సాహితీ సుగతుని స్వగతం – తిరుమల రామచంద్ర గారు

SahiteesugatuDu

సుగతుడు – అంటే మంచి మార్గమున వెళ్ళినవాడు అని అర్థం. బుద్ధుడికి గల ఒకానొక పేరిది. (సర్వజ్ఞస్సుగతో బుద్ధః – అమరం). బహుశా బుద్ధుడి మీద అభిమానంతోనేమో, తిరుమల రామచంద్ర గారు తనని సాహితీ సుగతుడని చెప్పుకున్నారు. ఈ పుస్తకం అట్ట చూశారుగా. పదేళ్ళ ముందు కొన్నప్పుడే దాదాపుగా జీర్ణస్థితిలో ఉన్నది ఈ పుస్తకం. ఇప్పుడు ముద్రణలో లేదు.

భారతి – ఒకప్పుడు ఈ పత్రికలో వ్యాసం అచ్చవడమంటే, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్. పొందినంత గౌరవమట. ఈ పత్రికలో రామచంద్ర గారి మొదటి వ్యాసం తమ 22 వ యేట – అంటే 1935 లో ప్రచురింపబడిందట. ఈ వ్యాసం పేరు – ఆంధ్రచ్ఛందోవిశేషములు. ద్విపదలో ప్రాసయతిని కొందరు పండితులు పాటించలేదని బ్రహ్మశ్రీ శ్రీ వజ్ఞలసీతారామస్వామి శాస్త్రులు గారు ఆక్షేపిస్తే, ఆ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ, వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వాదాన్ని సమర్థిస్తూ రామచంద్రగారు వ్రాసిన వ్యాసం ఇది. గిడుగు రామమూర్తిపంతులు గారు ప్రభాకర శాస్త్రి గారిని ఓ మాటు కలిసినప్పుడు, ఈ వ్యాసం గురించి ప్రస్తావిస్తే, శాస్త్రిగారు రామచంద్ర గారిని చూపారట. గిడుగు రామమూర్తి పంతులు గారు ఒకింత ఆశ్చర్యపడి, “ఈ కుర్రాడా? ఎవరో శాలువా పండితుడనుకున్నాను” అన్నారట. (మూలం – హంపీ నుంచి హరప్పా దాక)

అదే యేడు డిసెంబరులో రామచంద్ర గారు “ఎసగు – పొసగు” అని మరో వ్యాసం వ్రాశారు. “ఎసగు” లో అరసున్న ఉందా లేదా అని ఆ వ్యాసం సారాంశం.

ఇటువంటి గంభీరమైన చర్చలతో బాటు, హృద్యమైన వ్యాసాలు ఈ పుస్తకంలో ఏర్చికూర్చారు. ఈ వ్యాసాలు, ప్రముఖంగా భారతి పత్రికలోనూ, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, తదితర పత్రికలలో ప్రచురింపబడినవి.

ఇందులో –

ఆంధ్రసాహిత్యంలో స్త్రీపర్యాయపదాలు

పద్యాలకు రాగనిర్దేశం

నూరు, నూటఎనిమిది, నూటపదహారు

దేశీనామాలలోని మరికొన్ని తెలుగుపదాలు

బుద్ధుని ముందునుంచే ఉన్న ధూమపానం

వేదంలో, ఆయుర్వేదంలో గర్భనిరోధం

దండి దశకుమార చరిత్ర

త్యాగయ్య గారి కృతులలో రాగ రచనా సమన్వయం

చేతబళ్ళూ, తలనీలాలూ.

తదితర వ్యాసాలు ఉన్నాయి.

అనేక చమత్కారాలు, పరిశోధనలు, ప్రాపంచిక పరిశీలనలు, సమన్వయాలు, విశ్లేషణలు – వీటన్నిటి మేలుకలయిక ఈ వ్యాససంపుటి. కొన్ని వ్యాసాలు అచ్చమైన చక్కెరకేళీలు.

నువ్వులుకొట్టిన కొట్టిన ఇడి నూటిడి – నూటిడి అంటే నువ్వులపిండితో చేసిన పదార్థమట. ఈ నూటిడి మీరూ కాస్త రుచి చూడండి.

చూశారుగా. ఈ కమ్మనైన నూటిడి ఓ చిన్న అపోహ వల్ల దూరమయ్యే ప్రమాదం వచ్చింది! వేదం వెంకటరాయశాస్త్రిగారు ఈ నూటిడిని – నూబిడి (నువ్వు + పిడి) అని పరిష్కరించారుట. అంతకుముందు పరిష్కరింపబడిన పాఠాల్లో నూటిడి అనే ఉన్నప్పటికి.

ఈ వ్యాసంలో ఆచార్య రామచంద్ర గారు నూటిడి పదం గురించి వివరిస్తూ, ఈ కావ్య సంస్కృత మూలాన్ని, శ్రీనాథుల వారిని, అన్నమయ్యనూ తీసుకువచ్చి, కాసింత తమిళ భాషనూ అరువు తెచ్చుకుని, (ఇడి – అంటే కొట్టుట అని తమిళంలో అర్థం. ఇడియప్పం, ఇడ్డిలి వగైరా పదాలు దీనితో కూడినవే). ఈ పదం నూబిడి కాదని సోదాహరణంగా వివరిస్తారు. మరి నువ్వు + ఇడి = నూ”టి”డి ఎలా అయ్యింది? ఈ విషయాన్నీ వివరిస్తూ, భాషలో కొన్ని చమత్కారాలు ఇతర భాషా సాంగత్యం వల్ల ఉండిపోతాయని, కమ్మ + ఊరు = కమ్మటూరు అలానే అయిందనీ వివరించారు. ఇలా ఈ వ్యాసం రసభరితంగా సాగుతుంది.

దేశీ నామాలలోని మరికొన్ని తెలుగు పదాలు – గొప్ప పరిశోధనా వ్యాసం. భాషా శాస్త్రం మీద, తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవవలసిన వ్యాసమిది. ఈ వ్యాసం సారాంశాన్ని ఆరుద్ర గారు సమగ్రాంధ్రసాహిత్యం నాంది లో ఉటంకించారు.

కొన్ని సమకాలిక నవలలు అన్న వ్యాసంలో నవలా ప్రక్రియ గురించి చెబుతూ, మొదటి పద్యనవల కళాపూర్ణోదయమని చెబుతారు. ఇంకా రాచకొండ వారు (అల్పజీవి), అడవి బాపి రాజు గారు, విశ్వనాథ వారూ, ఉన్నవ వారు తదితరుల రచనల గురించి చెబుతారు.

ఇంకా ఈ పుస్తకంలో బుర్రకథ, ఏకాంకిక, క్రీడాభిరామం వంటి విషయాలపై వ్యాసాలు, కేతన, నాయని సుబ్బారావు గారు, కంకంటి వారు, చిలుకూరి నారాయణరావు గారు వంటి మహానుభావుల గురించిన విశేషాలు ఉన్నవి.

మొత్తం 40 అందమైన వ్యాసాల సమాహారమైన ఈ పుస్తకం విశాలాంధ్ర వారు ప్రచురించారు అప్పట్లో. పదేళ్ళ ముందు ఈ పుస్తకం వెల 45 రూపాయలు. మూడు ముద్రణలు పొందిన ఈ పుస్తకం అరుదయినది. ఇప్పుడు ఎవరైనా ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తే, అది తెలుగుజాతికి మహద్భాగ్యం అవుతుందనడంలో సందేహం లేదు.

You Might Also Like

One Comment

  1. మందాకిని

    భారతి పత్రిక గురించి ఓ టపా వ్రాయమని మనవి.

Leave a Reply