July 15 2009 : డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ శతజయంతి

ఎంతో మంది ప్రసిద్ధులైన కథకులు, కవుల శతజయంతి సంవత్సరంగా 2009ని గుర్తించాం. ఆ కోవకు చెందకపోయినా తన జీవితాన్నే సందేశంగా గడిపిన శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ శతజయంతి సంవత్సరం (1909 జులై 15 – 1981 మే 9)కూడా ఈయేడే. స్త్రీల అధికారాలు, హక్కులు, ఉపాధి ఇలా చాలా అంశాల గురించి ఇవాళ ఎక్కడ చూసినా చర్చలు జరుగుతున్నాయి. వాటికోసం ఎలుగెత్తి మాట్లాడి, తన చేతల్లో పరిష్కారాలు చూపిన విశిష్టమైన నాయకురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌. ఆవిడ గురించి వచ్చిన రెండు పుస్తకాల ముచ్చట్లు ఈసారి. రెండూ జీవితచరిత్రలే కావటం యాదృచ్ఛికమే అయినా, వాటిని చదవడం విభిన్నమైన అనుభవం.

మొదటి పుస్తకం: ‘దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జీవిత చరిత్ర’ను నేతి సీతాదేవి రాశారు. ‘మీ జీవిత చరిత్ర రాస్తాను’ అని దుర్గాబాయిగారి అనుమతి తీసుకుని, ఆమె గురించి అనేక వివరాల్ని సేకరించి సీతాదేవి రాసిన ఈ పుస్తకం దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ సంఘటన చూడండి.

1934లో శ్రీ గోరా చదువు చెప్పటానికి రోజూ వాళ్లింటికి వెళ్తున్నట్లుగానే ఒకరోజు సాయంకాలం కూడా వెళ్లారు. దుర్గాబాయి ‘మాస్టారూ ఒక్క అరగంట వెయిట్‌ చేయగలరా! ఇప్పుడే వస్తాను’ అని అడిగింది. సరేనన్నారు గోరా. ఆవిడ వెంటనే హిందీ కార్యకర్తల సభలో తాను ఉపన్యసించవలసి ఉండి వెళ్లింది. గోరా ఆవిడ కోసం అరగంటకాదు, రెండు గంటలు నిరీక్షించి ఇంక ఆ రోజుకు పాఠం సాగదని ‘రేపు వస్తాను’ అని ఒక చీటీ వ్రాసిపెట్టి ఇంటికి వెళ్లిపోయినారు. ఆ రాత్రి దాదాపు 10 గంటల సమయంలో దుర్గాబాయి, ఆమె భర్త సుబ్బారావుగారు శ్రీ గోరా ఇంటికి వెళ్లారు. ‘క్షమించండి మాస్టారూ! హిందీ కార్యకర్తల సభలో ఉపన్యాసకురాలిగా వెళ్తే అధ్యక్షురాలిగా కూర్చోబెట్టారండి. దాంతో సభ పూర్తయ్యేదాకా కూర్చోవలసి వచ్చింది’ అని సంజాయిషీ చెప్పుకున్నది దుర్గాబాయి. ‘ఈ మాట కోసమా ఇంత శ్రమపడి వచ్చారు? రేపు చెబితే సరిపోయేది కదా!’ అన్నారు గోరా.
‘మిమ్మల్ని నాకోసం వెయిట్‌ చేయమని చెప్పి అంతసేపు కూర్చోపెట్టడం కాక నాది శ్రమ అంటున్నారా’ అంది దుర్గాబాయి. ఈ విషయం వ్రాస్తూ శ్రీ గోరా అతి స్వల్ప విషయాలలో కూడా ఆమె జాగ్రత్త తీసుకుంటారని, ఎవరికి తగిన విధంగా వారిని గౌరవించటం ఆమెకు చక్కగా తెలుసుననీ అంటారు.

దాదాపు 290 పేజీలున్న ఈ పుస్తకం 1977లో మొదటిసారి ప్రచురితమయింది. మూడో ముద్రణ 1997లో ఆంధ్రమహిళాసభవారు ప్రచురించారు.

రెండో పుస్తకందుర్గాబాయి దేశ్‌ముఖ్‌‘ను రామలక్ష్మి ఆరుద్ర రాశారు. ఇది నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, తెలుగు అకాడమీల సంయుక్త ప్రచురణ. నలభై పేజీలున్న ఈ పుస్తకం ధర 1987 డిసెంబర్‌లో ఆరు రూపాయలు! ఐదు ప్రకరణాల్లో దుర్గాబాయి జీవిత చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తుంది. ఒకపక్క నేతి సీతాదేవి రచన సాగుతోందని తెలిసి కూడా రామలక్ష్మి గారు దుర్గాబాయి అంటే తనకున్న ఆరాధన వల్ల ఈ పుస్తకాన్ని రాయడానికి ఉపక్రమించి పూర్తిచేశారు. పై పుస్తకాన్ని చదవడానికి పాఠకులు చాలా సమయం వెచ్చించాలి, ఇది త్వరగా అయిపోతుంది. దీనిలో ‘లిటిల్‌ లేడీస్‌ ఆఫ్‌ బృందావన్‌’ మొదలుకొని ఆంధ్రమహిళా సభతో సహా దుర్గాబాయి స్థాపించి నిర్వహించిన అనేక సంస్థల వివరాలను పట్టికగా ఇవ్వడం బాగుంది. ఒక స్త్రీ జీవితంలో ఎంత శక్తిమంతంగా ప్రవర్తించగలదో తెలుసుకోవాలంటే ఈ రెండు పుస్తకాలూ తప్పకుండా చదవాలి. దానికి ఇది సరైన సమయమూ, సందర్భమూ కూడా.

కొసమెరుపు
: దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ తమ జీవితం ‘చింతామణి అండ్‌ ఐ’ అని తమ జీవితం గురించి రాశారు. తాను స్థాపించిన సంస్థల గురించి ‘పలికే రాళ్లు’ అనే రెండు సంపుటాలు రాశారు. వాటి గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే దయచేసి ఇక్కడ పంచుకోండి.

You Might Also Like

5 Comments

  1. మహిళావరణం-3 « sowmyawrites ….

    […] పుస్తకం.నెట్లో పరిచయ వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ […]

  2. the reader

    `ఇంకో శక్తివంతమైన మహిళ` గురించి తెలుసుకోవాలంటే “డి ఫ్యాక్టో” (పుష్పాంజలి,బెంగళూరు) పుస్తకం గురించి “అరుణ పప్పు” గారి పరిచయం చూడండి. (15-07-2010, నవ్య, ఆంధ్రజ్యోతి దినపత్రిక)

  3. పుస్తకం » Blog Archive » దుర్గాభాయ్ దేశ్‍ముఖ్

    […] గత ఏడాది దుర్గాభాయ్ గారి శతజయంతి సందర్భంగా ఆవిడపై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ. […]

  4. kusumakumari

    Thank you!Arunaji!
    durga bai dEsh^mukh^ dESa bhakti,saamaajika pragatilO paalu paMchukunna paddhatii,goppavi.
    maMchi vyaasaanni aMdiMchaaru.

  5. sirishasrii

    నేతి సీతా దేవి రచనను,సుమారు 15 ఏళ్ళ క్రితము,ఒక నవలను లాగా,ఆసాంతం ఏక బిగిని చదివాను.
    అనేక సంఘటనలను గుర్తు ఉన్నంత వరకూ,చిన్ని కథలుగా రాసాను.
    ఆవకాయ.కాం అనే వెబ్ పత్రికలో రాసాను.
    pappu aruna gaariki Thanks.

    By,
    (konamanini.blogspot,kusumakumari)

Leave a Reply