కథ సిరీస్ – ఒక ప్రశ్న

వ్యాసం రాసినవారు: బుడుగోయ్

బహుశా తొంభై ఎనిమిదిలోనో, తొంభైతొమ్మిదిలోనో నాకు కథ సిరీస్‌తో ప్రథమ పరిచయం. సంవత్సరంలో ప్రచురించిన కథల్లో ఆణిముత్యాల్లాంటి కథలన్నీ ఒక దగ్గరకు చేర్చి ప్రచురించే ప్రయత్నమే కథ సిరీస్. కథ-98 చదివి మహా సంతోష పడ్డాను. కథ-99 సంతోషం కాస్త తగ్గింది. కథ-2000 మెల్లగా కథ సిరీస్‌లో కథలు ఫార్ములాయిక్‌గా అనిపించసాగాయి. కథ-02 తర్వాత ఐదేళ్ళు కొనొద్దనుకుంటూనే కొంటున్నాను. చెత్త టీవీ సీరియళ్ళకు అలవాటు పడ్డ సగటు ప్రేక్షకుడిలా.
బుక్ ఫెస్టివల్లో కథ-08 చూడగానే కొనాలా వద్దా అని మళ్ళీ సందేహంలో పడ్డాను. కాఫీలకు ఎనభై రూపాయలు, సినిమాలకు వందరూపాయలు తగలేసే రోజుల్లో పుస్తకానికి నలభయ్యైదు రూపాయలు పెట్టలేమా అని కొన్నాను. చదివానా? మళ్ళీ ఎందుకు కొన్నానురా బాబూ అనుకోవడమే. కథ సిరీస్ చదవడమంటే ఒక చిన్నపాటి డిప్రెషన్‌లోకి వెళ్ళేందుకు మార్గాన్ని వెతుక్కోవడం.  ఈ పని ఒత్తిడి, డబ్బు సంపాదనకు మార్గాలు/వెతుకులాటలు, కాలుష్యం కనీవినీ ఎరుగని స్థాయిలకు చేరుకుని మన జీవితాలు ఈరోజుల్లో కాంప్లికేటెడ్‌గా తయారయ్యేయి నిజమే. కానీ మన జీవితాల్లో ఏడుపు/నిరాశ తప్ప వేరే రసం లేదా? నానా బాధల్ని ఒక్కచోటికి తెచ్చి ఎందుకిలా ఎగ్జెంప్లిఫై చెయ్యడం?  మన మూస సినిమాల్లో హీరోకు రెండే పనులు హీరొయిన్ను లవ్వాడ్డం, విలన్ను చితకబాదడం. ప్రేమ రసం, వీర రసం తప్పితే మిగిలిన రసాలు తెలీవు వాళ్ళకి. ఈ కథా సిరీస్‌లతో అలాంటి మూసనే తయారు చేస్తున్నారు సంపాదక గణం.
మూసలకే మూస మహామూస ఐన హిందీ చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ మధ్య ప్రేమకథలు వీడి కొత్త పుంథలు తొక్కుతుంటే కథాసిరీస్ ఎందుకు ఇలా నిరాశా/బాధలకు ఎందుకు పట్టంగడుతున్నది? ప్రచురణకర్తలు ఆలోచించవలసిన ప్రశ్న. తెలుగులో జీవితంలో బాధను తోడుకొని తాగడమొక్కటే మంచికథకు మార్గమా? slice of life కథలూ, coming of age కథలకు స్థానం లేదా? మొన్నీ మధ్య సోమరాజు సుశీల గారి సంకలనం చదివాను. దాంట్లో ఒక్క కథకి కూడా ఈ సంకలనాల్లో స్థానం దక్కలేదా? ఏం? “మరచెంబులో మందారం”లో, “నేను చూసిన చిట్టి తల్లి”లో జీవిత చిత్రణ లేదా? మిథునం పుస్తకంలో ఒక్క బంగారు మురుగుకే దక్కిందేమిటి? అలాగే ఖదీర్ దర్గమిట్టకథల్లో ఒక్క కథకూ వీటిలో ఉండే అర్హత లేదా? స.వెం.రమేశ్ ప్రళయ కావేరి కథల్లో, వంశీ ఆనాటి వాన చినుకుల్లో కనీసం ఒక్క కథ కూడా ఈ సంకలనంలో వేసుకునే స్థాయి లేదా?
ఈ సంకలనంలోని పధ్నాలుగు కథల్లో పన్నెండు కథలగురించి సంపాదకులే రాసిన ఏక వాక్య సారాంశం ఇక్కడ ఇస్తున్నాను నేను ఎందుకింత విమర్శిస్తున్నానో మీకే తెలుస్తుంది. (ఇందులో ఒకటో నంబరు కథ హాస్య ప్రధానంగానూ, ఎనిమిదో నంబరు కథ మాజిక్ రియలిజం ప్రక్రియ తోనూ సాగింది. వాటిని మినహాయిస్తున్నాను)
2) అభివృద్ధి నీడన చితికిపోతున్న వ్యధాభరిత హృదయాలను ఆవిష్కరించిన కథ “ఊరు గోదారి”
3) ఒక వ్యక్తి మానసిక, తాత్త్విక సంఘర్షణలను సామాజిక నేపథ్యం నుంచి చిత్రీకరించిన కథ “అసందిగ్ధ కర్తవ్యం”
4)ఉన్నస్థితిని యథాతథంగా సంభాషణలతో చిత్రిస్తూ మనవ మేధస్సుకు, హృదయానికి ఉన్న సంఘర్షణను తాత్త్విక దృక్పథంతో చిత్రించినకథ “నమ్మకం”
5) శిథిలమవుతున్న గ్రామీణ జీవితంలోని వృత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులను చిత్రించిన కథ “కొలిమి”
6) పోయిన్ మనిషికోసం జానెడు జాగ మిగల్చని అభివృద్ధి వెలుగునీడల మాయమర్మం కథ “మాయ”
7) మారుమూల అడవుల్లో బతుకుతున్న వారి దగ్గరినుంచి పట్టణాల్లో బతికే సామాన్యుల వరకు అందర్నీ చుట్టేస్తున్న రూపాయి మహత్యానికున్న వివిధ కోణాలను చర్చించిన కథ “రూపాయి చొక్కా”
9) నాగరికథ పెరుగుతున్న కొద్దీ పురస్మృతులు మరింతగా వెన్నాడుతున్నాయి. నాగరికథ నీడన మసిబారిపోయిన “పందెపు తోట” కథ ఇది.
10)భార్యాభర్తల సంబంధంలో మగవాడి వికృత స్వభావాన్ని ఆక్రోషంతో చెప్పిన కథ “సెగలోగిలి”
11) నాగరికథ పురోభివృద్ధిలో మనిషి ప్రకృతినుంచి వేరు చేయబడుతున్న వైనాన్ని సైన్స్ ఫిక్షన్‌గా చెప్పిన్ కథ UFO.
12) కార్పొరేట్ జీవన సమ్మర్ధంలో ఆర్ద్రత ఆవిరైపోతున్న కాలంలో ఖండఖండాలుగా క్రమపద్ధతిలో వర్ణించబడిన కథ “క్రానికల్స్ ఆఫ్ లవ్”
13) ఆధునిక అగ్రహారాల్లాంటి “గేటెడ్ కమ్యూనిటీ”ల్లో మనుషుల మానసికవేదనని చిత్రించిన కథ “అగ్రహారం”
14) అగ్రవర్ణీకరణ చెందడానికి తాపత్రయపడి తన తప్పును తెలుసుకొన్న దళిత యువతి కథ “తప్పిపోయిన కుమార్తె”
ఇలాంటి కథలను తెలుగు కథకు ప్రాతినిధ్యం వహించే కథగా సంపాదకులు భావిస్తున్నారేమో గానీ పాఠకులు మాత్రం ససేమీరా ఒప్పుకోలేరు. కాదూ కూడదూ అంటే “ఏడుపు గొట్టు కథ” అని పాఠకులే పేరు మార్చే ప్రమాదముంది. ఏదేమైనా నేను మాత్రం కథా సిరీస్‌ను కొనుక్కోవడం ఇదే చివరిసారి.

You Might Also Like

11 Comments

  1. కొత్తపాళీ

    బుడుగోయ్ గారు చేసిన విమర్శలు కొత్త కాదు. సాధారణ పాఠకుల దగ్గర్నించి సాహిత్య విమర్శకులం అనుకునే పెద్దతలకాయల దాకా చాలా మందే చేశారు ఈ విమర్శలు. వీటి సారాంశం ఇలా క్రోడీకరించుకోవచ్చు –
    అ. కథలన్నీ కష్టాలూ కన్నీళ్ళతో నిండి ఉంటాయి.
    ఆ. కొందరు రచయితలు రాసే కథలు మాత్రమే వేసుకుంటున్నారు. లేదా ఒక ఫలాని రచయిత ఎంత చెత్త కథ రాసినా ఇందులో అచ్చై పోతుంది. మరో ఫలాని రచయిత ఎంత గొప్ప కథ రాసినా ఇందులో అచ్చుకాదు.
    ఇ. కొన్ని కొన్ని పత్రికల్ని మాత్రమే చూస్తారీ సంపాదకులు.
    ఈ. ఒక మోస్తరు భావజాలానికి సంబంధించిన కథల్ని మాత్రమే వేసుకుంటారు.
    ఇత్యాది.
    అలాగని బుడుగోయ్ గారు చేసిన ప్రస్తుత ఫిర్యాదునీ పూర్తిగా తోసిపుచ్చలేము. 2005, 2006 ల సంకలనాలు, కనీసం నా దృష్టిలో, చక్కటి వైవిధ్యం కలిగి, అలరించాయి. కానీ ఈ రెండేళ్ళ సంకలనాలూ మళ్ళీ పుస్తకం ముట్టుకోవాలంటే భయపడేట్టే ఉన్నాయి. సంపాదకులకున్న పరిమితులు గట్రా ఉన్నాయి సరే. కానీ కథాసాహిత్య వినియోగదారులుగా, పుస్తకాన్ని “కొని” చదివే వారిగా, మా బాధ కూడా చెప్పుకోగలగాలిగా? ఇంతమాత్రానికి రాజరాజనరేంద్రులూ, సారంగధరులూ అంత గింజుకొవాల్సిన పన్లేదు. గింజుకున్నా నేను చేసేదీ ఏవీ లేదనుకోండి. అది వారి ప్రిరాగెటివ్. అవునూ, ఈ సంకలనాన్ని మా డీటీయెల్సీ వాళ్ళు ఆల్రెడీ నరికి పోగులు పెట్టినట్టు గుర్తు. అంతర్జాలంలో ఎక్కడో ఆ చర్చా నివేదిక ఉండే ఉంటుంది.

  2. మెహెర్

    For what is the state of affairs:

    ఖర్చుపెట్టి పుస్తకం కొన్న పాఠకుడు తన నిరాశని వ్యక్తపరచుకున్నాడు.

    ఒకరేమో, మీరే కథలు ఎంపిక చేసి పుస్తకాలు వేసుకొమ్మని సూచిస్తున్నారు.

    ఇంకొకరు, ఇవి నచ్చే పాఠకులూ వుండవచ్చు (కాబట్టి మీకు నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని పబ్లిగ్గా వ్యక్తం చేసుకోకూడదు, వ్యక్తం చేసి మనోభావాలు దెబ్బతీయకూడదు), అని ఎదురొస్తున్నారు.

    మరొకరు, తమకు నచ్చిన కథల జాబితా ఇక్కడ పెట్టి, అవి అందరికీ ఎందుకునచ్చలేదో అని తిరుగుళ్ళు పడిపోతున్నారు.

    Damn generalizations! Allways funny!

  3. Venkat

    ఇందులో కామెంట్లు రాసినవాళ్ళెవరూ ఆ కథలు చదవలేదని తెలిసిపోతుంది. దయచేసి కథలు చదివి కామెంట్లు రాయండి. కథ 2008లో ఏడుపుగొట్టు కథలేమీ లేవు. నేనైతే మురళి దాదాహయాత్ – ఊదే పాపడు, అల్లం శేషగిరిరావు – చీకటి, పెద్దింటి అశోక్ కుమార్ – మాయిముంత, వివిన మూర్తి – వాల్ పేపర్, అక్కిరాజు – గేటెడ్ కమ్యూనిటి, భగవంతం – అతడు నేను లోయ చివరి రహస్యం వంటి కథలు ఈ సంకలనాల వల్లనే చదవగలిగాను.

    ఇక గతంలో వచ్చిన ఏడుపుగొట్టు కథల గురించి ఆ కథలు ఎవరివో, ఎవరిగురించి రాసారో కాస్త వివరించి రాస్తే బాగుండును. జనరలైజ్ చేసి రాస్తే చదివేవారికి ఎలా అర్థమవుతుంది?

    కామెంట్లు రాసినంత తేలిగ్గా ఏడుపుగొట్టు సమీక్షలు రాసిపడేస్తున్నారు. తమ మిథునం, పసుపుకొమ్ము, తులసిచెట్టు, తెగిపడిన జంధ్యం వంటి కథలు రాలేదని బాధపడుతున్నారు. ఇది బాధ్యతా రాహిత్యం కాదా..

  4. budugoy

    “రెడ్డి గారి ఉవాచ : కథా సిరీస్ అంటే మనందరికీ గౌరవం. ఆ సిరీస్ సంపాదకుల పనితీరు మరింత బాగవ్వాలనే కోరిక మనలో ఉంది.”
    Thank you Sir. could nt have said it better.

    ఇక సారంగధరులకు లాస్ట్ అండ్ ఫైనల్గా మరొక్కసారి:

    అయ్యా మీ బాధేమిటో నాకింకా అర్థం కావట్లేదు. సపోజ్ నా పేరు సత్తిరాజు L నారాయణ అనుకోండి. would it change your opinion? మీకు ఎవరు రాశారు ముఖ్యమా? ఏమి రాశారు ముఖ్యమా?
    మొదట కులం/ప్రాంత వర్గం అని ఏదో అంటగట్టారు. అది వీగిపోయాక ఇప్పుడు మారుపేరు వెనకాల రాళ్ళేస్తున్నారంటున్నారు. ఈ పుస్తకాన్ని విమర్శించేందుకు ప్రత్యేకించి మారుపేరుతో రాయాల్సిన అవసరం నాకు లేదు. ఇదేం నా మొదటి సమీక్ష/పరిచయం కాదు, చివరిదీ కాదు. కుదిరితే నా బ్లాగు చదువుకోండి. ఇది మీ నాలుగోపాయింటుకు సమాధానం. ఇక మిగిలినవి..

    1) కథా సంకలనాలగురించి ప్రశ్నవేశాను. i am questioning the mood of the book. not the quality of the stories. What is this fixation with “glass is half empty” kind of stories?
    2) అలాగే నేను ఆరోపించలేదు. దాదాపు కథా సిరీస్ వచ్చిన సమయంలోనే వచ్చీ, నేటికి జనాలు మెచ్చుకుంటున్న కథలు (మళ్ళీ పాపులారిటీ మంచికథకు అర్హతా? అని మొదలెట్టకండి. నేను చెప్పినవి విమర్శకులు+పాఠకులు మెచ్చుకున్నవి) ఉదహరించాను.
    3) సంపాదకుల మీద అక్కసు వెళ్ళగక్కడం???? what the hey? రెడ్డిగారి ఉవాచ మళ్ళీ చదవండి.

    సరే నన్ను మారుపేరుతో రాళ్ళేస్తున్నానంటున్నారు? మీ సంగతేమిటి? వద్దులెండి. మీకు మరో సమాధానమిచ్చే ఓపిక లేదు.

    సెలవు.

  5. Purnima

    నాకో విషయం తెలియక అడుగుతున్నా, ఒక వేళ ఈ వ్యాసంలో కథ సీరీస్ ని ఆకాశానికి ఎత్తేసేంతగా పొగిడుంటే అప్పుడు కూడా ఎవరైనా “మాకు నచ్చినవి పెట్టుకున్నాం. మీకు నచ్చినా నచ్చకున్నా మాకు సంబంధం లేదు” అనేవారా? సినిమా బాలేదు అంటే “పోయి నువ్వే తీసుకోరాదూ!” అనటం, పుస్తకం బాలేదంటే “నువ్వే రాసుకో ఒకటి!” అనటం ఎంత వరకూ సమంజసం? ప్రేక్షకులూ, పాఠకులూ కొంత డబ్బు పెట్టి సినిమానో, పుస్తకమో కొనే వరకేనా అవసరం?

    సారంగధార గారు: మీరు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు బాగున్నాయి.

    “కథ సిరీస్ సంపాదకులకి ఉన్న పరిమితి ఎవరికీ అర్థం కాదా..? వాళ్ళు చేస్తున్న తప్పు ఒకటె- ఉత్తమ కథలకు ప్రతినిధ్యం వహించే కథలుగా వాటిని తమ సమీక్షలలొ చెప్తున్నారు. పత్రికలన్ని చదివి సంవత్సరానికి ఇరవై ముప్పై కథలని ఒకే సంకలనంలో తీసుకురావడం ఎవరి తరం. దానికి ఉన్న ఆర్థిక పరిమితులు ఎంత?”

    వీటికి జవాబులు ఎలా సంపాదించుకోవాలి? ఒక కథ సంకలనం తీసుకురావటంలో ఉన్న సాధకబాధకాలు అందరికీ తెలియాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మనకున్న అవరోధాలు ఏంటి? వాటిని మనం ఎలా పరిష్కరించుకుంటాం? – అన్నవి కదా మనకి ముఖ్యం?! ముసుగేసుకొన్నా, వేసుకోకున్నా విమర్శ చేసినవారిని వదిలేసి, విమర్శలో పస ఎంతో కదా మనం ఆలోచించుకోవాల్సింది. విమర్శలో పస లేదనుకున్నప్పుడు మనం దాని గురించి ఎందుకు పట్టించుకోవడం?

    నేను కథా సీరీస్ చదవలేదు కానీ, ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా కథలు నన్ను చాలా విధాలుగా నిరాశపరుస్తున్నాయి. ముఖ్యంగా బుడుగు గారి ఈ అభిప్రాయానికి నేను వంద శాతం మద్దతిస్తాను:

    “ఈ పని ఒత్తిడి, డబ్బు సంపాదనకు మార్గాలు/వెతుకులాటలు, కాలుష్యం కనీవినీ ఎరుగని స్థాయిలకు చేరుకుని మన జీవితాలు ఈరోజుల్లో కాంప్లికేటెడ్‌గా తయారయ్యేయి నిజమే. కానీ మన జీవితాల్లో ఏడుపు/నిరాశ తప్ప వేరే రసం లేదా? నానా బాధల్ని ఒక్కచోటికి తెచ్చి ఎందుకిలా ఎగ్జెంప్లిఫై చెయ్యడం?”

    “నేను కథ చదివా, అది నాకు నచ్చలేదు” అని నా అభిప్రాయాన్ని వెల్లడి చేయడానికి నాకు కథల మీద పి.హెచ్.డి అవసరం లేదు. నా అభిప్రాయాన్ని ఎంత వరకూ రచయితనీ, సంపాదకులనీ గాయపరుస్తుందన్నది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కాదనగలరా? 🙂

  6. sarangadhara

    నల్గొండరెడ్డి గారికి – మీరు రాసింది కాస్త బాగుంది. ఏయేటికాయేడు అన్ని కథల మీద చర్చ జరగవల్సిందే. కేవలం ఒక్క కథాసాహితే కాక పత్రికలలో వచ్చిన అన్ని కథల మీద చర్చ జరిగితే బావుంటుంది. సంకలనాల సంపాదకులకు మంచి కథలను సూచించినట్లుకూడా అవుతుంది. కాని మీరన్నట్లు అన్ని ఏడుపుగొట్టు కథలే లేవు. మచ్చుకి – నమ్మకం, అసందిగ్ధ కర్తవ్యం, రామల్లి, తప్పిపోయిన కుమార్తె వంటి మంచి కథలు అందులో లేకపోలేదు. అవన్ని ఏడుపుగొట్టు కథలంటే మీరు వాటిని చదవలేదనే అనుకోవాలి. మీరు కూడా కథాభిమాని అని పూర్తి పేరు రాయడం సబబుగా లేదు.

    బుడుగోయ్ విమర్శ ఇలా ఉంది.

    1. కథల మీద చర్చ సూటిగా లేకపోవడం
    2. గతంలో కొన్ని కథలు రాలేదన్న ఆరోపణ.
    3. కథల మీదకన్నా సంపాదకులమీద అక్కసు వెళ్ళగక్కడం
    4. మారు పేరు చాటున దాక్కుని రాళ్ళు విసరడం.

    కథ మీద మంచి సహేతుకమైన విమర్శ రావడానికి ఇది మంచి పద్దతి కాదు. బహుశా మీరూ నాతో ఏకీభవిస్తారేమో.

  7. nalgondareddy

    dear friend…

    chala rojulaka manchi charcha levadeesaaru.

    idi atyavasara charcha.

    katha series ante manandariki gauravam. aa series sampadakula paniteeru marinta baaga vundalane korika manalo vundi. ala baga cheyamani demand chese hakku kooda manaku vundi.

    katha 2008 nenu kooda chadivanu. telugu samajam inta yedupugottuga vunda ane sandeham vachindi. prati katha oka krutrima kalpana.

    innni kashtalu raaste tappa adi serious katha kaabodemo anna sandeham rachayitalaku vunnattundi.

    ilanti kathalu veyaka pothe adi serious katha sankalanam kaabodemo anna durabhiprayam katha sampadakulaku vunnatundi.

    ee dhorani maaraaali.

    ayithe- indulo rachayitaladi yekkuva vaata. budugu gaaru cheppinattu oka slice of lifenu pattukovadam vaariki raavadam leda? alanti kathalu kooda avasaram ani vaallaku yevaroo cheppadam leda?

    sampadaku alanti kathalanu kooda manchi kathaluga gurtincha galigithe appudu ilanti kathalu vache vatavaranam vuntundi.

    katha series vaaru mokkubadiga pani chestunnarani andariki anumanam vachesindi. aa anumanam sthira padithe katha series vuniki prasnardhakam kaaka tappadu.

    -katha abhimaani, reddy

  8. sarangadhara

    అవన్నీ మంచి కథలు కానక్కర్లేదు. అందులొ కొన్ని మంచి కథలు ఉన్నాయి. ఖదీర్/గొపిని/సం.వె.రమెష్ తదితరుల మంచి కథలు కథ సెరీస్ లొ లెవా? ఊడలు లేని మర్రి (కథ 2006) ఎక్కడిది?

    కథ సిరీస్ సంపాదకులకి ఉన్న పరిమితి ఎవరికీ అర్థం కాదా..? వాళ్ళు చేస్తున్న తప్పు ఒకటె- ఉత్తమ కథలకు ప్రతినిధ్యం వహించే కథలుగా వాటిని తమ సమీక్షలలొ చెప్తున్నారు. పత్రికలన్ని చదివి సంవత్సరానికి ఇరవై ముప్పై కథలని ఒకే సంకలనంలో తీసుకురావడం ఎవరి తరం. దానికి ఉన్న ఆర్థిక పరిమితులు ఎంత?

    అయ్యా.. పాథకులంతా ఒకేలా లేరు. మీరొక రకం పాఠకులు అంతే.. పాథకులంతా ఒకటే అని పప్పులొ కాలెయ్యకండి.మీకు నచ్చలేదని అందరికీ నచ్చకుండా ఉండదు. కొందరికి నచ్చనివి మీకు అసలు నచ్చకపోవచ్చు. మారుపేర్లతో విమర్శనా (కథన)రంగంలో దూకేవాళ్ళ నిజాయితీని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇదీ మన సాహిత్యానికి పట్టిన దుర్గతి.ఒక రకం విమర్శకుడు పాఠకులందరి తరపునా వకాల్తా పుచ్చుకోవడం ఎంతవరకు సబబు?

  9. budugoy

    సారంగధరా, ఫస్ట్ తింగ్స్ ఫస్ట్.
    ఇందులో కుల/వర్గ/ప్రాంత/లింగ ప్రసక్తి లేదు. గట్టిగా అడిగితే నేను లేరని ఉదహరించిన నలుగురైదుగురు రచయితలు ఏ కుల/వర్గం వారో కూడా నాకు తెలియదు. ఎవరిమీదో రాళ్ళేసి ఏదో సాధించాలన్న దురుద్దేశాలూ లేవూ. లేనివి అంటగట్టకట్టి చర్చను పక్కదారి పట్టించకు. ఇది పాఠకులతరపునుండి ఒక ప్రశ్న.

    fyi ప్రతి కథ-xx పుస్తకంలో కథ-90 నుండి కథ-xx వరకు వచ్చిన కథల లిస్టు ఇస్తారు. ప్రళయకావేరి/దర్గమిట్ట/దీపశిఖ కథలు వచ్చిన సంవత్సరం ఆ కథలు సిరీస్ లో ఎన్నుకోబడలేదు. మంచికథలు ఎన్నుకోవాలి అన్న సత్సంకల్పం ఉన్నప్పుడు ఇవెందుకు ఇగ్నోర్ చేయబడ్డాయి? ఇవి మంచికథలు కావా?

  10. sarangadhara

    మహానుభావా.. 2008 లో ప్రళయ కావేరి కథలు / దర్గామిట్ట కథలు వచ్చాయా. మీరు 2009 లో వచ్చిన కథలను పూర్తిగా చదివారా? అందరికీ అమోదయోగ్యమైన కథలను ప్రచురించడం ఏసంపాదకులకైనా సాధ్యమా ? బెండయ్య కాపురం / ఇంగువ కథలు ఎన్నిసంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వస్తున్నాయి. వాటిని తలుచుకునే వారెవరు. చదివి మరచిపోయే కథలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి సాహిత్యంలో. ప్రతి సంవత్సరం అన్ని పత్రికలు చదివి, అన్ని వర్గాలను (ప్రాంతీయ/ కుల) సంతౄప్తి పరిచి మీరూ ఒక సంకలనం తేగూడదూ. ఇలా తీరిగ్గా కుర్చీలో కూర్చుని ఏదైనా పనిచేసే వాళ్ళమీద రాళ్ళేసే బదులు.

  11. సౌమ్య

    అని అనుకుంటూ కథ 2009 కొంటారన్నమాట అయితే 🙂

Leave a Reply