జయప్రభ -ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం
రాసిన వారు: వాస్తవ్ అలోక్
[ఈ వ్యాసం మొదటిసారి 12 ఫిబ్రవరి 2006 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]
కవిత్వానికి దురర్థాలు ఎల్లా వస్తాయి?
కవిత్వమంటే తోచింది రాసేయడమన్న అపోహ వల్ల కావొచ్చు. లేదూ రాసేసిందల్లా కవిత్వమనే అహకారం వల్ల కావొచ్చు.లేదూ ఐదో ఆరో సంకలనాలూ, రెండో మూడో ఎవార్డులు ఓ డజన్ సన్మానాల వల్ల కావొచ్చు.
ఈ ఉపోద్ఘాతమెందుకని ప్రశ్నిస్తే ….. జయప్రభగారి ది పబ్ ఆఫ్ వైజాగపట్నం అన్న ‘పద్యాలు’ చదవడం వల్ల అని ఒప్పుకోకతప్పదు.
జయప్రభాగారి గురించి చెప్పడానికి నేనేమీ పేరుమోసిన ప్రసిద్ధ వ్యక్తిని గాను. ఐనా ఇల్లా ఎందుకు రాయాల్సివొచ్చిందనేది చెప్పుకొస్తా.
45 పద్యాలు (!) లేక కవితలున్న ఈ సంకలనం గురించి కవిగారి మాటల్లోనే చెప్పాలంటే
‘ఇంతవరకూ ఎక్కడా అచ్చుకానివి.’
‘ముఖ్యంగా కవిత్వాన్ని డబ్బు తేలేని విద్యగా పరిగణించినందువల్ల…’
‘వస్తు సౌఖ్యాలకి భిన్నంగా మనసుని చేరగల కళలనీ….సాహిత్యాన్ని…ఏ తరమైనా చేజార్చుకోకుండా ఉండాలి ! ఇది కవిగా నా ఆకాంక్ష. ఈ కోరిక కారణంగానే…..’
‘లోకంలో నాకు నచ్చని తనాల పట్ల కలిగిన కోపాలు….దుఖాలు….నా అక్షరాల్లో ప్రతిఫలించడం అత్యంత సహజం…..’
‘సాహిత్యరంగంలోని మగ విమర్శకులు ఎప్పుడేం అని పోతారోనని….ఎవరికీ ఏ ఇబ్బందినీ కల్గించని విషయాలని రాసిన ఆడవాళ్ళ వారసత్వానికి చెందను నేను !…..’
‘డబ్బు తేలేని విద్య కవిత్వం ’ అనడం నుండి ‘సాహిత్యరంగంలోని మగ విమర్శకులు’ వరకూ వెళ్ళిన జయప్రభగారి వాగ్వజ్రం ఇంత మొద్దుబారి వుండడం ఆశ్చర్యమేనని అనిపించినా లోపలి కవితల్ని చదివాక ఆ ఆశ్చర్యం తొలగిపోయింది. ఎల్లా తొలగిందో వివరిస్తాను.
మొదటి కవిత ‘నదికి…..’
ఒక కులం లేదు….మతం లేదు
సలిల శరీరం తప్ప !
వంకలని చుట్టి సాగే ద్వీపవతికి ! నదికి !!
వానా కాలంలో వళ్ళు చేసి….
ప్రమోద మధురమై కదిలి … చేపలతో తుళ్ళి
పరవళ్ళు తొక్కే కాంతి గతికి ! నదికి !!
……….
ఒకసారికి కురంగమై…..ఒకసారి తురంగమై
సాగర సదనానికి ఉరుకుతూ సాగే
సింధు ప్రియకి ! నదికి !!
నదీ మాతృకములలో నవధాన్య సంపదల
హరిత ప్రదాత….నిరతాన్న దాత….
స్రోతస్వినికి ! నదికి !!
ఇందులో కవిత్వం తప్ప మిగతావన్నీ అద్భుతంగా అమరివుండడం మెచ్చుకోదగ్గ విషయం. ‘నిమ్నోన్నతాల నిమగ’, ‘శిఖర తనయ’ వంటి పదాలు వుండి ఈ ‘పద్యా’న్ని కవిత కంటే భట్రాజు పొగడ్త కింద జమకట్టిస్తాయి.
రెండో పద్యం ‘నేను ఒకే ఒక జయప్రభని !!’
కాకవులైతే తప్ప మరింకే కవులూ
విమర్శకుల తల ఊపు కోసం
ప్రయత్నంతో కవిత్వం రాయరు !
గళ్ళ నుడికట్ల మధ్య కుదించుకున్న పదాలై…..
ఉప్పుదలగా కూర్చోరు !
విమర్శకుల సాహిత్య వ్యాఖ్యానాలు
చాలాసార్లు గరిక పాటి !
……
వరసనించి దించడమో
వరస కెక్కించడమో
వారికి పరిపాటి !!
………
నిజాయితీ కన్నా లౌక్యానికీ
తాను కోరుకునే వాళ్ళ మెప్పుకీ
పెద్దపీట వేస్తుంటారు !
……
కవిగా ఎప్పుడూ నాకు ఒకటే అనిపిస్తుంది !
సాహితీ రంగాన…..
అతడు ఒకానొక విమర్శకుడే !
కానీ, నేను….
ఒకే ఒక జయప్రభని !!
తెలుగు సాహిత్యంలో సద్విమర్శకుడిని జోకర్‌గా చూయించే అద్భుత స్పృహ ఆశ్చర్యపరుస్తుంది.ఈ ‘పద్యా’న్ని నేను విశ్లేషించడం కంటే ఈ వ్యాసాన్ని చదివే పాఠకులే విశ్లేషించుకోడం బాగుంటుంది.
కవి గురించి అన్న మరో పద్యముంది
అతడు ఫాలనేత్రుడు !
కపాల గాత్రుడు !!
…..
కర్కశ శర్కరా యుతంగా
హృదయాలని మేల్కొలిపే కిన్నరుడు !
-ల్లాంటి పద ప్రయోగాలు కవి అంటే శుక్రగ్రహ వాసేమో అన్నంత కొత్తదనాన్ని పరిచయం జేస్తాయి. అన్నట్టు ఈ కవిత్వం నైజీరియన్ కవి కెన్ సారోవివాకి అంకింతమివ్వబడింది.
నువ్వు వింటానంటే అనే ‘పద్యం ’లో రాజరాజ నరేంద్రుడినుండీ మొదలుకొని కవిగారి వరకూ సాగివచ్చిన సాహిత్య మూర్తుల పేర్లున్నాయి. వో ప్రాంతం నుండొచ్చిన సాహితీమూర్తుల పేర్లన్నింటినీ వరసలో పేర్చేసి చివర్లో నా పేరు కూడా తగిలించేసి ‘నాలో సమపాళ్ళలోనే ఛాందసమూ….సాంప్రదాయమూ కూడా….నువ్వు వింటానంటే….ఇదిగో…..ఈ పద్యం నేను రాసితీరవలసినంతగానే ఉన్నాయి !’ అని ముగించేయొచ్చు అనేది తెల్సుకోడం జరిగింది.
ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం పార్ట్ 1 2 ల గురించి ఎంత తక్కువగా చెపితే అంత మేలు. మొదటి పార్ట్ రొమాంటిసిజమనే సోది ఐతే రెండోది అరిస్టాటిల్ నుండి, ఆదిశంకరుని మీదుగా కాఫ్కా వరకూ పేర్ల లిస్టు దప్ప కదిలించే కవిత్వం సున్నా.
సౌగంధిక అన్న మరో పద్యం లోని కొన్ని వాక్యాలు….
కోలా కాని…గుండ్రమూ కాని….గింజకట్టని
లేతాకు పచ్చరంగులోని లేలేత వంకాయలని
ఎన్నుకుని అటు ఇటూ అడ్డుగా నిలువుగా గాట్లు పెట్టి…
అందులో…..
అల్లం పచ్చిమిరప ధనియం జీలకర్ర కొత్తిమీరలని
ఉప్పు పసుపులతో కలిపి ముద్దనూరి
దానిని వంకాయల మధ్యగా కూరి
మందమైన ఇత్తడి గిన్నెలో నూనెవేసి కాగాక
అందులో వంకాయలన్నింటినీ సమంగా పేర్చి
గిన్నెమీద మూకుడుపెట్టి అందులో నీళ్ళుపోసి
అడుగు మాడకుండా అలవోకగా చేతిగుడ్డతో
ఆ వేడి గిన్నెని కుదుపుతూ….
సన్నసెగ మీద వంకాయలని పైవి కిందకీ
కిందివి పైకీ రప్పించి …. నూనెలో మగ్గించి
కాయపళంగా కమ్మగా వండిన కూరని
విరివిగా వండిన సన్న బియ్యపు
అన్నం ముద్దలతో కలిపి తినిపించిన
అమ్మ ప్రేమ పరీమళ మాళిగె అది
వినాయక చవితి ముందు రోజు……
కోసి తెచ్చిన వెడల్పాటి పనస ఆకులని
శుభ్రంగా కడిగి….ఆరబెట్టి
తిరగలి దిమ్మ కింద దొంతిగా ఉంచి……
అవి చదును తేలేక
చేతితో పట్టుకునేందుకు వీలుగా ఆకుల కాడల్ని
పైకి వచ్చేలాగా పట్టుకుని
మధ్యకి చీల్చిన ఈన పుల్లలతో
నాలుగేసి పనస ఆకులని కలిపికుట్టి
అందులో……
ముందుగా రుబ్బి ఉంచుకున్న
మినప చోవిలో బియ్యం మొరువు
ఒకటికి రెండు పాళ్ళుగా కలిపిన ముద్దని
ఆకుల దొప్పల మధ్య నింపి…….
వెడల్పాటి లోతైన గిన్నెలో నీళ్ళు పోసి
వాటి మధ్య బహు జాగ్రత్తగా పనసబుట్టలని పేర్చి
ఆవిరి మీద ఉడికించి
ఉడికాక మూతతీసి చల్లార్చి……
నారింజరసం పిండిన పెసరపచ్చడితో
కలిపి తినిపించిన
మా అమ్మ మకరంద మానసం అది !
ఒకటని ఏమిటి ? వందల విందులు అందులో !!
పన్నీరు లడ్లు…ముగ్గుళ్ళు…పోలిపూర్ణం బూరెలు
మినప గారెలు
ఆవడలు…అరిసెలు….చెగోడీలు….చక్కిలాలు
జంతికలు….దోసెలు….పెసరట్లు….పూరీలు
పులగాలు…పులిహోరలు..అప్పడాలొడియాలు…చిమ్మిళ్ళు
చక్రపొంగళ్ళు…చంద్రకాంతాలు….తిమ్మనాలు
పరవాణ్ణాలు….పాకం చలిమిళ్ళు….నూలుండలు
ముద్దపప్పు…మావిడి పప్పు…పప్పు పోపు
ముక్కల పులుసు….పులుసు పచ్చడి….వేపుళ్ళు
పుల్ల కూరలు….ఆవకూరలు…చప్పకూరలు
ఆవ పచ్చళ్ళు…పెరుగు పచ్చళ్ళు….ఆవకాయలు
ఇలా అనేక రకాల భక్ష్యాలు…భోజ్యాలు !!
…….
ఒక్కో పండుగకీ మాకు ఒక్కో పిండివంట !!
పండగలు లేకపోతే …
వండి తినిపించేందుకు
మా అమ్మమ్మ తలపెట్టిన శతాధిక నోములున్నాయి !
నోములు కాకుంటే…..పోయిన వాళ్ళ తద్దినాలున్నాయి !!
Enough … Enough …
ఇదా కవిత్వమంటే ? ‘వస్తు సౌఖ్యాలకి భిన్నంగా మనసుని చేరగల కళ…’ అని ముందుమాటలో చెప్పిన సాహిత్యమిదేనా ? గుత్తొంకాయ్ ఎల్లా వండాలో చెప్పడం , ఆవిరి కుడుములెల్లా చేయడం అని చెప్పేది కవిత్వమా ? తిండిపదార్థాల లిస్టు జెప్పడం కవిత్వమా? ‘శక్తికి మించిన పనే ఐనా కవిత్వాన్ని సంకలనం చేస్తున్నా’ అని చెప్పుకొన్న సంకలనంలోని సారమిదేనా ? Enough..
‘ముఖం కడిగి
వేడిగా పొగలుకక్కే కాఫీని తాగుతూ
చూపుకి అడ్డంగా
ఆ వేళటి పత్రికని పరుచుకున్నాకా…..’
‘ఆరోగ్యాన్ని చక్కబరచుకుందామని
తినే తిండి నించి….
పిండి పదార్థాలని విరమించుకున్నా
నూనె శాతాన్నీ….చక్కెర సారాన్ని
పూర్తిగా తగ్గించుకున్నా …
ఆకు కూరలనీ … విత్తనాల మొలకలనీ మరింతగా వాడి
సూప్ సమన్వితంగా ఆహారాన్ని స్వీకరించినా
సమస్యలేవీ స్వాధీనంలోకి రావే !!
ఏవిటిదంతా ! ’నేను ఒకే ఒక్క జయప్రభని‘ అని ప్రకటించుకొని విమర్శకుల్ని కాలదన్నిన కవిగారి కవిత్వమేనా ఇది ?
అందుకే మీ స్వర్గమలా అన్న పద్యం ’క్రిష్ణశాస్త్రిని కాదని‘ రాసిందట.
ఏలనో మీ స్వర్గసీమలా
భాస్వరాల వాసనలా
మా దేవదారు వృక్షాల నీడల్లోని
మా హిమానీ హేమంతాల్లోని
తొలిపొద్దు వేళ కన్న స్వర్గమేదీ?
……..
మీ లోకాన
మీ ఇంద్ర సభా ప్రాంగణాన
అలా నాట్య మాడి….ఆడి
నూగారు తెల్లబడ్డ రంభలా
ఇంద్రుని వేయికళ్ళ కలకలా
అమరావతి .. అంతా వికృతి !!
ఇదంతా చదివిన తర్వాత పాపం క్రిష్ణశాస్త్రి అని అనక తప్పదు. ఏం చేద్దాం !!
నాకు కావలసినదల్లా నా చేతిసంచి
అది
బతుకు బతుకంతా నేను సవరించని
నా హృదయ విపంచి !
యెందుకింత ప్రాకులాట ? చివర్న సంచి, సవరించి అని వొచ్చిందని విపంచి అని రాయాలా? అంత్యప్రాసలను అంతలా ఎద్దేవా చెయ్యాలా? భాషను సౌందర్యభంగం చెయ్యాలా? ఈ వికృత ప్రాసలు అక్కడితో ఆగినవిగావు
ఆ సంచీ నాదే !
కానీ అందులో నా సంపద లేదే !
అతడే యముడేమో
అతడికి చెవుడేమో
అక్కడ మేఘశ్యామం వర్ణం !
అక్కడి గాలిలో
మినుకుమంటూ మెరిసే
నీలమణి చూర్ణం !!
ఎందుకో ఆ నలుపు మీద
నాలో వలపు !!
Readers ! Please enjoy the frgrance of our language …. rotten !!
నా మిత్రుడు గొప్ప మేధావి అన్న కవిత సీరియస్ గా హాస్యం పండించడం ఓ రిలీఫ్.
కథా సరిత్సాగరం అనే ఇంకో పద్యం ఎల్లా మొదలౌతుందో చూడండి
నడిమి శృంగారంలో ఆడదాని నడుములా
ఉవ్వెత్తుగా లేచి….పొంగి ప్రవహించి
తీరాన్ని చేరగానే శాంతపడి
నిద్రలోకి వొరిగి పోతుందా !
కంటి కాటుకలాంటి చీకటి మధ్య
కాంతి దృక్ చిత్రంలా వెలిగిపోతుందా
అది – యుగాల కధా సరిత్సాగరమా
కాళికామాత పెంపుడు పావురమా !!
మొదటి వాక్యాన్ని చివరి వాక్యన్నీ కలిపే సామగ్రీ మిగతా వాక్యాల్లో ఏదైనా వుందా ? కవిత్వమంటె ఎందుకింత నిర్లక్ష్యం ? కవిత్వాన్ని ఉద్ధరించే నిమిత్తం సంకలనాల్ని తెస్తున్నామని చెప్పుకొంటూనే ఇల్లాంటి రాతల్ని రాయడమెందుకు ? కొత్తగా కవిత్వాన్ని రాసేవాళ్ళని దారి తప్పించడమెందుకు?
యే కొత్త కవైనా ఈ సంకలనాన్ని చదివిన తర్వాత నేర్చుకోనే అంశాల లిస్టు :
1) యే వొక్క కవితా రెండు మూడు పేజీలకు తగ్గకండా రాయడం
2) అల్లా రాయడానికి అసంబద్ధమైన పొడవాటి వాక్యాల్ని నిర్మించడం
3) అల్లా నిర్మించడం కోసం అంత్య ప్రాసల్ని వాడ్డం
4) ఆ ప్రాసల కోసం తడుములాటలో అసలు విషయాన్ని మర్చిపోవడం
5) చిట్టచివరకు కవిత్వాన్ని నూతిలోకి నెట్టడం
మిగిలిన కవితల గురించి యెంత తక్కువ చెపితే పాఠకులు అంత హాయిగా ఊపిరిపీల్చుకోగలరు.
ఈ పుస్తకం అట్ట వెనక, కవిగారి ఫుటో పక్క ఇల్లా రాసుంది….
పాత వస్తువుల దుకాణం (ఈ సంకలనం )
అరలలో…మడతలుగా పేర్చిన పురాతనం (ఇందులోని పద్యాలు)
అడుగు సాగదు (పాఠకుడిది)
అక్కడంతా ఎగిసి…స్వప్నధూళి (పాఠకుని కళ్ళల్లో)
వినిపించీ వినిపించక ఘల్ ఘల్లని స్మృతి రవళి (సిసలు కవిత్వం )
‘విమర్శకుల తల ఊపు కోసం
ప్రయత్నంతో కవిత్వం రాయరు’
అనడంలోని అనర్థం కొత్త కవులు ఇప్పటికైనా గ్రహించగలరు. నాకు నచ్చింది రాస్తాను, నాకోసం రాసుకొంటాననే ప్రకటనల వల్ల కవిత్వానికెల్లాంటి వుపయోగం లేదనేదాన్ని కొత్త కవులు గ్రహించడం తప్పనిసరి.
సూర్యుడు మా ఇంటిగుమ్మం
నుండి పెరట్లోకెళ్ళడానికి
పగలంతా ప్రయాసపడతాడు
ల్లాంటి మూడు వాక్యాలు మూర్తంగా రాయగలినా చాలు.
కళ్ళ ముందే పుట్టి
కళ్ళ ముందే రాలిపోతున్న
పూలు
చూస్తూ ఆకు
చదివిన చదువరిని చివరి వరకూ వెంటాడే ఇల్లాంటి కవితని జీవితంలో వొక్కటి రాసినా చాలు
సోది సంకలనాలు, కొనుక్కొనే సన్మానాలు చట్టుబండలై కవిని కవిగా నిలబెట్టే నాలుగు వాక్యాల కోసం నడుం కట్టే విమర్శకులున్నంత కాలం తులసి వనాలు, ప్రేమాంజలులు, ప్రసూనాలూ వికసిస్తూనే వుంటాయి. ఇది ముమ్మాటికీ సత్యం .
గురి మరచిన గాలిబాణాన్ని
తెర యెత్తిన నౌకా ధనుస్సు బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది మనీష
అదే కవిత్వం . అసలైనది, సిసలైనది, చిక్కనైనది. మానవీయ పరిమళం నిండి మనిషిని మనీషిగా చేసే అక్షర మంత్రదండం . అదే కవిత్వం .
*******************************
గమనిక: పుస్తకం వివరాలు దొరకలేదు. మీకు తెలిసిన పక్షంలో ఇక్కడ వ్యాఖ్య ద్వారా గానీ, లేక editor@pustakam.net కు మెయిల్ పంపడం ద్వారా గానీ తెలియజేయగలరు – పుస్తకం.నెట్
పుస్తకం వివరాలు: (వివరాలతో పాటు ముఖచిత్రం పంపినందుకు జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు – పుస్తకం.నెట్)
ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
జయప్రభ పద్యాలు
2002
143 పుటలు
Rs.100/-; $10
చైతన్య తేజ పబ్లికేషన్స్
4-220/23, సైనిక్ ఎన్‌క్లేవ్
సైనిక్‌పురి, సికింద్రాబాద్ – 500 094
yasasvi
kevalam panigaTTukuni dummeththipOyaDAnikE oka maaru pErutO raasinaTTugaa undi ee review. indulO ekkaDA vaastavamoo lEdu. kavitAlOkamoo lEdu. ilaanTi review la valana mee pustakam.net ki credibility pOyE avakaaSam kooDA undi.deenni marOsaari pracurincinaTTugaa ceppukOvaDam saitam alaanTi oohaki avakaaSaM kalagajEstUMdi.
yasasvi.
కొత్తపాళీ
వాస్తవాలోకం గారు, ఆవిడ ఒక పక్కన విమర్శకుల్ని చేట చెరిగినట్టు చెరిగి పారేస్తుంటే, మీరు ఈ సంకలనాన్నే విమర్శించబూనుకున్నారే! మీకు ధైర్యం ఎక్కువే!! అందుకైనా అభినందించక తప్పదు.
The Reader
4,5 సంవ||ల క్రితం ఈ పుస్తకంలోని అంశాలపై “ఆంధ్రజ్యోతి సండే మేగజిన్”లో చర్చ జరిగినట్లు గుర్తు.
chavakiran
బాగుంది మీ వ్యాసం.