మధుశ్రీలు చదివాక
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
**********
బడిలో మా ఝాన్సీ టీచర్ క్లాసులో పాఠం చెప్పటం అయ్యాక ప్రశ్నలు వేసేప్పుడు మేమంతా జవాబులు చెప్పేందుకు పోటీలు పడేవాళ్ళం. ఒకళ్ళని మించి ఒకళ్ళం మరింత వివరంగా, తోచిన ఉదాహరణలతో సహా చెప్పి టీచర్ అభిమానం సంపాదించెయ్యాలని ఆరాటపడేవాళ్ళం. అప్పుడే విన్న పాఠానికి కాస్త దగ్గరి విషయాన్నో, జరిగిపోయిన పాఠంలోని అంశాన్నో పోల్చి చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళం. అంతిమంగా ఝాన్సీ టీచర్ అన్ని జవాబులూ వినేసి ఎవరమైతే చక్కగా రకరకాల ఉదాహరణలతో వివరించేవాళ్ళమో వాళ్ళని మెచ్చుకునేవారు, పైగా పాఠం బాగా అర్థమైంది కనుకే ఆ పోలికల్ని, భేదాల్ని చెప్పగలిగేమని అనేవారు. అప్పటి మా ఆనందం చెప్పనలవి కాదు.
మనమంతా మానవ సహజమైన ఒక అలవాటును గమనిస్తుంటాం. కొన్ని ప్రదేశాలకి వెళ్ళినప్పుడో, కొందరి వ్యక్తులను కలిసినప్పుడో, మరి కొన్ని అనుభవాలెదురైనపుడో అప్రయత్నంగా అప్పటికే అనుభవంలోకి వచ్చిన విషయాన్నో, అప్పటికే తెలిసిన వ్యక్తినో, సంగతినో తలుచుకుని వాటిలోని సారూప్యతని పోల్చేస్తాం.
ఈ ఉపోద్ఘాతం అంతా మరో కొత్త పుస్తకాన్ని పరిచయం చేసేందుకే.
పరిచయం చేసుకోబోతున్న పుస్తక రచయిత ఒక కథా సంపుటిని చదువుతూ ఆయా కథలతో సామీప్యం తోచిన, తను అప్పటికే చదివిన కథల్నీ, కవితల్నీ, చూసిన సినిమాల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటన్నింటినీ విశ్లేషించారు. ఇక్కడ రెండు విషయాలు! ఇదంతా ఒక తొంభై పేజీల పుస్తకంగా తయారైందంటే ఇందులోని యాభై ఎనిమిది కథలకీ పోలిక చెప్పగలిగేంత సాహిత్యాన్ని రచయిత చదవి ఉండటం, జ్ఞప్తిలో ఉంచుకుని సమయమొచ్చినప్పుడు చక్కగా వాటినీ తలుచుకోవటం! ఈ ప్రయాణంలో ఎందరెందరో మంచి మంచి రచయితల్ని, కవుల్ని, దర్శకుల్ని తలుచుకుంటూ మనకీ పుస్తకాన్ని అందించారు. ఇది నిజంగా పెద్ద ఫీట్!
శ్రీ మధునాపంతుల వేంకటేశ్వర్లు గారు మధుశ్రీ కలం పేరుతో 1950 నుంచి 1972 వరకు రాసిన కథలన్నీ వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వాటిని, మరికొన్ని సాహిత్య వ్యాసాలను 2011 లో మధుశ్రీలు పుస్తకంగా తీసుకురావటం జరిగింది.
మధుశ్రీలు పుస్తకం చదువుతున్న క్రమంలో కవి, రచయిత అవధానుల మణిబాబు మనసులో తోచిన ఆలోచనలే మధుశ్రీలు చదివాక పుస్తకం. మణిబాబు కవితా సంపుటాలను ఇదివరలో ఇక్కడే పరిచయం చేసుకున్నాం.
పుస్తకం ముందుమాటలో మధునాపంతుల వేంకటేశ్వర్లుగారి అబ్బాయి మధునాపంతుల కిరణ్ తన తండ్రి నా కథలో పాత్రలు వాటి మానాన అవి బతుకుతాయి, కథలు నీతిచంద్రిక చేసే పనులు చేయక్కర్లేదు కానీ అవినీతిని ప్రోత్సహించకూడదు అని రాసుకున్నారని చెప్పారు. పైగా మధుశ్రీలు పుస్తకం ద్వారా తెలిసిన మధుశ్రీ (తన తండ్రి) కన్నా మణిబాబు పరిచయం చేసిన మధుశ్రీ చాలా ప్రత్యేకంగా ఉన్నారన్నారు సంతోషంగా.
పుస్తకం ముందుపేజీల్లో ఇప్పుడు ఎందుకు ఇదంతా…! రాయటం అవసరమైందో వివరించారు మణిబాబు. పసిపిల్లలుగా ఉన్నప్ప్పుడే మాజా నో, ఫ్రూటీ నో తాగిన పిల్లలు మామిడిపండు మొదటిసారి తిన్నప్పుడు అచ్చం మాజా లా, ఫ్రూటీ లా ఉందంటారు. మనసులో ముందు వెనుకలుగా పడిన ముద్రలే దానికి కారణమంటూ ఉదాహరణగా చెపుతారు. మధుశ్రీలు చదివేప్పుడు తాను ఇంతకాలంగా చదివిన సాహిత్యం తాలూకు జ్ఞాపకాలు మనసులో ఎలా మెదిలాయో చెప్తూ, ఆ జ్ఞప్తిలోకి వచ్చిన వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకుని తనలో వచ్చిన పరిణతిని గమనించుకున్నా నంటారు.
మధునాపంతుల వేంకటేశ్వర్లుగారు తన పదిహేనవ ఏట మొదలుపెట్టి ముఫ్ఫై ఏడేళ్ళ వరకూ రాసిన యాభై ఎనిమిది కథల సంపుటి మధుశ్రీలు. వీటిలో దెయ్యాల కథలు, గుమాస్తా కథలు, మధ్యతరగతి కథలు, కట్నం కథలు వంటి వస్తువైవిధ్యం ఉన్న కథలున్నాయి. వీటన్నింటిని చదువుతూ అవి గుర్తు చేసే విషయాలన్నీ చర్చించారు మణిబాబు తన పుస్తకంలో.
మధుశ్రీలు సంపుటిలోనివి యాభై సంవత్సరాల క్రితం రాసిన కథలు కావటంతో అప్పటి సమాజాన్ని, మనుషుల్ని సహజంగానే ప్రతిఫలిస్తాయి.
మొదటి కథ పెళ్ళిపెద్ద లో బహు కుటుంబీకుడైన ఒక పేద మాష్టారి కూతురు ఇంటి బాధ్యతను ఎలా తలకెత్తుకుందో చెపుతూ బాలచందర్ అంతులేని కథ సినిమాను పోలుస్తారు. కానీ ఆ కథ 1972 ముందు రాసినది కాగా, బాలచందర్ సినిమా 1976 లో వచ్చినది. సమాజంలో ఉన్న అంశాలే కథలుగా, సినిమాలుగా రూపాంతరం చెందుతాయన్నదానికి ఇదే నిదర్శనమంటారు. ఈ కథతో గొల్లపూడి మారుతీరావు గారి పాలు విరిగిపోయాయి, పరిమళ సోమేశ్వర్ గారి క్రోటన్ మొక్కలు కథల్లోని, తనికెళ్ళ భరణి గారి కన్యా – కుమారి కవితలోని పోలికల్ని చెప్పారు. యాదృచ్ఛికంకథలో భార్య పుట్టింటికెళ్ళినప్పుడు భర్త స్వీయ నియంత్రణ లేక తప్పటడుగు వేస్తాడు. ఇక్కడ గురజాడ దిద్దుబాటు, శంకరమంచి పార్థసారధి ఆ రోజు రాత్రి కథల్ని పాఠకులకు జ్ఞాపకం తెస్తారు మణిబాబు.
స్నేహితుడు ఎవరికేసాయం కావాలన్నా ముందువెనుకలు చూడకుండా ముందుకొచ్చే శంకరం కథ. ఇలాటి వస్తువుతో వచ్చిన సయ్యద్ సలీం గారి ప్లాట్ ఫాం పిన్ని, డా. ఎన్. రామచంద్ర జవహర్ షెడ్, వీరలక్ష్మీదేవి కథ నీడ లను ఇక్కడ ప్రస్తావించారు.
అవ్యాఖ్యేయం కథ గురించి చెపుతూ ఒక స్త్రీ, ఒక పురుషుడు వైవాహికబంధం బయట ఆత్మీయతను పంచుకున్నప్పుడు వారు ఒకరికొకరు ఏమవుతారన్న ప్రశ్నకి జవాబు కష్టం అని చెప్పాల్సివస్తుందంటారు. ఈ సందర్భంలో చింతకింది శ్రీనివాసరావు గారి బుక్కావీధి, చా. సో. గారి పోనీ తిను కథలను జ్ఞప్తికి తెస్తారు మణిబాబు. ఇంకా వంశీ గారి ఉంచుకున్న మనిషి, సత్యం శంకరమంచి గారి పందిరి పట్టిమంచం కథల్నీ చెపుతారు.
శ్రేయోభిలాషి లో మెలోడ్రామా ఎక్కువై కథ కృతకంగా ఉందని నిర్మొహమాటంగా చెప్తూ, అలాటి వస్తువుతో వచ్చిన నేరము -శిక్షసినిమా గుర్తు చేసుకుంటారు.
నేనూ ఒక మనిషినా? కథలో ఆత్మవిమర్శకు లోనైన ఒక అధికారి తనకు గతంలో జరిగిన అవమానానికి కారణమైన ఒక వ్యక్తిని తలుచుకుంటాడు. తనకు అవకాశమొచ్చినా ఆ వ్యక్తి కొడుక్కి శిక్ష వెయ్యాలనుకోడు.
మధునాపంతుల వేంకటేశ్వర్లుగారు హెడ్ మాష్టారుగా ఉన్న రోజుల్లో ఆ స్కూల్లో చదివిన పిల్లవాడు స్టడీ సర్టిఫికెట్ కోసం వచ్చినపుడు, వివరాలు అడిగి తెలుసుకుని నమ్మకంతో పాత రికార్డులను వెతక్కుండానే అవసరమైన కాగితాన్ని సంతకం చేసి ఇచ్చేసారని ఆయనతో పాటు పనిచేసిన దాట్ల దేవదానం రాజు గారు ఓ సభలో పంచుకున్న అనుభవాన్ని పై కథతో పాటు జత చేసారు. వేంకటేశ్వర్లు గారి ఆలోచనాతీరుని, మనుషుల పట్ల నమ్మకాన్ని ఇది తెలుపుతుంది.
విభ్రాంతామరుకం, నిజమైన నిజాలు వంటి కథలు సినిమా కథలను పోలి ఉన్నాయంటూ ఆయా సినిమాలను ప్రస్తావించారు.
కమలమ్మ కథ బాలవితంతువుల బాధలను చర్చించే కథ ఆ నాటి సమాజంలో ఉన్న పరిస్థితిని చెపుతుంది. ఆవంత్స సోమసుందర్ సంచారిణీ దీపశిఖ, ముక్కామల చక్రధర్ చిట్టెమ్మ …చుట్టంకాని ఆత్మబంధువు, కుందుర్తి స్వరాజ్య పద్మజ ఆకుపచ్చ నేలకోసం బాల వితంతువుల జీవితల్లోని మరో పార్శ్వాన్ని చూపాయి.
మానవులు – దానవులు కథ ముగింపులో ప్రశ్నలు పాఠకుణ్ణీ ఆలోచించేలా చేస్తాయని చెపుతూ కథకు ప్రశ్నలతో ముగింపిచ్చిన మరికొన్ని కథల్ని తలుచుకుంటారు మణిబాబు. అద్దేపల్లి ప్రభు గారి అతడు మనిషి, అనామకుడు గారి ముహూర్తం. ఇంకా రస్కిన్ బాండ్ ఎ బుక్ ఆఫ్ సింపుల్ లివింగ్ లోని కథను ఉదహరిస్తూ మనిషితనాన్ని చెప్పేప్పుడు ప్రాంతాలకతీతంగా ఏ రచయితైనా ఒకటే చెపుతాడంటారు.
ఎవరి జీవితాల్లోని విషయాల్ని చూసో, వినో అలాగే అందరికీ జరుగుతాయని భయపడితే సంతోషకరమైన క్షణాల్ని కూడా ఆందోళనతో గడపాల్సివస్తుందంటూ కలలు, కల్లలు కథను చెపుతారు. ఇక్కడ ఎల్. సుధాకర్ గారి గొబ్బిపూలు అనే అందమైన కథను పరిచయం చేసారు.
ఉత్తమ పురుషలో తాటిచెట్టు నీడ, అనుభూతి, సర్పభ్రాంతి వంటి అనేక కథలు రాసారు వేంకటేశ్వర్లు గారు. తెలుగులో ఈ దృష్టి కోణాన్ని గురజాడ మెటిల్డా కథలో చూడచ్చు. ప్రపంచ కథా సాహిత్యంలో దీనిని ఎద్గర్ ఆలన్ పో ఎక్కువగా వాడినా, దానికి మరింత ప్రాచారం ఇచ్చింది సోమర్సెట్ మాం అంటారు.
వెంకటేశ్వర్లుగారి కట్నం కథల్ని ప్రస్తావిస్తూ,
ఒక మగాడి హత్యకి వంద కారణాలు
వంద ఆడాళ్ల హత్యలకి కట్నం ఒకటే కారణం! అనే జనార్దన మహర్షి కవితా పంక్తుల్ని, కొలకలూరి ఇనాక్ గారి డౌరీ డెత్కథను ప్రస్తావించారు.
కొన్ని కథలు కలలు మీద రాసినవి. ఇలాటి కలల సన్నివేశాలు సినిమాల్లోనూ చూడవచ్చు. గుమాస్తా కథల గురించి చెపుతూ వాకాటి పాండురంగారావు గారి Praise the Lord అను సర్పదష్టుడి కథ ఉదహరించారు. ఇంకా శ్రీశ్రీ కథల్లోని కోనేటిరావు ని ప్రస్తావించారు. దెయ్యాల కథలు చాలానే రాసినా మధుశ్రీ తనలోని సైంటిఫిక్ ఆటిట్యూడ్ కి భంగం రాకుండా చూసుకున్నారంటారు.
= ఇవేకాక మధుశ్రీ స్వీయ అభిప్రాయ ప్రకటన కోసం రాసిన కథలూ ఉన్నాయి. రచయిత ఏం చెప్పాడో, నీతిదాయకంగా చెప్పాడో లేదో పాఠకుడు చూసుకోవలసిన అవసరం ఉందంటారాయన. అలాగే విమర్శకుల దృక్పథం ఎలా ఉండాలన్న దాని పట్ల మధుశ్రీ కి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.
పాత్రలెదురు తిరిగాయి కథలో రచయిత రాసిన కథల్లోని పాత్రలు ఎదురుతిరిగి రచయితను నిలేస్తాయి. ఇలాటిదొక సన్నివేశంకల్పన సినిమాలో అల్లురామలింగయ్య పాత్ర కి ఎదురవుతుంది. రచయిత గురించి పాఠకుడేమనుకుంటాడో అన్నది సత్యగ్రాహి కథలో చూడవచ్చు. ఇందులోని పాఠకుడికి అద్వైతమూర్తి అన్న రచయిత పట్ల అభిమానం. ఆయనను చూడాలని ప్రయత్నించి తన ఆలోచనల్లో ఉన్న రచయిత అతను కాదని నిరాశ పడతాడు.
తన కవిత్వం చదివి ఇంకా ఎర్రగా, పొడుగ్గా ఉంటానని అనుకున్నట్టు డా. ఆవంత్స సోమసుందర్ గారు చెప్పారని, అందుచేత రచనను బట్టి రచయితను ఊహించుకోవటమనేది వాస్తవంలో ఉండేదేనంటారు మణిబాబు.
= మధుశ్రీ రాసిన బీనాదేవి కథలు – ఒక పరిశీలన వ్యాసంలో కథ కంటే కథ చెప్పే విధానంలో బీనాదేవి చాతుర్యం చెప్పుకోదగ్గదంటారు. కథ వాస్తవనికి దగ్గరగా ఉండాలా అంటే నిజానికి అవసరం లేదు, కొంత అసహజం ఉంటేనే దాన్ని పాఠకుడు ఆనందిస్తాడంటారు. చాలా కథలలో మధుశ్రీ తానే ఒక పాత్రగా మారిపోయి రచన, విమర్శ, పాఠకుడి దృష్టికోణం పట్ల తన అభిప్రాయాలను చెపుతారు.
పురాణాలు – ప్రాచీన సాహిత్యం పట్ల అవగాహన ఉన్న మధుశ్రీ తపః ఫలం అనే మూడు పేజీల కథలో ఒక మహా కావ్య ఘట్టాన్ని రాసి ఒప్పించారు. అది ప్రాచీన సాహిత్యం పై మధుశ్రీ గారికున్న పట్టును చెపుతుంది.
మధుశ్రీ గారి కథలకు పెట్టిన శీర్షికలు సార్థక నామధేయాలంటూ కాంతులీనే ముఖానికి కళాత్మకంగా తిలకం దిద్దడమే శీర్షిక అన్న పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారిని తలుచుకుంటారు. మధుశ్రీగారు చాలా కథలను విభిన్నంగా మొదలుపెట్టారని, భాష విషయంలో పాత్రోచిత భాష నైశిత్యం కనిపిస్తుందని మణిబాబు గారంటారు.
మధుశ్రీలు పుస్తకానికి మునిపల్లె రాజు గారి ముందుమాట,
“తన భావుకత్వ పరిధి, కాలంతో పాటు విసృతమవుతూ కథ, గేయం, సాహిత్య పరామర్శ, ఆధునిక సమాజ క్లైబ్యాలు, ఆమోదాలు, విషాదాలు – అన్నింటినీ స్పృశించిన వైనం – ఈ పుస్తక విశిష్టత.”
“అన్ని పవనాలకూ గవాక్షాలు తెరిచి వుంచిన ప్రాచీన సమకాలీన రచయితల మేలుబంతిలో నిలుస్తున్నారు – ఈ మధుశ్రీ” అన్న ప్రశంసనూ అందించారు.
మధుశ్రీ తాను నమ్మిన సిద్ధాంతాలు, అభిరుచికి అనుగుణంగా కథా వస్తువును తీసుకుని తన మనోధర్మాన్ని బట్టి శిల్పనిర్మాణం చేసారు. వారు అధ్యయనం చేసిన ఆంగ్ల సాహిత్యం, వారికున్న పరిచయాలు వారి రచనలకు మరింత వైవిధ్యాన్ని అందించాయి. అయినా మధుశ్రీ గారికి రావలసినంత ప్రఖ్యాతి రాలేదని, ఆయన ఒక Unsung Hero అని అంటారు మణిబాబు.
మధుశ్రీలు ఐదు దశాబ్దల వెనుక రాసినా కాలానికి నిలబడిన గొప్ప కథలనీ, తాను చదివి గొప్ప అనుభూతిని పొంది అందరితో పంచుకోవాలన్న ఆశతోనే వీటిని విశ్లేషించే పనికి పూనుకున్నానంటారు మణిబాబు. అలా మధుశ్రీలు చదివాకరూపుదిద్దుకుంది. పుస్తకం ఆఖరి పేజీల్లో మణిబాబు ప్రస్తావించిన గ్రంథాల, కథల పట్టికతో పాటు మధుశ్రీ గారి పరిచయం ఉంది.
ఆనాటి సమాజాన్ని సహజంగా, నిజాయితీగా అక్షరబద్ధం చేసిన మధుశ్రీ గారికి, ఆ రచనలన్నింటికి మధుశ్రీలు పేరుతో పుస్తక రూపమిచ్చి వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు కృషి చేసిన వారి వారసులకు అభినందనలు.
ఒక పుస్తకం తనలో రేకెత్తించిన ఆలోచనలన్నింటిని కలబోసి మరో పుస్తకంగా అందించిన మణిబాబు గారికి అభినందనలు. సాహిత్య లోకంలో బహుశా ఇదొక ప్రయోగమేమో! ఇటువంటి మరిన్ని ప్రయోగాలకు ఇది మార్గదర్శకం కావచ్చు.
ప్రచురణః కలిమిశ్రీ
మొదటి ముద్రణః సెప్టెంబరు, 2024
పుస్తకం ధర: రూ. 200 /-
Leave a Reply