బ్రాహ్మణ పిల్ల: శరత్
వ్యాసం రాసిపంపిన వారు: – నరేష్ నందం (http://naresh.co.tv)
విశాలాంధ్ర పబ్లిషర్స్ శరత్ సాహిత్యాన్ని పది సంపుటాలుగా పాఠకులకు అందిస్తోంది. ఆ సిరీస్‌లోని ఎనిమిదవ సంపుటంలోని నవలికలలో ఒకటి, బ్రాహ్మణ పిల్ల.
రచయిత గురించి:
శరత్‌ని, అతని సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. అయినా అతని గురించి పుస్తకం అట్టపై ఇచ్చినది ఒక్కసారి చూస్తే..
“సాంసారిక సాంప్రదాయ సంకెళ్లతో, సామాజిక దురన్యాయాల సమ్మెట పోట్లతో స్త్రీ ఇంటికే కట్టు బానిస. కుహనా వంశగౌరవాల సుడిగుండంలో అడుగంటి శిధిలమైపోతున్న జమీందారీ యుగం, ఊహించని మార్పులకు తట్టుకోలేక చితికిపోతున్న గ్రామీణ సమాజం, అందులోంచి అప్పుడప్పుడే తలెత్తబోతున్న పెట్టుబడిదారీ సమాజాంకురాలు- ఇదీ శరత్ చంద్ర చటర్జీ జీవించిన, రచనా వ్యాసంగం సాగించిన కాలంనాటి సమాజం. బెంగాలీ స్వభావం- హృదయ స్పందనలే శరత్ రచనలు. జీవితంలొ చెడూ, మంచీ ఉంటాయనీ రచయిత చెడుని కూడా స్పృశిస్తూ, మంచినీ ఉదాత్త భావాలనూ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది శరత్ రచనల్లో అంత:సూత్రం. శరత్ రచనల్లో స్త్రీని అన్ని కోణాలనుంచీ చిత్రిస్తూ, శక్తి స్వరూపిణిగానూ,
దయార్ద్ర హృదయినిగానూ, సేవాతత్పరురాలుగానూ, ప్రేమామృత వర్షిణిగానూ, ఉద్యమశీలిగానూ నిలిపిన ఘనత శరత్‌ది.
శరత్ తను చూసిన సమాజంలోని లోటుపాట్లను, ఆచారాల వెనుక ఉన్న అమానుషాలను లోకం ముందుకు తెచ్చాడు. అతని రచనలు చదివిన తర్వాత ఎంత మంది ఆడవారు అన్యాయమైపోయారో కదా అనిపించక మానదు. ఎనిమిదేళ్లు కూడా నిండని పసిపిల్లలకు పెళ్లిళ్లు, వారిపై జరిగిన అత్యాచారాలు, ఆ వయసులోనే ప్రేమ భావనలు, అత్త వారింట్లో అడుగుకూడా పెట్టకుండా విధవలైన జాతకులు, వారిని మోసం చేసి తమ సరదాలు తీర్చుకున్న మేక వన్నె పులులు, అన్యాయమైన తర్వాత కడుపు తీపి చంపుకోలేక యాభైరూపాయలతో కాశీ, బృందావనం రైలు ఎక్కిన అభాగినులు .. శరత్ రచనల్లో కనిపిస్తారు. తను పుట్టి పెరిగిన బ్రాహ్మణ కుటుంబ ఆచార సంప్రదాయాలే అతని రచనల నేపధ్యం.
అందుకే తెలుగులో స్త్రీ వాదిగా స్ధిరపడ్డ ప్రముఖ రచయిత చలం, “స్త్రీకి నేను వెన్నెముకనిస్తే, శరత్ హృదయాన్నిచ్చాడు” అని ప్రశంసించాడు.
ఈ నవలిక, “బ్రాహ్మణ పిల్ల”ను బొందలపాటి శివరామ కృష్ణ తెలుగులోకి అనువదించారు.
******************************************************************************
రాసమణి అనే ముసలావిడ తన మనవరాలితో నడుస్తూండగా, ఆ పిల్ల దారికి అడ్డంగా పడుకున్న మేక కట్టుతాడు దాటుతుంది. రాసమణి తిట్టటం ప్రారంభించటంతో ఆ పిల్ల “దాటితే ఏమవుతుంది?” అని ప్రశ్నిస్తుంది. “బ్రాహ్మలింట పుట్టిన పది పన్నెండేళ్ల ఆడమొద్దువి- మేక కట్టుతాడు దాటకూడదని ఆ మాత్రం తెలియదూ?” అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఆ మేక పిల్లను కట్టేసిన యానాది పిల్లపై ఎగిరి పడుతుంది. అసలు బ్రాహ్మల వీధిలోకి యానాది వాళ్లను రానిచ్చిందెవరని ప్రశ్నిస్తుంది. ఆ యానాది వాళ్లను తెచ్చి, తమ చోటులో ఉండనిచ్చిన ప్రియబాబు ఇంటిపైకి మాటల యుద్ధానికి వెళ్లి, అతని కూతురు సంధ్య, భార్య జగద్ధాత్రిలను బెదరగొడుతుంది.
ప్రియ ముఖర్జీ– ఇల్లరికపు అల్లుడు. ఆ ఊళ్లో అందరూ అతన్ని పిచ్చోడంటారు. అతని వల్ల లాభపడిన వాళ్లు మాత్రం, పిచ్చి మారాజంటారు. “పిచ్చి మారాజు తప్ప బీదవాళ్ల కష్టసుఖాలు గ్రహించే వాళ్లెవరూ లేరు. గంగా జలంలా స్వచ్చమైన మనస్సు” అనుకుంటారు. వృత్తిరీత్యా హోమియోపతి డాక్టరు. అమాయకుడు. ఎక్కువమందికి ఉచితంగా వైద్యం చేసి, పథ్యానికి ఎదురు డబ్బులిచ్చొస్తుంటాడు. భార్య జగద్ధాత్రి అతన్ని తప్పు పడుతుంటే.. కూతురు సంధ్య వెనకేసుకొస్తుంది.
ఇక అరుణ్, సీమకెళ్లి చదువుకుని వచ్చిన వాడు. అదీ వ్యవసాయం. “బ్రాహ్మణ పిల్లాడై ఉండి నాగలి బుజాన వేసుకుని దున్నటానికి వెళతాడా పొలాల వెంట! ఇంతకంటే చావేముంది?” అనేది రాసమణి లాంటి వారి మాట. పెద్దలమాట వినకుండా సీమకెళ్ళాడని లోకులకీ, అతడికీ సహపంక్తి భోజనాలు లేవు. కానీ అతను సంధ్య కోసం ప్రియ ముఖర్జీ ఇంటికి వచ్చిపోతుంటాడు. అమ్మా నాన్న లేని వాడు, చిన్నప్పటినుంచీ తెలిసిన వాడు, వస్తూ పోతున్న వాడూ అవటంతో జగద్ధాత్రి కూడా అతనిని ఇంటికి రావద్దని చెప్పలేకపోతుంది.
మిగిలింది- గోలోక చటర్జీ. రాసమణి మాటల్లో చెప్పాలంటే “ఊరికి శిరోమణి. అయిదారు ఊళ్లకి పెద్ద మనిషి. భోజనం చేసి గోమయంతో ముఖాన్ని శుద్ధి చేసుకునేటంత ఆచారపరుడు.” విదేశాలకు మేకలను, గొర్రెలను రహస్యంగా ఎగుమతి చేస్తుంటాడు. అతని భార్య చనిపోతూ దూరపు బంధువు, విధవ, వరుసకి చెల్లెలయిన జ్ఞానదాకు తన పదేళ్ల కొడుకుని అప్పగించి పోతుంది. జ్ఞానదా గోలోక చటర్జీ మాటలు నమ్మి అతనింట్లో ఉండిపోతుంది.
అరుణ్ ప్రియముఖర్జీ ఇంటికి వచ్చి వెళుతుండటంపై ఆరా తీసిన రాసమణి, అతన్ని ఇంట్లోకి రానివటం, పిల్లతో పరిహాసాలాడనివ్వటం మంచిది కాదని జగద్ధాత్రిని హెచ్చరిస్తుంది. సంధ్య తాంబూలం నములుతుండగా ఇంట్లోకి వచ్చిన అరుణ్, కలకత్తా నుంచి తెచ్చిన కొన్ని కాగితాలను సంధ్యకు ఇచ్చి జ్వరముందేమో చూస్తాడు. వీళ్లు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడకు వచ్చిన జగద్ధాత్రి “తమలపాకు నమలకు, ఊసెయ్యి” అంటుంది. సంధ్య ఊసేసి, నోటమాట లేకుండా ఉన్న అరుణ్‌తో “నీకు జాతిలేదు, ధర్మం లేదు.” అంటుంది. “నీకు కూడా అంటరాణి వాణ్ణయ్యాను, ఇంక ఈ ఇంటికి రాన”ని అరుణ్ వెళ్లిపోయాక, అతను ముట్టుకున్నందుకు బట్టలు మార్చుకు రమ్మంటుంది జగద్ధాత్రి. ఎందుకని అడిగిన సంధ్యతో “కిరస్తానీ వాడు- వితంతువైనా, పెళ్లయిన వాళ్లయినా స్నానం కూడా చెయ్యాలి.” అంటుంది.
అదే సమయంలో వచ్చిన గోలోక చటర్జీ, సంధ్యతో పరిహాసాలాడి, మాటల దెబ్బ తింటాడు. జగద్ధాత్రితో సంధ్య వయస్సు, పెళ్ళి, అరుణ్ గురించి మాట్లాడి చివరకు “ఊరి మధ్యకు తీసుకొచ్చి యానాది వాళ్ళను, ఎలికల వాళ్ళను ఉంచటానికి వీళ్లేదు” అని హెచ్చరించి వెళతాడు.
ఆరోజు సాయంత్రం అరుణ్ ఇంటికి వెళ్ళిన సంధ్య, తమ పశువుల పాకలో ఉన్న యానాది వాళ్ళకు ఆశ్రయం కల్పించమనీ, లేకపోతే తన తల్లి వారిని తరిమికొడుతుందనీ ప్రాధేయపడుతుంది. తన తోటలో వారికి ఆశ్రయం కల్పించేందుకు అంగీకరిస్తాడు అరుణ్.
రెండు రోజుల తర్వాత రాసమణి జగద్ధాత్రిని కలిసి, గోలోక చటర్జీ సంధ్యను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడనీ, సంధ్యను అతనికిచ్చి చేయటం వలన కలిగే లాభాలను గురించీ చెబుతుంది. బ్రాహ్మడి కులం కాపాడినట్లవుతుందనీ, ఊళ్లో పిల్ల ఊళ్లోనే కళ్లెదురుగా ఉంటుందనీ ఊరిస్తుంది. బాధతో, దిక్కు తోచని
స్ధితిలో ఉన్న జగద్ధాత్రికి సంధ్య, “కాశీ నుంచి నాయనమ్మ ఉత్తరం రాసింది, త్వరలో వస్తానంది” అని చెబుతుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ప్రియ
ముఖర్జీ, అరుణ్ ఊరొదిలి పోతున్నాడనీ, ఉన్న ఆస్తి అంతా అమ్మేస్తున్నాడనీ అంటాడు.
వీధిలోకి వెళ్ళబోతున్న గోలోక చటర్జీ, వంట గదిలో ఉన్న ఙానదాను పలకరిస్తాడు. “మీరు సంధ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నన్ను మోసగించగండి.” అని ప్రాధేయపడుతుంది. “అదేమీ లేదు. అంతా తమాషాకి.” అని చటర్జీ వెళ్లిపోతాడు. అదే సమయంలో తనను తీసుకెళ్లేందుకు వచ్చిన మామగారితో “నేను రాన”ని ఖచ్చితంగా చెప్పి పంపేస్తుంది.
గోలోక చటర్జీ, మృత్యుంజయ అనే అతన్ని ప్రియముఖర్జీ తల్లి గురించిన అన్ని విషయాలను తెలుసుకు రమ్మని ఆఙాపిస్తాడు. పదిహేనేళ్ళ పిల్లకు తండ్రయిన ప్రాణ కృష్ణుడు కష్టాల్లో ఉన్నాడని విని అతన్ని తన దగ్గరకు పంపమని చెబుతాడు.
సంధ్య పెళ్ళి వీరచంద్ర చటర్జితో నిశ్చయమైంది. మార్గశిరంలో ఒకటే లగ్నం ఉండటంతో పదిరోజుల్లోపలే ముహూర్తం. జగద్ధాత్రి అత్తగారు, కాళీతాం కాశీ నుండి వచ్చారు. అరుణ్ గురించి విషయం తెలుసుకున్న ఆమె జగద్ధాత్రిని “అలా బంగారపు చాయని చంద్రుడిలాంటి పిల్లవాడు నీకు నచ్చలేదా?” అని అడుగుతుంది. “ఈ కుల గౌరవమనేది ఎంత మహా పాపమో, ఎంతటి మోసమో, ఆ బరువుని నువ్వు నిజంగా గ్రహించినట్లైతే నీ కూతుర్ని ఇలా బలివేసుకోలేవు.” అనీ హెచ్చరిస్తుంది. తర్వాత వచ్చిన సంధ్య నాయనమ్మను “నీకు సవతులెంత మంది నాయనమ్మా? వందమందా? రెండు వందల మందా? నాలుగు వందల మందా?” అని అడుగుతుంది. సమాధానంగా కాళీతాం నవ్వి, “సరిగ్గా తెలియదు కానీ, అది అసంభవం కాదు. ఎనిమిదో ఏట పెళ్ళయింది. అప్పటికే వారికి ఎనభై ఆరుగురు భార్యలు. ఆ తర్వాత కూడా చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎంత మంది చేసుకున్నారో వారికే తెలియదు. ఇహ నాకెలా తెలుస్తుంది?” అని అడుగుతుంది. “తాతయ్య ఒకవేళ వచ్చినట్లైతే ఎన్ని రూపాయలు ఇవ్వ వలసి వచ్చేది?” అని నాయనమ్మను అడిగిన సంధ్యను జగద్ధాత్రి కోపగించుకుంటుంది.
రాత్రివేళ గోలోక చటర్జీ ఇంట్లో రాసమణి ఙానదాను బతిమాలుతోంది. “గుటుక్కున ఈ మందు తాగెయ్యి. మళ్ళీ ఎలా ఉన్నదానివి అలా అయిపోతావు. ఎవరూ తెలుసుకోలేరు.” అని చెబుతోంది. ఙానదా “అది విషం. మీరు నన్ను చంపాలనుకుంటున్నారు.” అంటుంది. “మగవాడతను- ఏదో అలాంటి పని చేశాడని చెప్పి, ఆడవాళ్ళు కూడా ఇలా మొండికేసుకుని కూర్చుంటే సాగదు. చటర్జీ తమ్ముడు చెప్పనే చెప్పాడు ‘ఆమెకు యాభై రూపాయిలిస్తాను. ఆమెను కాశీ కానీ, బృందావనం కానీ వెళ్ళమనూ అన్నాడు. ఎంతో మందికి అక్కడ స్థానం ఉండగా నీకేనా లేకపోయేది?” అని రాసమణి కోపంతో అడుగుతుంది. “నాకంతా తెలుసు. రేపు ఆయన ప్రాణముఖర్జీ గారి అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నారని తెలుసు. అంచేత ఇవాళ నాకు విషమివ్వమనీ, కాశీ పంపెయ్యమనీ, నన్ను ఇంట్లో ఉండకుండా దూరం చెయ్యాలనీ చూస్తున్నారు.” అని ఏడుస్తుంది ఙానదా. “అయితే చావు. నువ్వేం పసిపిల్లవా? నువ్వు చనువివ్వకపోతే మగవాడేం చేస్తాడు? అతడి తప్పేముంది?” అని ఎదురు ప్రశ్నిస్తుంది రాసమణి. ఙానదా నుంచి సమాధానమేదీ రాకపోవటంతో కొద్దిగా తగ్గి, “ఆ కోయదాని మందు అంటే నీకు భయం వేయవచ్చు. ప్రియ ముఖర్జీ అంటే నీకు నమ్మకమే కదా? అతనే ఇలాంటి మందు ఇస్తే?” అని అడుగుతుంది.
అదే సమయానికి ప్రియ ముఖర్జీ ఇంట్లోకి వస్తాడు. అతడికి రాసమణి విషయం చెప్పగానే “మీరు ఇంకో డాక్టరుకి కబురంపటం మంచిది. అలాంటి మందులు నాదగ్గర లేవు.” అని వెనుదిరగబోతాడు. రాసమణి ఆశ్చర్యంతో “ఇది ఇంకా నలుగురి చెవినీ పడవచ్చా? నువ్వు మనవాడివి. ఆడాక్టరు పరాయి వాడు. శూద్రుడు. బ్రాహ్మల మాన మర్యాదలు అతడికి తెలియవచ్చా?” అని అడుగుతుంది. అప్పుడు వచ్చిన గోలోక చటర్జీ ప్రియబాబుని బతిమాలుకుంటాడు. అప్పటికీ మాట వినకపోవటంతో “ఇంత రాత్రివేళ పెద్దమనుష్యుల ఇంట్లోకి నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని ఉంది? దొడ్డి తలుపు ఎవరు తెరిచారు నీకు?” అని గద్దిస్తాడు. రాసమణితో “నువ్వే దీనికి సాక్ష్యం” అంటాడు. సమాధానంగా రాసమణి “నేను వచ్చి చూసేసరికి యిద్దరూ దగ్గిర దగ్గిర కూచుని, నవ్వులు, వేళాకోళాలు, వెకచెకాలు, గుసగుసలూ- ఒకటే కబుర్లు” అంటుంది. ఙానదా రాతిబొమ్మలా చూస్తుండగా, ప్రియబాబుని గోలోక్ చటర్జీ బయటకు గెంటేస్తాడు.
ఆ నెలలో ఉన్నది ఒకటే ముహూర్తం కావటంతో ఆరీజు ఊరిలో నాలుగయిదిళ్ళలో పెళ్లిళ్లు ఉన్నాయి. సంధ్య పెళ్లి కూడా ఆరోజే. వివిధ కారణాల వల్ల ఊరొదిలి వెళ్లటం కుదరక పోవటంతో అరుణ్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి పదకొండు దాటినా ఇంకా మేలుకునే ఉన్నాడు. ఆసమయంలో సంధ్య అరుణ్ దగ్గరకు ఏడుస్తూ వచ్చి కాళ్లమీద పడుతుంది. ఏంజరిగిందని అడిగిన అరుణ్‌తో “నేను పెళ్లి పీటల మిద నుండి పారిపోయి వచ్చాను. నాకిప్పుడు సిగ్గు లేదు. భయం లేదు. మానావమానాలనే ఙానం లేదు. నువ్వు తప్ప పృధివిలో నాకెవరూ లేరు. రా నువ్వు”‘ అంటుంది. “ఎక్కడికి?” అని అడిగిన అరుణ్‌తో “ఎక్కడి నుంచి ఇప్పుడు ఒక వ్యక్తి లేచిపోయాడో, ఆ పెళ్లి పీటలమీదకి” అని సమాధానం చెబుతుంది. హిందూ సమాజంలో పీటల మీద పెళ్లి ఆగిపోవటం కొత్తేమీ కాదు కనుక “నువ్వు రావటమేంటి? మీనాన్న కానీ మరెవరైనా రాకపోయారా?” అని అడుగుతాడు అరుణ్. “నాన్న? ఆయన ఎక్కడికో పారిపోయాడు.
అమ్మ చెరువులో దూకింది. ఆమెనెలా అయితేనేం ఒడ్డెక్కించారు. నేను నీకోసం వచ్చాను” అని చెబుతుంది సంధ్య. “నేను చాలా తక్కువ కులపు బ్రాహ్మణ్ణి. నిన్ను నాకిచ్చి చేయటం వలన మీకులానికి రక్షణ కలుగదు. మీనాన్న ఎవరో కులీన బ్రాహ్మడిని వెదికి తెచ్చేందుకు వెళ్లి ఉంటారు.” అన్న అరుణ్‌తో “ఆయన భయంతో పారిపోయారు. కులరక్షణ జరగదన్నావే? ఎవరి కులం అరుణ్? నేను బ్రాహ్మణ పిల్లను కాదు- మంగలి పిల్లను. అందులోకూడా సరియైన మంగలి పిల్లను కూడా కాను.” అంటుంది. “నీకీ విషయం ఎవరు చెప్పారు?” అని అడిగితే “గోలోక చటర్జీ రుజువు చేశాడు. పెళ్లిళ్లు కుదిర్చే మృత్యుంజయ భట్టాచార్య మానాయనమ్మ వాళ్ల ఊరినుంచి ఇద్దరిని తీసుకు వచ్చాడు. వాళ్లు మానాన్నను చూపిస్తూ ‘ఇతను కులీన బ్రాహ్మడు కాదు. ఒక మంగలి కొడుకు ‘ అన్నారు. మృత్యుంజయ్ గంగాజలం ముందుపెట్టి మానాయనమ్మను నిజం చెప్పమన్నాడు. ఆమె ‘ఇది సత్యమే’ అని చెప్పింది.” అంది. “మానాయనమ్మకు ఎనిమిదో ఏట పెళ్లయింది. తర్వాత పద్నాలుగు, పదిహేనేళ్లకు ఒకతను వచ్చి ‘నేను మీ అల్లుణ్ణి, ముకుంద చటర్జీని ‘ అని చెప్పి ఇంట్లో ప్రవేశించాడట. రెండురోజులుండి అయిదు రూపాయలు, కొత్త పంచల చాపు తీసుకుని వెళ్లిపోయాట్ట. ఆతర్వాత అతను అప్పుడప్పుడూ వస్తూ ఉండేవాడట. ఒకరోజు పట్టుబడ్డాడు. అప్పటికే మానాన్న పుట్టాడుట. పట్టుబడ్డ తర్వాత అతనేమని ఒప్పుకున్నాడో తెలుసా? ఈ వెధవపని తన యజమాని ముకుంద ముఖర్జీ ఆదేశానుసారమే చేశాడట. ఆయన ముసలివాడు. పైగా పక్షవాతం ఉందట. అందుచేత అపరిచితులైన భార్యల నుండి డబ్బుగుంజే భారం వాడిమీద పెట్టి ‘రోజూ నువ్వు వాళ్లను పీడించి తెచ్చే సొమ్ములో నీకు సగం, నాకు సగం’ అన్నాట్ట. అతడింకా ఏం చెప్పాడో తెలుసా? ‘కేవలం మా యజమానే యిలాంటి పని చేయలా. ఇలా ఎంతో మంది బ్రాహ్మలు దూరదేశాల్లో ఉండి, ఇతరుల సహాయంతో ఇదొక వ్యాపారంగా చేస్తున్నారు ‘ అన్నాడట. ఆ పుట్టిన పిల్లవాణ్ణి తీసుకుని మానాయనమ్మ కాశీ వెళ్లి సన్యాసినిగా మారింది. అందుకనే ఆరోజు నీగురించి మాట్లాడేటప్పుడు ‘జాతి వల్ల ఎవరు తక్కువో ఎవరు ఎక్కువో అది కేవలం భగవంతుడికే తెలియాలి. మనుష్యులెన్నడూ కులహీనుడని ఎవర్నీ అసహ్యించుకోకూడదు ‘ అన్నది. దాని అర్ధం ఇప్పుడు తెలిసింది నాకు.” అంది సంధ్య. అంతా విన్న అరుణ్ “ఇవ్వాలకు నన్ను కొంచెం ఆలోచించుకోనీ సంధ్యా” అని అన్నాడు. సంధ్య “సరే, ఆలోచించుకునేందుకు సమయం ఉందనుకుంటా. ఒకప్పుడు నాకన్నా నువ్వు ఎంత కులం తక్కువ వాడివి అని ఆలోచించడానికి నాకేం కష్టం అనిపించలా. ఈసారి నువ్వు ఆలోచించే సమయం వచ్చింది” అని వెళ్లిపోతుంది.
దీపం లెలుగులో, ‘మెటీరియా మెడికా’ పుస్తకాన్ని, కొన్ని మందులను గుడ్డలో మూట కట్టుకున్నాడు ప్రియ ముఖర్జీ. వెనక నుంచి ‘నాన్నా’ అని వినబడటంతో వెనక్కు తిరిగి, సొంత ఇంట్లో దొంగలా పట్టుబడిపోవటంతో సిగ్గుపడి “ఎరగని చోటు, ఏమయినా ప్రాక్టీసు చేసుకోవాలిగా. అందుకే ఇవి తీసుకెళదామనుకుంటున్నాను.’ అని సంజాయిషీ ఇస్తాడు. కళ్ళనీళ్లతో సంధ్య “నువ్వు ఎక్కడ ప్రాక్టీసు ఎక్కడ చేస్తావు నాన్నా?” అంటే “బృందావనంలో. అక్కడికెంతో మంది యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వాళ్లకు మందులిస్తూ ఉంటే నెలకు ఐదారు రూపాయలైనా వస్తాయి.” అంటాడు. “నేను కూడా నీతో వస్తా నాన్నా. నేను కూడా లేకపోతే నిన్నెవరు చూస్తారు?” అని అడుగుతుంది సంధ్య. “అమ్మ ఒంటరిగా ఉంది. నువ్వు తోడుండాలి” అన్న తండ్రి మాట వింపించుకోదు. తల్లి తలుపులు బిగించుకుని కూర్చున్న గది ముందుకెళ్లి నమస్కరించి, వెళ్లిపోతున్నామని చెప్పి వచ్చేస్తుంది. దారిలో అరుణ్ కనిపిస్తాడు. పెళ్లి చేసుకోవటానికి సమ్మతిని తెలియజేస్తాడు. కానీ సంధ్య క్షమించమంటుంది. “ఆడవాళ్లు పెళ్లి చేసుకోవటం తప్ప పృధివిలో చేయదగ్గ పనులేవైనా ఉన్నాయా? లేవా? తెలుసుకోటానికే బయలుదేరాన”ని చెప్తుంది.
దూరంగా గోలోక చటర్జీ ఇంటిదగ్గర భోజనాల సందడి కనిపిస్తుంది. సంధ్య పెళ్లి ఆగిన రోజే ప్రాణకృష్ణ ముఖర్జీ కూతుర్ని గోలోక చటర్జీ పెళ్లి చేసుకున్నాడని సంధ్యతో చెప్తాడు ప్రియబాబు. రైల్వేస్టేషనుకు వెళ్లిన వీరిద్దరినీ చూచి ఒక స్త్రీ గాభరా పడుతుంది. సంధ్య ఆమెను గుర్తించి “నువ్వెక్కడికెళుతున్నావు ఙానదా అక్కా?” అని అడుగుతుంది. తెలియదని చేతులతోనే సమాధానమిస్తుంది. “టికెట్ తీసుకున్నావా?” అని ప్రియముఖర్జీ అడగటంతో లేదని చెప్పి వారెక్కడికి వెళుతున్నారో అని అడుగుతుంది. “టికెట్ ఖరీదు ఎంతో తెలీదు. నా దగ్గర యాభయి రూపాయలే ఉన్నాయి. నన్ను కూడా మీతో బృందావనానికి తీసుకెళ్ల”మంటుంది. ప్రియ ముఖర్జీ “సరే, మాతో రామ్మా” అంటాడు.
******************************************************************************
శరత్ రాసిన 17 నవలికలలోని ఏడు నవలికలు – “బ్రాహ్మణపిల్ల, రాముని బుద్ధిమంతనం, వైకుంఠుని వీలునామా, సరయు, స్వామి, కట్టుతెగిన పిల్ల, బిందుగారబ్బాయి” ఒకే పుస్తకంలో విశాలాంధ్ర పబ్లిషర్స్ అందించింది.
ఇందులో రాముని బుద్ధిమంతనం, ఒక కొంటె పిల్లాడి కథ. తల్లీదండ్రీ లేనివాడవటంతో అన్న వదిన దగ్గర పెరుగుతుంటాడు. వదిన తల్లిలా చూసుకుంటుంది. తన మితృలతో ఊరంతా అల్లరిగా తిరుగుతుంటాడు. వదిన తల్లి ఆ ఇంటికి వచ్చిన తర్వాత అతని కష్టాలు పెరుగుతాయి. ఆమెకి తనకి మధ్య కోప తాపాలు పెరుగుతాయి. అత్తగారు చెప్పిన చాడీల వలన రాముడిని ఇంట్లోకి రానీయవద్దంటాడు అతడి అన్న. ఇంటిని రెండు భాగాలుగా చేసి తనను విడిగా ఉండమంటాడు. రెండుమూడు రోజుల తర్వాత వదిన ముందు ఎప్పుడూ అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటానని చెప్పటంతో కధ ముగుస్తుంది.
వైకుంఠుని వీలునామా, ఇద్దరు అన్నదమ్ముల కథ. తండ్రి నుంచి వ్యాపారాన్ని అందుకున్న అన్న కష్టపడి తమ్ముడ్ని చదివిస్తాడు. మధ్యవర్తుల వలన అన్నాదమ్ముల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించుకోవటంతో కధ ముగుస్తుంది.
సరయు, ఒక అభాగిని కధ. ఒక పెద్ద మనిషి పెళ్లి చేసుకుంటాడు. ఆమె తల్లి గురించిన గతం తెలియటంతో లోకులకు భయపడి ఆమెను వదిలించుకుంటాడు. గర్భవతి అయిన ఆమె ఒక ముసలివ్యక్తి దగ్గర ఆశ్రయం పొందుతుంది. ఆమె విలువను, తన తల్లి గతంతొ ఆమెకు ప్రమేయమేమీ ఉండదన్న నిజం తెల్సుకుని, కొడుకు పుట్టిన తర్వాత వచ్చిన భర్తతో కలిసి ఆమె వెళ్లిపోతుంది. ఆమె బిడ్డపై బెంగతో ఆ ముసలి వ్యక్తి మరణించటంతో కథ ముగుస్తుంది.
సౌదామిని, నాస్తికుడైన మేనమామ ఇంట్లో పెరిగి పరమ ఆస్తికుడికి భార్యగా వెళుతుంది. అప్పటికే మామతో చర్చలు జరిపే ఎదురింటి అబ్బాయి మాటలు నమ్మి ప్రేమించాననుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత వచ్చిన అతనితో ఇల్లు వదిలి వచ్చేస్తుంది. చివరకు తప్పు తెలుసుకుని భర్త దగ్గరకు వెళ్లాలని తపిస్తుంది. భర్త ఆదరించటంతొ కథ సుఖాంతమవుతుంది.
కట్టుతెగిన పిల్ల, ఙానదా అనే నల్ల పిల్ల కథ. వయసొచ్చినా అందం లేని కారణంగా పెళ్లి కాదు. తండ్రి చనిపోతాడు. చేసుకుంటాడనుకున్న వ్యక్తి ఆ మాటే ఎత్తడు. ఎన్ని కష్టాలు పడినా పెళ్లి చేయలేకపోయానన్న బాధతో తల్లి కూడా మరణిస్తుంది. చివరకు ఆమెను చేసుకుంటానని చెప్పిన వ్యక్తే తప్పుతెలుసుకోవటంతో కథ ముగుస్తుంది.
బిందుగారబ్బాయి, అమూల్యుడి కథ. తల్లి కంటే పిన్ని దగ్గరే పెరుగుతాడు. పిన్నిని అమ్మా అని, తల్లిని అక్కా అనీ పిలుస్తాడు. పిన్ని అతనికి అన్నీ సమకూరుస్తుంది. సొంత బిడ్డలా చూస్తుంది. పెద్దయ్యాక తన వల్లనే తల్లికీ, పిన్నికీ మధ్యన ఏర్పడిన స్పర్థల కారణంగా పిన్ని దగ్గరకు వెళ్లడు. అతనిపై బెంగతో పిన్ని మంచం పట్టటంతో అందరూ గొడవలు మరచి ఒక్కటవుతారు. అతను “అమ్మ” దగ్గరకు వెళతాడు.
– నరేష్ నందం
http://naresh.co.tv
మంజరి లక్ష్మి
ఫ్యూడల్ సమాజంలో జరిగే నీచత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ శరత్ బాబు బ్రాహ్మణ పిల్ల కధ
varaprasad
ఛాలా బావుంది
వెంకటరమణ
మంచి పరిచయం. ముఖ్యంగా ఆ సంపుటిలోని బ్రాహ్మణపిల్ల, కట్టు తెగిన పిల్ల , రాముని బుద్ధిమంతతనం మనసుకు హత్తుకోక మానవు. అనువాదకుడు శివరామకృష్ణ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి బెంగాలీ వాతావరణాన్ని మన కళ్ళముందు నిలిపినట్లుగా ఉంటుంది.