శ్రీరమణ కథలు (మిథునంతో సహా)
రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
లక్ష్మన్న సెమీకండక్టర్స్ లో పరిశోధనా విభాగంలో, ఆష్టిన్‌లో ఉన్న “ఫ్రీస్కేల్ సెమీకండక్టర్స్” లో ప్రస్తుతం పని చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని “సరిపెల్ల” గ్రామంలో కవలల్లో (రామన్న – లక్ష్మన్న) ఒకరుగా జన్మించారు. ప్రాథమిక విద్య, కొంత వరకు కాలేజీ చదువు ఆంధ్రాలోనే చేసారు. తరవాత, ఐ. ఐ. టి. ముంబైలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయిన తరువాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి పూర్తి చేసారు. తెలుగు సాహిత్యంపై ఇష్టం, పరిచయం ఉన్న మిత్రులతో కలిసి “ఈమాట” అన్న పేరుతో ఒక వెబ్ మాగజైన్ ప్రారంభించారు. ఇప్పటికీ “ఈమాట” కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. అంతో ఇంతో రాయటం వచ్చిన ప్రవాసాంధ్రులు అందరూ తప్పకుండా రాయాలని వీరి అభిప్రాయం.
******************************
ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, అప్పటి మా ఫ్రాన్స్ బదిలీలలో పోయిందనుకున్న “శ్రీరమణ కథలు (మిథునం)” పుస్తకం మళ్ళీ మొన్న పాత పుస్తకాల పెట్టెలు సవరిస్తుంటే కనపడింది. ఈ కథా సంపుటంలోని కథలు ముందు వివిధ పత్రికల్లో వచ్చి తరవాత మిథునం పుస్తకంగా ప్రచురించ బడింది. అందులో ఉన్న ఒక పెద్ద కథ ” మిథునం” ఇదివరకే ఇక్కడ పరిచయం చేసా! కానీ, ఈ పుస్తకంలోని మిగిలిన కథలు కూడా గొప్పవే అని మళ్ళీ మొన్న చదువుతూ ఉంటే అనిపించింది. “అరటిపువ్వు సాములోరు”, “తేనెలో చీమ”, “వరహాల బావి”, “ధనలక్ష్మి”, “షోడానాయుడు”, “బంగారు మురుగు”, “పెళ్ళి” చదువుతుంటే ఆంధ్ర దేశాన్ని ముప్ఫై ఏళ్ళుగా వదిలిన నేను ఇంతకాలం ఏం మరిచిపోయానో (పోగొట్టుకున్నానో) ఒక్క సారిగా గుర్తుకు వచ్చింది. పుట్టి, పదహారేళ్ళు వరకు పెరిగిన మా ఊరు యొక్క జ్ఞాపకాలు వెల్లువలా గుర్తుకు రావటం మొదలైంది.
పదహారేళ్ళ వయస్సుకు హైదరాబాదు, కొన్నేళ్ళకు బొంబాయి, ఇంకా మరి కొన్ని ఏళ్ళకు అమెరికా, ఈ మధ్యే మూడేళ్ళు ఫ్రాన్స్ లో గడిపిన నా అనుభవాల పాతరలో ఎక్కడో అడుక్కి నెట్టబడి, దాదాపు పూర్తిగా మర్చిపోయిన నా చిన్న తనపు మా పల్లెటూరు జ్ఞాపకాలు ఎన్నో! ఇదిగో, మళ్ళీ ఇలా ఈ పుస్తకం చదువుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోయా!
నవోదయ పబ్లిషర్స్ వారు ముద్రించిన ఈ పుస్తకం మొదటి ముద్రణ 2002 సంవత్సరంలో. రెండో ముద్రణ 2006 లో. వెల: పేపరు బాక్ 50 రూపాయలు, హార్డ్ బౌండ్ 75 రూపాయలు.
అరటిపువ్వులో వేదాంతసారం అంతా ఇమిడి ఉందని వివరించే స్వామివారి జ్ఞానాన్ని, భక్తుల అజ్ఞానాన్ని వివరించే “అరటిపువ్వు సాములోరు” కథ. బక్కగా ఉన్నా, బలంగా ఉన్నా పేదోడు పేదోడే అనే జీవిత సత్యాన్ని ఆవిష్కరించే “తేనెలో చీమ” కథ. కులమతాలకి అతీతంగా వరాలమ్మ “వరహాల బావి” కథ. తనే సమర్ధతతో సంసారాన్ని అంతా లాగుతూ ఆ ఘనతంతా మెగుడిదే అని మొగుడ్ని వెనకేసుకొచ్చే గడుసు “ధనలక్ష్మి” కథ. చిన్నతనంలో ఎలాగైనా షోడా గోళీ సంపాదించాలన్న కోరికను తన పెద్దయ్యాకా తన పెద్దమనసుతో తీర్చిన “షోడానాయుడి” కథ. జీవితానుభవం ముందు ఏ వేదాంతమూ బలాదూరే అని నొక్కి వక్కాణించే ప్రేమమూర్తి బామ్మ కథే “బంగారు మురుగు” కథ. గవర్నమెంటు ఆఫీసు ఉద్యోగుల మధ్య, రాజకీయ నాయకుల మధ్య ఉన్న లుకలుకలు తెలిపే “పెళ్ళి” కథ.
ఈ కథల్లో కొన్ని సంగతులు పుస్తక ప్రియులకు యధాతధంగా …
‘ అరటిపువ్వు సాములోరు ‘
సాములోరు గుట్టలోంచి ఒక అరటిపువ్వు తీసి భక్తుడికి ఇచ్చారు. భక్తుడు బాంబు అందుకున్నంత భయంగా వణుకుతున్న చేతులతో అందుకున్నాడు.
“దీన్ని ఒలవరా, వత్సా!” అన్నారు మందహాసంతో.
భక్తుడు గజగజ వణుకుతూ అరటిపువ్వు డొప్ప ఒలిచాడు. ఆపమన్నట్టు సైగ చేసి, భక్తజనాన్ని తాపీగా ఒకసారి వీక్షించి, “చూశారా, ఇవన్నీ కర్మ శేషాన్ని పూర్తిచేయక అడుగున పడి ఉన్న పూతలు. ఈ పైన కప్పుకున్న రేకు ఉన్నదే, అదే మాయ! ముందు దాన్ని తొలిగించుకోవాలి. తదుపరి అత్తంగా పెనవేసుకున్న పూతని విడగొట్టాలి. అవే భవబంధాలు! చూశారా, ప్రతి పూతలో దొంగ, బూచాడు అనే రెండు చేదు విషయాలుంటాయి. అవే రాగద్వేషాలు, వాటిని త్యజించవలె!” భక్తుడితో వాఖ్యానుసారంగా తంతు నడిపిస్తున్నారు. భక్తులు ఉత్కంఠతో గమనిస్తున్నారు.
సాములోరు అందుకున్నారు. ” ఇప్పుడు చెప్పేది సావధానచిత్తులై వినండి!”
“ముందుగా నానబెట్టిన శెనగపప్పు, అనగా అది పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవక్షరాన్ని పట్టినంత మమ_కారాన్ని వేసి మొత్తాన్ని మధించి ముద్ద చేయండి. అగ్నిదేవుని ఆవాహన చేసి మనసనే బాణలిలో మానవత్వమనే నూనె పోయండి. ఆ ముద్దని చిట్టిగారెలుగా రెండు చేతులా తట్టండి, తట్టేవేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి! భక్తులారా! తట్టినకొద్దీ తరిస్తారు. పరిపక్వమయ్యాక అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించి, ఆహారమయకోశం నింపండి!”
అరటి పువ్వు వడలు తిని అంతా ‘ ఓం ‘ అని తృప్తిగా తేంచారు.
పూజా సభ పరిసమాప్తి అయ్యింది. భక్తులు సాములారి జ్ఞానానికి ముగ్ధులై లొట్టలు వేసుకుంటూ బయలుదేరారు.
గుమ్మం దాటాక ‘ మద్యవైస్కు ‘ డన్నాడు _ ” భక్తీ ముక్తీ ఏమోగానీ, సాములారి పుణ్యమా అని నాలో జ్ఞానదీపం వెలిగింది. అరటిపూవు రెక్కల్లో ఓ క్వార్టరు చుట్టుకుని పబ్లిగ్గా అబిడ్స్ లోంచి వెళ్ళినా అడిగేవాడుండడు – సేఫ్టీ అండ్ డిగ్నిటీ!
‘ ధనలక్ష్మి ‘
ఊరి మొగలో ఉన్న ఆరెకరాల స్థలం బేరానికి వచ్చింది. ధనమ్మ కొనాలని ప్రస్తావించింది. “వాళ్ళ పిల్ల పెళ్ళి కుదిరిందట … అవసరానికి అమ్ముతున్నారు … లక్ష చెపుతున్నారు గాని, నాలుగైదు వేలు తక్కువకే ఖరారు చేసుకోవచ్చు … తీసుకుంటే బావుంటది గందా …” అంది.
రామాంజనేలు రెచ్చిపోయాడు. ” … నీకేం పొయ్యేకాలం … అది తాడి లోతు గుంట. .. ఏం చేసుకుంటాం …”
“పల్లం కాబట్టే అంత మంచి చోట ఆ ధరకి ఇస్తామన్నారు _ నే చెప్పేది సవిత్రంగా విను”, “నేను వినను, ఆ చెరువు పూడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి … నిన్ను నిలబెట్టి సమాధి చెయ్యడానికి పనికొస్తది …” అంటూ కొట్టిపారేశాడు.
మళ్ళీ మళ్ళీ నచ్చ చెప్పింది. మా అందరి చేతా చెప్పించింది. రామాంజనేలు కాస్త మెత్తబడ్డాడు. అయినా డెబ్భై వేలకి మించి ధర పెట్టే ప్రసక్తి లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి డెబ్భై రెండు వేల రెండొందల యాభైకి రామాంజనేయులు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేర బదిలీ అయింది. మంచి చోటు చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేలు ఆనందపడ్డాడు.
మీ రామాంజనేలు నివురుకప్పిన నిప్పు _ పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే … మా మగపురుషుడు మంకుపట్టుతో కూర్చోబట్టి ఆ ధరకి నిక్షేపంలాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం … నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు. దానివల్ల పాతిక వేలు లాభించింది …” ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగలా హాయిగా రామంజనేలుని ఆవరించాయి. ఆ రోజు అమ్మకాల తాలూకు డబ్బు లెక్కపెట్టుకుంటూనే ధనమ్మ మాటలు ఓరకంట విని ఆనందపడ్డాడు. ముచ్చటపడ్డాడు. మురిసిపోయాడు. రామాంజనేలు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి.
చెరువు చెరువుగానే ఉంచి సిమెంట్ స్థంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గోడౌన్ అయింది. ఎరువుల లారీలు సరాసరి గొడౌన్ లోకి వెళ్ళిపోతాయి. తాడిలోతు గుంటని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న రామంజనేలుని మెచ్చుకోని వాళ్ళు లేరు.
“ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు … దిష్టి తగుల్తుందో ఏం పాడో …’ అని రామాంజనేలుకి నిమ్మకాయ దిగదుడిచింది ధనమ్మ.
‘షోడానాయుడు ‘
“బావున్నావా _ వ్యాపారం బావుందా …” అడిగాను చాలా చనువుగా.
నాయుడు గంభీరంగా నల్ల కళ్ళద్దాలు తీసి, కుర్చీలో స్థిమితంగా కూచుని “పర్లేదండి. ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశానండీ. పక్క ఊరేనండీ _ సెకండాండు బాడీ మూడు కాయలది మిసను జర్మన్‌ది … బాగా కంకణంలా ఉందండీ _ మిగతా బల్లా గిల్లా ఇక్కడే మోపు చేసి వాళ్ళకి ఇచ్చానండి. అమ్మాయికి బుడ్లు పట్టడం వొచ్చండి … అల్లుడు ఊరి మీద గ్రోసు బుడ్లు కొడతాడండీ _ ఇంటికాడ బేరం నాలుగు డజన్లు ఉంటాదండి … ఏదో ఆళ్ళ బతుకు ఆళ్ళు బతుకుతున్నారు. మనకేం వెర్రీ లేదండి …”
‘ బంగారు మురుగు ‘
“అరిశెల్ని, అప్పాల్ని వదల్లేని వాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు” స్వాములోరి మీద బామ్మ విసురు. “మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యటం … పక్షికి గుప్పెడు గింజల్ని చల్లటం, పశువుకి నాలుగు పరకలు వెయ్యటం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టటం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం _ ” సవాలు చేసింది బామ్మ. “పాటలు పాడి దేవుళ్లని లేపకపోతే వాళ్ళు లేవరా” అని అడిగితే, “పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేమైనా ఉందీ – ! మేలుకొలుపులూ మన కోసమే చక్రపొంగలీ మన కోసమే” అనేది బామ్మ. “నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం” బామ్మ చెప్పిన బ్రహ్మ సూత్రం.
“ఒరేవ్ అధిక మాసాలతో ఎనభై దాటేశా … నీ పెళ్లి చూడాలని ప్రాణాలు ఉగ్గపట్టుక్కూచ్చున్నా … ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్లు పండాలి. – నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి _ అది ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్ళీ మీ ఇంటికి రావద్దూ …” బామ్మ గొంతు జీరపోయింది. కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది.
పుస్తకం » Blog Archive » శ్రీరమణ గారి ‘మిథునం’ కథల సంపుటి – ఒక పరిచయం
[…] శ్రీరమణ గారి కథలపై, ప్రత్యేకం మిథునం కథపై, విష్ణుభొట్ల […]
rajasekhar
sriramana gari mithunam kathala pusthakam ennisaarlu chadivano lekkaledu
subhadra vedula
దాదాపు రెండేళ్ళక్రితమేమో ఈ పుస్తాకాన్ని హైదరాబాదు విశాలాంధ్రలో కొన్నాను. అప్పటినించీ ఇప్పటివరకూ ఇందులో కధలు ఎన్ని సార్లు చదివానో తెలీదు, అట్టలు నలిగిపొయాయి కూడా. ఏ కధ మంచిదనీ, బావున్నదనీ ఎంచాలి? బావులేదని దేనికి వంక పెట్టాలి అన్న సమస్యలే లేని పుస్తకం. ప్రతీ కధా ఇంత అని చెప్పలేని మంచిదే, మనసుని తడిమేదే.. ఆఫీసరు బాల్యాన్ని బంగారంలా దాచి నీలాల గోళీల రూపంలో తెచ్చి ఇచ్చిన సిద్ధుడు షోడా నాయుడూ, బంగారు మాటలే కాదు, బంగారు మురుగులూ మనవలకే అన్న బామ్మగారూ, పొద్దు వాలే వయసులో ఆనందంగా పొద్దు పుచ్చుకోవడమే కాక, ప్రతి పొద్దూ నిత్యనూతనంగా మెలిగే ఆదిదంపతులూ.. ఇలా రాసుకుంటూ పోతే ఈ కధలగురించే ఒక పుస్తకం రాసేయవచ్చేమో…. అందరూ తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకం. ఇది మాత్రం నిజంగా నిజం…
రామ
‘బంగారు మురుగు’ లో బామ్మ పాత్ర ఉదాత్త చిత్రణకి నాకు ఎన్ని సార్లు చదివినా కంటిలో నీరు తిరుగుతుంది.
kalpana
లక్ష్మన్న గారు, శ్రీ రమణ కథల గురించి మీ పరిచయం బావుంది. మీ పాత పుస్తకాలు కనిపించాయి అని చెప్పారు కదా ఇక ఈ సారి మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు తెచ్చుకోవచ్చు అన్న మాట.
చౌదరి జంపాల
మిథునం కథాసంకలనం ఇప్పటివరకూ ఆరు ముద్రణలు (2000, 2001, 2003, 2005, 2006, 2008లలో – మొత్తం 10,000 కాపీలు) పొందింది. ఆఖరు ముద్రణ కాపీలు ఇంకా కొద్దిగా మాత్రం ఉన్నాయని ప్రకాశకులు శ్రీ “నవోదయ” రామమోహనరావు (vjw_booklink@yahoo.co.in) చెప్తున్నారు.
చౌదరి జంపాల
@Ratna:
మిథునం కథ మొదట 1997 నవంబర్ డిశంబర్లలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమయ్యింది. 1999lO రచన మాసపత్రిక బాపుగారి చేతివ్రాతలో ఈ కథను రెండుసార్లు ప్రచురించింది. శ్రీరమణగారి మిగతా కథలన్నిటితో కలిపి పుస్తకంగా నవోదయా పబ్లిషర్స్ (విజయవాడ) 2000లో ప్రచురించారు. ఆ తరువాత చాలా ముద్రణలు పొందింది ఈ పుస్తకం.
చౌదరి జంపాల
@రవి: నాకు తెలిసినంతవరకు ఈ పుస్తకం మొదటినుంచీ బాపుగారు వేసిన ఈ మిథునం ముఖచిత్రంతోనే ప్రచురించబడింది. చాలా ముద్రణలు కూడా పొందింది. ఈ సంవత్సరం సంగతి నాకు తెలీదు కాని క్రిందటి జనవరిలోకూడా పుస్తకాలషాపుల్లో ఈ పుస్తకం దొరికిందనే గుర్తు.
రవి
ఇందులో నాకు నచ్చిన కథ “తేనెలో చీమ”. ఆంధ్రప్రభలో ఈ కథ ప్రచురించబడినప్పుడే చదివాను ఈ కథను.
ఈ పుస్తకం ఇదివరకు అరటిపువ్వు సాములారి ముఖచిత్రంతో ముద్రించినట్లు గుర్తు. అప్పుడు నా వద్ద ఆ పుస్తకం ఉండేది. ఎవరో తీసుకుని తిరిగివ్వలేదు. కొత్త ముద్రణ కోసం ఎనిమిదేళ్ళుగా చూస్తున్నాను.
ధన్యవాదాలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
నాకూ శ్రీరమణ గారితో వ్యక్తిగత పరిచయం ఉంది. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వార్షిక కార్యక్రమాల ద్వారా శ్రీరమణ గారు పరిచయం అయ్యారు.
ఇక్కడ పరిచయం చెయ్యబడ్డ పుస్తకం ఇంకా అమ్మకానికి దొరుకుతోందే లేదో తెలియదు. ఒక వేళ కాపీలు అమ్మకానికి దొరక్కపోతే పునర్ముద్రణకు నోచుకోతగిన పుస్తకం ఇది.
విష్ణుభొట్ల లక్ష్మన్న
chitralekha45
బాగున్నాయండి రమణ గారి కథలు బాగా పరిచయము చేసారు
Ratna
లక్ష్మన్న గారు,
మీ సమీక్ష, ఎక్కడో మరుగున పడిపోయిన జ్ఞాపకాలని తట్టి లేపింది.. నేను రమణ గారి అభిమానిని.. అందులో అయన రాసిన మిధునం అంటే.. .. ఇంకా చెప్పలేను.. భార్య , భర్త అంటే అలాగే వుండాలి, వునటారు కామోసు అనిపించింది మొదటిసారి చదివినప్పుడు.. అప్పుడు నేను degree లో వున్నాను; అంటే 15 సంవత్సరాల క్రితం. తరువాత.. మళ్ళి, 2004 లో మళ్ళి చదివాను.. కాని పుస్తకం ఎక్కడో miss అయ్యింది.. కాని కదా మాత్రం చెరిగిపోలేదు .. మనసులో నుంచి… చాల చోట్ల వెదికాను.. Hyderabad లో వున్నన్నాళ్ళు ,book fair లో ప్రయత్నించాను.. కాని దొరకలేదు..
మీకు తెలిస్తే.. కొంచెం చెప్పండి… ఎక్కడ.. దొరుకుతాయో ఆ పుస్తకం లేదా.. అయన మొత్తం కధల సంకలనం..
మీరు పరిచయం చేసిన విధానం బావుంది..
ధన్యవాదములు..
రత్న
సుజాత
ఈ సంకలనంలో ని కథల్లో ఏ కథ చదివినా “ఇది బెస్ట్ కథ” అనిపించకపోతే ఆశ్చర్యం లేదు. ధనలక్ష్మి, వరహాల బావి, బంగారు మురుగు దేనికదే అమోఘమైన రుచి తో ఉంటాయి. మళ్ళీ అన్నింటికన్నా మిథునం బెస్ట్ అనిపిస్తుంది చివర్లో! ఈ కథలన్నో ఒక పెద్ద మాయాజాలం. అనుబంధాలతోనూ, ఆప్యాయతల్తోనూ చిక్కగా పేరుకున్న తేనె ఊబి. అందులో చిక్కుకుంటే సుఖంగా ఉంటుంది, కానీ బయటికి రాలేం!
శ్రీరమణ గారి కథలన్నీ ఇంతే! అప్పుడెప్పుడో ఆయన రాసిన “ప్రేమ పల్లకీ” నవల కూడా అంతే!
మళ్ళీ ఆ వూబిలోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేసినందుకు లక్ష్మన్న గారికి ధన్యవాదాలు!
పంతుల జోగారావు
శ్రీ రమణ గారి మిథునం, యితర కథలని చక్కగా పరిచయం చేసారు. రమణ గారితో నాకు వ్యక్తిగత పరిచయం కూడ కొంత ఉంది. రమణ గారి కథలు నిత్య హరితాలు. మిథునం ఒక తీయనైన గొప్ప కథ అనడంలో సందేహం లేదు.