అమీనా…..మహమ్మద్ ఉమర్

రాసిన వారు: భానుకిరణ్
*************
ఆఫ్రికా స్త్రీ వాద రచయిత ” మహమ్మద్ ఉమర్” రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల మనసుకు హత్తుకు పోయేలా రచించబడ్డ ఒక మంచి నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది అంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించ వచ్చు. ఇది రచయిత మొదటి నవల. సరళమయిన అనువాదంతో మొత్తం ఏక బిగిన చదివించిన నవల.

కుటుంబానికి , భర్తకి అంకితమయిన ఒక ముస్లిం మహిళ, కాల క్రమేణా తను పుట్టిన వాతావరణంలో ఉన్న ఆంక్షలను ధిక్కరించి ఆ క్రమంలో ఆమె తనకే గాక అందరికి మేలు చేసే మార్పులను సాధిస్తుంది. ఇందులో నైజీరియా లో ముస్లిం మహిళల చట్ట ప్రతిపత్తి, సాంప్రదాయాలు, మతాచారాలు వారిపై విధించిన శృంఖలాలు , వారి ఆర్ధిక కార్యకలాపాలపై ఆంక్షలు అన్నీ ఈ నవలలో మనకి కనపడతాయి. సమాజంలో పురుషాదిక్యత వల్ల మహిళలు ఎదుర్కొనే దుర్భర పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు గోచరిస్తాయి. రచయిత ఒక్క నైజీరియా లోని మహిళల గురించి రాసినా, మనకు మాత్రం ఎక్కడ, ఏ దేశంలో చూసినా కొద్దిగా ఎక్కువ, తక్కువలతో అక్కడున్న సామాజిక పరిస్థితులే అంతటా కన్పిస్తాయి . మన చుట్టూ జరిగే ఎన్నో విషయాలు నవలలో మనకు కళ్ళ ముందు సజీవంగా కనపడతాయి. రచయిత నైజీరియా లోని ఒక ముస్లిం మహిళ జీవిత గమనాన్ని చదువరుల మనసుకు హత్తుకు పోయేలా రచించినదే ఈ ” అమీనా ” నవల.

కథలోకి వస్తే, ” అమీనా” ఈ నవలలో ముఖ్య పాత్ర.. అల్లజీహరూన్ రాష్ట అసెంబ్లీ కి ఎన్నికైన వ్యక్తి. అతను జీవితంలో సాధించే ఒక్కొక్క విజయానికి, ఒక్కొక్క భార్య ను చేసుకొనే వ్యక్తి, అతని మాటల్లో చెప్పాలంటే ” నూతన విజయం..నూతన భార్య అనేది ఇతని సిద్దాంతం ” అలా అతని నాల్గవ విజయానికి అతని నాల్గవ భార్య గా అతనితో జీవితం ప్రారంభిస్తుంది అమీనా. అమీనా ఇంట్లోనే ఉండి తన భర్తను, కుటుంబాన్ని చూసుకోవడమే తన బాద్యత అని నమ్మిన వ్యక్తి. ” ఫాతిమా” అమీనా కు యునివర్సిటీ స్నేహితురాలు. రాజకీయాలపై ఒక నిర్దుష్టమయిన అభిప్రాయాలున్న యువతి. ఆడవాళ్లకు కావాల్సిన వాటిలో అందం ఒక భాగం మాత్రమే, అదొక్కటే సరిపోదు, తెలివి తేటలు, మానసిక స్థైర్యం కూడా కావాలి అని ఆలోచించే యువతి, వ్యవస్థలో మహిళల స్థితిగతులు మార్చే దిశగా ఫాతిమా పోరాడుతూ ఉంటుంది . విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్న యువతి. ఫాతిమా అప్పుడప్పుడు తన మిత్రురాళ్ళతో రహస్య సమావేశాల గురించి, లేదా అమీనా ను కలవటందుకు తరచుగా అమీనా ఇంటికి వస్తూ ఉంటుంది. పెళ్ళయిన కొన్ని రోజులకే భర్త, అమీనా కారు డ్రైవర్ తో ప్రణయం సాగిస్తుందని అవమానిస్తాడు. అమీనా గర్బవతి అవుతుంది.ఎటూ తేల్చుకోలేని స్థితిలో అమీనా సోమరిగా ఆలోచిస్తూ ఇంట్లోనే గడుపుతుంటుంది. ఫాతిమా ఇంట్లో జరిపే చర్చలు, ఆమె చదవమని ఇచ్చే పుస్తకాలు క్రమంగా అమీనలో కొంత మార్పు ను తీసుక వస్తాయి. ఫాతిమా అమీనా తో నీ సొంత విశిష్టత పెంచుకో, అధికారం లేని వారి ప్రయోజనాల కోసం, స్త్రీలని విద్యావంతుల్ని చేయటం కోసం నీ శక్తి యుక్తుల్ని వినియోగించమంటుంది .

ఆ తర్వాత లైరా అనే చిన్న అమ్మాయి ప్రసవించిన తదుపరి, అనారోగ్యం పాలయి, మగని ఆదరణ లేక ఉన్న స్థితిలో చూసి చలించి పోయి, లైరాను ఆమె కూతురును ఇంట్లోకి తీసుకొచ్చి ఉంచుకొంటుంది. ఒక మహిళా సంఘం పెట్టె దిశగా ఆమె ఆలోచనలు కొనసాగుతాయి.అమీనా ప్రసవంతో ఆలస్యమయినా , బకారో ఉమెన్స్ అసోసియేషన్ ఆందోళనకర పరిస్థితులలో చివరికి పాలక పక్షానికి మహిళా విభాగంగా ఉండాలనే షరతులతో అమీనా వ్యవస్తాపకురాలిగా ప్రారంభమవుతుంది. అలా అమీనా జీవితం సోమరితనం నుంచి క్రియాశీలకంగా మారుతుంది.
మహిళలకు పురుషులతో సమానత్వం, అన్ని స్థాయిలలో బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్య బలవంతపు వివాహాలను నిరుత్సాహపరచడం, గృహ హింస పై గట్టి చట్టాలు చేయడం, అర్హులయిన మహిళలకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం, వీటిపై పోరాటానికి సిద్దమవుతుంది. ఆహారాన్ని అందించే బదులు , వారికి ఆదాయ మార్గాన్ని చూపితే తమకు తాము తిండి సంపాదించుకొంటారు, అని మహిళా సహకార ఉద్యమం వైపు దృషి సారిస్తుంది. ఆడవాళ్ళకు వచ్చిన “వంట”నే ఒక వ్యాపారంగా మలిచి, స్తానిక సంప్రదాయ మందుల తయారీ, మహిళలు రాసిన కథలు, కవితలు పుస్తకాలుగా ముద్రించడం . స్థానికంగా లభించే వస్తువులతో పౌష్టికాహారం తయారుచేయడం ఇలా అందరు మహిళలను సంఘటిత పరిచి మహిళా అసోసియేషన్ ను ముందుకు తీసుక పోతుంది.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు వీళ్ళ అసోసియేషన్ ను నిషేధిస్తుంది ప్రభుత్వం .సహకార ఉద్యమాన్ని కూడా నిషేధిస్తుంది. దీనికి నిరసనగా మహిళలను అందరిని సంఘటితం చేసి ఇండ్లు వదిలిపెట్టి అందర్నీ ఒక్క దగ్గరకు చేర్చి శాంతియుతంగా నిరసన తెలిపేల చేస్తుంది. ప్రభుత్వం పోలీసుల తో దాడి చేయించి అందర్నీఅరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు. అమీనా తో న్యాయ శాస్త్రం చదివిన ఆమె స్నేహితురాలు రబీ చాకచక్యంగా సమర్థవంతంగా కోర్టులో వాదించి అమీనతో సహా అందరు మహిళలను విడుదల చేయిస్తుంది. చివరగా విజయం దిశగా పోరాటాన్ని కొనసాగించి తీరాలని, పోరాటంతో “ఒక మంచి ప్రపంచం ..సాధ్యమే” అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతుంది. పోరాటంతోటే మార్పు సాధ్యమన్న సత్యాన్ని చాటుతుంది.

ఒక సాధారణ మహిళ, క్రియా శీలకంగా పోరాటం చేసే దిశగా పయనించడం రచయిత చాల చక్కగా రాస్తాడు. రచయిత ఫాతిమా పాత్ర చర్చల్లో, ఉపన్యాసాలలో, ఇంకా నవలలో అక్కడక్కడా వివిధ పాత్రల ఉపన్యాసాలలో తన అభిప్రాయాలను నైజీరియాలోని పరిస్థితుల్ని చాలా చక్కగా వివరంగా విశ్లేషిస్తాడు. అక్కడక్కడ ఈ చర్చలు , ఉపన్యాసాలు ఎక్కువయినట్టు అనిపించినా కథకు అవసరం కాబట్టి చదివే వాళ్లకు ఏమి అనిపించదు. తప్పకుండా చదవవలసిన నవల.

పుస్తకం అమేజాన్ లంకె ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. Indian Minerva

    పుస్తక పరిచయానికి thanks.

  2. SRRao

    మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం

Leave a Reply