2009 – పుస్తక నామ సంవత్సరం

‘తెలుగు సాహిత్యం నా ఒంటికి పడదు’, ‘చరిత్ర  చచ్చినా ఎక్కదు..’ ,’ఫలానా రచయితలనే, ఫలానా తరహా పుస్తకాలే, ఫలానా భాషే చదువుతాను’ అని కుండబద్దలు కొట్టేవాళ్లను చూసినప్పుడు నాకు భలే ముచ్చటేస్తుంది. వాళ్ల పని సులువు. షాపులకెళ్లినా, మరెక్కడైనా తమకేం కావాలో తక్కువ సమయంలో ఎంచుకోగలుగుతారు. అలాగే వాళ్లకు చదవాల్సిన పుస్తకాల జాబితా స్పష్టంగా, పరిమితంగా ఉంటుంది. ఇటు రీడర్స్‌ గ్రీడెక్కువ కావడం, అటు ఏ విస్పష్టమైన అభిప్రాయాలూ లేకపోవడం పరిమితి లేకుండా చేస్తుంది. అది ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పటికప్పుడు చదవాలనుకున్న పుస్తకాలు చదివిన పుస్తకాలకు విలోమ నిష్పత్తిలోనే ఉంటాయి. ఫలితం – మనమంటే మనకు నిరాశ, అప్పుడప్పుడూ అపరిమితమైన దుఃఖం, బాగా చదివేవాళ్లను చూసినప్పుడు అసూయ. చూడండి, చదువు వల్ల ఎన్ని దుర్గుణాలో!

రెండేళ్లుగా పుస్తకాల లభ్యత పెరిగినందువల్ల రీడర్స్‌ గ్రీడ్‌ కాస్త తగ్గుముఖం పట్టిందిగానీ, మిగిలిన బాధలు నాకు అలానే ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది స్నేహితులు చదవమని చెప్పినవి, నా చురుకుదనం తెలిసి వాళ్లే స్వయంగా కొనిచ్చినవీ పుస్తకాలు చదవకపోయినప్పుడు కలిగే గిల్టీ ఫీలింగ్‌. ‘లోలిటా‘, ‘టు కిల్‌ అ మాకింగ్‌ బర్డ్‌’ వంటివి కొన్ని పదుల పుస్తకాలు బుక్‌ర్యాకులోంచి నావైపు అసయ్యంగా చూస్తుంటాయి, అవి ఇచ్చిన వాళ్లేమో వెటకారం కలిసిన జాలితో చూస్తుంటారు. ఆ చూపుల్ని తట్టుకోలేక కనీసం ఈ ఏడు వాటిని పూర్తి చెయ్యాలని నూటాఅరవైరెండోసారి నిర్ణయించుకున్నా. ఇక 2009 రివైండ్‌లోకి వెళితే…
కథలు: కిందటేడాది కథలు రాయాలనే పురుగు కుట్టింది మొదలు, రచయితల జోళ్లలో కాళ్లు పెట్టి చదవడం మొదలయింది. దాంతో ఓం భూమని మళ్లీ మొదటికొచ్చి శ్రీపాద నుంచి శ్రీపతిదాకా అందరివీ కథలు చదివాను. (రచయిత్రులను కూడా) కథనెలా ఎత్తుకున్నారు దగ్గరనుంచి సంఘటనలు ఇతివృత్తాలు వాక్యాలు వర్ణనలు.. అన్నిటినీ పట్టిపట్టి చదివి ఎక్కువసార్లు హాచ్చెర్యపోయేసి మరికొన్ని చోట్ల ఏడ్చేసి ఎక్కువసార్లు విసుక్కుని తక్కువసార్లు నవ్వుకుని అలా గడిచిపోయింది. ఒక మామూలు పాఠకురాలిగా ఇదివరకు నా దృష్టికి రాని మెరుపులూమరకలూ ఇప్పుడు కనిపించేయంటే ఏమన్నమాట? వాసిరెడ్డిగారి పుణ్యమాని (నిజంగా పుణ్యానికే – సంపాదకుడి నుంచి సంపాదించేసి) కథ సంకలనాలన్నీ మళ్లీ టెక్స్‌ట బుక్కులంత దీక్షగా చదవడం 2009 పఠనానుభవాన్ని సంపన్నం చేసింది. సమకాలీన రచయితలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడింది. నాకు బాగా నచ్చింది, ఉపయోగపడింది – శ్రీశ్రీ అనువాద కథలు. వంగూరి ఫౌండేషన్‌ ప్రచురించిన ‘అమెరికా తెలుగు కథానిక‘ ప్రవాసాంధ్రుల కథలను పరిచయం చేసింది. ప్రవాసుల రచనల విషయంలో ఈ ఏటి తానా సావనీర్‌ కూడా ఉపయోగపడింది.
అనువాదాలు: నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ‘ఆదాన్‌ – ప్రదాన్‌’ పేరుతో వివిధ భాషల అనువాదాలను ప్రచురిస్తుంది. సాహిత్య అకాడమీ కూడా వేరే భాషల పుస్తకాలను అందిస్తుంది. అలా తమిళం, కన్నడ, మళయాళ భాషల కథల్ని, సమకాలీన కథలను చదవడం మంచి అనుభవం. ఆత్మకథలనదగిన కొన్ని పుస్తకాల్లో ఈ ఏడు నాకు నచ్చినవి అయాన్‌ హిర్సీ అలీ ‘మతపంజరంలో కన్య’ బేబీ హాల్దర్‌ ‘చీకటివెలుగులు’ నళినీ జమీలా ‘ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ’. ‘ద్వీపరాగాలు’గా వచ్చిన శ్రీలంక కథలు అనువాదం విషయంలో నిరాశ పరిచాయిగానీ భావోద్వేగాల విషయంలో కాదు. ‘గుజరాత్‌ మానవ విషాదం’ నవల టెక్నిక్‌ ఆకట్టుకుంది.
కవితలు: ‘పూరంటే పూరూ కాదూ..’ ఈ పాటను మేడంటే మేడా కాదూ ట్యూన్‌లో పాడుకోవాలని పాఠకులకు వినతి. కవిత్వం విషయంలో నేను తిలక్‌ దగ్గరే ఆగిపోయాను. ఈ ఏడు చదివినవాటిలో నాకు నచ్చినవి శివారెడ్డిఆమె ఎవరైతే మాత్రం వైదేహీ శశిధర్‌ ‘నిద్రిత నగరం’ నామాడి శ్రీధర్‌ ‘బంధనఛాయ’. అఫ్సర్‌ ‘వలస’, కె. గీత ‘ద్రవభాష’ ‘శీతసుమాలు’ వాడ్రేవు చినవీరభద్రుడు ‘కోకిల ప్రవేశించే కాలం’ విమల ‘మృగన’ పెన్నాశివరామకృష్ణ ‘దీపఖడ్గం’ స్కైబాబా షాజహానా కలిసి ప్రచురించిన ‘చాంద్‌తార‘ లాలస ‘సౌండ్‌ ఆఫ్‌ పొయెట్రీ’ కూడా చదివాను. ఏమైనా కవిత్వాన్ని చదివి ఆస్వాదించడానికి కొంత శిక్షణ / బోధన అవసరం అని (కనీసం నాకు) గుర్తించాను. నా ఎడ్డితనాన్ని నాకన్నా ముందే గుర్తించి నాకు వెల్చేరుగారి పుస్తకాన్ని, కాళిపాద గిరి పుస్తకాన్నీ ఇచ్చినవాళ్లకు నమస్కారాలు.
ఇంగ్లిషు: షరా మామూలుగా కథలదే సింహభాగం. మ్యాగజీన్లు, నెట్‌లో వచ్చే కథలు చదవడమే. ఒక నేస్తంపంపితే ఎర్నెస్ట్‌ హెమింగ్వే కథలన్నీ చదివాను. కిందటేడు ఎలాగన్నా బోరెస్‌ కథలు చదువుతాననీ, వీలయితే ఒకటోరెండో అనువాదమున్నూ చేసెదనని ఒక పెద్దమనిషి దగ్గర నేను వాగడం నాకు గుర్తుందిగానీ, ఆయనకు గుర్తు లేపోతే బావుణ్నని మాత్రం మనసులో మొక్కుకుంటున్నా. జెఫ్రీ ఆర్చర్‌ హైదరాబాదు వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవాలని ఏం చదవలేదంటే బావుండదు కదాని ఆయన కథలు చదివా. నేను బాగా నిరాశ పడింది రచయిత చేతన్‌ భగత్‌ విషయంలో. ఆయన రచనలు లక్షల కాపీలు అమ్ముడుపోతున్నాయని వినీవినీ అసలూ అనువాదాలూ రెండూ చదివితే ఎందుకో మరి చిరాకొచ్చింది. భాష, భావం… ఏ విషయంలోనూ నన్ను ఆకట్టుకోలేకపోయాయి ఆయన పుస్తకాలు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి ‘ఎ బెటర్‌ ఇండియా ఎ బెటర్‌ వరల్డ్‌’ ఒకే. యూత్‌ కర్రీ బ్లాగు నిర్వాహకురాలిగా జర్నలిస్టుగా చాలా ఏళ్ల నుంచీ తెలిసిన రష్మీ బన్సల్‌ ‘స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌’ మా ఫీచర్లలాగానే అనిపించింది (ఇతరుల విజయగాథలు చదివి స్ఫూర్తి పొందే మంచి దశను నేను దాటిపోయాననుకుంటా) 🙂 అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ప్రజలే సొంతంగా నాణ్యమైన విద్యావ్యవస్థను రూపొందించుకుంటున్న వైనాన్ని వివరించిన పుస్తకం ‘ఎ బ్యూటిఫుల్‌ ట్రీ’. అంతా చదివాక ‘ఇందులో ఏదో మెలికుందిరోయ్‌… మనవాడు నైసుగా ప్రభుత్వాల బాధ్యత జనాలకు తోసేస్తున్నాడు లేదా ఇతను చూసింది నాణేనికి ఒకవైపే’ అనిమాత్రం అనిపించింది. విద్యావ్యవస్థ మీద ఆసక్తి ఉన్నవాళ్లు మరింత శ్రద్ధగా చదివితే లోపాలను విశ్లేషించగలరేమో. విలియం డాల్రింపుల్‌ కొత్త పుస్తకం ‘నైన్‌ లైవ్స్‌’ కూడా నన్నంతగా ఆకట్టుకోలేదు.
అవీఇవీ: పాత్రికేయులు, పరిచయస్తులైనవాళ్లు రాసినవాటిలో పూడూరి రాజిరెడ్డి ‘మధుపం’, కృష్ణసాయిరాం ‘చూస్తునే ఉండండి’ ‘వార్తల వెనుక కథఆకట్టుకున్నాయి. సలాం హైద్రాబాద్‌’ లోకేశ్వర్‌ రాసిన ‘తెలంగాణ చూపుతో ఛత్తీస్‌ఘడ్‌ యాత్ర’ ఒక్కసారి ఆ రాష్ట్రానికి వెళ్లాలన్న ఆలోచన కలిగించింది. తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీత చరిత్ర, ఒడియా సాహిత్య చరిత్ర, చేరా భాషాంతరంగం వంటివి కొన్నానుగానీ వాటికి మోక్షం ఎప్పుడో! ముళ్లపూడి ‘కోతికొమ్మచ్చి ఎందుకో… నాలో ఏ భావాన్నీ కలిగించలేదు.
చివరిగా: కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర, అబ్బూరి ఛాయాదేవి ‘మృత్యుంజయ’ జర్మన్‌ రచయిత స్టెఫాన్‌త్వ్సైక్‌ పుస్తకానికి ఆవిడ అనువాదం ‘అపరిచిత లేఖ’ బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ‘పథేర్‌ పాంచాలీ’ కాటూరి విజయసారథి నవల ‘పితృవనం’ స.వెం. రమేశ్‌ ‘పొరుగుతెలుగు’ కుప్పం కవితలతో పేరుపొందిన సీతారాం రచన ‘ఆ ముగ్గురు సరే మన మాటేమిటి’తో పాటు, పతంజలి రచనలు నామీద చాలా ప్రభావాన్ని చూపించాయి. గడచిన ఏడాది నా మనోప్రపంచాన్ని ఊపేసిన పుస్తకం మాత్రం వనవాసి.
కొసమెరుపు: నా చదువూసంధ్యా చూసి ముచ్చటేసే చిరాకేసో పాఠకులెవరయినా నాకు పుస్తకాలు పంపగోరితే బండిళ్లూ, గిఫ్టు హ్యాంపర్లూ ఈ వెబ్‌సైట్‌ నిర్వాహకులకు అందించగలరు. దానికి నా ముందస్తు ధన్యవాదాలు. ఇన్నున్నాయి కదాని నన్నే అడగదల్చుకుంటే… హలో.. హలో.. హా….లో.. లైన్‌ కట్టయిపోయిందండ…

You Might Also Like

7 Comments

  1. rajireddy

    ee vyaasam chadavagaane, nenu enni chadivuntaanoo ani urgentga naa diary thirageyaalanipinchindi.
    yeddithanam… ee maata vinaka chaalaa rojulaindi.

  2. మెహెర్

    అభిరుచుల్లో చెత్తవీ మంచివీ వుంటాయా రవిగారూ? నేను వేర్వేరు అభిరుచులు మాత్రమే వుంటాయనుకున్నానే! 🙂

    ప్రతీ జీవితానికీ అనుభవాలు వుంటాయి. జీవితానికి పూచే పూలు జిల్లేడు పూలు. ఎందుకూ కొరగావు. చదివేతేనే—సారస్వతం అనే పరంపర మన ముందు ఎంతుందో, ఎలాగుందో తెలుసుకుంటేనే—పదవిన్యాసమూ, శైలీ, తీరూ, నడకా అలవడి ఆ రచనా కుసుమాలకు తావి అబ్బేది. అని నా అభిప్రాయం 🙂

  3. దుప్పల రవికుమార్

    చదవడమనే చాదస్తపు అలవాటు పెట్టుకున్న అరుణగారు ఈ ఏడాది చదివిన పుస్తకాల జాబితా మరీ టేస్ట్ లెస్ గా వుంది. ఇండియాప్లాజాలో, ఫ్లిప్ కార్ట్ లో, ఇన్ఫీబీమ్ లో బెస్ట్ సెల్లర్స్ అని ప్రకటనలు చూసి కొని పుస్తకాలు చదివితే ఇలాగే అవుతుంది మరి. ఈ 2010 మాత్రం మంచి మంచి పుస్తకాలు మీకు దొరకాలని, దొరికనవన్నీ మీచేత జీవితానికి పూసిన పువ్వుల్లాంటి కథలు రాయించాలని (అంటే ఇప్పటిదాకా పదవిన్యాసంతో మీరు రాసిన కథలన్నీ పుస్తకాలకు పూసిన పువ్వులని వేరే చెప్పక్కర్లేదు కదా!) కోరుకుంటూ…

  4. కొత్తపాళీ

    @ బాబా, చాలా మందికి కవిత్వాన్ని ఆస్వాదించడానికి కొంతైనా బోధన అవసరమే. ఈ మధ్యన జనాలు కథలక్కూడ వివరణలు కావాలంటున్నారు.

  5. బొల్లోజు బాబా

    sorry.

    పోస్టు చేసేసిన తరువాత అరరే వాఖ్య ప్రారంభంలో @అరుణ గారూ అని రాసి ఉండాల్సింది కదా అనిపించింది.

    ఈ వాఖ్య అరుణ గారిని ఉద్దేసించినదేనండీ.

  6. పుస్తకం.నెట్

    @బొల్లోజు బాబా: ఈ వ్యాసం రాసినది అరుణ పప్పు గారు. సౌమ్య, పూర్ణిమ కాదు. గమనించగలరు!:)

  7. బొల్లోజు బాబా

    సౌమ్య గారు, పూర్ణిమ గారు, ఇదిగో ఇప్పుడు మీ వ్యాసం చదువుతూంటే : మీరందరూ ప్రొఫెషనల్ రీడర్ల” లా అంపిస్తున్నారు. నేను డిప్రెశ్హన్లులో పడిపోతున్నా, పోయా………. 🙂

    ఏమైనా కవిత్వాన్ని చదివి ఆస్వాదించడానికి కొంత శిక్షణ / బోధన అవసరం అని (కనీసం నాకు) గుర్తించాను

    ఇంత వొరేషియస్ రీడరైన మీనుంచి పై వాక్యం రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కవులందరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అంశమని నా అభిప్రాయం.

    ఎప్పుడైతే, కవిత్వాన్ని కధనం నుంచీ, గేయం నుంచీ ప్రయత్నపూర్వకంగా వేరుచేయటం మొదలైందో (గమనించండి శ్రీశ్రీ, తిలక్ ల కవిత్వాలు ఎక్కువగా కధన శైలిలో నడుస్తాయి) అప్పటినుంచీ కవిత్వం సాధారణ మరియు మీబోటి విస్త్రుత పాఠకుల నుంచీ కూడా మద్దతు కోల్పోవటం మొదలైంది. ఈ నాడు కవిత్వం అనేది కవులమధ్య పంచుకొనే కరపత్రాల మాదిరి తయారైందంటే అతిశయోక్తి కాదు.

    అలా కవిత్వం చేస్తున్న ఖాళీని నెమ్మది నెమ్మదిగా కధలు ఆక్రమించటం గమనించవచ్చు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

Leave a Reply