ఆ రోజుల్లో – పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు
వ్యాసం రాసిపంపినవారు: చంద్ర శేఖర్
తెలుగు సంస్కృతీ మీద ఆపేక్ష వున్న అందరూ చదవవలసిన పుస్తకం – “ఆ రోజుల్లో”. రాసిన వారు: తెలుగు సాహితీ ప్రపంచంతో మరియు సాహితి వేత్తలతో సన్నిహితంగా మెలిగిన పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు. మొత్తం 80 వ్యాసాలు, ప్రతి ఒక్కటి ఒకనాటి తెలుగు నాట వెల్లివిరిసిన అత్మీయతానుబంధాల్ని కళ్ళముందుంచే రంగులచిత్రమే. ప్రచురణకర్తల మాటల్లో ఈ పుస్తకం ఒక ఆంధ్ర సాంస్కృతిక జీవనదర్పణం.
మొదటి వ్యాసం నాడు-నేడు తో ప్రారంభమై స్వస్తితో అప్పుడే ఐపోయిందా అనిపించి మళ్లీ మళ్లీ చదివించేట్లు చేస్తుంది. ప్రస్తుతం మన జీవనానుభావంలో లేని కట్టెల పొయ్యి, బొగ్గులకుంపటి, కిరసనాయిలు స్టవ్, రుబ్బురోలు, బొంబాయి, పొట్టు పొయ్యి, గ్రామఫోను, గాడిపోయ్యి, బ్రోలెర్ వీటి గురించి మనకి వున్న అనుబంధం మధురంగా గుర్తుచేస్తుంది. జీవితంలో ఇంకా మనం చూడని, వినని ఎందరో మహనీయుల ఔన్నత్యం గురించి, మహాద్భుత ఘట్టాలను ఏర్చి కూర్చి నిక్షిప్తం చేసారు.
ఓడడం, నెగ్గడం కాదు; ఆడ్డమే—ఇందులో రాజమండ్రి కేసరి క్లబ్ గురించి, అందులో ఆటగాళ్ల గురించి కళ్ళకు కట్టేట్టుగా వివరిస్తారు. ఆర్ధిక, సామాజిక అసమానతలు ఆటలకి అడ్డంకావని టీం లో రాజు అనే ప్లీడర్ గుమస్తా, గోపలరావ్ అనే జిల్లా జడ్జి గోల్కీపర్, ఎనిమిది రూపాయల జీతగాడు ఐన అలుమినియం వర్కర్ అప్పల స్వామి. వీరందరూ కలిసి ఆటలు సుహృద్కరమైన వాతావరణంలో ఎలా ఆడేవాళ్ళో హృద్యంగా రాస్తారు. అప్పట్లో గొప్ప వాళ్లకి ఏ అంతస్తులు, అధికారాలు పట్టవని, వారి ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం నుంచి మనం ఏంతో నేర్చుకోవాల్సింది వుంది అనిపిస్తుంది. ధాతు కరువులో కుటుంబం కుటుంబాన్నే ఆదుకున్న ఆలమూరుకి చెందిన నారాయణి గారు, శ్రమపడి రాజీలు కూర్చే రెబ్బప్రగడ సుబ్బారావుగారు: వీరి గురించి ప్రాతఃస్మరణీయులు వ్యాసంలో చెప్తారు. అతి బీదవాడైన అచ్యుతరామయ్య గారు ఆరోజుల్లో యాయవారం (ఇది సరిన పదమో కాదో తెలీదు) చేసి మాత్రమే సంపాదించుకుని వూరివారందరికి వారి నూతిలో నీళ్ళు వుచితంగా తోడుకోనిచ్చారో, ఎంత నిస్వార్ధంతో అందరికి వుపయోగపడే వారో – అదే ఒక్కక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తే ఆయన ఎలా బతికేవారో చదివితే అర్ధం అవుతుంది మనం ఇప్పుడు వున్న సంధి కాలం గురించి. అలాంటి ఆయన ఎవరికో సాయం చేస్తూ చనిపోయారంటే ఏంటో బాధగా వుంటుంది. “కందిరీగలు”—నరసమ్మగారి చెడ్డ నోరు, కావన్న తుంటరితనం గురించి చెప్తూ అంతామంచివాళ్ళే కాదు చెడ్డ వాళ్ళు కూడా వున్నారంటారు. కష్టపడి నీళ్ళు తెచ్చే కావన్న, ఇంకా రాత్రి ఎవరైనా వస్తే వినబడదేమో అని ఇంటిముందున్న కటకటాల వసారాలో పడుకునే డాక్టర్ చలపతి గారు, ధైర్యవచనాలతోటే వైద్యం చేసే జొన్నాడ డాక్టర్ గారు, ఆయన చేసిన అర్ధణా వైద్యం, ఇంకా అప్పటి ప్రైమరీ స్కూల్, రైలు డ్రైవర్ని కొట్టిన హార్డిన్జ్ స్కూల్ హెడ్మాస్టర్, ఎందరో గొప్ప అయ్యవార్లు, ఆచార్యులు – దివాకర్ల, కొత్తపల్లి, నండూరి, దిగుమర్తి, పోణంగి, పింగళి, యర్రోజు మాదవాచార్యులు.
వ్యసనల్లో కూడా ఓ దర్జా, ఓ హుందాతనం కనిపించేవే కాని, పిరికితనం లేకితనం వుండేవి కావు, ఓ ఔదార్యం వుండేది అంటూ నరసింహం తాతగురించి అయన యొక్క రంగి గురించి, ఆనాటి మనుష్యుల మధ్య వుండే ఆ అనుబంధాల గూర్చి ఆయన అనుహ్యం అని తేలుస్తారు. అది ఆత్మగౌరవం అంటే లో – ఘనాంతర స్వాధ్యాయవేత్త వెంకటశాస్త్రి గారిని గురించి – వారి అనుభవం లో వివాహాల్లో పురోహితులని చేసిన చులకన వల్ల ఆయన మార్చుకున్న జీవన విధానం ఆలోచింపజేసే విధంగా వుంటుంది. కరణం కాదంటే కలక్టర్ పని గోవిందా లో కరణంగారి జనార్ధన రావు గురించి, “గుండె పండితే అంతా పంటే” లో చింతలూరు (తూ!గో!జి!) పుణ్యదంపతులు అల్లంరాజు సత్యనారాయణగారు, రత్తమ్మగారి ఔదార్యం, విద్యార్దులని కూడా గౌరవించే వీరేశలింగం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జయంతి గంగన్న గారు, సుభాస్ చంద్రబోస్ సన్నిహితులైన అభిమానధనుడు అన్నపూర్ణయ్య గారు, అసామాన్యులైన సామాన్యులు అనాస ఆదినారాయణ గారు, పిచ్చి సత్యం (వున్నంతలోనే, సంపాదన రోజుకు మూడు రూపాయలు) వారి యొక్క భూతదయ నిజంగా మనల్ని వెంటాడక మానవు మనం మన జీవితాల్లో ఏమి సాధిస్తున్నామో అని. ఆరవ జార్జి అస్తమిస్తే కూడా జరిగిన టి పార్టి కి లౌక్యం చూపించిన సుబ్రహ్మణ్యం గారు, గవర్నర్ని కూడా గట్టుమీద కూర్చోపెట్టిన ఉషశ్రీ గారి తండ్రిగారైన రామ్మూర్తి గారు, వుదాత్తమైన ప్రకాశం హృదయాకాశం లో అంతా త్యజించి సామాన్యంగా జీవించిన వారి జీవనం మరియు వారి స్నేహానుభూతి, ఇంకా తిక్కన తిరుగాడిన నెల్లూరు గురించి వారి సాహిత్యభిలాష గురించి, కోమల విలాస్, రంగనాయకుల గుడి, తిరుపతి వేంకట కవులు, రామకృష్ణ కవులు, పింగళి కాటూరి కవులు, ఇంకా జాషువా గారు అలా ఎంతో మంది యొక్క ఔన్నత్యం, పోటీగా ప్రారంభించబడ్డ సి ఆర్ రెడ్డి కాలేజి మరియు డి యాన్ ఆర్ కాలేజి గా పేరు మారిన వెస్ట్ గోదావరి భీమవరం కాలేజి కదా కమామిషు, “ఒక శిఖరం” అధ్యాపకుల గురించిన వ్యాసం లో మనం ఆ కాలంలో చదువుకోలేదే అనిపించేట్లు చేస్తాయి. 1951 తెలుగు కధనికా చరిత్రలో సువర్ణఘట్టం ఐన తెలుగు కధ “గాలివాన“ గురించి, పదవికంటే పండిత సన్నిధి ముఖ్యం అన్న రామకోటిశాస్త్రి గారు, ప్రధానోపాధ్యాయులని ఖంగు తినిపించిన తెలుగు ఆచార్యులు దిగుమర్తి సీతారామశాస్త్రి గారు, దాస్తే నాకు సంతోషం, ఖర్చు పెడితే వాళ్ళకి సంతోషం, ఇద్దరి సంతోషం సాగుతోందిగా అనే తెలుగు పండితులు, సొంత ఖర్చుతో సంగీత కార్యక్రమాలు చేసే కారుమూరి నరసింహమూర్తి గారు, ఇంకా ఎన్నో అవి మనిషిని నమ్మే రోజులని, మనసుతో బ్రతికే రోజులని, మధ్యలో కొన్ని చురకలు నిజంగా మనలని తాకక మానవు మచ్చుకగా ‘సామర్ధ్యం వుంటే సక్రమజీవనం వుండదు. రెండు వుంటే సౌజన్యం వుండదు’, ఇంకా రాయలసీమ వాతావరణం, పరిస్థితులు, అక్కడి సామాన్య ప్రజా జీవితం, వారి నుడికారాలు, వారి దృష్టిలో సీమ ప్రజలు మంచి స్థానాన్ని సంపాదించారు, వారి స్వచమైన భాషతోను, మంచితనం తోనూ. ఇంకా ఇలా పుస్తకం మొత్తం మిద ఎన్నెన్నో జీవిత సత్యాలు వున్నాయి, అవి ఏవో మహనీయుల జీవితాల్లో కేవలం సంఘటనలు లాగ కాకుండా హృద్యంగా మనసుకు హత్తుకునేట్లు, మన జీవితాల్లో మనం ఏమి కోల్పోతున్నామో గుర్తుతెచ్చుకునేట్లు, అసలు జీవన పరమార్ధం తెలుసుకునేల వుంటుంది. స్వస్తి లో కూడా ఉషశ్రీ గారి గురించే, ఈ పుస్తకాన్ని ప్రధమ భాగం అన్నారు మరి ఇంకోభాగం ఏమైనా రాసారేమో తెలీదు (రెండో భాగం కూడా రాసి 2005 లో ప్రచురించారు). ఈ పుస్తకాన్ని కేవలం ఒక వ్యాసపరంపరలా కాకుండా ఏదో ఒక వ్యాసమైనా మనలో ఒక్కరి జీవానవిధనాన్ని ప్రభావితంచేసింది అంటే చాలు ఈ పుస్తక పరిచయ లక్ష్యం నెరవేరినట్టే.
పుస్తకం పేరు: ఆ రోజుల్లో
రచయిత: పోలాప్రగడ సత్యనారాయణమూర్తి
ప్రచురునకర్త: తరుణ సాహితీ సమితి, 2D, బ్రహ్మనందానగర్, మలకపేట, హైదరాబాద్ – 36
మొదటి ప్రచురణ: మే 2000
వెల: Rs.100
పేజీలు: 206
పుస్తక కాపీల కోసం సంప్రదించాల్సిన చిరునామా:
తరుణ సాహితీ సమితి, 2D, బ్రహ్మనందానగర్, మలకపేట, హైదరాబాద్ – 3
విశాలాంధ్ర అన్ని శాఖలు, ప్రజా సాహితి, నవోదయా.
రామ
నిజంగా “ఆ రోజుల్లో” అనిపించేలా ఉంది. ఇంచుమించు వ్యాసాలూ అన్నింటి గురించీ వ్రాయడం వాళ్ళ కామోసు హడావిడి గా ముగించినట్టు అనిపించినా ఆశక్తి ని రేకెత్తించింది. రాజమండ్రి లో పుట్టిపెరగడం వాళ్ళ అనుకుంటాను – నా మనసుకి మరింత దగ్గరగా అనిపించింది. ధన్యవాదాలు.