ప్రపంచ పుస్తక మేళాలో..!!

వ్యాసం రాసినవారు: అరిపిరాల సత్యప్రసాద్

ఢిల్లీలో గతవారం ప్రపంచ పుస్తక ప్రదర్శన జరిగింది. మనలాంటి పుస్తక ప్రియులకి (కొంతమంది పుస్తకాల పిచ్చోళ్ళనే పేరుపెట్టినా..) ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుందని నాకు అనిపించింది. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఠంచనుగా మొదటిరోజే సదరు మేళా సందర్శించాను. ఆ పుస్తక ప్రదర్శనకి నేను వెళ్ళిన తీరుతెన్నులు, అనుభవాలు మీకు విన్నవించుకుంటాను.

2010 World Book Fair in Pragati Maidan New Delhi 130 జనవరి 2010న మొదలై 7 ఫిబ్రవరి 2010 వరకు వారం రోజుల ప్రదర్శన గురించి పేపర్లో చదవగానే వెంటనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.(వెంటనే ఎందుకంటే
మిగిలిన పనిదినాల్లో నేను ఢిల్లీలో వుండనని తెలుసు కాబట్టి..!!) అందుకే ధైర్యం చేసి మొదటి రోజే వెళ్ళాను. ప్రగతి మైదానం ఒక చిన్న పల్లెటూరి సైజులో వుంటుంది. అందులో పుస్తక ప్రదర్శన జరిగేది ఎక్కడో తెలుసుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో ప్రతిస్టాత్మకంగా జరుపుతున్న ఈ ప్రదర్శనకి కనీసం బేనర్లు, దారి చూపే బోర్డులు లేకపోవటం నిరాశ పరిచింది.  వేరే ఏదో ఎగ్జిబిషన్‌కి వచ్చిన జనాన్ని చూసి “ఆహా రాజధానిలో ఎంతమంది పుస్తక ప్రియులు..” అని సంబర పడ్డాను. అసలు ప్రదర్శనకి వెళ్ళాక పల్చగా వున్న జనాన్ని చూసి పొరపాటు గ్రహించి, మనవారి పుస్తక ప్రియత్వానికి “జయ హో” చెప్పుకోని లోపలికి అడుగుపెట్టాను.

మొదటగా వెళ్ళిన హాలులో కన్నడ, మళయాళ, ఉర్దూ పుస్తకాలను చూసి, ఇక్కడే ఎక్కడో తెలుగు పుస్తకాలు వుంటాయని వెతికి భంగపడ్డాను. ఎవరో వాలంటీరు కనిపిస్తే – “అయ్యా తెలుగు పుస్తకాలు ఎక్కడ?” అని అడిగితే అతను ఎగా దిగా చూసి తెలుగు స్టాళ్ళు లేవు పొమ్మన్నాడు. ఇంకా నయం “తెలుగు అంటే ఆఫ్రీకా కొండ జాతులు మాట్లాడే భాషా?” అని అడగనందుకు సంతోషించి, దేశ భాషలందు తెలుగు “లెస్సే” సుమీ అనుకుంటూ ముందుకు సాగాను.

ఆ తరువాతే మొదలైంది అగ్ని పరీక్ష. దాదాపు రెండువేలకు పైగా స్టాళ్ళలో దేశ విదేశాలకు చెందిన పుస్తకాలు. విజ్ఞానం, వినోదం కలగలిపిన భాండాగారాలు. కథలు, కవిత్వాలు, నవలలు, ఆత్మకథలు, స్వామీజీల ప్రవచనాలు, సరసమైన పుస్తకాలు, కల్పనలు, కాల్పనికేతరాలు.. నన్ను కొనమంటే నన్ను కొనమని ముందుకు దూకుతుంటే ఏ పుస్తకమని కొనాలి? అసలు అంత వోపిక (జేబులో) వుందా? అక్కడే ఆగి ఒక కప్పు టీ పట్టుకోని అక్కడక్కడ పుస్తకాలు కొంటున్న ప్రముఖుల్ని చూస్తూ ఆలోచించాను. నా ఆలోచనల ఫలితం ఇదుగో నా ఈ చిన్న థియరీ:

“పుస్తకాలు చదివే వాళ్ళలు ప్రముఖంగా రెండు రకాలు – ఒకటి తమకి కావల్సిందేమిటో తెలిసినవాళ్ళు, రెండు ఏది కావాలో ఏది వొద్దో అంతగా క్లారిటీ లేనివాళ్ళు. మొదటి రకం ఒక రచయితకో, ఒక జెనరాకో, ముందే వ్రాసి పెట్టుకున్న లిస్టుకో పరిమితమైన వాళ్ళు. వీళ్ళపని సులువు. కావల్సినవి దొరుకుతున్నాయా లేదా అని చూసుకుంటూ పోతే దొరికినంత వరకు దొరకబుచ్చుకోని పోవచ్చు. ఇక రెండో రకం వారికే సమస్య. కనపడ్డ ప్రతి విషయం, ప్రతి పుస్తకం ఆవురావురు మని వూరిస్తుంటుంది. పుస్తకాల అట్టల్లోంచి రచయితలు, పాత్రలు, ఎప్పుడో చదివిన సమీక్షలు, రకరకాల శైలులు బయటికి తొంగి చూసి “రా..! రా..!!” అంటూ ఆవాహన చేస్తుంటాయి. ఇలాంటప్పుడే జేబులో బొమ్మ తగ్గు తగ్గు
అనీ, జేబు కింద గుండె కొనై, కొనై అనీ తికమక పెట్టేస్తాయి. ఈ రెండో కోవకి చెందిన నేను ఇలా కొట్టు మిట్టాడుతుండగా ఒక పుస్తక స్టాలు కింద జ్ఞానోదయమైంది.

ఆ పుస్తక స్టాలు ప్రకాశకులు – నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్.బీ.టి). దాదాపు అన్ని భారతీయ భాషల్లో వివిధ పుస్తకాలు వెలువరించారు వీరు. ఆ స్టాలుకి వెళ్ళగానే ఒక మూలగా పడివున్న తెలుగు పుస్తకాలు కనిపించాయి. “హిబ్రూ కథలు”, “గుజరాతీ కథలు”, “హిందీ నవల” వంటి టైటిల్స్ – వాటికి తెలుగు అనువాదాలు. పుస్తకం ఖరీదు చూస్తే రూ 19, రూ 24, రూ 28 ఇలా వున్నాయి. ఇంకెందుకు ఆలోచన అంటూ ఒక నాలుగైదు అందుకున్నాను. తరువాత అలాంటిదే మరో స్టాలు – కేంద్ర సాహిత్య ఎకాడమీ వారిది – ఎదురైంది. ఇక్కడ కూడా వివిధ
భాషల పుస్తకాలు తెలుగులో, ఆంగ్లంలో కొనుక్కోని, జేబు మీద పెద్ద భారం పడకుండా బయటపడ్డాను. తెలుగు పుస్తకాలు దొరికాయని ఆనందం ఒకవైపు, సరసమైన ధరలకే పుస్తకాలు దొరికినందుకు మరికొంత ఆనందం మరో వైపు – ఇలా ఆ హాలు దాటాను.

ఆంగ్ల పుస్తకాలు కొనేముందు మరో ఆలోచన పుట్టింది. బయట పైరసీలో దొరికే పుస్తకాలకు వందలు వందలు పోసి కొనాల్సిన పనిలేదని తీర్మానించుకొని (తప్పే కానీ తప్పలేదు).. రిబేటు ఇస్తున్న స్టాళ్ళలోనే అడుగుపెట్టి కొన్ని టైటిల్స్ కొన్నాను. ఇక్కడే పుట్టిన మరో సూత్రం ఏమిటంటే – నాకు వృత్తిపరంగా అవసరమైన పుస్తకాలు నేనుగా కొనుక్కోకూడదనీ, మా కంపెనిచేత కొనిపించాలని. (ఇలాంటి అవకాశం అందరికీ దొరకదనుకోండి.)

ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా తిరగగా తిరగగా సాయంత్రానికి అలసిపోయి (నడిచినందుకు కొంత, పుస్తకాలు మోసినందుకు మరికొంత) చూసింది గోరంత, చూడాల్సింది కొండంత అని తెలుసుకోని ఒక చోట కూలబడ్డాను. కొన్న పుస్తకాలన్నీ సర్దుకోని లెక్క చూసుకోని – 26 పుస్తకాలు ఇంకో ఆరునెలపాటు సరిపోతాయని, కాబట్టి ఇంక ఆరునెలెలపాటు పుస్తకాలు కొనకూడదని నిర్ణయించుకొని ఇంటి దారి పట్టాను.

***

స్టాలులో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి – సంస్కృతం స్టాళ్ళు – ఇందులో సంస్కృత పాఠాలకు సంబంధించిన టీచింగ్ సీడీలు దొరకటం, డిజిటల్ బుక్ రిడర్లు అమ్మే స్టాళ్ళు, యూరోపియన్ దేశాలవాళ్ళు (ముఖ్యంగా ఫ్రెంచ్, స్పానిష్)వారి వారి పుస్తకాలు అమ్మడం చూసి చాలా ఆనందమేసింది. ఎంతోకాలంగా అమ్ముడుపోని పుస్తకాలకు మంచి రిబేట్లు ఇచ్చేస్టాళ్ళూ కూడా గమనించాను. ముఖ్యంగా రూపా & కో వారి స్టాళ్ళో చేతన్ భగత్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతుంటే – చేతన్ భగత్ దేశంలో చాలామంది చేత కొత్తగా పుస్తకం
పట్టిస్తున్నాడన్నమాట నిజమనిపించింది. నేను వెళ్ళిపోయిన కొద్ది సేపటికే చేతన్ భగత్ అక్కడికి వచ్చాడని తెలిసింది. రొజూ ఎన్నో పుస్తకావిష్కరణలు, సాహితి సదస్సుల మధ్య పుస్తక మేళా దివ్యంగా జరిగిందని పేపర్లు చదివితే తెలిసింది.

పుస్తకం వారు ఈ నెల ఫోకస్‌గా ప్రకటించిన “బాల సాహిత్యం” గురించి రెండు ముక్కలు – చాలా వరకు స్టాళ్ళు చిన్న పిల్లకోసమే ఏర్పాటు చేశారు. అందులో ప్రముఖంగా ట్వింకిల్, అమర్ చిత్ర కథ వారి స్టాళ్ళు, రాదుగా పబ్లిషర్స్ వారి రష్యన్ పుస్తకాలు చాలానే వున్నాయి. అలాగే ఎన్.బీ.టీ వారి పుస్తకాలలో కూడా చాలా బాల సాహిత్యం పుస్తకాలు వుండటం, అవి కొనుక్కునేందుకు చాలా మంది పిల్ల వుత్సాహం చూపించడం కనిపించింది. మా అమ్మాయికోసం నా 26 పుస్తకాలలో ఆరు పుస్తకాలు కేటాయించాను.

ఇవిగో ఇవి నేను కొన్న పుస్తకాల వివరాలు:

ఇంగ్లీష్ కాల్పనిక సాహిత్యం
ఒన్ నైట్ అట్ కాల్ సెంటర్ – చేతన్ భగత్ – రూపా & కో (One night at a Call Center – Chetan Bhagat)
డెవిల్ ఇన్ పిన్‌స్ట్రైప్స్ – రవి సుబ్రమణ్యన్ – రూపా & కో (Devil in Pinstripes)
జీరో పర్సంటైల్ – నీరజ్ ఛిబ్బా – రూపా & కో (Zero percentile – Neeraj Chhiba)
ఇఫ్ గాడ్ వాస్ ఎ బాంకర్ – రవి సుబ్రమణ్యం – రూపా & కో (If God was a Banker – Ravi Subramanyam)
థ్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ – చేతన్ భగత్ – రూపా & కో (Three mistakes of my Life – Chetan Bhagat)
ది కైట్ రన్నర్ – ఖలిద్ హోస్సైని – బ్లూంస్‌బర్రీ (The Kite Runner – Khaleed Hosseini)

ఇంగ్లీష్ కాల్పనికేతర సాహిత్యం

ఫైనల్ బిగినింగ్స్ – జాన్ ఎడ్వర్డ్ – హేయ్ హౌస్ యూ.కే. (Final beginnings – John Edward)
ఏ కెరీర్ ఇన్ బుక్ పబ్లిషింగ్ – సామ్యుల్ ఇజ్రాయిల్ – నేషనల్ బుక్ ట్రస్ట్ ( A career in Book Publishing – Samuel Israel)
ఆఫ్టర్ లైఫ్ – జాన్ ఎడ్వర్డ్ – హెయ్ హౌస్ యూ.కె. (After Life – John Edward)
డిస్కవర్ ద డైమండ్ యు – అరిందం చౌధురి – వికాస్ పబ్లిషింగ్ హౌస్ (Discover the Diamond in You – Arindam Choudhuri)
ద గూగుల్ స్టోరీ – డేవిడ్ ఏ. వైస్ – పాన్ మెక్‌మిలన్ (The Google Story – David A Vice)

తెలుగు అనువాదాలు:
మధుపురం బహుదూరం (అస్సామీ కథల సంకలనం)- శీల్‌భద్ర – కేంద్ర సాహిత్య ఎకాడమీ
గంగమ్మ తల్లి (హిందీ నవల) – భైరవ ప్రసాద్ గుప్త – కేంద్ర సాహిత్య ఎకాడమీ
అద్భుతగ్రహం గాథ (జపనీసు కథలు) – తాజిమా షిన్‌జి – కేంద్ర సాహిత్య ఎకాదమీ
నాన్నగారి స్నేహితుడు (తమిళ నవల) – అశోక మిత్రన్ – కేంద్ర సాహిత్య ఎకాడమీ
మధు క్షీరాలు (హిబ్రూ కథా సంకలనం) – హాయా హాఫ్‌మన్ – నేషనల్ బుక్ ట్రస్ట్
శాంబుడు (బెంగాలి నవల) – కాల్‌కూట్ సమరేశ్ బసు – కే.సా.ఏ
గుజరాతీ కథలు – యష్వంత్ శుక్ల, అనిరుధ్ బ్రహ్మభట్ – నే.బు.ట్ర

ఇంగ్లీషు అనువాదాలు:
ద సర్వెంట్స్ షర్ట్ (హిందీ నవల) – వినోడ్ కుమార్ షుక్ల – నేషనల్ బుక్ ట్రస్ట్

జీవిత కథలు
ముత్తుస్వామి దీక్షితార్ – టి.ఎల్. వెంకటరామ అయ్యర్ – నే.బు.ట్ర.
ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి – పరమహంస యోగానంద – యోగొద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా

బాల సాహిత్యం
స్వర్గయాత్ర, ఇతర కథలు – లిలావతీ భాగవత్ – నెహ్రూ బాల పుస్తకాలయ
నేపాలీ మండూకం సాహసాలు – కణక్‌మణి దీక్షిత్ – నే.బు.ట్ర
తెలివైన రైతు నలుగురు దొంగలు – సోమా కౌషిక్ – నెహ్రూ బాల పుస్తకాలయ
మంగు బొంగరం – కామాక్షీ బాలసుబ్రమణ్యం – నె.బా.పు.
చిట్టెలుకమ్మ బేగం గులాబో ఆమె చిట్టి బెలూను – ఖుద్ద్సియా జైది – నె.బా.పు.
మృగరాజు ముళ్ళపంది – జె.బి.శర్మ – నె.బా.పు.

You Might Also Like

3 Comments

  1. ఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2012 – ఆహ్వానం | పుస్తకం

    […] పుస్తకం.నెట్లో వ్రాసిన వ్యాసం ఇక్కడ.) Manchi Pustakam is participating in the World Book Fair at New Delhi. The details are as follows: […]

  2. అరిపిరాల

    రావుగారు,
    చదవగానే తప్పకుండా..!! కొంత సమయం ఓపిక పట్టాలి మరి..!!

  3. cbrao

    ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతలు కోరిన పాటలు “మన్ చాహే గీత్” ఇష్టంగా వినేవాళ్లం. పాఠకుడి కోరికగా అద్భుతగ్రహం గాథ (జపనీసు కథలు) – తాజిమా షిన్‌జి – కేంద్ర సాహిత్య ఎకాడమీ సమీక్ష వ్రాసి పుస్తకం.నెట్ కు పంపగలరా?

Leave a Reply