అతడు – నేను: కె.వరలక్ష్మి కధలు

రాసిన వారు: సి.బి.రావు
*************
జీవితం కధలా ఉంటుందా? లేక కధ జీవితాన్ని పోలి ఉంటుందా అంటే ఏమి చెప్పగలం? అనుభవంలో తేలేదేమిటంటే రెండూ పరస్పర పూరకాలని. వరలక్ష్మి గారి కధలలో నిత్య జీవితంలో తనకెదురయ్యిన వ్యక్తుల పరిశీలన ఉంది. ఈ కధలు నిజ జీవితంలోంచి ప్రేరణ పొంది వ్రాసినవి కనుక వాటిలో జీవముంది. మిల్పిటాస్ (కాలిఫొర్నియా) లో జూన్ 19, 2010 న రచయిత, మిత్రులు బ్రహ్మానందం గారు నిర్వహించిన 5వ కాలిఫొర్నియా తెలుగు సదస్సులో వరలక్ష్మి గారి కధలను ప్రధమంగా చూశాను. ఆ రోజు వక్తలలో ఆమె కూడ ఒకరు. తన ఉపన్యాసంలో కె.వరలక్ష్మి గారు తమ కథా పరిణామం గురించి చెప్పారు. వీరి కధలలో తుదికంటా చదివించే గుణం ఉంది. కధలలో ప్రత్యక్ష సందేశం కనపడదు. కధలలోని పాత్రల చర్యలే కొన్ని విషమ పరిస్థితులలో జీవితం లో తటస్థించే ఆటు – పోట్లను ఎలా తట్టుకోవాలో చెప్తాయి. అతడు – నేను కధా సంకలనం మే 2007 లో ప్రచురింపబడింది. ఈ పుస్తకం లోని కొన్ని కధలను పరిచయం చేస్తాను.

ఆనకట్ట: అటవీ ప్రాంతంలో జరిగే ఆదివారం సంత వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుందీ కధ. ఇందులోని నాయకుడు సకల తను మనసు పడి, పెద్దలతో ఒప్పించుకుని మనువాడుదామనుకున్న వెన్నెలతో వివాహం జరపటానికి వెన్నెల తల్లితండ్రులు సుముఖంగా లేరని తెలుసుకుని ఆశ్చర్యానికి, విచారానికి లోనవుతాడు. ఈ ముగింపు పాఠకుడి ఊహకందదు. Spoiler. పోలవరం ఆనకట్ట వలన ముంపుకు గురయ్యే గ్రామాలలో సకల ఊరు కూడా ఒకటి. గోదావరి జలాలవలన నిర్వాసితమయ్యే సకల కుటుంబం వెన్నెల గూడానికి దూరంగా వెళ్లిపోబోతుంది. ఆ కారణంగా వెన్నెల తల్లితండ్రులు సకల తో వివాహానికి ఇష్టపడటం లేదు. ఆనకట్ట నదీ జలాలకే కాకుండా వెన్నెల, సకలల ప్రేమకు కూడా అడ్డుగోడై నిలవటం కధలో కొసమెరుపు. 2006 ఆటా కధల పోటీలో మొదటి బహుమతి వచ్చిందీ కధకు. ఈ కధను ఈమాటలో చదవవొచ్చు.

గండు చీమలు:
పాఠకుడికి తనకు తెలిసిన వ్యక్తులలాంటి పాత్రలు, స్వభావాలు వాస్తవికంగా అనిపించటం, అపరిచిత పాత్రలు, ప్రవర్తన, ప్రదేశాలు అస్వాభావింకంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. తెలిసిన పాత్రలు, తెలియని విధంగా రూపాంతరం చెందినా పాఠకుడు విస్మయానికి లోనవుతాడు. అలాంటి సందర్భంలో పాఠకుడు రచయిత కళ్లతో ప్రపంచాన్ని చూడాలా?

ఈ కధలో కధానాయకుడు మధ్యతరగతి రైతు. అప్పులు చేసి, తినీ తినక కొడుకును ఇంజనీరింగ్ చదివిస్తాడు. వృద్ధ్యాప్యంలో అప్పులు తీర్చటానికై వంశపారంపర్యంగా వున్న ఏకైక పాత ఇంటిని అమ్మివేసి, అరా – కొర సౌకర్యాలతో ఉన్న అద్దె ఇంట్లో ఉంటాడు భార్యతో కలిసి. కొడుకుకు మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉద్యోగం వచ్చాక, తన కష్టాలు తీరగలవని తలుస్తాడు. కొడుకు పెళ్లి జరిగాక మనవరాలిని చూడటానికై పట్టణం వెళ్లిన దంపతులకు కోడలు నిరాదరణ మనస్తాపానికి కారణమవుతుంది. పల్లెకు వచ్చి బ్రతుకు భారంగా ఈడుస్తున్న తరుణంలో కొడుకు వచ్చి స్థలం కొని, ఇంటి నిర్మాణానికై గ్రామ పంచాయితి అనుమతులు తీసుకుని, ఆ గృహ నిర్మాణ బాధ్యతలు తండ్రి పై వుంచి తను పట్టణానికి బయలుదేరుతాడు. ఎండనక, వాననక నిర్మాణపు పనులలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇంటి నిర్మాణం పూర్తి చేసి, సత్యనారాయాణ వ్రతం చేసి తమ కష్టాలు తీరాయనుకుంటున్న సమయంలో, కోడలు తన పుట్టింటి వారితో అన్న మాటలు “తను ఇంట్లోకి రాకూడదని అందుకే అత్తా, మామలతో పూజ చేయించవలసివచ్చిందని, రహదారి గుత్తేదారుకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చాము” , వృద్ధ రైతు దంపతులను హతాశులను చేస్తాయి.

ఈ కధలో రైతు బీదతనం, ఆర్ధికబాధలు కొడుకుకు తెలియకుండా ఎలా వుంటాయి? భార్య మాటలు విని, తల్లి తండ్రులను చివరలో గాలికి వదిలేయటం పాఠకులను ఆలోచింపచేస్తుంది.

అతడు నేను: ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అర్ధంచేసుకోని భర్త, రాచి రంపాన పెట్టే అత్తల మధ్య నలిగిన ఏ అమ్మాయిలో ఐనా భావుకత మిగిలిఉండటం అపురూపం కాదా! పక్షవాతం తో మంచాన పడ్డ భర్తకు, వృద్ధాప్యంలో మంచాన పడ్డ అత్తకు సేవచేసే కధా నాయికను ఆమె స్నేహితురాలు అడుగుతుంది ” అవునూ, అతను నీకేం చేశాడని నువ్వతనికంతగా సేవలు చేస్తున్నావు? ” సేవాభావంతో సేవాశ్రమంలో సేవ చేసే నాయిక అంటుంది ” ఎంతోమంది అపరిచితులను, వారి గురించి ఏమీ తెలిసికోకుండా వారికి సేవ చేస్తున్నాము కదా. ఇతన్నీ అలాగే అనుకుని నేనిదింతా చెయ్యగలుగుతున్నాను. అతను నిస్సహాయుడు. మనము జీవించటానికి కావలసిన ముఖ్య లక్షణం జీవితం మీద ప్రేమ. ఇతరులను జీవింప చేయటానికి కావల్సిన ముఖ్య లక్షణం, మనుషుల మీద నమ్మకం, జాలి దయ, ప్రేమ. ప్రపంచాన్ని, మనుషుల్నీ ప్రేమించలేని స్థితి విషాదకరమైంది.” కధానాయిక స్నేహితురాలు ఆమెతో అంటుంది ” ఈ లోకంలో అందరూ నీలా ఆలోచించగల్గితే దేశాల మధ్య అసలు యుద్ధాలే రావు.”

ఈ కధ ఆలోచింపచేస్తుంది. కధా శిల్పం కధను చదివించేలా చేస్తుంది. ఈ రచయిత్రి కధలలో ముగింపు ఊహింపజాలం. ఓ.హెన్రి కధలంత విస్మయాన్ని కలిగించక పోయినా, కధ చెప్పే తీరు ఒక క్రమ పద్ధతిలో మనలను ముగింపు వైపు లాక్కెళుతుంది. ఈ కధలను చదివే సమయంలో జరగబోయే కధను ఊహించటం కష్టతరం. అందుకు రచయిత్రిని అభినందించాలి. ఈ కధ 2003 తానా కధల పోటీలో బహుమతిపొందింది. ఈ కధను ఈ మాటలో చదవ వొచ్చు.

పక్షులు: 15 సంవత్సరాలు కంటికి రెప్పలా, ప్రాణంలా పెంచిన కొడుకు, కోర్టులో ‘నేను మా నాన్న దగ్గరే ఉంటా” అంటే ఏ తల్లి గుండె చెరువవ్వదు? భార్యా భర్తలు విడిపోవటం అనివార్యమైనప్పుడు ఇలాంటి విషమ పరిస్థిని ఎదుర్కోవటం కష్టమే. కొంగ రెక్కలొచ్చిన పిల్లలను గూట్లోంచి తరిమేస్తే ఆ పిల్లలు ఎగురుతూ, పడుతూ మరో గూటిని వెదుక్కుంటాయి. 15 ఏళ్ల కొడుకు ఇప్పుడు డబ్బున్న తండ్రివద్దకు బంగారు భవిష్యత్ కోసం వెళ్లితే అది పక్షులు, జంతువులు కూడా పాటించే సహజన్యాయమే కాదా!

ఆగమనం: ఒక విచిత్ర పరిస్థితిలో రఘుపతి ఇద్దరు పిల్లలున్న సునీతను వివాహం చేసుకుంటాడు కాని తనకు జన్మించని పిల్లలపై ప్రేమను పెంచుకోలేక, సునీతకు దగ్గర కాలేక, తల్లికి ఈ వివాహకారణంగా దూరమయ్యానని వ్యాకులపడే రఘుపతి, తల్లి అనారోగ్య వార్త విని ఆమెను చూడటానికై ముంబాయి నగరం నుండి సొంతఊరు ఉప్పాడ వెళ్లినప్పుడు, తాను తెలుసుకున్న ఒక కొత్త నిజం -తాను అనాధ ఐతే, తన తల్లి తనను దగ్గరతీసి, సాకి పెంచి పెద్దచేసిందనే వాస్తవం, అతన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుందీ కధ. గంగవరం ఆశ్రమంలో చేరుదామనుకున్న రఘుపతి మనసు మార్చుకుని తనకు పుట్టని పిల్లలపై ప్రేమను పెంచుకొని ముంబాయి ప్రయాణం కడ్తాడు.

ప్రస్థానం: అభివృద్ధి పేరుతో నదుల పై కట్టే ఆనకట్టల తో గుత్తేదారులు, పెద్ద వ్యసాయదారులు లాభపడుతుంటే అదే సమయంలో చిన్నా చితక రైతుల భూములు నదీ జలాల కింద సమాధై, భూములని నమ్ముకున్న రైతులను నట్టేట ముంచుతున్నాయి. బంగారమ్మ ఐదు ఎకరాల భూమి ఏలేరు పై డాం కట్టడం తో ఒక ఎకరమయింది. ఉన్న గూడు స్థానంలో, హైవే పక్క కూసింత జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికై, ఇసుక,సిమెంట్ వగైరాలు అప్పు పై ఇచ్చారు. వానాకాలం మాత్రమే పిసరంత గడ్డి మొలిచే స్థలంలో వారికి జీవనాధార మేమిటి? ఉపాధి నిచ్చే అడవికి దూరంగా బ్రతుకు వెళ్లదీస్తున్న వారికి పులి మీద పుట్రలా, రహదారి వెడల్పు పనులలో ఆ కొద్ది జాగాను సర్కారు స్వాధీనం చేసుకొని పది వేలు నష్టపరిహారమిస్తే, ఆ డబ్బుని బంగారమ్మ కొడుకులు ఉప్పుటేట్లో చేపల వ్యాపారం చేస్తామంటూ తీసుకెళ్లి తగలేస్తే, ఇప్పుడా కుటుంబం ఎట్లా గడిచేది? వీళ్లకు పది వేలు నష్ట పరిహారమిచ్చిన చోటే, పార్టీ కార్య కర్తలకు పది లక్షల నష్ట పరిహారం లభిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో అయినవారికి కంచంలో, కాని వారికి మంచం లో అన్నం పెట్టినట్లు చేస్తే, ప్రజల వెతలు తీరేదెలా? ఎప్పుడు తీరతాయి? ఇది చదువుతుంటే ఎందుకో కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కధ గుర్తు కొచ్చింది. అంతా అభివృద్ధే. ఊళ్లోకి రహదారొస్తుంది, బస్ లొస్తాయి. అంగళ్లొస్తాయి. కాని రైతు జీవన పరిస్థితేమిటి? ఈ అభివృద్ధి, గ్లోబలైజేషన్ లో ఉన్నవాడు బలిస్తే, పేదవాడు మరింత బలహీన పడ్తున్నాడు. ప్రభుత్వ విధానాలపై, అవినీతి ఉద్యోగులపై సంధించిన వ్యంగాస్త్రమీ కధ.

ఈ కధకు ఆర్.ఎస్.కృష్ణమూర్తి స్మారక బహుమతి లభించింది.

నాటకం: సినీ వ్యాపార ప్రకటనల చిత్రాల చిత్రీకరణలో చోటు చేసుకునే సినీ మాయల కధనమే ఈ కధ. అందాల పోటీలో పాల్గొన్న పల్లవి ఒక అడ్-ఫిల్మ్ నిర్మాత కళ్లలో పడుతుంది. టాల్కం పౌడర్ ప్రకటన చిత్రంలో నటించేందుకు రావాలని పిలుపొస్తుంది. ఆడ్ ఫిల్మ్ లో నటించినందుకు ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తారు. చెక్ బాంక్ నించి తిరిగొచ్చిన కారణంగా పల్లవి భర్త కోర్ట్ లో కేస్ వెయ్యాటానికి ఆయత్తమవుతున్న సమయంలో టాల్కం పౌడర్ వీడియో సినిమా హాల్స్ లో విడులవుతుంది. ఆశ్చర్యంగా వీడియో లో నటించిన మౌసమీ సనారా, పల్లవిలలో ఒక్క మౌసమీ మాత్రమే కనిపిస్తుంది. కాగడా వేసి వెతికినా ఎక్కడా పల్లవి చిత్రంలో కనిపించదు.

ప్రయాణం: బస్ లో విశాఖ నుంచి రాజమండ్రి ప్రయాణం లో తారస పడే పాత్రల మనస్తత్వ పరిశీలనే ఈ కధ. ఈ రచయిత్రి తాను ఫెమినిస్ట్ అని ఎక్కడా ప్రకటించుకోకపోయినా, బాధాసర్పద్రష్టలపై పుట్టెడు సానుభూతి కనిపిస్తుంది తన కధలలో. ఇందులో కధా నాయిక ఒక స్కూల్ కరస్పాండెంట్. రావులమ్మ తన రెండవ భర్త తాగుబోతు అని చెప్పాక, కధా నాయిక ” హతోస్మి” అని నిట్టూర్చి, “ఎక్కడైనా ఆడవాళ్ల నోటివెంబడి ‘సుఖంగా ఉన్నాం. ‘ అనే మాట వినపడుతుందా? ” అని ఆలొచనలో పడుతుంది. అదే బస్ లో నవనీత అనే అమ్మాయి భర్త వరకట్న వత్తిళ్లు తట్టుకోలేక పుట్టింటికి పయనమయి, మార్గం మధ్యలో ఒక పాత భావి ఉండే పండాలదిబ్బ లో, తన గమ్యస్థానానికి ముందే దిగి పోతుంది. నవనీత ఎందుకు అర్థాంతరంగా బస్ దిగిందో అని కధా నాయిక కలవరపడుతుంది. ఒక సంవత్సరం తర్వాత తన స్కూల్ లో టీచర్ పోస్ట్ కు ఇంటర్వ్యూ కొచ్చిన అమ్మాయిని చూసి గుర్తుపట్టి అడుగుతుంది. “నువ్వు బస్ మధ్యలో దిగినాక ఒక నెలపాటు నీ గురించే ఆలోచించాను.” ఎందుకు దిగావని. నవనీత అంటుంది ” రావులమ్మ తన భర్త వెరే స్త్రీ తో తిరిగితే ధైర్యం కోల్పోలేదు. వాడ్ని వదిలేసి ధైర్యంగా సొంతంగా వ్యాపారం చేస్తూ తన కాళ్ల మీద తను నిలబడింది.చదువులేని రావులమ్మే తనకు స్ఫూర్తి” అంటూ ఈ సంవత్సవర కాలంలో తాను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశానని, తాను తన అమ్మ , తన పాపాయి ఆ ఊళ్లోనే ఉంటున్నామని, తన తల్లి కూడా అదే స్కూల్ లో పని చేస్తుందని చెప్తుంది. “మా స్కూల్లోనా? మీ అమ్మ గారి పేరేమిటి” అన్న ప్రశ్నకు బదులుగా “నిర్మల. అటెండర్” అని బదులివ్వటం తో కధ ముగుస్తుంది. స్త్రీలు తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మ స్థైర్యం తెచ్చుకోవాలన్న సందేశం అంతర్లీనంగా పాఠకులకు అర్ధం కాగలదు.

మంత్రసాని: చుక్కమ్మ మంత్రసాని.నాగరిక, అభివృద్ధి తో ప్రసూతి కేంద్రాలు పల్లెలకు రావటంతో చుక్కమ్మ నిరుద్యోగి అవుతుంది. చుక్కమ్మ కూతురు లోవ బాల్యంలో గారాబంగా పెరిగినా, పెద్దయ్యాక కుటుంబాన్ని చుట్టుముట్టిన పేదరికం ఆమెను దైన్య పరిస్థితులలోకి తీసుకెళ్తుంది. పెనిమిటి పనిచేసిన పెంకుల మిల్లులో పని చేద్దామంటే అది కాస్తా మూతపడింది. పాచిపాని చేద్దామంటే, మొగుడుచచ్చిందాని మొహం మూడు నెలలుదాకా చూడకూడంటూ కామందులు పనికి రానివ్వరు. ఇంట్లో నలుగురు పిల్లలు, ముసలి చుక్కమ్మలను లోవ ఎలా పోషించాలి? లోవ కు ఆ పరిస్థితులలో, మిగిలిన దారి గురించి, హైవే పై ఉండే నీలమ్మ వివరించినప్పుడు,చుక్కమ్మ తో పాటు పాఠకుడూ ఆవేదనకు లోనవతాడు.

కధలో పందుల పెంపకంలో సాధకబాధకాలు, మంత్రసానిగా చుక్కమ్మ అనుభవాలు చాలా వాస్తవికంగా చిత్రించటం చూడొచ్చు. కధ చివర చుక్కమ్మ ఆవేదన కవిత రూపంలో రచయిత చక్కగా వ్యక్తపరిచారు.

దేవుడా! ఓరి మాయదారి దేవుడా !
పుట్టించీవోడివి నువ్వే అంటారు దేవుడా !
నేను పుట్టీటప్పుడు నా తల్లి కడుపులోని మురుగునీటిని సీల్చుకుని ఏలాగ బైటికొచ్చేనో
నాకు గెవనం లేదు దేవుడా!
ఉప్పుడీ తోలుతిత్తి మురిగ్గుంటలోపడి ఈ పేణం ఒకటే కొట్టుకులాడుతంది దేవుడా!
నీకే గనక నిజంగా మంత్రసాని పని వచ్చుంటే
ఈ మూలపడిపోయిన దేహంలోంచి దేవుడా
జీవుణ్ణి సునాయాసంగా బైటపడెయ్యి దేవుడా
అప్పుడే నీ సేతి సలవ రుజువౌతాది దేవుడా
నీ మొగోడితనం రుజువౌతాది దేవుడా
దేవుడో… ఓరి మాయదారి దేవుడో….

కధ, శిల్పం, శైలి ఇంకా కవిత సమపాళ్లలో ఉండి కధను కొత్తకోణంలో ఆవిష్కరించేసే కధ ఇది.సమాజంలో అట్టడుగు వారైన ఎరుకల జీవన విధానాన్ని భిన్న ధృక్పధంలో చూపించే కధ ఇది. ఇంత వాస్తవికంగా, ఈ కోణంలో వ్రాయటంలో రచయిత సఫలీకృతమయ్యారు.అగ్రకులాల వారు సృజించిన సాహిత్యం మానవ సంబంధాలను ఒక కోణంలో చూపిస్తుంది. వెనుకబడ్డకులాల వారి సాహిత్య సృజన,బడుగు వర్గాల దృక్పధంలో లేని సాహిత్య లోటును భర్తీ చేసి, సాహిత్యాన్ని సుసంపన్నం చేయగలదు.
ఈ కధ పులికంటి కృష్ణారెడ్డి అవార్డ్ పొందినది.

ఈ పుస్తకంలో పైన ప్రస్తావించిన కధలే కాకుండా మరో తొమ్మిది అణిముత్యాలలాంటి కధలున్నాయి. ఇవన్నీ గతంలో పలు బహుమతులొచ్చిన లేక వివిధ పత్రికలలో ప్రచురించబడి పాఠకుల ఆదరాన్ని చూరగొన్నవి. ఇప్పుడు ఆలోచనల్లా ఇంత మంచి కధలను గుర్తించటానికి నాకింత కాలం పట్టిందే అని.

అతడు – నేను: కె. వరలక్ష్మి కధలు
ప్రచురణ: ఎన్.కె పబ్లికేషన్స్, విజయనగరం.
ప్రధమ ప్రచురణ: మే 2007
18 కధలు ఇంకా మంత్రసాని కధపై రచయిత విహారి స్పందన
(తెలుగు కధ -తేజోరేఖలు శీర్షికలో 2007 ఆదివారం ఆంధ్ర ప్రభలో ప్రచురితము)
వెల: రూ.60/- డెమి సైజ్ పేజీలు: 163 ముఖచిత్రం: చంద్ర
అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యం అవుతుంది.

You Might Also Like

One Comment

  1. నాగలక్ష్మి

    కే. వరలక్ష్మి గారి కథల గురించి చాలా బాగా వివరించారు. మృదువైన శైలి లో పదునైన కధ అల్లే రచయిత్రి ఆమె!
    చుక్కమ్మ ఆవేదన కవితాశ్రువులై ప్రవహించినట్టు అనిపించింది .కవితలో మరణయాతన చాలా బాగా చిత్రించారు వరలక్ష్మి గారూ.

Leave a Reply