దుర్గాబాయ్ దేశ్‍ముఖ్

సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి సైటు బ్రౌజ్ చేస్తూ ఉంటే, ఆన్లైన్ పర్చేస్ అని ఉన్న జాబితాలో ఈ పుస్తకం కనబడ్డది. ’దుర్గాభాయ్ దేశ్‍ముఖ్’ గురించి అప్పుడప్పుడు ఒకటీ అరా వినడమే కానీ, ఎప్పుడూ వివరంగా తెలుసుకున్నది లేదు. అందువల్ల సహజంగానే కుతూహలం కలిగింది. ఇంద్రగంటి జానకీబాల గారు రాసిన ఈ పుస్తకం చదివాక, దుర్గాభాయమ్మ పై విపరీతమైన గౌరవం, ఆవిడ వ్యక్తిత్వాన్ని తల్చుకుంటే, పెద్ద మొత్తంలో స్పూర్తీ కలిగాయి. అందుకే, ఈ పుస్తకం గురించి అందరికీ తెలియజేయడం అవసరమనిపించింది.

మనలో చాలా మందికి – దుర్గాబాయ్ గారు స్వతంత్ర సమరయోధురాలిగా, మహా అంటే – ఆంధ్రమహిళాసభ స్థాపకురాలిగా తెలిసి ఉండొచ్చు అనుకుంటాను. ఇంకా, చిన్నప్పుడు స్కూల్లో ఆమె గురించి ఒక కథ ఉండేది – గాంధీజీ వచ్చి ప్రసంగిస్తూ ఉంటే, పదేళ్ళ ప్రాయంలో ప్రభావితురాలై, అదే సమావేశ స్థలంలో నిధులు పోగుచేసి ఆయనకి అందజేస్తే, ’మరి నువ్వేం ఇస్తావు? నీ చేతి గాజులివ్వవా?’ అని ఆయన అడగ్గానే మారాలోచించకుండా తీసి ఇచ్చేసిన అమ్మాయే పెద్దయ్యాక దుర్గాబాయ్ దేశ్ముఖ్ అయిందని. అంతకు మించి – నాకు గుర్తున్నంతలో దుర్గాబాయ్ గురించి ప్రత్యేకం చదివిన జ్ఞాపకం లేదు నాకు. ఇదిగో, పుట్టిన పాతికేళ్ళకి, ఇప్పుడు ఈ పుస్తకం నా కళ్ళు తెరిపించింది.

ఏడెనిమిదేళ్ళ ప్రాయం నుండే దుర్గాబాయ్ ప్రతిభాపాటవాలు ముగ్గులేయడం దగ్గర్నుంచి పద్యాలు వల్లించడం దాకా రకరకాల విషయాల్లో తెలుస్తూ వచ్చాయి. పదకొండేళ్ళ వయసులో కాకినాడలో హిందీ పాఠశాల పెట్టి ఎంతోమందికి (తన తల్లి కృష్ణవేణమ్మతో సహా) విద్యాబోధన చేసిందంటే – అబ్బురపడకుండా ఉండగలమా? అదీ, ఒక ఆడపిల్ల, ఆ కాలంలో! 1923 కాకినాడ కాంగ్రెస్ సభల సమయానికి అక్కడ హిందీ వాలంటీర్లు కావాలని ’హృషీకేశ్ శర్మ’ అన్న హిందీ పండితుడిని రాజమండ్రికి హిందీ ప్రచారం కోసం పంపితే, అప్పటికే దుర్గాబాయ్ బ్యాచ్ కి యాభై చొప్పున విద్యార్థినులకి హింది నేర్పి పరీక్షలకి కట్టిస్తోందట!! (అప్పటికి ఆమె వయసు పద్నాలుగేళ్ళే!) ఇలా ఆరొందల మంది వాలంటీర్లని తయారుచేసేనాటికి ఆమెకి వాలంటీరుకి ఉండాల్సిన కనీస వయసు (పద్దెనిమిదేళ్ళు) కూడా లేదు!!

ముక్కుసూటి మనిషి, ధైర్యవంతురాలు. అవతలి మనిషి నెహ్రూ అయినప్పుడూ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో జైల్లో పక్క గది గోడ దూకి, అక్కడి ’రౌడీ’వనితల చేతిలో దెబ్బలు తింటూ చివర్లో బ్రతికిపోయినప్పుడు, పట్టుబట్టి పట్టుమని ఇరవైఏళ్ళైనా లేనప్పుడే గాంధీజీతో ఊర్లోని ’కళావంతులైన’ స్త్రీలతో ప్రత్యేక భేటీ ఏర్పరచడంలో సఫలీకృతురాలైనప్పుడూ- ఎప్పుడైనా సరే, దుర్గాబాయ్ దుర్గాబాయే! నిజంగా దుర్గే! బాగా ఆలోచించి పెట్టిఉంటారు ఆమెకా పేరుని. అలాంటి ’సివంగి’ ఒకానొక సమయంలో ఈ జైలు శిక్షల పర్వంలో మానసికంగా చాలా దెబ్బతిన్నారన్నది చదివితే చాలా బాధనిపిస్తుంది.

అయితే, ఆమె మామూలు మనిషికాదు, దుర్గాబాయ్. కనుకే, మళ్ళీ she bounced back. లా చదివారు. మంచి ప్రాక్టీసు పెట్టారు. ఆంధ్ర మహిళాసభ స్థాపించారు. ’ఆంధ్రమహిళ’ మాసపత్రిక స్థాపించారు. స్త్రీలకి విద్యాలయం, వసతి గృహం – ఇలా ఆంధ్రమహిళాసభ ని పెరిగి పెద్దదయేలా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతే, నెహ్రూగారి పంతంవల్ల ప్లానింగ్ కమిషన్ మెంబరయ్యారు. కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖాధ్యక్షురాలయ్యారు. ఎన్నో నూతన పథకాలు రూపొందించారు. శిశువిహార్, వనితా బాల విహార్, ఆర్థోపెడిక్ సెంటర్ కాలిపర్ల వర్క్‍షాపు, శిశు సంక్షేమ కేంద్రం, రీజినల్ హాండీ క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్,లిటరసీ హౌస్ – ఇలా ఎన్నెన్నో సంస్థలను స్థాపించారు. అలాగే, ’బ్లైండ్ రిలీఫ్ ఫౌండేషన్’ వంటి ’సిక్ యూనిట్లని’ తీసుకుని కృషి చేయడం వంటివి చూస్తూ ఉంటే – దుర్గాబాయమ్మను ఆ తరానికి ’సీరియల్ ఎంటర్ప్రెన్యూర్’ అని చెప్పొచ్చేమో అనిపిస్తుంది నాకు.

అలాగని ఆవిడేదో సీరియస్ టైపనుకునేరు… చక్కని చమత్కారం, వ్యంగ్యం, ఒక విధమైన అమాయకత్వం ఉన్నాయని జైల్లో పాడిన పాటలు, ఇంట్లో జరిగిన ఒకట్రెండు సంభాషణలు చదివితే తెలుస్తుంది.

ఇక, ఆ తల్లిని చూసి ఈ కూతురు ప్రభావితమైందో, ఈ కూతుర్ని చూసి కృష్ణవేణమ్మగారు ప్రభావితమయ్యారో – తెలీదు కానీ, వీళ్ళిద్దరూ మాత్రం అమేజింగ్! కుటుంబసభ్యుల సహకారం కూడా బానే ఉండిందని తెలుస్తోంది కథని బట్టి. వీళ్ళ కథంతా ఫోన్ చేసి మరీ తలకాయ తినేసి చెబుతూ ఉంటే – ’ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి కదా’ అన్న వ్యాఖ్య అవతలివైపు. నిజం! ఇలాగే ఉండాలేమో.

దుర్గాబాయ్ గారి జీవితంపై సినిమా/టెలీఫిల్మ్/సీరియల్ – వంటివేవీ ఎందుకు రాలేదో. ఇన్ని థ్రిల్లింగ్ విషయాలుంటేనూ!

ఏమాటకామాటే చెప్పుకోవాలి, మొదట ఈపుస్తకం ఆకారం చూడగానే కొంత నిరాశ కలిగింది. ’జీవిత చరిత్ర’ అని బిల్డప్ ఇచ్చేసి, ఎనభై పేజీల్లో మొత్తం చెప్పేసి, తొంభై రూపాయలకి అమ్మితే – కొనేవాళ్ళెంత మంది? అన్నది నా సందేహం. పుస్తకం రాయడానికి ఉపకరించిన గ్రంథాలు గానీ, వ్యాసాలు గానీ, వ్యక్తులు గానీ – అందరి గురించి కొన్ని వివరాలు చివర్లోనన్నా అందజేసి ఉంటే బాగుండేది. రచయిత్రి పుస్తకం గురించి ’ముందుమాట’ వంటిదేదన్నా రాసి ఉంటే, బహుశా ఈ వివరాలు ఉండేవేమో..

సి.పి.బౌన్ అకాడెమీ వారు ఇలాంటి పుస్తకాలు మరిన్ని వెలువరించి, మరికాస్త వివరించి – తెలుగు జాతిరత్నాల్ని తెలుగువారికి పునఃపరిచయం చేయాలని కోరుకుంటున్నాను.

పుస్తకం వివరాలు:
’మార్గదర్శి’ దుర్గాబాయ్ దేశ్‍ముఖ్
రచన: ఇంద్రగంటి జానకీబాల
తొలి ముద్రణ: సీ.పీ.బ్రౌన్ అకాడెమీ, 2009.
వెల: 90/-
www.cpbrownacademy.org లో కొనుగోలుకి లభ్యం.

ఇదే సమయమ్లో పుస్తకం వెనుక అట్టపై మరో ఇద్దరు గొప్ప వనితలు ఈవిడని గురించి అన్న వాక్యాలు తలుచుకుందాం:

“Durgabhai is not a woman. She is a human dynamo” – Sarojini Naidu
“She is my Guru, Mother of social services in India” – Indira Gandhi.

గత ఏడాది దుర్గాభాయ్ గారి శతజయంతి సందర్భంగా ఆవిడపై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

You Might Also Like

10 Comments

  1. మహిళావరణం-3 « sowmyawrites ….

    […] పరిచయ వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ […]

  2. sailaja

    hi
    somya garu your article on the book is nice.i am proud to say that i did my bachelor of education in andhra mahila sabha.though i have not seen durga bhayi garu but got an oppurtunity to spend time with her followers soubhagyamani and laxmi garu while doing my course.its nice idea that she should be brought into picture through media.if you want to know more about her you can contact laxmi garu .she is ex principal of bed college AMS.

  3. లలిత (తెలుగు4కిడ్స్)

    అరే, ఇప్పుడే చూశాను, మీరిచ్చిన లింకు నేను ప్రస్తావించిన పుస్తకానిదే.
    ఇప్పుడు చదువుతున్నాను.
    Thanks.

  4. లలిత (తెలుగు4కిడ్స్)

    నేతి సీతా దేవి గారు రాసిన దుర్గాబాయి జీవిత చరిత్ర పుస్తకం నేను తెచ్చుకున్నాను.
    సగం చదివాను.
    రెండు వందలకు పైగా పేజీలు ఉన్నాయి కాబట్టి ఇంకాస్త వివరంగా ఉండి ఉండ వచ్చేమో అందులో.
    చక్కగానే రాసినట్టనిపించింది.
    దుర్గాబాయి గారి గురించి చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం కలగుతూనే ఉంది.
    ఇంకెవరైనా ఈ పుస్తకం చదివి ఉంటే పరిచయం చెయ్యగలరు.

  5. the reader

    Our Telugu Woman..”The first Social Welfare Minister” of the Free India..

    Its really great..

  6. rAm

    “ఏమాటకామాటే చెప్పుకోవాలి, మొదట ఈపుస్తకం ఆకారం చూడగానే కొంత నిరాశ కలిగింది. ’జీవిత చరిత్ర’ అని బిల్డప్ ఇచ్చేసి, ఎనభై పేజీల్లో మొత్తం చెప్పేసి, తొంభై రూపాయలకి అమ్మితే – కొనేవాళ్ళెంత మంది? అన్నది నా సందేహం ”

    చర్చ కోసం కాకపోయినా :)..విఙ్ఞానాన్ని పంచే పుస్తకం కొని చదవటమే రచయితకి ఇచ్చె గౌరవం అనుకుంటా.
    మొట్టమొదటి పద్మవిభూషన్ పొందిన తొలి తెలుగు మహిళా/ ఆవిడకాలం లో ఎవరు చూపని అసమాన ప్రఙ్ఞ ని చూపిన ఆమె జీవితం ఎప్పటికీ స్పూర్తిప్రదమే.

  7. జంపాల చౌదరి

    ముళ్ళపూడి వెంకటరమణ, వాసిరెడ్డి సీతాదేవి గార్ల జీవితాలపై శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గారి ప్రభావం చాలా ఉందని వారి జీవిత చరిత్రలవల్ల తెలిసింది.

  8. విజయవర్ధన్

    సౌమ్య గారు, బాగుంది. ఈ పుస్తకంలో photoలు ఏమైనా వేసారా?

Leave a Reply