The wind from the sun
“The Wind from the sun” Arthur Clarke కథల సంకలనం. మొత్తం 18 కథలున్నాయి. ఆర్థర్ క్లార్క్ అనగానే, అవి సై-ఫై కథలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆర్థర్ క్లార్క్ కథలు/నవలలు/వ్యాసాలు – ఏవీ నేను ఎప్పుడూ చదవలేదు కానీ, ఆయనంటే నాకు అభిమానం ఉంది. నేనెళ్ళే ప్రాంతాల్లో ఆయన పుస్తకాలు ఎప్పుడూ కనబడలేదు నాకు. అలాంటిది ఆ మధ్య సెంట్రల్ బుక్ స్టోర్స్ (క్లాక్ టవర్) లో ఇది కనిపించేసరికి మారాలోచించకుండా తీసుకున్నాను. చదివాక ఏమాత్రం నిరాశపడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడుపడితే అప్పుడు ఈ పుస్తకం అలా తెరిచి, ఇంట్లో పనులుచేస్తూ మధ్య మధ్య విరామాల్లో ఒక్కో కథా చదివాను. చదివిన ప్రతిసారీ ఏకబిగిన ఆ కథ ముగించడమే. ఈ పుస్తకం గురించి ఓ సంక్షిప్త పరిచయం –
“Food of the gods” – ఆహారాన్ని కృత్రిమంగా తయారుచేస్తూనే వాటిలోని సహజ విలువల వల్ల వచ్చే రుచిని కలిగించే వ్యాపారం గురించిన కథ. నాకు కథ నచ్చింది కానీ, “వావ్!” అనిపించలేదు. ఇందులోని ఇమాజినేషన్ నాకు చాలలేదనుకుంటాను. “The secret” – చంద్రుడిపై జీవితం, భూమిపై ఉండేవరితో పోలిస్తే, అక్కడి వారికి ఆయువు ఎక్కువుండాలి అన్న వాదనా – రెండూ నాకు ఆసక్తి కరంగా అనిపించాయి కానీ, మళ్ళీ నాకు ఆ “వావ్!” భావన కలగలేదు. “Dial F for Frankestein” కథ మాత్రం నన్ను పూర్తిగా కట్టిపడేసింది. ఊహిస్తూ ఉంటే ఒళ్ళు జలదరింపు… చదివేకొద్దీ పెరుగుతున్న ఉత్కంఠ, ముగింపులో సరైన పంచ్ – నాకీ కథ విపరీతంగా నచ్చింది. కథకి మూలమైన ఊహకు, కథని నడిపించిన విధానానికి క్లార్క్ కు జోహార్!
“Reunion” అన్నది నిజానికి కథ కాదు. ఓ చిన్న వ్యాసం లాంటిది. ఆసక్తికరంగానే ఉంటూ, కాస్తంత ఆలోచన రేకెత్తించింది. “Playback” – నాకీ కథ కంటే కూడా, దాన్ని నడిపిన తీరు నచ్చింది. I liked the experience of reading it. మళ్ళీ మళ్ళీ కూడా చదువుతానేమో. కథ కోసం కాదు. ఆ కథనం కోసం. “Light of Darkness” – ఈ కథలోని సృజనాత్మకత నాకు చాలా నచ్చింది కానీ, కథ మాత్రం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు కథ మొదలైన చోటినుండీ ఇంత మంచి ఊహాశక్తిని ఈ కథ మీద వృథా చేసారేమిటనే అనిపిస్తూ ఉండింది. “Longest sci-fi story ever told” – Recursively funny! ఎటొచ్చీ, నాకు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదు. “Herbert George Morley Wells Esq.” అన్న కథ-వ్యాసం బాగుంది. ఇందులోని కొన్ని ముగింపు వాక్యాలని ఒక్కసారి ఊహించుకుంటే, ఆ ఊహే భయంకరంగా ఉంది నాకు ఇప్పటికీ. “Love that universe” కథ చాలా ఆసక్తికరంగా ఉంది. మళ్ళీ నేను “వావ్!” అనుకున్న కథ – “The cruel sky”. కథ చదువుతూ ఉంటే, ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే, అద్భుతం! అనిపించింది. ఈ కథ చదువుతున్నప్పుడే సత్యజిత్ రాయ్ సై-ఫై పాత్ర ప్రొఫెసర్ శొంకు హిమాలయాల్లోనే చేసిన అడ్వెంచర్ ఒకటి గుర్తొచ్చింది.
“The wind from the sun” – టైటిల్ స్టోరీ కదా, నేనో రేంగ్ లో ఉంటుందనుకున్నా. వస్తువు పరంగా నిజంగానే ఓ రేంజ్ లో ఉంది. నాకు కథ నచ్చింది. కానీ, అద్భుతం! అనిపించలేదు. అప్పుడే అనుమానం కలిగింది, కథా సంకలనాల్లో ఆ సంకలనం పేరుకి ఓ కథ పేరు ఎంచుకుంటారు కదా – అది ఎలా ఎంచుకుంటారు అని. ఎవరన్నా తెలిస్తే ఇక్కడో వ్యాఖ్య వదలండి “Maelstrom-II” కథ చదువుతూ ఉంటే ఎందుకో కల్పనా చావ్లా, ఆమెతో పాటు గగన సమాధైన ఆ జట్టూ గుర్తువచ్చారు. “The Shining Ones” – కథ చాలా ఆసక్తికరమైన థ్రిల్లర్ కథ. నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన కథల్లో ఇదొకటి.
అసలైన, అన్నింటికంటే పెద్ద కథ గురించి నేను ఇందులో రాయలేదు, రాయను కూడా మొత్తానికి చదివి అనుభవించాల్సిన పుస్తకం. క్లార్క్ అభిమానులకైతే చెప్పనక్కర్లేదు. కానివాళ్ళకి చదివితే పోయేదేమీలేదు.
bondalapati
ఇది పుస్తక పరిచయం కాదు..పుస్తకం చదువుతున్నప్పుదు మీ లొ కలిగిన భావాల పరిచయం…:)