ఆకుపచ్చని తడిగీతం – కవితా సంకలనం
రచయిత – బొల్లోజు బాబా
రాసిన వారు….శ్రీనిక
—————————————————————————————————————————–
ఒక పరిచయ ప్రపంచం లోని సుపరిచిత వ్యక్తి శ్రీ బొల్లోజు బాబా ని పరిచయం చేయడమంటే….
నేలలో ఇంకి పోయిన మేఘాన్ని చెట్టు చేతుల్తో ఎత్తి ఆకాశం లో నిలబెట్టడమన్నంత సాహసమే..
పుట్టిన ఊరిపై ప్రేమని తన బ్లాగు పేరులో (సాహితీయానం) మమైకం చేసుకుని ఏప్రిల్ 27, 2008 న బ్లాగు లోకం లో తనని తాను ఆవిష్కరించుకున్నారు. తొలి ఆహ్వానాన్ని బ్లాగరు జ్యోతి గారు అందుకుని ఆశీర్వదించారు…అప్పటినుండి ఒక ప్రవాహమై సాహితీ సేద్యం లో మడమ తిప్పలేదు. కవితలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాదాలు ఇలా అనేక ప్రక్రియల కూడలిలో ఒక చిరునామా స్వంతం చేసుకున్నారు.
వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడైనా..అధ్యయనం చేసింది మాత్రం ప్రకృతిని, మానవ సమాజాన్ని అనిపిస్తుంది.
సంవత్సరకాలంగా బ్లాగుల్లో వెబ్ పత్రికలలోను, ఆంధ్రభూమి, కవిత వంటి పత్రికలలోను అచ్చయిన కవితలను ఒకేచోట చదవాలనుకునేవారికి రచయిత ఆకుపచ్చని తడిగీతం అను పుస్తకంగా తీసుకురావడం జరిగింది.
ముందు మాటలో:
ఒంటరి దీవిలో ఉన్న కవి ఒక సమూహం అంత శక్తి మంతుడు.
సమూహం లో సంచరిస్తున్నా కవి అపరిచితుడు, ఒంటరికూడా !
దీనికి కృష్ణశాస్త్రి , శ్రీశ్రీ ల సహపంక్తిలోని వాడు బాబా…లేకపోతే
అపరిచిత ప్రపంచం లో బతకటం అంటే
మబ్బుల మధ్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
వేలాడడమే !
అని వ్రాయ గలిగే వాడు కాదు….
…..శిఖామణి ( కవి, విమర్సకుడు, ఫ్రొఫెసర్,తెలుగు యూనివర్సిటీ,హైదరాబాద్ ).
*****************
“Poetry, which can not be shelled like a city
or white washed like Murals,
crushed like sculpture,
closed like theaters,
or even banned and censored
as easily as Novels and Journals
can spread and be influential
even without print or manuscript”
–MIKLOS VAJDA
మనం అపుడపుడూ తడిసి పోతూంటాం. తడిసినపుడల్లా తుడిచేసుకుంటాం. పొడిగా ఉండాలి కాబట్టి. ఎంత పొడిగా ఉండాలనుకున్నామళ్ళీ మళ్ళీ తడిసి పోతూనే ఉంటాం. అయితే ఈ తడిని వేరెవరికైనా ప్రసరింప చేస్తే… జలపాతమై,హోరుని, జోరుని సంతరించుకొని ఒక గీతంలా ధ్వనిస్తుంది,లాలిస్తుంది,ధైర్యానిస్తుంది,ఓదార్చుతుంది,గర్జిస్తుంది..
ఏదైనా చేస్తుంది. దాన్ని ఆపడం ఎవరితరం కాదు.
బాబా లోని ఈ తడిని ప్రతి గీతం లోనూ చూస్తాం.
ప్రకృతిలోకి ప్రవహించడమంటే దాని తత్వాన్ని తెలుసుకోవాలి. ప్రేమ, విరహం,సృష్టి ,విధ్వసం ఇవన్నీ అర్ధం చేసుకోవాలి.సహజంగా బాబా సౌందర్యపిపాసి. అందుకే ప్రకృతిలో తడిసి ముద్దయి ఆకుపచ్చని తడిగీతం పాడుతూ మనల్ని సీతాకోక చిలుకల్ని చేస్తాడు.
హేమంతోత్తరీయాన్ని కప్పుకున్న వనం
ఆకుల కొనల వేలాడే
మంచు బిందువుల భారాన్ని
మోయలేక అలసిపోతూన్న
వైనాన్ని వెన్నెల నావనెక్కి చూడాల్సిందే..
కాదేది కవిత కనర్హం అనుకుంటే…
సెలవుల్లో కాలేజి…మినహాయింపేమీ కాదు.
ఇందులో పదచిత్రాలు మచ్చుకి రెండు..
ఉపన్యాసాల పావురాలను
ఎగరేసే తరగతి గదులు….
తమపై వ్రాసిన ప్రేమరాతలను
చదువుకుంటూన్న చెక్కబల్లలు….
ఈ కవితలో వేడాంతగళ్ అన్న పదానికి అర్ధం ఇచ్చి ఉండాల్సింది.
నేలకి నెరళ్ళు చేసి పైకొచ్చిన అంకురాన్నే
అందరూ చూస్తారు. కానీ
తల్లి నుండి వేరయి విత్తనం మొలకెత్తడం లో పడ్డ ఘర్షణని
చూస్తాడు బాబా మట్టి కనుల నా పల్లె లో.
బ్రతుకు మీద ప్రేమ, నమ్మకం , ఇన్ని అసందర్భాల మధ్య , వైరుధ్యాల మధ్య
వికృతులమధ్య, విషాదాల మధ్య, ఓటమిలమధ్య,విజయాల మధ్య, నీకు నేనని, నాకు నువ్వని
వివాహ బంధం కట్టి పడేస్తుంది. అయినా ఎవరి ఆశలు, ఆశయాలు, పరిధులు,
అవసరాలు..అవకాశం దొరికితే… ఎవరికి వారే..
అందుకే…
శరీరాలు ఒకదానికొకటి
ఎంత వెలిగించుకుని కరిగించుకున్నా
అన్యోన్య దాంపత్యం లో కూడా
నువ్వు నువ్వే-నేను నేనే అంటాడు.
ప్రతీదీ ఎక్కడో చూసినట్లే ఉంటాయి
అన్నీ ఒకేలా ఉంటాయి
కాని బాబా వేరేలా చూపిస్తాడు.
వంచనా భీభత్స సర్వస్వం లో
మానవునికి తనకంటూ మిగిలిన
ఒకే ఒక్క ఆయుధం శరీరం
అందుకే, అది ఆత్మహత్య కాదు
అది ఒక అణు విచ్చేదనం…అంటూ
ఆత్మహత్యను సమర్ధిస్తాడు ఖాదర్ మొహియుద్దీన్
ఆత్మ హత్యాగ్రహం అన్న తన కవితలో..
( ఉదయం దినపత్రిక: 21-06-1987)
ఇలా ఆత్మహత్యని సమర్ధించిన వారెందరో ఉన్నారు.
కానీ పక్కింటబ్బాయి ఆత్మ హత్యాయత్నం లో
చచ్చినవాడు బ్రతుకుతూ,
బ్రతికున్న వారిని జీవితాంతం చంపటం లో
ఉన్న తడి మన కళ్ళని నీళ్ళ మడుగు చేస్తుంది.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారు
చేసుకోబోయేవారు తప్పక చదవాల్సిన కవిత..
కొంచెం ఇటు తిరిగి ఏడవండి అన్నప్పుడు
బ్లాగులో వచ్చిన స్పందన చూస్తే బాబా పోగొట్టుకున్న
యూజర్ నేమ్-పాస్ వర్డ్ దేవుడు రిట్రీవ్ చేసాడనిపిస్తుంది.
అందరూ పొడిగా ఉంటే కవి తడిసి పోతాడు.
తడి మాత్రం బయటకి కంపించదు.
కళాధార జీవితాల్లో ఆధునికత
అన్నివైపులనుంచీ కమ్ముకునే
శీతవేళలా వాడి (పెయింటర్) ని మింగేసింది
వాడి ఉపాధి స్వప్నం లా జారి పోయింది.
అంటూ మనందరినీ తడిపేస్తాడు.
పెయింటర్ కవితలో
మనలోకి మనమెప్పుడయినా నడుచుకుంటూ పోతే
మనకేం కనిపిస్తాయి. విజయాలు, వైఫల్యాలు,
ఆశలు,నిరాశలు, నిట్టూర్పులు. ఆత్మలోకంలో
సంచరించుకుంటూ పోతే మనలో మనం ఖాళీ అయి పోయి
మన లోపాల ముందు నగ్నంగా నిలబడతాం.
కాంక్షాతీరాల వెతుకులాటలో
తను పోగొట్టుకున్న గుప్పెడు మట్టిలో
తన అస్థిత్వ శకలాలు
ఇంకా చిక్కుకునే ఉన్నాయంటాడు.
ఓ నా ప్రియ గృహమా ! అన్న కవితలో
ఆస్పత్రిలో ఒక చావు తో ఖాళీ అయింది ఒక దేహమే కాదు.
మనమూ అభావమై తిరిగి భవిష్యత్తులోకి వెళ్ళాల్సిందే..
ఆసుపత్రిలో ఒక చావు లో కవితా లక్షణాలు కొరవడి వచన లక్షణాలు
మెండుగా చొరబడి నప్పటికీ మనం తడిసి ముద్దవుతాం.
రెండు కళ్ళతో మనం దేన్నైనా ఒకటిగా చూస్తే ఇక్కడ బాబా
తన రెండు కళ్ళతో రెండు దేశాలు చూస్తాడు.
అసలు ప్రతి కవి సమస్య ఎందుకు విన్నవించాలి?
విన్నవించబోతే..పదాలు దొరికీ దొరకనట్టుగా, కవిత కుదిరీ
కుదరనట్టుగా ఎందుకు నరకం అనుభవించాలి?
తన ‘ లో ‘ తడిని ప్రసరింపజేయాలి. అంతే…
సాగరతీర సాయంత్రం విరామం తీసుకోకుండా
అంతరించి పోతున్న పిచ్చుకలపై వాపోతాడు.
మనం కేవలం మనకోసమే జీవిస్తున్నామా?
మన ఉద్యోగం మనకోసమే చేస్తూన్నామా? ఖచ్చితంగా కాదు.
ఒక గుమస్తాచేసే పని తనది కాదు. ఒక ఇంజనీరు తన కోసం
డాం కట్టుకోడు. మనం ఎంతో మందికి పని చేస్తాం.
మనకెంతో మంది పని చేస్తారు.
మెలకువ గాజు పెంకులపై(అతను)
నైట్ షిఫ్టు కేబిన్ మాస్టర్
చేసిన తపస్సు ఫలితంగా
నిదురించే ప్రయాణీకులు
తమ తమ గమ్యాలలోకి మేల్కొంటారు.
మినికవితలు తిరగేస్తూంటే హఠాత్తుగా అవని ఏమంది? అని
అడుగుతాడు. అంతరించి పోతున్న పాపి కొండలు మిగిల్చే
ముళ్ళగాయాలు మానక ముందే పోలవరం నిర్వాసితుల కోసం
మరో తడి గీతాన్ని నిలబెడతాడు.
ప్చ్… ఇప్పటికీ
ఈ ప్రపంచం లోయలోనే ఉంది. అంటాడు బాబా.
ఒక కవిత లేదా ఒక వస్తువు కవి మనసులో
సమయానికి చిక్క బడక పోతే, ఉడికీ ఉడకనట్లు
ఊడిపడతది. సమయానికి సమయమివ్వాలి, చిక్కబడ
నివ్వాలి. అలాకాక పుట్టినవే ఫ్రాగ్మెంట్స్ .
ఇవి హైకూ లనలేం. ఎవరైనా ఏ పేరైనా పెడితే
అదొక క్రొత్త ప్రక్రియ అవుతుందేమో..
అక్కడ అక్కడ రచయితలో ఇస్మాయిల్ ప్రభావం కనిపిస్తుంది.
అంతేకాదు కొన్ని చోట్ల సార్వజనీనత లోపించింది.
కొన్ని కవితల్లో వచనం కవిత లక్షణాల్ని హరించినప్పటికీ
అస్థిత్వ వేదన మనకర్ధమవుతుంది.
మనిషి సమూహాన్ని కోల్పోయి చాన్నాళ్ళయింది.
జీవితాల్లో ఎంత వైవిధ్యం చోటుచేసుకుంది.
జీవితమ్లో అత్యవసరమయిన ఆర్ద్రత గురించి..
ప్రేమగురించి ఆలోచించే తీరికెక్కడిది.
నిను నువు ప్రేమించు చున్నట్లుగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు
అన్న బైబిల్ సూక్తిని తన మూడు చక్రాల బండిలో
మానవత్వాన్ని మోసుకు తిప్పుతూన్న
ఒక మోజెస్ ని చూపిస్తాడు.
ఆటో ప్రకాష్ 9945029294 లో.
ఏదైనా పుస్తకం లోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపుకోవటమే కదా! అంటాడు.
మనల్ని మనం ఒంపుకుని నింపుకోవడం లో
మనం పడిన ఘర్షణని సంపుటి సాంతం
మనం అనుభవించాల్సిందే.
ఈ సంకలనానికి ఈ టైటిల్ పెట్టి ఉంటే
మరింత బాగుండేదేమో.
ఎవరు వింటారని ఈ అక్షరాలను
వెదురు రంధ్రాల గుండా
ప్రవహింప చేస్తున్నాను ! అని అంటాడు..
ఎందుకు ? కవితలో
సమాజంతో మన బంధాన్ని
electrify చేసుకోవడమే కవిత్వం.
అయితే చేయాల్సిందల్లా…ఒక్కటే
అభివ్యక్తి అంతరాలలోంచి మోగే ధ్వని ని
బహిర్గతం చేసి పరివ్యాప్తి చేయాలి.
ఆకుపచ్చని తడి గీతం పుస్తకావిష్కరణ వివరాలను
http://sahitheeyanam.blogspot.com/ లో చూడవచ్చు.
పుస్త్తకం వివరాలు :
ఆకుపచ్చని తడి గీతం
58 కవితలు, 90 పేజీలు
వెల: 60 రూపాయిలు
కాపీల కొరకు :
బొల్లోజు బాబా
30-7-31, గొల్లల వీధి,
సూర్యనారాయణ పురం,
కాకినాడ,తూర్పు గోదావరిజిల్లా
ఫోన్: 0884-2368189
సెల్ : +91 98493 20443
పుస్తకం » Blog Archive » కాలుష్యం అంటని కవి
[…] ********** ఈ పుస్తకం పై పుస్తకం.నెట్ లో శ్రీనిక గారు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి. […]
జాన్ హైడ్ కనుమూరి
ఆకుపచ్చని తడిగీతం సంకలనం కాదు
బాబా గారి కవిత్వం మాత్రమే
శీర్షికను సవరించాలి చూడండి
kalpana
శ్రీనిక గారూ, బాబా గారి అందమైన కవిత్వానికి మీ సమీక్ష మరింత న్యాయం చేసింది. విశ్లేషణ బావుంది. పుస్తకం వచ్చినందుకు బాబా గారికి శుభాకాంక్షలు.
perugu
మంచి సమీక్ష..
శ్రీనిక కు అభినందనలు..
బాబా గార్కి శుభాకాంక్షలు..
బొల్లోజు బాబా
శ్రీనిక గారికి చాలా చాలా ధన్యవాదములండీ.
i am thrilled to see how i look in – in a review. 🙂 thank you very much.
రాఘవెంద్ర గారికి జాన్ హైడ్ గారికి థాణ్క్సండీ.
మాగంటి వారికి
“పెద్దలు సర్టిఫికేట్ ఇచ్చినంతమాత్రానా కాలం ఇవ్వొద్దూ?” అని ఇదివరలో బ్లాగుల్లో ఓ పెద్దాయనపై నే చేసిన కామెంటు.
i still stand by it sir. 🙂
thank you for your wishes
bollojubaba
జాన్ హైడ్ కనుమూరి
ఆకుపచ్చని తడిగీతం కవితను నేను మొదట బ్లాగులో చదివి చాలా వుద్విగ్నుడనై, అదే పేరుతో ఒక సంకలనాన్ని చేద్దామని అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య వ్యక్తిగత కారణాలవల్ల ఆ పని చేయలేకపోయాను.
ముక్యంగా వెలుతురు వేయి వెదురుగుమ్మాలలోచి రావటం (పాదాలు ఖచ్చితంగా గుర్తులేవు ఇప్పుడు) నన్ను చాలా ప్రభావితం చేసింది. అలాంటి ఫోటోకోసం చాలా వెతికాను కూడా.
మీ పరిచయం బాగుంది.
మళ్ళీ నేనొకసారి పుస్తకాని చదివి రాస్తాను.
శ్రీనిక
పుస్తకం సంపాదకులకు
ధన్యవాదములు.
Vamsi M Maganti
ముందుగా బాబాగారి కవితా సంకలం అచ్చైనందుకు అభినందనలు. సంతోషం. నిజంగానే, మనఃస్ఫూర్తిగానే!
ఇక అద్దంలో అటేపు చూట్టం మొదలుపెడితే బాబాగారిని కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల సహపంక్తిలో కూర్చోపెట్టి శిఖామణిగారు చెప్పిన “మొదటిమాటలు” నన్ను ఆ సంకలనం చదవకుండా చేసేటట్టున్నాయి. Not that he cares 🙂
శిఖామణిగారికి బాబాగారితో వున్న మిత్రత్వంతో రాసారో, లేక ఇంకేదైనా కారణంతో రాసారో తెలియదు కానీ, చాలా “ఇది కాని అది” గా వున్నది. బాబాగారూ – ఈ నా మాటలకు మీకు కోపం వచ్చినా సరే. 🙂 అయినా పాత కవితల సంకలనమే అంటున్నారు కాబట్టి, ఆయన బ్లాగు చదివే నేను వాటిలో చాలా మటుకు ఇంతకు ముందే చదివేసే ఉంటానని అనుకుంటున్నాను.
ఇక శ్రీనిక గారి ఉపోద్ఘాతం మాటలు శిఖామణి గారి మొదటిమాటల్ని మించిపోయాయి. అందులో ఈషణ్మాత్రం సందేహం లేదు. మళ్ళీ అద్దంలో ఇటేపుకొస్తే బాబాగారి కవితలు అప్పుడప్పుడు నిజంగానే బాగుంటాయి. కొన్ని వ్యక్తీకరణలు ఆయనకే సొంతం.
ఏదేమైనా, బాబాగారు ఇప్పుడు కాకపోయినా, కొన్నేళ్ళ తర్వాతైనా – ఆయనా, ఆయనతో పాటు ఆయన కలం వజ్రాయుధంలా మారాలని ఆశించేవారిలో నేనూ ఒకణ్ణి.
వంశీ
Nutakki Raghavendra Rao
శ్రీ శ్రీ మహాప్రస్తానానికి చలం యిచ్చిన యోగ్యతాపత్రంలా మహోన్నతంగా వుందీ విశ్లేషణ.
తెలుగు సాహితీ పుష్పవనాన సుగంధాలు వెదజల్లుతూన్న గులాబీ పొద బల్లోజుబాబా. వారి పై వ్యాఖ్యానించగలంతటి వాణ్ణి కాకున్నా సాహసిస్తున్నా.
ఆస్వాదిస్తే సౌరభాలును పంచగలడు.”సమాజాన అసమంజసాలు కనిపిస్తే తన అక్షర లక్షల కంటకాలతో సున్నితంగా స్ప్రుసిస్తూ వారించి నివారించగలడు……. శ్రీ బల్లోజు బాబా కు……సాహితీ అభినందనలతో ..నూతక్కి రాఘవేంద్ర రావు.”