరిచయం అయిన ప్రతి యొక్కరి నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవడమే గాక, తను స్వయంగా శ్రమించి మూడేళ్ళ చదువును రెండేళ్లలో ముగించేలా అనుమతిని పొందడమే కాదు, కేవలం పద్దెనిమిది నెలలలోనే కోర్సును పూర్తిచేసుకున్న ధీశాలి. తన వీసా నియమాలను అతిక్రమించకుండా ఇరవై గంటలకు మాత్రమే జీతం తీసుకుంటూ, మిగిలిన సమయం చేస్తున్న పనిని తనకు అనుభవం క్రింద లెక్కించుకుంటూ , 75000 డాలర్లు జీతంగా ఇస్తానన్న క్యాసినోవా ఉద్యోగాన్ని ….. పేకాటలో తమ ఆస్తి పాస్తులను కోల్పోతున్న బాధితులకు ఆలవాలమైన క్యాసినోవాలో ఉద్యోగం ద్వారా పొందే సంపాదనలో, సాంఘిక సమానత్వం, కరుణ లోపించిందని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించిన సహృదయ శీలి! మనిషికి, సమాజానికి హానిని కలిగించే, మత్తు పదార్దాలు, మారణ ఆయుధాల వ్యాపారం చేయడం తగదు అన్న బుద్ధుని మాటలిట గుర్తుకు వస్తాయి.
అతి తక్కువ సమయంలోనే, తన సొంత కంపెనీని ప్రారంభిచడమే కాదు, వాటి శాఖలను, కాలిపోర్నియా, కెనడా. ఇంగ్లండ్, భారత దేశాలలో వ్యాపింపజేసి, తన ఇరవై యెనిమిదవ యేట భారతదేశానికి తిరిగివచ్చి తన కుటుంబంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్న భావుకుడు, అమిత్. వివేక్ అన్నవ్యక్తి ప్రోద్బలంతో, భారత దేశంలో జ్యూస్ బార్ల చైన్ ను ప్రారంభించడమే కాదు, ఒక ఆయుర్వేద కంపెనీని కూడా కొనుగోలు చేసి, ఏడు ప్రత్యేకమైన ఆరోగ్య బూస్టర్ల ఉత్పత్తుల శ్రేణితో ముందుకు రావడమే కాదు ఒక్క సంవత్సర కాలంలోనే మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను సంపాదించుకోగలిగిన కంపెనీగా తీర్చిదిద్దారు. వివేక్ బలవంతం వలన, హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆశ్రమం కోసం స్థలాన్ని ఏర్పరచుకోవడమే గాక, నెలవారీ గౌరవ వేతనం క్రింద నెలకు పదివేల రూపాయలను టర్మ్ డిపాజిట్ వంటి తక్కువ వడ్డీని ఇవ్వగలిగిన ఆర్థిక పథకంలో పెట్టుబడిగా నిర్ణయించుకున్న అమిత్, 2009 చివరలో స్నేహితులను కలవడానికి ఆస్ట్రేలియాకు, అన్నదగ్గరకు వెళ్ళి ఉన్న అమ్మను కలవడానికి కెనడాకు వెళ్లివచ్చాడు. “అమ్మా! నేను తొందరలోనే సాధన చేయడానికి వెళ్లిపోతాను” అని కూడా చెప్పి వచ్చాడు. తన 31వ జన్మదినాన తాను సంపాదించిన కోట్లాది రూపాయలను వదలు కొని, మార్చ్ 15, 2010 లో ఇంటిని వదలి డిల్లీకి , అక్కడి నుండి వారణాసికి చేరుకున్నాడు అమిత్.
ఇంతవరకూ అతని జీవితం సాగిన తీరు ఒక ఎత్తు అయితే ఇక్కడి నుండి కొనసాగిన తీరు మరొక ఎత్తు. గురువు కోసం అన్వేషించడం, ఒక నాగ సాధువును గురువుగా అంగీకరించి, అతనినుండి దీక్షను పొందాలని నిర్ణయించుకోవడం, ఆ బాబా కట్టిస్తున్న బాలికల డిగ్రీ కాలేజీ భవనానికి, గురువు ఆదేశంతో తన దగ్గర నున్న ధనాన్ని తీసి, పూర్తిగా ఖర్చు పెట్టడం, తాను వండుకొనే సౌకర్యం లేక అభోజనంగా ఉండటం, నేలమీద పడుకొని, ఆ ప్రాంతంలోని విష పురుగులు, తేళ్ళ చేత కుట్టించుకొని బాధపడటం, ప్రతి పరీక్ష కూడా తన సాధనలో తోడ్పడే మైలు రాళ్ళు అని సంతోషించడమే కాదు, తనకు ధ్యానం చేసుకొనే అవకాశం తగ్గడం, తాను మరణపు అంచులను తాకి, వెను దిరిగి రావడం ….వీటితో, “నాలో ఉన్నదంతా ఖాళీ అయిపోయింది, మనం ఖాళీగా ఉన్నపుడు మాత్రమే నింపగలం”… “కోల్పోవడానికి నా దగ్గర ఏవీ లేవు.. ఆఖరికి గురువు కూడా.” (పుట…195) అని, ‘తంత్ర సామ్రాట్’ అని బిరుదు పొందిన గురువును విడచి హరిద్వార్, జోషీ మఠ్, బద్రీనాథ్ లకు చేరుకున్న అతడు, ధ్యానంలో కూర్చొని, తనను తాను శ్రీహరికి అర్పించుకుంటున్నానని , తనను విడిచి పెట్ట వద్దని వేడు కున్నాడు.
నాగ సాధువు దగ్గర గడిపిన, నాలుగు నెలల కఠినమైన సమయం అతనిని శారీరక బాధలకు గురిచేసినా, అంతరంగ బలానికి తోడ్పడింది. హిమాలయ పర్వత ప్రాంతాలలో తారసపడిన భైరవి సూచన ప్రకారం, ఒక గుహను ఎన్నుకొని,మొదట్లో స్వయం పాకం చేసికొన్నా, తనకు ఒక పూటకు మాత్రం ఆహారాన్ని సమకూర్చగల వ్యక్తిని ఎన్నుకొని, రోజుకు 22 గంటలు ధ్యానంలో గడిపిన వివరాలు చదివి తన్మయత్వాన్ని పొందవలసినవే తప్ప వివరించడం కుదరని పని…
మనిషికి ఒక లక్ష్యం ఉండాలని దానికోసం, తీవ్రంగా తపించాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా, తన ధ్యేయం నుండి తొలగి పోరాదని, అప్పుడు మాత్రమే మనం మన జీవన లక్ష్యాన్ని చేరుకోగలమని సహేతుకంగా వివరించే ఈ జీవిత చరిత్ర మనలోని అంతర్గత చైతన్యాన్ని మేల్కొలుపుతుంది.
శ్రీయంత్రం, మంత్రంతో జగన్మాతను ధ్యానం చేయడం ప్రారంభించిన సరిగ్గా నలభై రోజులకు, 13 ఫిబ్రవరి 2011 నాడు జగన్మాత దర్శనాన్ని పొందగలిగాడు అమిత్ అన్న సాధకుడు. సన్యాసిగా మారిన హిమాలయ యోగి.
“ఆత్మసాక్షాత్కారం అన్నది అప్పటికప్పుడు జరిగే విషయం కాదు. మనకు ‘ఆహా’ అని అనిపించే క్షణం ఒకటి ఉండి ఉండవచ్చు. కాని మన మౌఖిక, మానసిక, శారీరక చర్యల యొక్క పూర్తి అవగాహనతో ఈ ప్రపంచంలో ప్రయాణం చెయ్యడం బుద్ధి పూర్వకత వల్లే సాధ్యమవుతుంది. ….కోపం మన మనశ్శాంతిని నాశనం చేస్తుందని మనం గుర్తించవచ్చు. కాని ఎంత బలంగా రెచ్చగొట్టిన ప్రశాంతగా ఉండటం— అదే నిజమైన ఆత్మ సాక్షాత్కారం.”(పుట … 245) అంటారు.
“జీవితం నేను కోరుకున్న ప్రతిదాన్ని, అంతకంటే ఎక్కువే నాకు ఇచ్చింది. …. నేను నేర్చుకున్న దానిని ఇతరులకు అందించడానికి నేను ఈ విశ్వానికి ఋణపడి ఉన్నాను… నేను ప్రజలకి దిశా నిర్దేశం చేయాలని అనుకోవడం లేదు. వారికి మార్గ దర్శనం చేయడం, వారితో కలిసి ప్రయాణించడం మాత్రమే నేను కోరుకుంటున్నాను.” (పుట…246)అన్నది వీరి అభిప్రాయం.
ఇంతకు పూర్వం భైరవి ఆదేశించినట్లు, కామాఖ్యకు వెళ్ళి దేవిని దర్శించుకొని, రుద్రనాథ్ లో నలబై రోజుల యోగక్రియ నాచరించి, చివరకు తన యింట మొదటి సారిగా భిక్షను స్వీకరించాలనుకుని 2011 అక్టోబర్ 7వ తారీఖున తన యింటికి చేరుకున్నారు. “ప్రపంచమంతా నా యిల్లే కాని నా కంటూ ఇల్లు లేదు, మౌనంగా ఉన్న పరిశీలకుడిని” అన్న నిర్ధారణకు వచ్చిన వీరు తనతండ్రి కోరికననుసరించి ఇచ్చిన సందేశం చాలా గొప్పది. “….జీవితం చాలా చిన్నది. దీన్ని వేడుకగా జరుపుకోవాలి, జీవించాలి. జీవితం ఒక సవాలు కాదు, ఎదుర్కోవ డానికి. అలాగే శత్రువు కూడా కాదు, పోరాడడానికి. ఆ విషయానికి వస్తే, ఇది ఒక సమస్య కూడా కాదు, పరిష్కరించడానికి. ఇది ఒక ప్రవహించే నది. మనం చేయవలసిందల్లా దానితో పాటు ప్రవహించడమే” (పుట…260)అంటూ, జీవించండి, ప్రేమించండి, నవ్వండి, ఇవ్వండి” అన్న సందేశాన్ని ఇచ్చారు.
తనను చూసి చేతులను జోడించిన తన తల్లిని అలా చేయవద్దని అంటూ , తాను కనుగొన్న జగన్మాత ఒడికన్నా తన మాతృమూర్తి ఒడి తక్కువది కాదు అని తలచారు.
తాను జన్మించక ముందే ‘నీ మూడవ కేమారుడు యోగి అవుతాడు.’ అని ఒక సాధువు తన తల్లితో చెప్పినట్లు, యోగి అయి, ఆత్మసాక్షాత్కారం పొంది, హియాలయ ప్రాంతంలోని ఆశ్రమంలో నివశిస్తున్న ఓం స్వామి గారి 2014 లోని రచన, “If truth be told A monk’s memoir” అన్న పుస్తకానికి డా. కర్రి సత్యనారాయణ గారు అందించిన అనువాద(2023)మిది.
ఫ్లాష్ బాక్ పద్ధతిలో ప్రారంభమయ్యే ఈ స్వీయచరిత్ర, అన్నీ సత్య జీవిత కథనాలతో కూడినదే అయినా, చదువుతుంటే ఒక గొప్ప తాత్త్విక నవలను చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివి ముగించిన వెంటనే, మనకు తెలిసిన జీవన పోరాటంతోబాటు, మనకు అర్థం చేసి కోవడానికి క్లిష్టమైన అలౌకిక విశయా లను ఎన్నిటిని గూర్చో తెలుసుకొంటాము. మనచుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, మన జాగృత చేతన అందించే సూచనలను ఆచరిస్తే, మనం కోరుకొన్న గమ్యాన్ని చేరడం అతి సులభమని గుర్తిస్తాము. మనవిజయం మన చేతుల్లోనే ఉన్నదని, దానికి వలసినది మనలో అచంచలమైన విశ్వాసం ఉండడం మాత్రమేనని గమనిస్తాము. తెలుగు సాహిత్యానికొక మేలి చేర్పుగా ఈ పుస్తకాన్ని గుర్తిస్తాము. ఇంత గొప్ప పుస్తకాన్ని ప్రచురించిన, పొన్నమండ , రాజోలు మండలం తూ.గో. జిల్లా కు చెందిన జోశ్యుల ప్రచురణ సంస్థకు కృతజ్ఞతలను చెప్పకుండా ఉండలేము.
****
ప్రతులకు: జోశ్యుల పబ్లికేషన్, 9704683520 లో సంప్రదించగలరు; ధర: రూ:250/-
Leave a Reply