‘మరపురాని మనీషి’ – తిరుమల రామచంద్ర

marapuraniఅసలు ఏ రంగంలోనైనా ప్రత్యేక స్థాయికి ఎదిగిన వారిని గుర్తుంచుకోవాలా?

అవును గుర్తుంచుకోవాలి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మన ముందు తరాల్లో కొంతమంది మహా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల పేర్లు తెలుసుకున్నా చాలు! వారు ఎందుకు గొప్పవారో తెలిస్తే మరీ మంచిది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం తెలునాట జీవించిన కొందరు తెలుగు తేజో మూర్తుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, శ్రీ తిరుమల రామచంద్ర గారు ఇంటర్వ్యూ చెయ్యగా, శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తీసిన అరుదైన ఫోటోలతో ప్రచురించబడ్డ పుస్తకం ‘మరపురాని మనీషి ‘ మీరు చదివి తీరవలసిన పుస్తకం.

రామచంద్ర గారు ఎవర్ని ఇంటర్వ్యూ చేశారు?

సంగీత, సాహిత్య, కళా రంగాల్లో అసమాన ప్రతిభగల దిగ్గజాలను కొందరిని తెలుగు వారికి తిరిగి పరిచయం చేసారు. పరిచయం చేయబడ్డవారిలో కొందరు గాంధేయవాదులు, మరి కొందరు సాంఘిక సేవకులు, ఇంకా కొందరు విద్యావేత్తలు – ఇలా అనేక రంగాల్లోని ప్రతిభామూర్తులను పరిచయం చేసారు. ఇవన్నీ, 1962-64 సంవత్సరాల్లో ‘ఆంధ్ర ప్రభ సచిత్రవార పత్రిక ‘లో ధారావాహికంగా ప్రచురించారు.

భారతీయుల గురించి పెద్దగా చెప్పగలిగే సాహసం నాకు లేదు కానీ, ముఖ్యంగా తెలుగు వారికి మాత్రం, ప్రముఖుల జీవిత విశేషాలు, వారు చేసిన గొప్ప పనులు గ్రంధస్థం చెయ్యటంలో తగినంత శ్రద్ధలేదు అనిపిస్తుంది. అటువంటి నేపధ్యంలో, శ్రీ తిరుమల రామచంద్ర, నీలంరాజు మురళీధర్ ఛాయాచిత్రాలతో కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. కాశీ కృష్ణా చార్యులు, మాడపాటి హనుమంతరావు, తాపీ ధర్మారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బందా కనకలింగేశ్వరరావు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ,  విశ్వనాధ సత్యనారాయణ, గుఱ్ఱం జాషువా, ద్వారం వెంకట స్వామి నాయుడు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, తుమ్మల సీతారామ చౌదరి, నాయని సుబ్బారావు, బందా  కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి వంటి పెద్దల (మొత్తం ముప్ఫై మంది వ్యక్తులు) జీవిత విశేషాలు ఈ రకంగా పుస్తక రూపంలో వచ్చి, తరవాత తరాల వారికి అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం కొందరు తెలుగు  వెలుగుల జీవితరేఖినీ చిత్రాల సంపుటి.

ఈ మధ్యే ఇక్కడ పరిచయం చెయ్యబడ్డ కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని కూడా ఈ పుస్తకంలో పరిచయం చేసారు.

ఈ పుస్తకంలోని 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల గురించి కొన్ని వివరాలు:

కాశీ కృష్ణాచార్యులు

రెండు తరాల క్రింది మాట. బందరు పురమందిరం కిటకిటలాడి పోతున్నది. దిగ్దంతులైన పండితులు, మహాకవులు, పుర ప్రముఖులు చెవులు రిక్కించి వింటున్నారు. వేదికపై తిరుపతి వేంకట కవులు, నాదెళ్ళ పురుషోత్తమ శాస్త్రులు, మేధా దక్షిణామూర్తి శాస్త్రులు, శిష్ట్లా నరశింహ శాస్త్రులు, బుక్కపట్టణం తిరుమల వేంకటాచార్యులు మున్నగు విద్వత్కవిశేఖరులు వందమందికి పైగా పృచ్ఛకులు ఆసీనులయ్యారు. జంధ్యాల గౌరీపతి శాస్త్రులు అధ్యక్షపీఠం అలంకరించారు.

ఆ పండిత గోష్ఠి మధ్యన ఒక స్పురద్రూపి, వాక్చతురుడు, అయిన యువకుడు హాస్యప్రసంగాలు, శాస్త్రార్ధాలు జరుపుతూ, అసాధారణ ధారణా ధోరణితో పృచ్ఛకులకు సమాధానం చెపుతున్నాడు. ఆయన కంఠధ్వని శంఖధ్వని లాగ పురమందిరాన్ని తరంగితం చేసింది.

కొంతసేపటికి పండితులందరూ ఒక్కుమ్మడిగా లేచి, ఆ యువ పండితునికి కాశ్మీరు శాలువలు కప్పారు. ‘అవధాన శిరోమణి” బిరుదం ప్రకటించారు. వందల కొలది ప్రశంసా పద్య పుష్పాలు కురిపించారు. అదీని, స్వజన్మ స్థలంలో ఈ సన్మానం ఆ పండితునికి!

ఆయనే మన ప్రధమ ఆస్థాన కవివతంసులు శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారే!

తొంభయి రెండేళ్ళు పైబడి నేడు దేహం ధనుస్సువలె వంగినా, తొణుకూ, బెణుకూ లేని ఆ మాట తీరు, శరీరపాటవం, కొద్దిగా సడలినట్టు కనిపిస్తున్నా, పొంగులువారే ఆ ప్రవచనోత్సాహం, తపస్సుతో, సారస్వత తపస్సుతో ఉజ్జ్వలించే ఆ ఆకార సంపద – కృష్ణాచార్యులవారిని చూచినవారు తొలిచూపులోనే, ఏ కారణజన్మునో దర్శించి కృతకృత్యులమయామని తనిసిపోక తప్పదు.

ద్వారం వెంకటస్వామి నాయుడు

“క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే” అన్న భర్తృహరి మాటలు అక్షర లక్ష మాడల మూటలు.

కాకపోతే, అపస్వర వాద్యమని, ‘నిరాధార వాద్యమని ‘ మన సంగీత విద్వాంసులు అనే వయొలిన్‌ను సాధించి, స్వాధీన పరచుకొని, శ్రోతలను తన్మయులను చేయడం శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారికి ఎలా సాధ్యమవుతుంది? అది ఆయన సత్త్వం! అది ఆయన సాధన! అదే ఆయన తపోదీక్ష! శ్రీ రాళ్ళపల్లివారన్నట్టు ” ఏ సంగతి వాయించినా, ఎంత మృదువుగా, ఎంత ఘనంగా కమాను తీసినా, నాదంలో స్నిగ్ధత, గంభీర్యం కొంచెమైనా చెదరక, దృఢ సంకల్పంతో, నిశ్చలమైన నమ్మికతో, ఏకాగ్ర దృష్టితో, బహిరంగమైన చేష్టలేమీ లేక ‘ఫిడేలే తామై, తామే ఫిడేలై ‘ నాదామృతపుసోనలు కురిపించిన నాయుడుగారు ఫిడేలు నాయుడుగారు” అనే జనం హృదయాలలోనే గాక నాలుకపై నాట్యమాడటం సహజం.

2001 సంవత్సరంలో అజొ-విభొ ప్రచురణలగా వచ్చిన ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకంటే రాయటనికి నాకు భాషా, పాండిత్యం, జ్ఞానం సరిపోవు. అందరి తెలుగువారి ఇండ్లలో ఉండవలసిన పుస్తకం ఇది.

Marapuraani Maneeshi – Tirumala Ramachandra

*******************************************************************************************************

వ్యాసం రాసిపంపిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న

You Might Also Like

9 Comments

  1. badrinath

    tirumala ramachandrulu tama saisavamunande
    desabhakti dandiganu juupi tariyinchiyunde
    batuku pustakamu nandu bandukulu pelchiunde
    intalu kani loka vintalayeda variki tagu tatwika drushtiyunu unde
    NA NAMASSULU AA PRAGNADHUREENUNAKU,AMUSHMIKASEMUSHI DURANDHARUNAKU,KAALAPU KOYYA GURRAMUNU ALAVOKAGA THATTI CHUTTUKONI AVALAKU MARALIPOINA ANDHRA-SOCRATISUKU..VANDANAMULU

  2. పుస్తకం » Blog Archive » మరపురాని మనీషి === తిరుమల రామచంద్ర.

    […] విష్ణుభొట్ల లక్ష్మన్న గారి మాటల్లో ఇక్కడ. (No Ratings Yet)  Loading […]

  3. సౌమ్య

    I don’t remember reading this article, at all!
    Thanks to the newer one, I saw this! 🙂

  4. పుస్తకం » Blog Archive » అహం భో అభివాదయే

    […] వెలువరించారు. వాటిలో ఒకటి “మరపురాని మనీషులు” కాగా, రెండవది తెలుగు వెలుగులు, […]

  5. Ramana Murthy

    Nice one.

  6. విష్ణుభొట్ల లక్ష్మన్న

    రానారె గారూ:

    నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని పరిచయం చేద్దామని ఉంది. మీరన్నట్టు నా పఠనానుభావాల దృష్టిలో రాయటానికి ప్రయత్నిస్తా! కొకు “చదువు” పుస్తకాన్ని త్వరలో సమీక్షించాలని ఉంది.

    లక్ష్మన్న

  7. రానారె

    మంచి పరిచయం. చాలాబాగా రాశారు. ఈసారి మీరు రాసే పుస్తకపరిచయాన్ని మీ పఠనానుభవ వ్యక్తీకరణగా రాస్తే చదవాలనుంది. కృతజ్ఞతలు.

  8. రవి

    విశాలాంధ్ర లో ఈ మధ్యనే ఈ పుస్తకం వచ్చింది. ఈ మధ్యనే కొన్న పుస్తకం ఇది. ఇంకా పూర్తిగా చదవలేదు. మంచి పరిచయం.

  9. Purnima

    ఈ పుస్తకం మొన్న బుక్ ఫేర్ లో లేదు.. నవదోయ వారి దగ్గరుందని సమాచారం! చాలా బాగా పరిచయం చేశారండీ.. నెనరులు!

Leave a Reply