తిరుమల రామచంద్రగారి “హంపీ నుంచి హరప్పా దాకా”
రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
*****************
ఇప్పటి దాకా ఈ పుస్తకం పై పుస్తకం.నెట్‌లో సమీక్ష రాకపోటంతో నాకు కొంత ఆశ్చర్యం, కొంత ఆనందం కలిగాయి. ఎందుకంటే, గొప్ప పుస్తకాల పేర్లు ఒక వంద చెప్పమంటే, ఎవ్వరి జాబితాలో అయినా తప్పకుండా ఉండే ఈ పుస్తకం పై సమీక్ష ఇక్కడ లేనందుకు ఆశ్చర్యం, నాకు ఈ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం. ఈ పుస్తకం పరిచయం చెయ్యటంలో ఒక పాఠకుడిగానే కాక నాకు మరో పాత్ర కూడా ఉంది. అదేమిటో తరవాత మీకు మనవి చేస్తాను.
1996 సంవత్సరంలో అనుకుంటా, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి, అశేష ఆంధ్ర పాఠక ప్రజానీకాన్ని అబ్బురపరచిన శ్రీ రామచంద్ర గారి స్వీయచరిత్ర తరవాత పుస్తక రూపం పొంది తెలుగు సాహితీ జగత్తులో ఒక అరుదైన పుస్తకం అయింది. ఇంతా చేస్తే శ్రీ రామచంద్ర గారి జీవితంలో మూడవ వంతు సంగతులు మాత్రమే ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి! అయినా అదే చాలు నాబోటి పాఠకుల భాగ్యానికి. తెలుగు వారిలో ఒక తరం జీవిత చరిత్ర నిక్షిప్తమై ఉంది ఈ పుస్తకంలో.
శ్రీ తిరుమల రామచంద్ర శ్రీవైష్ణవుల ఇంట జన్మించారు. తమ కుటుంబంలోని కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల వివరాలే కాక విద్యార్ధి దశలో ఆయన అనుభవాలు, సంస్కృత భాషపై ఏర్పడ్డ అభిమానం, పాత్రికేయునిగా ఎందరో ప్రముఖుల పరిచయం, తెలుగు భాషా సేవకునిగా ఆయన కృషి, గాంధేయ వాదిగా ఆయన అభిప్రాయాలు, భారత దేశ పర్యటన – ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ ప్రతి విషయం ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదివింప చేస్తాయి అనటంలో సందేహం లేదు. మనసు సరిగా లేకున్నా ఏదైనా విషయమై దిగులు పడ్డా ఈ పుస్తకాన్ని చదవటం నాకు ఒక అలవాటై పోయింది.
మనవి (మనస్వి) మాటలు
తన రాసిన పుస్తకానికి “ముందు మాట” లను “మనవి మాట”లు అనేవారు శ్రీ రామచంద్ర. ఈ పుస్తకానికి అక్కిరాజు రమాపతి రావు గారు (మంజుశ్రీ) ముందు (మనస్వి) మాట రాసారు. ఈ పుస్తకం ఎంత గొప్ప పుస్తకమో ఈ ముందు మాటలు కూడా అంత గొప్పవే! శ్రీ రామచంద్రగారి ఈ క్రింది మాటల్లోని మనస్విత గమనించండి!
“లాహోర్‌లో ఉంటూ పశ్చిమాన ముల్తాన్ వరకూ తూర్పున ధరంశాలా వరకూ తిరిగాను. ‘ పన్నెండు కోసులకు భాష మారుతుంది ‘ అన్న పంజాబీ భాషణానికి అనుగుణంగా మారుతున్న పంజాబీ మధుర వాక్కులు ఆస్వాదిస్తూ వారిండ్ల ఆవకూర, యలవపిండి, రొట్టెలు తింటూ, తామరతూళ్ళ ఊరగాయలు నంజుకుంటూ, మన మధ్యాక్కర వంటి వారి హీర్‌చందస్సులోని పాటలు వింటూ, నిలువెత్తు ఆవచేలల్లో, మొక్కజొన్న చేలలో, రహస్యంగా పెంచే నల్లమందు తోటలలో, భంగ్ (భంగా) తోటలలో తిరిగాను. ప్రాప్రా (భ్రాతా భ్రాతా) అంటూ చుట్టూ చేరి నా జరీ ఖద్దరు పంచెలు, జరీ ఉత్తరీయాలు చుట్టుకొని ఆనందించే అమాయకులైన పల్లెపడుచుల ఆనందాన్ని చూచి మురిసిపోతూ, రబ్బా! (భగవంతుడా!) నీవున్నావు. నీవు భారత గ్రామ ప్రజల ఆనందంలో ఉన్నావు – అనుకొని కళ్ళు మూసుకొని మా అమ్మను తలచుకొని, ఆమె మాటలు మననం చేస్తూ సంతోషించాను” అంటారు రామచంద్ర. ఎంత మనస్విత!!!
మంజుశ్రీ గారి ముందు మాటలో శ్రీ రామచంద్ర గారి వ్యకిత్వ విశ్లేషణ ఈ క్రింది వాక్యాల్లో చూడండి!
“గురువుల పట్ల రామచంద్రగారికి ఉన్న ఆదరగౌరవ ప్రేమాభిమానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గౌతమ ధర్మ సూత్రాలు, మనుస్మృతి వంటివి మా గురువులను చూసే సూత్రాలు రచించారేమో అన్నంత ఆత్మార్పణం, అభినివేశం చూపారు రామచంద్ర. ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు, మా గురువు గార్ల వంటి వాళ్ళను చూచే ధర్మ శాస్త్రకారులు తమ సూత్రాలు రచించారా – అని అనిపించేది. ‘ మా గురువుల వ్యక్తిగత జీవితాలు మాకు తెలియవు. మేము తెలుసుకుందామనే రంధ్రాన్వేషణకు ఎప్పుడూ పూనుకో లేదు. వారు మాతో ప్రవర్తించిన తీరు చాలు, వారి వైయుక్తిక జీవితమూ పవిత్రంగా ఉంది అనడానికి. వారి వాత్సల్యం ఎంతటి దుష్టచిత్తుణ్ణైనా శిష్యుణ్ణి చేసేది. వారి బోధనా విధానం ఎంత మూర్ఖుణ్నైనా ప్రబుద్ధుణ్ణి చేసేది ‘ అంటారు రామచంద్ర. వారి గురువులు నిజంగా గొప్పవారే! అయినా వారిని ఈ విధంగా ఆరాధించడం రామచంద్రగారి మనస్వితకు గొప్ప తార్కాణం. వారి దగ్గర చదువుకున్నవారు అందరూ రామచంద్రలు కాగలిగారా?”
సంస్కృత శ్లోకాలు
ప్రతి అధ్యాయం ముందు, కొన్ని చోట్ల మధ్యలో, అన్ని అధ్యాయాల్లోనూ చివర ఒక అద్భుతమైన సంస్కృత లేదా ప్రాకృత శ్లోకం ఉదాహరించటం శ్రీ రామచంద్ర గారి సంస్కృత – ప్రాకృత భాషాభిమానానికి ఒక ఉదాహరణ. ఈ శ్లోకాల ద్వారా సత్పురుషుల ప్రవర్తన, కొన్ని నీతులు చెప్పబడ్డాయి. సంస్కృత – లేదా ప్రాకృత భాషలపై ఆయనకు గల ప్రవేశం, పట్టు పాఠకులకు తెలియటం కోసం శ్రీ రామచంద్ర గారు ఊటంకించిన కొన్ని శ్లోకాలను ఇక్కడ మీ కోసం ఇస్తున్నాను.
అంజనేన వినా విద్వాన్
జ్ఞానీ సర్వం సమీక్షతే,
అంజనాలిప్త నేత్రోః
మూర్ఖః కిమసినేక్షతే
(అంజనం మొదలయినవి లేకపోయినా విద్వాంసుడైన జ్ఞాని అంతా చూడగలుగుతాడు. అంజనం కళ్ళకు రాసుకున్నా మూర్ఖుడు ఏమీ చూడలేడు. అధ్యాయం 13 – “అంజనంలో కనిపించిన పట్టణద ఎల్లమ్మ”)
తుంగోచ్చి అ హో్ఇ మణో
మణంఖణో ఆంతిమాసు విదసాసు,
అత్థను అమ్మి విరిణో
కిరణా ఉద్దంచి అ పురం తి
(గొప్పవారి మనస్సు తుది దశలో కూడా తన గొప్పదనాన్ని కోల్పోదు. ఉన్నతంగానే ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా అతని కిరణాలు వాలిపోవు. పైకి ప్రసరిస్తాయి. అధ్యాయం 21 – “మహాతపస్విని కొండమ్మవ్వ”)
సత్యం తపో జ్ఞాన మహింసతా చ
విద్వత్ర్పణామం చ సుశీలతా చ,
ఏతాని యో ధారయతే స విద్వాన్
న కేవలం యః పఠతే స విద్వాన్
(సత్యం, తపస్సు, జ్ఞానం, అహింసా గుణం, విద్వాంసులను సేవించడం, ఉత్తమ శీలం – ఈ గుణాలు ఉన్నవాడే విద్వాంసుడు. వట్టి చదువుతో విద్వాంసుడు కాడు. అధ్యాయం 28 – “శిష్యవత్సలులు మా గురువులు”)
మూర్ఖ చిహ్నని షడతి
గర్వో దుర్వచనం ముఖే
విరోధీ విషవాదీ చ
కృత్యాకృత్యం న మన్యతే
(మూర్ఖుని లక్షణాలు ఆరు: గర్వం, పరుషమైన పలుకు, విరోధం, చెడ్డగా వాదించడం, చేయగలిగిందేది, చేయదగందేది అనే పరిజ్ఞానం లేకపోవడం. అధ్యాయం 28 – ” శిష్యవత్సలులు మా గురువులు”)
కుసుమ స్తబక స్యేవ
ద్వయీ వృత్తిః మనస్వినాం,
మూర్ధ్ని వా సర్వలోకస్య
శీర్యతే వన ఏవ వా||
(ఉత్తమాశయాలు గల మనస్సు కలవాడు మనస్వి. అలాటివాడు పూలగుత్తి వంటివాడు. పూలగుత్తికి రెండే స్థానాలు. అందరి తలలను అలంకరించడం, లేక అడవిలోనే రాలిపోవడం. అధ్యాయం 31 – “మానవల్లివారి కృపాకటాక్షం”)
యం సంతి గుణాః పుంసాం
వికసంత్యేన తే స్వయం !
న హి కస్తూరి కామోదః
సపథేన నివార్యతే ||
(ఎవరికైనా గుణాలు, యోగ్యతలు ఉన్నప్పుడు, అవి వాటంతట అవే బయటపడి ఇతరులను ఆకట్టుకుంటాయి. కస్తూరి గుమగుమలు ఎవరైనా ఒట్టు పెట్టిన మాత్రాన ఆగవు. అధ్యాయం – 33 “నేను చూచిన అద్భుతాలు”)
గౌరవం ప్రాప్యతే దానాత్
సతు విత్తస్య సంచయాత్
స్థితి రుఛ్చైః పయోదానాం
పయోధీనా మధః స్థితిః
(దానం చెయ్యడం వల్లనే గౌరవం కలుగుతుంది. కూడ బెట్టడం వల్ల కలుగదు. మేఘాలు దానమిస్తున్నాయి, వర్షిస్తున్నాయి. కనుక వాటి స్థానం మీదనే ఉంది. సముద్రం నీటిని కూడబెడుతున్నది: గనుక దాని స్థానం కిందే. అధ్యాయం 41 – “నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో”)
పొట్ట భరంతి స ఉణా
వి మా ఉ అప్పణో అనువ్విగ్గా
విహలుద్ధరన సహావా
హువంతి జ ఇకేవి సప్పురిసా
(పక్షులు కూడా ఎలాటి ఒడిదొడుకులూ లేకుండా తమ పొట్ట పోసుకుంటాయి. అది ఒక గొప్ప సంగతి కాదు. ఆర్తులను ఉద్ధరించే స్వభావం గల సత్పురుషులు కొందరే ఉంటారు. అధ్యాయం 50 – “నాగేశ్వర సందర్శనం”)
తం కిం పి సాహసాం పా –
హుసేణ సాహంతి సమస సహావా,
జం భావి ఊణ దివ్యో
పరం ముహో దుణి ని అసీనం
(సాహసం స్వభావం గలవారు సాహసంతో సాధించదగిన పనులు సాధిస్తారు. దానిని తలచుకొని దైవం ముఖం తిప్పి తల పరికిస్తుంది – గడుసువాడే అనే భావంతో. అధ్యాయం 52 – “మద్రాసులో సుభాష్ చంద్రబోస్”)
క్వచి ద్భూమౌ శయ్యా క్వచ్చి దపి చ పర్యంక శయనం
క్వచి చ్ఛాకాహారీ క్వచిదపి చ శాల్యోదన రుచిః
క్వచి త్కంథాధారీ క్వచి దపి చా దివ్యాంబరధరః
మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖం
(గొప్ప పనులు సాధించదలచిన మంచి మనస్సుగలవాడు సుఖదుఖాఃలను లెక్కపెట్టడు. కార్యార్థి అయి పరదేశానికి వెడతాడు. అక్కడ అనుకున్న సౌకర్యాలు ఉంటాయా? ఉండవు. నేల మీద పడుకోవలసి ఉంటుంది. కటిక నేల మీదే పడుకుంటాడు. మరొక చోట తినడానికి ఏమీ దొరకవు. కాయలు, కూరలు తప్ప. వాటినే సంతోషంగా ఆరగిస్తాడు. మరొక చోట కప్పుర భోగి వంటకం లభిస్తుంది. దానిని లొట్టలు వేస్తూ తింటాడు. పని పూర్తి కాదు. చాలా కాలం ఉండవలసి వస్తుంది. బట్టలు మాసి పోతాయి. ఉతుక్కోటానికి అవకాశం ఏదీ? అవి బొంతల్లాగ తయారవుతాయి. వాటినే కట్టుకుంటాడు. ఒకప్పుడు దివ్యాంబరాలు దొరుకుతాయి. వాటిని మెచ్చుకుంటూ ధరిస్తాడు. ఇలా కార్యసాధకుడు కాల దేశ వర్తమానాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ పనులు సాధిస్తాడు. కష్టమని చేతులు కట్టుకొని కూర్చోడు, సుఖమని పొంగిపోడు అంటాడు భత్తృహరి. అధ్యాయం 56 – “డా. రఘువీర మాట వినక మిలటరీలో చేరిక”)
యస్తు సంచరతే దేశాన్
యస్తు సేవేత పండితాన్
తస్య విస్తారితా బుద్ధిః
తైల బిందు రివాంభసి
(ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె సెక్కలా విస్తరిస్తుంది! చివరి అధ్యాయం 61 – “డెయిలీ టెలిగ్రాఫ్‌లో”)
ఈ పుస్తకం మొత్తం చదివితే ఎక్కడ శ్వోత్కర్ష కనపడదు. ఆయన సాధించిన విజయాలను కూడా వినమ్రంగా చెప్పుకొన్న శౌశీల్యులు శ్రీ రామచంద్ర. ఇంత గొప్ప వ్యక్తికి తగినంత ఆదరింపు తెలుగువారు ఇవ్వలేదనే చెప్పుకోవాలి. “మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లాహోర్ పాకీస్తాన్‌కు పోయినప్పుడు నా పిత్రార్జితం పోయినట్టు ఏడ్చాను” అని ఆయన తన ఆత్మ కథలో వివరిస్తున్నప్పుడు ఒక గొప్ప దేశాభిమాని, అంతకు సరితూగే “మనస్వి” సాక్షాత్కరిస్తారు మనకి. తన జీవితమంతా నిరాడంబరుడిగా గడిపిన రామచంద్ర గారి రచనలు ఈ నాటి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక దాని మీదొకటి పేర్చుకొని పెట్టుకుంటే నలభై అంగుళాలు (పదహారు వేల పేజీలు) రాగల ఆయన సాహిత్యానికి మరణం లేదు. ఆయన సాహిత్యమంతా గొప్పదే! అందులో ఆయన రచనల్లో మకుటాయమానమైనది వారి ఆత్మ కథే!
ముఖఃపరిచయం
శ్రీ తిరుమల రామచంద్రగారి పుస్తకాలు అప్పటికే అనేకం చదివినా వారితో నాకు ముఖఃపరిచయం లేదు. అది 1996 సంవత్సరం. ఊరు విజయవాడ. సందర్భం – ప్రముఖః కథా రచయిత శ్రీ మధురంతకం రాజారం గారికి అజో-కం-విభో ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం. అవి నేను, నా కవల సోదరుడు రామన్నతో కలిసి అప్పాజోస్యుల – విష్ణుభొట్ల – కందాళం ఫౌండేషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న రోజులు. “అహంభో అభివాదయే“, “మరపురాని మనీషి” (ఇది పుస్తక రూపంగా తరవాత వెలుగులోకి వచ్చింది), “తెలుగు లిపి, పుట్టుపూర్వోత్తరాలు”, “సాహితీ సుగతుని స్వగతం“, “తెలుగు పత్రికల సాహిత్య సేవ”, “నుడి-నానుడి“, “హాలగాథలు”, “బృహదారణ్యకం”, “మనవి మాటలు”, “బుద్ధుణ్ణి బళ్ళో వేశారు”, వంటి శ్రీ రామచంద్ర విరచితమైన ముఖ్యమైన రచనలు చదివినా, ప్రత్యేకంగా రామచంద్ర గారి గురించి తెలిసింది ఎక్కువ లేదు. అప్పుడు మంజుశ్రీ గారి ద్వారా పరిచయమయ్యారు మాకు. అతి సామాన్యునిలా కనిపించే ఈ అసామాన్యుడేనా ఆ పుస్తకాలన్నీ రాసింది అనిపించింది చూడగానే! పరిచయం జరిగిన తరవాత కాలంలో వారి గురించి మరిన్ని వివరాలు తెలియటం, వారి అత్మ కథను పుస్తక రూపంగా చూడాలన్న ఆయన ఆఖరి కోరిక ఫౌండేషన్ ప్రచురణల ద్వారా తీరటం – ఇవన్నీ తరవాత కాలంలో ఏర్పడ్డ పరిణామాలు. శ్రీ రామచంద్ర తమ ఆత్మ కథను పుస్తక రూపంలో చూడకుండానే పరమపదించటం దురదృష్టకరం! రెండు ప్రచురణలు పొందిన ఈ పుస్తకం అతి త్వరలోనే అన్ని ప్రతులు అమ్ముడుపోటం ఈ పుస్తకం గొప్పతనాన్ని మళ్ళీ విశదపరుస్తుంది.
కృతజ్ఞత
ఈ పుస్తకం చివర శ్రీ రామచంద్ర తెలుగు పాఠకలోకానికి తమ కృతజ్ఞతలు ఈ క్రింది విధంగా చెప్పుకున్నారు.
ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు. నేను సామాన్య మానవుణ్ణి. సగటు మనిషిని. కాని నాలో వైచిత్ర్యం, వైవిధ్యం ఉన్న మాట నిజం. ఎవరి జీవితంలో వైవిధ్యం లేదు గనుక? ప్రతి మనిషీ ఒక మూసలో పోసినట్టున్నాడా? అయినప్పుడు వైవిధ్యం తప్పదు. అందువల్ల మిత్రులు కొందరు నాలోని వైవిధ్యాల కన్నా వైరుధ్యాలు చూచి ముచ్చటపడి నా జీవితంలోని కొన్ని సంఘటనలను వ్రాయమన్నారు. కొందరు మారాం చేసారు. మిత్రులు బరోడా బాంక్ సికిందరాబాద్ శాఖ, ఛీఫ్ మేనేజర్ జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గారు రెండు మూడునాళ్ళు నాతో ఉండి, నా చిన్ననాటి సంఘటనలను ప్రశ్నిస్తూ, గుర్తు వచ్చేటట్టు చేస్తూ, చెప్పినవి చెప్పినట్టు కాగితంపై వ్రాస్తూ, వివరంగా రాయాలని ప్రోత్సహించారు. మిత్రులు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారు ఉదంతాలుగా వ్రాయండని బలవంత పెట్టారు. అరవై ఒక్క వారాలపాటు ప్రచురించారు ఇప్పటి సంపాదకులు. నా చిన్ననాటి మిత్రులు ఏ.వి. దేశికాచార్యులుగారు, బాణగిరి శ్రీకృష్ణమాచార్యులు గారు, కోలాచలం బాలకృష్ణ వంటి వారూ, పోలవరపు కోటేశ్వరరావు గారి వంటి సహృదయ పాఠకులూ ఏ వారానికి ఆ వారం చదువుతూ సంతోషం ప్రకటించారు. శంకరగల్లు వరదాచార్, కుంటిమద్ది భక్తవత్సలం వంటి భాతృవర్గం వారు ఎప్పటికప్పుడు ఉత్తరాలు వ్రాశారు మెచ్చుకుంటూ. ఇక మహిళాలోకం గురించి చెప్పనక్కర లేదు. నేను ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ పెండ్లికి వెళ్ళినా, ఒకే పొగడ్తలు. వీరందరికీ కృతజ్ఞత ఎలా చెప్పుకోను? నమస్కరించడం తప్ప?
భాషా సేవకుడు
తిరుమల రామచంద్ర
పుస్తకం వివరాలు
ఈ పుస్తకం ఇంకా విక్రయానికి దొరుకుతుందో లేదో తెలియదు.
అజో-కం-విభో ఫౌండేషన్ వారు 1997 సంవత్సరంలో పేరుగాంచిన సాహితీవేత్త మంజుశ్రీ సంపాదకత్వంలో శ్రీ రామచంద్రగారి ఈ ధారావాహిక నవలకు ప్రధమ ముద్రణగా పుస్తక రూపాన్నిచ్చారు. 2000 సంవత్సరంలో ప్రముఖ కథా రచయిత భరాగో ఆధ్వర్యంలో రెండో ముద్రణ చూచిన ఈ పుస్తకాన్ని కూడా తెలుగు పాఠకులు ఆదరించారు. ఈ పుస్తకం వెల 150 రూపాయలు. ప్రతులకు నవోదయా బుక్ హౌస్ వారిని సంప్రదించవచ్చు.
శ్రీ రామచంద్ర గారు దివంగతులు కావటంతో, ఈ పుస్తకం అమ్మకాలపై వచ్చిన మూల్యాన్ని శ్రీ రామచంద్ర గారి ధర్మపత్ని శ్రీమతి అనంత లక్ష్మిగారికి అందచేయటం జరిగింది.
(1997 సంవత్సరంలో తన 84వ ఏట కన్నుమూసిన శ్రీ తిరుమల రామచంద్ర తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక “మరపురాని మనీషి”.)
Avancha Ramadevi
Naalugella kritham chadivinappudu anipinchindi ventane Hampi velli choosi ravalani.Atmakadhalante ventane gurthukuvache vatillo agragami ani na abhipralyam.Anarkalli samadhi Lahore lo vundani telisi chala ascharya poyamu.swantha kadha matrame kakunda desa,kala, mana paristulanu manushula manasthvalanu nirmohamatam ga cheppina pusthakam.
Srinivas Nagulapalli
అజో విభో వారి పుణ్యమా అని జంపాలగారి ద్వారా విని ఈ పుస్తకాన్ని చదివే అవకాశం నా అదృష్టం. (ఆలస్యంగానైనా)సమీక్ష చదవగానే చాలా సంతోషం, లక్ష్మన్న గారు వ్రాయడం ఎంతో ఔచితీమంతం కూడా.
గొప్ప సాహిత్య ప్రతిభ ఉండొచ్చు,సౌశీల్యం అంత లేకపోవచ్చు.
చక్కని మాటలు చెప్పొచ్చు,చల్లని మనసు లేకపోవొచ్చు.
ఘనమైన వాక్పటిమ ఉండొచ్చు, కొంతైనా వాక్పారుష్యం వీడకపోవొచ్చు.
కవిరాజు సామ్రాట్టు జ్ఞానపీఠగ్రహీత అని పెట్టుకోవొచ్చు, భాషాసేవకులు అనుకోకపోవొచ్చు.
ఉన్నతమైన సత్కారాలు ఎన్నో పొందొచ్చు, ఉన్నతమైన భావాలు ఒక్కసారైనా వీడొచ్చు.
అటువంటి వెలితి ఏ మాత్రం లేని కనపడని వారు చాలా అరుదు, ఏ రంగంలోనైనా భాషలోనైనా దేశంలోనైనా కాలంలోనైనా. ఆ కోవలోనివారే తిరుమలరామచంద్రగారు అనిపిస్తుంది.
నవనవోన్మేషంగా, భాషాపరమైన విషయాలు, స్వాతంత్ర్య పోరాట సంగతులు, స్ఫూర్తిమంతమైన సంఘటనలు, ఆశ్చర్యపరచే కథనాలు, మరెన్నో విషయాలు పుస్తకంలో ఉండడం ఒక ఎత్తు. అది రామచంద్రగారి ఆత్మకథగా గొప్ప జీవితానుభవాలను అంతరంగాన్ని ప్రతిబింబించే నిర్మల సాహితీ స్రవంతి కావడం ఇంకో ఎత్తు. అంతే లోతు కూడా.
పుస్తకంలొ ఎన్నో సూక్తులు శ్లోకాలున్నా నాకు బాగా నచ్చింది మాఉరాయడనే ప్రాకృతకవి శ్లోకం
తుంగోచ్చి అ హో్ఇ మణో
మణంఖణో ఆంతిమాసు విదసాసు,
అత్థను అమ్మి విరిణో
కిరణా ఉద్దంచి అ పురం తి
(గొప్పవారి మనస్సు తుది దశలో కూడా తన గొప్పదనాన్ని కోల్పోదు. ఉన్నతంగానే ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా అతని కిరణాలు వాలిపోవు. పైకి ప్రసరిస్తాయి)
ఇది నాకే కాదు, తిరుమల రామచంద్రగారికి కూడా బాగా నచ్చినదేమో! ఎందుకు? ఎందుకంటే పుస్తకంలో వివిధ సందర్భాల్లో ఎన్నో శ్లోకాలు ఉటంకించినా, దీనినే రెండు సార్లు ప్రస్తావించారు, కొద్దిపాటి తాత్పర్యం తేడాతో.
—–
విధేయుడు
_శ్రీనివాస్
విష్ణుభొట్ల లక్ష్మన్న
సుజాత గారు, బిందుమాధవి గారు, మందాకిని గారు, అఫ్సర్ గారు, రవి గారు, చిన్నారి గారు:
మీ అభిప్రాయాలకి కృతజ్ఞతలు. అఫ్సర్ గారన్న రెండవ పాయింటు నాకు అనుభవం లేనిది. అయినా, ఈ పాయింటు ముఖ్యమైనదే! ఇక “మరపురాని మనీషి” పుస్తకాన్ని ఇక్కడే ఇదివరకు క్లుప్తంగా పరిచయం చేసాను. ఇప్పుడు “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” చదువుతున్నా. ఆ పుస్తకాన్ని కూడా ఇక్కడే పరిచయం చెయ్యాలని కోరిక.
నా ఈ పరిచయం కన్నా ఈ పరిచయానికి మూలమైన ఈ పుస్తకమే చాలా గొప్పది. శ్రీ రామచంద్ర గారితో పరిచయం వల్ల వారి విశిష్ట వ్యక్తిత్వం కొంత నేను ప్రత్యక్షంగా గమనించాను. ఒక ఉదాహరణ.
మే నెల 1996 సంవత్సరంలో వారి నుంచి ఆష్టిన్, టెక్సస్‌లో ఉన్న నాకు కూడా ఒక ఉత్తరం వచ్చింది. ఆ లేఖ సారాంశం:
**************************************************
మీరు నిర్వహించిన సాహిత్యోత్సవంలో శ్రోతగా వచ్చిన నాతో ప్రారంభోత్సవం చేయించి నాకు గొప్ప గౌరవం కలిగించారు. అంతే కాక నన్ను వేయినూట పదహారు రుపాయలతో సన్మానించారు. నేను స్వాతంత్ర్య సమరయోధుడిని. రైల్వే వారి ఫ్రీ ట్రావెల్ ప్యాసు ఉంది. ఈ సంగతి మీకు తెలిపి నాకు రైల్వే ఖర్చులు అక్కరలేదన్నాను. అయినా మీరు “అందరి అతిధుల్లాగే మీరూను” అంటూ రైలు ఖర్చులు కూడా ఇచ్చారు. ఈ అవ్యాజ గౌరవానికి నేనెంతో ఋణపడి ఉన్నాను.
సౌజన్య విలసితమైన మీ ప్రవర్తన అపూర్వమైనది. మీరు అమెరికా నుంచే వచ్చారా? అన్నేళ్ళు ఉన్నా మీ తెలుగు తనం పోలేదా? అంకుల్ శ్యాములు కాలేదా? – అని అందరూ విస్తుపోయారు మీ ప్రవర్తన చూచి.
*********************************************************
ఆ లేఖ చదువుకొని అప్పుడు శ్రీరామచంద్ర గారి ఆశీస్సులు మాకు దొరికాయని ఎంత ఆనందించామో ఆ ఉత్తరాన్ని దాచుకొని ఇప్పుడు చదివినప్పుడల్లా అంతే ఆనందం పొందుతాము.
మరిన్ని వివరాలతో మరోసారి.
విష్ణుభొట్ల లక్ష్మన్న
chinnari
హంపి నుండి హరప్పా,గురిన్చిన వ్యాసమ్, ప్రతిస్పందనగా వచ్చిన వ్యాఖ్య లను చదివి తే మనసంతా ఒక అనుభూతి.మంద నున్చి తప్పి పొయి న మేకపిల్ల కు దూరం నుండి తన వాళ్ళు కనబడి తే ఎలా ఉం టుందో అలాంటి ఫీల్.ఇలాంటి సాహితీప్రపంచం గురించి పరిచయం గలగడం( కూడలి గ్రేట్) చాలా ఆనందం గా ఉంది.సాహిత్య కుసుమాలు,కవితా పరిమళాలు.పర్వా లేదు లోకం పూర్తి మెటిరిలిసమ్ లోకి వెళిపోలేదు.
రవి
ఈ పుస్తకం గురించి చాలాకాలం క్రితం ఓ చిత్తుప్రతి రాసుకున్నాను. అయితే నాబోటి వాడు పరిచయం చేస్తే, గౌరవం తగ్గుతుందేమోనన్న భయంతో ప్రచురణనిమిత్తం పంపలేదు. ఇప్పుడు మీరు సరైన న్యాయం చేశారు.
ఆంధ్రప్రభలో వచ్చేప్పుడు నేను ఈ పుస్తకం సీరియల్ గా చదివాను. తెలుగు, కన్నడ, తమిళ సంప్రదాయాల మధ్య నేను కూడా పెరగడం వల్లనేమో సీరియల్ చదువుతుంటే, ఇంటి ముందు వసారాలో మా తాతయ్య కూర్చుని కథలు చెబుతున్నట్టు ఉండేది. పుస్తకం వచ్చిన తర్వాత ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
ఇప్పుడు కూడా విశాలాంధ్రలో పుస్తకం దొరుకుతున్నదండి.
afsar
తిరుమల రామచంద్ర గారి గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది, లక్ష్మన్న గారూ! మీ వ్యాసం ఆయన వ్యక్తిత్వ మూలాల్ని చక్కగా చెప్పింది. బహు భాషా పరిజ్ఞానం దాదాపూ క్షీణించిపోతున్న ఈ కాలంలో అలాంటి వారి గురించీ, వారి భాషా సేవ (రాంచంద్ర గారు ఎప్పుడు వుత్తరాలు రాసినా కింద “మీ భాషా సేవకుడు” అని సంతకం చేసే వారు. అది ఆయన భాషా నిబద్ధతకి గుర్తు).
“హంపీ నించి హరప్పా దాకా” ఆయన గొప్ప పుస్తకం. కాని, ఆయన ఇంకో రచన ” మరపు రాని మహా మనీషి” కూడా అంతే గొప్ప పుస్తకం. ఈ రెండీటినీ కనువిందుగా, అచ్చు వేసింది అజోవిభో. ఆ రెండో పుస్తకం గురించి కూడా మీ పరిచయ వాక్యాలలో చదవాలని అనుకుంటున్నా.
“హంపీ నించి హరప్పా దాకా” రెండు కారణాల వల్ల నాకు బాగా నచ్చింది.
ఒకటి: మన సాహిత్యంలో, సంస్కృతిలో శ్రీవైష్ణవ సాంప్రదాయం అత్యంత బలమయిన భావ ధార. కాని, ఆ కోణం ఇప్పటికీ విస్మృత కోణమే. ఈ పుస్తకం ఆ లోటుని చాలా వరకి తీరుస్తుంది. ఆ విధంగా చూస్తే, ఆధునిక వ్యక్తిత్వ వికాస చరిత్రలో కుటుంబ రావు గారి “చదువు” ఎంత విలువయిన సాధనమో, దానికి సమాంతరమయిన సాంస్కృతిక వ్యక్తిత్వ వికాస చరిత్రలో రామచంద్ర గారి పుస్తకం అంత విలువయిందని నాకు అనిపిస్తోంది. అయితే, నేను కాస్త ఆత్మకథల పక్షపాతిని కావడం వల్ల, రామచంద్ర గారి పుస్తకం ఇంకా గట్టిగా నా మనసుకి హత్తుకుపోయిందనుకోండి!
రెండు: తెలుగు-కన్నడ సాంస్కృతిక సాన్నిహిత్యం కూడా ఈ ఆత్మ కథనంలో మరో బలమయిన కోణం. అనంతపురం సరిహద్దు గ్రామాలకి వెళ్ళినప్పుడల్లా ఆ రెండు సంస్కృతుల సమ్మేళనం ఎవరికయినా అబ్బురంగా అనిపిస్తుంది. రామచంద్ర గారి పుస్తకం చదువుతున్నంత సేపూ ఆ వూళ్ళన్నీ చుట్టి వచ్చినట్టుగా వుంటుంది.
మంచి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు.
కానీ, మీ నించి రామచంద్ర గారి గురించి వినాలనుకున్న సంగతులు ఇంకా వున్నయని అనిపించింది ఈ వ్యాసం చదువుతూ వుంటే.
చూస్తూండగానే, వొక తరం అంతరించిపోతోంది. మొన్నటికి మొన్న కోవెల గారు కూడా వెళ్ళిపోయారు. ఈ గొప్ప వ్యక్తిత్వాల అనుభావాలు రికార్డు చేసే స్మృతి సాహిత్యం మనకి ఇవాళ చాలా అవసరం. భాష అంటే మమకారం తగ్గిపోతున్న ఈ కాలంలో ఆ వ్యక్తుల జీవిత పాఠాలు మనకి కావాలి. మీ లాంటి వారు కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడం స్వొత్కర్ష కానే కాదు.
అప్పుడప్పుడూ “పుస్తకం” మిత్ర ద్వయం అలాంటి చిరు వ్యాసాలు రాస్తూ వుంటారు. అవి చాలా ముచ్చటగా వుంటాయి.
మీరూ ఆ వైపు కాస్త దృష్టి పెడితే, అది ఈ తరానికి మంచి కానుక.
మందాకిని
మంచి పరిచయం. ధన్యవాదాలు.
bindumadhavi
అవునండీ నేను కూడా మీరు చెప్పిన విధం గా ఈ పుస్తకం ఆంధ్ర ప్రభ లో సీరియల్ గా చదవటం జరిగింది.
ఒక వ్యక్తి తన జీవన గమనాన్ని, అందులో అనుభవించిన ఆటుపోటులని, మధురానుభూతులని ఎల హ్రుద్యం గా గ్రంధస్తం చెయ్యచ్చో చూసి ఆనందించాను.
తరువాత నాకు చాల నచ్చిన వ్యక్తి కి ఒక ముఖ్యమైన సందర్భం లొ ఇవ్వదల్చుకున్న బహుమతి గా ఈ పుస్తకమొక్కటె యోగ్యం అని భావించి ఇవ్వటం జరిగింది.
నా మనవల తరానికి కూడా ఇది ఒక సమగ్ర గ్రంధం గా అందించాలని నేనూ కొని దాచుకున్నాను
మీ ప్రయత్నానికి నా అభినందనలు.
సుజాత
నేను రాస్తూ రాస్తూ….దార్లో ఉన్నాను.(నా బ్లాగుకోసం) ఈ లోపు మీరు రాసేశారు. చాలా సంతోషం!
ఇక్కడ రవి గారు రాస్తారని అనుకున్నాను!:-)
ఇది ఒక సాహితీ కారుడి సమగ్ర జీవన దృశ్యం! నన్ను ఎవరైనా అడిగితే ఈ అపురూపమైన గ్రంథానికి జ్ఞానపీఠం ఇవ్వాలని రికమెండ్ చేస్తాను. (జ్ఞానపీఠానికి నిబంధనలేమిటో గానీ..:)! పైగా దివంతులకు జ్ఞాపీఠం ఇవ్వరటగా!) జ్ఞానపీఠం గురించిన ఒక ఆసక్తికరమైన చర్చ ఇక్కడ..
http://chandrima.wordpress.com/2008/10/02/%E0%B0%99%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0%E0%B0%AE%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81/
ఈ పుస్తకం కొన్ని చోట్ల అందుబాటులో ఉంది మరి! దీన్ని ఆంధ్ర ప్రభలో అనుకుంటాను సీరియల్ గా వస్తున్నపుడు కొన్ని భాగాలు చదివాను కూడా!
ఇది చదివాక హంపీ వెళ్ళినపుడు రామచంద్ర గారి ఇల్లు కోసం వెదుకుతూ కమలాపురం అంతా తిరిగాను.