The Five people you meet in Heaven
రాసిన వారు: మోహన
*************
కొంత మందికి చనిపోబోయే ముందు తాము కొద్ది కాలంలో చనిపోతున్నాం అని తెలుస్తుందట. అతడికి అలాంటి నమ్మకం లేదు. “మరణం అనేది ఎప్పుడు ఒచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అని పసిగట్టలేనంత తక్కువ సమయంలో జరిగిపోతుంది. మరణం నిన్ను ఈ ప్రపంచం నుంచి దూరం చేస్తుంది. అటు పై ఇక ఏమీ లేదు.” అని చాలా మందిలా అతడు కూడా అనుకున్నాడు. అతడు నమ్మినట్టుగానే హుటా హుటిన అతడి మరణం వచ్చింది, ఈ ప్రపంచం తాలూకు ద్వారాలు అతడికి మూసుకున్నాయి. ఐతే అక్కడితో ఆగిపోలేదు. మరి ఏం జరిగింది??
బాల్యంలో తండ్రి లాలన దక్కలేదు. సైన్యం లో గడిపిన కాలం అతడికి యుద్ధం లో దెబ్బతిన్న కాలు, అర్థం కాక భయపెట్టే పీడకలని కానుకగా ఇచ్చాయి. తండ్రి మరణం అమ్మ బాధ్యతను అప్పగించింది. దక్కిందనుకున్న ప్రేమ ఎంతో కాలం తోడు ఊండలేకపోయింది. అంతుపట్టని ప్రశ్నలతో, నిస్సహాయపు నిట్టూర్పులతో, కొలవలేని అసహనంతో నిండిన అతడి జీవితం అలానే ఆ అమ్యూస్మెంట్ పార్క్ చుట్టూనే ఎనభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనభై వసంతాల ప్రయాణంలో అతడు చూసిన ఒక్కో మరణం, అతడి జీవితాన్ని శాశ్వతం గా మార్చేసాయి!! అతడి మరణం కూడా…..
ఒక అమ్యుస్మెంట్ పార్క్ లో పని చేస్తూ, Eddie, Maintenance గా తప్ప మరే విధమైన గుర్తింపు లేని Eddie…. తన ఎనభై మూడో పుట్టిన రోజున ఒక ఘోరమైన ప్రమాదం నుండి ఒక చిన్నారిని కాపాడే ప్రయత్నంలో, తన రెండు చేతుల్లో ఒక పసిదాని చేతులు ఉండగా మరణిస్తాడు. అతడు ఆ పాపను కాపాడ గలిగాడా? అతడి మరణం తరువాత ఏం జరిగింది? అతడిలో ఎలాంటి మార్పు తెచ్చింది? అనే కథనంతో ఈ పుస్తకం సాగుతుంది.
ఎడ్డీ మరణం అతడికి అయిదుగురి వ్యక్తుల రూపంలో, 5 తలుపులు తెరిచింది…. ఒక్కో వ్యక్తి అతడికి ప్రశ్నార్థకంగా మిగిలిన ఎన్నో ఆలోచనల చిక్కు ముడులు విప్పుతూ, తద్వారా ఒక సరికొత్త పాఠం బోధించారు. ఎవరు ఆ అయిదుగురు? అతడికి వీరికి ఉన్న సంబంధం? వారతడికి తీర్చిన సందేహాలు ఎమిటి? అతడు వారి నుండి ఏం నేర్చుకున్నాడు? అసలు ఎందుకు ఇదంతా?…………………..
మనలో ఎంతో మంది ఎడ్డీలు ఇలానే జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఉండచ్చు. అచ్చంగా అవే కాకపోయినా ఇంచు మించు అలాంటివే ఉంటాయనుకుంటాను. అలాంటి ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఒక కొత్త దృష్టి కోణం ఇవ్వగలదు. ఇది నవ్వించి, కవ్వించే పుస్తకం కాదు. ఉత్కంఠ అంతకన్న ఉండదు. ఐతే, పుస్తకం చదివిన తరువాత నాకు ఒక ప్రకాశవంతమైన అనుభూతి మిగిలిందని మాత్రం చెప్పగలను.
ఒక్కో మనిషి పర్వం, చదువుతున్నంత సేపూ, చచ్చిపోయాకా ఇలాంటి పరిస్థితే ఉంటే నేను ఎవరిని కలుస్తానో… వారు నాకు ఏం చెప్తారో.. నేను ఏం నేర్చుకుంటానో అని కాస్త కుతూహలం రేగింది. ఈ రకం గా కొన్ని ఊహలు కూడా మెదిలాయి. ఈ పుస్తకం లో నన్ను ఆకట్టుకున్న ఇంకో విషయం, ‘నా స్వర్గం’. నా స్వర్గం, నీ స్వర్గం ఒకటి కాకపోవచ్చు. స్వర్గం అంటే వర్ణనల్లో, ఊహల్లో మాత్రమే మెదిలే అజ్ఞాతమైన కాల్పనిక ప్రదేశమే కానక్కర్లేదన్న ఆలోచన. స్వర్గం అంటే అందంగానే ఉండాల్సిన అవసరం లేదన్న వాదన… చదివాక, “అవును. నిజమే!” అనిపించింది. ఎవరి జీవితాన్ని వారు కాస్త నిశితంగా పరిశీలిస్తే చనిపోయాక వారి స్వర్గం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ‘నా స్వర్గం’ గురించి నాకు తెలిసినట్టుగా!! 🙂 అయితే కహానీ లో ట్విస్ట్ ఏంటంటే…. నా కోసం వేచి చూసే ఆ అయిదుగురు నాకు తెలిసిన వాళ్ళే కానక్కర్లేదట! అస్సలు కలవని మనుషులు కూడా అయ్యే ఛాన్స్ ఉండటం నాకు ఇంకా ఆశ్చర్యం. కాబట్టి ‘నా అయిదుగురు ఎవరయ్యిఉంటారో!’ అనే విషయంలో నా ఊహలు, ఊహాగానాలే అవ్వచ్చు. మరి, అన్నీ ముందే తెలిసిపోతే థ్రిల్ ఉండదు కదా..
మీ అనుమానం నాకు అర్థమయ్యింది. “నువ్వు చెప్పేదంతా, మరణం తరువాత ప్రయాణం గురించి Mitch Albom చెప్పిన కల్పనే గనుక నిజం అయితే… అప్పటి మాట.” అనే కదా??. అఫ్ కోర్స్ నేను కూడా మీ అలోచనతో ఏకీభవిస్తున్నా. అయితే ఈ కాన్సెప్ట్ కరక్టా కాదా అన్న దానిపై మీతో వాదన కాస్త పక్కన పెట్టి, పుస్తకం తో నా అనుభవం గురించి కొనసాగిస్తున్నా… మరేం అనుకోకండీ. ఏం చేస్తాం, ఈ పుస్తకం గురించి చెప్పాలన్న ఉత్సాహం అల్లాంటిదీ!
నిజం చెప్పొద్దూ… ఈ పుస్తకం చదివాక, బహుశా నేను ప్రస్తుతం ‘నా స్వర్గం’ లో ఉన్నానేమో అన్న అనుమానం రాకపోలేదు :). ఐతే ఒక సందేహం…. ‘ఇప్పుడు నేను ఏ స్టేజిలో ఉన్నాను? నేర్చుకునే స్టేజి నా? లేక నేర్పించే స్టేజీ నా??”……….. అదంతా ఏమో తెలీదు కానీ ఈ పుస్తకం చదివి, నా ఆలోచనలు మీ అందరితో పంచుకుంటున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషం గా ఉంది. 🙂
సో… పుస్తకంలో సారాంశం బట్టి, నాకు అయిదుగురు… అలాగే వేరే వారి అయిదుగురులో నే ఉండచ్చు. [ఇలా ఎంతమందికి ఉండాలో?!] ముందు మనం మన పాఠాలు విని, అప్పుడు పక్కవారికి వారి పాఠాలు చెప్పాలన్నమాట. మనం వినేవి, మనం చెప్పేవీ ఒకేలా ఉండవ్ సుమా!! ఎవరన్నారూ స్వర్గం లో అన్నీ సుఖాలే అని? సుఖం సంగతి ఎలా ఉన్నా, బాధ్యతలు మాత్రం తప్పేట్టు కనబడటం లేదు! ఇంకా, ఎవరి స్వర్గం వారిది. అంటే ఒక్కరికీ ఒక్కో స్వర్గం అన్నమాట. “అంటే మన స్వర్గంలో మనం ఒక్కరమే ఉండాలా? బోర్ కొట్టదూ??” లాంటి అనుమానాలు తీరాలంటే మీరు ఈ పుస్తకం చదవాల్సిందే మరి! 🙂
ఇక ఉంటా… వీలైతే ఇంకో పుస్తకం తో మళ్ళా కలుస్తా….
పుస్తకం వివరాలు:
Title: The Five people you meet in Heaven
Author: Mitch Albom
nagamurali
ఎప్పుడో ఒకప్పుడు చదవాలనుకుని ఈ పుస్తకాన్ని మనసులో పెట్టుకున్నా. వెంటనే మర్చిపోయాను కూడా. కానీ రెండు వారాలక్రితం ఎయిర్ పోర్టులో పుస్తకాల షాపులో అనుకోకుండా కళ్ళబడింది. వెంటనే ‘పుస్తకం’ లో రివ్యూ గుర్తొచ్చి కొనేశాను. చదవడానికి కొద్ది గంటలకన్నా ఎక్కువ పట్టలేదు.
క్షమించాలి. ఈ పుస్తకం నన్ను నిరాశ పరిచింది. ఎక్కువ ఊహలు పెట్టుకోవడమో, లేక నా బుర్రలోనే లోపమో కానీ ఈ పుస్తకంలో లాజిక్కు కొంచం గట్టిగానే దెబ్బతిందని అనిపించింది. పుస్తకంలో మంచి ‘ఫీల్’ అయితే ఉంది. ఎటొచ్చీ లాజిక్కుకి అలవాటుపడ్డ నా బుర్రకి మాత్రం తృప్తిని కలిగించలేదు.
nagamurali
ఈ పుస్తకం గురించి తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా ఈ పుస్తకం చదివితీరాలనిపిస్తూంది మీ రివ్యూ చదివాకా.
స్వాతి కుమారి
బావుంది!